రాజశేఖర్ కలికి
ఔత్సాహిక రచయిత
నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరి పైరు గాలి నా తొలి శ్వాస. బాల్యమంతా పుస్తకాలతో స్నేహం, అక్షరాలతో ఆట. కవిత అయినా, కథ అయినా, పద్యం అయినా, వ్యాసం అయినా, మనసులో మెదిలిన ప్రతి భావం కలాన్ని వెతుక్కుంటూ వచ్చేది. వరంగల్లులో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనూ ఆ సృజన సజీవంగా ఉండేది. కవితలూ, వ్యాసాలూ, హాస్యరచనలూ పత్రికల్లో వెలుగు చూశాయి. నాటకాలు రాశాను, వేదికపై ప్రాణం పోశాను, ప్రేక్షకుల చప్పట్లు మనసులో చెరగని ముద్ర వేశాయి.
తర్వాత సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో అడుగుపెట్టాను. "కోడ్" లైన్లు పెరిగాయి, కవిత పంక్తులు తగ్గాయి. కలం ఎక్కడో మూలన నిద్రపోయింది, ముప్పై సంవత్సరాలపాటు. కానీ అక్షరం చిరంజీవి, ఇప్పుడది మళ్ళీ మేల్కొంది. కలం తిరిగి నా చేతికొచ్చింది. చెప్పాల్సింది చాలానే ఉంది. మీ అందరి అదరణతో, ఆశీస్సులతో చివరి శ్వాస వరకు రాస్తూ ఉండాలని కోరిక.