మేధో హత్యలు part 3

This is Third part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 3

మేధో హత్యలు - ౩

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

అడుగుల శబ్దం దగ్గరకి వచ్చింది. ఎవరో గానీ జాగ్రత్తగా వస్తున్నారు అనుకున్నాడు విజయ్. వచ్చేవాడు పక్కా ప్రొఫెషనల్ అయి ఉంటాడు అందుకే తను ఉన్నాడా పోయాడా అనే విషయం కన్‍ఫర్మ్ చేసుకోవడానికే వస్తున్నాడు. వాడి ని కవర్ చేస్తూ కనీసం మరొకడు సరైన రేంజ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకున్నాడు. ఊపిరి బిగబట్టి అడుగుల శబ్దం దగ్గరకి రావడం కోసం చెవులు రిక్కించాడు. 

వచ్చే వాడు ప్రొఫెషనల్ కాబట్టి గన్ ని అవసరమైనప్పుడే వాడుతాడు అని అర్థమయింది విజయ్‍కి. ఆ అవసరం వాడికి తను బ్రతికి ఉన్నాడు అని అనుమానం ఎప్పుడు వస్తే అప్పుడే కలుగుతుందని తెలుసు విజయ్ కి.

అడుగుల శబ్దం తన దగ్గరకు రాగానే ఆగింది. రెండు క్షణాలు పరిశీలనగా చూసి ఉంటాడు అతను విజయ్ వైపు, తర్వాత ఒక చేత్తో బోర్లా పడి ఉన్న విజయ్ ని తన వైపుకి తిప్పాడు. 

తనను తిప్పుతున్న ఆ చేతికి ఒక ప్రాణం లేని శరీరం ఎలా వేలాడుతున్నట్లు స్పందిస్తుందో అలాగే స్పందిస్తూ తిరిగాడు విజయ్. 

ఒక చేత్తో తనను తిప్పుతున్న ఆగంతకుడి రెండో చేతిలో ఆకలిగా తన వైపు చూస్తున్న హేండ్ గన్ ఉంటుందని విజయ్ కి నమ్మకంగా తెలుసు. తనని సగానికి పైగా అటువైపు తిప్పనిచ్చి, హటాత్తుగా రెండు చేతులతో ఆ ఆగంతకుడి రెండుకాళ్ళను మడమల దగ్గర పట్టుకుని ఒక్క ఉదుటన లాగిపారేశాడు. 

అతని హేండ్ గన్ నుంచి చిన్న శబ్దం తో బయటకు వచ్చిన బుల్లెట్ ఫుట్ పాత్ కి తగిలి అక్కడ నుంచి ఏటవాలుగా రిఫ్లెక్ట్ అయి పక్కనే ఉన్న ఖాళీ కంటైనర్లకు తగిలినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది.

కింద పడ్డ ఆగంతకుడు తేరుకుని పైకి లేచే లోగా పక్కకు వేగంగా దొర్లి పైకి లేచి వేగంగా దగ్గరలో ఉన్న కంటైనర్ల వెనక్కి దుమికాడు. ఆ కొద్ది సమయంలోనే అతని వైపుకి దూసుకు వచ్చిన బుల్లెట్లు కంటైనర్లకు తగిలి పెద్ద శబ్దం చేసాయి. అవి వచ్చిన్ యాంగిల్స్ ని గ్రహించిన విజయ్ తనను దగ్గర నుండి చూడడానికి వచ్చిన ఆగంతకుడు కాక అతనితో పాటు మరో ఇద్దరు ఉన్నారని, వాళ్ళు ఆ స్పాట్ కి రెండు పక్కల కాచుకుని ఉండి కార్ ఆగిన చోటుని కవర్ చేస్తున్నారని గ్రహించాడు.

కంటైనర్లను కవర్ గా తీసుకుంటూ పక్కనే చీకటిలో పార్క్ చేయబడి ఉన్న మెర్చంట్ షిప్ వైపు కి జిగ్ జాగ్ గా పరిగెత్తాడు. అతను కాళ్ళకు ధరించిన మెత్తటి షూస్ అతను పరిగెట్టినప్పుడు శబ్దం రానివ్వలేదు.

ఆ మెర్చంట్ షిప్ చాన్నాళ్ళుగా అలా పార్కింగ్ లో ఉన్నట్లుంది ఖాళీగా. దాని దగ్గర లైట్లు లేవు. అది చీకటిలో ఉంది. అందుకే ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్నట్లున్నారు తనను ఫినిష్ చేయడానికి అనుకున్నాడు విజయ్ అటు పరిగెడుతూ. 

నల్లటి హల్ అంత ఎత్తున భయంకరంగా కనిపిస్తోంది... చీకటి కుప్పలాగా! దానికి ఉన్న గాంగ్ లాడర్ ని అందుకుని చకచకా పైకి ఎక్క నారంభించాడు. అతను మధ్యకు చేరుకునేవరకు అతను ఎటు మాయమయ్యాడో కనిపెట్టలేక పోయినట్లున్నారు - అతను లాడర్ మధ్య వరకు వెళ్ళేసరికి మొదలయ్యాయి అతని వైపుకి కాల్పులు. నల్లటి షిప్ హల్ బాక్ గ్రౌండ్లో,  గ్రే కలర్ చుక్కలా కదులుతున్న విజయ్ పైన గురి కుదరలేదు వాళ్ళకి. చెదురు మదురుగా రెండు బులెట్లు హల్ కి తగిలి మెటాలిక్ సౌండ్ ఎకో లాగా వచ్చింది.

చక చకా పైకి ఎగబాకాడు విజయ్. డెక్ మీదికి చేరుకోగానే ఒక్క ఉదుటన షిప్ లోకి జంప్ చేసాడు. ఆ ముగ్గురు దుండగులు తనను వదలరు అని తెలుసు అతనికి. వెంట పడి వస్తారు... తమ హాండ్ గన్స్ తో! తమకు అప్పగించిన పని పూర్తిచెయ్యనిదే అవతలకి పోరు వారు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్!

వాళ్ళకు కనబడకుండా ఉండాలి అంటే దిగువకు షిప్ హోల్డ్ లో కి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు గాని అక్కడకు వచ్చి వెతకడం మొదౌ పెడితే అది డెత్ ట్రాప్ లాగా పరిణమిస్తుంది. దానికంటే ఫైనే ఉంటే ఏదో ఒకటి చేసే సావకాశం ఉంటుంది అని తర్కించుకున్నాడు విజయ్ తన మనసులో. గబగబా కొంచెం దూరంలో కనిపిస్తున్న లాడర్ ని పట్టుకుని పైకి ఎక్కి డెక్ పైన ఉన్న బ్రిడ్జ్ పైకి చేరుకున్నాడు. అంతటా పరుచుకుని ఉన్న చీకటి తనికి బాగానే కవర్ ఇస్తూ ఉంది. 

అతను ఊహించినట్లే ఆ ముగ్గురు దుండగులు ఒకరి వెనుకఒకరుగా డెక్ పైకి చేరుకున్నారు. బ్రిడ్జి పైన విజయ్ ఉన్న చోటి నుంచి వాళ్ళు ముగ్గురూ కనిపించారు. వాళ్ళల్లో ఒకడు షిప్ ముందు భాగం లోకి, మరొకడు షిప్ వెనక భాగం లోకి బయల్దేరారు. మూడవ వాడు తిన్నగా బ్రిడ్జ్ పైకి ఎక్కడానికి లాడర్ వైపు వచ్చాడు. ముగ్గురి చేతులలోను హేండ్ గన్స్ బయటకు తీసి సిద్ధంగా ఉన్నాయి.

విజయ్ తన చేతిలోకి మార్టిన్ ని తీసుకున్నాడు. అది అతని కాలి దగ్గర ఉన్న ప్రత్యేక అమరికలో ఉంటుంది. విజయ్ తన "పనిని" సైలంట్ గా చేయాలనుకున్నప్పుడు మార్టిన్ నే నమ్ముకుంటాడు. చక్కగా బాలన్స్ అయి ఉంటుంది ఆ చురకత్తి. పదునైన ముందు భాగం, కొద్దిగా బరువైన వెనకభాగంతో, ముందుకు చొచ్చుకుపోవడానికి, గురిని ఛేధించడానికి అనువైన మారణాయుధం అది. దాన్ని కుడి చేతిలో పట్టుకుని తను గురి చూసి విసరవలసిన లాడర్ వైపు దృష్టి కేంద్రీకరించి ఒంగి కూర్చున్నాడు విజయ్.

లాడర్ పైకి మొదటగా ఆ ఆగంతకుడి తల కనిపించింది, దాని వెంబడే పైకి ఎత్తి ఉన్న అతని కుడి చేయి, దానిలో ఉన్న గన్ కనిపించాయి. ఆ గన్ ఆకలి చూపులు బ్రిడ్జ్ పైకి సారించి ఉన్నాయి. పైకి ఎక్కుతూనే ఆ ఆగంతకుడి దృష్టి అక్కడ నక్కి ఉన్న విజయ్ పైన పడింది, వెంటనే తన చేతిలోని గన్ ని విజయ్ వైపుకి తిప్పాడు.

కానీ ఆతనికి ట్రిగ్గర్ నొక్కే అవకాశం దొరకలేదు. ఆ సరికే విజయ్ చేతినుంచి హై స్పీడ్ తో వెలువడిన మార్టిన్ సూటిగా వెళ్ళి అతని గొంతులోకి పిడి వరకూ దిగిపోయి అతని ఊపిరి ఆపేసింది. నోటి నుంచి అస్పష్టమైన గురకలు వస్తుండగా అతను తూలి వెనక్కి పడిపోబోయాడు.

మార్టిన్ ని విసిరిన వెంటనే అంతే స్పీడ్ లో దాని వెనకే లేచి వేగంగా వెళ్ళిన విజయ్ చటుక్కున అతని చేయి పట్టి అతను వెనక్కి పడిపోకుండా ఆపాడు. లాడర్ పై నుంచి అతన్ని పైకి లాగి బ్రిడ్జ్ పైన ఒక పక్కగా పడుకోబెట్టాడు. అతని జేబులు వెతకడం వేస్ట్ అని అతనికి తెలుసు. తమ పై ఒక్క ఆధారం కూడా ఉంచుకోరు వాళ్ళు. కింద ఉన్న మిగిలిన ఇద్దరిని కూడా హాండిల్ చేయకపోతే తన కష్టాలు ఆగవు అనుకుని శబ్దం చేయకుండా లాడర్ దిగాడు విజయ్.

షిప్ వెనక భాగం లోకి వెళ్ళిన దుండగుడిని టార్గెట్ చేసుకుని అతను వెళ్ళిన వైపుకే వెళ్ళాడు విజయ్. రెండో దుండగుడు ప్రతి చోటును క్షుణ్ణంగా వెతుకుతున్నాడు, ఒక చేతిలో పేల్చడానికి సిద్ధంగా ఉన్న గన్ ని పట్టుకుని.

నిశ్శబ్దంగా అతని వెనకకి చేరుకుని ఇంకా ముందుకి కదిలాడు విజయ్. ఇద్దరి మధ్య దూరం వీలైనంత తగ్గిస్తే శబ్దం లేకుండాతన పని పూర్తి చేయవచ్చని విజయ్ ఆశ. కానీ తన వెనక ఏదో కదులుతున్న అనుమానం వాడికి వచ్చినట్లుంది - చటుక్కున వెనక్కి తిరిగాడు. అప్పటికి విజయ్ కి అతనికి మధ్య ఆరడుగుల దూరం ఉంది.

ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదు విజయ్. చటుక్కున తన శరీరాన్ని వంచి కాళ్ళు మడత పెట్టి వెనక్కి తన్నుతూ ఒక్క దుముకులో ముందుకి పోయి ఆ దుండగుడి మీద పడ్డాడు. కానీ ఈ లోగానే వాడు తన చేతిలోని గన్ ట్రిగ్గర్ నొక్కాడు. అందులోనుంచి వెలువడిన బుల్లెట్ నిరపాయకరంగా వెళ్ళిపోయినా విజయ్ నిశ్శబ్దంగా పని పూర్తి చేయాలి అన్న సంకల్పాన్ని మాత్రం భంగపరిచింది. చుట్టూ ఉన్న మెటల్ గోడలకి తగిలి ఆ నిశ్శబ్ద నిశీధిలోని చీకటి షిప్ లో భయంకరమైన శబ్దాన్ని సృష్టించింది.

దుండగుడిని ఆశ్చర్యపరుస్తూ విజయ్ మొదటి దెబ్బ తీసినా బలంలో మొదటి మనిషికి రెండింతలుగా ఉన్న ఎనుబోతులాంటి ఆ దుండగుడు విజయ్ కంఠాన్ని పిడికిలిలో బిగించాడు.

గొంతు నులిమేస్తున్న వాడి పశుబలానికి ఉక్కిరిబిక్కిరి అవుతూ తన మోకాలిని వంచి వాడి పొత్తికడుపుకింద బలంగా పొడిచాడు విజయ్. దానితో వాడు తన పట్టు వదిలేసి నొప్పి తాళలేక వెనక్కి తూలి పడ్డాడు. అదే అదనుగా వాడి పైకి లంఘించాడు విజయ్.

బుల్లెట్ సృష్టించిన శబ్దం వల్ల అలర్ట్ అయిన మూడో దుండగుడు వడి వడిగా రెండోవాడు వెళ్ళిన వైపుకి వచ్చి విజయ్ తో పెనుగులాడుతున్న తన తోటి వాడిని గమనించాడు. చేతిలోని గన్ ని ప్రయోగించే వీలు లేకపోవడంతో పెనుగులాడుతున్న విజయ్ ని కోటు పట్టుకుని దూరంగా లాగడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో రెండవ దుండగుడు చేతులు విజయ్ నడుము దగ్గర బలంగా బిగుసుకున్నాయి. 

రెండవ వాడి మీద తన బరువు వేసి అతని సపోర్ట్ తీసుకుని తన కుడి కాలిని బలంగా పైకి విసిరాడు విజయ్. పవర్ ఫుల్ గా తగిలిన  ఆ కిక్ మూడవ వాని దవడ కి కనెక్ట్ అయింది. క్షణాల్లో అతను విగత జీవుడయ్యాడు. వడిలిపోయిన తోటకూర కాడలా నేలకు జారిపోయాడు. అది చూసి షాక్ అయిన రెండో దుండగుడి మీదికి తన మార్టిన్ ని, కుడి చేత్తో అందుకుని, అర్థ వలయాకారం లో దూసాడు విజయ్. కంఠం తెగి వెనక్కి వాలి పోయాడు ఎనుబోతులాంటి ఆ రెండవ దుండగుడు.

ముగ్గురి పీడ వదిలించుకున్నాక తన బట్టలను ఒకసారి దులుపుకుని స్టెయిల్ గా డెక్ పైన నడుచుకుంటూ గాంగ్ లాడర్ మీదుగా కిందకి దిగాడు విజయ్. 

జూకీ కార్ కింద నుంచి ఎప్పుడు బయటికి పాక్కుంటూ వచ్చిందో తెలియదు. కార్ లోపల లైట్ వేసి కిందా మీదా అంతా వెతికేస్తూ ఉంది చాలా డిస్పరేట్ గా!

’హలో జూకీ! ఏమిటి వెతుకుతున్నావు?’ అన్నాడు విజయ్.

హటాత్తుగా వినబడిన అతని వాయిస్ కి ఉలికి పడి చిన్నగా కెవ్వుమని అరిచి, ’నువ్వు బ్రతికే ఉన్నావా?’ అంది ఆశ్చర్యంగా!

’ఏం పోతాననుకున్నావా?’ వెక్కిరిస్తూ కార్ లోకి ఎక్కి కూర్చున్నాడు.

’అలా కాదు గానీ, నీ పైన ఎటాక్ జరుగ్తుందని నాకు నిజంగా తెలియదు’ అంది అమ్మతోడు అన్నట్లు అమాయకంగా చూస్తూ.

’నువ్వు వెతికేది, దీని గురించేనా?’ అన్నాడు విజయ్ కోటు జేబులో నుంచి తీసిన కార్ కీస్ ఆమె కళ్ళ ముందు విలాసంగా ఊపుతూ.

’ఇవి .. నీ దగ్గరకు ... ఎలా??’ ఆశ్చర్యంగా అడిగింది నోరుతెరిచి చూస్తూ!

కారు లోనుంచి దిగేటప్పుడు హెడ్ లైట్స్ ఆపుతూ, కార్ కీస్ కూడా తీసేసి తన కోటు పాకెట్ లో వేసుకున్న విషయం ఆమెకు చెప్పలేదు విజయ్.

’నాకు మాజిక్ వస్తుందిలే! పద నన్ను నా హోటల్ దగ్గర డ్రాప్ చేసి నీ దారిన నువ్వు పోదువు గాని’ అంటూ చాలా ఈజీగా ఉండే ఆప్షన్ ని ఆమె ముందు పెట్టాడు.

’ఓ ష్యూర్. బై ఆల్ మీన్స్’ అంటూ ఉత్సాహంగా తన డ్రైవింగ్ సీట్ లో సెటిల్ అయింది జూకీ. కార్ డోర్ వేసుకుని, స్టార్ట్ చేసింది కార్ ని. ఉత్సాహంగా కార్ యాక్సిలరేటర్ అదిమి వేగంగా ఆ చోటి నుంచి బయటకు కారుని ఉరికించింది.

’వాళ్ళను ఏం చేసావు?’ అడిగింది కార్ మైన్ రోడ్ కి రాగానే.

’ఆ.. ఏం చేస్తాను. నాకు ఏమీ తెలియదు నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేసి చక్కా వచ్చేసాను’ అన్నాడు విజయ్ సీరియస్ గా.

అయోమయంగా అతని వైపు చూసింది జూకీ.

జోక్ చేస్తున్న ఛాయలు అతని మొఖంలో కనిపించకపోయేసరికి కన్‍ఫ్యూజ్ అయి, ’అంతేనా? అలా చెప్తే వాళ్ళు... నమ్మారా?’ అంది.

’ఏం ఎందుకు నమ్మరు? నువ్వు చెప్తే నేను నమ్మాను కదా!’ అన్నాడు వెటకారంగా.

’నన్ను నమ్ము... నిజంగా నాకు ఏమీ తెలియదు’ అంది దీనంగా విజయ్ వంక చూస్తూ. ఆ సరికి విజయ్ ఆ దుండగులను దునుమాడేడు అని అర్థం అయిపోయింది ఆమెకి. పైకి కనబడినంత సాఫ్ట్ గా విజయ్ ఉండడు అని కారు దిగమని తనను ఆజ్ఞాపించినప్పుడు కలిగిన ఊహ ఇంకా గట్టిగా బలపడిపోయింది ఆమెలో!

’దాందేముంది నమ్మేస్తే పోలా’ అన్నాడు నవ్వుతూ.

తరవాత కొద్ది నిముషాలు మౌనంగానే డ్రైవ్ చేసింది ఆమె. అక్కడక్కడా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్స్ - విజయ్ మొఖంలోకి చూసి - ఆ పెట్రోలింగ్ వెహికిల్స్ దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నం చేయలేకపోయింది. 

హోటల్ చేరాక, కార్ పోర్టికోలో ఆపబోతుంటే... ’పార్క్ చేద్దాం జూకీ’ అన్నాడు విజయ్.

మారు మాట్లాడకుండా పార్కింగ్ లోకి తీసుకు వెళ్ళింది జూకీ. అతను కారు దిగుతూ ఆమె వైపు ప్రశ్నార్ధకంగా చూస్తే,’నన్ను వదిలెయ్ నాకు చాలా లేట్ అవుతుంది. మా అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది’ అంది జూకీ దీనంగా!

’వెళ్దువుగాని. కొద్ది సేపు నీతో మాట్లాడి పంపిచేస్తా, అన్నాడు వాచ్ చూసుకుంటూ. తనకు స్విఫ్ట్ ని కాంటాక్ట్ చేసిన స్త్రీ కాల్ చేసే సమయం కి ఇంకో గంట ఉంది.

’సరే’ అంది జూకీ నీరసంగా.

ఆమె చేతికి తన చేతిని మెలిక వేసి నవ్వుకుంటూ ఆమెను తన వెంట హొటల్ లోకి తీసుకు వెళ్ళాడు విజయ్. తన గదికి చేరే వరకు అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కూడా మౌనంగానే ఉండిపోయింది.

గదిలోపలికి వెళ్ళాక కాస్త బిడియంగా అటూ ఇటూ చూస్తూ ఉంటే, ’డ్రింక్ తీసుకుంటావా?’ అడిగాడు విజయ్.

’యా’ అంది జూకీ.

ఫ్రిజ్ వైపు సైగ చేసాడు. లోపలి నుంచి బాటిల్స్ తీసి డ్రింక్ పోయటానికి కబోర్డ్ లో నుంచి రెండు గ్లాసులు తీసింది.

’నాకు అలవాటు లేదు. నువ్వు తీసుకో’ అన్నాడు విజయ్.

’వాట్...’ అంది జూకీ ఆశ్చర్యంగా.

’యెస్. నువ్వు తీసుకో. నాకు జరిగింది మొత్తం వివరంగా చెప్పు’ అన్నాడు విజయ్ మళ్ళీ వాచ్ చూసుకుంటూ.

ఇంకా నలభై అయిదు నిముషాలు అనుకున్నాడు.

మెల్ల మెల్లగా డ్రింక్ సిప్ చేస్తూ జరిగినదంతా వివరంగా చెప్పింది. జూకీ. 

ఆమె పనిచేసే క్లబ్ కి ఆమె బాయ్ ఫ్రెండ్ వెంట ఇద్దరు పెద్ద మనుషులు లాంటి వాళ్ళు (చక్కగా డ్రెస్ చేసుకుని ఉన్నారు కాబట్టి జెంటిల్‍మెన్ అని అనుకుంది జూకీ) వచ్చారు. వాళ్ళకు జూకీతో ఏదో పని ఉందని ఆమె బాయ్ ఫ్రెండ్ చెప్పాడు. ఆ పని ఊరికే చేయనక్కరలేదని, దానికోసం చాలా చక్కటి పారితోషికం లభిస్తుందని కూడా చెప్పాడు. అడ్వాన్స్ గా వాళ్ళు ఇచ్చిన డబ్బు ఆమె ఒక సంవత్సరం కష్టపడితే వచ్చేటంత ఉంది. అది అడ్వాన్స్ మాత్రమే అని, పని అయిపోయాక మళ్ళీ అంత డబ్బు ఇవ్వడం జరుగుతుందని నమ్మకంగా చెప్పాడు వాళ్ళల్లో ఒక పెద్దమనిషి.

వాళ్ళు తన బాయ్ ఫ్రెండ్ ద్వారా వచ్చారు కాబట్టి ఆమె వారిని నమ్మింది. వాళ్ళు చెప్పిన పనిలో ప్రమాదం ఏమీ లేదు (తనకే కాకుండా తను కబురు చెప్పే మనిషికి - అంటే విజయ్ కి కూడా) అని ఆమె నమ్మింది. అందుకే ఆ పని చేయడానికి ఒప్పుకుంది.

ఎటువంటి ప్రశ్నలు వేయకుండా ఆమె చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు విజయ్. 

అతని పైన ఆమెకు ఉన్న భయం మెల్ల మెల్లగా తగ్గడం మొదలయింది. దానికి కారణం ఆమె సేవిస్తున్న డ్రింక్ మాత్రమే కాక విజయ్ మొఖంలో కాఠిన్యం తొలగిపోయి చాలా మంచివాడిలాగానూ, రొమాంటిక్ పర్సన్ లాగానూ కనబడడం అసలు కారణం.

తన నయగారాలు చూపించి విజయ్ ని లోబరుచుకోవాలి అన్న ఆలోచన కలిగినట్లుంది, గ్లాసు పక్కన పెట్టి ఒళ్ళు విరుచుకుంది చాలా సహజంగా... ఓరకంటితో అతని రియాక్షన్స్ గమనించుకుంటూ.

’సరే జూకీ... లేచి ఇలా రా’ అన్నాడు విజయ్.

అతను తన గాలానికి చిక్కాడు అనుకుంది జూకీ. వయ్యారంగా నడుచుకుంటూ అతని దగ్గరకు వెళ్ళింది.

’అటు తిరుగు...’ అన్నాడు విజయ్ తను లేచి నుంచుంటూ.

వెనక్కి తిరిగి నుంచుని అతని మీదికి వరిగింది జూకీ విలాసంగా నవ్వుతూ.

ఆమె రెండు చేతులూ అందుకుని వెనక్కి లాక్కుని ఆమే రెండు చేతులనూ కలిపి తన దగ్గర ఉన్న సిల్క్ స్కార్ఫ్ తో గట్టిగా బిగించి కట్టాడు విజయ్.

’ఏమిటిది? ఏమైనా గేమా?’ అంది జూకీ ఆశ్చర్యంగా!

’నో గేమ్స్ జూకీ. నాకు కొంచెం పని ఉంది నేను బయటికి వెళ్ళాలి. మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు నువ్వు నా గదిలోనే ఉండాలి. నా గెస్ట్ గా!’ అన్నాడు విజయ్ నవ్వుతూ. ఆమెను స్ట్రెయిట్ బాక్ ఉన్న రీడింగ్ టేబుల్ దగ్గరి కుర్చీలో కూర్చోబెట్టి ఒక రోప్ తో ఆమె కాళ్ళను, నడుమును కుర్చీకి వేసి కట్టేసాడు.

నోటికి ఒక టేప్ వేసి రెండు అడుగులు వెనక్కి వేసి ఆమె వైపు ఒక సారి పరిశీలనగా చూసాడు - ఒక ఆర్టిస్ట్ తను వేసిన బొమ్మ సరిగా వచ్చిందా లేదా అని పరిశీలనగా చూసినట్లు.

జూకీ కళ్ళు పెద్దవి అయ్యాయి. భయంతోనూ... ఆశ్చర్యంతోనూ...

’నన్ను ఏమీ చేయవద్దు’ అన్న వేడుకోలు ఆమె కళ్ళల్లో ప్రతిఫలించింది.

’భయపదకు. ముందు జాగ్రత్తగా ఇలా చేసాను. నీకు ఎలాంటి ప్రమాదము కలగదు’ అన్నాడు నవ్వుతూ.

ఆమె కళ్ళు అలానే భయం భయంగా అతని వైపు చూసాయి. అంతలో అతని గదిలోని ఫోన్ మోగింది. వాచ్ చూసుకున్నాడు. కాల్ చేస్తున్నది ఆమె నే అనుకున్నాడు.

ఒక్క అంగలో ఫోన్ దగ్గరకి వెళ్ళి, లిఫ్ట్ చేసాడు.

’హలో’ అన్నాడు విజయ్.

’ప్రపంచంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. వెలుగు రేఖలు వస్తాయో లేదో తెలియడం లేదు’ గంభీరంగా వినిపించింది ఒక స్త్రీ కంఠం. ఆమె కంఠంలో ధ్వనించిన అధికార దర్పం అతని దృష్టిని దాటిపోలేదు.

’సూర్యుడు క్రమం తప్పకుండా తన వెలుగు రేఖల్ని పంపి చీకట్లను పారదోలుతాడు. చాలా స్విఫ్ట్ గా!’ అన్నాడు విజయ్.

అది ఆమె తనను తాను ఐడెంటిఫై చేసుకోవడానికి తనతో మాట్లాడుతున్నది నిజమైన స్విఫ్ట్ ఏజెంట్ అని నిర్ధారించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సంకేతం. సరైన స్పందన విజయ్ నుంచి వచ్చిన వెంటనే ఆమె నిట్టూర్పు విడిచింది రిలాక్స్ అవుతున్నట్లుగా.

’ఇక్కడ నుంచి అల్టోన్ కి వెళ్ళాలి. వీ నది పడమర ఒడ్డు పైన నడుచుకుంటూ ఒక కిలో మీటర్ దూరం వెళ్తే అక్కడ ఒక బోట్ నీళ్ళల్లో కనిపిస్తుంది. అది కదలకుండా ఉండడానికి ఒడ్డున ఉన్న ఒక పోల్ కి తాడు తో బంధించబడి ఉంటుంది. దానిలో ఉన్న తెడ్లుతో సెల్ బోర్న్ వైపు కి ప్రయాణించాలి. దారిలో కనబడ్డ రెండో స్టోన్ బ్రిడ్జ్ కింద ఆగాలి. సరిగ్గా ఆరు గంటలకు నేను అక్కడ కలుసుకుంటాను. స్పష్టంగా అర్థం అయిందా??’ అంది ఆమె తన సూచనలను ఒక్కొక్కటి చక్కగా పలుకుతూ.

’అర్థమయింది’ అన్నాడు విజయ్.

’సరే. సీ యు’ అని కాల్ కట్ చేసింది ఆమె.

తన హోటల్ రూమ్ కి బయట నుంచి కాల్స్ డైరెక్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉందని తెలుసు విజయ్ కి. మొబైల్స్ వాడకుండా ఇంకా ఈ లాండ్ ఫోన్లను వాడడం వల్ల ఆమె తన కాల్ ని వేరెవరూ ట్రేస్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అని అర్థమయింది విజయ్ కి

***