నల్ల ధనం - అవినీతి తంత్రం-2

Mondepu Prasad has written these articles to educate the youth about the Dishonest and prompted them to cultivate Honesty. Very good material for Ethics, UPSC GS IV paper

నల్ల ధనం - అవినీతి తంత్రం-2

నల్లదనం అంటే ఏమిటి?

మొండెపు ఫ్రసాద్

           నెలరోజుల తర్వాత – శనివారం – స్కూల్లో  – గాయత్రి మొదటి గెస్ట్ లెక్చర్.

           విద్యార్థులతో పాటూ లెక్చరర్లు కూడా గాయత్రి చెప్పే విషయాలు వినడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

           విద్యార్థులెవ్వరూ ప్రశ్నలు అడగటం మెదలుపెట్టకపోవడంతో “నల్లధనం అంటే ఏమిటి?” అని ప్రిన్సిపాల్ సత్యనారాయణ మొదటి ప్రశ్న అడిగాడు.

          “క్లుప్తంగా చెప్పాలంటే ప్రభుత్వానికి లెక్కలలో చూపించని మరియు పన్నులు కట్టని ఆదాయాన్ని బ్లాక్ మనీ (నల్లధనం) అంటారు.” గాయత్రి చెప్పింది.

            “వివరంగా చెప్పాలంటే?” ఒక విద్యార్ధి సరదాగా నవ్వుతూ అడిగాడు.

            “సరదాగా అడిగినా చాలా మంచి ప్రశ్న అడిగావు” అని ఆ విద్యార్ధిని అభినందించి గాయత్రి జవాబు చెప్పడం మొదలుపెట్టింది – “కొంతమంది ఆర్దికవేత్తలు నల్లధనాన్ని “సింపుల్ బ్లాక్ మనీ” మరియు “కాంపౌండ్ బ్లాక్ మనీ” లుగా విభజిస్తారు. చట్టపరమైన మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయం మీద కట్టవలసిన పన్నులు కట్టకపోతే అది “సింపుల్ బ్లాక్ మనీ” (ఉదా: వ్యాపారస్తులు, వివిధ వృత్తులు చేసేవారు తాము సంపాదించిన ఆదాయం మీద ఆదాయపు పన్ను చెల్లించకపోతే ఆ ఆదాయం నల్లధనంగా మారిపోతుంది. అలాగే 10 లక్షలు సంపాదించి ఆదాయపు పన్ను రిటర్నులో 8 లక్షలు మాత్రమే చూపిస్తే, అంటే 8 లక్షల మీద మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తే మిగిలిన 2 లక్షలు నల్లధనంగా మారిపోతుంది). చట్టవ్యతిరేకమైన మార్గాల ద్వారా (స్మగ్లింగ్, మాదకద్రవ్యాల వ్యాపారం, గాంబ్లింగ్, లంచాలు, దొంగతనం వంటివి) సంపాదించిన ఆదాయం “కాంపౌండ్ బ్లాక్ మనీ”.

             మరికొంతమంది ఆర్దికవేత్తలు సింపుల్ బ్లాక్ మనీని “రిపోర్టబుల్ బ్లాక్ మనీ” అని, కాంపౌండ్ బ్లాక్ మనీని “అన్ రిపోర్టబుల్ బ్లాక్ మనీ” అని కూడా అంటారు.”

           ప్రశ్న అడిగిన విద్యార్ధి అభినందనలు పొందడం గమనించి ఉత్సాహం తెచ్చుకున్న మరో విద్యార్ధి “అవినీతి అంటే లంచాలు తీసుకోవడమే కదా! అలాంటప్పుడు లంచాలు, అవినీతి అంటూ రకరకాల పదాలు వాడి ప్రజలను అయోమయంలో పడేయడం ఎందుకు?” అని అడిగాడు

            “అవినీతి అంటే లంచాలు తీసుకోవడం మాత్రమే అని చాలామంది అభిప్రాయం. కాని, అవసరం లేకపోయినా తనకొచ్చే కమిషన్ కోసం పేషెంట్లను రకరకాల డయాగ్నొస్టిక్ టెస్టులకు పంపే డాక్టర్లు, పిల్లలని తమ ఇళ్ళకి ట్యూషన్లకు రప్పించుకోడానికి స్కూళ్లలో పాటాలు సరిగా చెప్పని టీచర్లు, క్లయింటు నుండి ఎక్కువ ఫీజు తీసుకోడానికి ఖర్చులను పెంచి చూపించి లాభాలను తక్కువగా చూపిస్తూ అకౌంట్స్ తయారు చేసే అకౌంటెంట్లు, పన్నులు తక్కువగా చెల్లించడానికి అమ్మకాలలో కొంత భాగాన్ని లెక్కలలో చూపించని వ్యాపారులు, సినిమా మొదలైన కొంతసేపటికి ఏ.సి. ఆఫ్ చేసే (సినిమా నడిచే మూడు గంటల సేపూ ఏ.సి. రన్ చెయ్యడం కోసం సినిమా థియేటర్ టికెట్ ధర నిర్ణయించబడుతుంది)  థియేటర్ ఓనర్లు, అధిక లాభాల కోసం తూకాలలో మోసాలు చేసే కిరాణా మరియు కూరగాయల వ్యాపారులు, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు మరియు కల్తీ సరుకులు అమ్మే వ్యాపారులు  – చేసేవి కూడా అదనపు డబ్బు కోసం చేసే అవినీతి పనులే

         కాబట్టి, రకరకాల అవినీతి పనులలో లంచం కూడా ఒక అవినీతి పని. అంతేగాని లంచం మరియు అవినీతి పర్యాయ పదాలు కాదు.” గాయత్రి జవాబు చెప్పింది.

***