మేధో హత్యలు part 12

This is Twelfth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 12

మేధో హత్యలు 12

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

ఒంట్లోని ప్రతి కండరం, ప్రతి ఎముక విపరీతమైన బాధతో నరకం చూపిస్తుంటే మెలుకువ వచ్చింది విజయ్ కి. బాధ సరే గానీ బ్రతికి ఉన్నాను అనుకున్నాడు అతను తను ఉన్న చోటుని పరిశీలించి చూస్తూ.

చిమ్మ చీకటిగా ఉంది. చెమ్మ వాసన వస్తూ ఉంది. తనొక మంచం మీద ఉన్నట్లు గమనించాడు. ఒంటి పైన బ్లాంకెట్ కప్పి ఉంది. పక్క  చాలా మెత్తగా ఉండేలా బెడ్ షీట్స్ వేసి ఉన్నట్లున్నాయి. సౌకర్యంగా ఉండటమే కాదు, చలినుంచి బాగానే రక్షణ ఇస్తున్నాయి. చేతులు కదపడానికి ప్రయత్నించి నొప్పికి అల్లాడిపోయాడు. బుల్లెట్ తగిలిన కాలికి బాండేజి ఉంది. శరీరం పైన అక్కడక్కడా ఆయింట్ మెంట్లు, బాండేజిలు ఉన్నట్లు గమనించాడు. 

తల్లీ పిల్లా గుర్తుకి వచ్చారు. తనను సేవ్ చేసారు అనుకుని మనసులోనే నమస్కారం చెప్పుకున్నాడు వారికి. బహుశా ఇంట్లోని నేలమాళిగ లో పెట్టినట్లున్నారు తనని, అందుకే చెమ్మ వాసన వస్తుంది అనుకున్నాడు.

అంతలో సీలింగ్ పైన ఏదో కదులుతున్న శబ్దం వచ్చింది. ఒక పెద్ద చెక్క పలక ఒక పక్కకు జరిగింది. పై గదిలోని వెలుతురు అందులోనుంచి లోపలికి పడింది. ఆ వెలుతురులో ఒక చిన్న ఐరన్ నిచ్చెన కనిపించింది. దానిపై నుంచి మొదట తల్లి దిగింది. తర్వాత పిల్ల.

తల్లి విజయ్ ని చూసి పలకరింపుగా నవ్వింది. ఒక దేవదూత తనను చూసి నవ్వినట్లు అనిపించింది అతనికి. చేతులు జోడించాడు. తనతో తెచ్చిన పాత్రను అతని బెడ్ పక్కన ఉన్న చిన్న టేబుల్ పైన పెట్టింది. అక్కడే ఉన్న దీపం కాంతి పెంచింది. ఆమె వెంట వచ్చిన పాప పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తోంది విజయ్ వైపు. ఆమెను చూసి నవ్వాడు విజయ్. చటుక్కున తల్లి వెనక్కు నక్కింది ఆమె.

’మిస్టర్ వి’ అంది తల్లి.

’విజయ్’ అన్నాడు విజయ్.

’వి..జ..య్. ఓకె. ఎలా ఉంది ఇప్పుడు?’ అంది ఆమె.

’థాంక్స్. బ్రతికి ఉన్నాను’ అన్నాడు విజయ్.

’థాంక్ గాడ్. మీ పరిస్థితి చూసి నాకు నమ్మకం లేకపోయింది. కానీ ఆ దుర్మార్గుల నుంచి మిమ్మల్ని కాపాడాలని గట్టిగా అనిపించింది. మీరు చాలా వైట్ ఉన్నారు. చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడకు చేర్చాము మేమిద్దరం’ అంది ఆమె.

’మీ ఇద్దరికీ థాంక్స్’ అన్నాడు విజయ్. ’మీ హజ్బెండ్??’ అన్నాడు.

’ఆయన హంగేరియన్. నన్ను పెళ్ళి చేసుకుని ఇక్కడే సెటిల్ అయ్యారు. కానీ మీ వెంట పడిన దుర్మార్గుల లాంటి వాళ్ళే ఆయన వెంట కూడా పడ్డారు నాలుగేళ్ళ క్రితం. ఆయన ప్రాణాలు తీసారు’ అంది దిగులుగా.

’అయామ్ సారీ’ అన్నాడు విజయ్.

’మీకు ఫుడ్ తెస్తాను. యాంటీబయాటిక్స్ వేసుకోవాలి మీరు’ అంది ఆమె పైకి వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ.

’ఓకె’ అన్నాడు విజయ్. అప్పటివరకు పంటి బిగువున బాధను తొక్కిపట్టి ఉంచాడు. వాళ్ళు అలా స్టెయిర్ కేస్ పైన ఎక్కి పైకి చేరి, చెక్కపలక మూత వేయగానే, గట్టిగా మూలిగాడు బాధను భరిస్తూ!

కొద్ది సేపటి వరకు అతని శరీరంలోని నిస్సత్తువ తన ప్రభావాన్ని చూపింది. తను ఉన్న గది గిర్రున తిరిగి తను అడుగులేని బావిలో పడి పాతాళానికి పోతున్నట్లు అనుభూతి కలిగింది అతనికి. స్పృహ కోల్పోయాడు.

కొంచె సేపటికి నుదుటిపై చల్లటి స్పర్శ తగిలి కళ్ళు తెరిచాడు. ఆందోళనగా తన వైపు చూస్తున్న తల్లి మొఖం కనిపించింది. ’పాపని పడుకోబెట్టి వచ్చేసరికి లేటయింది. ఇది తను నిద్రపోయే సమయం. మీకు ఆహారం తెచ్చాను. ఓపిక చేసుకుని కాస్త తినండి’ అంది.

అతని వెనుక దిండ్లు పెట్టి అతని తల వీపు భాగం కాస్త ఎత్తుగా ఉండేలా అమర్చింది.

ఆ కదలికకే అతని నుదుట చెమటలు పట్టేసాయి. వేడి వేడిగా ఉన్న జావ లాంటి పదార్థాన్ని అతనికి కొద్ది కొద్దిగా స్పూన్ తో తనే తినిపించింది. తను తినగలను అని విజయ్ అన్నా ఆమె వినలేదు. తన చేతులు కదిపే స్థితిలో లేనని గ్రహించిన విజయ్ ఆమె పట్ల మరింత కృతజ్ఞతతో మనసులోనే నమస్కరించాడు. ’చాలా థాంక్స్. మీ సహాయం లేకపోతే నా పని ఆఖరు అయిపోయేది ఎప్పుడో’ అన్నాడు కళ్ళల్లో చెమ్మ ఊరుతూ ఉండగా.

’మీకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. ఏదో మంచి కార్యక్రమం మీదే మీరు పనిచేస్తున్నారు అనుకుంటాను’ అంది ఆమె.

మౌనంగా ఉండిపోయాడు విజయ్.

’మీరు ఒక ప్రిజనర్ అని. రైలు లోనుంచి దూకి పారిపోయారు అని చెప్పారు మిమ్మల్ని తరుముకుని వచ్చిన వాళ్ళు’ అంది ఆమె.

’మీరు ఏమనుకుంటున్నారు?’ అన్నాడు ఆమె వైపు చూస్తూ.

’వాళ్ళ మాటలు నమ్మలేదు. ఎందుకంటే మీ పాస్ పోర్ట్, మీ పేపర్లు అన్నీ మీ కోట్ జేబుల్లో ఉన్నాయి. మీ ఆయుధాలు కూడా కనిపించాయి’ అంది ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.

ఆమె తన బట్టలు మార్చి తనకు వైద్యం చేసింది అని గుర్తుకి వచ్చింది విజయ్ కి. ఆమె నుండి రహస్యాలు దాచడం అవసరం లేదు అనిపించింది.

’అలాంటి పేపర్లు, అవీ ఉన్న వ్యక్తి ఒక ప్రిజనర్ అంటే నేను నమ్మలేను. నా భర్త ఒక డాక్టర్. నేను ఒక నర్స్ ని. తన దేశానికి సంబంధించిన ఒక న్యాయపోరాటంలో ఆయనకు శత్రువులు ఎక్కువయ్యారు. వారినుంచి తప్పించుకుని దూరంగా వచ్చి, మా మానాన మేము అజ్ఞాతంగా బ్రతుకుతూ ఉంటే ఆ దుర్మార్గులు కక్ష కట్టి ఆయనను హతమార్చారు. వారి కంట పడకుండా తప్పించుకుని ఈ మారు మూలకు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాము’ అడగకుండానే తన గురించి వివరంగా చెప్పింది ఆమె.

’మీ పేరు?’ అన్నాడు విజయ్.

’ఎమిలీ. మా పాప పేరు, గ్రెంటా’ అంది. పాప పేరు చెప్తుంటే ఆమె కళ్ళు మెరియడం చూసి, ఆమె పైన ఆ తల్లికి ఎంతో ప్రేమ అనేది అర్థం చేసుకున్నాడు విజయ్.

’వాళ్ళు మళ్ళీ వస్తారు’ అన్నాడు ఆమె మొఖం లోకి పరిశీలనగా చూస్తూ.

’అవును వస్తారు. మీ గాయాల నుంచి వచ్చిన రక్తం ఒక చోట ఆగిపోయింది. అక్కడ నుంచి తోపుడు బండి మార్కులు కనిపించాయి వాళ్ళకి. కానీ అలాంటి తోపుడు బండులు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. మా తోపుడు బండిని నేను రక్తం మరకలు కనబడకుండా, మరింత మురికి చేసాను. వాళ్ళకి ఏమీ తెలియదు. పైగా ఇలా నేల మాళిగలు మరే ఇంట్లోను ఉండవు. నేను ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నాను, నా భర్త నాకు చెప్పిన కొన్ని జాగ్రత్తలు పాటించడానికి’ అంది ఆమె.

ఆమె భర్త ఏదో విప్లవ వీరుడు అయిఉంటాడు అని అర్థం చేసుకున్నాడు విజయ్. ’మీ భర్త ముందు చూపుకి నేను ఋణపడిపోయాను’ అన్నాడు నవ్వుతూ.

ఆమె కూడా నవ్వింది, మొదటి సారిగా!

’ఇక పడుకోండి నిశ్చింతగా! ఎవరికీ మీరు ఇక్కడ ఉన్న విషయం తెలియదు. మీకు ఓపిక వచ్చిన తర్వాత వెళ్ళిపోవచ్చు సేఫ్ ప్లేస్ కి. రేపు వచ్చి మీకు డ్రెస్సింగ్ చేస్తాను’ అంది ఆమె అతనికి మందులు వేసి.

’గుడ్ నైట్’ అన్నాడు విజయ్.

ఆమె కూడా అతనికి గుడ్ నైట్ చెప్పి మెట్ల మీదుగా పైకి వెళ్ళి చెక్కపలక మూసి వేసింది. కొంచెం సేపటికి బయట నుంచి వచ్చే లైట్ వెలుతురు ఆగిపోయింది. తన గదిలో ఉన్న దీపం కాంతి తగ్గించి వెళ్ళడంతో చాలా తక్కువ కాంతి ఉంది. మెల్లగా కళ్ళు అలవాటు పడ్డాయి ఆ వెలుతురికి. పెద్దగా సామాను లేదు. ఒక పెద్ద మెటల్ పెట్టె, ఒక కుర్చీ, తను పడుకున్న మంచం తప్ప మరేమీ లేవు అక్కడ. 

అమె వెళ్ళిన రెండు నిముషాలకు గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు విజయ్.

***

బలబీర్ సింగ్ కి విజయ్ ఆచూకీ తెలియక చాలా టెన్షన్ కలిగింది. తను పని పూర్తి అయ్యేవరకు హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ చేయడు అని తెలుసు బల బీర్ సింగ్ కి. అయినా, అతనికి ఆందోళన కలగడానికి కారణం మాక్స్ కదలికల గురించి సమాచారం అందడమే! 

రోమ్ నుంచి జ్యూరిచ్ వెళ్ళే ట్రైన్ లో నుంచి ఎవరో దుమికి వెళ్ళడం అతని వెంట కొందరు పడడం గురించి జనాలు చెప్పుకోవడం అతనికి చేరవేసారు స్విఫ్ట్ ఇన్‍ఫార్మర్లు. ఆ దుమికిన వ్యక్తి విజయ్ అని గాఢంగా అనిపించింది బలబీర్ సింగ్ కి. అతను ఏమయ్యాడు అనేది కనుక్కోమని, అతన్ని ట్రేస్ చేసి అవసరమైన సహాయం అందించమని జ్యూరిచ్ లోని స్విఫ్ట్ టీమ్ కి సూచనలు వెళ్ళిపోయాయి.

అయితే విజయ్ గురించి తాము వెతకడం మొదలు పెడితే, మాక్స్ కి అతని అనుచరులకు తామే సమాచారం అందించినట్లు అవుతుందని, నేరుగా రంగంలోకి దిగకుండా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు జ్యూరిచ్ లోని స్విఫ్ట్ మెంబర్లు.

***

మరునాడు ఉదయం మళ్ళీ చెక్క పలక కదిలేటప్పటికి తనంతట తనే లేచి కూర్చున్నాడు విజయ్. మంచం పైన కూర్చునితన గాయాల వైపు చూసుకుంటూ ఉన్న విజయ్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఎమిలీ.

’గుడ్ మార్నింగ్. ఇంత త్వరగా మీరు లేచి కూర్చోఅడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అంది నవ్వుతూ.

’గుడ్ మార్నింగ్. మీరు తీసుకున్న కేర్ దానికి కారణం’ అన్నాడు విజయ్.

’లేదు నేను చేసినది సాధారణ వైద్యం, సాధారణ నర్సింగ్. మీలో ఏదో పట్టుదల ఉంది. అదే మిమ్మల్ని త్వరత్వరగా నార్మల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది’ అంది ఆమె.

ఇబ్బందిగా కదులుతూ, ’నా డ్రెస్ ...’ అన్నాడు.

అది రక్తం తో తడిచి, చిరిగి ఉంటే తొలగించాను. ఆ మూల ఉంచాను. ఈ పెట్టె మీద ఒక డ్రెస్ పెట్టాను. మీకు సరిపోవచ్చు’ అంది ఆమె అతని వైపు పరిశీలనగా చూస్తూ.

’థాంక్స్’ అన్నాడు విజయ్.

’ఈ పాలు తాగండి. బ్రెడ్ కూడా తెచ్చాను. ఇవి తిని టాబ్లెట్స్ వేసుకోండి’ అంటూ పాలు అందించింది.

పెద్ద మగ్ నిండా ఉన్న వేడి వేడి పాలుని మెల్ల మెల్లగా తాగాడు విజయ్. అతను పాలు తాగుతున్నంత సేపు, తన గురించి, తను చేసే వ్యవసాయం గురించి కబుర్లు చెప్తూనే ఉంది. అప్పుడప్పుడు తన కూతురు గ్రెంటా డాక్టర్ చదవాలనుకోవడం గురించి, తన దగ్గర ఉన్న ట్రాక్తర్ గురించి దాని సాయంతో తను అంత పెద్ద పొలంలో ఒక్కతే పని చేసుకోవడం గురించి చెప్పింది.

’మళ్ళీ ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు మీరు?’ అన్నాడు విజయ్ ఖాళీ చేసిన మగ్ ని ఆమెకు అందిస్తూ.

’చాలా మంది వచ్చారు కానీ, గ్రెంటా ని హాస్టల్ లో పెట్టమని చెప్పారు. నాకు అలా ఇష్టం లేదు’ అంది నిట్టూరుస్తూ.

’నేను డ్రెస్సింగ్ చేసి వెళ్తాను. తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి. ఎంత బాగా రెస్ట్ తీసుకుంటే అంత మంచిది మీకు’ అంది ఆమె.

’అలాగే’ అన్నాడు విజయ్.

చాలా జాగ్రత్తగా అతనికి డ్రెస్సింగ్ చేసింది ఆమె. కాలి గాయం కూడా మానడం మొదలయినందుకు మళ్ళీ ఆశ్చర్యం ప్రకటించింది. ’మీ బాడీ టైప్ ఏమిటో తెలియడం లేదు, ఇంత త్వరగా ఎవరి గాయాలైనా మానుతాయి అంటే నేను కట్టుకథ కింద కొట్టిపారేసేదాన్ని’ అంది నవ్వుతూ.

నవ్వి ఊరుకున్నాడు విజయ్.

’మీ ఇండీయన్స్ కి మంత్రాలు అవీ వస్తాయట కదా నిజమేనా?’ అంది అతని మొఖంలోకి సూటిగా చూస్తూ.

ఫక్కున నవ్వాడు విజయ్. ’మీ లాంటి మంచి మనసున్న వ్యక్రి సేవ చేస్తే ఎవరికైనా ఇలాగే నయం అవుతుంది’ అన్నాడు.

’నో నో. మీరేదో స్పెషల్ శరీరం పొందారు భగవంతుడీ నుంచి. థాంక్ గాడ్!’ అంది ఆమె చేతిని నుదుటికి తగిలించుకుని కళ్ళు మూసుకుని దైవాన్ని స్మరిస్తూ.

’థాంక్ గాడ్!’ అన్ణాడు విజయ్ తన చేతులు జోడించి నుదుటికి ఆనించుకుంటూ.

’ఓకె రెస్ట్ తీసుకోండి’ అంది ఆమె పైకి వెళ్తూ.

ఆమె అటు వెళ్ళగానే లేచి ఆమె తన కోసం పెట్టిన బట్టలు వేసుకున్నాడువిజయ్. కొద్దిగా లూజ్ గా ఉన్నా, సరిపోయాయి. కాలు నేల మీద పెడితే ఇంకా పైన్ వస్తూనే ఉంది. తను జ్యూరిచ్ ఎందుకు వెళ్తున్నాడో మాక్స్ కి తెలిసే అవకాశం లేదు అని విజయ్ కి తెలుసు. ఎవరు ఈ మేధో హత్యలు చేస్తున్నాడో తనకి తెలిసిపోయిన విషయం కూడా వారికి తెలియదు. అసలు విలన్ కి కూడా తన గుట్టు బయట పడిందన్న ఆలోచన వచ్చి ఉండదు. అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు, తనకు కావలసిన ఎవిడెన్స్ కోసం వెతికి పట్టుకోవచ్చు అనుకున్ణాడూ విజయ్. మరొక్క రోజు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి బయట పడవచ్చు అనుకున్నాడు. కానీ మాక్స్ తనకి అంత సమయం ఇస్తాడా? తన కారణంగా ఎమిలీ, గ్రెంటా రిస్కులో పడుతున్నారేమో? తనను సేవ్ చేసింది వీళ్ళేనని ఆ దుర్మార్గులకి తెలిస్తే వీళ్ళని ఏం చేస్తారో??

తల విదిలించి ఆలోచనలను దూరంగా తరిమేసి, ప్రయత్న పూర్వకంగా నిద్ర తెచ్చుకున్నాడు విజయ్. అతను ఉన్న పరిస్థితిలో నిద్ర చేసే మేలు ఏ మందు కూడా చేయలేదు!

మళ్ళీ రాత్రికి వచ్చింది ఎమిలీ. ఆమె మొఖంలో అలసట, ఆందోళన గమనించిన విజయ్ కి మాక్స్ మళ్ళీ వచ్చి ఉంటాడు అని అర్థం చేసుకున్నాడు.

’ఏమయింది? వాళ్ళు మళ్ళీ వచ్చారా?’ అన్నాడు.

’అవును. చాలా సేఫు విసిగించారు. ఈ రోజంతా మమ్మల్ని వాచ్ చేస్తూనే ఉన్నారు. అందుకే మధ్యాహ్నం మీకు భోజనం తేలేకపోయాను’ అంది ఆమె.

’పరవాలేదు. కానీ అనుమానం అలాగే ఉందా వాళ్ళకి?" అడిగాడు.

’అవును’ అంటూ నిట్టూర్చింది ఆమె.

మాక్స్ ఏదైనా పని మీద మనసు పెడితే అది అయ్యే వరకు ఎలా విశ్రమించకుండా తిరుగుతాడొ తెలుసు విజ కి. అతనికి సంబంధించిన వివరాలు అన్నీ అతనికి తెలుసు. చేతికి చికిఇన తనని పోగొట్టుకున్నందుకు ప్రతీకారంతో రగిలి పోతూ ఉంటాడు. తన అంతు చూసే వరకు ఈ ప్రాంతాన్ని విడిచి ఎక్కడకీ పోడు అని నమ్మకంగా తెలుసు విజయ్ కి.

’నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేను ఇంకా ఇక్కడే ఉంటే మీకు ప్రమాదం. నాకు ఈ చుట్టు పక్కల ఏమేంఇ ఉన్నాయో వివరంగా చెప్పండి’ అన్నాడు విజయ్.

ఒక వైపు మైదానాలు మరో వైపు కొండలు. ఒక వైపు నది ఉంది. ఆ నదికి వెళ్ళే దారి రెండు కొడ గుట్టల నడుమ ఉంది. ఆ నది పైన ఒక బ్రిడ్జ్ ఉంది. అది దాటి వెళ్తే పక్కన ఉన్న హైవే కి వెళ్ళ వచ్చు’ అంది ఎమిలీ.

’నా కార్ ఉంది. దానిలో డ్రాప్ చేస్తాను’ అని కూడా అంది.

చిన్నగా తల ఊపాడు విజయ్. ఆమెకు మాక్స్ గురించి పూర్తిగా తెలియదు. వాడో నర రూప రాక్షసుడు. అతనికి అనుమానం అంటూ వచ్చిందంటే ఎమిలీని, గ్రెంటాని కాపాడడం ఎవరి వల్లా కాదు.

అతనికి మందులు ఆహారం ఇచ్చి, అతను తిన్న తర్వాత గుడ్ నైట్ చెప్పి వెళ్ళింది ఆమె.

ఆమె వెళ్ళగానే పడుకున్నాడు. అర్థరాత్రి దాటాక లేచాడు విజయ్. తన వస్తువులు అన్నీ తీసుకుని మెల్లగా ఇనుప నిచ్చెన పైకి ఎక్కి చెక్క బల్లని పక్కకి నెట్టాడు. శబ్దం చేయకుండానే తెరుచుకుంది అది.

దానిలో నుంచి బయటకి వచ్చాడు. అది కిచెన్ గది. పైకి వచ్చాక చెక్క బల్లను జాగ్రత్తగా యథాస్థానంలో ఉంచి దానిపైన్ ఆమె కప్పి ఉంచిన డోర్ మాట్ ని నీట్ గా సర్ది పెట్టాడు.

ఆ ఇంటి లో ఒక హాల్, ఒక బెడ్ రూమ్ మాత్రమే ఉన్నాయి. చాలా సింపుల్ గా ఉంది ఆమె ఇల్లు. శబ్దం చేయకుండా వెనుక తలుపు తెరుచుకుని బయటకు నడిచాడు. బయట చిమ్మ చీకటి అలుముకుని ఉంది. ఆ ఇంటికి కాస్త్ దూరంలో ఆమె ట్రాక్టర్, గడ్డి ఉంచే పెద్ద షెడ్ కనిపించింది. దానికి డోర్ లేదు. లోపల ఉన్నవి బయటకు కనిపిస్తున్నాయి. ఇక్కడా దొంగల భయం ఉండదేమో అనుకున్నాడు విజయ్. చుట్టూ పక్కల ఎవరూ ఆ ఇంటి మీద కాపు పెట్ట్ లేరని నిశ్చయించుకున్నాక మెల్ల మెల్లగా అడుగులు వేస్తూ షెడ్ దగ్గరకు చేరుకున్నాడు. కాలు నొప్పిగా ఉంది కానీ మరీ అంత భయంకరంగా లేదు. షెడ్ లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న లాడర్ ఎక్కి పైన ఉన్న అటక మీదికి చేరుకున్నాడు. అక్కడ గడ్డి సర్దుకుని, ఎమిలీ ఇల్లు తనకి కనబడేలా చోటు ఎంచుకుని నడుము వాల్చాడు. కొద్దిక్షణాల్లో గాఢ నిద్రలోకి జారుకున్నాడు విజయ్.

***

గాలి వాలున గ్రెంటా మాటలు వినిపించి కళ్ళు తెరిచి చూసాడు. ఎమిలీ, గ్రెంటా బయటకి వచ్చి ఇంటి చుట్టు పక్కల చూస్తున్నారు. ఎమిలీకి తను వెళ్ళిపోయినట్లు అనుమానం వచ్చినట్లుంది అనుకున్నాడు విజయ్. తలుపు లోపలై నుంచి తెరిచి వచ్చాడు తను. అందుకే ఆమె తను ఉన్నాడో లేడో చెక్ చేసుకుని ఉంటుంది అనుకున్నాడు.

కొద్ది సేపటికి మళ్ళీ నిద్ర ముంచుకు వచ్చింది విజయ్ కి.

మరి కొద్ది సేపటికి ఉలిక్కి పడి లేచాడు విజయ్.

పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఎమిలీ ఇంటి ముందు ఆరుగురు ధృడకాయులు ఉన్నారు. అందులో తన వెంట పడిన వాళ్ళే కాక మరోముగ్గురు కొత్త వాళ్ళు కూడా కనిపించారు. మాక్స్ చేతిలో రక్తంతో మలినమైన తన చినిగిన దుస్తులు అనిపించాయి. వాటిని ఊపుతూ ఎమిలీపై గట్టిగా అరుస్తున్నాడు అతను.

’నాకేమీ తెలియదు’ అంటోంది ఎమిలీ. గ్రెంటా చేతిని బలంగా పట్టుకుని నిల్చున్నాడు ఒక బ్లాక్ వాడు.

తన దుస్తుల్ని నేలమాళిగ లోనే మరి కొద్ది రోజులు ఉంఛకుండా బయట పారేసి ఉంటుంది ఆమె. పొరపాటు చేసింది. గుంట నక్క మాక్స్ అక్కడే వెతుకుతూ ఉంటాడు అని ఊహించలేకపోయింది. తనైనా హెచ్చరించాడు కాదు, అని బాధ పడ్డాడు విజయ్.

పక్కనే ఉన్నవాడితో ఏదో అన్నాడు మాక్స్.

వాడు ఎమిలీని లాక్కుని వెళ్ళీ పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసాడు. ఆమె వేసుకున్న గౌనుని చించేసాడు. ఆమె లో దుస్తులతో వాళ్ళ ఎదుట అలా నిస్సహాయంగా చెట్టుకి కట్టబడి ఏడుస్తూ ఉంది, తనని వదిలేయమని వేడుకుంటూ.

తన చేతిలోని బట్టలను పక్కన పడేసి నడుముకి ఉన్న వెడల్పాటి బెల్ట్ ని తీసాడు మాక్స్.

ఒళ్ళు జల్లుమంది విజయ్ కి. దుర్మార్గుడు వీడు. ఏమి చేయబోతున్నాడు నా దేవదూతని అనుకున్నాడు. ఆవేశం కట్టలు తెంచుకుంది అతనిలో. కాని ఆలోచన అతన్ని నిలువరించింది. తను ఉన్న పరిస్థితిలో నాలుగు అడుగులు వేయడమే కష్టం. అలాంటిది ఆరుగురిని ఎదిరించడం అంటే ఆత్మహత్యతో సమానం. ఒకరిద్దరిని తను బలి తీసుకున్నా, వారి చేతుల్లొ చావడం తప్పని సరి.

మాక్స్ చేతిలోని బెల్ట్ గాలి లోకి లేచింది. వేగంగా వెళ్ళి ఎమిలీ శరీరాన్ని తాకింది. తెల్లటి ఆమె శరీరం పైన ఎర్రటి వాతలు తేలాయి. దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచింది ఎమిలీ. 

ఆమె అరుపులు ఆగలేదు. మాక్స్ బెల్ట్ ఆమె శరీరం పై వాతలు సృష్టించడం ఆగలేదు. ఆమె శరీరం పై అడ్డదిడ్డంగా వాతలు, రక్తం ఓడుతూ ప్రత్యక్షమయ్యాయి. 

కొంతసేపటికి ఎమిలీ అరుపులు ఆగిపోయాయి. తల పక్కకు వాల్చేసింది ఎమిలీ. 

గ్రెంటా చేయి పట్టుకున్న వాడు ఆమె చేతిని వదిలి ఎమిలీ దగ్గరకు వెళ్ళి ఆమెను పరీక్షించి ఏదో అన్నాడు.

తర్వాత ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చాడు ఎమిలీ మొఖం పై కొట్టడానికి. గ్రెంటా తన కళ్ళ ఎదుట తన తల్లిపైన జరుగుతున్న హింసాకాండ చూసి భయపడిపోయింది. తన చేయి వాడు వదలగానే వాళ్ళనుంచి తప్పించుకోవాలి అనుకుని పరిగెత్తుకుంటూ షెడ్ వైపు వెళ్ళింది. 

షెడ్ లోకి వచ్చిన గ్రెంటా ని మెల్లగా పేరు పెట్టి పిలిచాడు విజయ్. ఆశ్చర్యంగా పైకి చూసిన గ్రెంటాను లాడర్ ఎక్కి పైకి రమ్మన్నాడు.

’మనిద్దరం కలిసి అమ్మను రక్షిద్దాము. సరేనా?’ అన్నాడు విజయ్.

కళ్ళు తుడుచుకుంటూ తల ఊపింది సరే అన్నట్లు.

’నేను చెప్పినట్లు చెప్పాలి నువ్వు వాళ్ళకి’ అంటూ ఆమె చెప్పవలసిన మాటలు ఒకటికి రెండు సార్లు ఆమెకు చెప్పి ఆమెతో తిరిగి చెప్పించుకునాడు.

తృప్తి చెందాక. ’సరే నువ్వు వెళ్ళు ఇప్పుడు’ అంటూ ఆమెను పంపింఛాడు షెడ్ బయటికి.

***