నీ కోసం - 2
A romantic serial by Pasupuleti Satya Sreenivas - part 2. ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నా అన్న వాళ్ళు వదిలెయ్యడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేసాయి. కేసు విచారణ తరవాత ప్రణతికి మూడు సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం
’ఇంటి దగ్గర లేటయింది’ అంది ప్రణతి. ’వీళ్ళకేం తెలుసు, నేను ఇక్కడికి రావడానికి ఎంతగా పోరాటం చేసానో’ అనుకుంది మనసులో.
’అందరితో పాటూ వస్తే స్పెషల్ ఏముంది? అందరినీ కలిపి రాగింగ్ చేసేస్తాం, క్లాసులకి పంపేస్తాం. ఇలా సెపరేట్‍గా వస్తేనే ఈమెని స్పెషల్‍గా రాగింగ్ చెయ్యచ్చు. ఆ ఛాన్స్ మనకిద్దామనే ఈ పాప లేట్‍గా వచ్చింది. కదా పాపా?’ వంకరగా నవ్వుతూ అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్. అతన్ని చూసి అక్కడున్న వాళ్ళ కళ్ళల్లో బెదురుని చూసింది ప్రణతి. అప్పటివరకూ అక్కడున్న అమ్మాయిలు, అబ్బాయిలు జూనియర్స్‍ని సరదాగానే రాగింగ్ చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదు. వినోద్ అక్కడికి రావడం అక్కడ ఎటువంటి పరిణామలు సంభవిస్తాయో అని వాళ్ళలో జంకు కలిగింది. వినోద్ రాగింగ్ పేరుతో వల్గర్‍గా బిహేవ్ చేస్తాడు అమ్మాయిలతో. ఇబ్బందికరంగా మాట్లాడడం, తాకడం, ముద్దుపెట్టుకోవడం కూడ చేస్తాడు. ఈ విషయాలన్నీ తరవాత తెలిసాయి ప్రణతికి.
ప్రణతి ఏమీ మాట్లాడకపోవడంతో ’ఏం పాపా మాట్లాడవూ!!’ అంటూ ఆమె చెక్కిలి మీద చెయ్యి వెయ్యబోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అమృత్ ’హాయ్! ఏంటీ ఇంత లేట్‍గా వచ్చావూ! నేను నిన్ను నైన్‍కల్లా వచ్చెయ్యమన్నాను. నైన్‍ఫార్టీ అయిపోయింది. టెన్‍కల్లా నీ క్లాసులు మొదలవుతాయి. నడు నీకు నీ క్లాస్‍రూమ్ చూపిస్తా! ఎక్స్‍క్యూజ్‍మీ బ్రదర్’ అంటూ చొరవగా ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుండి కదిలాడు. అలా ఆమెని ఆమె వెళ్ళాల్సిన బ్లాక్ వరకూ తీసుకెళ్ళిన అమృత్ అప్పుడు ఆమె చెయ్యి వదిలిపెట్టాడు. అంతవరకూ ప్రణతి కూడా అతనిని ప్రతిఘటించలేదు. తనని తాకబోయిన వినోద్ నుండి కాపాడినప్పటి నుండి ప్రణతికి ఫ్రెండ్ అయిపోయాడు అమృత్. అమృత్ తనిని తాను పరిచయం చేసుకుని ఆమె పేరు కూడ అడిగాడు. చెప్పింది ప్రణతి. అమృత్ ఇంటర్ సెకండ్ ఇయర్‍లో ఉన్నాడు. అలా మొదలైన ఇద్దరి స్నేహం రోజురోజుకీ గాఢమయింది.
’అమృత్.. అమృత్!! ఎప్పటికీ నా స్నేహితుడిగా ఉంటానన్నావు. నన్నొదిలేసి ఎలా వెళ్ళిపోయావు?’ అమృత్ గుర్తుకు రాగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. మూడేళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంది.
ఊహించని సంఘటనలు జీవితంలో చోటు చేసుకోవడం, నా అన్న వాళ్ళు వదిలెయ్యడం ప్రణతికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న నిజాన్ని తెలిసేలా చేసాయి. కేసు విచారణ తరవాత ప్రణతికి మూడు సంవత్సరాల జైలు శిక్ష వేసింది న్యాయస్థానం.
ప్రణతి వైఖరి అప్పటి నుండే మారడం ప్రారంభమయింది. పెంకితనం స్థానంలో విధేయత, చురుకుతనం బదులు నిదానం అలవాటయ్యాయి. విధి జీవితాన్ని ఎప్పుడు ఏ మలుపులు తిప్పుతుందో తెలియదు కాబట్టి అప్పుడున్న క్షణాలే మనవిగా గుర్తించి అనుభవించాలి అని అర్ధం చేసుకుంది.
అప్పటివరకూ ఆమె ఏం మాట్లాడాలంటే అది మాట్లాడేసేది. ఏ పని చెయ్యాలనుకున్నా పెద్దగా ఆలోచించేది కాదు. ఆమెకు ఇష్టమైన రీతిలో ఉండేది. తల్లిదండ్రులు దేనికి మందలించినా పట్టించుకునేది కాదు. ఇంటర్‍మీడియెట్ అయ్యాక బి.టెక్‍లో ఐ.టీ చెయ్యాలని ప్రణతి ముందుగానే అనుకుంది. మంచి ఉద్యోగం వస్తే తనని నిరాదరించిన వారందరి ప్రవర్తనలోనూ మార్పు వస్తుందని ఆమెకి అనిపించేది. స్వశక్తితో జీవించాలని కలలు కనేది.
అనుకోని విధంగా జీవితం మలుపు తిరిగినా ఆమె తన ఆశయాన్ని వదలలేదు. చక్కటి ప్రవర్తనతో ఉండడం వల్ల జైలు వార్డెన్ సుశీల ఆమెకు చదువు విషయంలో సలహాలు ఇచ్చేది. ఆ మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసింది. కంప్యూటర్స్ బాగా నేర్చుకుంది. ఆమె సత్ప్రవర్తనతో సంతృప్తి చెందిన సుశీల ప్రణతికి ఉద్యోగం చూసి పెట్టే బాధ్యత కూడ తీసుకుంది. అంత చిన్న వయసులో జీవితంలో దెబ్బలు తిన్న ప్రణతి మీద ఆవిడకి సానుభూతి ఉంది. ప్రణతి మంచితనం వల్ల అది ఆమె మీద అభిమానంగా మారింది.
కంపెనీలలో వేకెన్సీలొచ్చినప్పుడు సుశీల తమ వైపు నుండి అప్పుడప్పుడు కొంతమందిని సిఫారసు చేస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా శిక్షాకాలంలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని మాత్రమే ఆమె రికమెండ్ చేస్తుంది. ప్రణతి విషయంలో సుశీలకు ఎటువంటి అనుమానమూ లేదు. ఎక్కడ ఉద్యోగం వచ్చినా ప్రణతి ఆమె విధులని పెర్‍ఫెక్ట్‍గా నిర్వహిస్తుందని సుశీల అర్ధం చేసుకుంది. అందుకే ఆమె కౌశల్ కంప్యూటర్స్ కంపెనీలో ఉద్యోగానికి ప్రణతి పేరు సిఫారసు చేసింది.
జైలు కెళ్ళిందని తల్లిదండ్రులే ఆమెని వదులుకున్నారు. జైలు నుండి విడుదల అయ్యాక సమాజం నుండి ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో అవన్నీ ప్రణతికి ఎదురయ్యాయి. ఆమెని ఆ పరిస్థితులనుండి మళ్ళీ సుశీలే రక్షించింది. ఆమెకు ఉండడానికి షెల్టర్ ఇప్పించడంలో కూడ సహకరించింది. అందువల్లే ప్రణతి ఈ ఉద్యోగం దొరుకుతుందని పూర్తిగా నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఏదో ఒక మంచి ఉద్యోగం దొరికే వరకూ ప్రయత్నిస్తూనే ఉండాలి అని మాత్రం అనుకుంది.
సుశీల సిఫారసు చెయ్యడం వల్ల ప్రణతికి ఉద్యోగం ఇవ్వడానికి ఆలోచించక్కర్లేదని షీలాకి తెలుసు. కానీ కౌశల్‍కి ఒకసారి చెపితే బెటర్ అనిపించి ఆమె అతని కేబిన్‍లోకి వెళ్ళి ప్రణతిని జైలు వార్డెన్ సిఫారిస్ చేస్తోందని చెప్పింది. కౌశల్ చెప్పడంతో తనకి వచ్చిన మూడు అప్లికేషన్ల లోని కాండిడేట్స్‍కి మర్నాటి నుండి కంపెనీలో జాయిన్ అవ్వవచ్చని తెలియపర్చింది.
తనకి ఉద్యోగం వచ్చిందని ప్రణతి చాల సంతోషపడింది. ’మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. అడుగడుగునా మీరు అమ్మ కంటే ఎక్కువగా నన్ను ఆదరిస్తున్నారు’ అంది ప్రణతి సుశీలకి కాల్ చేసి.
’నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండు. వెనకటి విషయలేమీ ఆలోచించకుండా హాయిగా ఉద్యోగం చేసుకో’ అంది సుశీల.
ప్రణతి ఉండేది ఒక పాత ఉమెన్స్ హాస్టల్‍లో. ఆ హాస్టల్ వార్డెన్ మేరీ. ఆమెని ప్రణతికి షెల్టర్ ఇమ్మని సుశీల అడిగినప్పుడు హాస్టల్‍లో గదులేమీ ఖాళీలు లేవు. అయినా ఆమె సుశీల మాట కాదనలేదు. మేరీ కొన్ని సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. మేరీ దగ్గర చాలా పాత సామానులు ఉంటాయి. ఆమెకి తెలిసున్నవాళ్ళు, ఇంకా ఆ కాలనీలో అందరూ తాము వాడని వస్తువులను మేరీకి ఇస్తూంటారు. ఆమె వాటినన్నింటినీ కొన్ని గదుల్లో ఉంచుతుంది. ఆ వస్తువులు ఎవరికి అవసరమయితే వాళ్ళు తీసుకెళ్లవచ్చు. డబ్బులు ఇవక్కర్లేకుండా. అందువల్ల విమెన్స్ హాస్టల్ గ్రవుండ్‍ఫ్లోర్‍లోని నాలుగు గదులను ఆ సామాన్లకి కేటయించింది. వాటిలో ఒక చిన్న రూమ్ ఖాళీ చేయించి ప్రణతికి ఇచ్చింది. అదే మహా అదృష్టంగా భావించింది ప్రణతి.
తనకి ఉద్యోగం వచ్చిన సంగతి మేరీకి చెపుదామని గదిలోనుండి బయటికి వచ్చింది ప్రణతి. మేరీ గుర్తుకు రాగానే ప్రణతి పెదవులపై నవ్వు కదలాడింది. మేరీకి ఒక అలవాటుంది, ’నేను ముందే చెప్పానా’ అని అంటూ ఉంటుంది.
’అవును, మీరు ముందే చెప్పారు’ అని అనగానే చాలా సంతోషపడిపోతుంది. అద్దెకి వచ్చిన మొదట్లోనే ప్రణతికి ఆ విషయం అర్ధమైంది. మేరీ నవ్వు నిర్మలంగా మనస్పూర్తిగా ఉంటుంది, అందువల్ల ఆమెని సంతోషపెట్టడానికి ప్రణతి కూడ ’అవును, మీరు ముందే చెప్పారు’ అంటూ ఉంటుంది. మేరీ కూడా చాలా సంతోషపడింది ప్రణతికి జాబ్ వచ్చిందని.
జీవితం మరో అనుకోని మలుపు తిరగబోతోందని తెలియని ప్రణతి మర్నాడు ఉద్యోగంలో జాయినయ్యే క్షణాలకోసం ఎదురుచూస్తూ నిద్రకుపక్రమించింది.
బెడ్ మీదకి చేరిందన్నమాటే కానీ ప్రణతికి నిద్ర పట్టట్లేదు. సుశీల ఫోన్ చేసి అందించిన తీపి కబురు పదే పదే తలుచుకుంది. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉన్నా, ఇంకా ఏవేవో ఆలోచనలు అమె అంతరంగాన్ని ఆక్రమించుకున్నాయి. మూడేళ్ళ నుండి ఆమె అనుభవించిన జీవితం వల్ల, ప్రణతి ప్రతీ సిట్యువేషన్‍నీ అన్ని కోణాలనుండి చూడడం అలవాటు చేసుకుంది.
’కొత్తగా ఉద్యోగంలో జాయినయినప్పుడు మొదటిరోజు ఎవరికైనా కొంచెం టెన్షన్‍గానే ఉంటుంది. కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు. నేను జైలు లో శిక్ష అనుభవించి వచ్చాను. ఈ సమాజం నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోదు. నాతో ఆఫీసులో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఎవరెలా ప్రవర్తించినా పట్టించుకోకుండా ఉండాలి. నేను జైలుశిక్ష అనుభవించానని తెలిసి వాళ్లు ఉద్యోగం నుండి తీసేస్తే మాత్రం సమస్య తప్పదు. నా పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది’ అనుకుంది ప్రణతి. ఇలా అలోచిస్తున్న ఆమెకి గుర్తొచ్చింది సుశీల తనని సిఫారసు చేసేటప్పుడే వాళ్లకు ఈ విషయం కూడా తెలియచేస్తుందని. అప్పుడు తను రిలీజైన ఖైదీ అని తెలిసే వాళ్ళు తనకి ఉద్యోగం ఇచ్చారని అర్ధమైంది ఆమెకి.
’ఈ కారణంతో నన్ను ఉద్యోగంలోనుండి తీసెయ్యరు కానీ వాళ్ళ నాతో ప్రవర్తించే విధానంలో తేడా ఉండొచ్చు. ముందునుండీ మానసికంగా సిద్ధంగా ఉంటే తరవాత బాధ పడక్కర్లేదు’ ప్రణతి పెదవులపై విషాదంతో కూడిన చిరునవ్వు కదిలింది.
’ఏం తప్పు చేసావని జీవితం నిన్నిలా శిక్షించింది. నీ హృదయంలో కొలువైన ప్రేమని నువ్వు తలచుకోని క్షణం ఉందా? ఆ ప్రియ సన్నిధిలో వసంతవనంలో పూలబాటలా జీవితం సాగిపోవాలని ఎన్నెన్ని కలలు కన్నావు? ఆ కలలన్నీ నీ హృదయాకాశంలో అలాగే ఉన్నాయి. కానీ పగటి వెలుగులో నక్షత్రాల్లా ప్రకాశాన్ని కోల్పోయాయి. జాబిలిరేడు ఉదయించేనా!! నీ కలలతారకలన్నీ మిలమిల మెరిసేనా? ఆ ఘడియలు నీ జీవితంలో వచ్చేనా?’ చేజారిన జ్ఞాపకాలలోని ప్రేమ భావసంచలనంతో ఆమె గుండెల్లో అలజడి మొదలైంది.
కాసేపటికి ఆమె ప్రస్థుత పరిస్థితి మీదకి ఆమె దృష్టి మరల్చుకుంది. ఇప్పుడు దొరికిన కొత్త ఉద్యోగంలో జాయినయ్యాక అక్కడి అధికారులతో జాగ్రత్తగా మెలుగుతూ, తన లిమిట్స్‍లో తను ఉండాలని నిర్ణయించుకుంది. అధికారాన్ని ఎప్పుడూ గౌరవించాలని, లేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని ఆమె జైల్లోని అనుభవాల ద్వారా తెలుసుకుంది. కొంతమంది అధికారులు దర్పాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. వాళ్ల అండర్‍లో ఉండడం తప్పనిసరి అయినప్పుడు ఆత్మాభిమానాన్ని వదులుకుని వాళ్ల అహంకారపూరిత ప్రవర్తనకి లోబడి పనులు చెయ్యవలసి వస్తుంది.
అక్కడ ఆమెని ఎవరూ ఎక్కువగా గమనించకుండా వీలున్నంత జాగ్రత్తగా ఉండాలని ఆనుకుంది. ఆమె ఇదివరకటి స్వభావానికి అది పూర్తిగా విరుద్ధం. తుళ్ళిపడే జలపాతంలా, పొంగిపొర్లే ప్రవాహంలా ఉండేది ప్రణతి. ఎక్కడ ఉన్నా సెంటరాఫ్ అట్రాక్షన్ ఆమే అయ్యేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. అత్యంత ప్రియమైన స్నేహితుడిని కోల్పోయిన తరవాత ఆమెలో ఒకలాంటి నిర్వేదం అలుముకుంది.
మర్నాడు ఉదయం తొమ్మిదికల్లా ఆఫీస్ దగ్గర ఉండాలని సుశీల చెప్పింది ఆమెకి. అప్పుడు గుర్తొచ్చింది ప్రణతికి ఆమె దగ్గర కొన్ని డ్రెస్సులు ఉన్నా, అవి చాలా పాతబడిపోయాయి, పైగా వాటిలో ఒక్కటి కూడా ఆఫీసుకి వేసుకెళ్ళడానికి పనికిరాదు. ఆ తరవాత ఆమె ఇంక ఎక్కువ ఆలోచించలేదు. ప్రణతి వర్తమానంలో జీవించాలనుకుంటుంది. ప్రణతికి రేపటి మీద ఆశ ఉంది కానీ, భవిషత్తులో ఏం జరుగుతుందో తొంగిచూడాలన్న తాపత్రయం ఎక్కువ లేదు. ’రేపటి సంగతి రేపు చూద్దాం’ అనుకుని పత్రికలో కొత్తగా మొదలైన తన ఫేవరెట్ రైటర్ రాసిన సీరియల్ చదవడంలో నిమగ్నమైపోయింది.
* * *
సింధూరవర్ణం నుండి బంగారువర్ణంలోకి మారుతున్న సూర్యుడిని చూస్తూ, ఆ లేలేత ఎండని అనుభవిస్తూ లాన్‍లోని పచ్చిక మీద స్కిప్పింగ్ చేస్తున్నాడు కౌశల్. అతను భవంతిలోనే జిమ్ ఏర్పాటు చేసుకున్నాడు. అయినా కూడా కొంతసేపయినా ఇలా సహజ వాతావరణంలో గడపడం అతనికి చాలా ఇష్టం.
రోజు మొత్తానికి సరిపడేంత ఫ్రెష్‍నెస్ అతను ఉదయాన్నే పొందుతాడు. ప్రసిద్ధ చిత్రకారుడు అత్యంత నైపుణ్యంతో చిత్రించినట్లున్న ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్న అతనికి ఆమె గుర్తు వచ్చింది. అత్యంత అందమైనదాన్ని ఏది చూసినా ఆమే గుర్తు వస్తుంది కౌశల్‍కి. సహజమైన అందం అతను మొదటిసారిగా చూసింది ఆమె లోనే. అందంతో అమాయకత్వం పోటీ పడుతున్నట్లుండే ఆమె వదనం కన్నుల ముందు నిలిచింది కౌశల్‍కి. అమ్మాయిలలో ఎవరిని చూసినా కలగని కొన్ని భావాలు అతనికి ఆమెను చూస్తేనే కలిగేవి. కానీ ఎందుకనో అతని మనసు ఆమెకు దగ్గరగా వెళ్ళడాన్ని అంగీకరించేది కాదు. ఆమె ఎక్కడ ఉందో అనే ఆలోచనలు వచ్చినా బలవంతంగా వాటిని తిరస్కరించడం అలవాటు అతనికి.
ఎక్సర్‍సైజెస్ చేసేసాక లాన్‍లోనే కూర్చుని గ్రీన్‍టీ తాగుతున్న కౌశల్ మనసు ఇంకా ఆమె గురించిన ఆలోచనలలోనే పరిభ్రమిస్తోంది. ఆమెతో చూస్తూ గడిపిన క్షణాలన్నీ అతని స్మృతిపటలం మీద సజీవచిత్రాలై శాశ్వతముద్ర వేసుకున్నాయి. ఎంతో మంది అమ్మాయిలు అతని దృష్టి నాకర్షించడానికి ప్రయత్నించినా ఆమె మాత్రం మలయ సమీరంలా అతని మనసుని చల్లగా తాకింది. హాయిగొలిపే ఆమె స్పర్శ గుర్తుకి వస్తే మనసు బలహీనపడుతుంది అనుకుంటాడు. అందుకే వెంటనే మనసు మరల్చుకుంటాడు. దూరమైన తీరంలా, చేరలేని గమ్యంలా ఎక్కడుందో మరి. అతని మస్థిష్కంలో ఆవిష్కృతమైన ఆ రూపాన్ని తనివితీరా ఆస్వాదించే అవకాశం అతనికెప్పుడూ రాలేదు.
మనసంతా మంచుతెరల్లా కమ్మేసిన ఆమె ఆలోచనలనుండి బలవంతాన తప్పించుకుంటూ టైమ్ చూసాడు మొబైల్‍లో. షీలా దగ్గరినుండి వచ్చిన మెసేజ్ ఉంది. ఆరోజు ఆఫీస్‍లో బోర్డ్ మీటింగ్ ఉంది. ఆ విషయం రిమైండ్ చేసింది ఆమె. ఆలోచనలన్నీ పక్కన పెట్టి పనులలో నిమగ్నమైపోయాడు కౌశల్.
* * *
తలుపు తడుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది ప్రణతికి. బెడ్ మీద నుండి వెంటనే కిందకి దిగింది. తలుపు తీస్తే ఎదురుగా మేరీ, గుడ్‍మాణింగ్ చెప్పింది ఆమె.
’ఈ పాటికి లేచి ఉంటావనుకున్నాను’ అంది ప్రణతి వైపు ఆప్యాయంగా చూస్తూ.
’రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, ఇప్పుడే లేచాను’ అంది ప్రణతి.
’నీకు ఉద్యోగం రావడం నాకు చాలా హేపీగా ఉంది. నీకు ఒకటి చెప్పాలని వచ్చాను’ అంది మేరి. చెప్పమన్నట్లుగా చూసింది ప్రణతి.
’మొదటిరోజు ఆఫీస్‍కి వెళుతున్నావు. నా దగ్గరున్న వాటిలో నీకు కావలసినవి తీసుకో. డ్రెస్, షూస్ ఇంకా నీకు ఏం కావాలంటే అవి. ఆ రూమ్ లోకి వెళ్ళి నీకు నచ్చినవి తెచ్చుకో’ అంది మేరీ. సరేనంది ప్రణతి. మేరీ వెళ్ళాక ఫ్రెష్ అయ్యి ఆ వస్తువులు ఉన్న గదికి వెళ్ళింది ప్రణతి.
మేరీ సింగిల్ గా ఉంటుంది. ఆమె భర్త ఎక్కడైనా ఉన్నాడో, చనిపోయాడో మేరీకి కూడ తెలియదు. ఆమెకి పుట్టింటివారిచ్చిన మూడంతస్థుల బిల్డింగ్ ఉంది. పాతబడిన ఆ బిల్డింగ్‍ని కొన్ని మార్పులు చేసి విమెన్స్ హాస్టల్‍గా మెయిన్‍టెయిన్ చెయ్యసాగింది ఆమె.
మేరీ చేసే సోషల్ సర్వీసెస్‍లో రోడ్ మీద తిరిగే కుక్కలను పోషించడం కూడా ఒకటి. ఎవరైనా తమ పెట్స్‍ని ఏవైనా కారణాల వల్ల విడిచి పెట్టాలనుకుంటే వాటిని తెచ్చి ఆమెకి అప్పగిస్తుంటారు. వాటిలో దేన్నయినా ఎవరైనా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తే వారికి ఫ్రీగానే ఇచ్చేస్తుంది. బిల్డింగ్ సెల్లార్‍లోని కొంత ఏరియాలో మెష్ పెట్టించిందామె. అక్కడ పెట్స్ ఉంటాయి.
తమకి పనికిరావు అనుకున్నవీ, అదనంగా ఉన్న వస్తువులూ తెచ్చి ఆమెకి ఇస్తూ ఉంటారు ఆ కాలనీలోని వారు. అవన్నీ ఆమె ఒక గదిలో పెడుతుంది. మరెవరికైనా ఆ వస్తువులు అవసరమైతే వాళ్ళు వాటిని వాడుకోవడానికి తీసుకెళ్ళచ్చు. బట్టలు, జోళ్ళు, బేగ్‍లు లాంటివి కొంతమంది తీసుకెళుతుంటారు. పాత టీపాయ్‍లు, కుర్చీలు, టేబుల్స్, వంటపాత్రలు ఇలాంటివి కూడ ఉంటాయి ఆ సామాన్లలో. వేరే ఎక్కడినుండయినా ట్రాన్స్‍ఫర్ అయివచ్చిన వాళ్ళు అవి తీసుకెళ్ళి ఏడాదో, రెండేళ్ళో వాడుకున్నాక మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళవి కూడ కొన్ని వస్తువులు పెడుతూ ఉంటారు.
మేరీ చేస్తున్న ఈ సర్వీస్ గురించి ఆ చుట్టుపక్కల చాలా దూరం తెలిసి ఆమెకి చాలా వస్తువులు లభించసాగాయి. అవి ఉంచడానికి ఆమె గదుల సంఖ్య పెంచింది. అలా నాలుగు గదుల్లో ఆ వస్తువుల రకాలను బట్టి ఉంచసాగింది మేరీ. వాటిలో ఒక గదిని ప్రణతి ఉండడానికి ఇవ్వడం వల్ల, ఇప్పుడు అవన్నీ మూడు గదుల్లో ఉంటున్నాయి.
బట్టలు, ఏక్సెసరీస్ ఉన్న గదిలోకి వెళ్ళింది ప్రణతి. అక్కడున్న బట్టలలో ఆఫీస్‍కి వెళ్ళడానికి ఆమెకి సూటబుల్‍గా ఉండేవి ఏవైనా ఉన్నాయేమో చూసుకుంది. ఒక జీన్స్, జాకెట్, టీ షర్ట్ తీసుకుంది. అవి కాస్త అటూఇటూగా ఆమెకు కావలసిన సైజ్‍లోనే దొరికాయి బట్టలు. షూస్ మాత్రం ఆమెకి కావలసిన సైజ్‍వి దొరకలేదు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉన్నాయి అక్కడ. చిన్నవి వేసుకోవడం ఎలాగూ కుదరదు కాబట్టి, కొంచెం పెద్దవైనా అవే తీసుకుని తన గదికి వెళ్ళింది ప్రణతి.