మేధో హత్యలు part 9

This is Ninth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 9

మేధో హత్యలు 9

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

ఆ రెండో రోజు డిన్నర్ వరకూ కూడా పెద్దగా ఏనీ జరగలేదు విజయ్ దృష్టిలో. చప్పగా అనిపించే సైంటిఫిక్ పేపర్స్ ప్రెజెంటేషన్ లను వింటూ ఉంటే హాయిగా గురకలు పెడుతూ నిద్రపోవాలి అనిపించింది అతనికి చాలా బలంగా! అతి బలవంతం మీద ఆ కోరికను మనసులోనుంచి తరిమేసి ఆ జాగా లోకి సోఫీ తో తను గడిపిన మధురమైన క్షణాలను నింపుకోవడానికి, ఆ జ్ఞాపకాలకు ఆహ్వానం పలికాడు. కానీ ఆసక్తి కరమైన సినిమా చూస్తుంటే అడ్డం వచ్చే మద్యపాన, ధూమపాన కాన్సర్ హెచ్చెరికల లా కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా పిలవకుండానే వచ్చేసి అతని మనసుని అతలాకుతలం చేసేసాయి.

డిన్నర్ కి వచ్చిన లూసీ అందంగా అలంకరించుకుంది. అద్భుతంగా ఉంది! ఆమె వైపు చూసిన సైంటిస్టులు కూడా కళ్ళజోళ్ళు సవరించుకుని మరో సారి చూసారు ఆమె వైపు. నవ్వుతూ అందరికీ హాయ్ చెప్తూ చాలా డీసెంట్ గా బిహేవ్ చేసింది లూసీ. విజయ్ వైపు మాత్రం ఒక స్పెషల్ నవ్వు రువ్వింది. ఆ నవ్వులో పలికిన భావాలకు గుడ్లు మిటకరించాడు విజయ్, తన భూతద్దాల కళ్ళజోడు వెనుక.

అప్పుడప్పుడు అతనికి చేతులు, కాళ్ళు తగిలిస్తూ, చీటికి మాటికి పలకరిస్తూ అతనితో ఆడుకుంది లూసీ. రోజీకి అంతా అర్థం అయింది. మార్సెల్లో మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన ప్రియ అభిమానికి, తను చేస్తున్న రీసెర్చ్ లోని ఆసక్తికరమైన అంశాలని వివరించాడు ఉత్సాహంగా. అతని వివరణలు అన్నీ తనకి అర్థం అవుతున్నట్లు, వాటిలోని లోతైన శాస్త్ర విషయాలను ఆస్వాదిస్తున్నట్లు అభినయం చేస్తూ అతన్ని ఆకట్టుకుంటున్నాడు విజయ్. నిజానికి అవన్నీ అతనికి బౌన్సర్లలాగా తలకి చాలా ఎత్తులో పైకే పోయాయి.

తనని పట్టించుకోకుండా నాటకాలు ఆడుతున్న విజయ్ పైన పంతం పెంచుకుంది లూసీ. ఎలాగైనా ఈ రాత్రికి అతనితో అమీ తుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయింది గట్టిగా. ’ఎంతకాలం తప్పించుకుంటావో నేనూ చూస్తాను. నీ సంగతి ఏమిటో తేల్చేస్తాను చూస్తూ ఉండు...’ అని మనసులోనే అతనికి ఒక ఛాలెంజి విసిరి డిన్నర్ ఫినిష్ చేయడం మీద దృష్టి పెట్టింది. 

జార్జి పెద్ద పొట్ట ఊపుకుంటూ నవ్వుతూ, అన్ని టేబుల్స్ దగ్గరకి వెళ్ళి అందరినీ స్నేహంగా పలకరిస్తూ, అందరికీ మరుసటి రోజు పిక్నిక్ విషయం చెప్తూ ఉల్లాసంగా తిరుగుతున్నాడు. మార్సెల్లో టేబుల్ దగ్గరకి కూడా వచ్చాడు. లూసీని చూసి ఆమె చేయి అందుకోవడానికి చేతిని చాచాడు నవ్వుతూ.

లూసీ కూడా అతని లాగా విశాలంగా నవ్వుతూ చేతులు జోడించింది. ఆశ్చర్యంగా చూసి, ’ఓ ... ఇండియన్ ఇన్‍ఫ్లుయెన్స్... ఇండియన్ కల్చర్...’ అంటూ రోజీకి కూడా ఒక నమస్కారం పెట్టేసి మార్సెల్లోకి పిక్‍నిక్ గురించి చెప్పి వెళ్ళిపోయాడు జార్జి. 

లూసీ తనను ఇంప్రెస్ చేయడానికి చూస్తుంది అని గ్రహించాడు విజయ్. ఇంకొక్క రోజు గడిస్తే, ఈ మేధోహత్యల వెనక ఎవరు ఉన్నారో వారు తనతో ముఖా ముఖీ గా తలపడడానికైనా రావాలి, లేదా మార్సెల్లో మీద ఏదైనా ప్రయత్నం చేస్తూ తనకు పట్టుబడనైనా పట్టుబడాలి అనుకున్నాడు విజయ్. 

అంటే లూసీని మరుసటి రోజు సాయంత్రం దాకా దూరం పెడితే చాలు. మెల్లగా ఆమె జీవితం ఆమెను తనలోకి లాగేసుకుంటుంది. అటుతర్వాత తన గురించి ఆమె ఇక ఆలోచించదు అనుకుని సమాధాన పడ్డాడు విజయ్.

డిన్నర్ ముగించి తమ తమ గదులకు చేరుకున్నారు. మార్సెల్లో తన గదిలోకి వెళ్ళే వరకు అతన్ని గమనించుకుంటూ అతను లోపలికి వెళ్ళాక తన గదిలోకి వెళ్ళాడు విజయ్.

లోపల పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. తన గదిలోకి ఎవరూ రాలేదు అని రూఢి చేసుకుని, మార్సెల్లో గది పైన తన దృష్టిని సారించడానికి తన మొబైల్ లోని సీక్రెట్ యాప్ ని ఓపెన్ చేసాడు. తన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో విన వస్తున్న మాటలను బట్టి అక్కడ కూడా అంతా క్షేమమే అనుకుని సమాధాన పడ్డాడు.

రాత్రి పదకొండు అయింది. అప్పుడు మార్సెల్లో గదిలో అయిన చిన్న శబ్దానికి మెలుకువ తెచ్చుకుని యాప్ లోకి చూసాడు విజయ్. లూసీ నైట్ డ్రెస్ లో బయటకు వెళ్తూ కనిపించింది. ’ఈ సమయంలో ఎక్కడికి వెళ్తుంది? ఎందుకైనా మంచిది వెంట వెళ్దామా అనుకుని ఒక క్షణం తర్కించుకున్నాడు. కానీ తను మార్సెల్లోకి కాపలా కాయడం ముఖ్యం కాబట్టి ఆమె విషయం పట్టించుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు.

ఒకే ఒక నిముషం తర్వాత అతని డోర్ కాలింగ్ బెల్ మోగింది. లూసీ బయటికి వచ్చింది తన గదికి రావడానికా, అనుకున్నాడు విజయ్ ఒక క్షణం. కానీ వేరే ఎవరైనా అయిఉండొచ్చు కూడా అనుకుని అదేమిటో తెలుసుకోవాలి అనుకుని డోర్ తెరిచాడు, జాగ్రత్తగా! అతను ఊహించినదే నిజం అయింది, కానీ అతను ఊహించినదానికంటే ఇంకా ప్రమాదకారిగా కనిపించింది.

ఆమె నైట్ డ్రెస్ పలుచగా ఉండి ఆమె అందాలను ఊహలకే వదిలేయకుండా శాయశక్తులా తన వంతుగా సహకరిస్తోంది. కళ్ళు చికిలించి ఆమె రూపాన్ని తన మైండ్ లోనుంచి ఎరేజ్ చేస్తూ, ’ఏమిటి?’ అన్నాడు రూడ్ గా. అతన్ని నెట్టుకుంటూ లోపలికి వచ్చేసింది లూసీ.

’ఏమిటి??’ అన్నాడు విజయ్ చికాకుగా!

’నాకు నిద్ర పట్టడం లేదు’ అంది లూసీ గారాంగా!

’అయితే ఏదైనా పుస్తకం చదువుకో’ అన్నాడు విజయ్. స్టూడ్డెంట్స్ కి మాత్రమే కాదు, చాలా మందికి నిద్ర పట్టడానికి దివ్యౌషధం పుస్తకమే కనుక!!

’కొద్ది సేపు కబుర్లు చెప్పు’ అంది లోపలికి నడుస్తూ. తిన్నగా ఫ్రిజ్ దగ్గరకి పోయి లోపల ఉన్న బాటిల్స్ బయటికి తీసింది. గ్లాసులు రెండు తీసి వాటిలోకి అందులోని ద్రవాన్ని కొద్ది కొద్దిగా వేసి, పరీక్షగా చూసి, ఒక దానిలో డోస్ డబుల్ చేసింది. షోడాలు కూడా వేసి అతనికి డబుల్ డోస్ గ్లాస్ ఆఫర్ చేసింది.

’నో థాంక్స్’ అన్నాడు విజయ్. 

అతన్ని ఎలాగోలా ముగ్గు లోకి దించాలి అని వచ్చిన లూసీ అంత తేలికగా పరాజయాన్ని అంగీకరించే ఉద్దేశంలో లేదు. అతన్ని రాసుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి లాక్ చేసింది.

అతని ఎదురుగా కూర్చుని తన గ్లాసు అందుకుని అతని వైపు కైపుగా చూస్తూ కొద్ది కొద్దిగా సిప్ చేయడం మొదలు పెట్టింది.

అప్పుడు విజయ్ మనసులో సోఫీ తిష్ట వేసుకుని కూర్చుని ఉండకపోతే లూసీ ఆ స్థానంలోకి చాలా ఈజీగా ప్రవేశించి అతని మనసునంతా ఆక్రమించేసుకుని ఉండేది. కానీ పాపం ఆ విషయం లూసీకి తెలిసే అవకాశం లేదు. అందుకే తన ప్రయత్నం తను వేగవంతం చేసింది.

’చెప్పు, ఏమైనా కబుర్లు. నువ్వెప్పుడైనా లవ్ చేసావా?’ అంది మత్తుగా చూస్తూ.

’అవన్నీ ఇప్పుడెందుకు. ఆ డ్రింక్ పట్టుకుని నీ గదిలోకి వెళ్ళిపో. ఇక్కడ నేను నీకు ఎలాగూ కంపెనీ ఇవ్వలేను. నాకు అలవాటు లేదు’ అన్నాడు విజయ్ కోపం, చికాకు, ఆమె మీద పనిచేయడం లేదని గ్రహించి నచ్చచెబుతున్న ధోరణిలో!

తాగుతున్న గ్లాసు పక్కన బెట్టి బద్ధకంగా వళ్ళు విరుచుకుంది తన చేతులును వెనక్కి పెట్టుకుని ఓరగా అతని వైపు చూస్తూ. ఠక్కున తల పక్కకి తిప్పుకున్నాడు విజయ్.

అంతలో తలుపుని ఎవరో నెట్టినట్లు అనిపించింది. తర్వాత చిన్నగా నాక్ చేసిన శబ్దం కూడా వినవచ్చింది. ఈ రాత్రి వేళ వచ్చింది ఎవరు, మిత్రులా శత్రువులా అనుకుంటూ నడుము దగ్గర ఉన్న హేండ్ గన్ పైన చేతిని అలవాటుగా పెట్టుకుని తలుపు అన్ లాక్ చేసి ఓపెన్ చేసాడు విజయ్.

ఆశ్చర్యంగా చూస్తూ, ’నువ్వా?’ అన్నాడు.

’ఏం... నీ మీద కోపంతో నిన్ను వదిలేస్తాను అనుకున్నావా?’ అంది సుప్రియ నవ్వుతూ. లాంగ్ జర్నీ చేసిన అలసట ఆమె మొఖంలో కనిపిస్తున్నా అందంగా కనిపిస్తోంది. కెంపుల్లాంటి పెదవులపైన చెరగని చిరునవ్వు ఆమె మొఖాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తోంది.

ఒక వైపు ఆమెను చూసిన ఆనందం మరోవైపు ఆమె తన గదిలో ఉన్న లూసీని చూసి ఏమనుకుంటుందో అనే భయం ఒక్కసారి కలిగేసరికి కన్ఫ్యూజ్డ్ గా అయిపోయాడు విజయ్.

’అదేమిటి వింత వేషం వేసావు, ఈ పిచ్చి కళ్ళజోడు ఎక్కడిది నీకు. నన్ను ఏమార్చాలని చూస్తున్నావా, ఏమిటి’ అంటూ లోపలికి నడిచింది సుప్రియ.

ఆమెను ఆపాలని చేతులు అడ్డు పెట్టాడు విజయ్. తనని కౌగిలించుకోవడానికి అలా చేతులు పెట్టాడు అనుకుని అతన్ని గట్టిగా హత్తుకుపోయింది సుప్రియ.

తన కన్‍ఫ్యూజన్ అంతా ఒక్కక్షణం మరిచిపోయి, తన్మయత్వంతో ’సోఫీ’ అన్నాడు విజయ్. కానీ అటునుంచి రావలసిన స్పందన రాలేదు. రాకూడని కోపం వచ్చేసింది ఉరుకులు పరుగుల మీద. 

ఒక్క సారిగా అతన్ని పక్కకి నెట్టేసి, ’నీ బిజినెస్ అంతా అమ్మాయిలను కలవడం వాళ్ళతో తైతక్కలాడడం తో నిండి ఉంటుందా ఎప్పుడూ. ఛీ.. ఛీ...’ అంటూ వెనక్కి తిరిగి వడి వడిగా బయటికి నడిచింది.

లూసీ తన కళ్ళను పెద్దగా చేసి అతని వైపు సుప్రియ వైపు మార్చి మార్చి చూస్తూ నిలబడిపోయింది.

’ఆగు సోఫీ, ఆగు... నీకు ఎక్స్‍ప్లైన్ చేయగలను...’ అన్నాడు విజయ్ వెనకనుంచి.

’ఎప్పుడు? రేపు తెల్లారేక తీరికగా చెప్తావా?’ వెనక్కి తిరగకుండా అరిచింది సుప్రియ.

అలా చూస్తూ నీరసంగా తలుపు వేసాడు విజయ్. చేతిలోని గ్లాసుని కింద పెట్టేసి, అతని దగ్గరకి వచ్చి చెంప మీద ముద్దు పెట్టుకుని, ’అయామ్ సారీ. ఆమెకు కోపం తగ్గాక నీతో మాట్లాడుతుందిలే. షి ఈజ్ గోర్జియస్’ అంటూ తలుపు తెరుచుకుని మార్సెల్లో గదిలోకి వెళ్ళిపోయింది లూసీ.

లూసీ కళ్ళు చెమ్మ చూసిన విజయ్ గుండె భారం అయింది క్షణ కాలం. కానీ అంతలోనే లూసీ చాలా మంచిది అనుకున్నాడు. గుడ్ గాళ్! అంది అతని మనసు.

సుప్రియను తలుచుకుని తిక్క రేగింది ఒక్కసారిగా. ’దీనికి కర్ణపిశాచి లాంటి శక్తులు ఏమైనా ఉన్నాయా? నా పక్కన ఎవరైనా అమ్మాయి ఉన్నప్పుడే నా దగ్గరకి రావాలని అనుకుంటుంది’ అని చికాకు పడ్డాడు... బయటికే!

***

మరుసటి రోజు అందరికంటే ముందుగా తయారయి మార్సెల్లో కి తుమ్మ జిగురులా అంటుకుని ఉండటం అనే కార్యక్రమాన్ని కొనసాగించాడు విజయ్. బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర డీసెంట్ గా విష్ చేసింది లూసీ. ఆమె డ్రెస్ గానీ ప్రవర్తన గాని అంతకు ముందు రోజు కంటే చాలా భిన్నంగా ఉండటం విజయ్ దృష్టికి వచ్చింది. ఆమె మీద అతనికి అభిమానం తో పాటు గౌరవం కూడా కలిగింది.

ఈ కొండ ప్రాంతం వాళ్ళు నమ్మితే ప్రాణం పెడతారు, నమ్మకద్రోహం చేస్తే ప్రాణం తీయడానికి కూడా వెనుకాడరు అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు విజయ్.

తన మనసులో సుప్రియ తిష్ట వేసుకుని ఉన్న విషయం ఎలాగో గ్రహించింది లూసీ. అందుకే తన ప్రవర్తనను అర్థం చేసుకుంది అని సంతోషించాడు.

మేధో హత్యలకు పాలప్డుతున్న వాళ్ళు తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని ఉండాళి. లేదా, స్విఫ్ట్ నుంచి ఎవరు వచ్చారో కనిపెట్టలేక సతమతమవుతూ కన్‍ఫ్యూజన్ లో నైనా ఉండి ఉండాలి అనుకున్నాడు విజయ్. ఎందుకంటే అతనితో ముఖాముఖీ తలబడడం గానీ, మార్సెల్లో దొంగ చాటుగా దెబ్బ తియ్యడం కానీ ఏమీ జరగలేదు. అందుకే కాస్త రిలాక్స్ అవ్వాలని అనిపించినా తన సర్వైలెన్స్ ని స్ట్రిక్ట్ గా కొనసాగించాడు విజయ్.

బలబీర్ సింగ్ చెప్పిన విషయాలలో ముఖ్యమైనది, ఇలాంటి కాన్ఫరెన్సుల తర్వాతే ఆ సైంటిస్టులు మేధో హత్య్లకు గురయ్యారు అన్న విషయం. దాదాపు అందరూ కూడా కాన్పరెన్స్ అయిన తర్వాత ఇల్లు చేరిన గంటలోనే ఇలా వెజెటబుల్స్ గా మారడం జరిగింది. అంటే శత్రువులు ఉపయోగించే రేస్ గానీ, వైరస్ గానీ కొంత కాలం తర్వాత పని చేసే విధంగా డిజైన్ చేయబడ్డాయా??

మొదటి సారి అలాంటి ఆలోచన వచ్చిన తర్వాత, మార్సెల్లోని ఇటలీ ఫ్లైట్ ఎక్కిస్తే చాలదు అనిపించింది విజయ్ కి. అతని వెంట ఇంటి వరకు వెళ్ళి డ్రాప్ చేసి రావడమే ఉత్తమం అని కూడా అనుకున్నాడు.

ఆ విషయం చెప్పడానికి సరైన వ్యక్తి లూసీ అనుకున్నాడు. వెంటనే లూసీని దగ్గరకు రమ్మని సైగ చేసి పిలిచాడు. ఆమె వచ్చిన తర్వాత తనకి వారి కుటుంబంతో పాటు ఇటలీ వెళ్ళి అక్కడి కొండలలో తిరగాలి అని ఉంది అని చెప్పాడు. ఉదాసీనంగా స్పందిస్తుంది అనుకున్నాడు కానీ, ఉత్సాహంగానే స్పందించింది ఆమె. 

’సరే అయితే, నేను ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా వస్తాము. నీకేమైనా అభ్యంతరమా అంది. ’మరీ ఎక్కువ కాకుండా ఉంటే అభ్యంతరం లేదు’ అన్నాడు విజయ్.

’సరే, ప్లాన్ చేస్తాను. నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో’ అంటూ తాము వెళ్తున్న ఫ్లైట్ వివరాలు ఇచ్చింది.

ఆటలు పాటలతో ఉల్లాసంగా గడిపిన సైంటిస్టులు, వారి కుటుంబాలకు గిఫ్ట్స్ ఇచ్చి అందరికీ షేక్ హాండ్లు ఇచ్చి వీడ్కోలు చెప్పాడు జార్జి. మార్సెల్లో తో అతనికి ఉన్న అనుబంధం చాలా గట్టిది అనుకుంటా, మార్సెల్లోకి మాత్రం వట్టి షేక్ హాండ్ కాకుండా గట్ట్గా భుజం మీద చరిచిహగ్ చేసుకున్నాడు జార్జి. జార్జి శరీరానికి, మార్సెల్లో శరీరానికి దున్నపోతుకి మేకపిల్లకి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. జార్జి చేయి తగిలిన చోట చురుక్కుమన్నట్లుంది, మాటి మాటికి దాన్ని తడుముకుంటూ కాస్త నవ్వు, కాస్త ఏడుపు కలగలిపి వీడ్కోలు ఇచ్చాడు మార్సెల్లో.

లూసీ ని కూడా భుజం మీదచరచబోయాడు కానీ, ’ఓ నో’, అంటూ నమస్కారం పెట్టింది లూసీ.

పెద్దగా నవ్వేసి తను కూడా ఓ నమస్కారం పెట్టేసి హడావుడీగా తక్కిన సైంటిస్టుల వెంట పడ్డాడు జార్జి.

సగం మందికి పైగా తమ గదులు ఖాళీ చేసాక మార్సెల్లో ఫామిలీ ఏర్‍పోర్ట్ వైపుకి బయల్దేరింది. వారితో పాటే తను కూడా జాయిన్ అయ్యాడు  విజయ్.

ఆ నైట్ కి ఇటలీ లోని మార్సెల్లో ఇల్లు చేరారు అందరూ. విజయ్ కి వారి ఇంట్లో గెస్ట్ రూమ్ ఇచ్చారు. అతనికి అవసరమైన సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయా లేదా అని స్వయంగా చూసుకుంది లూసీ.

’మీ అతిథి మర్యాదలు చాలా బాగున్నాయి. నీ ప్రత్యేక పర్యవేక్షణకు ధన్యవాదాలు’ అన్నాడు విజయ్.

సన్నగా నవ్వి ఊరుకుంది లూసీ.

ఫ్లైట్ లో గానీ ఏర్‍పోర్ట్ లో గానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త పడ్డాడు విజయ్. అందుకే డిన్నర్ తర్వాత హాయిగా నిద్రపోయాడు. తను చేయవలసిన పని పూర్తిగా అయింది అన్న నిశ్చింతతో!

ఉదయం దబ, దబా తలుపు కొట్టిన శబ్దానికి ఉలిక్కి పడి లేచాడు. గబుక్కున తలుపు తీస్తే కన్నీళ్ళతో లూసీ నిలబడి ఉంది. 

’ఏమయింది?’ అన్నాడు కీడు శంకిస్తూ.

’అంకుల్ మార్సెల్లో...’అని ఏడ్చింది లూసీ.

గబ గబా మెట్ల మీదుగా కిందికి పరిగెత్తాడు విజయ్. మార్సెల్లో తన గదిలో పసివాడిలా నవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఎవరినీ గుర్తు పట్టడం లేదు. అతన్ని చూడగానే నవనాడులూ కుంగిపోయినట్లయింది విజయ్ కి. శత్రువులు మార్సెల్లో మేధస్సు ని కూడా హత్య చేసేసారు!!

***