తుష్టి - రచన: పి.ఎస్.నారాయణ
ఏడు గంటలకల్లా విజయవాడ బస్టాండుకు వచ్చారు. అప్పటికే సాంబడి కొడుకు నైట్ డ్యూటీ దిగి ఇంటికి వచ్చాడు.
తుష్టి
(కథానిక)
రచన: పి.ఎస్.నారాయణ
ఏడు గంటలకల్లా విజయవాడ బస్టాండుకు వచ్చారు. అప్పటికే సాంబడి కొడుకు నైట్ డ్యూటీ దిగి ఇంటికి వచ్చాడు. వచ్చీ రావటంతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళను తమ ఆటోలోనే బస్టాండు దగ్గర దించి వెళ్లిపోయాడు. ఫిబ్రవరి ఎండ మొదలైంది. ప్రయాణాలు పెట్టుకున్నవాళ్ళంతా చీకటితోనే బయల్దేరుతుండటంతో బస్టాండు జనంతో కిటకిటలాడుతోంది.
సాంబడు భార్యను, మనవడిని గుంటూరు వెళ్ళే నాన్ స్టాప్ బస్ లో ఎక్కించాడు. ఎక్కేటప్పుడు కూడా చెప్పింది. "ఇప్పుడు వెళ్ళి సాయీరాంపురం లో ఏం చూస్తావు చెమటలు కార్చుకుంటూ వెళ్ళటం తప్ప!" అంటూ. ఇంట్లో బయలుదేరేముందు అలవాటుగా ఖాకీ డ్రస్సు వేసుకుంటే అననే అన్నది. "అయినా నాకు తెలియక అడుగుతానూ, మనం వెళ్ళేది మా చెల్లెలింటికి... ఇప్పుడూ ఆ డ్రస్సే ఉండాలా వంటిన... చక్కగా తెల్లటి లాల్చీ పైజమా వేసుకోక!" అంటూ. ఆమె అలా అంటే తననేందుకు ఏముంది? మౌనంగా ఆమె చెప్పిందే పాటించాడు.
స్కూల్లో పని చేసినంత కాలం ఖాకీ డ్రెస్సే. రిటైర్ అయి విజయవాడ వచ్చి గొల్లపూడికి కాస్తంత అవతల తమ్ముడింటి పక్కనే ఓ రెండు గదుల ఇల్లేసుకున్నాడు. ఒంట్లో శక్తి ఉన్నది కాబట్టి ఓ సెకెండ్ హాండ్ ఆటో కొనుక్కుని, కాళేశ్వరరావు మార్కెట్ నుంచి గొల్లపూడి దాకా షటిల్ నడుపుతుంటాడు. వచ్చే కొద్ది పెన్షన్ కి ఈ ఆదాయం కూడా కలిపితే తిండికి ఏ ఇబ్బందీ ఉండదని. అందుకే ఇప్పుడూ అలవాటుగా ఆ డ్రస్సు మీదకే చేతులు పోయినాయి.
ఎర్ర బస్సు రాగానే ఎక్కి, ఇంజను పక్కనే సింగిల్ సీట్ లో కూర్చున్నాడు, కండక్టర్ దగ్గర టిక్కెట్ తీసుకుని. సాయీరాంపురం అని చెబుతున్న మాటలో ఆ ఊరిమీద ఆత్మీయత నిండి ఉన్నది. బస్సు బయలుదేరి కృష్ణలంక మీదుగా వెళ్ళి ప్రకాశం బేరేజ్ దాటింది. సీతానగరం దాటింది. తాడేపల్లి సిమెంట్ పేకెట్ ఫ్యాక్టరీ దాటింది. మంగళగిరి వచ్చింది. మరో మూడు కిలోమీటర్లు వెళితే సాయీరాం పురం వస్తుంది.
మేనమామకు ఆ ఊరి కరణంగారు పరిచయం ఉండటంతో తనను ఇరవై ఎనిమిదేళ్ళప్పుడు తీసుకువచ్చి ఆ స్కూల్లో పనికి పెట్టాడు. అప్పటికే పెళ్లయింది. సత్యవతి బంధువుల అమ్మాయే.
స్కూలు తొమ్మిది గంటలకే అయితే, ఎనిమిది గంటలకల్లా వెళ్ళటం, అక్కడున్న రెండు సిమెంటు గాబులూ శుభ్రంగా కడగటం, కరణంగారి దొడ్లో బావిలోని మంచినీళ్లు తోడుకొచ్చి ఆ గాబులు నింపటం. తరువాత తొమ్మిది నుంచి గంట గంటకూ స్కూలు గంట మ్రోగించటం...
అక్కడ పనిలేనప్పుడు హెడ్మాస్టరు గారింటికి వెళ్ళి ఆయన భార్య చెప్పిన పనులు చేయటం. ప్రతీ ఆదివారం మంగళగిరిలో మిద్దె దగ్గర జరిగే సంతకు వెళ్ళి, అడిగిన టీచర్లందరికీ కూరలు తెచ్చి పెట్టటం.
ఎవరింట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సాంబశివుడు అక్కడ ఉండాల్సిందే... వాళ్ళకు అన్ని పనుల్లో సాయం చేయాల్సిందే. వేడుక అయింతరువాత అతడికి, అతడి భార్యకు భోజనం పెట్టేవాళ్లు.
అన్ని పనులూ ఓపికగా చేస్తూ, నలుగురి తలల్లో నాలుకగా మెలిగాడు.
సాయిరాంపురం లో బస్సు దిగి నాలుగు వైపులా చూసాడు. ఊరేం మారినట్టు లేదు. బస్టాండులో పెద్ద చింతచెట్టు అలాగే ఉన్నది. దానికి పక్కనే ప్రయాణీకులు కూర్చునేందుకు కట్టిన రేకుల షెడ్డు, అందులో నాపరాళ్ళ అరుగు అలాగే ఉన్నాయి. పక్కనే బావి అలాగే ఉన్నది. దాని గిలక పక్కగా కట్టిన గొలుసు, బకెట్టు అలాగే ఉన్నాయి.
తన పిచ్చి గానీ, ఐదారేళ్లకే అన్నీ మారిపోతయ్యా?
ఊళ్ళోకి వెళ్ళేందుకు చెరువు కట్ట ఎక్కాడు. మంగళగిరి వైపుకు చూస్తే, కొండ మీద తెల్ల అట్టముక్కలు అంటించినట్టున్న పానకాలస్వామి గుడి కనబడింది. ఎన్నిసార్లు ఆ స్వామిని దర్శించుకున్నాడో! నడుస్తూనే దణ్ణం పెట్టుకున్నాడు.
ఊళ్ళోకి వస్తూనే మర్రిచెట్టు నీడన కొద్దిసేపు నిలుచున్నాడు. దాని క్రింద ఒకప్పుడు సున్నపు గానుగ ఉండేదన్నట్టుగా దాని రాయి మాత్రం ఇంకా ఓ ప్రక్కగా పడి ఉన్నది. ఊరి మధ్యలోకి వచ్చేటప్పటికి తను ముప్ఫయి సంవత్సరాలు పనిచేసిన స్కూలు కనబడింది. ఉద్వేగాన్ని ఆపుకోలేనట్టుగా వడివడిగా ముందుకు అడుగులు వేసాడు.
స్కూలు నడుస్తూండటంతో బయట పిల్లలెవ్వరూ కనపడలేదు. లోపలినుంచి పాఠాలు చెబుతున్న టీచర్ల గొంతులే వినబడుతున్నాయి. ఉత్సాహంగా అటువైపు చూచాడు.
స్కూలు ముందున్న వేపచెట్టు క్రింద కూర్చుని పప్పుండలు అమ్ముతుండే శాంతక్క ఇంకా రాలేదు. అది చేసే పప్పుండలు పిల్లలు ఎగబడి కొనుక్కుంటుండే వాళ్ళు. అవి ఎంతో రుచిగా ఉండేవి.
చెట్టుకు కాస్తంత అవతలగా ఓ రెండు దుకాణాలు కొత్తగా వెలిసాయి. వాటి ముందు పిల్లలు తినే రకరకాల చిప్సు ప్యాకెట్లు దండలుగా కట్టి ఉన్నాయి. అప్పుడు గమనించాడు, అంతకు ముందు చెట్టు కిందే ఉండే చెరుకు బండి అక్కడ లేకపోవటం. గురవయ్య పెద్దవాడై మానేసాడేమో అనుకుంటూ విరిగిపోయిన స్కూలు గేటు దాటి లోపలికి వెళ్ళాడు. ఆ గేటు తనున్నప్పుడు బాగానే ఉండేది. సాయంత్రం వెళుతూ వెళుతూ ఓ గొలుసు కట్టి దానికి తాళం వేస్తూ ఉండేవాడు.
స్కూలు బిల్డింగ్ అంతా పాతదైనట్లనిపించింది. అక్కడక్కడ గోడలకు పెచ్చులు లేచి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దానికి సున్నం కొట్టించినట్టుగా కూడా లేదు.
ఆ ఆవరణను ఊడ్చి, శుభ్రం చేసి ఎన్నాళ్ళైందో అన్నట్లుగా చెత్తా చెదారం నిండి ఉన్నది. లక్ష్మి ఇప్పుడు పని చేస్తున్నదో లేక తనలాగా రిటైర్ అయిందో... అది తనకంటే ఒకటి రెండేళ్ళే చిన్న... రోజూ ఎనిమిదింటికల్లా వచ్చి, గదులన్నీ శుభ్రం చేసి, స్కూలు చుట్టూ ఊడ్చేది. ఆవరణ అంతా శుభ్రంగా ఊడ్చాలని ఎప్పుడూ తాపత్రయ పడుతుండేది.
వరండాలో తను రోజూ కడిగి, పిల్లల కోసం మంచినీళ్లు నింపిన గాబు కనబడలేదు. ఎటన్నా మార్చారేమోనని చూస్తే ప్రహరీ గోడ పక్కన ఓ పక్కన పడేసి ఉంది, చెత్తా చెదారంలో. దాన్ని అక్కడ చూస్తూనే మనసు చివుక్కుమన్నది. ముప్ఫయి సంవత్సరాల అనుభవం దానితో...
దానికవతలగా హెడ్ మాస్టరు గారి గది కిటికీ పక్కగా కట్టి ఉన్న గంట కనబడింది. మళ్ళా ఒకసారి కళ్ళల్లో వెలుగు. ఎవడైనా క్లాసు అవగానే గంట కొట్టటానికి వస్తే తనను అడిగి కొట్టాలి. ఆఖరి సారిగా స్కూలు వదిలేసిన రోజున కొట్టటమే!
వరండా మెట్లెక్కుతుంటే అప్పుడే అటుగా వచ్చిన పీటీ సారు ఆగి, "ఎవడ్రా నువ్వు... ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లున్నది!" అన్నాడు.
"నమస్తే సార్! నేను సాంబడిని! మంచినీళ్ళ గాబు తీసేసారేం సార్ పిల్లలకు మంచినీళ్ళు ఎట్లా... ఎండా కాలం కూడా వచ్చేస్తోంది." అన్నాడు ఆయన్నే చూస్తూ.
"ఓరి నువ్వట్రా... ఇప్పుడు దాంట్లో నీళ్ళెవరు తాగుతున్నార్రా... పిల్లలు మంచినీళ్ళు ఇంటినుంచే సీసాలతో తెచ్చుకుంటున్నారు... వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఇంటికి వెళ్లరా... అమ్మగారికి ఫోన్ చేసి చెబుతాను కానీ... ఇంట్లో చెత్తసామాన్లు చాలా జేరినాయి. కాస్త సర్ది పెడుదువుగాని!" అని చెబుతూనే భార్యకు సెల్ ఫోన్ లో చెప్పటం మొదలు పెట్టాడు.
"సాంబడు వస్తాడు కానీ ఆ స్టోర్ రూమ్ శుభ్రం చేయించు!"
"నేనర్జెంటుగా గుంటూరు వెళ్ళాలి సారూ..." అన్నాడు నసుగుతున్నట్టుగా.
తనకు తెలుసు, ఇక్కడ పనిచేసినంత కాలం శలవొస్తే చాలు, ఇంటికి పిలిచి ఇల్లంతా శుభ్రం చేయించుకుంటుండే వాడు.
"ఓ అరగంట పనేలేరా... వెళ్ళి చేసి పెట్టు!" అంటూనే మరో టీచరు కనబడటంతో మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు.
ఆయనకు రోగమొచ్చి, మంగళగిరి ఆసుపత్రిలో పడుంటే, పదిహేను రోజులపాటు రోజూ, ఇక్కడనుంచి అన్నం క్యారియర్ ఉదయం, సాయంత్రం తీసుకెళ్లి ఇచ్చాడు. అలా తన చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్న వాడు, ’ఎట్లా ఉన్నావురా?’ అని కనీసం అడగనందుకు మనసుకు బాధ వేసింది.
తెలుగు మాస్టారు క్లాసు అయిపోవటంతో, బయటకు వస్తూనే, సాంబడిని చూసి, "ఎక్కడుంటున్నావురా ఇప్పుడు!" అడిగాడు.
రోజూ ఉదయాన్నే వెళ్ళి వాళ్ళింట్లో అందరి గుడ్డలూ ఉతికి ఆరేసేవాడు.
"విజయవాడలో సార్!" అంటూనే "ఇప్పుడు గంటెవరు కొడుతున్నారు సార్! మరో కుర్రాడిని పెట్టారా లేక పిల్లల చేతే కొట్టిస్తున్నారా?" అన్నాడు నీరసంగా. తనెప్పుడైనా రాకపోతే పిల్లలే కొడుతుండేవాళ్ళు.
"దాంతో పనేమున్నదిరా... అది అక్కడ అలంకారంగా వేలాడుతోంది అంతే... ఆఫీసులో బజ్జర్ నొక్కితే అన్నీ క్లాసుల్లోనూ వినబడుతోంది!" ఆ మాట చెబుతూనే ఆయన లోపలకు వెళ్ళిపోయాడు.
సాంబడు దిగాలుగా గదులలో జరుగుతున్న క్లాసుల వంక చూస్తూ, వరండాలో నడవసాగాడు. తను సేవ చేసిన ఆ గాబు, గంట, పెచ్చులు లేచి పాడుబడినట్టున్న ఆ స్కూలు గోడలే అతడిని ఎంతగానో నిరాశ పరుస్తున్నాయి.
అప్పుడే గదిలోనుంచి బయటకు వచ్చారు హెడ్ మాస్టారు చేతిలో పేంబెత్తంతో. దాన్ని ఏ పిల్లవాడి మీదా ఉపయోగించకపోయినా ఆయనే ఆ స్కూలుకు పెద్ద అన్నట్టుగా ఎప్పుడూ చేతిలో ఉంచుకుంటాడు.
"నమస్కారమండీ" అన్నాడు రెండు చేతులూ జోడించి, వినయంగా కాస్త పక్కకు నిలబడి, సాంబడు.
"ఏరా సాంబడూ! ఏంటిటొచ్చావ్?" అంటూ ఆగకుండానే వెళ్ళిపోయాడాయన.
కదలకుండా అక్కడే నిలబడిపోయాడు సాంబడు, ముప్ఫయ్యేళ్లు ఇక్కడ పని చేసిన తనతో కనీసం కొద్ది క్షణాలు నిలబడి యోగ క్షేమాలు కనుక్కోకుండా వెళ్ళిపోయిన ఆయన తీరుకు దిగాలుగా. స్కూల్లోనే కాకుండా ఖాళీ సమయమంతా ఆయన ఇంటి పనులే చేస్తుండేవాడు. ఆయన భార్య ఒక్క క్షణం కూర్చోనిచ్చేది కాదు. మొదట్లో అయితే ఈ ఊరు అంతగా అభివృద్ధి చెందనప్పుడు కావలసినవన్నీ మంగళగిరి నుంచే తెప్పించుకుంటుండేది.
తన చేత అన్ని పనులూ చేయించుకున్న ఆయన, రెండు నిమిషాలు నిలబడి, తన గురించీ, తన పిల్లల గురించీ అడిగి ఉంటే ఎంత తృప్తిగా ఉండేది! ఎంత సంతోష పడేవాడు! ఇప్పుడాయనకు తన బాగోగులు అడిగే అవసరమే లేదన్నమాట... శరీరమంతా నిస్సత్తువ ఆవరించింది.
అప్పటి టీచర్లు, స్టాఫ్ తనని ఆప్యాయంగా పలకరిస్తుంటే గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆనంద పడాలనుకున్నాడు. ఆ గాబులోని మంచి నీళ్ళే గ్రుక్కెడు త్రాగి సంతృప్తి చెందుదామనుకున్నాడు. అన్ని సంవత్సరాలు కొట్టిన గంటను, మరోసారి ఆప్యాయంగా మ్రోగిద్దామనుకున్నాడు.
సత్యవతి వద్దంటున్నా వినకుండా ఆ ఎర్రబస్సు ఎక్కి వచ్చినందుకు దక్కిన ఫలితమిదా?
క్లాసు అయిందల్లే ఉన్నది, పిల్లలంతా కేకలు, అరుపులు. టీచర్లు కూడా మారినట్లున్నారు, కొన్ని కొత్త మొహాలు.
ఇక అక్కడ ఉండలేనట్టుగా, బరువెక్కిన గుండెతో ఆ విరిగిపోయిన గేటు దాటి బయటకు వచ్చాడు.
వేపచెట్టు క్రింద బుట్టలు పెట్టుకుని కూర్చున్న శాంతక్క కనబడటంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. వడివడిగా ఆమె వైపు అడుగులు వేసి, "అక్కా, బాగున్నావా?" అన్నాడు ఆప్యాయంగా.
ఆమె కూడా పెద్దదై పోయింది. ముఖం కూడా పీక్కుపోయి, సన్నబడి నీరసంగా కనబడుతోంది. కొద్ది క్షణాలు కళ్ళు చికిలించి చూసి, "ఓరి నువ్వట్రా సాంబడూ? ఎన్నాళ్లకెన్నాళ్ళకు! బాగున్నావురా? నీ పెళ్ళాం పిల్లాడూ ఎట్లా ఉన్నార్రా?" అనడిగింది, పళ్ళూడిన నోరంతా తెరిచి సంతోషంగా.
తృప్తిగా చూచాడు ఆమె వంక. అంతవరకూ గిజగిజలాడిన అతడి మనసు తేలికపడింది.
"బాగానే ఉన్నా... మనవడు పుట్టాడు..." అన్నాడు
ఆమె పక్కనే కూర్చుంటూ. "నువ్వెట్లా ఉన్నావే?" అనడిగాడు.
"ఇదిగో ఇట్లా ఉన్నా, ముసలాడు మంచం దిగటం లేదు. కొడుకు కూలికి వెళ్ళి నాలుగు రాళ్ళు తెచ్చి పడేస్తున్నాడు. నా వంతు సాయంగా ఎప్పట్లాగానే ఈ బుట్టలు పెట్టుకుని ఇక్కడ కూర్చుంటున్నాను." అన్నది చిన్నగా.
"బడైందాకా కూర్చున్నా, పది ఉండలు కూడా పోవటం లేదురా... పెద్దవాళ్ళు పిల్లల్ని ఈ ఉడికించిన పల్లీలు, పప్పుండలు తినొద్దంటున్నారటరా, చెట్టు కింద దుమ్ము కొట్టుకుంటున్న వీటిని తింటే రోగాలొస్తాయంటూ... అదిగో చూడు ఆ రెండు కొట్లలో బయట వేలాడదీసారే, వాటిల్లో ఏవేవో రకరకాలు తినేవి ఉంటాయట. ఎన్నాళ్ళైనా పాడు కావట. అవే కొనుక్కు తింటున్నారు. ఎవరు కొన్నా, కొనకపోయినా అలవాటుగా వచ్చి, ఈ చెట్టు కింద కూర్చుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే ఈ బుట్టలు పెట్టుకు కూర్చుంటున్నాను..."
దిగాలుగా చూసాడు ఆమె వంక. "గురవయ్య చెరుకు బండి కూడా లేదు, వాడూ రావటం లేదా?"
"వాడు మాత్రం ఏం చేస్తాడు? రోడ్డు మీద గ్లాసులతో ఆ చెరుకు రసం తాగొద్దు, కావాలంటే సీసాలలో ఉన్న కూల్ డ్రింకులు కొనుక్కు తాగమని డబ్బులిచ్చి పంపిస్తున్నారట పిల్లలకు పెద్దవాళ్ళు. ఇంకేం బ్రతుకుతాడిక్కడ? ఆ బండి తీసుకుని మంగళగిరి వెళ్ళిపోయాడు."
’ఊరు మారకపోయినా, మనుషులెంతగా మారిపోయారు? ఇంకా అక్కడ కూర్చుని తను చేసేదేమున్నది? ఎండెక్కక ముందే గుంటూరు వెళితేనన్నా సరిపోతుంది అనుకుని లేవబోతూ, ఓ సారి కరణం గారింటికి వెళ్ళి కనబడి వెళతాను అన్నాడు. కరణం గారి భార్యే రోజూ వాళ్ళింటి బావి నుంచి నీళ్ళు తోడుకు వస్తున్నప్పుడు తినేందుకు ఏవో ఒకటి పెడుతూ ఉండేది. తనూ ఆ బావి పక్కనే ఉన్న వాళ్ళ గాబు నిండా నీళ్ళు నింపేస్తూ ఉండేవాడు.
హెడ్మాస్టరు గారు మాట్లాడిన తీరుకు వాళ్ళింటికి వెళ్ళి ఆయన భార్యకు కనపడాలనిపించలేదు. ఆ కుటుంబానికి ఎంత చాకిరీ చేశాడు? కనీసం బాగున్నావురా? అని ఒక్క మాట అడిగితే తనకెంత తృప్తిగా ఉండేది? పీటీ సారూ అంతే. తను కనబడగానే ఎట్లా ఉన్నావురా? అని అడగాలనిపించకపోగా, తన ఇంట్లో పడి ఉన్న చెత్త గుర్తుకు వచ్చింది. కృతఘ్నులు...
కరణంగారిక్కడ లేరు కదరా... హైదరాబాదు వెళ్ళిపోయారు కొడుకు దగ్గరకు. ఆ ఇల్లు కూడా అమ్మేసారు...
కళ్ళు మూసుకున్నాడు సాంబడు.
ఇవాళ ఇక్కడకు రాకుండా ఉండాల్సింది... అయిదేళ్ళ క్రితం నాటి పచ్చటి రోజులే మనసులో మెదులుతుండగా అప్పుడప్పుడూ తలచుకుంటూ అయినా ఆనందిస్తూండేవాడు. ఆ గతాన్ని, ఆనందాల్ని చేతులారా తుడిచేసుకున్నాడు. ఏం చూస్తావయ్యా అక్కడ? అని సత్యవతి మొత్తుకున్నా వినకుండా వచ్చాడు. దానికున్న బుర్ర తనకు లేదు.
"మరి వెళతానే అక్కా... ఒకసారి లక్ష్మి ఇంటికి వెళ్ళి దాన్ని చూసి వెళతా... అదెట్లా ఉన్నదో..."
"ఉండు, నేనూ వస్తా... మధ్యానం పిల్లలు బయటకు రావటానికి ఇంకా టైమున్నదిలే..." అంటూనే ఓ కాగితం తీసుకుని ఓ పది పప్పుండలు కట్టి, "తీసుకెళ్లి, మీ ఆవిడకి, నీ కొడుక్కీ, మనవడికీ ఇవ్వు... ఇదిగో ఈ పప్పుండ నువ్వు తిను..." అన్నది.
"ఎందుకే శాంతక్కా అన్నీ? వద్దే..." చెయ్యి అడ్డంగా ఊపుతూ అన్నాడు.
"నోరు మూసుకు తీసుకెళ్లరా సన్నాసి. ఎన్నాళ్ళకు కనబడ్డావో... ఎంత తృప్తిగా ఉన్నదో నాకు..."అన్నది మెరుస్తున్న కళ్ళతో అతన్ని చూస్తూ.
జేబులోనుంచి ఒక వందనోటు తీసి ఆమెకివ్వబోయాడు. "ఛీ! ఎదవ... ఇన్నాళ్లకు కనబడ్డ నీ దగ్గర వాటికి డబ్బులు తీసుకుంటానట్రా?" అంటూ విసిరికొట్టింది అతడి చేతిని.
"వాటిక్కాదులేవే... ముసలాడు ఇంకా చుట్టలు కాలుస్తూనే ఉన్నాడా? వాడికియ్యి..." అంటూనే ఆ బుట్టలో పడేసాడు ఎంత వద్దన్నా వినకుండా...
"నిన్ను చూచిన ఆనందాన్నంతా తినేసావు కదరా సన్నాసీ.. పద పద... లక్ష్మి ఇంటికి పోయే దారే కదా, మా ముసలాడికి ఓ సారి కనబడుదువు గాని ..." అంటూ బుట్టలు తీసుకు బయలుదేరింది.
శాంతక్క మొగుడు బాగా ముసలాడై పోయాడు. వాకిట్లో నులకమంచం మీద కూచుని చుట్ట తాగుతున్నాడు. సాంబడిని గుర్తించి, "ఓరోరోరి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు?" సంతోషంగా పలకరించాడు.
తరువాత లక్ష్మి ఇంటికి వెళ్ళేటప్పటికి అది మంచంలో పడి మూలుగుతూ కనబడింది. స్కూల్లో పని చేస్తున్నప్పుడు పిట పిట లాడుతూ ఎట్లా ఉండేది? ఒంటి చేత్తో స్కూల్లో గదులన్నీ ఊడ్చేది. ఆవరణ ఊడ్చేది, తరువాత హెడ్ మాస్టారింటికి వెళ్ళి, అంట్లు తోమి, ఇల్లు తడిగుడ్డతో తుడిచేది.
"సాంబడూ... వచ్చావుట్రా నన్ను చూడటానికి... అయిపోయిందిరా నా పని... ఇంకెన్నాళ్ళో ఉండనురా ఈ నేల మీద!" అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే సాంబడికి కళ్ళు తడవడం మొదలు పెట్టినయి.
"ఏం రోగమే నీకు?"
"మాయదారి రోగం ఏమిటో ఎవరికి తెలుసు? ఆ గవర్నమెంట్ ఆస్పత్రికి వెళితే రంగునీళ్లు పోస్తున్నారు... తెచ్చుకోవటం, తాగటం, పడుకోవటం!"
"మంగళగిరి వెళ్ళి మంచి డాక్టర్ కు చూపించుకోక పోయినావా? హెడ్ మాస్టరు గారి భార్య నీ చేత అడ్డమైన చాకిరీ చేయించుకున్నదిగా పైసా ఇవ్వకుండా? వాళ్ళను సాయం చేయమనాల్సింది. అంతమంది టీచర్లున్న స్కూల్లో ఎవరూ ముందుకు రాలేదుటే?"
"ఆ అమ్మ గారి సంగతే చెబుతావూ? ఆమెకు రా అమ్మ తప్ప పో అమ్మ తెలియదు. టీచర్లూ కొత్తవాళ్లే వచ్చారు. పాతవాళ్లు కొద్దిమందే ఉన్నారు. వాళ్ళను నోరు తెరిచి అడిగినా, నువ్వు పని చేసిందానికి జీతం తీసుకోలేదా? మా జీతాలు మాకే చాలీ చాలటంలేదు అంటూ తొంటి చేయి చూపించారు. వాళ్ళ అసలు కోపం అదికాదులే, హెడ్ మాస్టరు గారింట్లో చాకిరీ చేసినట్లుగా తమ ఇంట్లో కూడా చేయలేదని!"
"నువ్వు బెజవాడ వస్తే నేనే డాక్టరు దగ్గరకైనా తీసుకువెళ్తా గానీ రా..."
"ఇక్కడ ఆస్పత్రిలో డాక్టర్లు చూస్తున్నారుగా, నా బతుక్కి ఈ మందులు చాల్లే... ఇంకెంత మందిని ఏడిపిస్తాను?"
మంచి, చెడూ మాట్లాడుకుంటూ కూర్చుంటే సమయమే తెలియలేదు. అప్పటికే బాగా ఎండెక్కింది.
"నేను బయలుదేరతా...గుంటూరు వెళ్ళాలి!" అంటూ లేచాడు సాంబడు.
"ఇదిగో, ఈ శాంతక్కే నన్ను వచ్చి చూస్తుండేది... ఆసుపత్రికి తీసుకు వెళుతుండేది. ఈరోజు నిన్ను చూచాను. నాకు కడుపు నిండిపోయింది సాంబడూ... సగం రోగం తగ్గినట్టే ఉన్నది..." అన్నది లక్ష్మి ముఖం విశాలం చేసుకుని.
లేచిన సాంబడు చటుక్కున చొక్కా లోపలి జేబులో చేయి పెట్టి, రెండు వంద రూపాయల నోట్లు బయటకు తీసాడు. "ఉంచవే లక్ష్మీ, మందులకు వాడుకో..." ముందుకు వంగి దాని చేతిలో కుక్కాడు వద్దంటున్నా వినకుండా...
లక్ష్మి ఘొల్లున ఏడుస్తుంటే చూడలేక బయటకు వచ్చేసాడు. తను ఎన్నో సంవత్సరాలు పనిచేసిన స్కూలు తృప్తిగా చూడటానికి వచ్చిన అతనికి అసంతృప్తే కలిగినా, తన రాకకు శాంతక్క, లక్ష్మి చూపిన ఆనందానికి ఆప్యాయతకూ ఎంతో సంతోష పడుతూ మరో ఎర్ర బస్సు కోసం వడివడిగా హైవే వైపుకు అడుగులు వేసాడు సాంబడు.
***
(సమాప్తం)