అతడు - మా నాన్న?

“ఇప్పుడంత డబ్బెందుకమ్మా?” అడిగాను. “కారణం చెప్పి తీరాలా?” సూటిగా అడిగేసరికి నేను నీళ్ళు నమలాల్సి వచ్చింది “అది కాదమ్మా” అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు ఆమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కానీ వెనకనుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ.

అతడు - మా నాన్న?

     అతడు - మా నాన్న?

-(రచయిత: గండ్రకోట సూర్యనారాయణ శర్మ)

 ప్రభూ! నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి. పంపుతావా?” అని అమ్మ అడగటంతో నాకు ఆశ్చర్యమేసింది.

“ఇప్పుడంత డబ్బెందుకమ్మా?” అడిగాను. 

“కారణం చెప్పి తీరాలా?” సూటిగా అడిగేసరికి నేను నీళ్ళు నమలాల్సి వచ్చింది “అది కాదమ్మా” అంటూ ఏదో చెప్పబోయాను. నా ప్రశ్నకు ఆమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు. కానీ వెనకనుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ.

కొంచెంసేపు మౌనం రాజ్యం చేసిందక్కడ. ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ “ఉన్నట్లుండి ఐదులక్షల రూపాయలు ఖర్చుపెట్టేంత అవసరమేమొచ్చిందని? ఇచ్చేముందు ఎందుకో, ఏమిటో తెలుసుకోండి” అంది గీత గట్టిగా అవతల సుమతికి వినబడేట్లుగా.

“అదే అమ్మా! నీకు ఏమవసరం వచ్చిందో ఏమిటో అని గీత అంటోందంతే“ గీత మాటలకు తను ఏమనుకుంటుందోనని భయపడుతూనే సర్దిచెప్పబోయాను. నేనా మాటలు అనటం ఆలస్యం... అట్నుంచి అమ్మ ఫోన్ డిస్‌కనెక్ట్ చేసేసింది. దాంతో ఏం చెయ్యాలో నాకు అర్ధం కాలేదు. 

“నేను మాట్లాడుతునే వున్నాగా. మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావ్?” విసుగ్గా అన్నాను గీతతో.

“అయ్యో నేనేమన్నానండీ. అంత అవసరమేమొచ్చిందో చెప్పమన్నాను. అదీ తప్పే? ఆ మాత్రానికే ఆవిడ అంత కోపంగా తెచ్చుకోవాలా? అయినా ఆవిడ అడిగింది ఐదువేలో పదివేలో కాదు అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. ఉన్నట్లుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడ్నించి తెస్తారు?”

“ఏదో దోషిని నిలదీసినట్లు సంజాయిషీ అడగటమేమీ బాగాలేదు. అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది. అమ్మ సంగతి నీకు తెలుసుకదా. ఒకరితో మాట పడదు. మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది” 

“మహానుభావా! మీకో దణ్ణం. మీ అమ్మగారికో దణ్ణం. డబ్బిచ్చేది మీరు. తీసుకునేది ఆవిడ. మధ్యలో నాదేముంది. బయటిదాన్ని. సరేనా? ఇంకెప్పుడూ నేను మీ మధ్యకి రాను” అని రెండు చేతులు జోడించి దణ్ణం పెడుతూ విసవిసా తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. నాకేం చెయ్యాలో పాలుపోలేదు.

మా అమ్మకు ఏకైక వారసుడ్ని నేను.  సాఫ్ట్ వేర్ ఉద్యోగినైన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూర్లో పని చేస్తున్నాను. నాన్న కట్టించిన స్వంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది. పోతూ పోతూ, నాన్న ఆ ఇంటిని అమ్మ పేరన రాసి వెళ్ళిపోయాడు. తన భర్త తిరుగాడిన ఆ ఇంట్లోనే తన శేషజీవితం సాగిపోవాలని అమ్మ కోరిక. అందుకే ఒక స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ అక్కడే తను కాలం వెళ్ళబుచ్చుతోంది. నాతో వచ్చి ఉండమని నేనెంత బ్రతిమాలినా ససేమిరా అంది. 

మా ఇల్లు తెనాలిలో ఉంది. అది రెండు వాటాల చిన్న పెంకుటిల్లు. ఒక వాటా అద్దెకిచ్చి, ఒక వాటాలో అమ్మ ఉంటోంది. నాన్న పెన్షనూ, తనకి స్కూల్లో వచ్చే జీతమూ కాక ఇంటి అద్దెకూడ వస్తుండటంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది.  అయినా నేను నెలనెలా అమ్మ అకౌంట్‌లో ఎంతోకొంత డబ్బు జమచేస్తూ వచ్చాను. తనకు డబ్బు అవసరంలేదని అమ్మ చెప్పినా, నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాడ్ని.

నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా “అత్తయ్యగారికి ఎందుకు ప్రతి నెలా డబ్బు పంపుతారు? ఆవిడ ఒక్కతికి ఏం ఖర్చులుంటయ్యక్కడ? ఆవిడేమీ అడగట్లేదుకదా. ఎందుకు డబ్బు పంపుతారు?” అని పోరుతుండేది గీత. అయినా తన మాటలు అతను పట్టించుకునేవాడ్ని కాదు.

అది నా బాధ్యతగా భావించాడు తప్ప ‘ఎందుకు పంపాలి?’ అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నోరు తెరచి డబ్బు కావాలని అడిగింది. అదేమీ చిన్న మొత్తం కాకపోయినా, ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమీకాదు. ఎందుకంటే మా కంపెనీ నాకు ఏడంకెల జీతంతోబాటు, కారు, క్వార్టర్స్ లాంటి అన్ని సదుపాయాలూ సమకూర్చింది. 

నిజానికి ‘ఇప్పుడంత డబ్బెందుకు’ అని నేనూ అడిగేవాడ్ని కాదు. కానీ ఎన్నో రోజులుగా ‘డబ్బెందుకు పంపటం? డబ్బెందుకు పంపటం?’ అంటూ అనుక్షణం పోరుపెడుతున్న గీత మాటలు నా మెదడులో ఏమూలో పేరుకుపోయి, అసంకల్పితంగా ఇప్పుడు బయటికొచ్చేశాయనుకుంటా. 

అమ్మకి కోపం వచ్చి, ఫోన్ కట్ చేసిందని అర్ధమయ్యాక ఇక నాకు నిద్రపట్టలేదు. నాన్న పోయినప్పట్నుంచీ అమ్మే అన్నీ అయి నన్ను పెంచి పెద్ద చేసింది. నాన్న చేసే ఉద్యోగం తనకు రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోపక్క నా ఆలనా పాలనా ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఏ లోపమూ రాకుండా ఎంతో గారాబంగా నన్ను పెంచి పెద్ద చేసింది. అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి కారణమనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత నాకు పెండ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది. 

ఇంత చేసిన అమ్మకి అడగ్గానే డబ్బు ఇవ్వకపోగా ‘ఎందుకు?’ అని సంజాయిషీ అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను. ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. అయినా ఐదు లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది? ఏదైనా గుడి కట్టటానికి చందా ఇస్తోందో లేకపోతే ఏదైనా అనాధాశ్రమానికి విరాళం ఇస్తోందో... ఉన్నట్లుండి అంత డబ్బెందుకు అడిగింది?  ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడగేది కాదని నాకు తెలుసు. అందుకే నేనే పర్సనల్‌గా వెళ్ళి ఐదు లక్షలూ అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఆఫీసు పని వత్తిడిలో పడి, కాస్త ఆలస్యం చేశాను. 

ఈ లోగా శ్యామ్‌గాడి నుంచి వచ్చింది ఫోన్... “ఏరా! మీరు ఇల్లు తాకట్టు పెట్టారట? అంత డబ్బవసరమేం వచ్చింది నీకు?” అన్న శ్యామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది. “ఏం మాట్లాడుతున్నావురా? మేమేమిటి... ఇల్లు తాకట్టు పెట్టటమేమిటి?” అన్నాను.

“అదేంట్రా.. నీకు తెలీనట్లే మాట్లాడుతున్నావు? మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ పది లక్షలు తీసుకున్నారట? నాకు ఇప్పుడే తెలిసింది.”  

నేనేమీ మాట్లాడలేకపోయాను. ‘నాతో ఒక్కమాటైనా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టటమేమిటి?’ అనుకున్నాను. నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా? అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను. కాల్ కలవకపోవటంతో, మళ్ళీ శ్యామ్‌కి ఫోన్ చేశాను “అరేయ్! అమ్మ ఫోన్ కలవటం లేదు. ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా?” అంటూ. 

శ్యామ్ సరేనన్నాడు. మరో పది నిమిషాల తర్వాత వాడినుంచి ఫోన్ “ప్రభూ! మీ ఇంటికి తాళం వేసి ఉందిరా. అద్దెకున్న వాళ్లని అడిగాను. వాళ్ళు అమ్మ గుంటూరెళ్ళిందని చెప్పారు” అంటూ.

మళ్ళీ మళ్ళీ అమ్మ ఫోన్‌కి ట్రై చేసి, కలవకపోవటంతో నాకెందుకో గాభరా పుట్టింది. అందుకే మర్నాడు సాయంత్రం ఆరున్నరకు బెంగళూర్లో ఫ్లైటెక్కాను. విజయవాడలో దిగగానే అమ్మకి ఫోన్ చేశాను. అదృష్టవశాత్తూ కాల్ కలిసింది. వెంటనే నేను తెనాలి వస్తున్నట్లు చెప్పాను. అది విని అమ్మ “నేనిప్పుడు తెనాలిలో లేను నాన్నా. గుంటూరులో ఉన్నాను. నువ్వో పని చెయ్. రజని అక్క ఇంటికి వచ్చేసెయ్” అంది. రజని మా పెదనాన్న కూతురు. గుంటూర్లో ఉంటుంది. బావకి టెలీఫోన్ డిపార్టుమెంటులో ఉద్యోగం.  

ఇంట్లో అడుగుపెట్టేసరికి అక్క ఎదురొచ్చి “రారా! పిన్ని చెప్పింది నువ్వొస్తున్నావని. తను ఇందాకే ఆసుపత్రికి వెళ్లింది. నువ్వు స్నానం చేసి ఫ్రెష్షవ్వు. ఈ లోగా తనొచ్చేస్తుందిలే” అంది.  

ఆమాట వినగానే నేను కంగారు పడి “ఆసుపత్రికా? ఎందుకు? ఏమైంది అమ్మకి” అనడిగాను.

“పిన్నికేమీ కాలేదులేరా? గాభరా పడకు. తెలిసిన వాళ్లకి ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పించిందిట”

“తెలిసినవాళ్లా? ఎవరక్కా?” 

“ఏమోరా? నాకూ సరిగ్గా తెలీదు. ఒక్కసారైనా పిన్నితో నేనూ ఆసుపత్రికి వెళ్ళొద్దామనుకున్నాను. కానీ ఎక్కడ... ఈ మధ్యే ఒక స్కూల్లో టీచర్‌గా చేరాను. దాంతో ఇక ఆసుపత్రికి వెళ్లటానికి కుదిరితేనా?” 

 “సరేలే. నేనొచ్చాగా. అదంతా నేను చూసుకుంటాలే” అన్నాను. 

“తొందరగా ఫ్రెషప్ అయి వచ్చెయ్. ఎప్పుడు తిన్నావో ఏమిటో. వంట రెడీ అయింది” 

“ఇదిగో క్షణాల్లో వస్తా” అంటూ బాత్రూంలోకి వెళ్ళబోతూండగా వెనకనుంచి “ఆఁ! గుర్తొచ్చిందిరా. పిన్ని ఆసుపత్రిలో చేర్చింది ఎవరో శంకరాన్నట. నీకు తెలిసే వుండొచ్చు” అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను.

* * *

శంకరం... ఈ పేరు నా చిన్నప్పట్నుంచీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది. నా ఊహ తెలిసేసరికే నాన్న చనిపోవటంతో ఇక నాకు అమ్మే లోకమైంది. అమ్మ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ, నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది. అయితే మాకేమీ స్వంత వెహికిల్ ఉండేది కాదు. 

ఉదయాన్నే మేం బయల్దేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటిముందు రెడీగా ఉండేవాడు. సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. నన్ను ఇంటికి తెచ్చి, నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలు ఆడించేవాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి, అమ్మని ఆఫీస్‌నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు.

సెలవు రోజుల్లో కూడా మేం ఎక్కడికన్నా వెళ్ళాలంటే, ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో, సరిగ్గా ఆ టైంకల్లా మా ఇంటిముందుండేవాడు. అప్పట్లో నాకు తెలీదుగానీ ఇప్పుడు తలుచుకుంటుంటే, అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలీని ఒక ఆనందం కనిపించేదని నాకు అనిపిస్తోంది. అప్పట్లో వాడిని చూడగానే నాకూ చాలా సంతోషంగా ఉండేది. 

అయితే నాకు వయసు వచ్చేకొద్దీ వాడు మా ఇంటికొస్తుంటే నాకు చిరాకుగా అనిపించటం మొదలు పెట్టసాగింది. నేను ఒక రోజు వాడిని “ఒరేయ్” అని పిలిచాను. వెంటనే అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని “తప్పు నాన్నా. శంకర్ నీకన్నా పెద్దవాడుగదా. అలా పిలవ్వొచ్చా” అంటూ సున్నితంగా మందలించింది.

ప్రతిరోజూ శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం, తిరిగి ఇంటికి తీసుకెళ్ళటం, అమ్మ వచ్చేదాకా నన్నాడించటం, మేము ఎప్పుడెక్కడికెళ్ళాలన్నా అతగాడి రిక్షాలోనే వెళ్ళటం చూశాక, మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవటానికి అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. 

ఒక పేరెంట్ టీచర్ మీటింగ్‌కి అమ్మ వెనకే వాడు కూడా వచ్చి, ఓ పక్కగా నిలబడ్డాడు. అది చూసి మా క్లాస్‌మేట్ ఒకడు నాతో డైరెక్టుగా “మా అమ్మతో మా నాన్న వచ్చాడు. మీ అమ్మతో ఆ రిక్షావాడు వచ్చాడేంట్రా? కొంపదీసి వాడే మీ నాన్నా ఏమిటి?” అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఒళ్ళు మండిపోయి, వాడ్ని కింద పడేసి కుమ్మేశాను. అది పెద్ద గొడవై, ప్రిన్సిపల్ దాకా కంప్లైట్ వెళ్ళటం, ఆయన నాకు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అప్పట్నుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చెయ్యటానికి కారణమైన శంకరంగాడిని చూస్తే ఒళ్ళు కంపరమెత్తటం మొదలుపెట్టింది. ‘అసలెవడు వీడు. ప్రతిరోజూ మా ఇంటికెందుకొస్తాడు? నిప్పులాంటి మా అమ్మ వీడి మూలంగా మాట పడవలసివచ్చిందిగదా. ఊర్లో ఇక రిక్షాలే లేనట్లు అమ్మ అన్నింటికీ వాడ్నే ఎందుకు పిలుస్తుంది?’ అన్నీ జవాబు లేని ప్రశ్నలే. ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్టుగా అమ్మని అడిగేశాను ”అసలు వాడెవడు మన ఇంటిచుట్టూ తిరుగుటానికి? మనకేమైనా చుట్టమా పక్కమా?” అంటూ. 

అంతే. ఆ రోజు అమ్మ ఉగ్రావతారాన్నే చూశాను. నా మీద అమ్మ విరుచుకుపడింది. అమ్మకు అంత కోపం ఎందుకొచ్చిందనేది అప్పుడే కాదు ఇప్పటికీ నాకు అర్ధం కాని విషయం. ఆఫ్ట్రాల్ ఒక రిక్షా వాడికి అంత చనువివ్వటానికి కారణమేమిటో నాకు తెలియలేదు. నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవటం అదే మొదలు. అఫ్‌కోర్స్ అదే చివరిసారి కూడా. కానీ అది ఆ శంకరంగాడి కారణంగానే అవటంతో నాకు వాడిమీద ద్వేషం పెరిగిపోసాగింది. 

ఆ తర్వాత అమ్మతో చాలా సార్లు బయటకి బయల్దేరిన నేను ఆ శంకరంగాడి రిక్షాను చూసేసరికి “నేను రాను నువ్వెళ్ళిరా అమ్మా” అనేవాడిని. 

అప్పుడప్పుడు మేం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుని “ఆటోలో వెళ్దాం అమ్మా” అని నేనంటే “ఎందుకు నాన్నా డబ్బులు దండగ? మన శంకర్ రిక్షా అయితే తక్కువలో వస్తుందిగదా” అనేది. నేను సమాధానం చెప్పేవాడిని కాదిక. రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరంగాడి బీదతనాన్ని వర్ణించి, వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుందని చెప్పేది. 

అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ, ఆ శంకరంగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి, వెళ్ళి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది. నిజం చెప్పొద్దూ.. నాకు ఆ సమయం కోపం నషాళానికి అంటేది. వాడిమీద పడి రక్కాలని అనిపించేది. ఒక్కోరోజు వాడూ, వాడి పెళ్ళామూ వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు. ఆ రోజు నాకు తిండి సహించేదికాదు. 

ఆరో తరగతినుంచీ అమ్మ నన్ను కోరుకొండ సైనిక్ స్కూల్లో వేసింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాక, మా ఇంటి వాతావరణంనుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా, ఆ శంకరంగాడిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి. అందుకే చదువుమీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. నెలకోసారి అమ్మ వచ్చేది. క్రమంగా నేను ఆ శంకరంగాడి గొడవ మర్చిపోయాను. అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను. అక్కడ చదువైపోయాక హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ పూర్తి చెయ్యటమూ, ఉద్యోగం రావటమూ, పెళ్ళి జరగటమూ అన్నీ వరసపెట్టి అయిపోయాయి. ఈ గొడవల్లో పడి ఆ శంకరంగాడ్ని పూర్తిగా మర్చిపోయాను.

కానీ ఇప్పుడు ఏదో పాత గాయం రేపినట్లు, అక్క ఆ శంకరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది. ఏ అర్ధరాత్రో గానీ నిద్రాదేవత నన్ను కరుణించలేదు. ఆసుపత్రి నుంచి అమ్మ ఎప్పుడోచ్చిందో కూడా తెలియలేదు. పొద్దున లేచాక అమ్మతో మాట్లాడుదాంలే అనుకున్న నాకు, నేను లేచేసరికే అమ్మ ఆసుపత్రికి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భ్రాంతికి లోనయ్యాను. 

నేనేదో అనబోతుండగా అక్క నాతో “ఒరే ప్రభూ! ఆ శంకరంగారికి ఈ రోజు సర్జరీ ఉందట. అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది. నువ్వు లేచాక ఒకసారి తెనాలి వెళ్ళి, ఇంట్లో బీరువాలోంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పమంది. మొన్న ఆసుపత్రికి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట. వెళ్ళి తొందరగా భోజనం టైంకల్లా వచ్చేసెయ్. ఆఁ.. వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకెళ్ళటం మర్చిపోకురోయ్” అని చెప్పింది.      

అంత దూరంనుంచి నేను పడీ పడీ వస్తే, అమ్మ నన్ను కనీసం పలకరించనైనా పలకరించకపోవటం, దానికీ ఆ శంకరంగాడే కారణం కావటం చాలా బాధనిపించింది. ఒక రిక్షావాడిపాటికూడా నేను చెయ్యలేదా అనిపించి నా మనస్సు చివుక్కుమంది. అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మ్యానేజ్ చేసి, తెనాలికి బయల్దేరాను.  

నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్‌కి వచ్చాడు. వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకెళ్ళాడు. ముందే చెప్పివుంచాడేమో వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది. నేను వద్దన్నా ఇద్దరూ వినకుండా కొసరి కొసరి మరీ తినిపించారు. వారిద్దరి ఆతిధ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను. ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధను మరచిపోయాను.

తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి, అమ్మ చెప్పినట్లుగా చీరలు తియ్యటం కోసం బీరువా తెరిచాను. కాస్త మంచి చీరల్ని ఒక్కొక్కటీ తీసి పక్కనున్న మంచంమీద పెట్టసాగాను. ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో నాలుగైదు బుక్స్ కనిపించాయి. అవేమిటా... అనుకుంటూ వాటిని బయటకు తీశాను. తీరా చూస్తే అవి డైరీలు. ఎన్నాళ్ళ క్రితమో అన్నట్లుగా అవి చాలా పాతబడిపోయి ఉన్నాయి. వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకుని నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ డైరీలని అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకున్నదని అర్ధమైంది. మొదట నాకెందుకులే అనుకుంటూ ఆ డైరీలు లోపల పెట్టెయ్యబోయాను. కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నని ఆ డైరీల్లోనైనా చూద్దామనుకుని ఒక్కో డైరీ తిరగేయసాగాను. ఎంతో గుండ్రని అక్షరాలతో ఉన్న నాన్న చేతివ్రాతని చూసి, నాన్నని కళ్ళారా చూసినట్లే ఫీలయ్యాను. ఆ డైరీల్లో ఒకచోట శంకరంగాడి పేరు కనిపించగానే ఆగిపోయి, నాన్న వాడిగురించి ఏమి రాశారా అని ఉత్సుకతతో చదవటం మొదలు పెట్టాను.

* *

మా పెళ్ళయ్యి ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది. సుమతితో ఈ రోజు ఒక శుభవార్త చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. త్వరలో మా ఇంట్లో ఒక బుజ్జిబాబు నడయాడబోతున్నాడన్న సంగతి నన్ను ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకి పోవటం ఏమాత్రమూ ఇష్టం లేదని, మర్నాడు మాట్నీకి వెళ్దామనీ అంది. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ రోజే వెళ్ళాలని బలవంతం చెయ్యటంతో సరేనంటూ బయల్దేరింది. 

ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాం. సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయల్దేరాం. సిటీ అంతా నిద్రలో జోగుతున్నట్లుగా ఉంది. అప్పటికే రాత్రి ఒంటిగంట దాటటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇద్దరమూ సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. 

మేం వెళ్తున్న దోవలో ఒకచోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి. వాటిని దాటుతుండగా ఉన్నట్లుండి నలుగురు ఆగంతకులు మాకు అడ్డం రావటంతో స్కూటర్‌బ్యాలెన్స్ తప్పి ఇద్దరమూ కింద పడిపోయాం. ఇద్దరు నన్ను పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు నామీద పడి కొట్టసాగారు. సుమతి నన్ను విడిపించటానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేయసాగింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకి దాదాపుగా నాకు స్పృహ పోయినంత పనైంది. నేను చనిపోయాననుకున్నారో ఏమో వాళ్ళు నన్నొదిలేసి సుమతి పైకి లంఘించారు. వాళ్ళ ముష్టిఘాతాలకి నేను తీవ్రంగా గాయపడి, ఒక్క అంగుళం కూడా కదలలేనట్లుగా నిర్వీర్యుడినైపోయాను. 

 వాళ్ళతో పెనుగులాడుతూనే తను నాకేసి చూసి అరుస్తోంది. తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగగూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ళ మీద తిరగబడింది. కానీ వాళ్ళు నలుగురు. తను ఒంటరి ఆడది. వాళ్ళ పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు. ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తులూ ధారపోసి లేవటానికి ప్రయత్నిస్తూండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది.   

ఉన్నట్లుండి ఎక్కడ్నుంచి ఊడిపడ్డాడో తెలీదుగానీ ఒక యువకుడు వచ్చి, ఆ నలుగురిపైన దాడి చేశాడు. తన చేతిలోని ఇనప రాడ్‌తో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితకబాదసాగాడు. ఒక్కొక్క దెబ్బకి వాళ్ళు హాహాకారాలు చేస్తూ, పగిలిన తలలనుండి రక్తం ఓడుతుండగా, అక్కడ్నుంచి పరారయ్యారు.

“దొంగ నా కొడుకులు పారిపోయారు. లెగండమ్మా. మీకేమీ బయ్యం లేదు” అంటూ అతడు సుమతిని లేపి, చెదిరిన చీరని తనకి చుట్టబెట్టి, నా దగ్గరికి తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు. సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చుని నా తలని తన ఒళ్ళో పెట్టుకుంది. అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి నన్ను చేర్చాడు. డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి, మందులు రాసిచ్చి, రెండ్రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాడు. 

ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ళమీద పడిపోయి, రోదించసాగింది. అతడు కంగారు పడ్డట్లుగా వెనక్కి జరిగి, “నాకు దండం పెడతారేంటమ్మా. నేను రిక్షా లాగి బతికే వాడ్ని శానా సిన్నోడినమ్మా” అన్నాడు. 

“నువ్వు చిన్నవాడివికాదు. మా పాలిట దేవుడివి. ఈరోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనమైపోయేవి. వెయ్యి జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేము. చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చెయ్యమని నిన్ను పంపారేమో. అందుకే ఈ రోజునుంచి నువ్వే మా నాన్నవి” అంటూ అతని పాదాలపై పడిపోయింది. నేను కూడా అతనికి చేతులు జోడించి నమస్కరించాను. 

తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అనీ, తన గుడిసె ఆ దగ్గర్లోనే ఉందనీను. 

ఆ మర్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్. ఇక దాన్ని వాడటం ఇష్టంలేక అమ్మకానికి పెట్టేశాను. అప్పట్నుంచి మేం ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకుని ఆ సంగతి సుమతికి చెప్పాను. నా ప్రతిపాదనకు తను సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది. * * *

మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిశ్చేష్టుడినైపోయాను. ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలీదు. చిన్నప్పట్నుంచీ ‘శంకరంగాడు శంకరంగాడు’ అంటూ అకారణంగా నేను ఎవరిమీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే ఒక గాడ్ అనీ తెలిసి వచ్చింది. అలాంటి దేవుడి కాళ్ళపైబడి క్షమాపణలు అడిగితే గానీ నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ, అక్కడ్నుంచి లేచి, మెల్లిగా మా తాతయ్యని కలవటం కోసం బయటికి నడిచాను.    

           *** సమాప్తం ***