మేధో హత్యలు part 7

This is Seventh part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 7

మేధో హత్యలు 7

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

మార్సెల్లో మార్టియాని అయిదు అడుగుల నాలుగు అంగుళాలు ఎత్తులో మిక్కీ మౌస్ కి మానవ రూపం ఇస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. అతని భార్య టైట్ గా ఉండే బట్టలతో అతనికి రెండింతలు ఉంది. హైట్ మాత్రం అతనికంటే రెండు అంగుళాలు తక్కువే! వారితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమె పేరు లూసీ అని తెలుసు విజయ్ కి. 

రిసార్ట్ లోపలికి అడుగు పెడుతూనే అతను కళ్ళతో స్కానింగ్ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు కనిపించారు. రిసెప్షన్ వైపు వెళ్ళకుండా ముందు తన అభిమాన సైంటిస్ట్ వైపు వడి వడిగా వెళ్ళిపోయాడు విజయ్. ’అయామ్ డాక్టర్ అభిరామ్, ఫ్రమ్ ఇండియా’ అంటూ వారికి పరిచయం చేసుకుంటూ, తన గురించి చెప్పాడు.

’మనం మైల్స్ లో చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉండే వాళ్ళము కదా?’ అన్నాడు మార్సెల్లో.

గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అనిపించింది విజయ్ కి. అవన్నీ అడుగుతాడా ఏమిటి, ఇప్పుడు అని భయపడ్డాడు. కానీ వెంటనే మాట మారుస్తూ, ’డాక్టర్, మీరు ఏ రూమ్ లో ఉన్నారు?’ అని అడిగాడు. 

మార్సెల్లో తనకు అలాట్ అయిన స్వీట్ నెంబర్ చెప్పగానే, ఇప్పుడే వస్తాను’ అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా రిసెప్షన్ వైపు పరిగెత్తాడు విజయ్.

గబగబా రిసెప్షన్ దగ్గరకి వెళ్ళి మార్సెల్లో పక్కనే ఉన్న స్వీట్ తనకు అలాట్ చేయించుకున్నాడు. అప్పుడు తీరికగా మళ్ళీ మార్సెల్లో కోసం వెతుక్కున్నాడు.

వాళ్ళు ముగ్గురూ రెస్టారెంట్ వైపుకి వెళ్తూ కనిపించారు. తన బాగ్ ని రిసెప్షన్ దగ్గర ఉన్న్ బాయ్ కి అప్పచెప్పి తను రెస్టారెంట్ లో ఉంటాను అని చెప్పి కీ కూడా ఇచ్చి మార్సెల్లో ని కలవడానికి అటు పరిగెత్తాడు విజయ్.

తను ఇప్పుడు డాక్టర్ అభిరామ్. ఒక యువ సైంటిస్ట్. తన ఫీల్డ్ లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సైంట్సిట్ ను తన ఆరాధ్య దైవంలా కొలవబోతున్నాడు ఈ సెమినార్ జరిగే మూడు రోజులపాటూ.

పాణిగ్రాహి చెప్పినట్లు తను మార్సెల్లోని ఒక క్షణం కూడా ఏమరకుండా కనిపెట్టుకుని ఉండాలి అంటే ఇలా నటించడం తప్ప వేరే దారి లేదు. ఎవరికీ అనుమానం రాకుండా, మార్సెల్లో ని నీడలాగా .. కాదు కాదు... తుమ్మ జిగురులాగా... అతుక్కోవడానికి ఈ అభిమాన సైంటిస్ట్ అన్న కాన్సెప్ట్ బాగా ఉపయోగపడుతుంది అని డిసైడ్ అయిపోయాడు విజయ్.

మళ్ళీ తమ ఎదుట ప్రత్యక్షమైన విజయ్ ని చూసి నవ్వుతూ చూసాడు మార్సెల్లో. అతని భార్య, వారితో పాటూ ఉన్న లూసీ కూడా వింతగా చూసారు విజయ్ వైపు. సినిమా స్టార్లు, ఫుట్ బాల్ ప్లేయర్లను ఇలా వెంటాడే అభిమానులను చూసారు గానీ ఇలా సైంటిస్టుల వెంట పడే వాళ్ళను చూడడం అదే ప్రథమం వాళ్ళకి. ఏముంది ఈ మికీ మౌస్ బట్టతల, టూత్‍బ్రష్ మీసాల మనిషి మొఖంలో’ అనుకున్నట్లు మొఖ మొఖాలు చూసుకున్నారు ఆడావాళ్ళు ఇద్దరూ.

అభిమానం అంతా కళ్ళల్లో కురిపిస్తూ, వాళ్ళ టేబుల్ దగ్గర కూచోవచ్చునా అని అనుమతి కోరాడు విజయ్.

’ఓ యెస్’ అన్నాడు మార్సెల్లో.

ఎంతో ఆనందంగా అక్కడ కూర్చున్నాడు విజయ్. ఒక సారి రెస్టారెంట్ మొత్తాన్ని తన ఎక్స్ రే కళ్ళతో స్కానింగ్ చేసాడు అనుమానితుల కోసం. డోర్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి కాస్త దూరంలో మరో పారలెల్ సెక్యూరిటీ వాళ్ళు కనబడ్డారు. వీళ్ళెవరో మన కోసం కాపు పెట్టినట్లున్నారు అనుకున్నాడు విజయ్. తన మొఖానికి కొత్తగా తగిలించిన భూతద్దాల కళ్ళ జోడు, మారిన హెయిర్ స్టైల్ వల్ల తనను గుర్తు పట్టడటం అంత ఈజీ కాదు అనుకున్నాడు. 

’నా భార్య రోజీ, నా మేనకోడలు లూసీ. పిజి చేస్తోంది న్యూరాలజీలో’ అన్నాడు మార్సెల్లో భార్య ఆర్డర్ ఇవ్వగా వచ్చిన పాస్తా మీదకి దండయాత్రకి వెళ్తూ.

చేతులు జోడించాడు విజయ్ ఆడవాళ్ళిద్దరికీ. వారికి బాగా నచ్చేసింది విజయ్ నమస్కారం. వాళ్ళు కూడా తమ ఫోర్కులు, స్పూనులు ప్లేట్లలోకి వదిలి చేతులు జోడించారు చిరునవ్వుతో.

మార్సెల్లో ఇంప్రెస్ అయ్యాడు, తన మాతృ బాష ఇటాలియన్ లో భార్యతో అన్నాడు, ’చూసావా...  ఇండియన్ల కల్చర్ ఎంత హూందాగా ఉందో!! మనుషులకు టచ్ కాకుండానే తమ గౌరవాన్ని, అభిమానాన్ని ఎంత చక్కగా తెలియచేస్తున్నారు’ అన్నాడు. వాళ్ళిద్దరూ కూడా తలలు ఊపారు అతని మాటలను ఆమోదిస్తున్నట్లు. వారి మాటలు తనకు అర్థం అవుతున్నా, అర్థం కానట్లుగా ఉండిపోయాడు విజయ్. డాక్టర్ అభిరామ్ కి ప్రపంచ భాషలతో ఏం పరిచయం ఉంటుంది. అనవసరంగా బయటపడి అనుమానాలు రేకెత్తించడం ఎందుకు?

వినడానికి తెలుగు లాగానే ఉన్న ఆ ఇటాలియన్ భాష చెవిన పడితే అతని మనసు తన మాతృభాష తెలుగుని తలుచుకుంది. తేనెల తేటల తెలుగుని యూరోపియన్లు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవడం కొంతవరకు సమంజసమే అనుకున్నాడు. తెలుగు లాగా ఇటాలియన్ పదాలు కూడా అచ్చులతో అంతం అవుతూ ఒక రకమైన లాలిత్యాన్ని, లయను కలిగి ఉంది అనుకున్నాడు.

బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నంత సేపూ మార్సెల్లో అవీ ఇవీ కలగలిపి ఏవో మాట్లాడుతూనే ఉన్నాడు. లక్కీగా ఏమీ ప్రశ్నలు అడగటం లేదు అతను. విజయ్ మాట్లాడినా మాట్లాడకపోయినా పరవాలేదు అన్నట్లు ఉన్నాడు. ఊ కొడుతూ ఉంటే చాలు ఆనందంగా మరో రెండు గంటలైనా ఆపకుండా మాట్లాడేలా ఉన్నాడు.

ఈ లోగా బ్రేక్ ఫాస్ట్ ముగించిన ఆడవాళ్ళిద్దరూ కొద్దిగా అసహనంగా చూడడం మొదలు పెట్టారు.. అతని భార్య ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతని కాలు బలంగా తొక్కినట్లుంది. ’ఆ...’ అంటూ బాధగా చిన్న కేక పెట్టి కాలు వైపు, భార్య వైపు చూసి, ’ఇక చాలు తక్కినవి మల్ళీ చెప్తాలే ... బై’ అంటూ టేబుల్ ముందు నుంచి లేచాడు. తన ప్లేట్ లో ఉన్న పదార్థాన్ని ఆనందంగా విడిచి పెట్టేసి తను కూడా లేచాడు విజయ్. 

అప్పుడే వెయిటర్ కాఫీ తెచ్చి విజయ్ ముందు పెట్టాడు. దాని వంక కూడా చూడకుండా అక్కడ నుంచి లేచి మార్సెల్లో వెంట కొద్ది దూరంలో నడిచాడు. మరీ దగ్గరగా వెళ్తే అతని భార్య ఈసారి అతన్ని వదిలి తనను ఎగిరి తన్నినా తంతుంది అనుకున్నాడు నవ్వుకుంటూ.

గుంపులు గుంపులుగా సైంటిస్టులు కాజువల్ బట్టలలో హయిగ తిరుగుతున్నారు. కాన్ఫరెన్స్ పేరు చెప్పుకుని వాళ్ళందరూ కలిసేది తమకు తమ కుటుంబ సభ్యులకు కాస్త రిలాక్సేషన్ దొరకడానికే. ఎప్పుడూ తమ తమ పనులలో మునిగి పోయి కుటుంబాలను కూడా మరిచిపోయే సైంటిస్టులకు ఇదొక ఆటవిడుపుగా ఉంటుంది అని నిర్వాహకుల ఉద్దేశం.

దగ్గరలోనే ఉన్న అందమైన బీచ్ లో కొందరు వాక్ చేస్తున్నారు.

లావుగా గుమ్మడికాయలా ఉన్న ఒక కామిక్ కారెక్టర్ విజయ్ దృష్టిని ఆకర్షించాడు. బెర్ముడాస్ వేసుకుని దానిపై లూజుగా ఉన్న పూల చొక్కా వేసుకుని నెత్తిన పెద్దహాట్, గాగుల్స్ పెట్టుకుని ఉషారుగా అందరినీ పలకరిస్తున్నాడు అతను. ఎదురుపడిన వారందరినీ ప్రేమగా భుజం తట్టి మరీ పలకరిస్తున్నాడు. క్షణ క్షణం నవ్వుతూ నే ఉన్నాడు. అతని నవ్వు ఒక అంటువ్యాధిలా ఆందరినీ అంటుకుంటున్నట్లుంది, అతను ఉన్నంత సేపూ ఆ తర్వాతా కూడా అతన్ని కలిసిన సైంటిస్టులు నవ్వులు పువ్వుల్లా పూయిస్తున్నారు.

’హే ఇండియన్! అంటూ తన దగ్గరకు వాచిన ఆ శాల్తీనిఒ నవ్వు మొఖంతో చూసాడు విజయ్. తన సోడా బుడ్డి కళ్ళద్దాలు అతన్ని చక్కగా విడియో తీస్తాయి అని తెలుసు అతనికి. అందుకే అతన్నే చూస్తూ, ’డాక్టర్ అభిరామ్’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. ’కాల్ మి జార్జ్’ అన్నాడు అతను. అతని పూర్తి పేరు చెప్పకపోయినా, అతను జార్జి గా పిలవబడుతున్నాడు కాబట్టి అతని గురించి వివరాలు సేకరించడం కష్టం కాదు అనుకున్నాడు విజయ్.

’మా కాన్ఫరెన్స్ కి మీ దేశం స్పాన్సర్ చేసిన ఏకైక సైంటిస్ట్ మీరు. లాస్ట్ మినిట్ లో యాడ్ అయింది మీ పేరు. అయినా ఇండియా అంటే మాకు గౌరవం. మీ దేశ వేద శాస్త్రాలపై మా వాళ్ళు చాలా పరిశోధనలు చేసారు. సంస్కృతం అంటే మా దేశీయులకు చాలా ఇష్టం అన్నాడు జార్జి.

’మీరు జర్మనా?’ అన్నాడు విజయ్ ఏదో డిస్కవరీ చేసినట్లు మొఖం పెడుతూ.

’అవును... ఎలా కనుక్కున్నారు?’ అన్నాడు జార్జి నవ్వుతూ.

’సంస్కృతం అంటే, వేదాలు అంటే జర్మన్స్ కి ఉన్నంత ఇంట్రస్ట్ యూరోపియన్ దేశాలలో మరెవరికి ఉంటుంది చెప్పండి’ అంటూ తను కూడా నవ్వేసాడు విజయ్.

’అఫ్ లోర్స్. యూ ఆర్ గ్రేట్ డిటెక్టివ్ దాక్టర్ అభ్భీ’ అన్నాడు జార్జి పకపకా నవ్వుతూ.

ఉలిక్కిపడ్డాడు విజయ్. కొంపతీసి వాడు గానీ తన మారువేషం కనిపెట్టలేదు కదా అన్న అనుమానం క్షణకాలం వచ్చి మాయమయింది.

తన ఉలికిపాటుని సమర్థించుకున్నట్లుగా, ’ఓ యూ మీన్ అభిరామ్’ అన్నాడు అభ్భీ అనే మాట తనకు లేట్ గా అర్థమయినట్లు కవరింగ్ ఇస్తూ.

’యెస్ యెస్. ఎంజాయ్ యువర్సెల్ఫ్. లంచ్ తర్వాత రెండు గంటలు మన సెమినార్ హాల్ లో పేపర్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దాన్ని మిస్ అవ్వొద్దు’ అంటూ చేతిని చాచాడు.

అతని చేతికి ఉన్న పెద్ద నీలంరంగు రాయి ఉన్న ఉంగరం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ’నమస్తే’ అంటూ చేతులు జోడించాడు విజయ్. విజయ్ ప్రవర్తన కు ఏమాత్రం అఫెండ్ అవకుండా , ’యెస్ యెస్, ఇదే కరెక్ట్ పద్ధతి’ అంటూ తను కూడా చేతులు జోడించి అక్కడ నుంచి నవ్వు మొఖంతో వెళ్ళిపోయాడు జార్జి మరో సైంటిస్ట్ ఫామిలీని కలవడానికి.

అతని మాటలను బట్టి ఆ కాన్ఫరెన్స్ ఆర్గనైజర్లలో అతను ముఖ్యమైనవాడు అయి ఉంటాడు అనుకున్నాడు విజయ్. తన గది కి వెళ్ళగానే అతని గురించి వివరాలను సేకరించమని స్విఫ్ట్ కి చెప్పాలి అనుకున్నాడు.

లంచ్ టైమ్ వరకూ మార్సెల్లో ఎక్కడికి వెళ్తే అక్కడకు అతన్ని నీడలా వెంబడించాడు. అతని దగ్గరకు ఎవరైనా క్లోజ్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఏదో ఒకటి చేసి ఆపుదామనుకున్నాడు. అతని అదృష్టవశాత్తూ ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు.

లంచ్ కి ముందు తమ రూమ్ కి మార్సెల్లో కుటుంబం వెళ్తుంటే తను కూడా తన గది వైపుకి వెళ్ళాడు. తన గది లాక్ ని స్మార్ట్ కార్డ్ తో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతూ మార్సెల్లో తన పక్క గది తలుపు దగ్గర ఉండడం చూసి, ’డాక్టర్, మీరు నా పక్క స్వీట్ లోనే ఉన్నారా?’ అన్నాడు ఏదో పెద్ద డిస్కవరీ చేసినట్లు.

నొసలు చిట్లించి చిరాకుగా చూసింది మార్సెల్లో భార్య.

వెంటనే తన గదిలోకి దూరిపోయాడు విజయ్. గదిలోకి వెళ్ళిన మార్సెల్లో భార్య అరిచిందో, మరి లూసీ అరిచిందో తెలియలేదు కానీ కెవ్వు మన్న కేక ఒకటి విజయ్ చెవుల పడింది. ఆ కేక కోసమే ఎదురు చూస్తున్నాడు విజయ్.

మెరుపులా తన గది బయటికి వచ్చాడు విజయ్. ఆందోళన ప్రతిఫలిస్తున్న మొఖంతో, ’ఏమయింది.. ఏమయింది..’ అంటూ జొరబడిపోయాడు మార్సెల్లో గదిలోకి. సోఫాలో కాళ్ళు రెండూ పైన పెట్టుకుని కూర్చుని ఉంది మార్సెల్లో భార్య. మంచం మీద నుంచుని ఉన్నాడు మార్సెల్లో, భయంతో గడ్డకట్టుకుని నిలబడి చూస్తున్న లూసీ తలుపు తెరిచి లోపలికి వచ్చిన విజయ్ వైపు ఒక్క గంతు వేసి అతని చంక ఎక్కేసింది. తన కాళ్ళను అతని నడుము చుట్టూ వేసి అతని మెడ కావలించుకుని చంకలో కూర్చుంది. 

ఓ.. ఓ..భయం లేదు. ఇలాంటి పిల్ల పాములను నేను చాలా పట్టుకున్నాను. భయం లేదు’ అంటూ ఆమెను కూడా మంచం దగ్గరకి తీసుకెళ్ళి మార్సెల్లో పక్కన కూలవేసాడు. వెనక్కి తిరిగి గోడ పక్కనుంచి టేబుల్ వైపుకి జర జరా పాకుతున్న మూడడుగుల నల్లని తాచుపాముని పట్టుకోవడానికి అటు ఉరికాడు. అతని అలికిడికి అది గబగబా తన తోకని దగ్గరకి లాక్కుని నోరు తెరిచి వికృతంగా బుసలు కొట్టింది. బెత్తెడు వెడల్పు ఉన్న దాని నల్లటి పడగను, ఎర్రటి నోటిని లోపల కనిపిస్తున్న తెల్లని కోరలను చూడగానే భయం పది రెట్లు పెరిగింది మార్సెల్లో ఫామిలీకి. 

దాన్ని పట్టుకోవడానికి ధైర్యంగా ముందుకి వెళ్తున్న  విజయ్ ని చూసి వెనక నుంచి అరిచాడు మార్సెల్లో ఇటాలియన్ భాషలో ’ప్రమాదం, అది కాటు వేస్తుంది జాగ్రత్త’ అంటూ.

’నో ప్రోబ్లెమ్ డాక్టర్..’ అంటూ ఎడమ చేతిని పాము పడగ మాదిరి చేసి బుసలు కొడుతున్న నల్ల తాచు కి అడుగు దూరంలో మెల్లగా ఊపడం మొదలు పెట్టాడు.

దగ్గరికి రావద్దు అన్నట్లు బుస్ మని గాలి వదిలింది ఆ పాము. ఏమీ తొణకకుండా, బెణకకుండా ఎడమ చేతిని అలా ఊపుతూ కుడి చేతిని మెరుపులా ముందుకి విసిరి ఆ పాముని పడగ కిందగా ఒడిసి పట్టుకున్నాడు విజయ్. కనులు మూసి తెరిచేలోగా జరిగిన ఆ కదలిక పాముకి గానీ మార్సెల్లో కుటుంబానికి గానీ కనబడలేదు. ఒక్కసారిగా పడగ విప్పిన పాముని పట్టుకుని పైకి లేస్తూ ఉన్న విజయ్ కనిపించి ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. అతని కుడి చేతి మణికట్టు నుంచి మోచేతి వరకు తన శరీరాన్ని చుట్టి అతని చేతిని నొక్కడానికి ప్రయతిస్తూ ఉంది ఆ తాచు. కానీ అతని పట్టు నుంచి వదిలించుకోవడం దాని వల్ల కాలేదు.

’ఇండియన్స్ ఆర్ గ్రేట్’ అన్నాడు మార్సెల్లో చిన్నపిల్లాడిలా నవ్వుతూ. లూసీ కళ్ళల్లో విజయ్ పట్ల అభినందన కనిపించింది. మార్సెల్లో భార్యకు ఇంకా భయం తగ్గలేదు, ’దాన్ని దూరంగా పడెయ్, చంపెయ్’ అంటూ అరవసాగింది.

’నో మాడమ్. ఇది ఏమీ చేయలేదు. దీన్ని దాని ఇంటికి క్షేమంగా పంపిచేస్తాను. మీరు వర్రీ అవ్వకండి’ అంటూ దాన్ని తీసుకుని బయటికి నడిచాడు. దాన్ని దూరంగా కనిపిస్తున్న మొక్కల్లో విడిచి పెట్టేసి త్వరగా తన గది కి చేరుకున్నాడు. తన వస్తువులను గదిలో అమర్చుకుని పక్క గదిలో మాటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినబడేలా కొన్ని పరికరాలను సెట్ చేసుకున్నాడు. పాము భయంలో అందరూ ఉన్నప్పుడు ఆ గదిలోని టేబుల్ కింద పెట్టిన బగ్ బాగానే పని చేస్తుందని నిర్ధారించుకున్నాడు.

వాళ్ళు రెడీ అయి లంచ్ కోసం బయటకు రాగానే కాకతాళీయంగా అప్పుడే బయటికి వచ్చినట్లు తను కూడా బయటికి వచ్చాడు.

’అభిరామ్, ఆ పాముని చంపేసావా?’ అడిగింది మార్సెల్లో భార్య.

లూసీ కూడా అతని వైపు ప్రశ్నార్ధకంగా చూసింది. 

’నో నో మాడమ్. దాన్ని దూరంగా వదిలేసి వచ్చాను’ అన్నాడు. 

’మళ్ళీ వస్తుందేమో’ అన్నది మార్సెల్లో భార్య భయం భయంగా చూస్తూ.

’రాదు మాడమ్. నాదీ గారంటీ’ అన్నాడు విజయ్. ’దానంతట అదెలా వస్తుంది మాడమ్? దాన్ని తీసుకొచ్చి మీ తలుపు కింద నుంచి లోపలికి పంపిందే నేను అయితే’ అనుకున్నాడు మనసులో. కోరలలో విషం పిండేసిన ఆ తాచుని స్పెషల్ గా తన బాగ్ లో దాచి తెచ్చుకున్నాడు విజయ్ తనకు మార్సెల్లో గదిలోకి వెళ్ళే అవకశాం దొరకడం కోసం.

లంచ్ జరిగినంత సేపూ, మార్సెల్లో కుటుంబం స్నేహపూర్వకంగా విజయ్ తో మాట్లాడుతూనే ఉన్నారు. లూసీ తన సోడాబుడ్డి కళ్ళద్దాల వైపు ప్రేమగా చూడడం గమనించి ఇబ్బందిగా కదిలాడు విజయ్. లేని పోని తలకాయ నొప్పులు తెచ్చుకుంటున్నాడా తను అనుకుంటూ. 

అతని కాలిక్యులేషన్ లో, మార్సెల్లో, అతని భార్య మాత్రమే కాన్ఫరెన్స్‍కి వస్తారు. కానీ అనుకోకుండా లూసీ యాడ్ అయింది. అసలు ఆమె బాక్ గ్రౌండ్ ఏమిటో కనుక్కుంటే మంచిది అనుకున్నాడు విజయ్ లోని స్విఫ్ట్ ఏజెంట్. అమాయకులు అని ఎవరిని స్పేర్ చేసేది లేదు. మేధోహత్యలు చేసే హంతకులకు సహకరించే వారంతా మానవాళికి శత్రువులే. వారందరికీ మరణ దండన విధించాల్సిందే అంటూ పళ్ళు పటపటలాడిస్తూ వికృతంగా లేచాడు  విజయ్ లోని స్విఫ్ట్ ఏజెంట్. తన కళ్ళల్లోని భావాలను బయటపడకుండా అడ్డుకున్న సోడబుడ్డి కళ్ళద్దాలకు మౌనంగా కృతజ్ఞత చెప్పుకున్నాడు విజయ్.

లంచ్ తర్వత ఆడవాళ్ళిద్దరూ గది కి వెళ్ళిపోయారు. పాము భయం కనీసం ఆ రోజు అంతా ఉంటుంది వాళ్ళతో అని అంచనా వేసాడు విజయ్. కాళ్ళు కనబడకుండా డ్రెస్ వేసుకుంటే మంచిది. హై హీల్స్ కంటే స్పోర్ట్స్ షూస్ బెటర్ అని కూడా వాళ్ళకు సలహా ఇచ్చాడు స్నేక్ ఎక్స్‍పర్ట్ లా.

ఆ రోజుకి మార్సెల్లో ని ఎవరెవరు కాంటాక్ట్ చేసారు, వాళ్ళల్లో అనుమానితులు ఎవరైనా ఉన్నారా అని పరికించి చూసాడు విజయ్. అలా ఎవరూ కనబడలేదు.

నైట్ డిన్నర్ లో కూడా ఏమీ జరగలేదు. అంతా బాగానే ఉంది అనుకున్నాడు విజయ్. మొదటి రోజు సేఫ్ గా గడిచింది అనుకున్నాడు. మార్సెల్లో కుటుంబం గదికి వెళ్ళిన రెండు నిముషాలకు తన గదికి చేరుకున్నాడు. స్మార్ట్ కార్డ్ తో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే అతని మెడ మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. చేయి అప్రయత్నంగా తన రూజర్ మార్క్ పైకి వెళ్ళింది. ఆ హేండ్ గన్ కోటు కింద, నడుము వైపు ఎవరికీ కనబడకుండా సేఫ్ గా ఉంది. చల్లటి దాని స్పర్శ తగలగానే, అతని శరీరం కొద్దిగా వంగి కనిపించని శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధమయింది.

***