నిర్ణయం
NirNayam is a story by Sammeta Umadevi “సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడుచేసుకోకు. కమాన్ మంచి కాఫీ తాగుదాం”. ఆమె భుజం చుట్టూ చేయివేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి.
నిర్ణయం
సమ్మెట ఉమాదేవి
"ఈ పెళ్లి ఒక ఇంద్రజాలమో, మహేంద్ర జాలమో నాకు తెలియదు లలితా.! కొన్నాళ్లక్రితం వరకు నువ్వెవరో తెలియదు. కానీ నిన్నుచూసాక నిన్నే పెళ్లాడాలననిపించింది. మా వాళ్ళు, మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం."
"ఎందుకలా అనుమానపడ్డారు..?"
"ఏముంది ఇవ్వాళా అమ్మాయిలందరికీ ఎమ్బీబీయస్సో, బీ టెక్ చేసిన అబ్బాయ్యో మాత్రమే కావాలి. వాడు ఫారిన్ కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి నేను మామలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ని మామూలు అకౌంటెంట్ ని. అసలు నీకు తెలుసా ఇవ్వాళా అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమైపోతున్నది. అమ్మయిలు తెగ చదివేసి యిట్టే ఉద్యోగస్తులై పోతున్నారు. వాళ్లకు తగ్గ వరుణ్ణి వాళ్ళే ఎంచుకుంటున్నారు. "ఎనీ హౌ మనిద్దరికీ రాసి పెట్టి ఉంది. పెళ్లికుదిరింది. ఐ అయం సో హ్యాపీ లలితా.."
"నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అనిల్. ఒక మాట అడగనా..? ఇవ్వాళ రేపు ఎంగేజ్ మెంట్ కి కూడా ఎందుకిలా పెళ్ళికి పెట్టినంత ఖర్చుపెడుతున్నారు.? మా నాన్న ఒక సామాన్య ప్రభుత్వోద్యోగి. మనం పెళ్లి కాస్త సింపుల్ గా చేసుకోలేమా..? ఈ ఎంగేజ్ మెంట్ కి ఇంత ఖర్చు అవసరమా ?"
"చూడు లలితా..! పెళ్లిగురించి మనకు ఎన్ని ఆశలు ఉంటాయో.! పిల్లల పెళ్లిళ్లు ఎలాచేయాలో పెద్దవాళ్లకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఖర్చుపెట్టనీ, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతారు. జీవితంలో ఒకేసారి వచ్చే సందర్భం కోసం ఇలా ఖర్చు పెట్టడం నువ్వో నేనో మొదలెట్టింది కాదు. నీతోనే నాతోనే ఆగిపోయేది కాదు.”
“సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడుచేసుకోకు. కమాన్ మంచి కాఫీ తాగుదాం”. ఆమె భుజం చుట్టూ చేయివేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల వెల్లువలో కొట్టుకుపోయాయి.
* * *
వైభవంగా జరిగిపోయిన ఎంగేజ్ మెంట్ అనే ఆ ఘట్టంలో పసుపుతాడొక్కటే తక్కువ. పెళ్ళికి రెండునెలల గడువు వచ్చిది. దానితో ఇద్దరికీ ఆ మర్నాటినుండి సెల్లు స్వరాలే చెంపస్వరాలయినాయి
రోజులు గడుస్తున్నకొద్దీ పెళ్లి ఏర్పాట్లకోసం ఆమె తండ్రి సూర్యం నానా అగచాట్లుపడడం లలిత గమనిస్తూనే ఉన్నది. ఒక మధురోహలలో తేలుతున్న లలితకు తండ్రిపడే యాతనకు చాలా బాధగా ఉన్నా.. ఇలాటపుడే కదా ఖర్చుపెట్టేది అన్న అనిల్ మాటలు గుర్తుకువచ్చి ఏమి అనలేకపోతున్నది. అసలు కట్నం ఎందుకివ్వాలి అని వాదించే లలితకు వాళ్ళు పదిలక్షలు అడిగారని తెలిసీ చాలా బాధపడింది. ఈ సంబంధం వద్దు నాన్న అని గట్టిగా చెప్పాలనుకున్నది.
" ఏ వయసులో జరగాల్సిన ఆ ముచ్చట ఆ వయసులో జరగాలి. ఇలా కట్నం ఇచ్చుకోలేమనో, ఇవ్వనమనో అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు. ఐశ్వర్యవంతుడూ, అందగాడు కావాలనో రకరకాల కారణాలతో పెళ్ళి వాయిదా వేసుకున్న వారికి.. ఆ తరువాత ఆ ఈడు అబ్బాయి దొరకడం కష్టమయిపోతున్నది. అలా పెళ్లికాని అమ్మాయిలు ఎందరో మన బంధువుల్లోనే ఉన్నారు.” తల్లి కఠినంగా చెప్పింది. దానికి తోడు అనిల్ నచ్చి, రాజీకొచ్చిన దానిలా మౌనం వహించింది.
పెళ్లికొడుకు ఇల్లూ తానూ ఉద్యోగం చేస్తున్న స్థలం చాలా దూరం కాబట్టి ప్రస్తుతానికి ఇరువురి పెద్దల సూచనమేరకు చేస్తున్న చిన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసింది.
చకాచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మధ్యమధ్య మొగ పెళ్ళివారి కోరికల చిట్టా విప్పుతున్నారు. ముందే వాళ్ళు పెళ్లి చాల ఘనంగా జరపాలి అన్నారు. లేని ఆడపడుచు కట్నం కూడా తమ్ముడి కూతురికి ఇవ్వాలి అన్నారు, కళ్యాణమండపం వాళ్లకు నచ్చాలి అన్నారు. ఈ డిమాండ్లు లలితకు ఒళ్ళు మండిస్తున్నా ఓపిక పడుతున్నది. అప్పటికే అయిదు లక్షలు పెళ్లివారికి ఇచ్చేసాడు సూర్యం. ఇంకా అయిదులక్షల సొమ్ములు సమర్చుకోవాలి. పెళ్లిఖర్చులు చూసుకోవాలి.. ఆందోళనగా కంగారుగా తిరుగుతున్న తండ్రిని చూసి ..
"నాన్నా.. ఎందుకలా చాల ఆందోళనగా ఉన్నావు..? డబ్బు సర్దుబాటు అవ్వలేదా? " ఉండబట్టలేక అడిగింది.
"అదేంలేదమ్మా అన్నీ సమకూరుతాయి. అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వేం కంగారుపడకు” అన్నారు. అయిదేళ్ల క్రితం అక్క సునీతను మేనత్త కొడుకుకే ఇచ్చి చేసినా.. అంతో ఇంతో కట్నం ఇచ్చుకోక తప్ప లేదాయనకు. ఇప్పుడిక ఉన్నదంతా నాకు ఊడ్చి ఇస్తే రేపు తమ్ముడి భవిష్యత్తు ఏమిటి? అని బాధపడింది. మగపెళ్లి వాళ్ళు ఎక్కడా దేనికి తగ్గడం లేదు. అనిల్ అన్నా కాస్త వాళ్లకు సర్దిచెప్పొచ్చు కదా. చూడబోతే అతగాడికి కూడా వాళ్ళ అమ్మావాళ్ళు చేస్తున్న ఆర్భాటాలన్నీ ఇష్టమే అనిపించసాగింది. దానికితోడు ఇంట్లో యేవో చర్చలు జరుగుతున్నాయి. లలిత వచ్చేసరికి ఆపేస్తున్నారు. పదిరోజులు ముందే పెళ్ళికి వచ్చిన అక్క కూడా ఇంట్లో దేనిగురించి చర్చ జరుగుతున్నదో ఏమీ చెప్పడంలేదు. దానితో లలితకు మరికొంత అనుమానము మొదలయ్యింది. అనవసరంగా ఈ సంబంధం ఒప్పుకున్నానా అనుకుని బాధపడింది. ఇప్పుడు వెనక్కు వెళ్లేందుకు ఏమీలేక మౌనం వహించింది.
* * *
రంగురంగుల పూలతో అందమయిన సెట్టింగులతో కళ్యాణమంటపం అందాలు సంతరించుకున్నది
బంధుమిత్రులంతా పెళ్ళికి తరలివచ్చారు పెళ్లికూతురిగా ముస్తాబయిన లలిత చూడముచ్చటగా ఉన్నది. రుచికరమయిన వంటలు సిద్దమవవుతూ ఆ వాసనలు హాల్ లోకి కూడా వ్యాపిస్తున్నాయి. ఇన్ని రోజులనుండీ పెళ్లిపనుల్లో సతమతమవుతూ తిరుగుతున్న సూర్యం పట్టుపంచె కట్టుకుని భార్య సమేతంగా కన్యాదానానికి సన్నద్ధం అయ్యాడు. భారతి ముఖంలో సంతోషం వెళ్లివిరుస్తున్నది. విడిదినుండి పెళ్లికొడుకు ఉరేగింపుగా వచ్చాడు. అమ్మాయినీ, అబ్బాయినీ కూర్చోబెట్టి పూజలు చేయిస్తూ కళ్యాణపు తంతు మొదలుపెట్టారు పంతులుగారు. ఇరువురు తల్లిదండ్రులు వేదికమీద ఉన్నారు. “ఇక వధువు తల్లిదండ్రులు ఇటు వచ్చి కూర్చోండమ్మా..” అని పంతులుగారు పిలవగానే వెళ్లి కూర్చున్నారు . సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వంక తలెత్తి చూసింది లలిత. పెళ్లికూతురిగా ఉన్న కూతురిని సంతోషంగా చూసుకున్నారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సూర్యం .
"అయ్యో ఏమయింది నాన్న.?గట్టిగా అరుస్తూ పెళ్లి పీటలమీదనుండి ఒక్క గెంతుతో వచ్చి తండ్రిని పట్టుకున్నది లలిత.. “ఏమయ్యిందండీ..?” అంటూ భారతి భయంతో అరిచింది. తల్లీ కూతుర్లిద్దరూ అరుస్తూనే వున్నారు. గుండె చేత్తో వత్తుకుంటూ క్షణాలలో ప్రాణాలు వదిలాడు సూర్యం. ఈ హటాత్ పరిణామానికి ఉక్కిరిబిక్క రై పోయింది లలిత. అంబులెన్స్ రావల్సిన అవసరమే లేకపోయింది. వచ్చిన బంధువుల్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు. అతని మరణవార్తను ద్రువీకరించేసారు. కళ్యాణరాగాలు పలుకుతున్న సన్నాయిమేళాలు ఆగిపోయాయి. అయినవారి శోకాలు అక్కడ మారుమోగిపోయినాయి. భారతి పొర్లి పొర్లి ఏడుస్తున్నది. లలిత అక్క సునీతా, తమ్ముడు సుధీర్ లలితను పట్టుకుని పెద్దగా రోదించసాగారు. లలితకు భయం.. దుఃఖం.. ఇలా జరిగిందేమిటన్న ఆశ్చర్యం. ఇదంతా నిజంకాకుండా ఉంటే బాగుండన్న ఆశతో అయోమయంగా అరుస్తూ ఏడవసాగింది. పెళ్లి కొడుకుని ఎవరో అక్కడనుండి తప్పించి కార్లో తీసుకెళ్లిపోయారు. మొగపెళ్ళివారంతా మెల్లగా అక్కడనుండి వెళ్లిపోయారు. పెళ్లి చూద్దామనుకుని వచ్చినవారికి సూర్యాన్ని ఆఖరు చూపులు చూడవలసి వచ్చింది. పెళ్ళికొడుకు, పెళ్లికూతురి కోసం ఉంచిన పూలదండలు అతన్ని భౌతికదేహాన్ని కప్పేశాయి సూర్యం కుటుంబాన్ని విషాదపు చీకట్లు కమ్మేశాయి .
* * *
కర్మలు ముగిసాయి. పెళ్లిళ్లు చావిల్లుగా మారి స్మశాన నిశ్శబ్దం ఆవహించింది. నాన్నలేని ఇల్లు శూన్యంగా భయంకరంగా అనిపించి లలితకు తానూ చచ్చిపోదామన్నంత ఆలోచనలు వస్తున్నాయి. తల్లిని చూస్తే ప్రాణం ఉసూరుమన్పిస్తున్నది. చదువుకోవడం తప్ప ప్రపంచం తెలియని తమ్ముడిని చూస్తే జాలనిపిస్తున్నది. కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని ఇంటిపనులు చేస్తూ తల్లిని చూసుకోసాగింది. తండ్రి మరణం ఎంత బాధగా ఉందో.. అక్కడనుండి జారుకున్న అనిల్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అంతకంటే చాల కంపరంగా అనిపించసాగింది. పెద్దకర్మకి అనిల్ తండ్రి ప్రసాదరావు వచ్చివెళ్లాడని తెలిసింది. కనీసం లలితను అతను పలుకరించనయినా లేదు. సూర్యం చనిపోయి నెల గడిచిపోతుండగా భారతి అన్నలు వచ్చి..
“అమ్మా భారతీ మరి ప్రసాదరావ్ గారింటికి వెళ్లి లలిత పెళ్లిసంగతి మాట్లాడిరామా..?” అని అడిగారు.
“అమ్మా..! తండ్రి చనిపోయిన దుఃఖంలో నేనుంటే కనీసం ఇంతవరకు మనలను పలకరించని ఆ కుటుంబంలోకి నేను వెళ్లాలా..? కనీసం అనిల్ కి నా గురించిన ఆలోచనే లేదా..? ఇప్పటిదాకా ఒక్క ఫోన్ కూడా చేయని ఆ మనిషితో నాకిక పెళ్ళి అవసరమా..?” అడిగింది.
“చూడమ్మా..! మనం మనిషిపోయిన దుఃఖంలో ఉన్నాం. వాళ్ళు వాళ్ళ అబ్బాయి పెళ్లి ఆగిపోయి అందరికీ జవాబు చెప్పుకునే స్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళకు కూడా ఇది బాధే. ఇదంతా తట్టుకోవడానికి వాళ్లకు కూడా కాస్త సమయం పడుతుండమ్మా. ” తల్లి మాటలలో నిజం ఉందనిపించింది లలితకు.
పెద్దలు వెళ్లి అనిల్ కుటుంబాన్ని కలిశారు."నిండు పందిట్లో ఇలా జరగడం మా అందరికీ చాలా షాక్ గా ఉందండీ. ఇదేదో అపశకునంలా ఉన్నది మాకు. మళ్ళీ అదే అమ్మాయితోనే పెళ్లి అంటే కాస్త ఆలోచించాల్సి వస్తున్నదండి.”
“అదేంటండి అలా అంటారు. నిజానికి మా బావగారు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నది మేము. ఏదయినా అపశకునం అనుకుంటే అది మేము అనుకోవాలి. పెళ్లిపీటల వరకు వచ్చిన వధువును అలా నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తారా.? ఇది అకస్మాత్తుగా జరిగిన మరణం. ఇందులో ఎవరి తప్పూ లేదండి. పెద్దలు మీరు బాగా ఆలోచించి త్వరగా ఈ పెళ్లిజరిగేలా చుడండి..” అంటూ హెచ్చరించి వాళ్ళు ఇంటికి మరిలారు.
మర్నాడు లలిత మేనమామ శ్రీధర్ లలితను, భారతిని, లలిత తమ్ముడు సుధీర్ ని తమవెంట సూర్యం ఆఫీసుకి తీసుకెళ్ళారు. అక్కడ ఆఫీస్ లో సూర్యం తోటి ఉద్యోగులు వీళ్ళను ఆత్మీయంగా పరామర్శించారు. సి.ఈ.ఓ గారు సూర్యానికి రావలసిన సొమ్ములన్నీ వీలయినంత త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని. కాంపన్సేషన్ గ్రవుండ్స్ లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నదని దానికి అప్లై చేసుకొమ్మని సలహా ఇచ్చారు. ఇంటిల్లిపాదికి కాస్త ఊరటగా అనిపించింది.
శ్రీధర్ లలిత గదికి వచ్చి కూర్చుని “చూడమ్మాలలితా..! ఇంకా చదువు ముగియని తమ్ముడు ఏ జాబ్ చేస్తాడు ? మీ ఆమ్మను ఉద్యోగం చేయమనడం ఏమి బాగుంటుంది? అయినా ఆమె చదువుకు ఏ అటెండర్ జాబో ఇస్తారు. మరి ఏమి చేద్దాం? అని అడిగాడు
“పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మను ఈ వయసులో ఉద్యోగం చేయమంటమా? మామయ్య నాకు రాదా ఆ జాబ్..?” అని అడిగింది
“నీవు అవివాహిత కూతురివి కాబట్టినీకు వస్తదమ్మా. కానీ మరి నీకు ఈ నెలలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ ఉద్యోగం రావడం అంటే కనీసం ఆరునెలలకు పైగా పట్టొచ్చు.”
“ఏడాది అయినా ఆగుతాను మామయ్య. మీరంతా అంటున్నరని నేను మౌనంవహించాను కానీ, నాకు అసలు పెళ్లి అంటేనే విరక్తి పుట్టింది మామయ్యా..” లలితా ఘొల్లున ఏడ్చింది.
“నేను అర్ధం చేసుకోగలనమ్మా. సరే రేపే సిఈఓ ని కల్సి మన ప్రయత్నాలు మొదలుపెడదాం. ముందు నువ్వు దైర్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలుగుతావు.”
“ధైర్యంగా ఉంటాను మామయ్య.. ఎందుకంటే ఇప్పుడు అమ్మనీ, తమ్ముణ్ణి నేనే చూసుకోవాలి.. స్థిరంగా అన్నది.
* * *
లలిత తన సర్టిఫికెట్స్ .. తండ్రి డెత్ సర్టిఫికెట్, అతని ఎస్ఆర్ పట్టుకుని జెడ్ పీ చుట్టూ, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరగసాగింది. సూర్యాన్ని ఎంతగానో అభిమానించే అతని మిత్రులంతా లలితకు అడుగడుగునా సాయం చేయసాగారు. అప్పుడే ఆమెకు సీనియర్ అకౌంటెంట్ పరమేశ్వర్ గారి ద్వారా చాల విషయాలు తెలిసాయి
"మీ నాన్న నాకు ఆప్తమిత్రుడమ్మా. అందం, చదువు అన్నీ ఉన్నా నీ పెళ్ళికి వాళ్ళు ఇరవయిలక్షల కట్నం అడగడం, మీ అక్కకి చాల తక్కువ కట్నం ఇచ్చారని, ఇప్పుడు నీకు ఇరవయిలక్షల కట్నం ఇస్తే.. తనకు ఓ పది లక్షలన్నా ఇవ్వాలని మీ అక్కా, బావలు పోట్లాడడం ఆయన తట్టుకోలేకపోయారమ్మా.! ఇవ్వన్నీ మీ నాన్న నాకు చెప్పుకుని ఎంతో బాధపడ్డాడమ్మా. దానితో నేనే ష్యురీటిగా ఉండి బాంక్ లోనూ, బయట ఫైనాన్స్ కంపెనీల్లోనూ అప్పులు ఇప్పించాను. పుట్టెడు దుఃఖంలో ఉన్న మీకు ఇప్పుడే ఇవ్వన్నీ చెప్పడం ఎందుకని ఆగిపోయాను. ఇవాళో రేపో వచ్చి మీ అమ్మకు, మీ మేనమామలకు ఆ కాగితాలన్నీ అప్పగిస్తాను.”
లలిత తలపై వందటన్నుల బరువు పడ్డట్టు విలవిలలాడింది. కూతురు సుఖంగా ఉండడంకోసం ఇరవయిలక్షల కట్నంకి ఒప్పుకుని.. తనదగ్గర అబద్దం చెప్పి తానూ ఇక్కట్లపాలయిన తండ్రి ప్రేమకు.. కన్నీరు మున్నీరయ్యిది. అక్క కొడుకయి ఉండీ, మామయ్య కష్టం పట్టించుకోకుండా తనకూ ఓ పదిలక్షలు కావాలని అడిగిన బావ ముఖం, అతనికి వంతపాడిన అక్క ముఖం చూడాలంటే అసహ్యం వేసింది. కన్నకూతురికే తండ్రిబాధ పట్టనప్పుడు ఇంకాఎవరికి పడుతుంది అనుకున్నది. అంతలోనే తానూ మాత్రం తక్కువేం తిన్నది? అసలు కట్నపు పెళ్ళికి ఒపుకున్నాక అది పదిలక్షలయితేనేం ఇరవయి లక్షలయితేనేం..? ఈ ఆర్థిక సమస్యలకేగా ఆయన ఇంత నలిగిపోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.” తన తప్పు ఏమిటో తెలిసి రాసాగింది లలితకు. చాలా గంభీరంగా మారిపోయింది.
ఆ రోజు ఆదివారం. సాయింత్రం నాలుగింటికి కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపుతీసింది. ఎదురుగా అనిల్ తండ్రి ప్రసాదరావ్ .
“ఇంత ఘోరం జరిగిపోయాక మిమ్ముల్ని ఎలా పలుకరించాలో అర్ధంకాక మళ్ళీ రాలేదమ్మా.” అతనితో పాటు మరో ఇద్దరు పెద్దలు వచ్చి కూర్చున్నారు. లలిత టీ పెట్టి ఇచ్చేలోగా భారతి ఫోన్ చేసి తమ్ములను పిలిపించింది.
“సూర్యంగారి డబ్బులు వచ్చాయని విన్నాం. మీరు పెళ్ళికి సిద్ధమని తెలుసు. కానీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని అన్నారట కదా! అందుకే కొన్ని నెలలు ఆగుదాము. అమ్మయికి ఉద్యోగం వచ్చాకే పెళ్లిచేద్దాం..” భారతికి ప్రాణం లేచివచ్చింది. ఆమె తమ్ముళ్లు “సరేనండి మరి అబ్బాయి అంత కాలం ఆగటానికి ఒప్పుకున్నాడా?” అని అడిగారు.
“వాడు పెద్దలమాట కాదనడండీ. మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు.”
“నిజానికి సూర్యంగారు ఇరవయిలక్షల కట్నంకి ఒప్పుకున్నారు. పాపం ఇప్పుడాయనే లేరు. మీరు మిగిలిన అయిదులక్షలు ఇస్తే చాలులెండి. అన్నాడు.” అతని ఉదారత్వానికి భారతి మళ్ళీ మురిసిపోయింది.
వాళ్ళు వెళ్లిపోయాక "ఆ అబ్బాయికీ మన లలితకు రాసి ఉన్నది. అందుకే వాళ్ళంతట వాళ్ళే మళ్ళీ వచ్చారు..” నిశ్చింతగా ఊపిరిపీల్చుకుంటూ అన్న తల్లివంక జాలిగా చూసింది లలిత. వీళ్ళు అయిదులక్షలతో సరిపెట్టారు కాబట్టి.. నాన్న పేరిట వచ్చేడబ్బుల్లో అక్కకు కూడా ఓ నాలుగులక్షలు ఇద్దాం లలితా.. ఆడపిల్లను బాధపెట్టడం ఎందుకు.?” అన్నది. లలిత తల ఊపింది.
అనుకున్న దానికన్నా త్వరగానే లలిత ఉద్యోగంలో చేరింది. ఆరునెళ్ళు ఇట్టే గడిచిపోయాయి. లలిత అక్క సునీత తనకు వచ్చే డబ్బుకోసం.. అనిల్ తండ్రి ప్రసాదరావ్ మరో అయిదులక్షల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగంతో రానున్న కోడలికోసం ఎదురు చూస్తున్నారు.
ఆ రోజు సాయింత్రం లలిత మేనమామలు, సునీత ఆమె భర్త, ఇక పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకు వచ్చి కూర్చున్నారు. ఆఫీస్ నుండి వచ్చిన లలిత వాళ్ళు ఎదో మాట్లాడబోయేలోగా బాగ్ తెచ్చి..
“మామయ్యా..! నాన్నపేరిట వచ్చిన ముప్పై అయిదు లక్షల్లో పదిలక్షలు ఆయన చేసిన అప్పు తీర్చేసాను. ఇవిగో ఇవే ఆ కాగితాలు. ఇక అమ్మ ఎవరి పంచనా ఉండకుండా ఇరవయి లక్షలతో తన పేరిట చిన్న ఫ్లాట్ కొన్నాను. ఇవి ఆ కాగితాలు”
“అదేంటిమరి నీ పెళ్ళీ ఖర్చులు ఎలా..? అక్క కివ్వాల్సిన డబ్బులమాటో..?”
“అక్కకి నాన్న ఏనాడో పెళ్లి చేశారు. నాన్న వాళ్ళకేం బాకీలేరు తీర్చడానికి. తమ్ముడికి ఉద్యోగం వచ్చేవరకు వాడి బాధ్యత నాదే. ఇక నా పెళ్ళి విషయం.. నేనూ మనిషినే మామయ్యా.. ముందు చేసుకుంటాననడం, తరువాత అపశకునం, అనుమానం వద్దు అనడం, ఆ తరువాత నాకు నాన్న ఉద్యోగం వస్తుంది అనగానే మళ్ళీ చేసుకుంటాము అనడం అంతా వాళ్ళిష్టమేనా..? నాకీ పెళ్లి వద్దు మామయ్యా. నేను నేనుగా బతుకుతాను, నాకు నచ్చిన.. నేను నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లిచేసుకుంటాను. పెళ్ళి వారికిచ్చిన ఐదులక్షలు మీరు తిరిగి తీసుకొస్తే అవి అమ్మ పేరిట ఫిక్సడ్ డిపాజిట్ చేద్దాం మామయ్యా..” స్థిరంగా పలికింది లలిత.
* * *