మేధో హత్యలు part 2

This is Second part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 2

మేధోహత్యలు - 2

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

సుప్రియ వచ్చి ఉంటుంది అనుకున్న విజయ్ కి రిసెప్షన్ దగ్గర నుంచుని ఉన్న అమ్మాయిని చూడగానే ఆశాభంగం అయింది. 

ఎదురుగా కనిపించిన అమ్మాయికి ఇరవై మూడు నుంచి ఇరవై అయిదు ఏళ్ళు ఉండొచ్చని అంచనా వేసాడు విజయ్. చూడడానికి ఎక్కడో బార్ లో పనిచేసే అమ్మాయిలాగా అనిపించింది. టైట్ గా వంటిని పట్టి నట్లు ఉన్న మిని స్కర్ట్, ఇంకా టైట్ గా ఉన్న షర్ట్. ఆమె అందాలను అవసరానికి మించి ఆరబెట్టేలా ఉన్నాయి. చెంపలకు అటూ ఇటూ వేలాడుతూ మెడ పై వరకూ ఉండేలా కట్ చేసుకున్న బ్రౌన్ రంగు శిరోజాలు, దట్టమైన మేకప్ చేసుకున్న మొఖం, ఎర్రటి చౌకబారు లిప్ స్టిక్ దిద్దిన పెదవులు. 

సుప్రియ రాలేదు కాబట్టి తను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో ఆమెనే ఇలా డైరెక్ట్ గా తనను కలవడానికి వచ్చిందా అనుకున్నాడు విజయ్. కానీ అంతలోనే అనుమానాలు వచ్చాయి. 

ఈమెనా స్విఫ్ట్ ని కాంటాక్ట్ చేసింది? ఈమె దగ్గర స్విఫ్ట్ కి పనికి వచ్చే విలువైన సమాచారం ఉందా? తన దగ్గర ఉన్నది ఎవరికైనా పనికి వస్తుందంటే వెంటనే ఎంతకో అంతకు తెగనమ్మే రకం లా ఉంది ఈమె. అంత కఠినమైన ప్రొసీజర్ అనుసరిస్తూ స్విఫ్ట్ ఇన్‍ఫార్మర్ నెట్ వర్క్ ని ఎలా కాంటాక్ట్ చేయగలిగింది? ఇలాంటి ఆలోచనలు తేనెతుట్టె ను చుట్టుముట్టే తేనెటీగలలాగా ఝుమ్మంటూ మూగే సరికి - తల విదిలించి వాటిని దూరంగా తరిమేసి, తిన్నగా రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు విజయ్.

ఓరగా ఆమెనే చూస్తూ, రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతూ ’నా కోసం ఎవరో వచ్చారు, అన్నారు?’ అన్నాడు.

’మిస్టర్ విజయ్?’ అంది రిసెప్షనిస్ట్.

’యెస్...’ అన్నాడు విజయ్ అసహనంగా.

అతని దృష్టిని ఆకట్టుకున్న ఆ అమ్మాయి వైపు చూపించింది రిసెప్షన్స్ట్.

వారి సంభాషణ గమనిస్తున్న ఆ అమ్మాయి, ’హలో’ అంది.

’యెస్’ అంటూ - తన వెంట రమ్మని సైగ చేస్తూ రిసెప్షన్ కి కాస్త దూరంగా ఉన్న లౌంజ్ వైపుకి దారి తీసాడు విజయ్. తమ మాటలు రిసెప్షనిస్ట్ కి వినబడవు అన్నంత దూరం వచ్చాక ఆగాడు.

’చెప్పు?’ అన్నాడు విజయ్ ఆమె ను ప్రాంప్ట్ చేస్తూ.

’ప్లాన్స్ లో మార్పులు చేసారు. మీటింగ్ ఇక్కడ కాదు వేరే చోట. నిన్ను తీసుకు రమ్మని నన్ను పంపించారు’ అంది ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండానే.

మీటింగ్ లో మార్పు ఉంది అనగానే, తను ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచే ఈమె వచ్చి ఉంటుంది అనుకున్నాడు విజయ్. ఇలాంటి లాస్ట్ మినిట్ చేంజెస్ ఆమె చేసే అవకాశం ఉందని ముందే అనిపించింది విజయ్ కి. రాత్రి రెండు గంటలకు కాల్ చేస్తాను అని ఆమె ముందుగా చెప్పిందని బలబీర్ సింగ్ చెప్పాడు. ఇప్పుడు ఏడు గంటలకే ఈ అమ్మాయిని పంపించి మీటింగ్ లో మార్పులు ఉన్నాయి అంటుంది. సరే, ఏదైతే అది అవుతుంది అనుకుంటూ తల ఊపాడు ఆమె మాటలకు.

’నిన్ను పంపించిన ఆమె ఎక్కడ ఉంది?’ అన్నాడు యథాలాపంగా.

’నన్ను పంపింది ఒక మగ మనిషి’ అంది ఆమె కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ.

ఈ సారి ఆశ్చర్యపోవడం విజయ్ వంతు అయింది. ఆ ఆశ్చర్యాన్ని దాచిపెడుతూ, ’అలాగా, మరి ఆ ఆడ మనిషిని ఎక్కడ కలుసుకోబోతున్నాము’ అంటూ మరో రాయి వేసాడు.

’ఆడ మనిషి ఎవరో నాకు తెలియదు. నాకు అప్ప చెప్పిన పనులు రెండు. ఒకటి - నీకు ప్లాన్ లో మార్పు ఉంది అని చెప్పడం. రెండు - నిన్ను వెంట బెట్టుకుని వారు చెప్పిన చోటికి తీసుకు వెళ్ళడం. అంతే...’ అంది ఆమె చికాకుగా.

బలబీర్ సింగ్ చేసిన హెచ్చరికలు గుర్తుకి వచ్చాయి విజయ్ కి. ఒక వేళ ఇదంతా ట్రాప్ అయితే దానికి కూడా సిద్ధం పడి ఉండడమే కరెక్ట్, అనుకుంటూ ’మరి మనం ఎలా వెళ్తాము? కాబ్ హైర్ చేయనా?’ అన్నాడు మొబైల్ బయటకు తీస్తూ.

’అక్కరలేదు. నా కార్ ఉంది. దానిలో వెళదాము’ అంది ఆమె.

’ఓకే మరి... పద... అంటూ స్టెయిల్ గా ఆమె చేతికి తన చేతిని మడిచి పట్టుకుని నడిచాడు.

సరిగ్గా అప్పుడే మెయిన్ డోర్ లో నుంచి లోపలికి వస్తూ ఎదురయింది సుప్రియ. రాత్రి రెండు గంటలకు తనకు ఫోన్ కాల్ వస్తుందన్న ఆలోచనతో, సుప్రియను డిన్నర్ కి ఆహ్వానించాడు తను. ఇప్పుడు సడెన్ గా తను కాంటాక్ట్ చేయవలసిన ఆమె ప్రోగ్రామ్ లో మార్పులు చేసింది. ఆ విధంగా సుప్రియతో ఉన్న ఎంగేజ్‍మెంట్ తో తన డ్యూటీ క్లాష్ అయింది.

అందమైన బేబీ పింక్ ఫుల్ డ్రెస్ లో మిల మిల మెరిసిపోతున్న సుప్రియను చూడడానికి రెండూ కళ్ళూ చాలవు అనుకున్నాడు విజయ్. కానీ అదేమిటి అందమైన ఆమె కనులు అలా ఉన్నాయి? తనను చూసినందుకు ఆనందం ఆశ్చర్యం కలగలిపి మరింత విశాలమై ఉండవలసిన ఆమె కనులు కుంచించుకుని తనవైపు కోపంగా చూస్తున్నట్లు ఉన్నాయి. ఆమె లేత గులాబీ రంగులోని పెదవులు అరవిరిసి చిరునవ్వులు చిందించాల్సింది కాస్తా బిగించినట్లు ఉన్నాయి. ఆమె మొఖ సౌందర్యం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ రోజ్ కలర్ లో కనిపిస్తోంది. అదేమి విచిత్రమో గాని, ఆమె మామూలుగా ఉన్నప్పటి కంటె, కోపంగా ఉంటే మరింత అందంగా కనిపిస్తుంది విజయ్ కళ్ళకి.

ఆమె ఎందుకు తనను అలా చూస్తుంది అన్న విషయం ఆమె చూపులు తనను తన పక్కన ఉన్న అమ్మాయిని మార్చి మార్చి చూడడంతో గ్రహించాడు విజయ్. తన చెయ్యి ఆ అమ్మాయి చేయి కి మడత వేసి లాక్ చేసినట్లు ఉందని. ఒక జంట సరదాగా షికారుకి వెళ్ళేటప్పుడు చెట్టపట్టాలు వేసుకుని వెళ్ళడం బ్రిటన్ లో అయితే అలాగే చేస్తారు అనేది కూడా గుర్తొచ్చింది. ఏ ప్రాంతం కి వెళితే ఆ ప్రాంతపు అలవాట్లను తనవిగా చేసుకుని సహజంగా ప్రవర్తించేలా తనకు స్విఫ్ట్ ఇచ్చిన ట్రెయినింగ్ ఇలా వికటిస్తుంది అనుకోలేదు అని మనసులోనే నాలుక కరుచుకుని, తన చేతిని బలవంతంగా విడదీసుకున్నాడు విజయ్.

’సోఫీ, అపార్థం చేసుకోవద్దు. నేను నీకు వివరంగా చెప్తాను...’ అన్నాడు బ్రతిమిలాడుతున్నట్లు.

కోపంగా నేలను తన్ని బుసలు కొడుతూ, బిగించిన పెదవులు విప్పి ’చెప్పు’ అనేసి, మళ్ళీ బిగించేసింది సుప్రియ.

’ఇప్పుడు కాదు...  రేపు ఉదయం...’ అన్నాడు విజయ్ తడుముకుంటూ.

’ఓ, అలాగా, ఈ రాత్రి ఎంజాయ్ చేసి, రేపు ఉదయానికి నాకు చెప్పడానికి ఒక చక్కటి కథ సిద్ధం చేసుకుంటావన్న మాట. నీ బుద్ధి మారలేదు అన్న మాట. నీ వెంట పడడం నాదే బుద్ధి తక్కువ!! పార్టీకి వెళ్ళవలసిన దాన్ని, ఇలా నీకోసం వచ్చాను చూడు, నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి, ఛీ.. చీ..’ అంటూ గిరుక్కున వెనుతిరిగింది సుప్రియ, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ.

’ఓకే, ఓకే పార్టీకి వెళ్తున్నావా? సరే, నేను ఉదయాన్నే నీకు ఫోన్ చేసి అంతా వివరంగా చెప్తాను’ అన్నాడు విజయ్, ఇదంతా చాలా మామూలే అన్నట్లుగా రిసెప్షన్ లో ఉండే వాళ్ళకి, చుట్టు పక్కల వాళ్ళకి బిల్డప్ ఇస్తూ.

’షటప్. ఫోన్ చేయడానికి నీసమయం వృధా చేసుకోకు. నీకు నచ్చిన దానితో తిరుగు’ అంది సుప్రియ - మళ్ళీ అతని వైపు తిరిగి. తన కళ్ళలో పొంగుతున్న దుఖాశ్రువులు చెంపల మీదుగా జారుతూ ఉంటే తుడుచుకోవడం కూడా మానేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది.

భారంగా నిట్టూర్చాడు విజయ్. అదేమి కర్మమో గానీ పోయిన సారి కూడా ఒక అమ్మాయితో తను మాట్లాడూతూ ఉండగా చూసింది సుప్రియ. ఆమెకు వచ్చిన అనుమానాలు తీర్చి మళ్ళీ ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది. అప్పుడైతే ఆమెతో ఒక కాఫీ క్లబ్ లో కూర్చుని మాట్లాడటమే జరిగింది. ఇలా చెట్టపట్టాలు సీన్ కాదు అది. అమెని తిరిగి ప్రసన్నంగా చేసుకోవడానికి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో?? అసలు తనను ఎప్పటికైనా నమ్ముతుందా సుప్రియ??

తన హృదయాన్ని ఏలే సుప్రియ తో సంబంధం క్రిటికల్ స్టేజి లో ఉందని తెలిసినా, ఏమీ చేయలేని పరిస్థితి. ఎదురుగా ఉన్న ఈ అమ్మాయిని వదిలేసి, సుప్రియ వెనుక పరిగెడుతూ వెళ్ళి కాళ్ళూ గడ్డం పట్టుకుంటే ఆమె తన మాట నమ్ముతుంది, తనతో వస్తుంది. కానీ తను లండన్ వచ్చిన డ్యూటీ ప్రకారం ఎదురుగా ఉన్న ఈ కొత్త మనిషి వెంట - అది ట్రాప్ అని తెలిసినా - వెళ్ళకపోతే తను ఫెయిల్ అయినట్లు అవుతుంది. తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలుసు విజయ్ కి. 

’పద’ అన్నాడు ఆ అమ్మాయి వైపు చూసి.

’నన్ను జూకీ అంటారు’ అంటూ అతని దగ్గరకు వెళ్ళి అతని చేతులకు తన చేతులను మెలిక వేసింది. భయంకరమైన పాముని పట్టుకున్నట్లు అదిరిపడి, గబుక్కున తన చేతిని వెనక్కి లాక్కున్నాడు విజయ్. ’పద, జూకీ’ అన్నాడు వీలైనంత సౌమ్యంగా.

అతని ఇరకాటం, సుప్రియకు వచ్చిన కోపం కలగలిపి ఒక విచిత్రమైన సంతృప్తిని కలిగించినట్లుంది జూకీకి. సహజంగా ఒక స్త్రీకి కలిగే విచిత్రమైన సంతృప్తి అది! వేరే స్త్రీకంటే తన పట్ల ఒక మగవాడు ఆకర్షించబడ్డాడు అన్న ఆలోచన కలిగించే సంతృప్తి. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదని ఆమె మనసుకు తెలుసు. అయినా సుప్రియ దుఃఖానికి కారణం ఆమె బాయ్ ఫ్రెండ్ తన పక్కన ఉండటం అనుకోవడం ఆమెకు అదే రకం సంతృప్తిని ఆయాచితంగా పంచింది. ఆ పాయింట్ ఆమెకు విజయ్ పట్ల కాస్త ఇష్టం కలిగించింది.

మౌనంగా అతన్ని తన కార్ వైపుకి తీసుకు వెళ్ళింది జూకీ. సెకండ్ హాండ్ కార్ అది. రీ పెయింట్ చేసినట్లుంది. ఏవో గజిబిజి రంగులతో నింపేసి ఉంది దాని ఉపరితలం. కార్ డోర్ తెరుచుకుని ఆమె డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే, ఆ పక్క సీట్లోకి ఇరుక్కునాడు విజయ్. సీటుని కాస్త వెనక్కి తోసాడు, తన పొడవు కాళ్ళకు ప్లేస్ దొరకడానికి.

అతని వైపు ఆసక్తిగా చూసింది జూకీ. 

’పద. దారి తెలుసుగా?’ అన్నాడు విజయ్, ఆమె ఆలోచనలు తనను ఇబ్బంది పెడుతుండగా. తన ఒంటి మీద బట్టలను దాటి ఆమె చూపులు తన శరీరాన్ని తడిమేస్తున్నట్లు ఇబ్బందిగా కదిలాడు. 

స్మూత్ గానే స్టార్ట్ అయింది ఆమె కారు.

విక్టోరియా ఎంబాంక్‍మెంట్ వైపు పోనిచ్చింది ఆమె తన కారుని. ఇన్నర్ సిటీ గుండా ప్రయాణిస్తోంది. బిల్లింగ్స్ గేట్ మార్కెట్, ఓల్డ్ టవర్ దాటింది. తన మిని స్కర్ట్ పై పైకి జరిగిపోతున్నా దాన్ని పట్టించుకున్నట్లు కనిపించటం లేదు ఆమె. ఒక సారి అటు చూసి చిరాకుగా తల పక్కకు తిప్పుకున్నాడు అతను. తన వైపు అతను చూపు తిప్పేలా చేయాలి అనుకుందేమో, తనే మాట్లాడటం మొదలు పెట్టింది. 

’ఆమె నీ గాళ్ ఫ్రెండా?’ అంది ఒక రకమైన యాస లో. ఇంగ్ళీషు వాళ్ళు మాట్లాడే భాషను బట్టి వారు ఏ ప్రాంతం వారో చెప్పడం తేలికే! బహుశా ఆమె సౌత్ లండన్ ప్రాంతంది అనుకున్నాడు విజయ్.

’కాదు. ఆమె నా ఫ్రెండ్’ అన్నాడు. గాళ్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ కి చాలా పెద్ద తేడానే ఉన్నట్లుగా! ఆమె గట్టిగా నవ్వింది.

’స్మోక్ చేస్తావా?’ అంది. సిగిరెట్ పాకెట్ ఆఫర్ చేస్తూ!

’నో! అలవాటు లేదు’ అన్నాడు ప్లైన్ గా! ఈమె నాతో స్నేహం చేయాలనుకుంటుందా ఏం అనుకున్నాడు మనసులో. ఒక సారి ఆమె వంక పరీక్షగా చూసాడు. లోయర్ మిడిల్ క్లాస్ పెంపకం, తల్లిదండ్రులు సరిగా లేని బాల్యం ఆమెలో కనిపించాయి. కొద్దిగా సాఫ్ట్ గా అనిపించింది అతనికి ఆమె పట్ల. దురుసుగా మాట్లాడకూడదు అనుకున్నాడు.

’నీ సిట్యువేషన్ ఆమెకు వివరించడం కష్టమే సుమా?’ పక పకా నవ్వింది మళ్ళీ!!

ఏమీ మాట్లాడలేదు విజయ్. సుప్రియ గురించి ఆలోచనలు రాకుండా మనసుని కట్టడి చేసుకున్నాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆ పని మీద దృష్టి పెట్టకపోతే తన జీవితంలో మరుసటి రోజు అనేది ఒకటి ఉండే విషయం అనుమానమే అనుకున్నాడు!

’ఇప్పుడు ఆ ఆడ మనిషిని కలుస్తామా మనం?’ అన్నాడు ఆమెని డైవర్ట్ చేయడానికి.

’ఓహ్, నువ్వు వదలవా ఆ విషయాన్ని. నీకు నేను  చెప్పిన మాటలు తప్ప మరో విషయం ఏమీ నాకు తెలియదు. నువ్వు నమ్మితే నమ్ము. లేకపోతే నీ ఇష్టం. ఐ కాంట్ హెల్ప్ ఇట్’ అంది చికాకుగా. తన అందాన్ని, కవ్వించే తన మాటలని విని కూడా ఇతను తన గురించి మాట్లాడకుండా ఏమిటేమిటో మాట్లాడూతున్నాడు అనుకుంది కాబోలు.

కార్ ఒక పెద్ద హోర్డింగ్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే చూసాడు విజయ్. ఎల్‍ఇడి లైట్ల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాయి "రాయల్ డాక్స్" అన్న అక్షరాలు. 

లండన్ డాక్స్ కి ప్రత్యేకత ఉంది. అయిదు పెద్ద పెద్ద కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఏరియాలు ఉంటాయి ఆ డాక్ యార్డ్ లో. థేమ్స్ నదికి దగ్గరగా ఉంటాయి అవి. ఆ ఏరియాల  నుంచి వెనుకగా ఉన్న థేమ్స్ కి పాసేజిలు ఉంటాయి. చాలా విశాలమైన ఆ ఏరియాలలో సముద్రం లోకి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక వంద షిప్పులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వాటిలో ఎక్కువగా కార్గో వెసెల్స్ ఉంటాయి. భారీగా ఉంటాయి అవి. రకరకాల గూద్స్ ని రవాణా చేస్తూ ఉంటారు వాటిల్లో.

జూకీ తన కారుని డాక్ లోపలికి తీసుకుని వెళ్ళింది. సన్న సన్నటి లేన్స్ లోకి వెళ్తూ పెద్ద పెద్ద స్థంభాలు ఉన్న వైపుకి పోనిచ్చింది తన కార్ ని. చాలా వరకు లైట్లు ఉన్నా, చీకటిగా ఉన్న ప్రాంతాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ టైమ్ కి అక్కడక్కడా యాక్టివిటీ జరుగుతూనే ఉండడం గమనించాడు విజయ్. కానీ వాటి మధ్య చిక్కటి నిశ్శబ్దం లాగా దట్టమైన చీకటి కూడా ఉంది. దీపం పక్కనే నీడ ఉన్నట్లు! మంచి చెడులు ఒక మనిషిలోనే పక్క పక్కన సహజీవనం చేస్తున్నట్లు!!

ఆ ఏరియాల లోకి వెళ్తుంటే కార్ ని స్లో చేసింది జూకీ. ఏదో వెతుకుతున్నట్లు కనిపించింది విజయ్‍కి. కార్ లో బయట నుంచి పడుతున్న మసక వెలుతురులో ఆమె మొఖం టెన్షన్ గా ఉండడం కనిపించింది విజయ్ కి. విజయ్ మనసులో ఏదో ప్రమాదం తనకోసం పొంచి చూస్తుంది అన్న భావం హఠాత్తుగా మొదలయింది. అది క్షణక్షణానికి ఊడల మర్రిలా మనసంతా ఆక్రమించేసుకుంది. అలాంటి సంఘటనలు అదివరకు కూడా చాలా సార్లు ఎదురయ్యాయి అతనికి. మొదట్లో వాటిని అలక్ష్యం చేసినా తర్వాత తర్వాత ఆ సిగ్నల్స్ అనేవి తన మనసు పంపించే ముందస్తు హెచ్చరికలుగా గుర్తించి వాటిని లెక్కలోకి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.

  అలాంటి శక్తి తనకి ఎలా వచ్చిందో అతని దగ్గర సమాధానం లేదు. బహుశా తన మనసు తనకు తెలిసిన విషయాలను, తెలియవలసిన విషయాలను లెక్కలోకి తీసుకుని ఏదో కాంప్లెక్స్ కాలిక్యులేషన్ చేసి అటువంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని తనకోసం తయారు చేసిందేమో అని అతని అనుమానం. అది ఏమైనా గానీ, తనకు ఉపయోగపడుతుంది... అంతే చాలు అనుకుంటాడు.

అతని శరీరం, మనసు ఆ వార్నింగ్స్ ని స్వీకరించి కంటికి కనబడని ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం అయిపోయాయి.

బయటకు చూస్తూ ఉన్న జూకీ ఒక చీకటి ప్రాంతం లోకి కారుని పోనిచ్చింది. ఆమె  హెడ్ లైట్స్ ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద స్థంభాల పైన పడుతున్నాయి. ప్రతి స్థంభం పైన రిఫ్లెక్టింగ్ పెయింట్ తో రాసి ఉన్న నెంబర్లు కనిపించాయి. ఒక చోట కారు ఆపీ, హెడ్ లైట్ ఆపి, మళ్ళీ ఆన్ చేసింది. 

’ఇదే చోటు. స్థంభం - ౮౮... దిగు’ అంది జూకీ.

’నో. నువ్వు దిగు ముందు’ అన్నాడు విజయ్, లైట్ ఆపి వేయడం ద్వారా ఎవరికో సిగ్నల్ పంపింది అన్న విషయం మనసులో రిజిస్టర్ చేసుకుంటూ!

’నా డ్యూటీ నిన్ను ఇక్కడకు తీసుకు రావడం వరకే. నీ మీటింగ్ ఇక్కడే ఉంటుంది. నిన్ను దింపి వెళ్ళిపోవడమే నా పని’ అంది జూకీ బింకంగా!

’నో బేబీ, నేను చెప్పినట్లు చెయ్’ కరుకుగా అన్నాడు విజయ్. 

అతని గొంతులో వచ్చిన మార్పు గమనించి మ్రాన్పడిపోయింది జూకీ. చటుక్కున అతని వైపు చూసింది. అతని మొఖంలో కనబడిన భావాలు ఆమె ధైర్యాన్ని మరింతగా దిగజారిపోయేలా చేసాయి. తన కార్ లో ఎక్కినప్పటి మనిషిలా లేడు అతను. కళ్ళల్లో ఆ క్రూరత్వం అంతకు ముందు లేదు. ఉబుకుతున్న ఆ కండలు కూడా అంతకు ముందు తను గమనించలేదు. అతను చెప్పినట్లు చేయడం తన ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంది.

తలుపు తెరుచుకుని జూకీ దిగింది. ఒక క్షణం ఆమె దిగిన తర్వాత వేచి ఉండి తన వైపు కార్ డోర్ అన్‍లాక్ చేసి కాలితో దూరంగా నెట్టాడు. అంతలోనే తన కాళ్ళు రెండూ చటుక్కున ఎత్తి జూకీ ఖాళీ చేసిన డ్రైవింగ్ సీట్ లోకి పిల్లి పిల్లలా జారుకున్నాడు. ఒక చేత్తో హెడ్ లైట్స్ ఆపేసి, జూకి దిగిన వైపునుంచి బయటకు దిగాడు.

కొద్ది క్షణాలు చిమ్మ చీకటిలో కళ్ళు అడ్జస్ట్ కావడం కోసం టైమ్ తీసుకుని చుట్టూ చూసాడు. సైలన్సర్ అమర్చిన హేండ్ గన్స్ నుంచి బుల్లెట్స్ బయటకు దూసుకు వచ్చిన సన్నటి శబ్ధం అతని చెవులు పసికట్టాయి. బుల్లెట్స్ అతని భుజానికి అరంగుళం దూరం నుంచి వెళ్ళి జూకీ కారుని తాకి మెటాలికి సౌండ్ చేసాయి.

వెంటనే జూకీని నేలమీదకు తోసి తను కూడా ఆ పక్కనే బోర్లా పడిపోయాడు విజయ్. జూకీ భయంతో వణికి పోతూ ఉంది. మెల్ల మెల్లగా పాక్కుంటూ కారు కిందకు దూరడానికి ప్రయత్నించింది. 

గన్స్ పేల్చిన వారు ఎవరో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కష్టం. ఆ చీకటిలో ఆ బుల్లెట్లు ఎటు నుంచి వచ్చాయో తెలుసుకోవడం ఇంకా కష్టం. ఎక్కడైనా కవర్ తీసుకుందాము అని లేచి పరిగెత్తడానికి చేసే ప్రయత్నం చాలా ప్రమాదకరం. 

చీకటి కాబట్టి, పైగా తను వారు ఊహించినదానికి వ్యతిరేక దిశలో కారు దిగాడు కాబట్టి వాళ్ళు మొదటి షాట్స్ మిస్ అయ్యారు కానీ, ఇంకో అవకాశం ఇస్తే, నిముషాల్లో తన శరీరాన్ని జల్లెడలా మార్చేస్తారు అని విజయ్ కి తెలుసు. 

కనీసం ఇద్దరు ఉండి ఉంటారు అనుకున్నాడు విజయ్ బోర్లా పడుకుని నిశ్శబ్ధంగా ఊపిరి పీలుస్తూ. నడుము దగ్గిర తడిమి చూసుకున్నాడు, తన రూజర్ మార్క్ గన్ ’నేనున్నాను’ అని భరోసా ఇచ్చింది.

అంతలో ఎవరో దగ్గరకు వస్తున్న అడుగులు చప్పుడు వినిపించింది విజయ్‍కి. 

*** 

(ఇంకా ఉంది)