మేధో హత్యలు part 8

This is Eighth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 8

మేధో హత్యలు-8

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

తన గదిలో తనకు ఎదురవ్వబోయే ప్రమాదం ఏమై ఉంటుంది? ఎవరైనా తనకోసం మాటు వేసారా? ఒక్కసారి అనుమానాలు ఉప్పెనలా వచ్చాయి విజయ్ కి. 

ఒక్కో అడుగు మెల్ల మెల్లగా వేస్తూ లోపలికి అడుగు పెట్టాడు విజయ్. ఆ గది తలుపు తెరవగానే కుడివైపు టాయిలెట్ ఉంటుంది. దాని తలుపు బెడ్ రూమ్ వైపు ఉంటుంది. కాబట్టి నాలుగు అడుగులు వేస్తే గానీ బెడ్ కనబడదు.

ఎవరైనా ఉంటే ఈ పాటికే అలర్ట్ అయిపోయి ఉంటారు. నాలుగు అడుగులు వేయగానే తన తల పుచ్చకాయలా పేలిపోతుంది అనుకున్నాడు. ఒక్కసారి మనసులోకి తన గది డైమెన్షన్స్, ఏ వస్తువు ఎక్కడ ఉందో గుర్తుకి తెచ్చుకున్నాడు. రెండు సింగిల్ సీటర్ లగ్జరీ సోఫాలు - వాటి మధ్య ఒక రౌండ్ గ్లాస్ టాప్ టేబుల్. మరో పక్క కింగ్ సైజ్ బెడ్. ఎవరైనా నక్కి ఉండాలి అంటే అది ఆ సోఫాల వెనకే అయి ఉంటుంది.

స్ప్లిట్ సెకన్ లో ఎడమ భుజం వంచి, శరీరాన్ని ఒక లూప్ లాగా చేసుకుని వేగంగా దొర్లుతూ గదిలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళడం వెళ్ళడం నేరుగా మొదటి సోఫా వెనుక భాగానికి చేరుకున్నాడు. కుడి చేతిలోకి తెచ్చుకున్న రూజర్ మార్క్ ని ఎయిమ్ చేసి చూసాడు, ఎవరైనా ఉన్నారేమో అని.

ఎవరూ కనబడలేదు. రెండుక్షణాలు కదలకుండా ఉండిపోయాడు. అప్పటికి అతనికి అనిపించింది, ఆ గదిలో తను ఒక్కడే ఉన్నాడు అని.

జాగ్రత్తగా లేచి రెండవ సోఫా వెనక కూడా ఒక సారి చూసి, కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. అయినా అతని చేతిలో రోజర్ మార్క్ మాత్రం రిలాక్స్ కాలేదు. ఆకలిగా చూస్తూనే ఉంది.

లైట్స్ వేసి గది మొత్తం ఒకసారి కలయ చూసి ఆశ్చర్యపోయాడు. తన గది మొత్తం కోతులు పీకిన వనంలా ఉంది. బెడ్ షీట్స్, అటూ ఇటూ లాగేసి ఉన్నాయి. దిండ్లు చెల్లా చెదురు అయి ఉన్నాయి. తన సూట్ కేస్ ఓపెన్ చేసి ఉంది. దానిలో పేపర్లు అన్నీ కెలికేసి ఉన్నాయి. తన బట్టలు కూడా చెదిరి ఉన్నాయి.

ఎవరో తన గదిని సోదా చేసారు అని మాత్రమే కాదు, ఆ విషయాన్ని తను గుర్తించాలి అని కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు అర్థమయింది విజయ్‍కి. శత్రువులు తనను పరీక్ష చేస్తున్నారు అనుకున్నాడు విజయ్. అంటే వారికి తనపైన అనుమానం వచ్చిందన్నమాట.  ఇప్పుడు తను డాక్టర్ అభిరామ్‍లా ఆలోచించాలి. 

తమ టార్గెట్ అయిన మార్సెల్లో కి దగ్గర దగ్గర గా తిరుగుతున్న డాక్టర్ అభిరామ్ అనే ఇండియన్, నిజమైన సైంటిస్ట్ అవునా కాదా అనేదే వారి సందేహం అని అర్థం అయింది అతనికి. వారి సందేహాలను నివృత్తి చేసి తనే అసలైన డాక్టర్ అభిరామ్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిశ్చయించుకుని తన గన్ ని యథాస్థానానికి చేర్చి, ఇంటర్ కామ్ అందుకున్నాడు విజయ్.

తన గొంతులోకి ఎక్కడ లేని ఆందోళనను తీసుకువస్తూ మానేజర్ ని వెంటనే రమ్మనమని చెప్పాడు. విషయం ఫోన్ లో వినగానే మానేజర్ ’వస్తున్నాను’ అని చెప్పాడు.

అన్నట్లే రెండు నిముషాలలో తన డోర్ దగ్గర ప్రత్యక్షం అయిన మానేజర్ ని చూసి వణికిపోతున్నట్లు కనిపించాడు విజయ్.

’ఏమిటిది? నా గది చూడండి... ఇలా చేసారు... నాకు చాలా భయంగా ఉంది. మీ రెసార్ట్స్ సేఫ్ కాదు. నేను ఈ సెమినార్ ఆర్గనైజర్స్ కి ఫోన్ చేస్తాను’ అన్నాడు విజయ్.

’అవసరం లేదు డాక్టర్ అభ్భీ! నాకు విషయం మానేజర్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ ఇష్యూని పూర్తిగా పరిశోధించి అసలు నిజం కనుక్కుంటాను అని నాకు ప్రామిస్ చేసాడు. మీకు వేరే రూమ్ అలాట్ చేయమని చెప్పాను’ అన్నాడు జార్జ్. అప్పుడే వచ్చాడు అతను. మొదట్లో కనబడిన జోవియల్ నేచర్ కనబడలేదు అప్పుడు. చాలా గంభీరంగా ఉన్నాడు. జరిగిన విషయం పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నట్లు కనిపించింది.

’సర్, నెక్స్ట్ బ్లాక్ లో మరో కంఫర్టబుల్ లగ్జరీ స్వీట్ ఖాళీగా ఉంది. మీ బేగేజిని అక్కడకు షిఫ్ట్ చేయించమంటారా?’ వినయంగా అడిగాడు మానేజర్.

తన అసలు టెస్ట్ మొదలయింది అనుకున్నాడు విజయ్. మార్సెల్లో పక్క స్వీట్ తీసుకోవడానికి తనకున్న రీజన్స్ వినాలనుకుంటున్నాడు మానేజర్. ఆ విషయాలను ఎవరికో చేరవేస్తాడు. వాళ్ళు కన్‍విన్స్ అయితే సరే, లేకపోతే మార్సెల్లో కంటే ముందు తనను ఒక వెజెటబుల్ గా మార్చే ప్రయత్నాలు మొదలవుతాయి అనుకున్నాడు. అందుకే తను ముందుగానే సిద్ధం చేసుకున్న సమాధానాన్ని కన్‍విన్సింగ్ టోన్ లో చెప్పాడు మానేజర్ కి.

’నేను సైంటిస్ట్ మార్సెల్లోతో చాలా ఏళ్ళగా కాంటాక్ట్ పెట్టుకున్నాను. ఆయనకు నేను పిచ్చి అభిమానిని. ఆయన దగ్గర నాకు రీసెర్చ్ లో వచ్చిన కొన్ని అనుమానాలు తీర్చుకోవాలని నా ఆశ. అందుకే పనికట్టుకుని మరీ ఈ స్వీట్ సెలెక్ట్ చేసుకున్నాను. అందువలన, ఈ స్వీట్ లో నే కంటిన్యూ అవుతాను. వీలుంటే... నా గదికి సెక్యూరిటీ పెట్టించండి’ అన్నాడు, చిన్నగా నిట్టూరుస్తూ!

రోట్లో తల పెట్టిన తర్వాత రోకటి పోటుకి వెరవకూడదు అన్న నానుడి గుర్తొచ్చింది అతనికి. తనంతట తనే స్పెషల్ సెక్యూరిటీ అడిగే పరిస్థితి కల్పించిన శత్రువు తెలివితేటలకి మనసులోనే కచ్చగా జై కొట్టాడు. గది బయట సెక్యూరిటీ వాడు తనపైన నిఘా పెట్టే అవకాశాన్ని తనే లడ్డూలా అందించాడు శత్రువుకి. కానీ వేరే ఏం చేయగలడు ఇలాంటి పరిస్థితిలో??

’ఆర్ యూ ష్యూర్?’ అన్నాడు మానేజర్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ.

’అఫ్‍కోర్స్’ అన్నాడు విజయ్.

’అభ్భీ, నీకు కాన్ఫరెన్స్ టైమ్ లో చాలా సమయం దొరుకుతుంది మార్సెల్లో తో కలిసి మాట్లాడటానికి. అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావేమో, ఆలోచించు’ అంటూ విజయ్ కి సలహా ఇవ్వబోయాడు జార్జ్.

’పరవాలేదు జార్జ్. ఏదో పొరపాటున జరిగి ఉంటుంది. కావాలని చేసింది కాదేమో. ఇక ముందు జరగకపోవచ్చు అనుకుంటున్నా’ అన్నాడు తన సోడా బుడ్డి కళ్ళద్దాలను ముక్కు మీద సర్దుకుంటూ.

ఆ పరిస్థితిలో ఇక ఏమీ చేయలేను అన్న తన నిస్సహాయతను వెలిబుచ్చుతూ పెదవి విరిచి, సరే నీ ఖర్మ అన్నట్లు ఒక చూపు చూసి, ’ఓకే మానేజర్, ఇక్కడ స్పెషల్ సెక్యూరిటీ పెట్టించండి’ అని చెప్పి వెళ్ళిపోయాడు జార్జ్.

హౌస్ కీపింగ్ వాళ్ళని పంపిస్తాను. మీ బెడ్ షీట్స్ అవీ మార్పిస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు మానేజర్.

సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతూ తన మొబైల్ తీసి మార్సెల్లో గదికి తను అమర్చిన బగ్ లోవచ్చే ఆడియోను బ్లూటూత్ ఇయర్ ఫోన్స్‍లో విన్నాడు కొంత సేపు. వాళ్ళ మాటలలో ఏవీ ప్రత్యేకమైన అంశాలు లేకపోయేసరికి మొబైల్ లోని ఆ యాప్ ని క్లోజ్ చేసి తను సుప్రియకు పంపిన మెసేజి లకు ఏమైనా స్పందన వచ్చిందా అని చూసాడు. ఎటువంటి స్పందన ఉండదు అనుకున్న విజయ్ ఆశ్చర్య పోయాడు.

ఒకే ఒక వాక్యంతో చురకత్తిలా ఒక మెసేజ్ ఉంది, అందులో.

’ఎక్కడ ఉన్నావ్?’ అని ఉంది.

హమ్మయ్య, సోఫీకి నాపైన కోపం తగ్గింది అనుకుని సంతోషించి, తను ఉన్న రిసార్ట్స్ పేరు రిప్లై లో పెట్టి, ’ఎలా ఉన్నావు బేబీ’ అని కొద్దిగా క్రీమ్ కూడా రాసాడు.

అతని మెసేజి చూసినట్లు బ్లూటిక్స్ రాలేదు, కానీ ఆమె చూసే ఉంటుంది అనుకున్నాడు. కొద్ది సేపు వెయిట్ చేసి ఏమీ స్పందన లేకపోయేసరికి మొబైల్ స్క్రీన్ ఆఫ్ చేసి కోట్ జేబులోకి తోసేసాడు.

హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చి గది అంతా శుభ్రం చేసి బెడ్ షీట్స్ అవీ మార్చి వెళ్ళారు. అప్పుడు ఆలోచన వచ్చింది విజయ్ కి. తన గదిలో కూడా బగ్స్ పెట్టబడి ఉండొచ్చు అని. తనదే కాదు మార్సెల్లో గది లో కూడా బగ్స్ పెట్టబడే ఉండొచ్చు అనికూడా అనుకున్నాడు. ఇంకా రెండు రోజులు ఉంది కాన్ఫరెన్స్ పూర్తి అవడానికి. ఈ రెండు రోజులు తను అటెంటివ్ గా ఉండి మార్సెల్లోకి ప్రమాదం జరగకుండా కాపాడటానికి చూస్తే చాలు. శత్రువు బయటికి వచ్చే అవకాశం ఉంది. శత్రువు అనుకున్న పనిని చేయలేని నాడు తప్పకుండా ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడు తన చేతికి చిక్కుతాడు. సమూలంగా పెరికి వేయాలి అలాంటి విషపు తీగలను అనుకున్నాడు విజయ్.

ఒక సారి తలుపు తెరిచి కారిడార్ లోకి చూసిన విజయ్ కి ఆరున్నర అడుగుల ఎత్తున్న ఒక ధృఢకాయుడు ఆయుధాలు ధరించి సెక్యూరిటీ గా తన గది ముందు పచార్లు కొట్టడం కనిపించింది. వాడి వైపు చూసి నవ్వాడు విజయ్. వాడు తిరిగి నవ్వకపోగా, సీరియస్ గా చూసాడు విజయ్ వైపు. 

’వామ్మో, వీడు నాకు సెక్యూరిటీ లాగా లేడు జైలర్ లాగా ఉన్నాడు’ అనుకుంటూ డోర్ క్లోజ్ చేసుకున్నాడు విజయ్.

***

మరుసటి రోజు తన ప్లాన్ ప్రకారం ఉదయం మార్సెల్లో ఫామిలీ గది దాటి బయటికి రాగానే తను కూడా యాధృచ్చికంగా బయటికి వచ్చినట్లు వస్తూ వారి వెంబడే తిరిగాడు. మార్సెల్లో ని తుమ్మ జిగురులా ఫాలో అవడం ఏమిటో కానీ, లూసీ అతనికి తుమ్మ జిగురు కంటే బలమైన గమ్ లా అంటుకుంది. 

విజయ్ వ్యక్తిగత విషయాలను నేర్పుగా లాగడానికి ప్రయత్నించింది లూసీ. ఆమె ప్రశ్నలకు తను ఇచ్చే సమాధానాలు అభిరామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. అవి అతనికి ఇవ్వబడిన ఫైల్ లో ఉన్న క్లుప్తమైన విషయాలే! ఎక్కువ వివరాలు అతని చదువు, ఉద్యోగం, రీసెర్చ్ ఇంట్రెస్ట్స్ పైన మాత్రమే ఉన్నాయి. లూసీ అడిగే సమాచారం అతని దగ్గర లేక ఇబ్బంది పడ్డాడు విజయ్.

’నీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా?’ అంది లూసీ కాజువల్ గా.

’ఉహూ, నాకు ఇష్టం లేదు. నేను నా రీసెర్చ్ చూసుకుంటూ ఉండటమే ఇష్టం నాకు’ అని చెప్దామనుకున్నాడు, కానీ డా అభిరామ్ ఫేస్ బుక్ లో ట్రెక్కింగ్ చేస్తూ ఉన్న ఫొటోలు పెట్టుకున్నాడు అని గుర్తుకి వచ్చి, ’అప్పుడప్పుడూ ట్రెక్కింగ్ చేస్తుంటాను’ అన్నాడు అనాసక్తంగా.

’నాకు కూడా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. మేము ఉండేది కొండల్లోనే. అక్కడ చాలా అందంగా ఉంటుంది ప్రకృతి. ఎప్పుడైనా చూసావా ఇటలీలోని ఆల్పినైన్ పర్వతాలను. ఆ కొండల మధ్య ఉండే లోయల పచ్చదనాన్ని, ఆ సెలయేర్లను’ అంది లూసీ ఉత్సాహంగా.

ఇటలీలో ఎక్కువ భాగం పర్వతాలతో నిండి ఉంటుంది. ఒక వైపు ఆల్ప్స్, మరోవైపు ఆల్పినైన్ పర్వతాలు. సిసిలీ లో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం కూడా ఉంది. ఇది యూరోప్ లో కెల్లా అతి పెద్ద యాక్టివ్ అగ్నిపర్వతం.

ప్లెయిన్స్ లో ఉండే ప్రజల జీవన సరళికి, కొండ ప్రాంతంలో ఉండే ప్రజల జీవన సరళికి కొట్టొచ్చినంత వ్యత్యాసాలు ఉంటాయి. కొండ ప్రాంతం వాళ్ళు చూడడానికి రఫ్ గా కనిపించినా మనసులో ఏమీ దాచుకోరు. నమ్మితే ప్రాణం పెడతారు. నమ్మకపోతే ప్రాణం తీయడానికి కూడా వెనుకాడరు. తమ ఎమోషన్స్ ని నియంత్రించుకునే ప్రయత్నం ఏమీ చేయరు పెద్దగా. లూసీని చూస్తే అదే అనిపించింది విజయ్ కి. ఈమె కూడా ఒక యాక్టివ్ అగ్నిపర్వతం. ఇప్పుడు శాంతంగా కబుర్లు చెప్తుంది. నేను తనకి దగ్గరయ్యాను అని నమ్మితే ఇక అంతే సంగతులు...

’ఉహు, లేదు’ అన్నాడు విజయ్ తన గొంతుని ఉదాసీనంగా ధ్వనింపచేస్తూ.

అతని ఉదాసీనతను పట్టించుకోవడం లేదు లూసీ.

ఈ సోడాబుడ్డి కళ్ళద్దాలు, మారిన తన హెయిర్ స్టెయిల్ కూడా ఆమె ఆసక్తిని తగ్గించలేకపోతే ఎలాగురా భగవంతుడా అనుకున్నాడు విజయ్. సుప్రియ వెంట తను పడుతుంటే, ఈ కొత్త అమ్మాయి తన వెంట పడుతోంది. ’ఇదేనేమో జీవితం అంటే’ అని విషాదంగా నిట్టూర్చాడు.

’... ఈ కాన్ఫరెన్స్ తర్వాత నువ్వు ఓ నాలుగు రోజులు మాతో పాటు వచ్చెయ్. నీకు ఆ కొండలలో వింతలూ విశేషాలు అన్నీ చూపిస్తాను, ఒక జీవితకాలానికి సరిపడే ఆనందాన్ని మూట గట్టుకోవచ్చు’ అంది అతన్ని టెంప్ట్ చేయడానికి ప్రయతిస్తూ. 

ఆమెకు ఏమీ అర్థం కాకుండా ఏదో గొణిగి, ’మీ పేపర్ ప్రెజెంటేషన్ ఎప్పుడు ఉంటుంది? నేను దాన్ని వినాలని చాలా చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను’ అన్నాడు విజయ్, మార్సెల్లో తో.

దానితో తన భోజనం కూడా మరిచిపోయి మరీ విజయ్ కి తన రీసెర్చ్ విషయాలను వివరించడం మొదలు పెట్టాడు మార్సెల్లో. దూరంగా తమనే గమనిస్తున్న పారలెల్ సెక్యూరిటీ వాళ్ళను ఒక కంట గమనించుకుంటూనే మార్సెల్లో ప్రతి మాటకు ఆసక్తిగా ఊ కొడుతూ వినసాగాడు విజయ్.

కొద్ది సేపు ఆ మాటలు విని, ఇక వాళ్ళు తమ గోలనుంచి ఇప్పట్లో బయట పడరు అని నిశ్చయించుకుని లేడీస్ ఇద్దరు తమ భోజనాలు ముగించుకుని వెళ్ళిపోయారు బీచ్ లలో షాపింగ్ చేసుకోవడానికి.

కాన్ఫరెన్స్ సెకండ్ హాఫ్ లో మార్సెల్లో పక్కనే కూర్చుని అతను చెపుతున్న సుత్తి అంతా వింటూ తల నొప్పి తెచ్చుకున్నాడు విజయ్.

ఎవరైనా మార్సెల్లోని వెజెటబుల్ గా మార్చి అతని మేథస్సుని హత్య చేయాలి అనుకుంటే ఏవైనా రేస్ వాడాలి, లేదా వైరస్ ఎక్కించాలి. రేస్ అంటే దూరం నుంచి కూడా చేయొచ్చు. కానీ ఆ రేస్ ని గురి పెట్టాలి అంటే అతను గుంపులో ఉండకుండా ఒంటరిగా దొరకాలి వాళ్ళకి. సో, మార్సెల్లోని వీలైనంత వరకు ఒంటరిగా  వదలకుండా ఉంటే రేస్ సమస్య పరిష్కరించ బడుతుంది.

అలా కాక వైరస్ ద్వారా శత్రువులు మేధోహత్యకు పాల్పడుతుంటే గనుక వాళ్ళు మార్సెల్లోకి దగ్గరగా రావాల్సిందే. తమకు కావలసిన మనిషికి మాత్రమే సెలెక్టివ్ గా  వైరస్ తో ఎటాక్ చేయాలంటే దాన్ని వాళ్ళు ఏదైనా  ఆహారంలో ప్రత్యేకంగా ఇవ్వడం చేయాలి, లేదా అతన్ని పట్టుకుని ఇంజెక్ట్ చేయాలి. ఆహారం సెలెక్టివ్ గా తీసుకోకుండా తను జాగ్రత్త తీసుకోగలడు. అలాగే మార్సెల్లో చుట్టు పక్కలకు ఎవరినీ రానివ్వకుండా కూడా తను జాగ్రత్తగా తీసుకోగలడు అని అనుకున్నాడు విజయ్.

అటుగా వెళ్తున్న జార్జ్ విజయ్ వైపు చూసి కళ్ళెగరేసి నవ్వాడు. ఇతను మళ్ళీ నార్మల్ గా అయిపోయాడు అనుకున్నాడు విజయ్. నిన్న సీరియస్ గా కనబడడానికి కారణం తన గదిలో జరిగిన ఇన్సిడెంట్ కి బాగా డిస్టర్బ్ అవడమే అయిఉంటుంది అనుకున్నాడు. తను కూడా నవ్వాడు. అతని నవ్వు మరీ అంటువ్యాధి లాంటిదే. ఈజీగా అంటుకుంటుంది అతన్ని చూసిన వారెవరికైనా సరే!

’డా అభ్భీ, ఎలా ఉంది నీ గది?’ అన్నాడు జార్జ్ అటుగా వస్తూ.

’పెర్ఫెక్ట్’ అన్నాడు విజయ్, అదో పెద్ద విషయం కాదు అన్నట్లు దాన్ని తీసిపారేస్తూ.

కానీ మార్సెల్లో లోని సైంటిస్ట్ బ్రెయిన్ అతన్ని ప్రశ్నించేలా చేసింది. ’ఏమయింది నీ గదికి? టెంపరేచర్ ఏమైనా వచ్చిందా?!’ అంటూ పెద్దగా నవ్వాడు.

’జార్జి కూడా పగలబడి నవ్వి మార్సెల్లో భుజం పైన చరిచాడు.

వాళ్ళ స్నేహానికి ఒకింత ఆశ్చర్యపోయాడు విజయ్. చిన్న పిల్లలు లాగా మారిపోతారు ఈ సైంటిస్టులు అనుకున్నాడు.

’అది సరే గానీ రేపు ప్రోగ్రామ్ ఏమిటి జార్జ్’ అన్నాడు విజయ్ మాట మారుస్తూ.

’ఓ, రేపు అంతా పిక్ నిక్ వాతావరణమే. ఈ రోజు కొచెం లేట్ అయినా పేపర్స్ రీడింగ్ పూర్తి చేసేస్తాము. రేపు మనమంతా బీచ్ లోనే గడూపుతాము. లంచ్ కూడా అక్కడే. ఈవెనింగ్ ఫోర్ నుంచి డిస్పర్స్ అయిపోతాము అక్కడి నుంచే’ అన్నాడు జార్జ్. 

’బాగుంది’ అన్నాడు మార్సెల్లో. ’ఫామిలీస్ కి ఆట విడుపులా ఉంటుంది’ అని కూడా అన్నాడు.

’త్వరగా కాన్ఫరెన్స్ హాల్ కి రండి మరి’ అని చెప్పి జార్జి పెద్దగా నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 

జార్జ్ అటు వెళ్ళగానే ఊపిరి పీల్చుకున్నాడు విజయ్. ఈ జార్జ్ గాడు ఓ పెద్ద నవ్వుల అంటువ్యాధి పుట్ట. వాడు పొట్ట ఊపుతూ నవ్వడం చూస్తుంటే మనకి కూడా ఆ నవ్వు అంటుకుంటుంది అనుకున్నాడు మనసులో. ఎందుకో ఈ కామిక్ కారెక్టర్ పైన నాకు చికాకు అనిపిస్తుంది అని కూడా అనుకున్నాడు.

***