నాన్నా మీరు మాకు కావాలి

A Short story by Bondala Nageswara Rao. Gor Second Prize

నాన్నా మీరు మాకు కావాలి

         నాన్నా!మీరు మాకు కావాలి

బొందల నాగేశ్వరరావు

                                                      

 రాత్రి పది గంటలు.

పిల్లలిద్దరూ పడుకొన్నాక వెళ్ళి వరాండాలో వున్న వాలు కుర్చీలో కూర్చొని రోడ్డు వేపు చూస్తోంది భర్త శ్రావణ్ కోసం భార్య పల్లవి.వీధి దీపం వెలుగులో నిర్మానుష్యంగా వున్న ఆ దారిలో అల్లంత దూరాన రోడ్డంతా తనదేనన్నట్టు అటూ ఇటూ  తూలుతూ వస్తున్నాడు శ్రావణ్. భర్తను గమనించిన పల్లవి లేచి వెళ్ళి కాంపౌండు గేటు తీసింది.బ్యాగును వాకిట్లోనే గీరాటేసి సరాసరి పడగ్గదికెళ్ళి అలాగే మంచానికి అడ్డంగా పడుకున్నాడు శ్రావణ్.

బ్యాగును తీసుకు వెళ్ళి టీపాయి మీదుంచి భర్త వద్దకు వెళ్ళింది పల్లవి " ఏమండీ...మళ్ళీ ఏంటండీ ఇది.గత నెల్లో ఇకపై తాగనని ప్రమాణం చేశారు!"అడిగింది. "అవును.చేశాను.ఇవాళ తాగాను.అయితే ఏంటి?వెళ్ళవే అవతలికి!"మత్తుగానే అన్నాడు.

"అది కాదండి.పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. రోజు ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తే మీవల్ల వాళ్ళు పాడయ్యే ప్రమాదముంది. పిల్ల ఎనిమిదవ తరగతి చదువుతుంది. షార్పు గరల్. బహుశా తను గమనిస్తుందేమోనన్నది నా అనుమానం"బ్రతిమాలింది.

"ఏంటే ... పిల్లలు, ప్రమాదమంటూ వాగుతున్నావ్  రాస్కల్ ! "అని కోపంగా లేచి అలాగే చెంపను చెల్లుమనిపించాడు.

పల్లవి  చెంపను పట్టుకొని"మీరు కొట్టడం నాకు కొత్తేమీ కాదు.కొట్టండి.కాని ఇలా తాగి రాకండి. రండి భోంచేద్దాం"బ్రతిమాలినట్టు అడిగింది.

"నేను ఫ్రెండ్సుతో భోంచేసే వచ్చాను!నా ఎదరే వుండకు. వెళ్ళి పడుకో"మంచంలో అటు తిరిగి పడుకున్నాడు శ్రావణ్ .

'అంతా నా కర్మ. మందు ముట్టనని ప్రమాణం చేశారు. ఇవాళ మళ్ళీ తాగొచ్చారు. నేను భార్యను సరే...ఓర్చుకుంటాను. పెద్ద  పాపకు అన్నీ అర్థమైయ్యే వయసు. తను ఫీలయితే ఇంకేమన్నా వుందా? వీరి వల్ల  గుట్టు బట్ట బయలయితే తప్పకుండా విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భగవంతుడా!అలా జరక్కుండా వీరు తాగుడు మానేలా చెయ్య స్వామీ' అని గొణుక్కొంటూ పిల్లలున్న గదికి వెళ్ళబోయింది పల్లవి.

పల్లవి మాటలు లీలగా శ్రావణ్ చెవిన పడ్డాయి. షాక్ తిన్నట్టు దిగ్గున లేచాడు.మరి మనసులో ఏమనుకున్నాడో ఏమో వెళ్ళి పల్లవి చేతులను గట్టిగా పట్టుకున్నాడు "పల్లవీ"అంటూ.

"వదలండి. నేను వెళ్ళాలి" కోపాన్ని ప్రదర్శించిందామె.

"నన్ను క్షమించు పల్లవి!నిజమే. తాగనని ప్రమాణం చేశాను. నెలనాళ్ళు జాగ్రత్తగానే వున్నాను. కాని నా స్నేహితులు నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు. ఆఫీసులో నేను ఓ టెండరు పాస్ చేశానని , అందుకు ఆ పార్టీ వాళ్ళు అయిదు వేలిచ్చారని ఆ డబ్బును ఈ విధంగానే ఖర్చు పెట్టాలన్నారు.నాది తప్పే!ఇంకెప్పుడూ ఇలా నడుచుకోను. పొద్దాక పిల్లల్ని,భగవంతుణ్ణి గుర్తుచేస్తూ నన్ను భయపెట్టకు పల్లవి!"ప్రాధేయ పూర్వకంగా అన్నాడు శ్రావణ్. చేసేది లేక భర్త చేతులనుంచి తన చేతులను సున్నితంగా విడిపించుకుని మౌనంగా వెళ్ళి పోయింది పల్లవి.

©©©©©©©                         ©©©©©©©                       ©©©©©©©

మరుసటి రోజు శ్రావణ్ త్వరగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు.అఫీసులో కనీసం ప్రక్క సీటులో వున్న ఫ్రెండును కూడా పలకరించకుండా పనిలో నిమగ్నమైయ్యాడు. కాఫీకి ఒక్కడే వెళ్ళాడు. లంచ్ అవర్లో ఫ్రెండ్సుతో కలవకుండా భోంచేసి వచ్చి సీటులో కూర్చొన్నాడు.

"ఏరా!ఉదయం నుంచి చూస్తున్నాం. కాఫీకి ఒక్కడివే వెళ్ళావ్ ! లంచ్ కూడా ఒక్కడివే తీసుకున్నావ్!ఏంటి సంగతి?మాతో చేరవా?మేము అంటరాని వాళ్ళమా?"అడిగాడు ఒకడు.

"చెప్పు మామా!నువ్వుమాతో రాకుంటే ఏదో వెలితిగా వున్నట్టుంది.కారణమేంటి?" రెండోవాడు ప్రశ్నించాడు. శ్రావణ్ మౌనంగా వుండి పోయాడు.

" పోనీలేరా!ఒరేయ్  శ్రావణ్! విను. మనమందరం కలిసి చేసి పెట్టిన మరో పనికి ఇవాళ దానికి సంబంధించిన వాళ్ళొచ్చి అయిదు వేలరూపాయలు ఇచ్చారు. సాయంత్రం స్వాగత్ హోటల్లో మనం పార్టీ చేసుకొంటున్నాం. వచ్చేయ్ !భాగం డబ్బులిమ్మని అడక్కు"మూడోవాడన్నాడు.

"నాకేమీ వద్దురా!మీరే తీసుకొండి. పార్టీ కూడా మీరే చేసుకొండి. నన్నొదిలేయండి చాలు" దృఢంగా వచ్చాయా మాటలు శ్రావణ్ నోటినుంచి. పకపకా నవ్వారు ముగ్గురు స్నేహితులు.

వాళ్ళలో రెండోవాడు "వీలుపడదు మామా!నువ్వొక్కడివే మంచివాడివనిపించుకోవడం  కుదరదు. కావాలంటే రేపటినుంచి మాకు దూరంగా వుండిపో!పద ...పద మామా!"అన్నాడు రెక్క పట్టుకుని లేపుతూ. తప్పదన్నట్టు పైకి లేచాడు శ్రావణ్ . శ్రావణ్ను నెట్టు కొంటూ వెళ్ళి బైకులో కూర్చోబెట్టుకొని నలుగురు స్వాగత్ హోటల్కు వెళ్ళారు. ఓ టేబుల్లో కూర్చొన్నారు, బ్రాందీ ఆర్డర్ చేసుకొన్నారు. అయిదు నిముషాల్లో బ్రాందీ వచ్చింది సైడ్ డిష్ తో పాటు. తాగను మొదలు పెట్టారు ముగ్గురు స్నేహితులు.

"ఏంటిరా!గ్లాసు ముందుంచుకొని మౌనంగా వున్నావ్ !ఒక్క పెగ్గేలే లాగిచ్చేయ్ !"అన్నాడు మూడో ఫ్రెండు.అయితే భార్యకిచ్చిన  మాట మనసులో మెదలగా ఆలోచిస్తూ మౌనంగా వుండి పోయాడు శ్రావణ్ .

"ఏంట్రా ఆలోచిస్తున్నావ్ !సిప్ చెయ్యి"అన్నాడు ఇంకొకడు. గొలపెట్టారు తతిమ్మా ఇద్దరు.

శ్రావణ్‌ కూడా గ్లాసులోని బ్రాందీని గటగట తాగేసి "పొద్దు పోయిందిరా! నేనొస్తాను. రేపు కలుద్దాంలే" అంటూ పైకి లేవబోయాడు. అప్పుడు తన జేబులోనుంచి మడిచి పెట్టిన నోటు పుస్తకంలోని కాగితమొకటి  క్రింద పడింది. దాన్ని చేతికి తీసుకొని బ్యాగుతో పాటు గబగబ  బైకు వద్దకు నడిచాడు. బైకు మీద కూర్చొని కాగితాన్ని విప్పి చూశాడు. అది కూతురు లాస్య దస్తూరితో రాసుంది. సుదీర్ఘమైన వుత్తరమది. వెంటనే చదవను ప్రారంభించాడు.

నాన్నా!భయంవల్ల మీతో ముఖాముఖిగా చెప్పుకోలేని నాలుగు మాటల్ను ఈ వుత్తరంలో రాస్తున్నాను. ఇవాళ నా పుట్టిన రోజు. మీరు త్వరగా వస్తారని నమ్ముతాను. పోతే... మిమ్మల్ని నిత్యం గమనిస్తునే వున్నాను. ఉదయం ఆఫీసుకు వెళ్ళేటప్పుడు బాగానే వెళతారు. సాయంత్రం ...అసలు సాయంత్రం ఆఫీసవుతూనే మీరెప్పుడు ఇంటికి వచ్చారు కనుక. ఏ అర్థరాత్రికో బాగా తాగి తూలుతూ వస్తారు. అమ్మ ప్రశ్నిస్తే విచక్షణా రహితంగా మూర్ఖుడిలా మారిపోయి చెయ్య చేసుకొంటారు. మరి ఏ దేవుడు కరుణించాడో గత నెల్లో ఓ రోజు తాగనని అమ్మకు ప్రమాణం చేసి బుద్ధిగా వుంటూ వచ్చారు. మేమూ సంతోషించాము. మరి మళ్ళీ మీకేమైందో రెండు రోజులనుంచి తాగుతున్నారు. మీవల్ల ఇరుగు పొరుగు వాళ్ళ వద్ద పరువు పోతుందని అమ్మ మిమ్మల్ని మందలించటం మాని ఓర్పుతో  మీకనుకూలంగా మారి పోయింది. అయితే నేను అమ్మలా మారి మౌనంగా వుండలేక పోతున్నాను. నాన్నా! ఎనిమిదవ తరగతి చదువుకొంటున్న నాకు కాస్త ఆలోచించే శక్తి వుంది. మీరు ఇలాగే వుంటే నా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతోందేమోనన్న భయం నాకుంది. మిమ్మల్ని, మీ తాగుడిని తలచుకుంటే అసహ్యం వేస్తోంది. మీకు తెలియందేమీకాదు. ఈ తాగుడువల్ల ఎన్నో కుటుంబాలు సర్వ నాశనమై పోతున్నాయి. నా స్నేహితురాలు తండ్రి ఈ తాగుడుకి బానిస కావడం వల్ల, వాళ్ళను ఆర్థిక ఇబ్బందులు వెంటాడగా చదువు మానుకొని ఏదో కంపెనీలో అయిదువేల రూపాయలకు వుద్యోగం చేస్తోంది. అలాంటి పరిణామమే ఇంకో  స్నేహితురాలి ఇంట్లో చోటు చేసుకోగా వాళ్ళ అమ్మ వురి వేసుకొని చనిపోయింది. ఇప్పుడు తల్లిలేని పిల్లగా,తాగుబోతు తండ్రి ప్రేమానురాగాలకు దూరంగా బాధతో బడికి వస్తోందా అమ్మాయి. మరి భవిష్యత్తులో తన జీవితం ఎలా సాగుతోందో వూహించలేము. నాన్నా!అసలు మీకేమైంది? నా, నా తమ్ముడి భవిష్యత్తు మీకు అఖ్ఖరలేదా? మేము ఎలా పోయినా పర్వాలేదా?మళ్ళీ తాగుతున్నారెందుకు? మొదటే మనం అప్పుల వూబిలో కూరుకుపోయాం. అందుకు తగ్గట్టు అటు నాన్నమ్మ తరపునుంచో లేక అమ్మమ్మ తరపునుంచో ఎలాంటి ఆర్థక సహాయం పొందలేక పోతున్నాం. ఇక మీ జీతం డబ్బుల్లో మీ వ్యసనాలకు పోను మిగిలిన డబ్బు అమ్మ చేతికిస్తే ఆమె ఈ కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొస్తోంది పాపం.

నాన్నా!మీరిలాగే కొనసాగితే మా భవిష్యత్తేమో కాని మీరు చెల్లుకొంటారు. అవును నాన్నా!  ఆరోగ్యం దెబ్బ తిని వూపిరితిత్తుల వ్యాధిలో మీరు బాధపడుతున్నారని నాకు ఈ మధ్యే తెలిసింది. ఎలా తెలిసిందంటారా...!మొన్నో రోడు మీరు రోజూ దగ్గే మామూలు దగ్గుకు తేడాగా ఎడతెరపి లేకుండా దగ్గి కల్లెతో రక్తం పడగా దాన్ని మీ షర్టుకు తుడిచి ప్రక్కన పెట్టారు. అది చూసి నేను షాక్కు గురైయ్యాను. అంటే అది వూపిరి తిత్తుల వ్యాధేగా!?

కనుక నాన్నా! మీరు మాకు కావాలి. మా కోసమైనా మీరు బ్రతకాలి. ఆలోచించుకొండి. తాగుడు మానండి. అమ్మను, తమ్ముడ్ని,నన్ను సంతోషంగా వుంచుకొండి. మా కోసం బ్రతకండి.ప్లీజ్ !                                                                                                                        

                                                                   నాన్నకు ప్రేమతో

                                                                       లాస్య

అని రాసిన కూతురి  ఉత్తరం మొత్తం చదివిన శ్రావణ్ కు ముచ్చెమటలు పోసినై. 'మీరు మాకు కావాలి. మాకోసమైనా మీరు బ్రతకాలి' అన్న మాటలు శ్రావణ్ హృదయాంతరాలను తాకాయి. కర్చిఫ్ తో ముఖం తుడుచుకున్నాడు. బైకును స్టార్టు చేసుకొని ఇంటికి బయలు దేరాడు. అప్పుడు గంట రాత్రి తొమ్మిది.

"గంట తొమ్మిదైయ్యింది గదమ్మా!కాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేస్తే నీ పుట్టిన రోజు పండగ అయ్యిందనిపించుకొని భోంచేసి పడుకుందాం"తల్లి పల్లవి అంది.

"అవునక్కా!నాకూ ఆకలవుతోంది,పైగా నీ ఫ్రెండ్సూ కూడా వెళ్ళిపోయారు"తమ్ముడు రిషి.

"కుదరదురా! నాన్న రావాలి. వస్తాడు. అప్పుడే నేను కేక్ కట్ చేస్తాను"అని అటు వాకిటి వేపు చూస్తుండగా బైకును పార్కు చేసి పరిగెత్తినట్టు లోనికొచ్చాడు 'తల్లీ లాస్యా'అంటూ శ్రావణ్. అప్పటికే తండ్రిలో మార్పును గమనించింది లాస్య.తను రాసి జేబులో వుంచిన ఉత్తరం తండ్రి చదివి వుంటాడని గుర్తించింది. ఆ వుత్తరమే తన తండ్రిలో మార్పు తెచ్చిందనుకొంది. వెంటనే "నాన్నా"అంటూ దగ్గరికెళ్ళి వాటేసుకుంది. ఇద్దరి కళ్ళలో అశ్రుధారలు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియక పోయినా అయోమయ పరిస్థితిలో తల్లి, తమ్ముడు కూడా కళ్ళమ్మట కన్నీళ్ళు తెచ్చుకున్నారు.

"పల్లవీ,బాబూ మీరూ దగ్గరకు రండి!"అన్నాడు శ్రావణ్ .భార్య, పిల్లాడు కూడా శ్రావణ్ దగ్గరకు వెళ్ళారు.

"తల్లీ లాస్యా!నన్ను క్షమించమ్మా. నువ్వుకూడా నన్ను క్షమించు పల్లవీ!నాలో కలిగిన మార్పుకు, మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ? అందుక్కారణం నా బంగారు తల్లి లాస్య నాకు రాసిన ఈ వుత్తరమే! ఇదే నా కళ్ళు తెరిపించింది. తాగుడితో నా ఆరోగ్యం క్షీణిస్తుందన్నది నాకొక్కడికే తెలుసను కున్నాను. కాని అది  నా కూతురు గుర్తించింది. ఆ వ్యాధి నుంచి బయటికి రమ్మని నన్ను అప్రమత్తం చేసింది. అవును.సంపాదనంతా తాగుడికే ఖర్చుపెట్టి అప్పులపాలై, ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని  అథఃపాతాళానికి దిగజారి పోతున్న నన్ను ఈ వుత్తరమే కళ్ళు తెరిపించింది. ఇదిగో! మీకు ప్రమాణం చేసి చెపుతున్నాను. ఇకపై నేను తాగను. ఇది నా ప్రియ పుత్రిక లాస్య మీద ఒట్టు" అంటూ చేతిలో చెయ్యేసి ముగ్గురిని అక్కున చేర్చుకొన్నాడు కన్నీళ్ళతో శ్రావణ్ .

"అదేనండి మాక్కావాలి"భార్య పల్లవి దీనంగా అంది.

"అవును నాన్నా!నేను వూహించినట్టే మీరు మారిపోయారు.ఇక మీరు తాగరని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు ఒట్టు పెట్టుకొన్నది  నామీద కదా"అంది లాస్య.

"తప్పకుండా తల్లీ!"అంటూ తన మెడలో వున్న చిన్నపాటి గొలుసును తీసి లాస్య మెడలో వేసి "విష్ యూ హాప్పీ బర్త్ డే అండు  మెని మోర్ రిటర్న్స్ అఫ్ ద డే"అంటూ కూతుర్ని దీవించాడు శ్రావణ్.

కొవ్వొత్తులను ఆర్పి కేకును కట్ చేసి మూడు పీసులను తీసి  తండ్రి,తల్లి,తమ్ముడి నోళ్ళలో పెట్టింది లాస్య. అలాగే తల్లి,తండ్రి,తమ్ముడు కేకును కొద్దికొద్దిగా తీసి లాస్య నోటికందించారు.

©©©©©©                           ©©©©©©                       ©©©©©©