నల్లధనం కాని అవినీతి సంపాదన
avineeti tantram - a series of articles by Mondepu Prasad educating youth about corruption and ways to identify and avoid it.
నల్లధనం కాని అవినీతి సంపాదన
“మీరు నల్లదనం అవినీతి వేరువేరు అన్నారు. నల్లధనం కాని అవినీతి సంపాదన ఉంటుందా?” ఒక విద్యార్ధి అడిగాడు.
“ఉంటుంది.” చెప్పింది గాయత్రి.
ఆ జవాబు వినగానే హాలులోని విద్యార్థులందరూ నమ్మలేక ఆశ్చర్యంతో “ఆ!” అన్నారు
వాళ్ళ ఆశ్చర్యాన్ని గమనించిన గాయత్రి “నల్లధనం కాని అవినీతి సంపాదన ఉంటుందంటే నమ్మడం కొంచెం కష్టమే. అందువలన నల్లధనం కాని అవినీతి సంపాదన ఉంటుందని తెలియజేసే రెండు కథలు చెప్తాను -
“ఒక ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టడానికి వంద ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆ కంపెనీకి స్థలం ఇవ్వడానికి నిర్ణయించింది. కాని స్థలం కేటాయించే జి.ఒ (G.O) బయటకి రాకముందే, ఆ నిర్ణయం తీసుకొన్న కమిటీలోని ఒక వ్యక్తి ఆ కంపెనీకి ఇవ్వబోయే స్థలం చుట్టుపక్కల ఉన్న రెండు వందల ఎకరాలని ఎకరం లక్ష రూపాయిలు చొప్పున రెండు కోట్లు పెట్టి తన భార్య మరియు పిల్లల పేర్లమీద కొన్నాడు. జి.ఒ వచ్చిన నెల రోజులకి ఆ వ్యక్తి కొన్న రెండు వందల ఎకరాల రేటు పదిరెట్లు పెరిగింది. ఆ వ్యక్తి తాను కొన్న రెండు వందల ఎకరాలని ఎకరం పది లక్షల రూపాయిలు చొప్పున ఇరవై కోట్లకి అమ్మి నెల రోజులలో పద్దెనిమిది కోట్ల లాభం సంపాదించాడు. పద్దెనిమిది కోట్ల మీద కట్టవలసిన టాక్స్ ఐదు కోట్ల నలభై లక్షల రూపాయిలు (సుమారు) కట్టేసి పన్నెండు కోట్ల అరవై లక్షలు మిగుల్చుకున్నాడు. అతను సంపాదించిన ఆ పన్నెండు కోట్ల అరవై లక్షలు అవినీతి సంపాదనే, కాని నల్లధనం మాత్రం కాదు.”
***
మరో కథ వినండి -
“ఒక ఫార్మసి కంపెనీ వయసుతో పాటూ శరీరం మీద వచ్చే ముడుతలు రాకుండా చేసే మందు కనిపెట్టే ప్రయోగంలో విజయం సాధించింది. ప్రభుత్వం నుండి లైసెన్సు పొందడం మాత్రమే మిగిలి ఉంది. ఆ ప్రొడక్టు మార్కెట్లో రిలీజ్ అయితే అమ్మకాలు విపరీతంగా పెరిగి కంపెనీ షేర్ల విలువ కూడా బాగా పెరుగుతుంది. విషయం తెలిసిన కంపెనీ డైరెక్టర్ ఒకరు తన భార్య పేరుతొ 25 లక్షలు పెట్టి కంపెనీ షేర్లు కొన్నాడు. కంపెనీ ఆ ప్రోడక్టుని మార్కెట్లో రిలీజ్ చెయ్యడానికి లైసెన్స్ కోసం ప్రభుత్వానికి అప్లై చేసింది. ఆ విషయం మార్కెట్లో తెలిసి కంపెనీ షేర్ల విలువ అమాంతంగా నాలుగు రెట్లు పెరిగింది. కాని కొన్ని కారణాల వలన ప్రభుత్వం ఆ ప్రోడక్టుకి లైసెన్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఆ నిర్ణయం పబ్లిక్ కి తెలియకముందే ఆ డైరెక్టర్ తన భార్య పేరుతో కొన్న షేర్లన్నీ అమ్మేశాడు. అప్పటికే ఆ కంపెనీ షేర్ల విలువ నాలుగు రెట్లు పెరిగి ఉండటంతో అతని పాతికలక్షల పెట్టుబడికి అతనికి కోటి రూపాయిలు వచ్చింది. వారం తర్వాత ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వలేదనే విషయం మార్కెట్లో తెలిసి ఆ కంపెనీ షేర్ల విలువ పెరగక ముందు ఉన్న విలువలో సగానికి పడిపోయింది. కంపెనీ గురించి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన డైరెక్టర్ భారీ లాభాలు సంపాదించుకున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ తెలియని సాధారణ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఆ డైరెక్టర్ తన భార్య పేరుమీద సంపాదించిన లాభాల మీద ఆదాయపు పన్ను చెల్లిస్తే, అతను సంపాదించినది కూడా అవినీతి సంపాదనే, కాని నల్లధనం కాదు.” గాయత్రి కథ చెప్పడం ముగించి “ఈవారానికి సెలవు. వచ్చే శనివారం కలుద్దాం.” అని చెప్పి ఆనాటి లెక్చర్ ముగించింది.
***