మేధో హత్యలు part 4
This is Fourth part of Spy Suspense Thriller Novel . Written by Samrat. Very Gripping Novel. Un-pu-downable.
మేధో హత్యలు - 4
(స్పై సస్పెన్స్ థ్రిల్లర్ )
హోటల్ గదిలోనుంచి బయటకు వెళ్ళబోతూ జూకీ వైపు ఒక సారి చూసాడు విజయ్. ఆమె కట్టివేయబడి ఉన్నా సౌకర్యంగానే కూర్చుని ఉందని రూఢి చేసుకుని, చిన్నగా నవ్వుతూ బయటకి నడిచాడు. డోర్ వేసి, దానికి "డోంట్ డిస్టర్బ్" బోర్డ్ పెట్టేసి ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఆ వేళప్పుడు అతను బయటకు వెళ్తున్నా అతన్ని పెద్దగా పట్టించుకున్నవారెవరూ లేరు. సెక్యూరిటీ వాడు హడావుడి లేకుండా ఠీవిగా వెళ్తున్న విజయ్ వైపు నిరాసక్తంగా చూసాడు. పార్కింగ్ లో ఉన్న జూకీ కార్ తీసుకుని అల్టోన్ వైపు పరుగులు తీయించాడు విజయ్.
"వీ" నది లండన్ కి సౌత్ లో ఉంది. విజయ్ ఉన్న హోటల్ కి అక్కడకు పగటి పూట వెళ్ళాలంటే ఎంత లేదన్నా రెండు గంటలు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రాత్రి పూట అతనికి అంత సమయం పట్టదు అనిపించింది అక్కడక్కడా కనిపిస్తున్న నైట్ ట్రాఫిక్ చూస్తుంటే.
విజయ్ ఓల్డ్ బ్రాంప్టన్ రోడ్ లో కార్ ని వేగంగా నడుపుకుంటూ పోయాడు. కెన్సింగ్టన్, చెల్సియా లు దాటుకుంటూ వెళ్తూ తన పొజిషన్ ని ఒక సారి సింహావలోకనం చేసుకున్నాడు. అప్పటికీ అతనికి తను వెళ్తున్నది నిజంగా స్విఫ్ట్ కి సహకారం అందించి సహాయం పొందాలనుకున్న వ్యక్తి ని కలవడానికేనా? లేక స్విఫ్ట్ టాప్ ఏజెంట్లను లేపెయ్యడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్ర లో పడడానికా? అన్నది ఇథమిత్థంగా తేలలేదు.
రాయల్ డాక్స్ లో తనను మట్టు పెట్టడాణికి ప్రయత్నించిన వారు తనతో ఫోన్ లో మాట్లాడిన అజ్ఞాత స్త్రీ పంపిన మనుషులా, లేక వాళ్ళు ఆమెకు కూడా శత్రువులేనా?
ఏది ఏమైనా ఆరు గంటల వేళలో ఆమె చెప్పిన చోట ఉండి తేల్చుకోవడమే అసలు పద్ధతి అని తెలుసు అతనికి. ఎంత సేపు తర్కించుకున్నా, ఎన్ని విధాలుగా ఆలోచించినా అసలు విషయం ఏమిటి అన్నది తెలిసే అవకాశం లేదు. ఆలోచనలలో ఉండగానే అతను ఆల్టన్ కి చేరువయ్యాడు.
ఆ సమయానికి ఆల్టన్ గాఢ నిద్రలో ఉంది. ఏ ఇంట్లోనూ లైట్స్ వెలుగుతూ లేవు. స్ట్రీట్ లైట్స్ తప్ప మరో వెలుతురే కనబడలేదు విజయ్ కి. ’వీ’ నది ఒడ్డుకి దగ్గరలో కార్ ని పార్క్ చేసి కిందికి దిగాడు విజయ్. నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది ’వీ’ నది. అది మరీ అంత పెద్ద నది కాదు. వెడల్పు మరీ పెద్దది గా లేదు. కానీ నదిని చూడగానే చాచి పెట్టి కొట్టినట్లు ఒక ఆలోఅచన వచ్చింది అతనికి. ఆమె ఎందుకు నది లో మీటింగ్ పెట్టిందో అప్పుడు అర్థం అయింది.
అంతేకాదు మొదటిసారిగా ఆమె నిజమేనేమో అనిపించింది అతనికి. ఆమె తను ఇలా స్విఫ్ట్ కి ఏదో ముఖ్యమైన విషయం గురించి సమాచారం అందించబోతున్న విషయం శత్రువులు పసిగడతారని ఆమెకు కూడా అనుమానం ఉండబట్టే, ఎవరికీ కనబడకుండా, ఎవరూ తమ మాట్లను వినకుండా ఉండేలా ఇలాంటి ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకుంది అనుకున్నాడు.
అలా అనిపించడానికి కారణం దట్టంగా అలుముకుని ఉన్న పొగమంచు. ఎవరైనా మూడు అడుగుల దగ్గరకి వస్తే గానీ కనబడనంత దట్టంగా ఉంది మంచు.
ఒడ్డు వెంబడే నడవడం మొదలు పెట్టాడు విజయ్. నది వంపులు తిరుగుతూ సాగుతోంది. కన్ను కానని ఆ పొగ మంచులో పొరపాటున నదిలోకి నడిచే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా నడిచాడు నది ఒడ్డున.
కొద్ది దూరం అలా జాగ్రతగా నడిచాక బోట్ కి కట్టిన తాడు కనబడింది. ప్రమాదవశాత్తు దాన్ని తన్నుకుని పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆ తాడు ముడి తగిలించి ఉన్న పోల్ నుంచి వేరు చేసి దాన్నే పట్టుకుని మెల్లగా నది వైపు నడిచి ఆ బోట్ లోకి ఎక్కి కూర్చున్నాడు విజయ్.
బోట్లో ఆ తాడుని చుట్ట చుట్టి పెట్టి బోట్ అంచులకు ఉన్న సైడ్ రింగులలో పెట్టి ఉన్న తెడ్లను నీళ్ళల్లోకి దించి మెల్లగా తెడ్లు వేస్తూ ఆ బోట్ నడపసాగాడు విజయ్.
చల్లటి గాలి నుంచి ప్రొటెక్షన్ ఇస్తున్న తన కోటుని చూసి సంతోషించాడు గాని ముందు ముందు అదే తనకు భారం అవుతుందని ఎంత మాత్రమూ ఊహించలేకపోయాడు.
ఆకాశం నలుపు రంగు కోల్పోయింది. తూర్పు దిక్కు కొద్దిగా కాంతివంతం అవుతున్నట్లు, వేకువ ముందురంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనబడింది ఆకాశం. అయినా ఆ మంచు మాత్రం దట్టమైన తెరలాగానే ఉంది. కనీసం ఆమెను కలిసే సమయానికైనా కాస్త పలచవడితే బాగుంటుంది అనుకున్నాడు విజయ్.
నీళ్ళల్లో తెడ్లు చేసే చిరు సవ్వడి తప్ప మరే విధమైన శబ్దము లేని ఆ నదిలో ఒంటరి ప్రయాణం ఒక రకమైన డిప్రెషన్ ని కలుగ చేస్తూ అతని మెదడుని మెల్ల మెల్లగా అలుముకోచూసింది. తలవిదిలించి, కనులను చిట్లించుతూ ఆ మంచుని చీల్చుకుని వచ్చే వెలుగు కిరణాల కోసం చూసాడు విజయ్. లీలగా ఒక బ్రిడ్జి కనిపించింది. దగ్గరవుతున్న కొద్దీ దాని స్వరూపం కొద్ది కొద్దిగా వివరంగా తెలిసింది. ఆమె చెప్పిన రాతి బ్రిడ్జ్ అది.
ఆ రాతి బ్రిడ్జి కింద నుంచి వేగం పెంచుతూ బోట్ ని నడిపాడు విజయ్, త్వర త్వరగా తెడ్లు వేస్తూ!
గమ్యానికి దగ్గరకు వచ్చాను అన్న ఆత్రుత ఒక వైపు, ఏదో జరగబోతుంది అన్న అలజడి మరో వైపు విజయ్ ని స్థిమితంగా ఉండనివ్వలేదు. కళ్ళు చించుకుని ఆ మంచుతెరలను చీలుస్తూ చూడడానికి ప్రయతింఛాడు. ఒక అరమైలు దూరం దాటాక మరో బ్రిడ్జి స్వరూపం లీలగా గోచరించింది. దగ్గరవుతున్న కొద్దీ అతని మనసులో ఏదో అనీజీనెస్స్ అలుముకోసాగింది. ఒక విధంగా ఈ మంచు తనను కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అన్న ఆలోచనే అతన్ని కొంచెం నిబ్బరంగా ఉంచింది.
దగ్గరవుతున్న కొద్దీ ఆ బ్రిడ్జి రాతితో చేసినది కాదని అది చెక్క వంతెన అని అర్థమయింది అతనికి. అది కూడా దాటి ముందుకి ప్రయాణిస్తూ ఉంటే నది మలుపు తిరిగింది. ఆ మలుపులోకి తిరగగానే హఠాత్తుగా అతని ఎదుట ప్రత్యక్షమయింది ఆ రాతి బ్రిడ్జి - ఒక భూతంలాగా!!
దాన్ని చూస్తూనే తను సంకేత స్థలానికి వచ్చినట్లు గుర్తించాడు విజయ్. ఆ బ్రిడ్జి దాటి తన బోట్ ని నిలబెట్టి వాచ్ చూసుకున్నాడు. మరో రెండు నిముషాలలో ఆరు కాబోతుంది.
స్విఫ్ట్ తో అప్పాయింట్‍మెంట్ ఫిక్స్ చేసుకున్న స్త్రీకి సమయపాలన చాలా ఇష్టమని ఆ సరికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాడు విజయ్. అతని చేతులు తెడ్లు వేసి వేసి లాగుతున్నాయి. అయినా అతని కండరాలు పూర్తి అలర్ట్ గా ఉన్నాయి. వేటాడటానికి వెళ్ళిన బ్లాక్ పాంథర్ లా చీకటి లాంటి ఆ మంచు తెరల మధ్య కదలక మెదలక జరగబోయే దాని కోసం, చాలా మెల్లగా శ్వాసిస్తూ, ఎదురు చూడసాగాడు.
అతను ఎంతో సేపు ఎదురు చూడవలసిన అవసరం కలగలేదు. అతనికి ఎదురు దిశలో ఏదో బోట్ తెడ్లు వేస్తూ దగ్గరవుతున్న శబ్దం వినవచ్చింది. అసంకల్పితంగా అతను తన హ్యూగోని తడుముకున్నాడు. చల్లగా అతనికి తగిలిన లోహపు మారణాయుధం అతనికి ’తోడుగా నేను ఉన్నాను’ అని అన్నట్లు అనిపించింది.
కనులు చిట్లించి తన వైపు వస్తున్న బోట్ వైపు దృష్టి సారించాడు విజయ్. అతనికి కొద్ది దూరంలో నిలబడింది బోట్. లీలగా ఆ బోట్ నడుపుతున్న వ్యక్తి కనిపించింది.
’టైమ్ కి వచ్చినందుకు థాంక్స్’ అంది ఆమె. ఆ వాయిస్ ఫోన్ లో ఉన్నట్లే ఉంది. ఇంకాస్త గంభీరంగా అనిపించింది. ఎవరో పెద్ద పొజిషన్ లోఓ ఉన్న అధికారి అనుకున్నాడు విజయ్.
మౌనంగా ఆమె వైపు చూసాడు, ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలి అన్నట్లు.
’నా దేశానికి సంబంధించిన ఏ రహస్యమూ నేను మీకు చెప్పను. ఆ విషయాల గురించి నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు’ అంది ఆమె.
’అలాగే’ అన్నాడు విజయ్. వేరే దేశంలో ఆశ్రయం కోరేవారు సాధారణంగా తమ దేశంలో ఉన్న ప్రభుత్వాలతో తీవ్ర విభేధాలు ఉన్నవారు గాని, ప్రబల శత్రువులు ఉన్న వారు గాని అయి ఉంటారు అని అతనికి తెలుసు. అటువంటి వారికి రాజకీయంగా ఆశ్రయం కావాళ్సి వస్తుంది పరాయి దేశంలో. అయినా తన దేశానికి సంబంధించిన రహస్యాలను చెప్పను అని అంటుంది అంటే ఆమెకు దేశంతో బంధం బాగున్నా, దేశ్ధినేతలతోనో, ఆ స్థాయికి చెందిన మరెవరితోనో ప్రబల శత్రుత్వం ఏర్పడింది అనుకున్నాడు.
’అప్పటికీ వాళ్ళకి చెప్పాను, అవి తప్పు పద్ధతులు అని. కానీ నా మాట వినలేదు. ఇదే పద్ధతి కనుక ముందు ముందు అలాగే జరిగితే ప్రపంచ భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది’ అంది ఆమె. ఆ గొంతులో ధ్వనించిన బాధకు చలించిపోయాడు విజయ్. ఈమె ఎవరో తెలియడం లేదు. ఏదో దేశానికి చెందిన విదేశాంగ శాఖకు చెందిన వ్యక్తి అయిఉండే అవకాశం తోసిపుచ్చలేము అనుకున్నాడు. తనకు తెలిసిన దేశాల విదేశాంగ వ్యక్తులు మదిలో మెదిలారు. లండన్ లో ఉన్న ఇబ్బందికర దేశాలకు చెందిన వారి పేర్లు చకచకా అతని మస్తిష్కంలో మెరిసాయి. కనీసం అరడజన్ మంది స్త్రీల పేర్లు గుర్తుకి వచ్చాయి. కానీ ఈమె మాత్రం వారిలో ఒకరు అయ్యే అవకాశం లేదు అనుకున్నాడు.
’నా షరతులు అంగీకారమైతే నేను మీకు ...’
ఒక్క సారిగా విజయ్ వెన్నెముకలో చల్లటి గాలి కదిలి అతన్ని వణికించింది. ప్రమాదాలను ముందే గుర్తించే అతని మానసిక శక్తి అతన్ని హెచ్చరించడంతో ఆగలేదు. ఉన్నట్లుండి బోటు ముందు భాగాంలోకి డైవ్ చేసాడు.
’టప్’ మనే శబ్ధం లీలగా అతని చెవులకు సోకింది. కనుకొనల నుంచి తనతో అంతవరకు మాట్లాడుతు మసక మసకగా కనిపిస్తున్న స్త్రీ రూపం నెల్లగా ఒక పక్కకు ఒరిగి పోతూ ఉండడం కనిపించింది. మరొక ’టప్’ శబ్దం వినిపించింది అతను బోట్ ఫ్లోర్ మీదికి పూర్తిగా పడిపోతుంటే! ఆ రెండో టప్ అప్పటివరకు అతను ఆనుకుని కూర్చున్న చెక్క బోర్డ్ కి రూపాయి కాసంత రంధ్రం పెట్టింది.
ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పడిన చోటినుంచి సైడ్ జంప్ చేస్తూ బోట్ కి సమాంతరంగా బాడీని లేపి నీళ్ళల్లోకి జారాడు విజయ్. అతను చల్లటి ’వీ’ నదిలో మునగటం అతని బోట్ అంచుకి బుల్లెట్ తగిలి రేగిన చెక్క ముక్కలు గాలిలోకి లేచి అతను నీళ్ళల్లో పడిన చోటనే పడి తేలుతూ ప్రవాహంలో అటూ ఇటూ ఊగటం మొదలు పెట్టాయి.
నీళ్ళల్లోకి శరీరాన్ని దింపుతూ మొట్ట మొదటి సారిగా తన కోటు తనకు బయట ఉన్నప్పుడు రక్షణ ఇచ్చినా ఈ నీళ్ళల్లో తనకు ప్రతిబంధకంగా మారబోతుంది అని గ్రహించాడు విజయ్.
బుల్లెట్స్ వచ్చిన దిశను గుర్తించి వ్యతిరేక దిశలో నీటి అడుగునే ఉంటూ ఈదాడు విజయ్. బ్రిడ్జి కిందకు చేరి తలను పైకి ఎత్తి తనను ఎటాక్ చేయడానికి వచ్చే వ్యక్తి ఎటునుంచి వస్తాడని ఊహించాడో అటే చూసాడు. క్షణంలో పదో వంతు ఆ వ్యక్తి కనిపించాడు. సన్నగా రివటలా ఉన్నాడు. టైట్ గా ఉన్న రబ్బరైజ్డ్ డ్రెస్ ధరించి ఉన్నాడు. అతని చేతులో బారుగా ఉన్న రైఫిల్ తన వైపుకి తిరిగే సరికి మళ్ళీ నీటిలో మునిగి నేరుగా ఆ షూటర్ వైపుకే ఈదాడు విజయ్.
నీళ్ళల్లో నిలబడి, తను మళ్ళీ తల పైకెత్తితే షూట్ చేయాలని చూస్తున్న ఆ షూటర్ కాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక్క సారిగా అతని కాళ్ళు పట్టుకుని లాగాడు విజయ్. అతని చేతిలోని రైఫిల్ మరో సారి పేలింది కానీ, బుల్లెట్ ఆకాశం వైపుకి దూసుకెళ్ళింది. జరిగింది గమనించి రైఫిల్ ని వదిలి పిడికిళ్ళకు పని చెప్పాడు ఆ షూటర్.
అతని అథ్లెటిక్ బాడీకి ఉన్న పంచింగ్ పవర్ కి విజయ్ లంగ్స్ లో ఉన్న గాలి ఒక్క సారి గా బయటకి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. అతని చేతులకు అందకూడదు అనుకున్నాడు.
ఆ షూటర్ కి దూరంగా ఈదడానికి ప్రయత్నించాడు విజయ్. అతనికి తనకి మధ్య దూరం పెంచడానికి ప్రయత్నించాడు. కానీ నీటిలో యుద్ధానికి అనుకూలంగా పనికి వచ్చే డ్రెస్ వేసుకున్న ఆ షూటర్ దే పై చేయి అయింది.
తడిచి బరువెక్కిన తన సూట్ ని చూసుకుని, చేతులకు ఇనప గొలుసులు వేసుకుని ఈదుతున్నట్లు ఫీలయ్యాడు విజయ్. మోచెయ్యి మడిచి తన వీపు మీద పొడిచిన ఆ షూటర్ దెబ్బను తప్పించుకోవడానికి విఫలయత్నం చేస్తూ మళ్ళీ తిట్టుకున్నాడు తన సూట్ ని.
ఊపిరి బిగబట్టి నదిలో లోతుకి వెళ్ళిపోయాడు. వాడు అది గమనించి వెంట పడే లోగా నాలుగంటే నాలుగు బారలు వేసి చటుక్కున ఉపరి తలం పైకి వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుని లంగ్స్ ని నింపుకున్నాడు. ఈదుకుంటూ తన దగ్గరకు వచ్చిన ఆ షూటర్ చేతులకు అందకుండా నీళ్ళలోకి మునక వేసి వాడి మెడ చుట్టూ చేతులు బిగించి నీటి లోతుకి వెళ్ళిపోయాడు విజయ్.
తనలాగా ఎక్కువ ఊపిరి తీసుకుని లంగ్స్ నింపుకునే సావకాశం అతనికి చిక్క లేదని విజయ్ కి తెలుసు. తన కోటుతో నీళ్ళల్లో ఈదుకుంటూ ఆ షూటర్ ని ప్రతిఘటించడం వలన ప్రయోజనం ఉండదు అనిపించింది అతనికి. అందుకే శత్రువుని సత్వరమే నిర్జించడానికి తన వ్యూహాన్ని సమయస్ఫూర్తితో మార్చుకున్నాడు.
చేతులతో విజయ్ ని కొట్టడానికి ప్రయత్నించాడు ఆ షూటర్. కానీ లోతైన ఆ నీళ్ళల్లో అతని పంచింగ్ పవర్ బాగా తగ్గిపోయింది. కాళ్ళు విదిలిస్తూ ఈది పైకి వెళ్ళడానికి ప్రయత్నించినా తడిచిపోయి బరువెక్కిన విజయ్ సూట్ అతన్ని నిరోధించింది. మొదట తనకు ప్రతిబంధకమైన తన సూట్‍ని అనుకూలంగా ఉపయోగించుకోవడంలో కృతకృత్యుడయ్యాడు విజయ్.
విజయ్ కి ఊపిరి తీసుకోవాల్సిన అవసరం అనిపించి గుండెల్లో మంటలు పుట్టే సమయానికి ఆ షూటర్ ప్రతిఘటన పూర్తిఅయిపోయింది. ప్రాణాలు వదిలి రబ్బరు బొమ్మలా వేలాడిపోయాడు. నిర్జీవంగా మారిన అతని దేహాన్ని వదిలి నీటి ఉపరితలానికి చేరుకున్నాడు విజయ్.
గట్టిగా ఊపిరి పీల్చుకుని తనను కలవడానికి వచ్చిన స్త్రీ దేహం పడి ఉన్న బోట్ వైపు ఈదుకుంటూ వెళ్ళాడు. బుల్లెట్ సూటిగా కనుబొమ్మల మధ్య రంధ్రం చేయడంతో క్షణాల్లో మృతి చెందింది ఆమె. ఆమె శరీరం అలా పక్కకు వాలిపోయి ఉంది. ఆమెను కాపాడలేకపోయినందుకు క్షణాకాలం చింతించాడు విజయ్.
ఆమె కోటు జేబులు వెతికాడు. ఆమె ఐడి మీద మరియా కలెస్నికావా అనే పేరు కనిపించింది. ఆ ఐడి ని కోటు జేబులో వేసుకుని ఒడ్డు వైపుకి బోట్ ని తెడ్లు వేసి నడిపి ఒడ్డుకి చేరుకున్నాడు విజయ్. నీటి మీద తేలుతూ ఒడ్డుకి చేరిన షూటర్ డ్రెస్ లో ఒక ఫోన్ ఉంది, కానీ దాన్ని ముట్టుకోలేదు విజయ్. ఆ ఫోన్ ద్వారా తన గురించి తెలుసుకోవడమే కాదు, తన పైన విషప్రయోగాలు చేయవచ్చు, తనను ఎక్స్‍ప్లోడ్ చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు ఈ నాటి టెక్నాలజీతో అని అతనికి తెలుసు. మనవి కాని ఎటువంటి గాడ్జెట్స్ ని దగ్గరకు తీసుకోవడం అంటే దారే పోయే పాముని కెలికి మెడ చుట్టూ చుట్టుకోవటం తో సమానం అని అతని నమ్మకం!
స్విఫ్ట్ ని ఆశ్రయం కోరిన వ్యక్తి ని శత్రువులు హతం చేసేసారు తన కళ్ళ ముందే అన్న వాస్తవం, ఆమె తమకు చెప్పాలనుకున్న విషయాలు చాలా ముఖ్యమైనవి అన్న విషయాన్ని నొక్కి చెప్పినట్లు అయింది విజయ్‍కి.
బల బీర్ ఊహించినట్లు సైంటిస్టుల మేధోహత్యలకు సంబంధించిన వివరాలను ఆమె అందచేయాలి అనుకున్నట్లయితే తను చాలా విలువైన సమాచారాన్ని కోల్పోయాడు. రాయల్ డాక్స్ లో చాచిన ముగ్గురు, ఈ వీ నదిలో హతమయిన షూటర్ తనకు ఎలాంటి క్లూస్ ఇవ్వకుండానే పోయారు. సమాచారం ఇవ్వవలసిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయింది. స్విఫ్ట్ కంటే వేగంగా శత్రువు పని చేస్తున్నాడు అన్న ఆలోచన వచ్చేసరికి విసుగ్గా తల విదిలించాడు విజయ్.
తడిచిన కోటుని పిండుకుని దులిపి మళ్ళీ వేసుకున్నాడు. చలికి వణుకుతూ గబగబా నడవడం ప్రారంభించాడు. వాచ్ లో సమయం ఆరున్నర చూపిస్తోంది. వేగంగా బడుస్తూ తను కార్ పార్క్ చేసిన చోటుకి చేరుకున్నాడు విజయ్.
ఇప్పుడు మిగిలి ఉన్నది తన హోటల్ గది లో ఉన్న జూకీ ఒక్కతే! ఆమెకు డబ్బు ఇచ్చి తన దగ్గరకి పంపిన వాళ్ళు ఎవరూ అన్నది ఆమె బాయ్ ఫ్రెండ్ కి తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు మిగిలిన లీడ్ అదొక్కటే. ఆ విషయం పూర్తిగా తేలితే గానీ ఈ కేసు ఒక కొలిక్కి రాదు. తనకు బలబీర్ అప్పచెప్పిన పని ఆమె చెప్పే సమాచారం తీసుకు రమ్మని. కానీ ఇప్పుడు ఆమె మరణ వార్తని బలబీర్ కి చెప్పాల్సి వస్తుంది. ఇంత పొద్దున్నే చెప్పాల్సిన శుభవార్త కాదు అది.
కార్ లో కూర్చుని తన హోటల్ చేరుకోవడానికి దాన్ని ఉరికిస్తూ అనుకున్నాడు విజయ్. సోఫీ ఎలా ఉందో? ఏం చేస్తూ ఉందో? మళ్ళీ తనతో మాట్లాడటానికి ఇష్టపడుతుందో లేదో? అని.
ఆలోచనలు దారి తప్పుతున్నట్లు అనిపించి బలవంతంగా జూకీ మీదికి, ఆమె బాయ్ ఫ్రెండ్ మీదికి తన ఆలోచనలు మళ్ళించుకుంటూ హోటల్ చేరుకున్నాడు.
***