నీ కోసం 3
This is third part of a thrilling and Romantic serial written by Pasupuleti Satya Sreenivas. Published in Sahari Digital Weekly.
నీ కోసం 3
n పసుపులేటి సత్య శ్రీనివాస్
ఆఫీస్‍కి రెడీ అవసాగింది ప్రణతి. చిన్నప్పటి నుండీ కూడ అక్కలు వాడిన డ్రెస్సులే వేసుకునేది. దానికే ఆమెకి చాలా ఉక్రోషంగా ఉండేది. ఆ గదిలోనుండి తెచ్చి బెడ్ మీద పెట్టిన బట్టల వైపు చూసింది. ఈ బట్టలు ఎవరివో బయటివాళ్లవి. వాళ్ళు ఎవరో ఎలాంటివారో తెలియదు, వాళ్ళు వాడి వదిలేసిన బట్టలు ఇప్పుడు ఆమె వేసుకుంటోది. కానీ ఇప్పుడు ఆమెలో ఉక్రోషం లేదు. జైలు జీవితం ఆమెకు నేర్పిన చాలా విషయాల్లో సర్దుకుని పోవడం ఒకటి. ఎంతో హుషారుగా ఉండే ఆమె ఇప్పుడు స్థబ్దుగా ఉంటోంది. బెస్ట్‍ఫ్రెండ్ అమృత్ గుర్తుకి వచ్చాడు. మనసులో కలిగిన బాధావీచిక కళ్ళల్లో నీటిబొట్టై నిలిచింది ప్రణతికి.
ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు మూడేళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ రోజు... డిశంబర్ ముప్పై ఒకటి! కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చాలా గ్రాండ్ పార్టీ జరిగింది. చాలా మంది ఫ్రెండ్స్ గేదర్ అయ్యారు. అంతా యూత్. అరుపులు, కేకలు, సంతోషం, సంరంభం పార్టీ చాలా ఉత్సాహంగా జరిగింది. చాలా మంది డ్రింక్ చేసారు, అందరూ డాన్స్ చేసారు. కవ్వింతలతో, కేరింతలతో న్యూ ఇయర్ ఈవెంట్‍ని సెలబ్రేట్ చేసుకున్నారు.
అంతగా తాగిన తరువాత కారు నడపడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. అది ఎలా మొదలైందో, కారు ఎవరు డ్రైవ్ చేసారో ఆమెకు కొంచెం కూడా గుర్తు లేదు. ఆ దుర్ఘటనలో ఆమె ప్రియస్నేహితుడు అమృత్ చనిపోయాడు.
కళ్ళు తెరిచేసరికి ప్రణతి హాస్పిటల్‍లో ఉంది. ఏం జరిగిందో ఎలా జరిగిందో ఆమెకి ఏమీ తెలియదు. ఆమె పై నేరం మోపబడింది. ఏమీ వాదించలేదు ప్రణతి. వాళ్ళు చెప్పినవన్నీ ఒప్పుకుంది. తన ప్రియమిత్రుడు చనిపోయాక దేవుడు నిర్దయుడు అనిపించింది. తన సంతోషాలను దూరం చెయ్యడమే ఆ దేవుడి పని అని బాధపడింది. ఎలాంటి ప్రతిఘటన చెయ్యకుండా చట్టం ముందు తల వంచింది. న్యాయస్థానం ఆమెకు మూడేళ్ళ జైలు శిక్ష వేసింది. ఆ మూడేళ్ళు పూర్తయ్యి ఇప్పుడు సాధారణ జీవితం ఆరంభించింది ప్రణతి.
అమృత్‍ని కోల్పోయిన బాధ ఒకటయితే, తన కుటుంబం తన పట్ల ప్రదర్శించిన వైఖరికి ప్రణతి మనసు బాగా గాయపడింది. అనుకోని ఆపద వాటిల్లినప్పుడు కూతురిని ఆదరించకపోగా, తమకు సంబంధం లేనట్టే వదిలెయ్యడంతో ప్రణతి తీవ్రమైన ఆవేదనకి లోనయింది.
ప్రణతి తనలో తాను కుంచించుకుపోయింది. ’మనసుకి దగ్గరగా వచ్చిన స్నేహితుడు దూరమయ్యాడు. చిన్నప్పటి నుండీ ప్రేమగా చూడకపోయినా, కన్నబిడ్డ ఇటువంటి పరిస్థితిలో ఉంది అని కూడా నా కుటుంబసభ్యులు అనుకోలేదు. వాళ్ళకి నేను అక్కర్లేదని వాళ్ళు డిసైడైపోయారు. నేనే వాళ్ళ కోసం ప్రాకులాడుతున్నాను’ అనుకుంటూ చాలా నెలలు వాళ్ళెవరైనా వచ్చి కలుసుకుంటారేమో అని ఎదురుచూసేది.
రానురాను ఆమెకి అర్ధమైపోయింది, ఆమె ఇంట్లోవాళ్ళు అమెని శాశ్వతంగా వదిలేసారని. గుండెని రాయిగా మార్చుకుంది. చిన్న చిన్న భావాలకి ఆమె మనసు స్పందించడం మానేసింది. ఆ మూడేళ్ళు చాలా ఒంటరితనాన్ని అనుభవించింది. తనకు తానే తోడు అని నిర్ణయించుకుని, తనలోతను సంభాషించుకునేది తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. జైల్ వార్డెన్ సుశీల చదువుకోమని ప్రోత్సహించడంతో జైల్‍లోనే కంప్యూటర్ కోర్సెస్ కూడా నేర్చుకుంది.
ఆ బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడింది. బాగానే ఉన్నాననుకుని షూస్ కూడా వేసుకుంది ప్రణతి. అవి కొంచెం లూజుగా ఉండడం వల్ల నడవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గదిలోనే అటూ ఇటూ నడిచి చూసింది వాటితో నడవడం అలవాటు అవుతుందని. కొంచెం ఫరవాలేదనిపించాక రూమ్ నుండి బయటికి వచ్చి ఆఫీసుకి బయలుదేరింది ప్రణతి.
ఆఫీసుకి వెళ్ళిన ప్రణతి షీలాని కలిసింది. షీలా ఆమెకి ఓ కఠినమైన జైల్ సూపరింటెండెంట్‍లా అనిపించింది. ప్రణతిని చూసిన వెంటనే ఆమె ఆఫీసులో ఎంత జాగ్రత్తగా మెలగాలో భయపెడుతున్నట్లుగా చెప్పింది షీలా. ’రోజూ టైమ్‍కి రావాలి. లేటయినా, లీవ్ పెట్టినా సేలరీలో కటింగ్ అయిపోతుంది. నీ పై అధికారులు చెప్పే పనులన్నీ చెయ్యాలి. నిజాయితీగా ఉండాలి. నిన్ను అనుక్షణం నేను కనిపెడుతూనే ఉంటాను. వీటిలో ఏం తేడా వచ్చినా నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది’ అని చెప్పింది వాయిస్‍లో సీరియస్‍నెస్ మిక్స్ చేసి. షీలా ఏం చెప్పినా ’యెస్ మేడమ్’ అంటూ ఆన్సర్ చేసింది ప్రణతి.
’ఏమేం చెయ్యకూడదో చెప్పారు బాగానే ఉంది! ఇప్పుడు ఏమేం చెయ్యాలో కూడా చెపితే బావుండును. ఇక్కడి నుండి వెళ్ళి పని చూసుకోవచ్చు’ అనుకుంది ప్రణతి. ఆమె ఆలోచన అర్ధమయినట్లుగా ఆఫీసులో ఏమేం చెయ్యాలో చెప్పింది షీలా. అదే కాకుండా ఎప్పుడు ఏపని అదనంగా చెప్పినా చెయ్యవలసి ఉంటుందని, అందుకు పేమెంట్స్ సెపరేట్‍గా ఏమీ ఉండవని కూడా చెప్పింది ఆమె. అన్నిటికీ సరేనని చెప్పి తనకి కేటాయించిన సీట్ వైపు కదిలింది ప్రణతి.
ఒక్క క్షణం ఆమెకి జరుగుతున్నదంతా నిజమేనా అన్న ఆలోచన కలిగింది. ఆమె తనని తాను ఒకసారి చూసుకుంది. మేరీ ఆంటీ దగ్గర డ్రెస్, షూస్ తీసుకుని వేసుకుని ఇంత పెద్ద ఆఫీసుకి రావడం, ఇక్కడ షీలా అనబడే లేడీ హిట్లర్ ఇప్పటివరకూ ఇచ్చిన క్లాస్ వరకూ అంతా నిజమే. వదులుగా ఉన్న ఈ షూలు నడవడానికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాయో అంత నిజం అనుకుంది ప్రణతి. తనకి అవి దొరకడమే గొప్ప విషయం, ఇప్పుడు ఈ ఉద్యోగం దొరికింది కాబట్టి తన సమస్యలు కొంతవరకూ తగ్గుతాయని ప్రణతి మనసులో ఆశ కలిగింది.
షీలా ప్రణతిని అబ్జర్వ్ చేస్తూనే ఉంది. తొమ్మిది గంటలకి ఆఫీసుకి వచ్చినప్పటి నుండి పది గంటల వరకూ ఆమెకి అప్పచెప్పిన పనులన్నీ ఫాస్ట్‍గానూ, పెర్‍ఫెక్ట్‍గానూ చేసిన ప్రణతి మీద సదభిప్రాయం కలిగింది ఆమెకి. ప్రణతిని తనకి అసిస్టేంట్‍గా ఉంచుకుందామని అనుకుంది ఆమె. ప్రణతిని పిలిచింది తన దగ్గరికి. షూస్ వదులుగా ఉండడంతో పట్టి పట్టి నెమ్మదిగా నడుస్తున్న ప్రణతిని చూసి తన మీద విధేయతతో ఆమె అలా నడిచి వస్తోందనుకుని తృప్తి పడింది షీలా.
’ఈ రోజు బిజినెస్ మీటింగ్ ఉంది. బాస్, బోర్డ్‍మెంబర్స్, క్లయింట్లు అందరూ కలిపి పన్నెండు మంది ఉంటారు. మీటింగ్ పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది. నువ్వు టెన్‍థర్టీకి మీటింగ్ హాల్‍లోకి వెళ్ళి ఒక్కసారి సిటింగ్ అరేంజ్‍మెంట్స్ చెక్ చెయ్యి. వాటర్ బాటిల్స్ పెట్టు. మీటింగ్ స్టార్ట్ అయిన అరగంటకి నువ్వు వాళ్ళకి కాఫీకి సెర్వ్ చెయ్యాలి. కిచెన్ స్టాఫ్ నీకు కావలసినవన్నీ ఇస్తారు. అవి తీసుకుని నువ్వు మీటింగ్ హాల్‍లోకి వెళ్ళి సెర్వ్ చేసి రావాలి. అర్ధమైందా!’ అంది షీలా. తను ఏం చెయ్యాలో బాగా అర్ధం చేసుకుంది ప్రణతి.
పదిన్నరకి మీటింగ్ హాల్‍లోకి వెళ్ళింది. హాల్ ఖాళీగా ఉంది. ఒక్క పెర్సన్ కూడా లేకపోవడంతో ఆమె తను చెయ్యవలసిన పనులు ప్రశాంతంగా చేసుకుని బయటికి వచ్చేసింది. సరిగ్గా పదకొండుగంటలకల్లా మీటింగ్ మొదలయింది.
ఇంకో అరగంటకి అందరికీ కాఫీ సెర్వ్ చెయ్యాలి. ప్రణతికి టెన్షన్‍గా అనిపించింది. ’మొదటిసారి కాబట్టి అలా ఫీలవుతున్నాను, కానీ కొన్ని రోజులకి ఈ ఆఫీస్, ఈ పనులు అన్నీ బాగా అలవాటయిపోతాయి’ అని అనుకుంది. టైమ్ పదకొండున్నర అయ్యేటప్పటికి కాఫీ కెటిల్, కప్స్, సుగర్ క్యూబ్స్ పెట్టుకుని ట్రాలీ రెడీ చేసుకుంది.
హాల్‍లోకి అడుగు పెట్టేముందు ఆమె మనసు కొద్దిగా ఉద్వేగానికి లోనయ్యింది. లూజుగా ఉన్న షూలను మేనేజ్ చేసుకుంటూ నెమ్మదిగా అయినా కాన్ఫిడెంట్‍గా మీటింగ్ హాల్‍లోకి అడుగుపెట్టింది ప్రణతి. యూ షేప్‍లో ఉన్న టేబుల్‍చుట్టూ ఉన్న కుర్చీలలో ఉన్నారు అందరూ. కౌశల్ పవర్‍పాయింట్ ప్రెజెంటేషన్‍ను మీటింగ్‍లో ఉన్న వాళ్ళకు వివరిస్తూ స్క్రీన్ వైపు తిరిగి ఉన్నాడు. లోపలికి అడుగు పెటిన మరుక్షణమే ప్రణతి చూపు అతని మీద పడింది. వెంటనే ఆమె అలర్ట్ అయిపోయింది. అతను ఆమె వైపు తిరిగి లేకపోయినా అతని కోట్, అతను నిలబడిన స్టైల్, అన్నిటినీ మించి అతని వాయిస్ చెవులకు వినిపించగానే ఒక్కసారిగా ప్రణతి తనను తాను మరిచిపోయింది. ’ఇతను కౌశల్ కాదు కదా, కౌశల్ బిజినెస్‍లు వేరు కదా ఇక్కడ ఉన్నాడేంటి? అతనికిక్కడేం పని’ అనుకుంది.
కంపెనీలో జాబ్‍కి అప్లై చేస్తున్నప్పుడు శ్రద్ధగా ఆ కంపెనీ ఎవరిది అని చూసింది. అప్పుడు ఆమెకి కౌశల్ పేరు కనిపించలేదు. ఇక్కడ ఆమె కౌశల్ ప్రెజెన్స్‍ని ఊహించలేదు. ఇందాక మీటింగ్‍హాల్‍లోకి అడుగుపెట్టేముందు కలిగిన ఫీలింగ్ గుర్తొచ్చిందామెకి. ఒకలాంటి ఉద్విగ్నత. అది అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడర్ధం అయింది ప్రణతికి. కౌశల్ అక్కడే దగ్గర్లో ఉన్నాడని తన మనసు తనకి సంకేతం ఇచ్చిందని అనిపించింది ఆమెకి.
అతనికి తను అక్కడ పని చేస్తున్న విషయం తెలిస్తే వెంటనే ఉద్యోగం లోనుండి తీసేస్తాడు. ఉద్యోగంలో జాయినయ్యి ఇంకా కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా అనుకుంది. వీలైనంత కాలం కౌశల్‍కి తను ఇక్కడ పని చేస్తున్న విషయం తెలియకుండా మానేజ్ చెయ్యగలిగితే ఆమెకి ఆ ఉద్యోగం నిలబెట్టుకోవచ్చు అనే ఆశ కలిగింది. అతనికి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ అందరి ముందు కప్స్ పెట్టి వాటిలో కాఫీ ఫిలప్ చేసింది.
ఇంక కౌశల్‍కి కాఫీ సెర్వ్ చెయ్యాలి. ప్రణతికి ధైర్యం, తెలివి ఉన్నా ఆ సమయంలో అవేమీ పని చెయ్యట్లేదు. ఆమెని అక్కడ కౌశల్ చూడడం జరిగితే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో ఆమె ఊహకి అందడం లేదు. అతనికి దగ్గరగా వెళుతున్నప్పుడు అతను తనని చూడకూడదు అనుకుంటూ వెళ్ళింది. అతనికి అందుబాటులో టేబుల్ మీద కప్ పెట్టింది. జాగ్రత్తగా ఆ కప్‍లో కాఫీ పోసింది. హమ్మయ్యా అనుకుంది. వెంటనే ఆమెకి గుర్తు వచ్చింది, షుగర్ క్యూబ్స్ పెట్టలేదని. షుగర్ క్యూబ్స్, స్పూన్ కూడ అక్కడ పెట్టింది. కాలం నెమ్మదిగా గడుస్తున్నట్లు, అక్కడ ఎక్కువ సమయం ఉండిపోయినట్లు అనిపించి నెర్వస్ అయింది ప్రణతి. ఇంక వెనుదిరగబోతోండగా ఆ తడబాటులో ఆమె నడక బాలెన్స్ తప్పింది.
అప్పటివరకు లూజుగా ఉన్న షూలను చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచింది ఆమె. కానీ దృష్టి మరలేసరికి ఆమె షూస్ ఆమె పాదాలను వదిలి అక్కడే ఉండిపోయాయి. ఒక కాలు షూలోనుండి బయటికి వచ్చేసింది. షూ అక్కడే ఉండి పోయి ఆమె పాదం ముందుకు పడింది.
ప్రణతి తిరిగి షూ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కౌశల్ ఆమె వైపు తిరిగాడు. ఆ టెన్షన్‍లో కాఫీ టేబుల్‍మీద ఒలిగింది. వెంటనే అక్కడే ట్రాలీలో ఉన్న క్లాత్ తీసుకుని టేబుల్ మీద ఒలికిన కాఫీ నీట్‍గా తుడిచేసింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. అతనికి ఆమెకి రెండడుగుల దూరం కూడా ఉండదు. ఆమె వెనుక అతను నిలబడి ఉన్నాడు. అతను స్క్రీన్‍వైపు నుండి ఇటు తిరిగాడని లీలగా అనిపిస్తున్న అతని కదలికలని బట్టి ఆమెకి అర్ధమైంది. అతని చూపులు ఆమె వీపుని తడుముతున్నాయి అని ఆమెకి తెలుస్తోంది. ఆమె గుండె కొట్టుకుంటున్న చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. షూలో కాలు పెట్టేసి, తల వంచుకుని అక్కడి నుండి బయటకు వచ్చేసింది. ఆమెకు ఆ సమయంలో లూజుగా ఉన్న షూలు పెట్టే ఇబ్బందికన్నా అక్కడి నుండి బయట పడడమే పరమావధిగా అనిపించింది.
అప్పటివరకూ అక్కడివారికి చక్కగా అన్నీ వివరిస్తున్న కౌశల్ వాక్ప్రవాహానికి ఆనకట్ట పడినట్లయింది. అనర్గళంగా మాట్లాడుతున్న అతను మాటల కోసం తడుముకున్నాడు. అతను ఎందుకు తడబాటు పడ్డాడో ప్రణతికి మాత్రమే తెలుసు. కలా నిజమా అర్ధంకాక అయోమయంగా ఫీలయ్యే వ్యక్తి కాదతను. ప్రణతిని ఆ సమయంలో అక్కడ ఊహించని అతను ఆమెని వెనుకనుండి చూసినా తప్పనిసరిగా గుర్తు పట్టేస్తాడు అనుకుంది ఆమె.
కౌశల్ చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ’ఆమె ప్రణతి కాదు కదా!! ఒకవేళ ప్రణతి అయితే, అంటే జైలు నుండి సిఫారసుతో వచ్చి తన కంపెనీలో చేరిన అమ్మాయి ప్రణతి, తన ప్రియమైన తమ్ముడి అకాలమృతికి కారణమైన ప్రణతి. ఎంత ధైర్యం? తన దగ్గరికి వచ్చి పని చేస్తుందా? తనకి సమీపంగా నిలబడి, తనకి కాఫీ సెర్వ్ చేసి, అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది ఆ అమ్మాయికి? ఇంత జరిగిన తరవాత కూడా నా దగ్గర జాబ్‍లో జాయినయిందేంటి? కౌశల్‍లో కోపం చెలరేగింది, కానీ అదే సమయంలో ఏదో తెలియని పాశం అతని హృదయాన్ని పట్టి లాగుతోంది. ఆమెని దూరంగా విసిరికొట్టాలనిపిస్తోంది అతనికి, కానీ అదే సమయంలో అలా చెయ్యలేని అశక్తత అతన్ని ఆవరిస్తోంది. రెండు రకాల ఆలోచనల సందిగ్ధంలో తనని తాను ఏం చేసుకుంటాడో అన్న భయం మెదిలింది అతనిలో.
* * *
మీటింగ్ హాల్ నుండి బయటికి వచ్చింది ప్రణతి. కిచెన్‍లోకి వెళ్ళింది ట్రాలీ మూవ్ చేసుకుంటూ. తన సీట్‍లో కూర్చుని ఉన్న షీలా ప్రణతి కిచెన్ వైపు వెళ్ళడం చూసింది. ప్రణతి నడకలోని కంగారుని కనిపెట్టింది ఆమె. జాబ్‍లో జాయినయిన మొదటి రోజు కదా, మీటింగ్‍హాల్‍లో అంతా సవ్యంగా చేసిందా లేదా అన్న సందేహం కలిగింది ఆమెలో. అడిగి చూద్దాం అనుకుంది.
మీటింగ్‍లో అతను ప్రెజెంట్ చెయ్యవలసింది అయిపోవడంతో, మిగిలిన వాళ్ళని కంటిన్యూ చెయ్యమని చెప్పేసి తన ఛాంబర్‍కి వెళ్ళిపోయాడు కౌశల్. అతని ఆలోచనలు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. ఆ ఆలోచనల్ని ఆపాలని కూడా అతను అనుకోలేదు. వలపు వెన్నెల మనసంతా నింపుకుని అతనిని అలరించే ఆమె ఒక పక్క, తమ్ముడి అకాల మృతికి కారణమై అవాంఛనీయ పరిస్థితులలో దోషిగా నిలబడ్డ ఈమె ఒక పక్క అతని మనోఫలకం మీద నిలబడ్డారు. అతని ఆలోచనల తీవ్ర మథనంలో అమృతమే వస్తుందో, హాలాహలమే వస్తుందో అతనికి కూడ తెలియలేదు. మరో కొన్ని నిమిషాలకి షీలాకి కాల్ చేసాడు అతను.
’సెండ్ హెర్ టూ మై కేబిన్, దట్ న్యూలీ అపాయింటెడ్ వన్ హూ సెర్వెడ్ ఇన్ ద మీటింగ్’ అన్నాడు షీలాతో. కౌశల్‍కి ఓకే చెప్పింది షీలా. ప్రణతి మీటింగ్ హాల్ నుండి బయటికి వచ్చి కిచెన్ వైపు వెళ్ళడం చూసిన షీలా, ప్రణతి దగ్గరికి వెళ్ళాలనే అనుకుంటోంది. ఇప్పుడు బాస్ పిలవమని చెప్పడంతో సీట్లో నుండి లేచింది.
కిచెన్‍లోకి వెళ్ళిన ప్రణతి చేతిలోని ట్రాలీని పక్కన పెట్టింది. ఆమె హృదయంలో అలజడి తుఫానులా రేగింది. కిచెన్ ఫ్లాట్‍ఫామ్‍ని ఆనుకుని కళ్ళు మూసుకుంది. ఇంతకాలం ఆమె హృదయంలో దాగిన వేదన ఎప్పటికీ తగ్గేది కాదని తెలిసినా, ఇప్పుడు కలుగుతున్న ఆరాటానికి మాత్రం తనే బాధ్యురాలనిపించిందామెకి. కౌశల్ ఇక్కడ ఉన్నాడని తెలిస్తే అసలు ఈ ఆఫీస్ ఛాయలకు కూడా వచ్చేది కాదు తను అని అనుకుంది. నిమిషాలు గడుస్తున్నా ఆమె గుండె దడ ఇంకా తగ్గలేదు.
మూసి ఉన్న ఆమె కనురెప్పల వెనుక కల్లోల సాగరాలు కదలాడుతున్నాయి. గతం తాలూకు జ్ఞాపకాలు గుండెలో ఉప్పెనలా పొంగుతున్నాయి. అది ఆఫీస్ కాబట్టి తనని తాను కంట్రోల్ చేసుకోవాలని, అల్లకల్లోలంగా ఉన్న మనసుని స్వాధీనపరచుకోవాలని ప్రయత్నించసాగింది ఆమె. అంతలో షీలా అక్కడికి వచ్చింది.
ఎవరో వచ్చిన అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచింది ప్రణతి. ఆమె ఎదురుగా షీలా నిలబడి ఉంది. ఆమె చూపులు ప్రణతిని గుచ్చి గుచ్చి చూస్తున్నాయి. తనవైపే అనుమానంగా చూస్తున్న షీలాని చూసి వెంటనే సర్దుకుంది ప్రణతి.
ఆమె వెళ్ళేటప్పటికి ప్రణతి కిచెన్‍లో కళ్ళు మూసుకుని నిలబడి ఉండడంతో ఆమెలో అనుమానం మరింత ఎక్కువయింది. ’ఈ ప్రణతి ఖచ్చితంగా మీటింగ్‍హాల్ లోపల ఏదో పొరపాటు చేసే ఉంటుంది. అందుకే ఇక్కడ కళ్ళు మూసుకుని నిలబడి టెన్షన్ పడుతోంది. ఏం కష్టమైన పని చెప్పేసాను నేను, మీటింగ్‍లో ఉన్న వాళ్లకి కాఫీ సెర్వ్ చేసి రావడమే కదా? అది కూడ సరిగ్గా చెయ్యలేకపోతుందని నాకేం తెలుసు. బాస్‍కి అసలే కోపం ఎక్కువ. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమంటాడో!! ఆ తరవాత నన్ను కూడా ఎక్స్‍ప్లనేషన్ అడుగుతాడేమో, నన్ను అడిగితే నేను చెప్పేస్తాను, అన్ని జాగ్రత్తలు చెప్పే మీటింగ్‍హాల్‍లోకి పంపించానని, ఇందులో నా తప్పేమీ లేదని. ఈ అమ్మాయికి పని సరిగ్గా చెయ్యమని వార్నింగ్ ఇస్తాడనుకుంటా’ అనుకుంది షీలా.
’బాస్ పిలుస్తున్నారు నిన్ను’ అంది ఆమె ప్రణతితో.
అర్ధమైపోయింది ప్రణతికి. కౌశల్ తనని గుర్తు పట్టేసాడు. ఇప్పుడు పిలిచి ఈ ఆఫీసు నుండి అవతలికి వెళ్ళిపొమ్మంటాడు, అనుకుంది.
"ఏంటి ఆలోచిస్తున్నావు? బాస్ నిన్ను వెంటనే రమ్మన్నారు. మీటింగ్‍హాల్‍లో అంతా సరిగ్గానే చేసావా? లేకపోతే ఏదైనా ఉల్టాపుల్టా చేసేసి వచ్చేసావా? బాస్ ఇంత వెంటనే పిలుస్తున్నారు నిన్ను, నీ కేపబిలిటీని సరిగ్గా చెక్ చెయ్యకుండానే నీకు రెస్పాన్స్‍బిలిటీ ఇచ్చేసినట్టున్నాను. వెళ్ళు ముందు బాస్ దగ్గరికి. తరవాత నన్ను పిలుస్తారు. నిన్ను అపాయింట్ చేసినందుకు నన్ను కూడా అంటారు’ అంది కాస్త అక్కసుగా.