అవినీతి తంత్రం-1
Articles written by Mondepu Prasad against corruption. Educative and informative. USeful for Civils Ethics Paper GS IV
అవినీతి తంత్రం
మొండెపు ప్రసాద్
తాను ప్లస్ టు చదివిన స్కూలు ప్రిన్సిపాల్ సత్యనారాయణ మాష్టారు చెప్పాపెట్టకుండా తన ఇంటికి రావడంతో గాయత్రి సంభ్రమాశ్చర్యాలతో నమస్కారం చేసి గురువుగారిని లోపలికి ఆహ్వానించి “ఫోన్ చేసి వుంటే నేనే స్కూలుకి వచ్చి మిమ్మల్ని కలిసేదాన్ని మాష్టారు.” అని చెప్పింది.
ఎం.బి.ఎ చదివిన గాయత్రి ఒక ప్రముఖ న్యూస్ చానల్లో ఫైనాన్సియల్ న్యూస్ అనలిస్ట్ గా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగంలో నిజాయితీకి నిజమైన రూపమని పేరు తెచ్చుకుంది. ఖాళీ సమయాలలో యువతకు ఉపయోగపడే రచనలు చేస్తూ మంచి రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకుంది.
మాష్టారుకి కాఫీ ఇచ్చి “నేనేమి చెయ్యగలనో చెప్పండి మాష్టారు” అని అడిగింది.
“చాలా ముఖ్యమైన పనిమీద వచ్చాను. నువ్వు ఒక ఉన్నత పదవిలో వున్నావు. నిజాయితీకి మారుపేరని పేరు తెచ్చుకున్నావు. మంచి రచయిత్రివి కూడా. నువ్వు మాత్రమే ఈపని చెయ్యగలవని నమ్మి వచ్చాను.”
“తప్పకుండా చేస్తాను మాష్టారు”
“అయితే ముందుగా రెండుమూడు నిమిషాలపాటు నా ఉపోద్ఘాతం వినాలి.”
“మరోసారి మీ లెక్చర్ వినే భాగ్యం కలిగింది. చెప్పండి మాష్టారు”
“ఈ దేశంలో సగటున ప్రతీ దశాబ్దానికి ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాలలో ఆనాటి యువత పాల్గొన్నారు. అలా అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేసిన యువతలో కొంతమంది ప్రభుత్వ మరియు ప్రేవేటు ఉద్యోగాలలో చేరి ఉంటారు. అయినా అవినీతి తగ్గలేదు. అంటే ... నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్న యువతలో కొంతమంది ఉద్యోగాలలో చేరిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారేమో అనిపిస్తోంది. కాని మన స్కూల్లో చదివి బయటకి వెళ్ళే విద్యార్ధులు అటువంటి అవకాశవాదులుగా కాకుండా నిజమైన, స్వచ్చమైన నీతిపరులుగా సమాజంలోకి వెళ్లాలని నా ఆశయం. ఆ ఆశయ సాధనలో నీ సహాయం కావాలి.”
“మంచి ఆశయం. ఏమి చెయ్యాలో చెప్పండి మాష్టారు?”
“విలువలను బోధించడానికి కథలను మించిన మంచి సాధనం లేదని నా అభిప్రాయం. పిల్లలకైనా, పెద్దలకైనా చెప్పాలనుకున్న విషయాన్ని కథల ద్వారా చెప్తే వారికి బాగా అర్ధమవుతుంది, మరచిపోలేనంతగా వారి మనసులలో నాటుకుంటుంది. అందుకే రుడ్యార్డ్ కిప్లింగ్ – “చరిత్రను కథల మాధ్యమంలో బోధిస్తే ఎప్పటికీ మర్చిపోరు” అన్నాడు. మంచి కథ శ్రోతల లేక పాఠకుల మనసులలో కొన్ని ప్రశ్నలను లేవనెత్తి వారిని ఆలోచింపజేస్తుంది. పంచతంత్రం కథల ద్వారా మూర్ఖులైన ముగ్గురు రాజకుమారులకు లోకజ్ఞానం బోధించిన విష్ణుశర్మ లాగ నువ్వు కూడా “నీతి – అవినీతి” గురించి కథలు చెప్పి మన స్కూలు విద్యార్ధులను నిజాయితీకి ఉదాహరణలుగా తీర్చిదిద్దాలి.”
“అంటే మరో పంచతంత్రం రచించాలన్నమాట.”
“అవును ... కాని...”
“సందేహించకుండా చెప్పండి మాష్టారు”
“జంతువుల పాత్రలతో కథలు వ్రాస్తే ప్రయోజనం నెరవేరకపోచ్చు.”
“ఎందుకు మాష్టారు?”
“ఈరోజుల్లో ప్రైమరీ స్కూలు పిల్లలు కూడా జంతువులు, పక్షులు మాట్లాడాయంటే నమ్మడంలేదు. ఇంక ప్లస్ టు విద్యార్థులు ఎలా నమ్ముతారు?” మాష్టారు నవ్వుతూ చెప్పారు
“అలాగే మాష్టారు. మీ సలహా పాటిస్తాను”
“కథలు వ్రాయడం పూర్తయ్యాక చెప్తే, ఆ కథలు విద్యార్ధులకు చెప్పడానికి నీకు ప్రతీ శనివారం ఒక గంట సమయం కేటాయిస్తాను.”
“సరే మాష్టారు. కాని ఒక చిన్న సజెషన్”
“చెప్పు”
“నేను అవినీతి గురించి ఒక కథ తర్వాత మరొక కథ చెప్పుకంటూ పోతే అది ఉపన్యాసంలా ఉంటుంది. విద్యార్ధులని అవినీతి గురించి వాళ్ళకున్న సందేహాలను రాసి ఉంచుకోమని చెప్పండి. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు సందేహాలను అడిగితే కథల ద్వారా వాళ్ళ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను.”
“ఆలోచన బాగుంది. కథలు తయారుచేసుకోడానికి నీకు ఎంత సమయం కావలి?”
రెండు నిమిషాలు ఆలోచించి గాయత్రి “ఒక నెల మాష్టారు” అని చెప్పింది.
“ఆల్ ది బెస్ట్” చెప్పి మాష్టారు వెళ్ళిపోయారు.
***