అవాంఛిత శిశువు

A story by Angara Venkata Siva Prasada rao

అవాంఛిత శిశువు

అవాంఛిత శిశువు

అంగర వెంకట శివ ప్రసాదరావు

 

భార్య నిర్మల చెప్పిన విషయం విని ఆనందపడకపోగా కసురుకున్నాడు కార్తికేయ.

“ఇది ఎలా జరిగింది?” అడిగామెని.

“నన్నడుగుతారేం.. మీకు తెలీదా?” ఎదురు ప్రశ్న వేసిందామె.

“అదే.. ఋతువని నీకు తెలుసా?” అడిగాడు.

“నాకు తెలుసు... మీకు అలాగని ఎలా చెప్పను? ఇప్పుడొద్దంటే మీరు వింటారా?” నిలదీసి అడిగిందామె.

“విపులంగా చెప్తే అర్ధం చేసుకునేవాణ్ణిగా... ఎందుకొద్దన్నావో నాకెలా తెలుస్తుంది?” అన్నాడు తన తప్పు కాదని చెప్పటానికి ప్రయత్నిస్తూ.

“సరే.. ఇప్పుడేం చేద్దాం? ఈ కరువు కాలంలో ఒకర్ని పోషించటమే కష్టంగా వుంది. ఇప్పుడే మనకిద్దరున్నారు. మరొకరా?” అంది.

అది సమస్య కాదు.. నేను ఆలోచిస్తుంది మరొకటుంది” అన్నాడు.

“ఏవిటది?” అడిగిందామె.

“చెప్పినా నీకు అర్ధం కాదులే.. నేనే ఏదో ఒకటి అలోచిస్తాను”.

“అదేదో నాకూ చెప్పొచ్చుగా.. అసలు మన సమస్య .. అర్ధికమా? మరేదేనా?” అడిగిందామె.

“రెండూనూ..” అన్నాడతడు ఏదో ఆలోచిస్తూ..

“ఆ రెండోదేది?” రెట్టించి అడిగింది. 

“చెప్పాగా.. చెప్పినా నీకు అర్ధం కాదని. ముందు మనం డాక్టరు దగ్గరకు వెళదాం, మరోసారి నిర్ధారణ చేసుకోవటానికి. అవసరమైతే ఆవిడ్నే ఏదో మార్గం చెప్పమని అడుగుదాం” అన్నాడతడు.

“నేను కూడా చదువుకున్నదానినే అన్న విషయం మర్చిపోతున్నారు. నాకూ తెలివుంది. మీలా ఉద్యోగం చెయ్యడం లేదు గానీ అవసరం వస్తే నేనూ మీలా సంపాదించగలను. అంతకంటే ఎక్కువగా” అందామె.

ఆ మాట విన్న తరవాత అతనికి కోపం వచ్చింది. కానీ పెళ్ళినాటి ప్రమాణాలు మర్చిపోయి, రెచ్చిపోయి యుద్ధానికి దిగే వ్యక్తి కాదతడు. ఆమె ఒక మాట తూలిందని తనూ అంటే అక్కడ నిజంగానే యుద్ధం మొదలవుతుంది. ఆ భార్యభర్తల మధ్య వున్న సఖ్యత చెడిపోతుంది. అందుకే తనేం అనకుండా మిన్నకుండిపోయాడు. సమస్యకి పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాడు.

“పోనీ గర్భస్రావం చేయిస్తే...” అడిగాడు.

“విషయం చెప్పకుండా.. ఎందుకలా తెగ ఆలోచిస్తారు?” అందామె తన తొందరపాటు మాటలకి తనలో తనే నొచ్చుకుంటూ.

అప్పుడు చెప్పాడతడు అసలు విషయం. ఆమె అంతా విని “ఓస్.. ఇంతేనా.. దానికోసం అంతలా బాధ పడిపోవాలా..?” అందామె.

“నీకు అంతేనా అనిపిస్తుంది. నా కెరీర్ దెబ్బతింటుంది. ముందు డాక్టర్ దగ్గరకెళదాం పద”.

 “అందుకు నేనొప్పుకోను”.

“ఆవిడ దగ్గరకెళ్లాక ఆలోచిద్దాం ఏం చేస్తే బావుంటుందో.. మనలో మనం దెబ్బలాడుకోవడం ఎందుకు?” అని ఆమెని డాక్టర్ దగ్గరకి బైల్దేరదీశాడు.

డాక్టర్ ప్రెగ్నెన్సీ అని నిర్ధారించింది.

“అది సంతోషకరమైన విషయమేకదా?” అంది డాక్టర్.

“అది ఒకప్పుడు. కానీ మాకు ఇప్పుడది సంతోషకరమైన విషయం కాదు డాక్టర్.. మాకిప్పటికే ఇద్దరు పిల్లలున్నారు” అన్నాడతడు డాక్టర్‌తో.

“మరో పిల్లని మీరు పోషించలేరా?” అడిగింది డాక్టర్.

“అది కాదు మా సమస్య డాక్టర్.. పోనీ గర్భస్రావం చేసేస్తే... మరోలా అనుకోకండి ఇలా అంటున్నందుకు” అన్నాడు.

“మీరిద్దరూ వద్దనుకుంటే అలాగే చేసెయ్యవచ్చు. కానీ ఆమె పరిస్థితికూడా మనం ఆలోచించాలి. ఆమె ఇప్పుడు చాలా నీరసంగా వుంది. ఇప్పుడు కానీ గర్భస్రావం చేస్తే ఆమెకే ప్రమాదం” అంది డాక్టర్.

“మరిప్పుడెలా?” .

“మీరు మరో శిశువు వద్దనుకున్నప్పుడు ముందే జాగర్త పడవలసింది. మీరిద్దరూ చదువుకున్నవాళ్ళే.. దానికి ఎన్నో పద్ధతులున్నాయిగా.. అసలు మీ సమస్య ఏమిటి? అది చెప్పండి” అంది డాక్టర్.

“నేనో కంపెనీలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాను. అక్కడ ఇద్దరు పిల్లల్తో నేను వేసెక్టమీ చేయించుకుంటే నాకు రెండు ఇంక్రిమెంట్లతో సహా వెంటనే ప్రమోషన్ కూడా ఇస్తారు.. అది నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుంది డాక్టర్” విషయం నెమ్మదిగా చెప్పాడు.

“మరలాంటప్పుడు రెండో పిల్ల పుట్టగానే మీరు వేసక్టమీ చేయించుకోలేకపోయారా?” అంది డాక్టర్.

“నేనప్పుడు ఆఫీసు పని మీద ఫారిన్ వెళ్ళాను డాక్టర్.. వచ్చాక చేయించుకోవచ్చులే అని బద్ధకించాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని ఆలోచిస్తున్నాను” అన్నాడు.

“మీ కంపెనీ నియమాల కాయితం నాకోమారు చూపించగలరా?” అడిగింది డాక్టర్.

“తప్పకుండా డాక్టర్.. అయినా ఎందుకది?” అడిగాడు.

“అందులో ఏదేనా మార్గం కనిపించవొచ్చేమో చూడాలి” అంది డాక్టర్.

ఆ మర్నాడు అతడు తమ కంపెనీ నియమాల కాయితం తీసుకొచ్చి డాక్టర్‌కిచ్చాడు. ఆమె ఆ కాయితం కూలంకషంగా చదివింది.

“మీరు వేసెక్టమీ చేయించుకునే నాటికి ఇద్దరు పిల్లలని సర్టిఫికెట్టు కావాలి.. అంతేగా” అని అడిగింది డాక్టర్.

“అవును డాక్టర్. కానీ.. నా భార్య ఇప్పటికే గర్భిణి కదా?” అని సందేహం వెలిబుచ్చాడు.

“మీకెందుకు. నేను మీకు సర్టిఫికెట్ ఇస్తాగా.. దాంతో మీకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ ఖాయం” అంది నవ్వుతూ.

ఆ మర్నాడు వేసక్టమీ చేయించుకున్నాడు కార్తికేయ ఆమె ఆస్పత్రిలోనే. ఆమె అతను వేసక్టమీ చేయించుకున్నటు, ఆ తేదీకి ఆయనకి ఇద్దరు సజీవ పిల్లలున్నట్లు సర్టిఫికెట్టు ఇచ్చింది.

“మరి నా భార్య గర్భిణి కద డాక్టర్..” అడిగాడు.

“మీరు వేసక్టమీ చేయించుకున్నప్పుడు మీకు టూ లివింగ్ చిల్డ్రన్’. ఆమె గర్భంలో వున్నది లెక్కలోకి రాదు” అంది నవ్వుతూ.

కార్తికేయకి రెండు ఇంక్రిమెంట్లు, ప్రమోషను యిచ్చారు ఆఫీసు వాళ్ళు. అతను ఆఫీసంతటికీ స్వీట్లు పంచాడు. తొమ్మిది నెలల తరవాత కొడుకు పుట్టాడని మళ్ళీ స్వీట్లు పంచాడు కార్తికేయ ఆఫీసులో.

ఆ కంపెనీ నిర్వహణ అధికారులు తమ రూల్స్ మార్చుకున్నారు ఆ దెబ్బతో.

                                      --సమాప్తం--