మామ గారి అభిమాని
A romantic comedy by K K Raghunandana. ఈ అమ్మాయికి సరసకథలంటే మహ మోజుగా ఉన్నట్లుంది.ఇలాటప్పుడే లైన్ లో పెట్టాలి.అనుకుంటూనే మరికొంత అడుగువేసి చిలిపిగా వాక్యాలు రాసి పంపాడు.ఆమెకూడా అదే రీతిలో స్పందించింది.అలా అరగంట ఛాట్ చేసాక అట్నుంచి ఆగిపోయాయి.మనసంతా ఒకటే గమ్మత్తైన అలికిడి.
మామ -గారి అభిమాని (కథ) -కె.కె.రఘునందన
ఒక్కసారిగా నిర్విణ్ణుడైనాడు శ్రీపతి!అతన్ని అంత ఉత్కంఠపూరితుడిని చేసింది అప్పుడే వచ్చి మెరిసిన మెసేజ్!
ఈమధ్యకాలంలో కథ చివర సెల్ నంబరివ్వటంతో రకరకాలవాళ్ళు ఫోన్లు,మెసేజెస్ రూపంలో అభిప్రాయాలు తెలపటం పరిపాటైపోయింది.ఒక మహిళా పాఠకురాలినుంచి వచ్చిన మొదటి మెసేజ్ ఇదే!తిరిగి జవాబీయడం ధర్మమనిచెప్పి “నా కథ చదివినందుకు థాంక్స్!ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఎక్కడుంటున్నారు? “అని అడిగాడు.
“నాది విశాఖ.ప్రస్తుతం జాబ్ చేస్తున్నా!మావారికి దూరంగా ఉంటున్నా.పిల్లల్లేరు.ఒంటరిగా గడుపుతున్నా!మీవంటి వారి కథలు చదివి ఆనందించటం నా హాబీ”అని జవాబిచ్చింది.
“అరె!చాలా విచారంగా ఉంది.మీరు ఒంటరి అని తెల్సి.మీకు ఎప్పుడైనా ఫోన్ లేదా మెసేజ్ చేయొచ్చా?”ఆసక్తిగా మెసేజ్ ఇచ్చాడు.
“ఫోన్లొద్దులెండి!మెసేజెస్ నాకిష్టం.ఎప్పుడైనా చేయొచ్చు.సరే!మళ్ళా ఏమైనా కథలు పడితే మెసేజ్ ఇవ్వండి.వెంటనే పుస్తకం కొని చదువుతా!ఉంటా!”అని ఆపేసింది.శ్రీపతి మనసంతా ఉల్లాసం, ఉద్విఘ్నత వీరవిహారాలు చేశాయి. ఇంతకాలం ఎందరో అభిమానులు తనకు అభినందనలు తెలిపినాసరే కథ చదివి ఇలా చెప్పడమేకాక ప్రత్యేకంగా పరిచయంకోసం ప్రాకులాడే ఒక అమ్మాయి దొరకటం తన అదృష్టమే అనుకోవాలి. శ్రీవల్లి...!అందమైన పేరు...పదేపదే మనసులో అనుకున్నాడు శ్రీపతి... యాభైవ పడిలో పడ్డ తనను చూసేదెవరని?ఏదో రచయితగా పేరుండబట్టి ఆమాత్రం గుర్తింపు ఉంది.ఇంతకీ ఈ శ్రీవల్లి అనే అమ్మాయి వయసులో ఉందా?లేక తనలా ముసలి ముతకా? అందమైనదా?లేక వికారా? తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది.
“మామయ్యగారూ!మీకే... బూస్ట్ ఇంకా త్రాగలేదా?”అన్న కోడలు పూర్ణ మాటలకు ఈలోకంలోకొచ్చాడు శ్రీపతి.
కోడలు అలా వెళ్ళగానే సెల్ అందుకున్నాడు. “సర్!ఇంత సరసాలొలికించే కథలు రాసే మీ వయసెంత?మీరెక్కడుంటున్నారు?” ఆ ప్రశ్నకు ఉలిక్కిపడ్డట్లైంది.ఎందుకంటే తన వయసుగాని చెబితే పరిచయానికి వెనకాడవచ్చు.కొన్ని సందర్భాల్లో చిన్న అబధ్ధం చెప్పినా తప్పులేదంటారు.అందుకే ముప్పై ఐదు అని,ఉండేది విశాఖ అని మెసేజ్ పెట్టాడు.
“మనం ఒకే ఊర్లో ఉండటం నా అదృష్టం!ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా కలుద్దాం.ఆ మంచి ముహూర్తం నేనే నిర్ణయిస్తా!వేచి వుంటారని ఆశిస్తూ....మీ అభిమాని శ్రీవల్లి.”
ఆ సందేశం శ్రీపతిని ఆనందడోలికల్లో ముంచెత్త్తింది.ఐతే శ్రీవల్లి రూపం ఎలాగుంటుందోనని ఒకటే తహతహ బయల్దేరింది. ఒకవేళ ఆమె ఏమీ బాగోని రూపమైతే తను పరిచయం పెంచుకోగలడా?దానికేముంది?అక్కడితో ఆపేయొచ్చు!ముందే ఎలాగుంటావని అడిగితే మొదటే ఆ అమ్మాయి స్నేహాన్ని కత్తిరించవచ్చు.
“ఐతే తప్పకుండా కలుద్దాం.మీరెక్కడికి రమ్మంటే అక్కడికొస్తా!మీ పరిచయం నా అదృష్టం!”
“థాంక్యూ!అసలు మీ ‘’ బిగికౌగిలి’’ కథకు నేపథ్యం తెలుసుకోవాలని ఉంది.ఈతరానికి ‘బిగికౌగిలి’లోని మాధుర్యం తెలియదని భార్యాభర్తలు బిగిగా కౌగిలించుకొనేంత సమయాన్ని కేటాయించడానికి మొగ్గు చూపించడం లేదని ఆర్ధికమైన విషయాలకు ప్రాథాన్యమిస్తున్నారని,చెపుతూనే అధరామృతం జుర్రుకోవడం కూడా జత చేయడం నాకు నచ్చింది.”అన్నవాక్యాలు రెండు మెసేజుల్లా పంపింది.
ఆహా!ఈ అమ్మాయికి సరసకథలంటే మహ మోజుగా ఉన్నట్లుంది.ఇలాటప్పుడే లైన్ లో పెట్టాలి.అనుకుంటూనే మరికొంత అడుగువేసి చిలిపిగా వాక్యాలు రాసి పంపాడు.ఆమెకూడా అదే రీతిలో స్పందించింది.అలా అరగంట ఛాట్ చేసాక అట్నుంచి ఆగిపోయాయి.మనసంతా ఒకటే గమ్మత్తైన అలికిడి.
అంతలోనే “ఏమండీ!ఏమిటి చేస్తున్నారట?ఇంకా పడుక్కోరా ఏమిటి?టి.వి.లో మీకిష్టమైన సీరియల్ చూడ్డానికొస్తారనుకుంటే ఇక్కడ సెల్ పట్టుకుని కూర్చున్నారేంటి?”అని తనవైపే వస్తున్న భార్య నీలాంబరివైపు చూస్తూనే ఉలిక్కిపడ్డాడు శ్రీపతి.సెల్ జేబులోకి తోసేసాడు.
“అబ్బే!ఏం లేదులే నెట్ లో ఏదో కథ చదువుతున్నా!”అనేసాడు శ్రీపతి.
పదిగంటలైనాక తప్పనిసరిగా పక్క ఎక్కేస్తారు ఆ దంపతులు. వారి ముఖంలో మార్పులైతే వచ్చాయేమో తప్ప సరసాలకు మాత్రం కొదువలేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
కాని ఆరోజు మాత్రం భర్త శ్రీపతి సెల్ లో చిన్న శబ్దం రావడంతోనే గభాలున తననొదిలేసి మరీ లేవడం, ఏదో మంచినీళ్ళు త్రాగడానికన్నట్లుగా వెళ్ళి సెల్ కెలుక్కోవడం ఆమెను నివ్వెరపరచింది.అలా ఐదారుసార్లు జరిగినా కిమ్మనకుండా ఉదాసీనం వహించింది.ఆ పిదప వచ్చిన భర్త తనవైపు తిరక్కుండా అటువైపు తిరిగి పవళించడంతో చికాకనిపించింది.అలిగి తనుకూడా మరోవైపుకి ఒత్తిగిలి పరుండిపోయింది నీలాంబరి.
--------------------- ------------------- -------------------
“అత్తయ్యా!ఇలా రండి!మీకో విషయం చెబుతా!మామగారు ఈమధ్యన అదోలాగుంటున్నారు.ఇదివరకు సెల్ ను పట్టించుకోని మనిషి ఇప్పుడు అదే ధ్యాసలో గడుపుతున్నారు.నాకేదో అనుమానంగా ఉంది.”అని నీలాంబరిని చావిడిలోకి తీసుకెళ్ళి పతివైపుకి చూపించింది పూర్ణ.
“లేదులే!ఆయనేదో నెట్ చూసుకుంటున్నారేమో!పోనీ ఆయనేదో చేస్తే మనకెందుకట?నిన్న రాత్రి కూడా సెల్ పైనే దృష్టి పెట్టారు. పెద్దగా పట్టించుకోలేదులే”అనేసింది సాదాసీదాగా.
“అయ్యో!మీరెంత అమాయకులండీ!రోజులన్నీ ఒకేలాగుండవ్! సరసకథకు బహుమతివ్వడమే కాక కథ చివర ఈయనగారి సెల్ నంబరుకూడా ఇచ్చారాయె!ఇక ఏ అమ్మడైనాసరే ఇట్టే బుట్టలో పడేసుకోడానికి పథకం వేస్తే మన కొంప కొల్లేరు ఐనట్లే! ఇకనుంచైనా జాగ్రత్తగా చూసుకోండి. మన బంగారం మంచిదనుకుని అశ్రధ్ధ చేసారో పక్కదోవలు పట్టడం ఖాయం!’’ అని పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చింది కోడలు పూర్ణ.
“అమ్మా!నువ్వు చెప్పింది నిజమే కావచ్చునేమోగాని....ఎవరి నిజాయతీ వారికుండాలి.ఎంతకని కాసుకుని కూర్చోగలం చెప్పు.” అన్నది అతి మామూలుగా నీలాంబరి.
“అత్తయ్యా!మీకెలా చెప్పాలో నాకర్ధం కావటంలేదు.రహస్యంగా సాగినంతకాలం పర్వాలేదు.బట్టబయలైనప్పుడే చిక్కులన్నీ ముంచుకొస్తాయి.వాటిని విప్పటం బ్రహ్మతరం కాదు.ఇళ్ళ మీదకొచ్చి యుధ్ధాలాడే ఘటాలను ఎంతోమందిని టి.విల్లో చూస్తున్నాం.పైగా మీడియా ఒకటి ఇదిగో పులంటే అదిగో తోకంటూ అదేపనిగా ప్రచారం చేస్తోంది. అదిగో చూడండి మామయ్యగారి ముసిముసినవ్వులు!అంటే ఇదేదో అమ్మాయి వ్యవహారంలాగే తోస్తోంది. తర్వాత మీ ఇష్ట్రం!”అనేసి చకచక వంటగదిలోకి నడిచింది పూర్ణ.
“అమ్మా!సరేలేగాని!అబ్బాయి దృష్టిలోకి ఈ సంగతి రానీయకుమీ!వాడసలే చెడ్డ కోపిష్టి.తెలిస్తే తండ్రికొడుకుల నడుమ యుధ్ధభేరి మ్రోగుతుంది.ఐనా ఆయన వయసు యాభై దాటింది.అటువంటి ఆలోచనలు బుర్రలోకెందుకొస్తాయమ్మా!” ఎదురడిగింది నీలాంబరి.
“సరే!ఒకసారి మీరు ఆయనగారి వైఖరి గమనించండి.అసలు మిమ్మల్ని విడవకుండా మాటిమాటికీ పిలిచే ఆయన నిన్నట్నించి మీవైపైనా చూస్తున్నారా?”అని కోడలు పూర్ణ అనేసరికి ఒక్కసారి ఆలోచనలో పడింది నీలాంబరి.
“ఔన్నిజమే సుమా!పొద్దస్తమానం నా పక్కనే తచ్చాడేవారు...ఇప్పుడు మాత్రం సెల్ తోనే కాపురం చేస్తున్నట్లుంది. ఉండు... ఈయనకిలాకాదు...నా జాగ్రత్తలో నేనుంటాలే...చిన్నదానివైనా ఎందుకు చెప్పావో!”అని లేచి భర్త ఉన్న చోటికి నడిచింది.
నీలాంబరి రాకచూసి గతుక్కుమన్న శ్రీపతి “ఏం బంగారం?ఏమిటి కథ?”అని తెచ్చిపెట్టుకున్న నవ్వోటి విసిరాడు.
“మీకు నేనిప్పుడు ఇత్తడేగా?వేరే బంగారాలు మీకళ్ళబడుతుంటే మేం ఆనుతామా?”అని వ్యంగ్యంగా పలికింది.
“అబ్బే!నువ్వు తప్పుబట్టుకోకు!నెట్ లో మ్యాగజైన్స్ చదవడం,ఫేస్ బుక్ చూడ్డం అలవాటైంది ఈ మధ్య!అందుకనే దాంతో కాలక్షేపం!”అనేసాడు తత్తరబిత్తరగా లేచి గదిలోకి దారి తీస్తున్న శ్రీపతి.
ఆయనలా వెళ్ళడం గమనించిన కోడలు పూర్ణ “మీరేదో నిలదీసినట్లున్నారు కదూ!అందుకే మామయ్యగారు జారుకుంటున్నట్లుంది.లేదు ఇదేదో అనుమానించాల్సిన కేసే!వెనకటికెవరో ఒక ముసలాయన్ని పెళ్ళి చేసుకుంటావా తాతా? అని అడిగితే ఇప్పుడు నాకెవరు పిల్లనిస్తారుగనుక అని అన్నాడే తప్ప పెళ్ళి చేసుకోడం తప్పని ఒక్క మాట పెగిలిందా ఆ పెద్దాయన నోట్లోంచి...అలా ఉంటుంది ఈ మగరాయుళ్ళ తిక్క!అందువల్ల మీరు మీ ఆయన్ని నీడలా వెంటాడండి.ఆరాలు తీయండి.అప్పటిగ్గాని గప్ చిప్ గా ఉండరు.అర్ధమైందా?”అనేసి మళ్ళా వెళ్ళిపోయింది.
“ఆహా!బాగా అర్ధమైంది ఆయనగారి వైఖరి.నువ్వు చెబుతుంటే కాదంటానా?ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాగా?”అని కళ్ళజోడు సవరించుకుంటూ లోనికెళ్ళిపోయింది నీలాంబరి.
-------------- --------------------- -----------------
“ఏమిటింత హటాత్తుగా ముస్తాబౌతున్నారు పెళ్ళికొడుకులాగ?”అని వెనుకనుంచి వచ్చిన భార్య నీలాంబరి ప్రశ్నించేసరికి మొదట నీళ్ళు నమిలి “మా మిత్రుడొకరు మాకు పార్టీ ఇస్తున్నాడు.కాదనలేక వెళ్తున్నా!” జవాబిచ్చాడు శ్రీపతి.
“అదేంటి ఈరోజు ఏదో కథలపోటీకి కథ రాసుకుంటూ కూర్చుంటానన్నారు.మళ్ళా ప్లాన్ మారిందా?”నిలదీసినట్లుగా మాట్లాడింది.
“మరి రానంటే అతగాడు బాధపడతాడని తయారైనా!తప్పుతుందా?”అని,ముఖానికి పౌడర్ పులుముకుని,ఒళ్ళంతా యాక్స్ స్ప్ర్రే చిమ్ముకున్నాడు.
“ఇప్పుడు హెల్ మెట్ నిబంధన ఇంకా ఎక్కువగా పట్టించుకోలేదుగా!దాన్నెందుకు మోసుకెళ్తున్నారు?”అనుమానంగా అన్నది నీలాంబరి.
“రోజులు బాగాలేవు కదా?మన రక్షణకోసం పట్టుకెళ్తున్నా!”అదే సమయంలో ఠంగ్ మని మెసేజ్ సౌండ్ మ్రోగింది.సెల్ లోకి చూసి వెంటనే గుమ్మం దాటేశాడు శ్రీపతి.
----------- --------------- ------------------
“అత్తయ్యా!అత్తయ్యా!ఎక్కడ?”అంటూ గాబరాగా వచ్చింది పూర్ణ.
“ఏమ్మా!ఏమైందిట?”కంగారుగానే అడిగింది నీలాంబరి కోడల్ని.
“ఏమైందని మెల్లిగా అడుగుతారేమిటి?ఇంతకీ మావగారేరీ? “గదిలో తెరతీసి చూస్తూ అడిగింది.
“ఇప్పుడే ఎవరో ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడని వెళ్ళారు”
“అప్పుడే ఆయన కట్టుకథ అల్లేయడమూ...మీరది నమ్మేయడమూ...బాగుంది వరస...”నోటిమీద చేయేసుకుంది పూర్ణ.
“చెట్టంత మనిషి చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉండడం?”
“ఐతే ఏది చెబితే అది నమ్మేయడమేనా?ఇదిగో చూడండి..మామగారు బాత్రూంలోకెళ్ళినప్పుడు ఆయన సెల్ కెలికిచూసాను. కొన్ని మెసేజెస్ నా సెల్ లోకి ఫార్వర్డ్ చేసాను.ఎవరో ఈయన ఫ్యాన్ లాగుంది.చాలా క్లోజ్ గా మెసేజెస్ పెట్టారు.ఈరోజు ఉడాపార్క్ దగ్గర కలుసుకుందామని.... అక్కడికి రమ్మంటే మామయ్యగారు పరిగెత్తుకెళ్ళారు.ఈ వయసులో ఈయన్ని ఎవరోగాని వలవేసి పట్టేసింది.ఇంతకీ ఇక్కడ తగిలించి ఉన్న హెల్ మెట్ ఏదీ?”అదాటుగా గోడవైపుకి చూసి అడిగింది పూర్ణ. పట్టుకెళ్ళినట్లు చెప్పింది నీలాంబరి.
“ఆహా!గొప్పగా టోపీవేసారత్తయ్యా మీకు.హెల్ మెట్ నిబంధన లేనప్పుడు పట్టుకెళ్ళాల్సిన అవసరమేమొచ్చిందో నే చెబుతా! దాన్ని పెట్టుకుని ఆ అమ్మడిని వెనకాతల ఎక్కించుకుంటే ఎవరూ గుర్తుపట్ట లేరు.ఏ ఒక్కరికి అనుమానం రాదుకూడా.అదీ ఆయన ప్లాన్!”అని అప్పుడు పూర్ణ అత్తగారికి ఒక ఇరవైదాకా మెసేజెస్ చూపించి బయటకు చదివి వినిపించింది.
“చూసారా! ఇప్పుడెవరో కొత్తభామ పరిచయమయేసరికి అగ్నిసాక్షిగా పెళ్ళాడిన మిమ్మల్ని పక్కకు నెట్టేయాలని చూస్తున్నారు. మీ అబ్బాయి కంపెనీ పనిమీద విదేశాలకు వెళ్ళబట్టి ఈయన మరీ పురి విప్పేసారు. వెంటనే మేల్కోండి.”అనడంతోనే కొద్దిగా పౌరుషపడుతూ “ఆయన రానీ నేనే తేల్చుకుంటా!నేను ముఖ్యమో అది ముఖ్యమో!” అని అగ్గగ్గలాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది నీలాంబరి.
పూర్ణ తనమానాన తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.మామగారొచ్చాక జరగబోయే సన్నివేశం ఎంత రంజుగా ఉండేది అంచనా వేసుకోసాగింది.అలా కొన్ని గంటలు గడిచాక రాత్రి ఎనిమిదిగంటలకు ఇల్లు చేరాడు శ్రీపతి.బైకు దిగి సరాసరి గదిలోకెళ్ళేసరికి వెంటనే తలుపు మూసేయడం కనిపించింది పూర్ణకు.ఇక యుధ్ధం మొదలవడం ఖాయం!అత్తగారికి కోపమంటూ రాదుగాని వస్తే మరి ఆపలేమన్నది తనకు తెలుసు.కాపురానికొచ్చిన కొత్తలో డాబామీద కుంకుళ్ళు ఎండబెట్టి తను నిద్రలో జారిపోయింది.ఎప్పుడొచ్చిందోగాని పాడు వర్షం మొత్తం తడిసిముద్దైపోయాయి.నురగంతా క్రిందకు కారిపోయింది. అంతే! అంత మొద్దు నిద్రేమిటంటూ ఎగిరిపోయారావిడ! తను చేసిన తప్పుకే అలా వీరావతారమెత్తితే... సాక్షాత్తూ మొగుడు ఇంకో పరాయి పిల్లకోసం తాపత్రయపడితే సహించగలదా? ఈరోజు మామయ్యగారికి దరువు తప్పదనుకుంది.లోపలేం జరుగుతోందో తెలీటం లేదుగాని ఎప్పుడూ ఈ సమయంలో ఇంతసేపు తలుపులు మూసి ఉంచడం తనెరుగదు.
ఆ రాత్రి భోజనాల దగ్గర మామగారు ముభావంగానే అన్నం తిని లేవడంలోనే గదిలో ఘాటైన డోసే పడిందన్నది నిజమని గ్రహించింది పూర్ణ.
“అత్తయ్యగారూ!సక్సెసా?నేను మీకు ఉప్పందించానని చెప్పకండేం?తెలిస్తే నా మీద కారాలుమిరియాలు నూరే అవకాశం ఉంది.”అన్నది పూర్ణ.
“ఇంకా కొంత భాగమే ఐంది.మిగతాది రాత్రికి....ఆయనేదో కట్టుకథలల్లబోతున్నారు...అవి నమ్మడానికి సిధ్ధంగా ఉన్నాననుకున్నారు.తగవులోకి దారి తీస్తున్నారు.డోసింకా చాలదని అనుకుంటున్నా.”అని ఒకటే కోపం ప్రదర్శించింది నీలాంబరి....
“మీరిదే మాదిరిగా ఇచ్చారనుకోండి ఇక ఈ జన్మలో మరే పరాయిపిల్ల ఊసు ఎత్తర్లెండి”అని మరింత ఎగదోసింది పూర్ణ.
------------------ --------------------- ----------------
ఉదయం అత్తమామలిద్దరూ బైటకొచ్చినా ఎడమొహం పెడమొహంలా ప్రవర్తిస్తుంటే ఇద్దరికీ బాగా ఘర్షణ జరిగుంటుందని గ్రహించింది పూర్ణ.
“అత్తయ్యా!ఇలారండి!మామగారి మొహం చూస్తే మాడిపోయినపెసరట్టులా ఉంది.మీరేమైనా గట్టిగా దెబ్బలాడారా?ఒకసారలా ఇస్తేగాని దార్లోకి రారు.”అని కోడలు పూర్ణ చెబుతుంటే వెంటనే అందుకుని “ఓ పట్టాన ఒప్పుకున్నారనా?గయ్యిమంటూ లేచారు నామీద!తనపై నమ్మకం లేదా అన్నారు.కాని బలవంతంగా సెల్ లాక్కున్నా!అంతే దొరికిపోయారు.మొత్తం అంతా కక్కితేగాని వదల్లేదు.ఆ పరాయిపిల్లెవరో చెప్పమంటే తనింతదాకా చూడనేలేదంటూ కాళ్ళావేళ్ళా పడ్డారు.ఐనా నేను కరగలేదంటే నమ్ము. నిప్పులు చెరిగాను.”అని ఆవేశంగా ఊగిపోతూ చెప్పింది నీలాంబరి.
“పోనీలే అంటూ అప్పుడే కరిగిపోకండి!మళ్ళా మగ బుధ్ధి ప్రదర్శిస్తారు.కరవకపోయినాసరే అప్పుడప్పుడు బుసకొడుతూండాలి. అదే మన ఆడాళ్ళకి రక్ష!”మళ్ళా హితబోధ మొదలెట్టింది పూర్ణ.
-------------------- ------------------- -------------
సరిగ్గా పక్కమీదకు వాలేసరికల్లా ఠంగ్ మంటూ మెసేజ్ శబ్దం!ఈసారి గభాలున సెల్ తను తీసుకుంది నీలాంబరి.
“అదేంటి ఓపెనవడం లేదు?’’చిరాగ్గా అడిగింది.
“ఐనా నీకెందుకు నా సెల్?సెక్యూరిటీ కోడ్ పెట్టుకున్నా!”భయంగానే అన్నాడు శ్రీపతి.
“లేదు నేను చూడాల్సిందే!ఏదీ విప్పివ్వండి!”అని మళ్ళా సెల్ భర్త చేతికిచ్చింది.అతను నసుగుతూనే సీక్రెట్ కోడ్ కొట్టి ఇచ్చాడు.మెసేజ్ బాక్స్ తెరచింది.
“అదేంటి అవన్నీ కెలుకుతున్నావ్?ఇలాగియ్యి!”అని లాక్కోబోయాడు శ్రీపతి.
“ఉండండి!చదువుతా! “మీరు నాకోసం ఉడాపార్క్ కి వచ్చి వుంటారు.నాకోసం ఎంతో ఆసక్తిగా,ప్రేమగా వచ్చినాసరే నేను రాలేకపోయినందుకు ఎంతో విచారించా.సారీ!మిమ్మల్ని నిరాశపరచినందుకు క్షమిస్తారనుకుంటా!మీ బిగికౌగిలి కథలోలా మిమ్మల్నోసారి చుట్టేయాలనుంది.కాని ఆ యోగం ఎప్పుడుంటుందో తెలీదు....”అది చదవగానే భర్త మొహంలోకి తీక్షణంగా చూస్తూ “అంటే మీకెవరో అమ్మాయి ఆశపెట్టేసరికి మీరేమో ఎంచక్కా ఆ మోజులో పడిపోయారన్నమాట!మరి నా మాట!మన ముద్దుమురిపాలో?ఏయ్!బిగి కౌగిలి కథ నా స్పందన,ప్రేరణతో మీర్రాసి పదివేలు కొట్టేసారు.ఇప్పుడు ఎవరో అభిమాని పెట్టిన మెసేజ్ కి పడిపోయి అటు దూకేస్తున్నారు. చూడండి. సరసాలకోసం ఎక్కడికో పోనవసరం లేదు.పాతికేళ్ళయి మీ చెంతనే... సదా మీ సేవలో అన్నట్లుగా ఉన్నా! మీకేంకావాలో చెప్పండి ఇచ్చేస్తా!అర్ధమైందా?”అని భర్తని కౌగిల్లో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసేసింది.
“అబ్బే!అది...అది....అసలు నేను....”ఇంకా ఏదో చెప్పబోతుంటే ఒక్కసారిగా పక్కుమని నవ్వేసింది నీలాంబరి.
“అదేంటి?నువ్వు సీరియస్ గా నాపై అగ్గిమీదగుగ్గిలంలా విరుచుకుపడతావేమోనని అదిరిపోతున్నా!ఆ నవ్వులేంటి?”ఇంకా అదోలా అయోమయంగా చూస్తూ అన్నాడు శ్రీపతి.
“ఈ సెల్ లో ప్రకారం జరిగిందంతా అక్షరాలా నిజమే ఐతే మిమ్మల్ని ఒక్క గుంజు గుంజేదాన్ని.మొదట నేనూ నమ్మేసా!ఇంక వ్యవహారం ముదిరి పాకానపడే సమయానికి తెరవెనుక దొంగ దొరికిపోయింది.అందుకే మనసు నిశ్చింత చేసుకుని మిమ్మల్ని తప్పుబట్టకుండా జాగ్రత్తపడ్డా!ఐతే మీ మగబుధ్ధిని మాత్రం పోనిచ్చుకోకుండా పరాంగన అనేసరికి చంకలు గుద్దుకునిమరీ కుంటిసాకులు చెబుతూ ఊరేగారు.”అని ఆగి మరోసారి పక్కున నవ్వేసింది.
“ఏమిటో నువ్వు చెప్పింది ఒక్క పిసరు నాకు కొరుకుడు పడలేదు.సస్పెన్స్ తో చంపక వివరంగా విప్పిచెప్పేయ్!”అని ఉత్కంఠగా ఎదురుచూశాడామె నోట్లోంచొచ్చే మాటలకోసం.
“ఆగండి మహాశయా!నిజంగా జరిగే ఉంటే నా కొంపకొల్లేరయ్యేది.మీకు ఎవరో అభిమాని దగ్గరవడానికి ప్రయత్నిస్తోందని, మిమ్మల్ని బుట్టలో వేసుకోడానికి అట్టే సమయం పట్టదని,మేలుకోవాలని హెచ్ఛరిస్తే మిమ్మల్ని కనిపెట్టడం మొదలెట్టా! మీతో గొడవపడి మనమధ్య సరసం సన్నగిల్లి,పక్కలు దూరం చేసుకుంటామేమోనని ఎదురుచూసిన సదరు శాల్తీ ఒకరోజు నాకు అడ్డంగా దొరికిపోయింది.కాని నేనా రహస్యం తెలుసుకున్నట్లుగా కనపడక మిమ్మల్ని ఇంకా అనుమానించి వెంటాడుతున్నట్లే నటించాను.మీరేమో అపరిచిత స్త్రీ ఇంకా లైన్ లోకి రాలేదనే కారణంచేత ముఖం ముడుచుకున్న విషయం తెలీక మన నడుమ ఏదో జగడం జరిగిందని, మనమధ్య ఇంకా దుమారం రేగి ఎడమొహం పెడమొహం అయ్యామనే అనుకుంటోంది.” అంది మరోసారి నవ్వుతూ...
ఇక ఉగ్గబట్టుకోలేక అడిగేసాడు. “ఆ శాల్తీ... ఎవరో చెప్పి ఏడవచ్చుగా?”
“ఏడవను...నవ్వుతాను....ఎందుకంటే ఆ శాల్తీ ఎవరో కాదు సాక్షాత్తూ మన కోడలే కాబట్టి!”
“ఆ!...!?కోడలు పూర్ణా?ఇలా ఎందుకు చేసిందట?”ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు శ్రీపతి.
“మన కోడలుగా ఇంట్లో అడుగుపెట్టే ముందే నాకు తెలిసింది ఆమె మా చెడ్డ అల్లరిపిల్లని....ఏదో ఒకలాగ సరదాగా ఏడిపించడం ఆమెకు సరదా అని అబ్బాయి ఇదివరకే చెప్పాడు.కాని పెద్దగా పట్టించుకోలేదు.ఐతే గడసరి పిల్లననుకుందిగాని,తను ఒంటరిగా మన అబ్బాయితో రాత్రిపూట మాట్లాడుతున్నప్పుడు ఆ మైకంలో తను చేస్తున్న అల్లరి వ్యవహారమంతా అరటిపండు ఒలిచినట్లు విప్పి చెబుతుంటే నేను వినలేదనుకుంది.పాపం! ఆమె సరదా నేనెందుక్కాదనాలని చెప్పి నేనూ అంతకంటే గొప్పగా నటించాను.ఐనా మీగురించి ఎవరెన్ని సృష్టించినా నమ్మే వెర్రిబాగులదాన్ని కాదుగా.?”అనిచిలిపిగా నవ్వుతూ తన శ్రీవారిని గాఢంగా హత్తుకుపోయింది.
శ్రీపతి ఆ జవాబుకు అదేపనిగా నవ్వేసి “పాపం!కోడలుపిల్ల వెర్రిబాగుల్దే! ఈ రహస్యం నీకు తెలీదనుకుంటోంది.’’ చెబుతావా?లేక ఇంకా సస్పెన్స్ లో ఉంచుతావా? ‘’సందేహంగా చూస్తూ అన్నాడు.
“కాకపోతే....!ఇంతకాలం మనల్ని తన అల్లరితో ఎలా ఏడిపించిందో...ఇట్నుంచి నేనూ అలాగే నా అల్లరితో ఏడిపిస్తా!అదికూడా మనబ్బాయి వచ్చేదాకానే! ”
“అంటే అప్పటిదాకా మనం ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉండక తప్పదా?”
“తప్పదు!మరి కోడలికి కూడా సరదాగా ఓ డోసివ్వద్దూ? ఈ మామ... కోడలు...ఇద్దరి వైఖరి చూస్తుంటే మహ నవ్వొస్తోంది ...”అని గుండెనిండుగా నవ్వేసింది నీలాంబరి.
అదే సమయంలో మెసేజెస్ అడపాదడపా ఠంగుమంటూ శబ్దాలు చేస్తునే ఉన్నై!
కాని వాటిని పట్టించుకోడానికి వారిద్దరికీ ఇహపరాలు తెలీటం లేదు.అంతగా ఐక్యమైపోయారు.
----------------------- ------------------- ----------------