మేధో హత్యలు part 10
This is Tenth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.
మేధో హత్యలు 10
(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)
కొద్ది క్షణాలు షాక్ కి గురయ్యాడు విజయ్. ఏం జరిగింది? తను ఎంతో జాగ్రత్తగా తుమ్మ జిగురు మాదిరిగా మార్సెల్లో ని ఒక్క క్షణం కూడా వదలకుండా కాపాడుతూ ఉంటే ఎవరు అతన్ని ఇలా చేసారు?
మార్సెల్లో భార్య రోజీ పిచ్చి చూపులు చూస్తోంది. లూసీ మాత్రం ఎమోషనల్ గా ఏడుస్తూ ఉంది. మొబైల్ కి కాల్ వచ్చింది విజయ్ కి. స్విఫ్ట్ నుంచి బలబీర్ సింగ్ కాల్ చేసాడు.
’విజయ్, జరిగింది తెలిసింది. డాక్టర్స్ టీమ్ మార్సెల్లోని పరీక్షించడానికి వస్తున్నారు. మరో రెండు గంటలలో అక్కడ ఉంటారు. వారి దగ్గర నుంచి ఏమైనా అదనపు సమాచారం తెలుస్తుందేమో చూడు. ఈ సమస్య నీ చేతులు దాటనివ్వకు’ అని అబ్రప్ట్ గా కాల్ కట్ చేసాడు బలబీర్ సింగ్.
ఎప్పుడూ పరాజయం ఎరుగని తనను బురిడీ కొట్టించారు ప్రత్యర్హులు అన్న బాధ కంటే అమాయకంగా నవ్వుతూ, తనో పెద్ద సైంటిస్టుని అన్న అహంభావం ఏమ్ ఆత్రం లేకుండా ఒక యంగ్ సైంటిస్టుకి కావలసిన ప్రోత్సాహాన్ని, సమాచారాన్ని అడగకపోయినా ఉదారంగా ఇచ్చిన మార్సెల్లో మంచితనం గుర్తుకి వచ్చింది. అలాంటి మనిషిని తన రక్షణలో ఉండగానే మేధో హత్యకు గురిచేసారు ప్రత్యర్థులు అన్న ఆ లోచన భరించరానిదిగా అనిపించింది.
మార్సెల్లో గురించి తలుచుకుంటే చాలు కళ్ళల్లోఊరుతున్న కన్నీళ్ళను అదుపు చేసుకుంటూ మార్సెల్లోకి ఆ గతిని పట్టించిన వారిని వదిలి పెట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
బలబీర్ సింగ్ చెప్పినట్లే డాక్టర్ల బృందం వచ్చి మార్సెల్లోని పరీక్షించారు. వారి పరీక్షలు ముగిసాక వారితో మాట్లాడాడు విజయ్. లోకల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం డాక్టర్ అభిరామ్ పేరుతో ఉన్న వ్యక్తికి కావలసిన సమాచారం ఎలాంటి సంకోచం లేకుండా ఇవ్వడం తమ విధి అని వారికి తెలుసు.
’మార్సెల్లో కి జరిగిన బ్రెయిన్ డామేజి ఇర్రెవెర్సిబుల్’ అన్నాడు చీఫ్ డాక్టర్, విజయ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.
’ఎలా జరిగింది ఇది?’ అన్నాడు విజయ్.
’ఇలాంటివి మరో ఏడు కేసులు మా దృష్టికి వచ్చాయి. వాటన్నిటిలో జరిగినట్లే ఈ కేస్ లో కూడా జరిగింది’ గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు చీఫ్ డాక్టర్.
’ఇదిగో రిపోర్ట్’ అంటూ తన దగ్గర ఉన్న ఒక ఫోల్డర్ ని ఇచ్చాడు విజయ్ కి.
కళ్ళు మసకగా ఉంటే కళ్ళజోడు తీసి హాండ్ కర్చీఫ్ తో కళ్ళు వత్తుకుని ఆ రిపోర్ట్ ని చక చకా చూసాడు విజయ్. బ్రెయిన్ డామేజి టోటల్ అండ్ ఇర్రెవెర్సిబుల్ అని ఉంది. కారణం అన్ నోన్ పాథోజెన్ లేదా అన్ నోన్ రేడియేషన్ అని ఉంది.
ఆ రిపోర్ట్ వెనక్కి ఇచ్చేస్తూ తన కళ్ళజోడుని తిరిగి పెట్టుకున్నాడు.
లూసీ అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ’నువ్వు కళ్ళజోడు లేకుండా చూడగలవా?’ అంది అనుమానంగా అతని వైపు చూస్తూ.
’చిన్న ప్రింట్ లో ఉండే అక్షరాలను కళ్ళజోడు లేకుండా చదవడం అలవాటు నాకు’ అన్నాడు విజయ్ తడుముకోకుండా.
మరి కాసేపు కొన్ని వివరాలు తీసుకున్నాక ఆ డాక్టర్ల టీమ్ కి వీడ్కోలు చెప్పాడు విజయ్.
రోజీ దగ్గర, లూసీ దగ్గర శలవు తీసుకుని తిరిగి తన పరిశోధన మొదలు పెట్టాలి అన్నా ఆలోచనలో ఉన్న విజయ్ తో లూసీ తన వెంట ఒక చోటికి రమ్మని పిలిచింది.
’ఎక్కడికి?’ అన్నాడు విజయ్.
’నేను బాగా అప్‍సెట్ అయినప్పుడు వెళ్ళే చోటు అది. అక్కడ నా వాళ్ళు అంతా ఉంటారు. వాళ్ళకు నిన్ను పరిచయం చేస్తాను’ అంది లూసీ. ఆమె మొఖంలో కనబడుతున్న విచారాన్ని చూసి విజయ్ ఆమె కోరిక మన్నిస్తే తప్పేముంది అనుకున్నాడు.
రోజీకి చెప్పి ఇద్దరూ బయటకి నడిచారు.
లూసీ తన కార్ లో విజయ్ ని వెంట పెట్టుకుని రోమ్ అవుట్ స్కర్ట్స్ వైపుకి డ్రైవ్ చేసుకుంటూ పోయింది.
కొండలలో పెరిగిన వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ అని విజయ్ కి తెలుసు. మార్సెల్లో కి అలా అవడం లూసీని బాగా డిస్టర్బ్ చేసింది అని అనుకున్నాడు. ఆమె మంచిది అని అంతకు ముందే ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్న విజయ్ కి ఆమె పట్ల సానుభూతి ఉంది.
ఆమె తీసుకెళ్ళిన చోటు ఒక ఇరుకుగా ఉన్న సందులలో ఉన్న ఒక పాత ఇల్లు. అక్కడ ఆరుగురు ధృఢకాయులు ఉన్నారు. వాళ్ళను చూస్తే బాగా రఫ్ కారెక్టర్లు అనిపించింది విజయ్ కి. వాళ్ళందరిలో ఏదో ఆవేశం కొట్టొచ్చినట్లుగా కనిపించింది అతనికి. వాళ్ళందరూ ఏదో విషయంగా అప్పటివరకు తీవ్రంగా చర్చించుకుని ఒక అభిప్రాయానికి రాలేకపోయినట్లు కనిపించారు. బహుశా లూసీ నిర్ణయం కోసం వాళ్ళంతా చూస్తున్నారేమో అనుకున్నాడు విజయ్. ఎందుకంటే వాళ్ళ మొఖాలు చూస్తే పొట్టకోస్తే ఒక్కడంటే ఒక్కడికి కూడా అక్షరమ్ముక్క వచ్చి ఉండదు అనిపించింది విజయ్ కి.
’వీళ్ళంతా ఎవరు?’ అన్నాడు లూసీ వైపు చూసి.
అతని వైపు చుర చుర చూసి, లో గొంతుకతో వారితో ఏదో చెప్పింది. వెంటనే వాళ్ళల్లో బండగా ఉన్న వాడొకడు ముందుకు వచ్చి విజయ్ షర్ట్ పట్టుకుని గట్టిగా గుంజుతూ ’ఏం చేసావు మా అంకుల్ ని’ అని గద్దించాడు.
’మీ అంకుల్ ని నేనేం చేస్తాను. ఏంటి మీరు మాట్లాడేది’ అన్నాడు విజయ అయోమయంగా చూస్తూ. వార్నింగ్ లేకుండా మొఖం మీద ఒక పిడిగుద్దు పడి కళ్ళు బైర్లు కమ్మాయి విజయ్ కి. తూలి వెనక్కి పడబోతూ నిలదొక్కుకున్నాడు.
వాళ్ళందరికి తనపైన అనుమానం వచ్చిందని, తనే మార్సెల్లో దుస్థితికి కారణం అని వాళ్ళు అనుకుంటున్నారనీ, అలా అనుకోవడానికి ముఖ్యకారణం లూసీకి తనపైన అనుమానం కలగడం అని అర్థం అయింది అతనికి.
మాటలతో చెప్పే స్టేజి దాటి పోయిందని గ్రహించాడు. తన గన్ నో, కత్తి నో తీసి వాళ్ళను ఎదుర్కోవడం సరి కాదు అనిపించింది అతనికి. వెంటనే పిడికిళ్ళు బిగించివాళ్ళని ఎదుర్కోవడానికి పొజిషన్ తీసుకున్నాడు.
అతన్ని పిడిగుద్దు కొట్టిన వాడే మళ్ళీ విజయ్ మీద పడ్డాడు. పెద్ద పెద్ద చేతులను అతని మీదికి విసురుతూ.
అతని పంచ్ లను ఎడమ చేత్తో బ్లాక్ చేసి కుడి చేత్తో అతని డొక్కలోకి ఒక మీడియమ్ పంచ్ ఇచ్చి పక్కనుంచి దూసుకువస్తున్న మరో ధృఢకాయుడి వైపు కుడికాలు మడిచి షార్ప్ గా ఒక కిక్ ఇచ్చాడు. ఆ రెండు దెబ్బలూ తగిలిన ఇద్దరూ కెవ్వు కెవ్వున అరుస్టు అల్లంత దూరంలో పడ్డారు. కానీ వెనక నుంచి లావుపాటి దుంగ లాంటి కర్రతో విజయ్ తలమీద మోదాడు వాళ్ళల్లో పెద్ద చెవులతో అమాయకంగా కనిపిస్తున్న ఒక ధృఢకాయుడు.
మరోసారి కళ్ళు బైర్లు కమ్మాయి. చీకటి కమ్ముకుని క్షణాల్లో స్పృహ కోల్పోయాడు విజయ్. తోటకూద కాడలా వాలిపోయిన విజయ్ కాళ్ళు చేతులూ కట్టేసి బయట ఉన్న ఒక వాన్ లో అతన్ని వేసుకుని బయల్దేరారు ఆ ధృఢకాయులు.
పెద్ద చెవుల వాడిని తన కార్ లో ఎక్కించుకుని లూసీ కూడా ఆ వాన్ ని ఫాలో అయింది.
***
తల మీద సుత్తులతో కొడుతున్నట్లు అనిపిస్తూ ఉంటే మెలుకువ వచ్చింది విజయ్ కి. ఒక చిన్న గదిలో కుర్చీలో కూర్చుని ఉన్నాడు అతను.చేతులువెనక్కి విరిచి కట్టి ఉన్నాయి. నడుమునుంచి ఛాతీ వరకు అతన్ని కుర్చీకి అతికించినట్లు గట్టిగా కట్టేసారు ఆ ధృఢకాయులు. కాళ్ళు మాత్రం ఫ్రీగానే కదులుతున్నాయి. తాడు లేకపోవడం వల్ల అలా వదిలేసారేమో అనుకున్నాడు విజయ్.
కళ్ళు టప టప లాడిస్తూ చుట్టూ చూసాడు. అతను కళ్ళు తెరవడం గమనించిన పెద్ద చెవుల వాడు, ’లేచాడు, లూసీ’ అంటూ గట్టిగా అరిచాడు.
’గ్లాకో వాడికి దగ్గరగా వెళ్ళకు, చాలా ప్రమాదం’ అరిచింది లూసీ.
పెద్ద చెవులవాడు అయిదడుగుల దూరంలో ఆగిపోయి అనుమానంగా చూసాడు విజయ్ వైపు.
ఒక కూరగాయలు కోసే కత్తి పట్టుకుని విజయ్ వైపు చూపిస్తూ బెదిరించింది, లూసీ. ’నిజం చెప్పు, ఎందుకు మా అంకుల్ ని అలా చేసావు? నీకేం లాభం? చెప్పు??’ అంది కీచు గొంతుతో అరుస్తూ.
’వాడితో మాటలేమిటి?’ అన్నాడు అందరికంటే పొడవుగా బలంగా ఉన్న వాడు.
’ఏం చేద్దాం, విన్సీ’ అన్నాడు పెద్ద చెవుల వాడు.
’చంపేద్దాం’ అన్నాడు వాడు నిర్లక్ష్యంగా.
’ఆగండి. అంకుల్ మార్సెల్లోని అలా ఎందుకు చేసాడో తెలియాలి. అంకుల్ ని బాగు చేయడం కూడా వీడీకి తెలిసే ఉంటుంది’ అంది లూసీ కోపంగా చూస్తూ.
’మీరేం మాట్లాడుతున్నారు. నిజమే చెప్తున్నారా?’ అడిగాడు విజయ్. అతనికి నవ్వాలో భయపడాలో తెలియడం లేదు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే. మార్సెల్లో అంటే వాళ్ళకి చాలా ఇష్టం అన్న మాట మాత్రం నిజం. ఇక చంపడం అన్న మాటకి వస్తే వాళ్ళ ఎమోషన్స్ తో వాళ్ళు ఏమైనా చేయడాణికి సమర్థులే!!
’నిజమే! వాళ్ళెందుకు, నేనే నా చేతులతో నిన్ను చంపేస్తాను’ అంది లూసీ కత్తిని వయొలెంట్ గా ఊపుతూ.
’ఛా.. నేను అడిగేది, మీ అంకుల్ విషయం లో నన్ను మీరు అనుమానించడం నిజమేనా అని’ అన్నాడు విజయ్.
’యెస్. నువ్వు మారు వేషం వేసుకున్నావని మాకు తెలిసిపోయింది. నీ కళ్ళ జోడు సైట్ ఉన్న వాళ్ళకోసం వాడేది కాదు. నీ విగ్గు కూడా ఊడి పోయింది గ్లాకో కొట్టిన దెబ్బ కు’ అంది లూసీ.
అప్పుడు గమనించాడు విజయ్, తన కళ్ళజోడు మిస్సింగ్ అని. విగ్గు కూడా పోయి ఉంటుంది అని అర్థం అయింది. వాళ్ళు తనను అనుమానించడానికి సరైన కారణాలే ఉన్నాయి అని అర్థం చేసుకున్నాడు.
’నన్ను నమ్ము లూసీ, మీ అంకుల్ ని కాపాడడానికి వచ్చిన ఆఫీసర్ ని నేను’ అన్నాడు విజయ్ నిజాయితీని కంఠంలో పూర్తిగా ధ్వనింపచేస్తూ.
’ఆపు నీ అబద్ధాలు. డాక్టర్ అభిరామ్ ని కూడా చంపేసి ఉంటావు నువ్వు. మా అంకుల్ కి ఇలాంటి గతి ఎందుకు పట్టించావు చెప్పు’ అంది లూసీ.
’చూడు లూసీ, ఇలా ఎంత సేఫు వాడితో మాట్లాడుతూ ఉంటావు. మాకు ఆకలి అవుతుంది. తినేసి వద్దాము. వాడు అప్పటికీ జవాబు చెప్పక పోతే చంపేసి తోడేళ్ళకు ఆహారంగా వేసేసి వెళ్దాము’ అన్నాడు విన్సీ.
వీడి సరదా పాడు కాను, మాటి మాటికి చంపేద్దాము అన్న మాట తప్ప వేరే మాట రావడం లేదు వీడి నోటి వెంట అనుకున్నాడు విజయ్ నిస్సహాయంగా చూస్తూ!
’సరే, గ్లాకో, నువ్వు వీడీకి కాపలా ఉండు. మేమంతా తినేసి వస్తాము’ అంది లూసీ.
’మళ్ళీ మనం తిరిగి వచ్చేసరికి అసలు విషయం అంతా తిన్నగా చెప్తే సరి, లేదంటే చంపేద్దాము’ అన్నాడు విన్సీ.
అందరూ పొలో మంటూ తినడానికి పోయారు. గ్లాకో మాత్రం కాస్త దూరంలో ఒక కుర్చీ వేసుకుని ఏదో కామిక్స్ చదువుతూ కూర్చుని ఉన్నాడు.
ఈ పిచ్చాళ్ళ చేతుల్లోనుంచి ఏమీ కాకుండా బయటపడటం ఎలాగో అనుకున్నాడు విజయ్.
వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత తనకు ఏమీ తెలియదు అని ఎంత మొరపెట్టుకున్నా వినకుండా తనను ఫినిష్ చేయడానికే చూస్తారు. ఇప్పుడే ఈ ప్రమాదం నుంచి బయట పడటం ఉత్తమం అనుకున్నాడు. గ్లాకో కాస్త అమాయకుడే కాబట్టి అతన్ని ఏదో విధంగా ఎదిరించి తప్పించుకోవాలి అని డిసైడ్ అయిపోయాడు.
విజయ్ కాళ్ళు ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా శరీరాన్ని ముందుకి వంచితే కాళ్ళపైన నిలబడగలడు. తల వంచి అలాగే ముందుకి పరిగెడితే గ్లాకోని తలతో గుద్ది నేలమీద పడేయవచ్చు. అప్పుడు అతన్ని తన అదుపులోకి తీసుకోవచ్చు. కానీ తను లేచి నిలబడే లోగా వాడు చూస్తే కుర్చీలోనుంచి లేచి నిలబడతాడు. వాడు నిలబడితే తనను తప్పించుకోవడం చాలా ఈజీ. ఒకసారి తన ఎటాక్ ఫెయిల్ అయితే రెండో సారి ఎటాక్ చేసే అవకాశం మాత్రం దొరకదు అనుకున్నాడు విజయ్.
లూసీ కజిన్స్ లో ఎవడో దుంగలను నరుకుతున్నట్లున్నాడు గొడ్డలితో. ఉండుండి పెద్ద శబ్దం వస్తోండి. ఆ శబ్దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుందామన్న ఆలోచన వచ్చింది విజయ్ కి.
ఆ శబ్దం వచ్చినప్పుడు తన కాళ్ళను కొద్దిగా ముందుకి జరిపి, కుర్చీని తన శరీరంతో పాటు కాస్త ఎత్తి ఒకటి రెండు ఇంచిలు ముందుకి తోయడం మొదలు పెట్టాడు. ఒక సారి అలా చేసి గ్లాకో తనను గమనించడం లేదు అనిపించాక, తన ప్రయత్నాన్ని అలాగే కొన సాగించాడు. కామిక్స్ లోని బొమ్మలు చూసి ఆనందిస్తున్న గ్లాకోకి విజయ్ కదలికలు తెలియరాలేదు. అయిదారు సార్లు అలాగ చేసే సరికి గ్లాకోకి తనకి మధ్య దూరం ఒక అడుగు వరకు తగ్గింది అనిపించింది.
తర్వాత వచ్చే పెద్ద శబ్దాన్ని ఆసరాగా తీసుకుని ఒక్క సారిగా కాళ్ళతో నేలను తన్ని, శరీరానిఇ వంచి ముందుకి దూకి తను అనుకున్న ప్లాన్ ప్రకారం గ్లాకోని గుద్ది నేలమీదపడేసాడు.
ఒక మోకాలిని అతని ఛాతీ పైన వేసి నొక్కుతూ మరో మోకాలిని అతని గొంతు పైన వేసి అదిమాడు. విండ్ పైప్ కి కలిగిన ప్రెజర్ వళ్ళు గ్లాకో కళ్ళు ఉబికాయి, నోట్లోనుంచి నాలుక బయటకు వచ్చింది. వెంటనే ప్రెజర్ రిలీజ్ చేసాడు విజయ్.
భయంకరంగా దగ్గుతూ భయంతో గజగజలాడాడు గ్లాకో.
’అరవడానికి ప్రయతిన్సే నా మోకాలు నీ గొంతుని అదుముతుంది. దెబ్బకు చస్తావ్. జాగ్రత్త!’ అని బెదిరించాడు విజయ్ కరుకుగా.
తల ఊపాడు అర్థం అయినట్లు.
’గుడ్. అలా కోపరేట్ చేస్తే నిన్ను వదిలేస్తాను’ అన్నాడు విజయ్.
మళ్ళీ తల ఊపాడు గ్లాకో.
’జాగ్రత్తగా నీ చేతులను పైకి లేపి నా కట్లు లూజ్ చెయ్యి’ అన్నాడు విజయ్.
సమయం ఎక్కువలేదు. వీడి పిచ్చి అన్నలు, ఆ పిచ్చి లూసీ తిరిగి వచ్చే లోపు తనకు స్వేచ్చ కలగాలి. లేకపోతే తన ప్రానాలకు విముక్తి కలిగిస్తారు ఈ పిచ్చి గాంగ్ అంతా కలిసి అనుకున్నాడు విజయ్.
రెండు నిముషాలకు విజయ్ కట్లు ఊడి పడ్డాయి. పైకి లేవబోతూ పిడికిలి బిగించి గ్లాకో మెడ పైన గట్టిగా గుద్దాడు. దెబ్బకు చిన్న శబ్దం కూడా చేయకుండా స్పృహ కోల్పోయాడు గ్లాకో.
అంతలో గోల గోలగా మాట్లాడుకుంటూ లూసీ, ఆమె కజిన్స్ వస్తున్న శబ్దం వినిపించింది.
చటుక్కున లేచి తనను కొట్టి పడేసిన మొద్దు లాంటి కర్రను అందుకుని తలుపు పక్కన నక్కాడు విజయ్.
అందరి కంటె ముందు వచ్చింది లూసీ. లోపలి సీన్ చూసి కెవ్వున అరిచింది. ’గ్లాకోని కొట్టి వాడు పారిపోయాడు’ అని అరిచింది.
ఆమె మాటలను విని ఏం జరిగిందో చూడడానికి అజాగ్రత్తగా లోపలికి అడుగు పెట్టాడు విన్సీ. అతని తో పాటూ మరో గద్ద ముక్కు వాడు కూడా ఉన్నాడు.
నిర్దాక్షిణ్యంగా చేతిలోని మొద్దుతో ఒక్కటి ఇచ్చాడు విజయ్. ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా, విన్సీ, గద్ద ముక్కు వాడు తలలమీద తగిలిన దెబ్బకు సైలంట్ గా అయిపోయారు. స్పృహ కోల్పోయి నేలమీద దబ్బున పడిపోయారు. చేతిలోని మొద్దుని ప్క్కన పడేసి లూసీని ఒక చేత్తో పట్టుకుని తన దగ్గరకు లాక్కున్నాడు. ఆమెను ఒడిసి పట్టుకుని ఆమె గొంతు దగ్గర తన చురకత్తిని పెట్టాడు. క్షాణాల్లో మాజిక్ లా అతని చేతుల్లో ప్రత్యక్షమైన ఆ కత్తిని చూసి కళ్ళు తేళవేసారు స్పృహలో ఉన్న ఆమె ఇతర కజిన్స్.
’లూసీ, ముందు కింద పడిన వాళ్ళ మొఖాల మీద నీళ్ళు కొట్టి వాళ్ళని లేపమను’ అన్నాడు విజయ్.
ఆ మాటలు విన్న ఆమె కజిన్స్ నీళ్ళు తెచ్చి కింద పడి ఉన్న వారి మొఖాల మీద కొట్టి వాళ్ళని మేలుకొలిపారు. తలలు తడుముకుంటూ బాధగా మూలుగుతూ లేచారు లూసీ కజిన్స్.
అందరూ లేచారు, తన చేతుల్లో బందీగా ఉన్న లూసీని చూసారు అని నిర్ధారించుకున్నాక మాట్లాడాడు విజయ్.
’నేను నిజంగా డాక్టర్ మార్సెల్లోని కాపాడడానికి వచ్చిన ఆఫిసర్ ని. అందుకే అనుక్షణం మార్సెల్లో వెంట తిరిగాను. ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడకు వచ్చి రోమ్ లో చేయాల్సిన అవసరం ఏముంది. ఆ కాన్ఫరెన్స్ లోనే ఏదైనా చేయగలైగే వాడిని కదా! నా మాట నమ్మండి. లేదంటే, ఇదిగో ఇప్పుడే మీకు నచ్చినట్లు నన్ను పొడిచేయండి’ అంటూ లూసిని విడిచి పెట్టి ఆమె చేతులకు తన చేతిలోని చురకత్తిని జాగ్రత్తగా అందించాడు.
అతని చేతిలోని కత్తి తన చేతుల్లో పెట్టిన అతని వైపు, ఆ చురకత్తి వైపు మార్చి మార్చి చూసిన లూసీ, ఆ కత్తిని పారేసి విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని హగ్ చేసుకుని భోరుమంది.
ఆమెను ఊరడించాడు విజయ్ తల నిమురుతూ.
’మరి ఎవరు ఇలా చేసారు మా అంకుల్ ని’ అంది కళ్ళు తుడుచుకుంటూ.
ఆమె కజిన్స్ మొఖాల్లో కూడా తన మీద కోపం, పగ పోయి, సామరస్య భావాలు కనబడే సరికి ఊపిరి పీల్చుకున్నాడు విజయ్.
’అది కనుక్కోవడమే నా పని. డాక్టర్ మార్సెల్లోకి ఈ గతి పట్టించిన వాళ్ళను ప్రాణాలతో వదలను’ అని భీకర ప్రతిజ్ఞ చేసాడు.
’అవును, అవును’ అంటూ అతని ప్రతిజ్ఞకు ప్రతిస్పందించారు లూసీ, ఆమె కజిన్స్.
’సరే, నేను ముందుగా రోమ్ కి చేరుకోవాలి’ అన్నాడు విజయ్.
’అలాగే. నా కార్ లో తీసుకు వెళ్తాను, నేను. మనం ఇప్పుడే బయల్దేరుదాం’ అంది లూసీ.
’నువ్వెందుకు?’ అన్నాడు విజయ్.
దెబ్బ తిన్న ఆడ బెబ్బులి లా చూసింది లూసీ. ’మా అంకుల్ కి ఇలా చేసిన వాడి మీద పగ తీర్చుకోవడం నా కర్తవ్యం’ అంది కీచు గొంతు తో అరుస్తూ.
’అవును, అవును’ అంటూ వంత పాడారు ఆమె కజిన్స్.
గట్టిగా నిట్టూర్చి, ’సరే’ అన్నాడు విజయ్ విధిలేక.
***