పెంట్ హౌస్

డెస్క్ టెలిఫోన్ మ్రోగడంతో రిసీవర్ అందుకుని, “ఎస్?” అన్నాడు డిటెక్టివ్ భగీరథ. “డిటెక్టివ్ భగీరథ గారేనా మాట్లాడేది?” అడిగాడు అవతలి వ్యక్తి. “ఎస్, మీరెవరు?” అడిగాడు డిటెక్టివ్. “సార్! నా పేరు జలాలుద్దీన్. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి నేను” కంగారుగా అన్నాడు అవతలి వ్యక్తి. “ఇది ఫోన్ లో డిస్కస్ చేసే విషయం కాదు”.

పెంట్ హౌస్

క్రైమ్ స్టోరీ

పెంట్ హౌస్

రచనః తిరుమలశ్రీ

***

          డెస్క్ టెలిఫోన్ మ్రోగడంతో రిసీవర్ అందుకుని, “ఎస్?” అన్నాడు డిటెక్టివ్ భగీరథ.

          “డిటెక్టివ్ భగీరథ గారేనా మాట్లాడేది?” అడిగాడు అవతలి వ్యక్తి.

          “ఎస్, మీరెవరు?” అడిగాడు డిటెక్టివ్.

          “సార్! నా పేరు జలాలుద్దీన్. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి నేను” కంగారుగా అన్నాడు అవతలి వ్యక్తి. “ఇది ఫోన్ లో డిస్కస్ చేసే విషయం కాదు”.   “సరే, రండి” అన్నాడు భగీరథ.

          “మీ ఆఫీసులో వద్దు, సార్! వేరే ఎక్కడైనా కలుద్దాం” అభ్యర్థనగా అన్నాడు ఆ వ్యక్తి. “మీకు అభ్యంతరం లేకపోతే మెహదీపట్నంలో ఉన్న కోక్ అండ్ కాక్ టెయిల్ రెస్టారెంట్ లో కలుద్దాం”.

          “మిమ్మల్ని నేను గుర్తుపట్టేదెలా?” అడిగాడు భగీరథ.

          “మీరు నాకు తెలుసును, సార్! నేనే మీవద్దకు వస్తాను…” హడావుడిగా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసాడు అవతలి వ్యక్తి.

#

          సాయంత్రం నిర్ణీతవేళకు అయిదు నిముషాలు ముందే కోక్ అండ్ కాక్ టెయిల్ కి చేరుకున్నాడు డిటెక్టివ్ భగీరథ. ఓ పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ అది. రద్దీగా వుంది. తన ప్రాస్పెక్టివ్ క్లయెంట్ తనను చూసి వస్తాడని…రెండు నిముషాలు గుమ్మం వద్దే నిలుచున్నాడు భగీరథ. ఎవరూ రాలేదు. లోపల ఖాళీగా ఉన్న ఓ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

          పది నిముషాల తరువాత ఓ యువకుడు హడావిడిగా లోపల ప్రవేశించడం కనిపించింది. ఓసారి హాలంతా చూపులతోనే పరికించి…తిన్నగా భగీరథ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చాడు అతను.

          “అయాం జలాలుద్దీన్. మీకు ఫోన్ చేసింది నేనే” అన్నాడతను. టేబుల్ కి మరోపక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. సుమారు ముప్పయ్ అయిదేళ్ళుంటాయి అతనికి. ఫెయిర్ గా, సన్నగా, పొడవుగా ఉన్నాడు. ముఖంలో ఆందోళన చాయలు తారట్లాడుతున్నాయి.

          వెయిటర్ రావడంతో కాఫీకి ఆర్డర్ ఇచ్చారు.

“సార్! నేను పెద్ద ఆపదలో చిక్కుకున్నాను. నన్ను మీరే కాపాడాలి” అన్నాడు జలాలుద్దీన్.

          “వివరంగా చెప్పండి” అన్నాడు భగీరథ.

          అతను చెప్పిన వివరాలు ఇవి – ‘హోటల్ మేనేజ్మెంట్ చదివిన అతను అమెరికాలో వివిధ హోటల్స్ లో ఏడేళ్ళపాటు పనిచేసాడు. అక్కడే సెటిలైన ఓ పాకిస్తానీ అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడాడు. హైద్రాబాదులో ఉంటున్న అతని తల్లిదండ్రులకు ఇటీవల ఆరోగ్యం చెడిపోవడంతో. నాలుగు నెలల క్రితం ఇండియాకి తిరిగివచ్చేశాడు. భార్య అక్కడే ఉండిపోయింది. అతనికున్న అమెరికా అనుభవంతో ఇక్కడ ఓ స్టార్ హోటల్లో మేనేజర్ గా సులభంగానే ఉద్యోగం దొరికింది. కానీ…’

          హఠాత్తుగా చెప్పడం ఆపి, చటుక్కున టేబుల్ క్రిందకు డక్ అయ్యాడు జలాలుద్దీన్. ముఖంలో భయం క్రమ్ముకుంది.

          అతని చూపులు ఎంట్రెన్స్ వైపు ఉండడం గమనించి, అటువైపు చూసాడు భగీరథ. ఎవరో నలుగురు వ్యక్తులు గుమ్మంలో నిలుచుని చూపులతోనే రెస్టారెంటును స్కాన్ చేస్తుండడం కనిపించింది.

          జలాలుద్దీన్ లేచి నిలుచున్నాడు. “సారీ, సార్! మనం మళ్ళీ కలుద్దాం. తరువాత మీకు ఫోన్ చేస్తాను” అన్నాడు గబగబా. జేబులోంచి పొడవాటి కవర్ ఒకటి తీసి డిటెక్టివ్ చేతిలో పెట్టాడు. “మీరు నా కేసును టేకప్ చేస్తే ఇవ్వడానికని తెచ్చిన ఎడ్వాన్స్ ఇది. ప్రస్తుతానికి దీన్ని రిటెయినర్ షిప్ గా ఉంచండి…” కంగారుగా వెనుక గుమ్మం వైపు నడచాడు.

          రెండడుగులు వేసి ఆగాడతను. “సార్! మనం మళ్ళీ కలుసుకునేంతవరకు ఆ క్యాష్ ని అలాగే ఉంచండి. ఎందుకంటే, జాగ్రత్తగా లెక్కపెట్టుకుని దాచుకోవలసిన సరికొత్త నోట్లు అవి!” అనేసి, అక్కణ్ణుంచి అదృశ్యమయిపోయాడు.   

#

          రాత్రి ఎనిమిది గంటలకు డిటెక్టివ్ యొక్క ఆఫీసులో ప్రవేశించారు ఇద్దరు వ్యక్తులు. ఎత్తుగా, దృఢంగా ఉన్నారు. సఫారీ సూట్స్ ధరించి, క్యాప్స్ పెట్టుకున్నారు. “వుయ్ ఆర్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్…” అన్నారు.

          “ఈరోజు సాయంత్రం మెహదీపట్నంలో ఉన్న కోక్ అండ్ కాక్ టెయిల్ లో జలాలుద్దీన్ అనే వ్యక్తిని కలిసారు మీరు...” అన్నాడు ఒకతను.  “సో?” ప్రశ్నార్థకంగా చూసాడు భగీరథ.

          “అతను మీతో ఏం మాట్లాడాడు?” సూటిగా చూస్తూ ప్రశ్నించాడు ఆ వ్యక్తి.

          “క్లయెంట్స్ విషయాలు ఇతరులతో చర్చించను నేను” అన్నాడు భగీరథ.

          “వుయ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ హిమ్” అన్నాడు రెండవ వ్యక్తి.

          “ఏ విషయంలో?” అడిగాడు భగీరథ.   “సారీ, వుయ్ కాంట్ రివీల్ ఇట్”.

          “సేమ్ ఈజ్ మై ఆన్సర్…ఎబౌట్ మై క్లయెంట్”.

          “ఆ వ్యక్తి మీకో కవర్ ఇచ్చాడు. అందులో ఏముంది?” ప్రశ్నించాడు మొదటి వ్యక్తి.

“ఇట్జ్ నన్నాఫ్ యువర్ బిజినెస్,” జవాబిచ్చాడు భగీరథ.

          “మాతో సహకరించకపోతే…మీ ఆఫీసును సెర్చ్ చేయవలసి వుంటుంది మేము” బెదిరించారు వాళ్ళు.         “సెర్చ్ వారెంట్ ఉందా?” అడిగాడు భగీరథ. “అండ్, మీ ఐడీలను కూడా చూపించలేదు మీరు”.

          ముఖాలు చూసుకున్నారు వాళ్ళు. “ఇఫ్ యూ డోంట్ కోపరేట్…ఫోర్స్ ఉపయోగించవలసి వుంటుంది” అన్నాడు మొదటి వ్యక్తి.

          భగీరథ ఇంటర్ కామ్ లో లోపలవున్న అసిస్టెంట్ భావనకు ఫోన్ చేసాడు. “భావనా! గెట్ ద డిజిపి ఆన్ ద లైన్,” అన్నాడు.

          ఆ పలుకులు ఆలకించిన ఆ వ్యక్తులు, “ఓకే, ఓకే. సెర్చ్ వారెంట్ తో తిరిగివస్తాం” అంటూ, హడావుడిగా గదిలోంచి బయటకు నడచారు.

          వాళ్ళు నిజంగా పోలీసులేనా అన్న సందేహం కలిగింది డిటెక్టివ్ కి.

#

          మర్నాటి ఉదయం ఆరు గంటలకు జలాలుద్దీన్ నుండి డిటెక్టివ్ కి కాల్ వచ్చింది. “సార్! అయాం ఆన్ ద రన్. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సంజీవయ్య పార్కులో కలవడానికి వీలవుతుందా? ప్లీజ్…” అనడిగాడు.   ఓ క్షణం ఆలోచించి, “ఓకే!” అన్నాడు భగీరథ.

          భగీరథ పార్కుకు చేరుకునేసరికి పదినిముషాలు ఆలస్యమయింది. పార్కులో జనం అక్కడక్కడ ఉన్నారు. జలాలుద్దీన్ చెప్పిన పొదరిల్లు చివరిలో వుంది. జలాలుద్దీన్ వీపు పూతీగలలోంచి కనిపిస్తోంది. ప్రవేశం వెనుకపక్క నుండి కావడంతో అటువైపు వెళ్లిన భగీరథ లోపలి దృశ్యాన్ని చూసి ఉలికిపడ్డాడు.

          ఓరాతిబండకు జేరగిలబడి కూర్చునివున్నాడు జలాలుద్దీన్. ఛాతీలో కత్తి దిగబడివుంది! షర్టంతా రక్తసిక్తమయింది.   

          దగ్గరకు వెళ్ళి ముక్కు దగ్గర వ్రేలు పెట్టి చూసాడు భగీరథ. శ్వాస ఆడడంలేదు. ఒంటిమీద చేయి వేసి చూసాడు. బాడీ టెంపరేచర్ ని బట్టి, అతను చనిపోయి ఎంతోసేపు అయివుండదనిపించింది.

          పొదరింటి బైటకు పరుగెత్తి పరిసరాలను పరికించాడు. ఎవరూ కనిపించలేదు…హతుడి ప్యాంట్ పోకెట్స్  ని వెదికాడు. ఒకదానిలో మనీపర్సూ, రెండవదానిలో చేతిరుమాలూ ఉన్నాయి. మనీపర్సులో కొన్ని కరెన్సీ నోట్స్ తప్ప ఇంకేమీలేదు. విండోలో అతను, అతని భార్య కాబోలు – జాయింట్ ఫొటోగ్రాఫ్ ఉంది. వెనుక సెల్ ఫోన్ పడివుంది. అది అతనిదే అయ్యుంటుందనుకున్నాడు.

          క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరాంకి ఫోన్ చేసి ఆ హత్యను గూర్చిన సమాచారం ఇద్దామని, జేబులోంచి తన సెల్ తీసాడు భగీరథ. స్క్రీన్ మీద కనిపించిన ఎస్సెమ్మెస్ ని చూసి విస్తుపోయాడు.

అది జలాలుద్దీన్ నుండి వచ్చినది – ‘సార్! ఓ కవర్ మీ పోస్టల్ లెటర్ బాక్స్ కి పంపించాను. దయచేసి చూడండి…’ ఆ మెసేజ్ ని అతను ఎప్పుడు పంపించాడో, తాను చూసుకోలేదు.

ఇన్స్ పెక్టర్ కి తన సెల్ లోంచి ఫోన్ చేయాలన్న ఆలోచనను విరమించుకుని, అక్కడనుండి బైలుదేరాడు భగీరథ. ఇంటికి వెళుతూ త్రోవలో ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి ‘100’ కి డయల్ చేసే పార్కులోని శవం గురించి ఎలర్ట్ చేసాడు. పీక్-అవర్ ట్రాఫిక్ జామ్స్ కారణంగా అతను ఇంటికి చేరుకునేసరికి పదకొండు గంటలయింది.

చేరుకోగానే ఎదురైన వార్త అతన్ని అప్రతిభుణ్ణి చేసింది – ‘అతని పోస్టల్ లెటర్ బాక్స్ కి ఎవరో నిప్పు పెట్టడంతో, లోపలున్న పోస్ట్ తో సహా కాలి బూడదయిపోయింది!’

#

తాను పార్కుకు సకాలానికి వెళ్ళగలిగుంటే, జలాలుద్దీన్ బ్రతికివుండేవాడేమోనన్న అపరాధభావన ఏమూలో గుండుసూదిలా గ్రుచ్చుకుంటోంది భగీరథను. అతన్ని చంపిన వ్యక్తి ఎవరో కనిపెట్టి శిక్ష వేయించి జలాలుద్దీన్ ఆత్మకు శాంతి చేకూర్చాలని తీర్మానించుకున్నాడు. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరాంని కలసి జలాలుద్దీన్ మొదటిసారి తనకు ఫోన్ చేసింది మొదలు అంతవరకు జరిగిందంతా చెప్పాడు. హత్యాస్థలం నుండే చేయబోయి, తన ఫోన్ లోని జలాలుద్దీన్ మెసేజ్ ని చూసాక, అతను పంపించిన కవర్ ఏమిటో చూసేంతవరకు బైటపడకూడదని ఆగిపోయాడు. కానీ, ఆ సంగతి శత్రువులకు ఎలా తెలిసిపోయిందో, తన లెటర్ బాక్స్ ని కాల్చేసారు.

జలాలుద్దీన్ మృతదేహానికి పోస్ట్ మార్టెమ్ జరిపించి, బాడీని అతని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. భగీరథ జలాలుద్దీన్ తల్లిదండ్రులను కలుసుకున్నాడు. వారు చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. జలాలుద్దీన్ హత్య తరువాత ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తులతో బెదిరించి దేనికోసమో ఇల్లంతా గాలించి వెళ్ళారట. ఆ సంగతి పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారట… తనకు తెలిసినంతవరకు తమ కుటుంబానికి గానీ, కొడుక్కి కానీ విరోధులు ఎవరూ లేరని చెప్పాడు ముసలాయన.

#

ఆ కేసు గురించే తీవ్రంగా ఆలోచిస్తూన్న డిటెక్టివ్ కి, జలాలుద్దీన్ రిటెయినర్ షిప్ గా ఇచ్చిన క్యాష్ కవర్ గుర్తుకువచ్చింది. అతని పలుకులూ మదిలో మెదిలాయి – ‘మనం మళ్ళీ కలుసుకునేంతవరకు ఆ క్యాష్ అలాగే ఉంచండి.  ఎందుకంటే జాగ్రత్తగా లెక్కపెట్టుకుని దాచుకోవలసిన సరికొత్త నోట్లు అవి!’ అన్నాడు.

టేబుల్లోంచి ఆ కవర్ తీసి తెరచి చూసాడు భగీరథ. సరికొత్త రెండువేలరూపాయల నోట్లకట్ట అది.

జలాలుద్దీన్ ఆ నోట్లను అలాగే ఉంచమన్నాడంటే – ఒకవేళ తాను కలవలేకపోతే, వాటి ద్వారా తనకు ఏదో సంకేతం ఇవ్వాలనుకున్నాడా అని ఆలోచనలో పడ్డాడు.  జాగ్రత్తగా లెక్కపెట్టుకుని’ అనడంలో వాటిని లెక్కపెట్టమని చెప్పకనే చెప్పాడా!?...వాటిని లెక్కపెట్టాడు. మొత్తం పాతిక నోట్లు. ఓ నోటు మీద అస్పష్టంగా ఏదో స్క్రిబ్లింగ్ కనిపించింది. కొత్తనోటుపైన ఆ స్క్రిబ్లింగ్ ఏమిటా అని, భూతద్దంతో పరిశీలించాడు దాన్ని. ‘హోటల్ స్కై హై…పెంట్ హౌస్’ అని గిలికినట్టున్న అక్షరాలు కనిపించాయి...

హోటల్ స్కై హై’. జలాలుద్దీన్ పనిచేస్తున్న హోటల్ అదే!…అతను చెప్పాలనుకున్న మిస్టరీ ఏదో అతని వర్క్ ప్లేస్ లోనే ఉందనిపించింది.  

#

షంషాబాద్ లోని ‘స్కై హై’ ఓ స్టార్ హోటల్. అయిదంతస్థుల అధునాతన కట్టడం.

మారుపేరుతో టూరిస్ట్ గా ఆ హోటల్ కి వెళ్ళిన డిటెక్టివ్ అసిస్టెంట్ భావన, స్కై వ్యూ కోసమంటూ పెంట్ హౌస్ ఎకామొడేషన్ కావాలంది. ఖాళీలేదని, ఐదవ అంతస్థులో రూమ్ నంబర్ 503 ను ఎలాట్ చేసారు.

భావన డిన్నర్ తరువాత టెర్రేస్ పైకి వెళ్ళబోతే సెక్యూరిటీ గార్డ్ అడ్డుకున్నాడు, పైన పెంట్ హౌస్ ఉన్నందున అతిథులకు అనుమతి లేదంటూ. లిఫ్ట్ మూవ్ మెంట్ పగటిపూట కంటే  రాత్రివేళ అబ్నార్మల్ గా ఉన్నట్టు గమనించిందామె.

మరుసటిరోజు రాత్రి వేషం మార్చుకుని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బార్ కి వెళ్ళింది. డ్రింక్స్ ఆర్డర్ చేసింది, త్రాగినట్టు నటిస్తూ, పూలకుండీలో ఒలకబోసేసింది. తరువాత లిఫ్ట్ దగ్గరకు వెళ్లింది. అందులో అప్పటికే కొందరు వున్నారు. వారితో కలసి పెంట్ హౌస్ కి వెళ్ళింది.

గుమ్మం  దగ్గర వాచ్ మేన్ ఆమెను ‘పాస్’ అడిగాడు. మరచిపోయినట్టు నటించి, హ్యాడ్ బ్యాగులోంచి ఓ నోట్లకట్ట తీసి అతని చేతిలో పెట్టింది. అతను ఓసారి అటు ఇటు దొంగచూపులు చూసి, డబ్బు జేబులో పెట్టుకుని ఆమెను లోపలికి ఎలవ్ చేసాడు.

లోపల ప్రవేశించిన భావన అప్రతిభురాలయింది…ఫుల్లీ ఏర్-కండిషండ్ ఐన అది, అత్యంత విశాలంగా, రిచ్ ఇంటెరియర్స్ తో మోడర్న్ గా ఉంది. ఆడ, మగ – యువత అధికంగా ఉన్నారు.

యూనిఫామ్ లో ఉన్న స్టువర్డ్ ఒకడు భావన దగ్గరకు వచ్చాడు. “ఎస్, మేమ్! చాట్ రూమా? డోప్ డెన్నా?”అనడిగాడు సవినయంగా.

“యాఁ…అయాం జస్ట్ న్యూ హియర్…లెట్ మీ గో రౌండ్ ఫస్ట్” అంది భావన దర్పంగా. చేతిరుమాలు కోసం అన్నట్టు, హ్యాండ్ బ్యాగును తెరచింది – అందులోని నోట్లకట్టలు కనిపించేలా.

వాటినతను చూడనే చూసాడు. “యూ ఆర్ వెల్ కమ్, మేమ్! ప్లీజ్ టేక్ ఎ టూర్…” అన్నాడు.

ఒక్కొక్క ఫెసిలిటీనీ చూస్తూంటే మతిపోయిందామె భావనకు.  బార్ లో ప్రపంచంలోని ఖరీదైన అన్ని రకాల బ్రాండ్సూ ఉన్నాయి...’డోప్ డెన్’ లో హెరాయిన్, హ్యాషిస్, మార్జువానా లాంటిటి మాదకద్రవ్యాలను సేవిస్తూ ఏవో లోకాలలో తేలిపోతున్నారు కొందరు...’చాట్ రూమ్’ లో యువతీయువకులు ఆన్ లైన్ లో సెక్సీ చాటింగ్స్ చేస్తున్నారు…’పోర్న్ కార్నివాల్’ లో పోర్న్ ఫిల్మ్స్ స్క్రీన్ చేయబడుతున్నాయి…

నిర్ణీత ఫీజు చెల్లించి ఓ చాట్ రూమ్ లో ప్రవేశించింది భావన. టేబుల్ పైనున్న ల్యాప్ టాప్ ఆన్ చేయగానే…స్క్రీన్ మీద అర్థనగ్నంగా ఉన్న ఆడ, మగ ప్రత్యక్షమయ్యారు. వారిలో ఒకరిని ఎంచుకుని సెక్సీ చాటింగ్ చేయవలసిందేతప్ప, ఇతరులతో కాంటాక్ట్ కలవదని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు ఆమెకు. సిస్టం ఆఫ్ చేసి, సెల్ తీసి భగీరథకు ఫోన్ చేయబోయింది. అక్కడ జామర్స్ అమర్చబడడంతో కాల్ వెళ్ళలేదు.

చాట్ రూమ్ నుండి బైటకు వచ్చింది భావన. తనను సమీపించిన స్టువర్డ్ తో, “అయాం హేవింగ్ ఎ టెర్రిబుల్ హెడ్ ఎక్. ఐ థింక్ ఐ నీడ్ సమ్ రెస్ట్,” అంటూ, అతని చేతిలో కొన్ని నోట్లు పెట్టి బైటకు నడచింది.

తన సూట్ కి వెళ్ళిన భావన తాను తెలుసుకున్న విషాయాలను ఓపట్టాన జీర్ణించుకోలేకపోయింది.  పి.హెచ్. క్రిటికల్…నీడ్స్ ఎమర్జెన్సీ సర్జరీ!’ అంటూ భగీరథకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది. అప్పుడు ఇంచుమించు ఒంటిగంట అవుతోంది. పడుకుందామని లైటార్పబోతూంటే, డోర్ బెల్ మ్రోగింది. వెళ్ళి తలుపు తెరచింది.

గుమ్మంలో ఓ వ్యక్తి నిలుచుని ఉన్నాడు. అతని చేతిలో పిస్టల్ ఉంది. అది ఆమెకు గురిపెట్టబడింది…

#

రెండు గంటల తరువాత ఆ పెంట్ హౌస్ పైన పోలీసులు రెయిడ్ చేసారు. డిటెక్టివ్ భగీరథ తోడురాగా ఇన్స్ పెక్టర్ శివరాం ఆధ్వర్యంలో జరిగింది రెయిడ్. ఎందరో కస్టమర్సూ, హోటల్  సిబ్బందీ అదుపులోకి తీసుకోబడ్డారు. లక్షలకొద్దీ క్యాష్ స్వాధీనం చేసుకోబడింది.

భావనపైన అనుమానం కలిగిన హోటల్ మేనేజ్మెంట్ ఆమెను ఓ గదిలో బంధించింది.   పోలీసులు ఆమెను విడిపించారు. హోటల్ సీజ్ చేయబడింది.

#

రెయిడ్ జరిగిన మర్నాడు జలాలుద్దీన్ భర్య జహీరా వచ్చి డిటెక్టివ్ భగీరథను కలిసింది. భర్త హత్య గురించి ఆలకించి స్టేట్స్ నుండి వచ్చిందామె. ఓ కవరు డిటెక్టివ్ కి అందించింది…అది- జలాలుద్దీన్ ఏర్ కార్గోలో భార్యకు పంపిన ఉత్తరం. అతను హత్యచేయబడ్డ రోజునే ఆమెకు అందిందది.

జరీనా ఇచ్చిన కవర్లో ఉర్దూలో ఉన్న ఓ లేఖ, కొన్ని ఫొటోలూ ఉన్నాయి. ఫొటోలు పెంట్ హౌస్ కార్యకలాపాలకు చెందినవి. ఆ లేఖ యొక్క సారాంశాన్ని వివరించింది జరీనా –

‘హోటల్ స్కై హైలో ఉద్యోగంలో చేరిన కొద్దిరోజుల్లోనే పెంట్ హౌస్ గురించి తెలుసుకున్నాడు జలాలుద్దీన్. యాజమాన్యానికి తెలియకుండా అక్కడ అంత పెద్ద ఎత్తులో అవినీతి కార్యక్రమాలు జరగడం అసంభవం. అటువంటి హోటల్ కి మేనేజరుగా వుండడం అవమానకరంగా ఎంచి రాజీనామా చేయాలనుకున్నాడు. అంతకంటే ముందు వాళ్ళను ఎక్స్ పోజ్ చేయాలనుకున్నాడు. ఓ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్లో సమాచారం అందించాడు. హోటల్ యాజమాన్యం తన ఫోన్ నే హ్యాక్ చేసిందో, లేక ఆ పోలీస్ అధికారే చెప్పేసాడో - జలాలుద్దీన్ ని చంపడానికి యాజమాన్యం మనుషులు వెంటపడ్డారు..

‘జలాలుద్దీన్ హోటల్ కి వెళ్ళడం మానేసి, డిటేక్టివ్ భగీరథను ఆశ్రయించాడు. డిటెక్టివ్ కి పెంట్ హౌస్ గురించి కరెన్సీ నోట్ల ద్వారా, పోస్ట్ లో పంపిన లేఖ ద్వారా సమాచారం అందించడానికి ప్రయత్నించాడు. హ్యాక్ చేయబడిందన్న అనుమానంతో అందుకు తన ఫోన్ ని ఉపయోగించలేదు… ఎందుకైనా మంచిదని, డిటెక్టివ్ కి పంపిన లేఖ యొక్క నకలును భార్యకు పంపించాడు.  డిటెక్టివ్ ని కలవడానికి మరో ప్రయత్నం చేస్తున్నట్టూ…ఒకవేళ తనకు ఏదైనా జరిగితే, ఆ కవర్ని భగీరథకు అందజేయవలసిందిగానూ ఆమెను కోరాడు…’

నిట్టూర్చాడు భగీరథ…ఆ ఫొటోల కోసమే శత్రువులు తన వద్దకు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల్లా వచ్చారు. తన పోస్టల్ మెయిల్ బాక్స్ ని కాల్చేసారు.  అతని తల్లిద్సండ్రులను బెదిరించి ఇల్లంతా ర్యాన్ స్యాక్ చేసారు. చివరకు జలాలుద్దీన్ ని చంపేసారు!... జలాలుద్దీన్ తనకు ఇచ్చిన యాభైవేల రూపాయలను అతని తల్లిదండ్రులకు వాపసు చేసేసాడు భగీరథ.

పరారిలో ఉన్న హోటల్ యాజమాన్యం కోసం ‘రెడ్ లెటర్’ నోటీసు జారీచేయబడింది...ధైర్యసాహసాలతో ఒంటరిగా పెంట్ హౌస్ కి వెళ్ళి దాన్ని ఎక్స్ పోజ్ చేసిన భావనను ప్రభుత్వం అభినందించింది.

 “Tirumalasree”  PVV SATYANARAYANA