చూపు

A story by Simhaprasad

చూపు

చూపు

సింహ ప్రసాద్

అద్దంలో తన నల్లని ముఖాన్ని చూసుకుని కృంగిపోతోందో టీనేజ్ దాటిన అమ్మాయి. ఇంతలో ఆమె స్నేహితురాలొచ్చింది. పరిస్థితి గ్రహించింది. “ఈ మాత్రానికేనా!” అని నవ్వింది.

తన హ్యాండ్ బ్యాగ్ లోంచో ఫేస్ క్రీమ్ తీసిచ్చింది. దాన్ని ముఖానికి ఎలా పట్టించాలో వివరించింది.

“ఒక్క నెల రోజుల్లో అద్భుతం జరక్కపోతే నన్నడుగు” అంది చాలెంజింగ్‌గా.

ఆ ఫేస్ క్రీమ్ నిష్ఠగా వాడగా ఆ అమ్మాయి నల్ల ముఖం తెల్లగా మారిపోయింది. ముఖం కాంతి, నవ్వుల కాంతి పోటీ పడుతుంటే పెళ్ళి చూపులకు కూర్చుంది. “వావ్” అన్నాడు పెళ్ళి చూపుల కొచ్చిన అబ్బాయి.

వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. తనతో బాటు ఆ ప్రేస్‌క్రీమ్‌నీ అత్తారింటికి గొప్పగా తీసుకెళ్ళిందా అమ్మాయి.

టీవీలో ఆ ప్రచార చిత్రం చూసిన వెంటనే గదిలోని అద్దం వద్దకు పరుగెత్తింది నీహారిక.

తన ముక్కుని పరిశీలనగా చూసుకుంది. దాన్ని అటూ ఇటూ నొక్కింది. అది మళ్ళీ యథాస్థితికి రావటం చూసి నిరుత్సాహపడింది. దగ్గర్నుంచి, దూరాన్నుంచి రకరకాల కోణాల్లో నాసికను చూసుకుంది.

“బోదురు కప్పలా ఉందిఅని నుదురు కొట్టుకుంది. నిరుత్సాహం ముంచెత్తగా డీలా పడి, కూర్చుండిపోయింది.

ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. కంగారుగా భయంగా ఉంది.

ఆ మర్నాడే తనని చూసుకోవటానికి పెళ్ళి వారొస్తున్నారు. వాళ్ళకి తను నచ్చితే చాలు పెళ్ళి కుదిరిపోయినట్టేనని తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది.

నిజానికి తను చాలా అందంగా ఉంటుంది. పెర్ఫెక్ట్ బాడీ అంటారు మిత్రులు. కానీ ముక్కు మాత్రం పెద్దగా నిలువునా నాశనం చేసేస్తోంది.

ఏడుపు తన్నుకురాగా బావురుమంది.

“ఏంటక్కా ఏవయ్యింది..?” ఆదుర్దా పడుతూ వచ్చింది చెల్లెలు రమ.

“నా ముక్కు ఎంత పెద్దగా అసహ్యంగా ఉందో చూడు. చిన్నప్పుడు స్కూల్లో బోదురు కప్ప ముక్కుఅని ఏడిపిస్తే ఉడుక్కుని కొట్టడానికెళ్ళేదాన్ని. ఇప్పుడు చూసుకొంటోంటే వాళ్ళన్నది నిజమే అనిపిస్తోంది. ఇక ఎవరికైనా ఎలా నచ్చుతాను?” బేలగా అంది. కళ్లనుండి కన్నీటిబొట్లు టపటపా రాలిపడ్డాయి.

“నాకేమీ వికృతంగా కనిపించట్లేదక్కా. కొంచెం పెద్దగా వుంది తప్ప మరీ అనాకారిగా లేదు. నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. నిజానికి నీకన్నా నేనెక్కువ బాధ పడాలి. నా చెవులు చూడు దొప్పల్లా ఎలా ఉన్నాయో. అంతా నా దొప్ప చెవుల్ని అదోలా చూస్తారు. అలా వున్నాయేంటని అడుగుతారు. చచ్చే చావుగా ఉంటోందనుకో. మనింట్లో ఎవరికీ లేని చెవులు నాకే ఎందుకొచ్చాయో!” దిగులు పడింది రమ.

“చెవుల్ని జుట్టుతో కవర్ చేసుకోవచ్చు. ముక్కు ఎలా కవర్ చేసుకోగలం చెప్పు? చూడగానే ఎవరి చూపు అయినా డైరెక్టుగా నా ముక్కుమీదే పడుతుంది. నాకసలు పెళ్ళవుతుందంటావా?”

“అవేం మాటలక్కా. నల్లగా తుమ్మ మొద్దుల్లా ఉన్న వాళ్ళకీ, లావుగా బండగా ఉన్న వాళ్ళకీ పెళ్ళిళ్ళవటం లేదూ. ఒక్కొక్కరి చూపూ, దృష్టీ ఒక్కో రకంగా ఉంటుంది. నీకేం అక్కా చక్కగా ఉంటావు. నీ జుట్టు చూడు ఎంత పొడవుగా ముద్దొస్తూ ఉందో, నా ఫ్రెండ్ ఆయేషా ఎప్పుడూ నీ జుట్టు గురించే మాట్లాడుతుంది. తను నీ జుట్టుకి ఫ్యాన్ అనుకో. తనది ఎలుక తోక జుత్తు కదా!” బిగ్గరగా నవ్వింది రమ.

“రోజూ చూసి చూసి నీకు అలవాటైందిగానీ, నా ముక్కు చాలా దారుణంగా ఉంది రమా. పెళ్ళి చూపుల్లో నచ్చుతానో లేదో!” దిగులుగా అంది.

“ఇంక సరిపెట్టండి” అంటూ కసిరింది వారి తల్లి సత్య. “ఒక్కొక్కళ్ళనీ ఒక్కో రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఒకరితో పోల్చుకుని కృంగిపోకూడదు. ఎవరి అందం వాళ్ళది. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఎవరి జీవితం వారిది”

“నీకేం అమ్మా. కడుపు నిండిన బేరానివి. ఈజీగా ఏరు దాటేసిన లక్కీ ఫెలోవి. ఎన్ని కబుర్లైనా చెబుతావు” నిష్టూరంగా అంది రమ.

“నిజమేనమ్మా. ఈ వయసులో కూడా ఎంతో అందంగా ఉన్నావు. కను ముక్కుతీరు చక్కగా ఉంది. ఇంక పెళ్ళి వయస్సులో ఇంకెంతందంగా ఉండివుంటావో ఊహించుకోగలరు. ఎవరి పెళ్ళిలోనో నాన్న, నిన్ను చూసీ చూడగానే ఫ్లాట్ అయిపోయి, పెళ్ళిపెద్దల్ని మీ ఇంటికి తరిమారు. పెళ్ళిచూపులూ అగ్నిపరీక్షలూ లేకుండానే నీకు పెళ్ళైపోయింది. అంత అదృష్టం మాకెలా వస్తుంది చెప్పు!” నవ్వుతూనే బుంగమూతి పెట్టింది నీహా.

ముసిముసిగా నవ్వింది సత్య. “మీకున్న చదువూ స్వేచ్ఛా నాకెక్కడివే. మీ నాన్నని నేను పెళ్ళిలోనే చూశాను తెలుసా?”

“చూడకుండా, మాట్లాడకుండా, టెస్ట్ చేయకుండా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావమ్మా?” ఆశ్చర్యపోయింది రమ.

“అన్నీ పెద్దవాళ్ళే చూసి ముహూర్తాలు పెట్టించేశారు. ఇక నా అభిప్రాయం అడిగేదెవరూ? మీరు చాలా అదృష్టవంతులు. మీ అభిప్రాయం సూటిగా చెప్పగలుగుతున్నారు”.

“మేం నీ అంత అందంగా ఉండి ఉంటేనా, ఎలాంటి మగాళ్ళనైనా పెళ్ళి చూపుల్లో ఒక ఆట ఆడించేసేవాళ్ళం!” చిటికెలేస్తూ అంది రమ.

కూతురి మాటలకు చిన్నగా నవ్వింది సత్య. “నీదాకా వచ్చేదాకా అలాగే అనిపిస్తుందిలే. ముందు రేపటి పెళ్ళి చూపులకు ఏ చీర కట్టుకోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకో. ఒకసారి కట్టుకుని చూసుకున్నా మంచిదే. ఆఖరి క్షణంలో అదా ఇదా అని తర్జన భర్జనలు పడుతూ కూర్చుంటే కాదు”.

“చీర గొడవ అలా ఉంచమ్మా. ముందు నా ముక్కు సంగతి తేల్చు. నా ముక్కు చూసి ముఖం చిట్లించరంటావా? నేను నచ్చుతానంటావా? నిజం చెప్పు” తల్లి భుజాలు పట్టుకుని కుదుపుతూ సూటిగా అడిగింది నీహా.

“నీకేం తక్కువ తల్లీ. అందాల అపరంజి బొమ్మవి” కూతురి బుగ్గలు పుణికింది.

“కాకి పిల్ల కాకికి ముద్దు అని, నీ కళ్ళకలాగే కనిపిస్తాను గానీ అబ్బాయి కళ్ళతో చూసి చెప్పు”.

“ఏ కళ్ళతో ఎలా చూసినా నీది కళైన మొహం నీహా. ఊరికే నీలో నువ్వు కించపడటం మానేసి మిగతా సంగతులు చూడు...” వెళ్ళిపోయింది సత్య.

 “నా ముక్కు ఇలాగాకుండా ఎంచక్కా సంపెంగలా ఉండుంటే ఎవరికైనా సరే అమాంతం నచ్చేద్దును కదా రమా” మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అంది నీహా.

“అఫ్‌కోర్స్. మొదటి చూపులోనే నచ్చేసేదానివి”.

“రేపొచ్చే అబ్బాయికి 50% అయినా నచ్చుతానంటావా?”

రమ ఇబ్బందిగా కదిలింది. ఇంతలో వారి తండ్రి సదానందం గొంతు విన్పించింది.

“రేపొస్తున్న సంబధం గురించి మన రామకృష్ణ వాకబు చేశాడు సత్యా. అన్ని విధాలా బావుంది, కుర్రాడు బుద్ధిమంతుడు, ఇంకేం ఆలోచించొద్దని చెప్పాడు” సంబరంగా చెప్పారు.

“నేను చెప్పలేదూ. నీహా అదృష్టవంతురాలు. ఈ సంబంధం కుదురుతుంది చూడండి” ధీమాగా అంది తల్లి.

వారి మాటలకు నీహా దిగులు రెట్టింపయ్యింది. ముక్కుని రకరకాలుగా రబ్బరులా నొక్కుతూ, సాగదీస్తూ తండ్రి దగ్గరికెళ్ళింది.

“అమ్మమ్మ బ్యాడ్‌ది నాన్నా. చిన్నప్పుడు నాకు నీళ్ళు పొసేప్పుడు రోజూ నా ముక్కు ఒత్తివుంటే ఎంతో అందంగా తయారయ్యేది” బుంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది.

“ఇప్పుడూ చక్కగానే ఉంది. ఎందుకు దాని గురించి అతిగా పట్టించుకుంటావ్?”

“మీకలాగే ఉంటుందిగానీ ఒకటి అడగనా నాన్నా” అడిగింది.

“ఏదైనా కావాలా నీహా?”

“శ్రీదేవిలా నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను. అందంగా చెక్కించుకుంటాను”

నివ్వెరబోయి చూశారాయన. “పిచ్చితల్లీ. సినిమా తారలతో, మోడళ్ళతో పోల్చుకుని ఎందుకు నిన్ను నువ్వు కించపరచుకుంటావు. ప్రతిదీ పెర్ఫెక్టుగా ఉండటమే అందం అనుకోవడం సరికాదు. వ్యాపార లాభాల కోసం ఎవరో సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్స్ లో ఇమడాలని ఎగబ్రాకటం, ఇమడలేకపోతే అనాకారినని కృంగిపోవడం రెండూ తప్పే. అందం అవయవాల్లోనే కాదు ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో, దృక్పథంలో ఉంటుంది. మొదట నువ్వు నీ లోపాన్ని భూతద్దంలో చూసుకోవడం, న్యూనతగా ఫీలవడం మానెయ్. నువ్వు నువ్వులా ఉండటానికీ, నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాటానికీ ప్రయత్నించు. రేపు చూడటానికొచ్చే అబ్బాయి భావాలూ అభిప్రాయాలూ ఏమిటో, నిన్నూ నీ లక్ష్యాలనీ గౌరవిస్తాడో లేదో తెలుసుకోవడానికి ప్రాధాన్యతనియ్యి. బాహ్య సౌందర్యం కన్నా అంతఃసౌందర్యం గొప్పది. గుర్తుంచుకో”

“డాడీ. క్లాసు పీకొద్దు ప్లీజ్...”

“అతడు మీరనుకున్నట్లు ఆలోచించడు నాన్నా. నన్ను చూడగానే ముఖం తిప్పేసుకుని లేచిపోతాడు చూడండి”

“ముందే అలాంటి రాంగ్ నోషన్స్ వద్దు. నీ జీవితం నీ నియమాల్లో సాగాలి తప్ప ఎవరో చెప్పిన కొలతలతో కాదు. నిన్ను నువ్వు యథాతథంగా ప్రేమించుకోవాలి. ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఆడపిల్లకు ఆత్మవిశ్వాసమే గొప్ప అందం, అలంకారం, ఆభరణం. తెలుసా?”

“నేనెలా ఫీలవుతున్నానో మీరెవరూ అర్ధం చేసుకోలేకపోతున్నారు” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతోంటే బాధగా చెప్పింది.

“సరే. నీకు మరీ ఇన్ఫీరియారిటీగా అన్పిస్తే ఒక పని చెయ్ నీహా. నువ్వనుకుంటున్న లోపాన్నే నీ బలంగా మార్చుకో”.

“ఎలా?” మెరుస్తోన్న కళ్ళతో అడిగింది.

“ముక్కు పుడక పెట్టుకో”

అక్కాచెల్లెళ్ళిద్దరూ ఫక్కున నవ్వారు. కడుపు పట్టుకుని పడీ పడీ నవ్వారు.

“ఎందుకలా నవ్వుతారు? నేనేం కాని మాట అన్నానని?” విస్తుబోతూ అడిగారు.

“భలే సలహా ఇచ్చారు నాన్నా. ఇదిగో నా పెద్ద ముక్కు చూడండహో – అని ప్రత్యేకంగా డప్పు కొట్టి మరీ చెప్పనా? భలేవారు నాన్నా. అమ్మా విన్నావా. నాన్న ఏమంటున్నారంటే నా పెద్ద ముక్కుకి ముక్కుపుడక పెట్టుకోమంటున్నారు. అప్పుడింక నా ముఖం కన్పించదు. ముక్కు ఒక్కటే కన్పిస్తుంది!” నవ్వుతూ చెప్పింది.

“పోనీ మొదట ఆర్టిఫిషియల్‌ది పెట్టుకుని చూద్దామా, ఎలా ఉంటుందో”

తల్లి మాటలకు, “నాన్నకు తగ్గ అమ్మవి. దొందూ దొందే” నవ్వారు నీహా, రమ.

వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు సదానందం. “చదువూ, సంధ్యా లేని అమ్మాయిల్లా ప్రవర్తించకండి. మీ స్థాయి దిగజార్చుకోకండి”

వెంటనే “సారీ నాన్నా” అంది నీహా.

“దానికేంలే గానీ రేపు ముక్కూ, ముక్కుపుడక సంగతి పూర్తిగా మర్చిపో. ఆత్మవిశ్వాసంతో ఫేస్ చెయ్. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలియజెప్పేలా హుందాగా ఉండాలి నీ ప్రవర్తన. అంతా మంచే జరుగుతుంది. బీ కాన్ఫిడెంట్”

తండ్రి మాటలకు ఏదో భరోసా చిక్కినట్టు అనుభూతించింది నీహా.

తండ్రి వంక అభినందనపూర్వకంగా చూసింది రమ.

పెళ్ళిచూపుల ఘట్టం జయప్రదంగా ముగిసింది.

అమ్మాయి నచ్చిందని అప్పటికప్పుడే చెప్పేశాడు అబ్బాయి.

పెద్దవాళ్ళు కూడబలుక్కుని తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

అదే వేగంతో పెళ్ళీ జరిగిపోయింది.

పెళ్ళిలో వరుడి తరఫువాళ్ళు “అమ్మాయి ముక్కు చాలా పెద్దగా ఉంది. చిన్నగా వుంటే ఎంతందంగా ఉండేదో!” అని చెవులు కొరుక్కోవడం నీహా చెవిన పడుతూనే ఉంది.

అయినా తన భర్తకి ఎలా నచ్చిందన్న సందేహం కాస్తా, కుతూహలంగా మారి, క్షణ క్షణానికీ త్రివిక్రమ రూపం దాల్చసాగింది.

మొదటి రాత్రి గదిలోకెళ్తూనే అతడ్ని సూటిగా అడిగేసింది నీహా.

“మీరసలు నా ముక్కు సరిగ్గా చూశారా? అయినా మీకు నచ్చిందా? నిజం చెప్పండి”

“చూశాను గనకే బాగా నచ్చింది. ఎవరికీ లేని ప్రత్యేకత నీకు నీ ముక్కు తెచ్చిపెట్టింది. నువ్వు నాకెలా ప్రత్యేకమో, నీ ముక్కు నీకలా ప్రత్యేకం. స్పెషల్ అండ్ యూనిక్. నీ ప్రధాన ఆకర్షణ నీ ముక్కే డీయర్. అందుకే నీకో స్పెషల్ గిఫ్ట్!”

చిన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు.

ఉత్కంఠతో గబుక్కున తెరచి చూసింది.

వజ్రపు ముక్కు పుడక!

*                  *                  *