లోపలి మనసు

It is a story by V Raja Rammohan Rao

లోపలి మనసు

లోపలి మనసు

వి రాజా రామ్మోహనరావు

మంగకు ముప్పయ్యేళ్ళుంటాయి. మొఖం మంచి కళగా ఉంది. అందమైందే! ఇలాంటి మంగ మొగుడికి పిచ్చా అనుకున్నాడు మాధవరావు.

తన మొగుడికి పిచ్చని, తనకి ఒక్కడే కొడుకని, మంగే తనని తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది.

ఏమంటాడో అని మంగ మాధవరావు వైపే చూస్తుంది.

మంగ నీట్‍గా, శుభ్రంగా కూడా ఉంది అనుకున్నాడు మాధవరావు.

’పనిమనిషి అవసరం ఉంది...కానీ’ అన్నాడు మాటని మధ్యలోనే ఆపేస్తూ.

’ఏంటో చెప్పండి అయ్యగారూ’ అంది మంగ చెప్పమన్నట్లుగా.

’ఇంట్లో నేను ఒక్కడినే ఉంటున్నాను. ఇంటి పనీ, వంట పనీ అంతా చెయ్యాలి. నీకు కుదురుతుందా అని’ అన్నాడు.

’నాకూ ఇలాంటి ఇల్లే కావాలి అయ్యగారూ. మొన్నటి దాకా పిల్లాడిని పక్కిళ్ళవాళ్ళకి అప్పచెప్పి, నాలుగిళ్ళకి పనికి వెళ్ళాను. కానీ ఇప్పుడు వీడు నన్నొదిలి ఉండటం లేదు. అందుకే ఒకటే ఇల్లయితే, వీడిని కూడా ఉంచుకుని, నెమ్మదిగా పనంతా చేసుకుంటాను’ అంది.

మరిన్ని వివరాలు మాట్లాడుకున్నాక మంగ పనికి కుదిరింది. రెండేళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. మంగ ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంది.

మాధవరావుకి కూడా సౌకర్యంగా ఉంది.

***

చిన్నదైనా మంగది సొంతిల్లు. తండ్రి తాగుబోతు. ఇంట్లోవాళ్ళని పట్టించుకోకుండా తాగి తాగి, మంగ చిన్నతనంలోనే చచ్చిపోయాడు. తల్లే నానా యాతనలు పడి మంగను పెంచిపెద్ద చేసింది. కూలి పనులు, ఇంట్లో పనులు, ఇలా నానా చాకిరీలు చేసి చివరకు ఒక ఫేక్టరీలో చిన్న ఉద్యోగంలో చేరింది. తల్లిపడిన ఆ కష్టాలన్నీ మంగకి తెలుసు. చెప్పుకోవటానికి దూరపు బంధువులు పేరుకి కొందరు ఉన్నా, ఆదరంగా ఆదుకునే వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ తల్లికి మంగ, మంగకి ఆ తల్లీ సర్వస్వం అయ్యారు. కూతురికి ఏదో ఆధారం ఉండాలని అష్టకష్టాలు పడి ఆ ఇల్లుకొంది మంగ తల్లి. మంగ తొమ్మిదో తరగతిలో ఉండగా తల్లికి జబ్బు చేసి ఫేక్టరీకి వెళ్ళ లేని స్థితికి వచ్చింది. అలాగే మంచం మీద కొన్నేళ్ళు ఉంది. మంగ ఒంటరి కాకూడదని తొందరపడి పెళ్ళి చేసింది. ఎవరో చెప్పిన సంబంధం. పిల్లాడు బాగానే ఉన్నాడు కదా అనుకుంది. పెళ్ళయిన యాడాదికి మంగ తల్లి పోయింది.

మంగ, ఆమె మొగుడూ కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. కానీ మధ్య మధ్యలో తిక్కగా ఉండే వాడు అతను. ఏ పనికీ తిన్నగా వెళ్ళేవాడు కాదు. బద్ధకమేమో అనుకుంది మంగ. కానీ క్రమేపీ తెలిసొచ్చింది, భర్త రంగది బద్ధకం కాదని, అతనికి మతిస్థిమితం ఉండటం లేదని. అతని వేపూ ఎవరూ లేరు. అన్నింటికీ మంగే అయింది. నాలుగు ఇళ్ళల్లో పనికి కుదిరింది. క్రమేపీ రంగ పిచ్చి పెరుగుతూ వచ్చింది. పొద్దున్న లేచింది మొదలు రోడ్డుచ్చుకు తిరుగుతూ ఉంటాడు. ఎవరేనా డబ్బులు ఇస్తే ఏదో ఒకటి కొనుక్కుని తినేస్తాడు. బట్టలు నీట్‍గా వేసుకోడు. పిచ్చి వాలకం తెలుస్తూనే ఉంటుంది. చాలా వరకు కామ్ గా ఉంటాడు. కానీ ఏడాదిలో ఎప్పుడేనా ఒకటి రెండు సార్లు పిచ్చి కేకలూ అవీ వస్తాయి. అప్పుడు ప్రభుత్వ పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుంది. వాళ్ళు ఇంజెక్షన్లు ఇస్తారు. మళ్ళీ మామూలుగా కామ్‍గా అయిపోతాడు. మంగకి అన్నీ అలవాటైపోయాయి.  పిచ్చోడైనా రంగ అంటే అభిమానం మంగకి. బాగున్న రోజులు గుర్తు తెచ్చుకుంటుంది. పిచ్చి అతను కావాలని తెచ్చుకుంది కాదు కదా అనుకుంటుంది.

పసివాడైన కొడుకుని ఎలా చూసుకుంటుందో భర్తని కూడా అలాగే చూసుకుంటూ సర్దుకుంటుంది. పరోక్షంలో మంగని పిచ్చోడి పెళ్ళాం అని వ్యవహరిస్తుంటారు. దానికి మంగ బాధపడదు. కుంటి, గుడ్డి అయితే ఎలాగో, ఇదీ అలాగే అనుకుంటుంది.

మాధవరావు ఇంట్లో పనికి కుదిరి రెండేళ్ళు గడిచేసరికి మంగ మొఖంలో కళ పెరిగింది. నడకలో చురుకొచ్చింది. శుభ్రంగా తయారై, పిల్లాడితో సహా మాధవరావు ఇంటికి వెళ్ళేది. మధ్యలో అవసరమేదైనా ఉంటే ఇంటికి వచ్చేది. లేదా రాత్రి మాధవరావు భోజనం అయ్యాకే ఇంటికి రావటం. మంచి చీరలు కడుతోంది. కంటికి నదురుగా కనిపిస్తోంది. ఎవరింట్లోనో పనికి వెళ్తున్నట్లుగాక ఏదో ఆఫీసులో పని చేస్తున్నట్లు ముస్తాబయ్యేది.

మంగ చుట్టుపక్కల వాళ్ళందరూ నిర్ధారణకు వచ్చేసారు. మాధవరావు ఒంటరివాడు, డబ్బున్నవాడు. బాగా చూసుకుంటున్నాడు. కాబట్టే మంగ అన్ని సోకులు పోతుంది. ఎవరైతే మటుకు పిచ్చోడితో ఎన్నాళ్ళుంటారు? మంచోడినే పట్టుకుంది అని కొందరు ప్రచారం. పోనీలే పాపం, పిచ్చోడిని అన్యాయంగా వదిలెయ్యలేదు, బాగానే చూసుకుంటుంది. దాని వరకు అది సుఖపడితే తప్పేమిటిలే అనుకున్నారు మరి కొందరు.

మాధవరావుకి భార్యలేదు. పిల్లలు విదేశాలలో ఉన్నారు. జీవితం సౌకర్యవంతంగా ఉండాలనే ఆయన కోరిక. డబ్బుకి వెనకాడాల్సిన అవసరం లేదు. సొంత ఇల్లు. పెన్షన్ వస్తుంది. పిల్లలు కూడా డబ్బులు పంపుతున్నారు. మంగ ఆయనకి వీలుగా సదుపాయంగా అన్నీ చేసిపెడుతూ ఉంది. 

"మంగా, నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. నన్ను అలాగే ఉండనీ. నువ్వు ఈ ఇంట్లో పనిమనిషివి అనుకోకు. ఇంటిమనిషివే అనుకో. మనకి డబ్బుకి లోటు లేదు. నా వల్ల నువ్వు సుఖంగా ఉన్నావంటే ఈ వయసులో నాకది ఎంతో తృప్తి" అని మంగ పనిలో చేరిన నెలలోపే చెప్పాడు మాధవరావు.

మంగ కూడా ఆ మాటకు సంతోషంగా తల ఊపింది ’అలాగే’ అన్నట్లు.

పెద్ద దాపరికాలు లేకుండా ఒకరి కష్టసుఖాలు ఒకరికి చెప్పుకుంటూ ఉంటారు. ఇద్దరి మధ్యా యజమాని, పనిమనిషి అన్న పరిధిని దాటిన చనువు ఏర్పడింది. ఓ సారి ఆ చనువుతోటే...

"మంగా మీ ఆయన పిచ్చోడంటున్నావు కదా! మరి ఎలా సంసారం, పిల్లాడు పుట్టడం..." అన్నాడు మాధవరావు.

"దానిదేముందండి అయ్యగారు. ఎప్పుడేనా తనంతట తనే దగ్గరకొస్తాడు. అప్పుడు నేను కాదనను" అని సమాధానం చెప్పింది మంగ నవ్వుతూ. ఆ మాటకి మాధవరావు నవ్వాడు.

అలాంటి కబుర్లలోనే మంగ మనస్థత్వం ఆయనకి ఇంకా బాగా అర్థమైంది. ఆయనంటే బెరుకు లేదు మంగకి. ఓ దగ్గరి మనిషితోనో, ఓ తల్లితో, ఓ స్నేహితురాలితో చెప్పుకున్నట్లే తన మనసు విప్పి చెప్పుకుంటుంది.

ఎప్పటినుంచో చూస్తున్నాడు మల్లయ్య. ఆ రోజు మాత్రం మంగకి అడ్డు వెళ్ళాడు. పనికని పొద్దున్నే బైలుదేరింది మంగ. గుమ్మం దాటి నాలుగడుగులు వేసిందో లేదు ఎదురుగా మల్లయ్య.

మల్లయ్యది మంగ పక్క ఇల్లే. అందరూ మేస్త్రీ మల్లయ్య అంటారు. కొన్నేళ్ళ క్రితం కూలిచేసినవాడే. అంచెలంచెలుగా డబ్బు సంపాదించాడు, మేస్త్రీ అయ్యాడు. ఇప్పుడు ఇళ్ళు కట్టుబడిలో సెంట్రింగ్ పనులు చేయించే ముఠా మేస్త్రీ. కూలి పనులు ఎప్పుడో మానేసాడు. ప్రస్తుతం పనులన్నీ ఫోన్ల మీదే. ఇళ్ళకి స్లాబులు వేసే కాంట్రాక్టులు వస్తాయి. కూలీలతో చేయిస్తాడు. మనిషి మొరటు. కొంతమంది రౌడీ మల్లయ్య అని అంటుంటారు.

"ఏం మంగా నీకు కొత్తింటి నీళ్ళు బాగా పడ్డట్టున్నాయి. మిస మిసలాడిపోతున్నావే" అన్నాడు.

మంగ ఏమీ మాట్లాడలేదు.

"ఇదివరకు పట్టించుకోలేదు గానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే వదల బుద్ధి కావటం లేదు. ఇవాళ రాత్రి మా ఇంటికి వచ్చేయి" అన్నాడు. 

మల్లయ్య ఇల్లు ఓ అలగా కొంప. ఒంటరిగా ఉంటాడు. ఇంట్లో అతనుండే భాగం కాక పక్క భాగాల్లో కూడా కూలాళ్ళుంటారు. నిత్యం తాగుడూ, పార్టీలు. మల్లయ్య దగ్గరికి కొంతమంది ఆడ కూలీల రాక మామూలే. చేతినిండా డబ్బు తిరుగుతూ ఉంటుంది మల్లయ్య దగ్గర.

పల్లెల నుంచి వచ్చే కూలీల దగ్గర ఏడాది, రెండేళ్ళకి ఒప్పందం రాయించుకుంటాడు. తను పని చూపిస్తాడు. వాళ్ళ కూలీలో రోజుకి ఒక్కొక్కళ్ళ దగ్గర వంద రూపాయలు కమీషన్ తీసుకుంటాడు. రోజూ సగటున ఓ ముప్పై మందైనా  పని చేస్తుంటారు. ఇది కాక వేరే సంపాదన. రోజూ వేలల్లో ఆదాయం. డబ్బు మదం, ఒంటి మదం పుష్కలంగా ఉన్నాయి.

"ఇవాళేమిటీ పిచ్చి వాగుడు?" అంది మంగ కోపంగా చూస్తూ.

"పిచ్చి వాగుడేం కాదు. ఈ కూలి ఆడాళ్ళతో మొఖం మొత్తింది. అడదంటే నీలా స్టైల్‍గా ఉండాలి. రమ్మన్నాను కదా అని ఓ రాత్రి తో వదిలేయను. మంచీ చెడ్డా చూసుకుంటూ మగ సాయం చేస్తుంటాను. నా మనిషి లాగే ఉందువు గానీ. డబ్బంటావా..నీకు తెలుసుగా..నీ ఇష్టం..ఎంతంటే అంత" అన్నాడు నవ్వుతూ.

మంగకి అక్కసుగా ఉంది. అయినా ఊరుకుంది.

"మీ ఆయన ఎలాగూ పిచ్చోడే కదా! ఆడితో ఏ గొడవా ఉండదు. సరేనా" అన్నాడు తిరిగి.

"పిచ్చోడైనా, మగాడే. అది తెలుసుకో. పక్క పక్కనుంటున్నాం కొంచెం మర్యాద నేర్చుకో. నువ్వు పిలవగానే రావటానికి ఒళ్ళమ్ముకునే దాన్ననుకుంటున్నావా? మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు" అంది తీవ్రంగా.

"ఓసోస్..ఏం స్టైల్ కొడుతున్నావే! ఆ అరవై ఏళ్ళ మాధవరావు గాడు పనికి రాగా లేంది, ఆడి కన్నా చిన్నోణ్ణి... పవరున్నోణ్ణి..నేను పనికి రానా.. అయినా నా సంగతి నీకు తెలిసినట్లు లేదు. నేను తలుచుకుంటే నిన్ను ఆ మాధవరావుని ఏం చేస్తానో తెలుసా?" అన్నాడు మల్లయ్య వెకిలిగా నవ్వుతూ.

"ఏం చేస్తావు.. నన్నూ ఏం చెయ్యలేవు, ఆయన్నీ ఏం చేయలేవు. వెర్రివేషాలేయకు. అయినా ఆయనకీ నీకూ పోలికా? ఆయన దేముడి లాంటి మనిషి. ఆయన నన్ను కావాలని అడిగినా తప్పేం లేదు. నీలాంటి రౌడీ తోటి, మొరటోడితోటి శరీరం పాడు చేసుకోవాల్సిన ఖర్మ నాకేం పట్టలేదు. పిచ్చోడి పెళ్ళాం కదా అని తేలికగా అనుకోకు. నా భర్తంటే ఏమిటో నాకు తెలుసు. ఇంక మాధవరావుగారంటావా? నేనేమిటో ఆయనకీ, ఆయనేమిటో నాకూ తెలుసు. నా నీతి, నా గౌరవం నాకూ ఉన్నాయి. దేనికీ భయపడే బతుకు బతకడం లేదు నేను, తెలుసుకో" అంది. అలా అని ధీమాగా మల్లయ్యని తప్పించుకుని ముందుకి నడిచింది మంగ.

మల్లయ్య నోట మాటరాక అలా నిలబడిపోయాడు.

మల్లయ్య తనను అలా రోడ్డు మీద నిలబెట్టడం ఎంతో చికాకుగా ఉన్నా, ఏం కలత పడలేదు మంగ. శరీరాలు దగ్గరవకపోయినా మనసులు దగ్గరవడంలో ఉన్న తృప్తి పొందుతోంది మాధవరావు దగ్గర. ఒకరికి ఒకరు తోడుగా బతకటంలో ఉన్న ధీమా అనుభవిస్తోంది. ఇదీ అని చెప్పలేని అమలినమైన తృప్తి అది. మంచిమనుషుల దగ్గర మాత్రమే లభించే అరుదైన గొప్ప ఆదరణ అది.

తనది గొప్ప అదృష్టం అనుకుంటోంది మంగ. తను ధైర్యంగా అలా బతకడం సరైందే అనుకుంటోంది. పిచ్చోడి పెళ్ళామే కావొచ్చు. నలుగురికీ లోకువ కావొచ్చు. పరిస్థితులు అంత గొప్పవి కాకపోయినా బాగానే బతకొచ్చు. ఎందుకంటే మనసు లోపల ఏమున్నదో దాని విలువ దానిదే!

***