నీ కోసం

ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం! ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండి ఉంటాయి. కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను. లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి. అవేవీ అతని మనసుని తాకవు. అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు. కానీ ఏ అమ్మాయీ అతని గుండె గదివరకూ రాలేదిప్పటివరకు. ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్. అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు, అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే.

నీ కోసం

నీ కోసం

 

                నాలుగు చంద్రోదయాలు ఒక్కసారే అయినట్టు ఆ గది అంతా తెల్లని వెన్నెల్లాంటి వెలుగుని వెదజల్లుతున్నాయి అందమైన ఫాల్స్ సీలింగ్‍లో అమర్చబడిన ఎల్‍ఇ‍డి లైట్లు.  ఖరీదైన వాల్ పెయింట్ మీద పడి రిఫ్లెక్టవుతున్న వెలుగులో అతని ముఖారవిందం కూడా మెరుస్తోంది,  కాకపోతే ప్రశాంతంగా కాదు,  ప్రజ్వలంగా సూర్యబింబంలా.  అతని కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న డిటెయిల్స్‍ని పరిశీలిస్తోంటే, అతని చేతివేళ్ళు కీబోర్డ్ మీద చురుగ్గా కదులుతున్నాయి. 

                అతను కౌశల్.  జయలక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‍కి అధిపతి. సుమారు ముప్పయ్యేళ్ళు ఉంటుందతని వయసు. స్పురదౄపి. ఏ అమ్మాయి అయినా మళ్ళీ మళ్ళీ తిరిగి చూసేంత అందమైన రూపం,  ఆకర్షణీయమైన పర్సనాలిటీ అతని సొంతం.  అందమైన, పరాక్రమవంతుడైన రాజకుమారుడి కోసం కలలు కనే ప్రతీ ఆడపిల్ల మనసునీ కొల్లగొట్టే మోస్ట్ ఎలిజబుల్ బాచిలర్ అతను.

                ఆ వయసు కుర్రాళ్ళలా అతని కలలు అందమైన అమ్మాయిల చుట్టూ తిరగవు! ఆశలు అసామాన్యమైన ఆనందాలను అందుకోవాలని ఆరాటపడవు!! అతను కలలు కనేది వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం!  ఆశపడేది కొత్త కొత్త పథకాలతో వ్యాపారాభివృద్ధి చేసి ఆనందించడం కోసం!! వెరసి అతని ఆశయాలు చేపట్టిన వ్యాపార రంగాల్లో మరింత ఎత్తుకు ఎదగడానికి కృషి చెయ్యాలనే సంకల్పాలతో నిండి ఉంటాయి. 

                కానీ అందమైన ఆడపిల్లల కలల రాకుమారుడు అతను.  లేలేత పరువాల ఆందాల మల్లెతీగలెన్నో అతనిని అల్లుకోవాలనుకుంటాయి.  అవేవీ అతని మనసుని తాకవు.  అమ్మాయిలతో స్నేహం అతనికి కొత్త కాదు.  కానీ ఏ అమ్మాయీ అతని  గుండె గదివరకూ రాలేదిప్పటివరకు.  ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వడు కౌశల్.  అపురూపమైన ఏ అపరంజి బొమ్మ అయినా అతనికి తారసపడినప్పుడు,  అతని హృదయం క్షణకాలమైనా చలిస్తుందా, లేదా  అని చాలా మందికి సందేహంగా ఉంటుంది అతనిని చూస్తే.  

                ఎప్పుడూ తన కంట్రోల్‍లో తను ఉండాలి అనుకుంటాడు, వేరే ఎవరైనా తనని కంట్రోల్ చెయ్యాలనుకోవడం అతనికి నచ్చదు.  ధృడత్వం, దారుఢ్యం అతని శరీరానికే కాదు,  మనసుకు కూడ ఉన్నాయి.  మాట తీరు కటువుగా ఉండి, పని విషయంలో పట్టుదలగా ఉండే అతనంటే ఆఫీస్ స్టాఫ్ అందరికీ గౌరవంతో పాటూ భయం కూడా.

                కౌశల్ తన కంపెనీల్లోని ఉద్యోగులందరి సంక్షేమం చూడడంలో ఎటువంటి లోటూ చెయ్యడు.   అందువల్ల అతని ప్రవర్తన దురుసుగా ఉన్నా, దానిని చురుకుతనంగా భావిస్తారు వాళ్లందరూ.  మహరాజుకీ,  ప్రజలకీ ఉన్న బంధం లాగానే ఉంటుంది కౌశల్‍కి, కంపెనీ స్టాఫ్‍కి మధ్య ఉన్న సంబంధం.

                అతను సొంతం కావడం మాట ఎలా ఉన్నా, అతనికి చేరువగా ఉండాలన్నా బంగారు పూలతో పూజ చేసుకుని ఉండాలేమో అని అమ్మాయిలు భావిస్తే అది అతని తప్పు కాదు.  అయితే ఏ అమ్మాయికీ అతనికి దగ్గరయ్యే ఛాన్స్ లేదని అందరికీ ఒక పెద్ద సందేహం.

                సిస్టమ్ ముందు కూర్చుని ఉన్న అతని లోని గంభీరతకి ఆ గదిలోని వాతావరణం కూడా వేడెక్కుతున్నట్లుగా ఉంది. కౌశల్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్.బి.ఎ. చేసాడు.  ఇండియా వచ్చిన తరవాత అతను బిజినెస్ మీద తన దృష్టి అంతా కేంద్రీకరించాడు. తండ్రి నుండి వచ్చిన బిజినెస్‍లను మరింతగా అభివృద్ధి చెయ్యడం ప్రారంభించాడు.  టెక్స్ట్‍టైల్స్, ప్లాస్టిక్స్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెంచాడు.

                కౌశల్ తండ్రి భానుప్రసాద్ కొద్ది సంవత్సరాలుగా ఫారెన్‍లోనే ఉంటున్నాడు.  ఒక హెల్త్ ఇష్యూ వల్ల భానుప్రసాద్‍కి  అక్కడ సర్జరీ జరిగింది.  ఆ తరవాత కూడా  అక్కడే ఉండి రెగ్యులర్‍గా ట్రీట్‍మెంట్ తీసుకుంటున్నాడు.  మనసుని బరువెక్కించే బాధాతప్త జ్ఞాపకాలనుండి తండ్రి అయినా దూరంగా ఉన్నాడు అనుకుంటాడు కౌశల్. 

                తను ఎక్కడ ఉన్నా జరిగిన దారుణ సంఘటన తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటే ఆ బాధని భరించే ధైర్యం దేవుడిని ఇమ్మని కోరుకుంటూ, అంతకు ముందు ఆనందంగా గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ రోజులు గడుపుతున్నాడు భానుప్రసాద్.

                ఆ కుటుంబానికి తగిలిన దెబ్బ ఎప్పటికీ కోలుకోలేనిది. కాలం ఏ గాయాన్నయినా మాన్పుతుంది అంటారు, కానీ కాలం ప్రయాణించేంత వేగంగా మనసుకు తగిలిన గాయాల నుండి బయటపడలేరు ఎవ్వరూ.  ఇండియాలో ఉంటే ఆ జ్ఞాపకాల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుందని తండ్రి ఇంకొంత కాలం అక్కడే ఉంటే బెటరనుకుంటాడు కౌశల్. 

                కౌశల్ కంప్యూటర్ విడిభాగాలను తయారు చేసే కంపెనీని కొత్తగా టేకోవర్ చేసాడు.  ఆ కంపెనీకి అప్పటికే మంచి పేరు ఉంది. అందువల్ల దాన్ని కూడ మరింతగా అభివృద్ధి చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నాడతను.  రీసెంట్ బిజినెస్ వివరాల గ్రాఫ్ చూసినప్పుడు అతనికి బిజినెస్ మందకొడిగా నడుస్తున్నట్టు అర్ధమయింది. అతను మానేజర్‍ని వివరాలు కనుక్కున్నాడు.  క్రిస్మస్ శలవులు పెట్టుకుని కొంతమంది స్టాఫ్ వెళ్ళడం వల్ల పని సరిగ్గా సాగడం లేదని అతని మానేజర్ షీలా అతనికి చెప్పింది.  ఈ కంపెనీని కొత్తగా టేకోవర్ చేసాడు కాబట్టి ఈ విషయాలన్నీ అతనే చూసుకోవలసి వస్తోంది.  మిగిలిన కంపెనీలలో సీనియర్ మానేజర్స్ కౌశల్ వరకూ రాకుండా ఇవన్నీ మానేజ్ చేసేసుకుంటారు.

                కంపెనీలో పనులు చురుకుగా సాగడానికి కొంతమంది ఉద్యోగుల్ని తాత్కాలికంగా నియామకాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు కౌశల్. కౌశల్ అతని కంపెనీల్లో ఆపుడప్పుడు ఇలా తాత్కాలిక ఉద్యోగుల్ని నియమిస్తూ ఉంటాడు.  అలా చేర్చుకునే వారిలో గవర్న్‍మెంట్ నుండి సిఫారస్ చెయ్యబడిన వ్యక్తులు కూడ ఉంటారు.  ఉద్యోగులని నియమించడానికి కావలసిన చర్యలు తీసుకోమని అప్పటికే షీలాకి చెప్పి ఉన్నాడు కౌశల్.   కౌశల్ ఆఫీస్‍కి వచ్చాక షీలా ఇంటర్‍కమ్‍లో చెప్పింది,  కాంటాక్ట్ బేసిస్ మీద కంపెనీలో పని చెయ్యడానికి మూడు అప్లికేషన్లు వచ్చాయని. ఆమె ఆ అప్లికేషన్లు తీసుకుని వచ్చేలోపులో అతను ఆలోచించసాగాడు,  ఆ ముగ్గురినీ ఉద్యోగంలో తీసుకుంటే వాళ్లకి ఏ ఏ విభాగాల్లో పనులు అప్పచెప్పాలా అని.

                సిస్టమ్ బ్రవుజ్ చేస్తున్న కౌశల్ అసంకల్పితంగా ఒక ఫోల్డర్ ఓపెన్ చేసాడు.  ఆ ఫొటోలు చూస్తూ, తమ్ముడి జ్ఞాపకాలలో తనని తాను మరిచిపోయాడు అతను.  నయాగరా జలపాతాల అందాలు తనివితీరా చూసారు తామిద్దరూ.  ఘనీభవించిన నీటిరాసులని చూసి ఆనందంలో చిన్నపిల్లాడిలా తమ్ముడు గెంతులు వేసాడు.  తమ్ముడు ఏ చిన్న సాహసం చెయ్యబోయినా చాలా అలెర్ట్‍గా ఉండేవాడు కౌశల్.  కొన్నిసార్లు తమ్ముడి ఉత్సాహనికి ఆనకట్ట వేసేవాడు కూడ.  ఆ ట్రిప్‍లో ప్రతీ మూమెంట్‍నీ ఎంజాయ్ చేసారు ఇద్దరూ. 

  ప్రతీ ఫోటోలోనూ తమ్ముడు ఎంతో ఉత్సాహంతో కనపడ్డాడు.  ఆనందం అతని ముఖంలో తొణికిసలాడుతోంది. అలా ఫోటోలలోనూ జ్ఞాపకలలోనూ మిగిలిపోయిన తమ్ముడిని తలచుకుని కౌశల్ కళ్ళల్లో సన్నని నీటి పొర కదలాడింది.

                న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.  ప్రపంచంలోని ఉత్సాహమంతా ఆ వేడుకలోనే వరదలై పొంగింది.  ఆ వెనువెంటనే పెను ప్రమాదం పొంచి ఉందని తెలియలేదు ఎవ్వరికీ.  ఆ సంఘటన గుర్తుకురాగానే అతని ఆలోచనలలో మరింతగా అలజడి కలిగింది.  నుదుటి మీద అరచేతితో రుద్దుకున్నాడు అసహనంగా. ఎన్ని ఉన్నా ఏమీ చెయ్యలేని అసహాయ క్షణాలు ఎంత గొప్పవాడినయినా, ధైర్యవంతుడినయినా కొద్ది సేపయినా అలజడికి, అసహనానికి గురి చేస్తాయి. కౌశల్ కూడ అటువంటి పరిస్థితికే లోనయ్యాడు ఆ క్షణంలో. మూడేళ్లయింది ఆ ఘటన జరిగి.  ఆ విషాద సంఘటన అతని కుంటుంబాన్ని కుదిపేసింది.  అప్పటినుండి కౌశల్ మళ్ళీ అలా వేడుకలు చెయ్యలేదు.

                తమ్ముడూ! నువ్వు నాకు ఎప్పుడూ దూరం అవ్వవు.  నువ్వు ఎక్కడున్నా అనుక్షణం నా వెన్నంటే ఉంటావు  కౌశల్ హృదయం అతని తమ్ముడి ఆలోచనలతో భారమయింది. అదే సమయంలో ఇంకొక వ్యక్తి అతనికి గుర్తు వచ్చింది. ఆమె గుర్తుకు రాగానే కౌశల్ ముఖం ఆవేశంతో కందింది.  కోపంగా పిడికిలి బిగించాడు.  ఆమె పట్ల తీవ్రమైన భావాలు అతని హృదయంలో పౌర్ణమి పూట సముద్ర కెరటాలలా లేచాయి.

                అతని కేబిన్ డోర్ చిన్నగా నాక్ చేసిన శబ్దం విని తన కుర్చీ పక్కనున్న సైడ్ టేబుల్ మీది రిమోట్ తీసి ప్రెస్ చేసాడు కౌశిక్.  అతని కేబిన్ డోర్ నెమ్మదిగా ఓపెన్ అయింది. షీలా లోపలికి వచ్చింది. కౌశల్ అప్పటివరకూ ఉన్న ఆలోచనల్లోంచి వెంటనే బయటికి వచ్చేసాడు.  సమయానికి తగినట్లుగా అతను తనని తాను సర్దుబాటు చేసుకోగలడు,  పరిస్థితులకనుగుణంగా మేనేజ్ చేసుకోగలడు. 

                షీలా చేతిలో అప్లికేషన్స్ ఉన్నాయి.  ఈ మూడూ కూడా గవర్న్‍మెంట్ నుండి వచ్చిన సిఫారస్ అప్లికేషన్‍లే. ముగ్గురూ గ్రాడ్యుయేట్సే. ఎలిజిబుల్ కాండిడేట్సే. మీరు ఓకే చేస్తే వీళ్ళు ముగ్గురినీ అపాయింట్ చెయ్యచ్చుఅంది షీలా.

                ఎలిజిబుల్ కాండిడేట్స్ అయినప్పుడు అపాయింట్ చేసెయ్యడమేఅన్నాడు కౌశల్. 

                మీరు ఒకసారి చూడండి సర్  అంది షీలా.

                వీళ్ళు మహా అయితే రెండు, లేదా మూడు నెలలు ఉంటారు అంతే కదా! తీసేసుకోండి.  మనకీ ఇప్పుడు స్టాఫ్ అవసరం ఉందిఅన్నాడు కౌశల్.

                మూడు సిఫారసులు ప్రభుత్వం నుండే వచ్చినా, వీటిలో ఒకటి జైలు అధికారుల నుండి వచ్చింది  అంది షీలా. ఆమె ఆ మాట చెప్పినప్పుడు విన్న అతని ముఖ కవళికల్లో ఏ భావమూ కనిపించక కొంచెం కన్‍ఫ్యూజ్ అయింది ఆమె.

                ఆమె దొంగతనం చేసిందా? అవినీతికి పాల్పడిందా?’ అడిగాడు షీలావైపే చూస్తూ.

                లేదు సర్!  రెండూ కాదుఅంది షీలా.

                దెన్, నో ప్రోబ్లెమ్.  అపాయింట్ చేసెయ్యండి  అన్నాడు కౌశల్. ఎందుకో అతనికి ఆ టాపిక్ ఇంక పొడిగించాలని అనిపించలేదు.  షీలా తెచ్చిన లిస్ట్ లో జైలు అధికారులు సిఫారసు చేసిన పేరు ప్రణతిది.

*             *             *            

                ప్రణతి ఆ ఉద్యోగం దొరుకుతుందని ఎక్కువ హోప్ ఏమీ పెట్టుకోలేదు. చిన్న వయసులోనే ఎక్కువ జీవితాన్ని చూసేసిన ఆమెలో ఒక విధమైన నిర్లిప్త భావన నెలకొని ఉంది.

                ప్రణతిది మధ్య తరగతి కుటుంబం. ఆమె తండ్రిది జయలక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‍లోనే ఒక కంపెనీలో చిన్న ఉద్యోగం. ప్రణతి తల్లికి ఒక ప్రైవేట్ స్కూల్‍లో టీచర్‍గా ఉద్యోగం.

                ఇద్దరికీ చిన్న ఉద్యోగాలు, ముగ్గురు పిల్లలు అవడంతో వారి జీవితాలు భారంగా గడిచేవి.  మగపిల్లవాడు లేడని వాళ్ళు తరచూ అసంతృప్తికి లోనయ్యేవారు. ప్రణతి ఎప్పుడూ తండ్రి నిర్లక్ష్యానికి,  నిరాదరణకి గురవుతూ ఉండేది. ఇంటర్ సెకండ్ ఇయర్‍లో ఉండగా జరిగిన ఆ సంఘటన ఒడిదుడుకులుగా సాగుతున్న ఆమె జీవన నావని మరింతగా అల్లకల్లోలం చేసేసింది.

                ఆమె మీద మోపబడిన నేరానికి ఆమెకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది.  ప్రణతి అరెస్ట్ అయిన రోజునుండే ఆమె తల్లిదండ్రులు ఆమెని దూరం పెట్టారు.  ఆమె కస్టడీలో ఉన్నన్ని రోజులు కానీ,  విచారణ జరుగుతున్నప్పుడు కానీ ఆమె కుటుంబసభ్యులెవరూ అమెని కలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రణతి తమ కూతురే కాదు అనే నిర్ణయానికే వచ్చేసారేమో వాళ్ళు అనుకున్నారు అందరూ. విచారణ జరుగుతున్న సమయంలో ప్రణతికి వాళ్ల వీధిలోనే ఉండే ఒక వ్యక్తి కోర్టు దగర కనిపించాడు.  అతనిని ఆమె తన తల్లిదండ్రుల గురించి అడిగింది.   ఒక వారం రోజుల తరవాత అతను మళ్ళీ కనిపించాడు. అప్పుడు చెప్పాడు అతను ప్రణతి కుటుంబం గురించి ప్రణతి ఏమాత్రం ఊహించని విషయాలు.

                నిన్ను కలుసుకోవడానికి కాదు కదా,  నిన్ను తలచుకోవడానికి కూడ మీ ఇంట్లోవాళ్ళకెవరికీ ఇష్టం లేదు.  ప్రణతి అనే కూతురే మాకు లేదు, అన్నారు  అన్నాడు ఆ వ్యక్తి.

                తల్లిదండ్రులు తనని ప్రేమగా పెంచడం లేదని ఆమె అనుకునేది కానీ, ఇలా తమకి సంబంధం లేని మనిషిగా భావిస్తారని ఆమె ఎంత మాత్రం ఊహించలేదు.   అయినా కూడా ఆమె మనసులో ఇంకా ఆశ మిగిలే ఉంది, వాళ్ళు తనని కలుసుకుంటారని.

                నా పేరెంట్స్ నిజంగా అలా అన్నారా?  మీరు నా పేరెంట్స్‍నే కలుసుకున్నారా,  పొరపాటున వేరే ఎవరినయినా కలుసుకున్నారేమోఅంది ప్రణతి.

                వాళ్ళెవ్వరూ నిన్ను తమ మనిషిగా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు.  తమ కూతురు ఒక నేరస్థురాలు అని తెలిస్తే తమ మిగతా కూతుర్లకి పెళ్ళిళ్ళు అవ్వవని వాళ్ళ భయం.  నీకొక కుటుంబం ఉందని నువ్వు మర్చిపో  అన్నాడు అతను. బీడుభూమిలా మారిపోయింది ఆమె హృదయం.  ఆమె కళ్ళు ఎప్పుడో వర్షించడం మానేసాయి. ఎటుచూసినా ఎడారిలా కనిపిస్తున్న నిస్పృహలో నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది ప్రణతి.  

                తల్లిదండ్రులు తనని ఎందుకు ప్రేమగా చూడడం లేదో ప్రణతికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు.  తండ్రి అయితే ప్రణతి ముఖం చూడడానికే ఇష్టపడేవాడు కాదు.  తల్లి కూడ ఎప్పుడూ కసురుకున్నట్టు మాట్లాడడం ప్రణతిని మరింతగా బాధ పెట్టేది.  తల్లికి ప్రణతి మీదున్న కోపం,  అసహాయత వల్ల కలుగుతున్న కోపమని అర్ధం చేసుకునే వయసు ప్రణతికి లేదు.  

                ప్రణతికి ఊహ వచ్చినప్పటి నుండీ ఆమె కొత్తబట్టలు ఎప్పుడూ వేసుకోలేదు.  ఆమె అక్కలు వాడిన బట్టలే అమెకి ఎప్పుడూ వేసుకోవడానికి ఇచ్చేవారు.  పుస్తకాల దగ్గరి నుండి ఆమెకి కావలసిన ప్రతీ వస్తువు వాడేసిన పాతవస్తువులే అయ్యేవి. ప్రణతి మనసు చాలా సార్లు ఎదురు తిరిగేది,  ఆ పాత బట్టలు వేసుకోవడానికి, ఆ పాత వస్తువులు వాడుకోవడానికి.  అయినా అంతకు మించి గత్యంతరం లేకపోవడంతో  బాధని, కోపాన్ని దిగమింగుకుని ఆ పాత వస్తువులనే వాడుకునేది. 

                అణచిపెట్టుకున్న కోపం ఆమెను హైపర్ ఏక్టివ్‍గా మార్చడం మొదలుపెట్టింది.  పెంకితనం, పట్టిన పట్టు విడవకుండా ఉండడం ఆమె లక్షణాలుగా మారాయి.  తల్లిదండ్రులు ఆమెతో సరిగ్గా ప్రవర్తించనట్లే ఆమె కూడ వాళ్లతో పెడసరంగా ఉండెది. తల్లి చెప్పిన మాట వినకపోవడం, బయటికి వెళ్ళినా తల్లికి చెప్పకపోవడం చేసేది ప్రణతి. తన ఇద్దరు అక్కలతో కూడా సఖ్యంగా ఉండేది కాదు.

                 ప్రణతికి చదువు మీద చాల శ్రద్ధ ఉండేది.  ఆమె మనసులో ఎటువంటి కలవరం ఉన్నా, దాని ప్రభావం చదువు మీద పడనిచ్చేది కాదు.  ఆమె చదివేది గవర్న్‍మెంట్ గర్ల్స్ హైస్కూల్  అయినా ఎప్పటి పాఠాలు అప్పుడు శ్రద్ధగా చదువుకుంటూ తరగతిలో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది.

                టెన్త్ పరీక్షలు అయినప్పుడు ప్రణతి పేరు చాలా మందికి తెలిసింది.  ఆమెకు ఆ సిటీలోనే పదవ ర్యాంకు వచ్చింది.  ప్రైవేట్ కాలేజీలు ఆమెని ఫీజులు లేకుండా జాయిన్ చేసుకుని చదివించడానికి ముందుకొచ్చాయి.  రంగారావు ప్రణతిని కాలెజీకి పంపడానికి ఒప్పుకోలేదు. 

                నీ అక్కలు ఇంట్లోనే ఉంటున్నారు.  నువ్వు మాత్రం కాలేజీ అంటూ బయటికెళ్ళిపోదామనుకుంటున్నావా? అదేం కుదరదు.  వాళ్ళతో పాటూ ఇంటిపట్టునే ఉండి పనులు చేసుకోఅన్నాడు రంగారావు కోపంగా. ఆడపిల్లలు కళ్ళముందు తిరుగుతుంటే వాళ్ళని ఏదో ఒకటి అంటూండేవాడు.  ఆడపిల్లల పట్ల భర్త ప్రవర్తన శ్రీవిద్యకి నచ్చేది కాదు.  కానీ చిన్న మాట ఆమె తిరగేసినా అతను గట్టిగా అరిచేవాడు.  మరీ ఎక్కువ కోపం వస్తే ఆమె మీద చెయ్యి చేసుకునేవాడు కూడా.  శ్రీవిద్య రంగారావుని ఎదిరించి ఏమీ మాట్లాడేది కాదు.

                మంచి కాలేజీలో జాయినవ్వడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రణతి నిర్ణయించుకుంది. తండ్రి ఒప్పుకోకపోతే అతన్ని ఎదిరించింది. అమ్మ డిగ్రీ చదివింది కాబట్టే కదా ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది.  నువ్వు కాలేజ్ ఫీజ్ కట్టక్కరేదు.  నేను కాలేజ్‍లో జాయినవ్వాల్సిందేఅని పట్టు బట్టింది.       

                ప్రణతి కాలేజ్‍కి వెళ్ళిన మొదటిరోజే జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పింది. చురుకైన అమ్మాయి అయినా కొత్త వల్ల బెరుకుగా కాలేజ్ ఆవరణలోకి అడుగుపెట్టింది.  ఇంటర్‍మీడియెట్ లో చేరిన కొత్త స్టూడెంట్స్‍ని సీనియర్స్ రాగింగ్ చేస్తున్నారు.  ఆవరణలో ఉన్న డయాస్ మెట్ల మీద గుంపులా కొంత  మంది అబ్బాయిలు, అమ్మాయిలూ ఉన్నారు. వాళ్ళ ముందు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి.  వాళ్ల ర్యాగింగ్ అయిపోయినట్లుగా వాళ్ళని పంపించేసి,  ఆ స్థానంలో ప్రణతిని నిలబెట్టారు.

                మొదటి రోజే లేట్‍గా వచ్చావేంటి?’  అడిగింది ఒక అమ్మాయి ప్రణతిని.

 (ఇంకా ఉంది)