ఔను నిజం నువ్వంటే నాకిష్టం-2
This is Romedy serial written by Puttaganti Gopikrishna.
ఔను నిజం నువ్వంటే నాకిష్టం-2
పుట్టగంటి గోపీకృష్ణ
ఇంతలో టి.సి. వచ్చాడు. అతని వెనుకే భారీకాయుడు భయం భయంగా నిలబడి ఉన్నాడు.
టి.సి. బామ్మని టిక్కెట్టు అడిగాడు.
ఆమె తీసి చూపించింది.
“ఇది నిన్నటి టికెట్ బామ్మ గారూ…” విసుగ్గా అన్నాడు టి.సి.
“నిన్నటి టికెట్ ఏంట్రా వెధవా? ఇరవై నాలుగో తారీకుదేగా?”
“కానీ ఇవాళ ఇరవై అయిదుగా బామ్మా?”
“ఏంట్రా మందు కొట్టి వచ్చావా? ఇవాళ ఇరవై అయిదు ఏమిటి?”
“మీకు ఎలా చెప్పాలి బామ్మగారూ… సరిగ్గా మీరు ట్రైన్ ఎక్కే సమయానికి తేదీ మారి పోయింది.”
“ఏం తారీకులు కూడా రైల్వే వాళ్లు చెప్పినట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోతాయా? ఇవాళ ఇరవై నాలుగే…”
“అలా కాదు బామ్మా! రాత్రి పన్నెండుకి కొత్త తారీకు వచ్చేస్తుంది. నిడుబ్రోలు వాళ్లు ఈ ట్రైన్ ఎక్కాలంటే ఇరవై నాలుగో తారీకుకి టికెట్ కొనుక్కోవాలి. కానీ తెనాలి వాళ్లు ఈ ట్రైన్ ఎక్కాలంటే ఇరవై అయిదో తారీకు టికెట్ కొనుక్కోవాలి.”
బామ్మ తేజ వైపు చూసింది. అతను ఆ మాటలు నిజమే అన్నట్లు తల ఊపాడు.
“అయితే నేను నిడుబ్రోలులోనే ఎక్కాననుకో…” సమస్యని సాల్వ్ చేసిన ఫీలింగ్తో అంది.
“నువ్వెక్కాల్సి ట్రైన్ నిన్నే వెళ్లి పోయింది… నా ఖర్మ కాలి నా డ్యూటీ ఈ ట్రైన్లో తగలడింది.” కోపంగా అని, “నువ్వయినా చెప్పవయ్యా…” అంటూ తేజని అభ్యర్ధించాడు టి.సి.
తేజకి చెప్పే ఛాన్సు ఇవ్వలేదు బామ్మ. కానీ… కొద్దిగా తగ్గింది. “నువ్వు ఏమయినా చెప్పరా అబ్బాయ్. నీ తల్లి వయసు దాన్ని. నన్ను లేపి ఆ బండ వెధవకి బెర్తు ఇస్తావట్రా?” అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగింది.
“లేకపోతే నా ఉద్యోగం పోతుంది.” బ్లాక్మెయిల్కి లొంగకుండా అన్నాడు టి.సి.
“మీరు నా బెర్త్ మీద పడుకోండి…” అంటూ తన బెర్త్ ఆఫర్ చేశాడు తేజ. అందరూ ఆ ఏర్పాటుకు సంతోషించారు. టి.సి. సహాయం చెయ్యగా భారీకాయుడ్ని మిడిల్ బెర్తు మీదకు ఎక్కించాడు తేజ.
“ఇప్పుడు టికెట్ డబ్బులు 500 కట్టండి.” రశీదు పుస్తకం తీస్తూ అన్నాడు టి.సి.
“నా దగ్గర లేవు…” ఖరాఖండిగా చెప్పింది బామ్మ.
“అయితే గుంటూరులో దిగిపోండి.”
“నన్ను దిగి పొమ్మంటానికి నువ్వెవడివిరా”
“టిక్కెట్టు లేదు కదండీ.”
“ఇదుగో! ఉందిగా.”
“అది నిన్నటిదండీ.”
“కానీ నిన్న నేను రైలు ఎక్కలేదుగా అందుకే దాన్ని ఇవాళ వాడతాను.”
తల పట్టుకున్నాడు టి.సి. అతన్ని పక్కకి తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న 500 ఇచ్చాడు తేజ. అటు నుండి అటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లి పోయాడు టి.సి.
“మరి నువ్వెక్కడ పడుకుంటావబ్బాయ్?” ఇక నా బెర్తు మీద నుండి లెగవమన్నట్లు మొహమాటం లేకుండా చెప్పింది ఆమె.
“రెండు పాత న్యూస్ పేపర్లు పరచుకుని ఈ రెండు బెర్తుల మధ్య పడుకుంటాను.” చెప్పాడు తేజ, ట్రైన్లో రిజర్వేషన్ దొరకనప్పుడు చేసే పనిని మరోసారి చేస్తూ.
“దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకోవటమంటే ఇదే…” పై నుండి సౌండ్ వినిపించింది.
“నీలాంటి వాడు పక్కన ఉంటే కొత్తగా దరిద్రం నెత్తికి పూసుకోవటం ఎందుకు?” అని రిపార్టీ ఇచ్చి, తేజ పూర్తిగా సెటిల్ అయ్యేవరకు ఆగి, “హైదరాబాదులో ఎక్కడుంటావబ్బాయ్?” అని అడిగింది.
“అక్కడక్కూడా వద్దామనుకుంటున్నావేమో. అది కుదరదు…” తేజ కంటే ముందు తనే చెప్పాడు పై నుండి ఓంకార్.
ఆవిడ అసలు ఆ మాటలు పట్టించుకోనట్లు, “ఏం ఉద్యోగం చేస్తున్నావ్? సాఫ్టువేరేనా?...” అంది.
“కాదండీ. బ్యాంకులో.”
“ఆ పైన పడుకున్నాడే… వాడేం చేస్తాడు?”
“ఇద్దరం ఒక చోటే అండీ.”
“ఏ బ్యాంకు?”
“సూర్యా బ్యాంకు అని ఒక చిన్న ప్రైవేట్ బ్యాంకు.”
“అదేంటబ్బాయ్! ఏదన్నా మంచి బ్యాంకులో చేరకపోయావూ…”
“దేశంలో ఉన్న బ్యాంకుల వాళ్లందరూ మా దగ్గరకి వచ్చి గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడితే లాటరీ వేసి ఈ బ్యాంకు సెలక్ట్ చేసుకున్నాం...” పై నుండి ఓంకార్ చెప్పాడు.
“చెరకు గడకి పాంటూ షర్టూ వేసినట్లు ఉంటాడు కానీ, మీ వాడి దగ్గర చాలా వగలున్నాయే. సరయిన పెళ్ళాం చేతిలో పడితే క్రషర్లో పెట్టి చెరకులో నుండి రసం అంతా లాగినట్లు వీడి పొగరు అణచి పిప్పి మిగిలిస్తుంది. అప్పుడు కానీ నోరు మూసుకుని పడుండడు. సరే… నువు చెప్పబ్బాయ్. ఆ బ్యాంకులో ఎలా చేరావ్? ఎందుకు చేరావ్?” తేజని అడిగింది బామ్మ.
బామ్మ మాటతో తేజకి కూడా తన ఫ్లాష్‌బాక్ రింగులు తిరుగుతూ కళ్ల ముందు కనిపించింది. దానిని చూస్తూ కామెంటరీ చెప్పినట్లు చెప్పసాగాడు.
“బాల నేరస్తుల్ని పెట్టే జైలు లాంటి స్కూల్లో బాల్యం గడిచి పోయింది. టెంత్ అయ్యాక ఒక మంచి కోళ్ల ఫారం చూసి నన్ను మా నాన్న ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాడు.”
“కోళ్లఫారంలో ఇంటర్మీడియట్టా?” ఆశ్చర్యంగా అడిగింది బామ్మ.
“కార్పొరేట్ కాలేజీకి మేం పెట్టుకున్న ముద్దు పేరు అదే.”
“అదేంటబ్బాయ్ అలా అంటావ్? ఆ కాలేజిలో చదివినాళ్లందరికీ మంచి మంచి ర్యాంకులు వస్తాయంటనే…”
“అదే మా నాన్న కూడా ఎక్స్పెక్ట్ చేశాడు. మూడు అంకెల ర్యాంకు వస్తుందని నా మీద ఆశలు పెట్టుకున్నాడు. కనీసం నాలుగంకెల ర్యాంకు తెప్పించే పూచీ మాదని కాలేజీ వాళ్లు వాగ్దానం చేశారు. అయిదంకెల ర్యాంకు రాకుండా ఉంటే కొండకి వచ్చి గుండు కొట్టించుకుంటానని నేను మొక్కుకున్నాను.”
“ఇంతకీ ఎంత ర్యాంకు వచ్చింది?”
“దేవుడు లెక్కల్లో దిట్ట అనుకుంటా. ఎవరినీ నిరుత్సాహ పరచకుండా మూడు వాల్యూస్ యావరేజ్ చేసి ఫలితం పంపాడు.”
“అంటే?”
“అంటే 999 + 9999 + 99999 కలిపి 3 పెట్టి భాగించి 36999 ర్యాంకు ప్రసాదించాడు.”
పై నుండి కిసుక్కున నవ్వు వినిపించింది.
“నీ సంగతి సరే కానీ, ఆ పై బెర్తు వాడికి ఎంత ర్యాంకు వచ్చింది.”
“నాదే దీన గాధ అనుకుంటే వాడిది దయనీయ గాధ. నా దరిద్రాన్ని నాలుగు పెట్టి హెచ్చవేసి నలుగు పెడితే వచ్చే రిజల్టే వాడు.”
“ఒక వేలు ప్లగ్గులో పెట్టి, రెండో వేలుతో స్విచ్ నొక్కటానికి తయారయిన కొవ్వు పట్టిన కోతిపిల్ల లాంటి జాతకం వాడిదని వాడి మొహం చూసినపుడే ఊహించాలే.”
సూడి పందికి డొక్కల్లో తీవ్రమయిన దెబ్బ తగిలితే వచ్చే సౌండ్ పై నుండి వచ్చింది.
“నువు కానియ్ అబ్బాయ్…” అంటూ బామ్మ తేజని తిరిగి ఫ్లాష్బాక్లోకి రమ్మని ఆహ్వానించింది.
“అలా మాకొచ్చిన ర్యాంకుకు మేము మెచ్చిన కాలేజీలో సీటు దొరకదుగా. గంతకు తగ్గ బొంతలా మా లాంటి వాళ్లని చేర్చుకునే ఒక కాలేజీలో చేరాం. మేము కాలేజీలో చేరింది కిట్టిగాడి క్యాంటిన్లో బొద్దింకలూ, ఈగలూ జాగ్రత్తగా ఏరి మిగిలిన సాంబారులో ఇనుప ముక్కల్లాంటి ఇడ్లీలను ముంచుకు తింటానికి కాదని తెలిసేటప్పటకి సగం కోర్సు అయిపోయింది. చేరిన పిల్లలకు పాఠాలు చెప్పటం తమ బాధ్యత అని లెక్చరర్లకు తెలిసేటప్పటికి మిగిలిన పుణ్య కాలం గడిచి పోయింది. ఎట్టకేలకు లెక్చరర్లే స్లిప్పులందించి మమ్మల్ని గండం గట్టేక్కేటట్లు చేశారు.”
“అదేదో క్యాంపస్ రిక్రూట్మెంట్లు అని ఉంటాయంటగదరా. కోర్సు పూర్తి కాక ముందే ఉద్యోగాలొస్తయ్యంటనే…”
“అట్లాంటివి ఏవో ఉంటయ్యని మాకు కూడా చదువు మొత్తం పూర్తయ్యాక మీలాంటి బామ్మలు చెప్తే తెలిసింది. ఆ తరువాత కూడా కొన్ని ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాం. వాళ్లిచ్చే క్వశ్చన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైపులో ఉండటం ఒక్కటే మాకు కలిసొచ్చిన అంశం. మా లక్కు కిక్కు ఇచ్చి ఎప్పుడయినా ఆ రాత పరీక్ష గండం గట్టెక్కినా తరువాత ఇంటర్వ్యూలో మమ్మల్ని, మా మౌనభాషని అర్ధం చేసుకునే మానవత్వం ఉన్న మహనీయులే లోకంలో లేకుండా పోయారు. మేము సిటీ బస్సుల్లో కాలేజికి వెళ్లే రోజుల్లో మా చేత బీటు కొట్టించుకున్న అమ్మాయిలు ఉద్యోగాలొచ్చి మొదట్లో స్కూటీల మీద, ఇప్పుడు కార్లలోనూ తిరుగుతుంటే మేము మాత్రం సిటీ బస్సుల్లోనే మిగిలి పోయాం.”
“కాలం కలిసిరాక పోతే శనీశ్వరుడికయినా దరిద్రం పడుతుందంట. మీరేం చేస్తారులే?” ఓదార్పుగా అంది బామ్మ.
“మేము ఏమీ చెయ్యలేమనే వారికి బుద్ధి చెప్పటానికి డొనేషన్ కట్టి ఎమ్బీయేలో చేరాం.”
“ఈసారన్నా బుద్ధిగా చదువుకున్నారా?”
“చదువుదామనే అనుకున్నాం. కానీ… ఫేస్బుక్లో హైయెస్ట్ లైకులు సాధించి, వాట్సప్లో వీడియోలు షేర్ చేసి, ట్విట్టర్లో అభిమాన హీరోని ఫాలో అయి, అలసి పోయి ఇంటికి వచ్చాక చదివే ఓపిక లేక పోయేది. చూస్తుండగానే కోర్సు కాలం గడిచి పోయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ల కాలం వచ్చింది. ఒక దాని తరువాత ఒకటిగా ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్లామో లెక్కలేదు. వాళ్లలో ఒక్కడిక్కూడా మాకు ఏ ప్రశ్నలకి సమాధానం తెలుసో తెలిసి చావదు. వాళ్లకి ఏ ప్రశ్నలకి సమాధానం తెలుసో వాటినే అడిగే వారు. ఆఖరుగా నే చెప్పానే సూర్యా బ్యాంకని దాని ఇంటర్వ్యూకి వెళ్లాము.”
“వాడు అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలు వేసి ఉంటాడు. అందుకే ఆ ఉద్యోగం వచ్చింది…”
“ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందో ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది. వాళ్లు అడిగిన ప్రశ్నలు, నేను ఇచ్చిన జవాబులు బాగా గుర్తు ఉన్నాయి… చెప్పమంటారా?” మళ్లీ గతం గుర్తు చేసుకుంటూ అన్నాడు తేజ.
“ఇంకా నిద్ర రావటం లేదు. చెప్పు…”
పైన కంపార్టుమెంటు సీలింగ్కి వేలాడుతూ గిరగిర తిరుగుతున్న ఫాన్ చూస్తూ ఫ్లాష్‌బ్యాక్ లోకి జారిపోయాడు తేజ.
ఇంటర్వ్యూ కమిటీ : నీ పేరు?
తేజ : అప్లికేషన్లో ఉంటుంది. (ఆ రోజు అప్పటికే రెండు ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయిన కోపం అలా మాట్లాడించింది.)
ఇం. క. : పోనీ ఇది చెప్పు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేరు ఏమిటి?
తేజ : తెలియదు.
ఇం. క. : సమాధానం నీ జేబులోనే ఉంటుంది. (వాళ్ల ఉద్దేశ్యం కరెన్సీ నోటు మీద పేరు చూసి చెప్పమని.)
తేజ : స్లిప్పులు రాసుకుని కాపీ కొట్టే అలవాటు లేదు.
ఇం. క. : అంటే అన్ని సబ్జెక్టులూ చదివే పాస్ అయ్యానంటావ్.
తేజ : మీకలా అర్ధమయిందా? స్లిప్పులు లెక్చరర్ రాసిస్తే కాపీ కొట్టి పాసయ్యాను.
ఆ సమాధానానికి కమిటీ మెంబర్లందరూ ఒకరినొకరు చూసుకుని తలలు విచిత్రంగా ఆడించుకున్నారు.
ఇం. క. : అసలు బ్యాంకులో ఏం జరుగుతుంటుందో తెలుసా?
తేజ : తెలుసు సార్. అవసరం లేకపోయినా అధికంగా సంపాదించిన వారి డబ్బు డిపాజిట్గా తీసుకోవటం ఫస్ట్ స్టెప్. తరువాత అధికంగా సంపాదించాలన్న వేరే వారి ఆశని ఆసరాగా తీసుకుని, వారి అవసరం కోసం అప్పు ఇచ్చి, అవసరం తీరక ముందే గొంతు మీద కూర్చుని వసూలు చేసి బాగుపడే దాన్నే బ్యాంకు అంటారు.
ఇం. క. : డెఫినిషన్ బాగుంది. ఏ పుస్తకంలో చదివావ్?
తేజ : పుస్తకాలు చదివే అలవాటు లేదు సర్. ఎప్పుడో వాట్సప్లో చూసి ఉంటాను.
ఇం. క. : మనం ఇచ్చిన అప్పు కస్టమర్ కట్టటం లేదనుకో. ఆ డబ్బు వసూలు చెయ్యటానికి ఏం చేస్తావ్?
తేజ : వెనకటి సినిమాల్లో కాబూలీ వాలాలు ఉండేవారు. బ్రతిమాలో, బెదిరించో, భయపెట్టో ఎలాగోలా డబ్బులు వసూలు చేసేవారు. అదే పాలసీ ఫాలో అవుతాను.
ఇం. క. : అయినా ఎదురు తిరిగితే?
తేజ : ముందు మనమే నాలుగు వడ్డించేస్తే సరిపోతుంది.
మళ్లీ ఒకరినొకరు చూసుకుని విచిత్రంగా నవ్వుకున్నారు.
ఇం. క. : ఆఖరి ప్రశ్న. నువ్వు మా ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావ్?
తేజ : ఇంకో గతిలేక.
ఇం. క. : వెల్ డన్. నూటికి నూరు శాతం కరెక్ట్ మాట చెప్పావ్. నీకు ఈ ఉద్యోగం వచ్చింది.
తేజ : మీకు కూడా ఇంకో గతి లేదన్న మాట. కానీ నేను ఈ ఉద్యోగం చెయ్యాలంటే బయట నా ఫ్రెండు ఉన్నాడు. వాడికి కూడా ఉద్యోగం ఇవ్వాలి.
ఇం. క. : వాడిది కూడా నీలాంటి బ్రెయినేనా?
తేజ : నాకంటే పెద్ద లుచ్ఛా లఫంగా గాడు.
ఇం. క : అయితే ఇద్దరికీ ఉద్యోగం ఇస్తున్నాం…
తేజ : జీతం ఎంత సార్? (మొదటిసారి కొద్ది వినయాన్ని మాటల్లో రంగరించి ఆనందంగా అడిగాడు)
ఇం. క. : (మొదటిసారి ఇబ్బందికరంగా ఫీలింగ్స్ పెట్టారు ఉమ్మడిగా) “ఇదొక కొత్త రకం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీం లాంటిదనుకో. మీరు వసూలు చేసే సొమ్ములో 10% ఇస్తాం.”
తేజ : ఏమీ వసూలు కాకపోతే?
ఇం. క. : మీ సామర్ధం మీద మాకే అంత నమ్మకం ఉంది. మీకు లేదా?
“ఫ్రీగా ఇస్తున్నపుడు ఓన్లీ ఇన్కమింగ్ అయితే మాత్రం వద్దనటం ఎందుకని ఒప్పుకున్నాను. ఆ విధంగా మా ఇద్దరికీ ఆ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది.” ఫ్లాష్‌బాక్ ముగిస్తూ అన్నాడు.
పై నుండి ఓంకార్ గురక వినిపిస్తోంది.