మేధో హత్యలు part 11

This is eleventh part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 11

మేధో హత్యలు 11

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

లూసీ ఉషారుగా తన్ కార్ ని రెడీ చేయడానికి వెళ్ళింది. ఆమె కజిన్స్ విజయ్ తో పిచ్చా పాటీ మాట్లాడటానికి ప్రయత్నించారు. వారి మాటలకు అవసరమైనంత వరకే సమాధానాలు చెప్తూ, అవసరం లేదు అన్నప్పుడు చిరునవ్వుతో మాట మారుస్తూ స్పందించాడు విజయ్. కరకుగా మాట్లాడితే ఆ ఎమోషనల్ గాంగ్ ఎలా ప్రతిస్పందిస్తారో ఊహించడం కష్టం అనుకుంటూ.

లూసీ తన వెంట రాకపోతే ఆ కోండ దారుల్లో డ్రైవ్ చేసుకుని వెళ్ళడం కొద్దిగా ఇబ్బందే అనుకున్నాడు విజయ్, లూసీ పక్కనే కూర్చుంటూ. లూసీ డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఫుల్ పవర్ లో ఉన్నట్లు నవ్వింది. విజయ్, తను కలిసి అంకుల్ మార్సెల్లోకి హాని చేసిన వారి సంగతి తేల్చేయబోతున్నాము అన్న ఆలోచన - ఆమెకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. 

’లూసీ మన ఫామిలీ గౌరవం నువ్వు కాపాడాలి. ఏమైనా అవసరం వస్తే ఒక పోన్ కాల్ చాలు ఎక్కడికైనా వచ్చేస్తాం’ అన్నాడు విన్సీ, మీసం దువ్వుతూ.

’విజయ్, నేను చాలు ఆ దుర్మార్గులకి. మీ దాకా రానివ్వకుండా మేమే ఫినిష్ చేసేస్తాము లే’ అంది లూసి.

అందరూ వీడ్కోలు చెప్పాక కార్ ని కొండ దారుల్లోకి ఉరికించింది. చాలా నేర్పుగా ఆ ఘాట్ రోడ్లలో నడిపిస్తూ ముందుకి తీసుకెళ్ళింది. ప్రతి మూడు నాలుగు కిలోమీటర్లకు దారి రెండు గా చీలుతూ కన్‍ఫ్యూజింగ్‍గా ఉంది. కొండలలో చిన్న చిన్న గ్రామాలు అనేకం ఉన్నాయని, వాటిల్లోకి వెళ్ళే దారులు, కొండలలో నుంచి బయటపడే మార్గాలు అలా ఎప్పటికప్పుడూ తమ ముందు అలాంటి కన్‍ఫ్యూజన్ నే క్రియేట్ చేస్తాయని త్వరగానే అర్థం అయింది విజయ్ కి. దానితో లూసీ తన వెంట రావడం చాలా మంచిది అయింది అనుకున్నాడు. కానీ ఆమెను ఎంత త్వరగా వీలయే అంత త్వరగా వదిలించుకోవలసిన అవసరం కూడా ఉంది అంది అతని మనసు. 

తనతో తిరిగితే ఆమె ప్రమాదాలలోకి అడుగుపెట్టినట్లే. ఆమెకు రిస్క్ కలిగించడం చేయకూడని పని విజయ్ దృష్టిలో!

మూడు గంటలలో కొండలలో నుంచి ప్లైన్స్ కి వచ్చేసింది కార్. దూరంగా సిటీ లోని బిల్డింగ్స్, హైవే కనిపించే సరికి, లూసీ ని అడిగాడు విజయ్. ’ఇక్కడ నుంచి నువ్వు సిటీ లోకి ఎప్పుడైనా కాలినడకన వెళ్ళావా?’ అని.

’చాలా సార్లు వెళ్ళాను. పెద్ద కష్టమేమీ కాదు’ అంది నవ్వుతూ.

’ఒక్కసారి ఆపు’ అన్నాడు విజయ్.

కార్ పక్కకు తీసి ఆపింది లూసి. 

కిందికి దిగి ఆమె వైపు వెళ్ళి, దోర్ తీసి ఎయిర్ ఇండియా మహారాజా స్టయిల్ లో చేతులు చూపిస్తూ, ’ఒకసారి దిగు డియర్’ అన్నాడు విజయ్ సమ్మోహనంగా నవ్వుతూ.

’ఏంటి, ఏమయింది నీకు’ అంటూ తను కూడా నవ్వుతూ కిందికి దిగింది లూసి.

’ఇలా రా’ అంటూ ఆమెను కొద్దిగా పక్కకు తీసుకెళ్ళి రోడ్డు పక్కన ఉన్న గడ్డిలోకి గట్టిగా నెట్టేసాడు. ఆమె పడిపోకుండా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా కుదరలేదు. గడ్డి లో పడి రెండు పల్టీలు కొట్టింది.

’టేఖ్ కేర్ బేబీ’ అంటూ పరుగున వెళ్ళి కార్ లో కూర్చుని, స్టార్ట్ చేసుకుని ముందుకి ఉరికించాడు విజయ్. ఇటాలియన్ భాషలోని తిట్లన్నీ కీచు కీచు గొంతుతో అతన్ని తిడుతూ, కార్ వెంట పరిగెత్తింది లూసీ, చేతులు ఊపుతూ.

తనలో తను నవ్వుకున్నాడు విజయ్, ఇటాలియన్ తిట్లు తను నేర్చుకోకపోవడం ఒక విధంగా మంచిదే అయింది అనుకుంటూ! 

***

సిటీ చేరాక తనకు కాబ్ దొరికే చోట కార్ ని విడిచి పెట్టి, వేరే కాబ్ హైర్ చేసుకుని రోమ్ లోని ఖరీదైన హోటల్ కి వెళ్ళిపోయాడు విజయ్. దారిలో తనకు కావలసిన డ్రెస్ లు, వస్తువులు, తీసుకుని.

హోటల్ లో రూమ్ తీసుకుని, తదుపరి కార్యక్రమం గురించి ఆలోచించాడు. మేధో హత్యలకు గురయిన వారిలో డాక్టర్ మార్సెల్లో ఎనిమిదవ సైంటిస్ట్. ఎవరిపైన ఎలాంటి ప్రయత్నం జరిగినా అది ఈ కాన్ఫరెన్స్ ల లోనే జరిగిఉండాలి - ఎందుకంటే ఆ ఎనిమిది మంది ఈ కాన్ఫరెన్స్ లలో పాల్గొని వారి వారి ఇళ్ళకు వెళ్ళిన తర్వాతనే ఇలా జరిగింది.

వాళ్ళు తనని ఏదో విధంగా ఎదుర్కోవడమో ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయడమో చేస్తే తనకు దొరికి పోయేవారుకానీ అలా జరగలేదు. అందువలన వారెవరో తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది అనుకున్నాడు విజయ్. 

వెంటనే బలబీర్ సింగ్ కి కాల్ చేసి తనకు కావలసిన సమాచారం గురించి వివరించాడు.

’దాని వల్ల నీకు అసలు విలన్ తెలుస్తాడంటావా?’ అన్నాడు బలబీర్ సింగ్ సాలోచనగా!

’ఏమో!? తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కనీసం ఒక అవకాశం అయితే ఉంది కదా! ఎవరైతే ఈ మేధో హత్యలు చేస్తున్నారో వారు ఈ కాన్ఫరెన్సులలో తప్పక ఉండి ఉంటారు. నా ఊహ సరైనది అయితే వాళ్ళను కనుక్కోవడానికి ప్రతి పేరు పక్కన వారు ఎన్ని కాన్ఫరెన్సులు అటెండ్ అయ్యారు అన్న నెంబర్ కూడా వేసి నాకు పంపిస్తే నా పని సులభం అవుతుంది’ అన్నాడు విజయ్.

’అర్థం అయింది. సరే, ఏర్పాటు చేస్తాను. నాకు రెండు మూడు గంటల సమయం కావాలి’ అన్నాడు బలబీర్ సింగ్.

’ఆ టైమ్ చాలు నాకు కూడా. నేను నిద్ర పోవాలి’ అన్నాడు విజయ్.

’గుడ్ నైట్’ అన్నాడు బలబీర్ సింగ్. అప్పటికి ఇంకా సాయంత్రం నాలుగే అయింది.

అన్నీ మరిచిపోయి హాయిగా నిద్ర పోయాడు విజయ్. కరెక్ట్ గా ఎవరో లేపినట్లు ఏడు గంటలకు కళ్ళు తెరిచి తన మొబైల్ చూసుకున్నాడు. మైల్ లో బలబీర్ పంపిన లిస్ట్ కనిపించింది. చాలా పేర్లు ఉన్నాయి. వాటిని ఒకసారి అటెండ్  అయిన వాళ్ళు, రెండు సార్లు అటెండ్  అయిన వాళ్ళు... అని విభజించారు.

విచిత్రం ఏమిటి అంటే, చాలా మంది ఒకే ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. ఒక అరడజన్ మంది మాత్రం రెండు సార్లు అటెండ్ అయ్యారు. అలా ఆ పేర్లు చూస్తున్న విజయ్ భ్రుకుటి ముడి పడింది.  

తన అనుమానం తీర్చుకోవడానికి జ్యూరిచ్ వెళ్ళాల్సిందే అనుకున్నాడు విజయ్. సైంటిస్టుల కాన్ఫరెన్స్ లను ఆర్గనైజ్ చేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ జ్యూరిచ్ లోనే ఉంది. స్విట్జర్లాండ్ లో చాలా అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి. అది తటస్థ దేశం. ఎవరితోనూ ఎలాంటి పేచీలు పెట్టుకోదు ఆ దేశం. అయినా అప్పుడప్పుడు ఇలా చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశం తోసిపుచ్చలేము అనుకున్నాడు విజయ్.

ఆలోచనల నుంచి బయటికి వచ్చి రిసెప్షన్ కి ఫోన్ చేసాడు విజయ్. 

’హెలో సర్, ఎలా హెల్ప్ చేయగలము మీకు’ అని అడిగింది కోమలమైన కంఠం.

’జ్యూరిచ్ కి నాకు ఫస్ట్ ఎవైలబుల్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి’ అన్నాడు విజయ్.

’సారీ సర్, హెవీ ఫాగ్ వల్ల ఈ నైట్ నుంచి ఫ్లైట్స్ అన్నీ కాన్సిల్ అయ్యాయి. ఈ పరిస్థితి మరో రెండు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక’ అంది అంతే సౌమ్యంగా.

’ఓహ్.. సరే’ అంటూ ఫోన్ క్రెడిల్ చేసాడు విజయ్.

’ఇక మిగిలింది, కార్ లో గాని, ట్రైన్ లో గానీ వెళ్ళడం. ఉదయం లేవగానే అది డిసైడ్ చేసుకుందాం అనుకున్నాడు విజయ్. నైట్ చక్కగా డిన్నర్ చేసి హాయిగా పడుకుని నిద్రపోయాడు. 

మరుసటి రోజు ఉదయాన్నే లేచి రోమ్ నుంచి జ్యూరిచ్ వెళ్ళే ఎక్స్‍ప్రెస్ ట్రైన్స్ ఎప్పుడు ఉన్నాయో కనుక్కుని ఫస్ట్ ట్రైన్ కాచ్ చేయడానికి హడావుడీగా వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్ కి. దారి పొడవునా ఫాగ్ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది రోమ్ నుంచి బయట పడీతేగాని ఈ ఫాగ్ సమస్య తీరదు అని అర్థం అయింది విజయ్ కి.

యూరోపియన్ ట్రైన్స్ అన్నీ కూడా స్టేషన్ల మధ్య విపరీతమైన స్పీడ్ లో వెళ్తుంటాయి. కానీ ఈ ట్రైన్ కీ మాత్రం మధ్య మధ్య వచ్చే స్టాప్స్ చాలా ఉన్నాయి. అందువలన వేగం పెంచడం తగ్గించడం చీటికి మాటికి జరుగుతూ ప్రయాణం అంతగా సౌకర్యంగా అనిపించలేదు. తన ప్రయాణంలో ఎవరూ తనను గమనించడం లేదు అని, ఎవరూ తనను ఫాలో అవడం లేదు అని ధీమాగా ఉన్నాడు విజయ్. మార్సెల్లోని తమ ప్రణాళిక ప్రకారం మేధో హత్యకు గురిచేసాక, ప్రత్యర్హులు నెక్స్ట్ కాన్ఫరెన్స్ వరకు ఏమీ ప్రయత్నాలు చేయరు అని నమ్మకంగా ఉన్నాడు విజయ్. ఇప్పుడు ఏమైనా చేసినా తమను తాము బయటపెట్టుకోవడమే అవుతుందని వాళ్ళు ఆలోచిస్తారని, అందుకే కదలక మెదలక ఉండడమే బెస్ట్ పోలసీ అనుకుంటారని అతని ఉద్దేశం.

కానీ తనకు ఒక లీడ్ దొరికిన విషయం వారికి తెలిసి ఉండదు. తెలిస్తే తన వెంట పడే వాళ్ళు ఇప్పటికే, అనుకున్నాడు. ట్రైన్ లోని కండక్టర్ కి తన పాస్‍పోర్ట్, టికెట్ చూపించి, తనకు బెడ్డింగ్ ఇవ్వమని అడిగాడు విజయ్. అటెండర్ వచ్చి అతని బెడ్ సెట్ చేసి వెళ్ళాడు. ఊరికే కూర్చుని ఉండడం కంటే పడుకుని రిలాక్స్ అవ్వొచ్చు అనుకున్నాడు విజయ్.

వాష్ రూమ్ కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఒక యూరోపియన్, చేతిలో సిగరెట్ పెట్టుకుని ఎదురయ్యాడు.  మరో చేయి కోటు జేబులో ఉంది. అతను కారిడార్ లో ఎదురవ్వగానే మెడ మీద చీమలు పాకినట్లు అనిపించి ఒక్క క్షణం నిలబడి పోయాడు విజయ్. అంతలోనే అతను సిగరెట్ చూపిస్తూ, ’మాచెస్ ఉన్నాయా బ్రో’ అన్నాడు.

’నేను స్మోక్ చెయ్యను’ అన్నాడు విజయ్. అప్పటికి అతని మెడ మీద చీమలు మరిన్ని పాకుతున్న అనుభూతి. తనను ఎవరో కార్నర్ చేసేసారు అన్న ఫీలింగ్ ఎక్కువయింది.

’మిస్టర్ విజయ్, మాతో కోపరేట్ చెయ్. నీ వెనక నా వాళ్ళు ఉన్నారు. వాళ్ళా చేతుల్లో గన్స్ నీ వీపుకి గురి పెట్టి ఉన్నాయి’ అన్నాడు సిగరెట్ పట్టుకుని ఉన్న యూరోపియన్ లోగొంతుతో.

తన పేరు అతని నోట వెంట వింటూనే ఆ యోరోపియన్ ని గుర్తు పట్టాడు విజయ్. రెడ్ హెయిర్ తో ఎప్పుడూ కనిపించే అతను ఇప్పుడు గోల్డ్ కలర్ హెయిర్ తోను, గాగుల్స్ తోను కనిపించడం, అప్పటికే తనను ఎవరూ ఫాలో చేయడం లేదని తను రిలాక్స్ అయిపోవడమే తన కొంప ముంచాయి అని అర్థం అయింది విజయ్ కి.

మెల్లగా తల తిప్పితన వెనక్కి చూసాడు. ఇద్దరు నల్లటి ధృఢకాయులు ఒకరి వెనుక ఒకరు నుంచుని ఉన్నారు. వారి చేతుల్లో నిగ నిగ లాడుతున్న గన్స్ కనబడగానే బుద్ధిగా తన ఎదుటికి చూసాడు. కోటు జేబులోని  చేతిలో కూడా గన్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది.

’గుడ్ కాచ్. అడ్డంగా దొరికిపోయాను మీకు. ఇప్పుడు ఏం చేయాలి నేను’ అన్నాడు నవ్వుతూ.

’విజయ్, నో ట్రిక్స్ ప్లీజ్. నీ కాబిన్ లోకి పద’ అన్నాడు గాగుల్స్ వాడు.

నిద్రపోవాలి అనుకుని ఉంది అంటే ఇలా ఖాళీగా ఉన్న కాబిన్ ఇచ్చాడు ఆ కండక్టర్. వీళ్ళ చేతికి లడ్డూలా దొరికిపోయాను నేను అనుకున్నాడు విజయ్. 

’ఇలా సైంటిస్టులను వేస్ట్ చేస్తే మీకు ఏం లాభం’ అన్నాడు విజయ్.

’మా చేతుల్లో ఒకపవర్ ఫుల్ ఆయుధం అనుకోకుండా వచ్చి చేరింది. మేము ఎలాంటి ఇన్వెస్ట్‍మెంట్ చేయకుండానే! జస్ట్ మా సహకారం మాత్రమే కోరుకుంటున్నాడు ఒక అజ్ఞాత వ్యక్తి. ఇలా చేయడానికి అతనికి ఉన్న కారణాలు మాకు కూడా తెలియదు’ కూల్ గా చెప్పాడు గాగుల్స్ వాడు.

’అజ్ఞాత అంటున్నావు, అతనెవరో మీకు తెలియదా!?’ ఆశ్చర్యంగా అడిగాడు విజయ్.

అతని మొఖంలో కనబడిన ఆశ్చర్యం ఆ గాగుల్స్ వాడికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. పక పక నవ్వుతూ, ఎక్స్‍పెక్ట్ చేయలేదు కదూ నువ్వు. మేము యాక్టివ్ గా ఇన్‍వాల్వ్ అయ్యేటంత పెద్ద ఇష్యూ అనుకున్నావా ఇది’ అన్నాడు గాగుల్స్ వాడు.

అప్పుడు గుర్తుకి వచ్చింది వాడి పేరు విజయ్ కి. 

’మాక్స్, నేను అదే ఆశ్చర్యపోతున్నాను. ఇది వ్యక్తిగత కక్షల మాదిరి కనిపిస్తున్నది కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా లేదు. అయినా ఇందులో మారణాయుధం ఏముంది?’ అన్నాడు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోనట్లు. అతనికి తన ఎదురుగా ఉన్న కిటికీ లోనుంచి అప్పుడే ఒక మలుపు తిరుగుతూ బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నట్లు అనిపించింది. ట్రైన్ వేగం కాస్త తగ్గింది మలుపు కారణంగా!

విజయ్ నోట తన పేరు వినగానే, సన్నగా నవ్వాడు మాక్స్. ఇంటర్‍నేషనల్ క్రిమినల్ గాంగ్ కి చెందిన టాప్ ఆపరేటివ్ అతను. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ద్వారా ప్రపంచంలో ఏ మూల ఉన్న టెర్రరిస్ట్ కూటమికైనా సహకారాన్ని అందించే ఒక బ్లాక్ ఆర్గనైజేషన్ వారిది. స్విఫ్ట్ వారికి ప్రథమ శత్రువు. ప్రపంచంలోని టెర్రరిస్ట్ కార్యకలాపాలను అరికట్టడం కూడా స్విఫ్ట్ ప్రాధాన్యతలలో ముఖ్యమైనది.

’ఇప్పుడు సైంటిస్టులే... కానీ రేపు దేశాధ్యక్షులు.’అన్నాడు మాక్స్ వంకరగా నవ్వుతూ.

’ఓ’ అన్నాడు విజయ్ అర్థమైనట్లు.

అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఒకే ఒక పంచ్ తో మాక్స్ మొఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం చేయలన్న ఆవేశాన్ని అతి బలవంతం మీద అణుచుకున్నాడు. ట్రైన్ వేగం మరి కాస్త మందగించింది. మాక్స్ కనుసైగ చేసాడు నల్ల ధృఢకాయుల వైపు. 

తనకు మహా ఉంటే పది సెకన్లు ఉంటాయని తెలుసు విజయ్ కి. బ్రిడ్జ్ కింద బ్లూ కలర్ లో నీరు కనిపించింది. కాబిన్ లో తను ఉన్న వైపు ఎమర్జన్సీ చైన్ వేలాడుతూ కనిపించింది. ఒక్క క్షణంలో దాన్ని పట్టుకుని తన బరువుని ఉపయోగిస్తూ కిందికి వేలాడాడు. అతని కదలికలకు చూసి తమపై ఎటాక్ చేయబోతున్నాడు అనుకున్న ఆ ముగ్గురూ అతను చైన్ పట్టుకుని వేలాడడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యారు.

ఎయిమ్ మార్చి అతని వైపు కి గన్స్ ని గురిపెట్టేలోపు సడెన్ బ్రేక్ తో ట్రైన్ ఆగడం మొదలు పెట్టింది. అనుకోని విధంగా ట్రైన్ ఆగేసరికి నిలబడ్డ ముగ్గురూ మూడు వైపులకి విసిరి వేయబడినట్లు పడ్డారు... ఒక్క విజయ్ తప్ప. చైన్ పట్టుకుని వేలాడుతున్న విజయ్ వారు ఊహించిన ఎత్తులో లేడు... పైగా ట్రైన్ ఆగుతుందని తెలుసు కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాడు. 

రెండు చేతులను మోచేతులు తల ముందుకి వచ్చేలా ప్వ్ట్టుకుని బలమంతా ఉపయోగిస్తీ వెడల్పాటి అద్దాన్ని గుద్దాడు. ఆ బలానికి పగిలిన అద్దం ముక్కలు శరీరాన్ని చీరుతున్న బాధను ఓర్చుకుంటూ గాలిలోకి రెండు మొగ్గలు వేస్తూ నీళ్ళల్లోకి డైవ్ చేసాడు. చేతులను తల ముందుకి చాస్తూ.

ఎంతో నేర్పుగా చేయాల్సిన ఆ డైవ్ సరిగా కుదరలేదు. నీటిలోకి దూసుకు వెళ్ళాల్సిన శరీరం రాతి గోడకు గుద్దుకున్నట్లు అదిరింది. అసంకల్ప్తంగా తలను చేతులతో కాపాడుకుంటూ నీటిలోకి జారిపోయాడు. బ్రిడ్జి మధ్యలో ఆగిపోయింది ట్రైన్. మాక్స్, అతని అనుచరులు కిందికి దిగడానికి  అవస్థ పడ్డాద్రు. 

నీళ్ళలోకి వెళ్ళిన విజయ్ తన శరీరం అంతా సుత్తి దెబ్బలు తిన్నంతగా బాధ పడ్డాడు. వంట్లోని ఎముకులు, కండరాలు పప్పు పప్పుగాను, పచ్చడి పచ్చడిగాను అయినట్లు అయింది.

యుద్ధకళల అభ్యాసం, స్విఫ్ట్ చేయించిన కఠోర సాధన అతనికి అండగా నిలిచాయి. ఎంత వేగంగా లోపలికి వెళ్ళాడో అంతకు రెట్టింపు వేగంతో పైకి వచ్చేసాడు, బారలు వేస్తూ వడ్డుకి చేరుకుని పరిగెత్తడానికి ప్రయత్నించాడు. దూరంగా గన్ పేలిన శబ్దం వినిపించింది. ఎడమ తొడలో నిప్పురవ్వ చీలుస్తున్న ఫీలింగ్ కలిగింది. బుల్లెట్ లోపల ఇరుక్కుపోయింది. అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి దాని వేగం తగ్గింది. అయినా పెద్దగాయమే చేసింది. బాధ భరించలేక తూలి పడ్డాడు. 

పైకి లేవకుండా వాలు లోకి దొర్లుకుంటూ పోయి పొదలు అడ్డం పెట్టుకుని ముందుకి సాగిపోయాడు. వాళ్ళు తన వెంట పడడానికి సమయం పడుతుందని తెలుసు. కానీ వాళ్ళు తన వెంట పడడం మానరు. పళ్ళబిగువున బాధను భరిస్తూ అలా కుంటుకుంటూనే ముందుకి సాగాడు. కొంత దూరం వెళ్ళే సరికి పచ్చిక మైదానం, కొన్ని ఆవులు, అక్కడక్కడ విసిరేసినట్లున్న ఇల్లు కనిపించాయి. అడుగు తీసి అడుగు వేస్తుంటే జరుగుతున్న రక్తస్రావం తన వెనక వచ్చే వాళ్ళకు తన ఆచూకి చెప్పేస్తుందని తెలుసు విజయ్ కి.

ఎలాగోలా ఏదో ఒక ఇంటికి చేరితే వారి సాయంతో తప్పించుకోవచ్చు అనుకున్నాడు. అడుగు తీసి అడుగు వేస్తుంటే భూమి గిర్రున తిరుగుతున్న అనుభూతి కలిగింది. బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గుతుందేమో అనుకున్నాడు. అంతలో ఒక పదేళ్ళ పాప కనిపించింది. గట్టిగా అరుస్తూ ఉంది. ఆమెను చూస్తూనే అలా తూలి నేలమీద పడి పోయాడు. క్షణకాలం చీకటి కమ్ముకుంది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి, ఆ పదేళ్ళ పాప పక్కన అదే ముఖ కవళికలతో ఒక స్త్రీ కనిపించింది. ఇద్దరూ అచ్చు గుద్దినట్లు ఒకేలా ఉన్నారు. వయసుల తేడా తప్ప మరే తేడా లేదు. 

అంత అందమైన మొఖాలు తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు అనుకున్నాడు విజయ్. ’తరుముతున్నారు. హెల్ప్ చేయండి’ అన్నాడు. ఆ స్త్రీ తనను భుజాన వేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారించాడు.

’వద్దు, వద్దు, తోపుడు బండి వాడండి’ అన్నాడు. 

సామాను తీసుకు వెళ్ళే తోపుడు బండి ని దగ్గరలోనే చూసిన గుర్తు ఉంది అతనికి. ఆ స్త్రీ గబగబా వెళ్ళి తోపుడు బండి తెచ్చింది. అతి ప్రయత్నం మీద దానిలోకి ఎక్కాడు విజయ్. ఎక్కుతూనే కటిక చీకటి కళ్ళను కమ్ముకుంది. స్పృహ కోల్పోయాడు. అతన్ని ఆ తోపుడు బండిలో పెట్టుకుని తోసుకుంటూ వెళ్ళిపోయారు తల్లీ కూతుళ్ళు.

వాళ్ళు ఇల్లు చేరిన అరగంటకు చుట్టు పక్కల ఉన్న ఇళ్ళ దగ్గరకి మాక్స్, అతని అనుచరులు ఎంక్వైరీలు చేస్తూ తిరిగారు.

***