శఠగోపం

"ఏమండీ! చిన్నమాట" అంది వరలక్ష్మి పట్టుచీర సరిచేసుకుంటూ వచ్చి. "చెప్పు" అన్నాడు ధర్మరాజు. "సాయంత్రం అమ్మాయి స్వాతి, నేను జ్యూయలరీ షాపింగుకి వెళ్తాం. ఇంట్లో ఉన్న చిల్లర సరిపోయేటట్లు లేదు. వచ్చేటప్పుడు ఏమైనా తెస్తారా?" అంది వరలక్ష్మి.

శఠగోపం

శఠగోపం

రచయిత -విరించి

డ్రెయివర్ యాదగిరి బ్రీఫ్‍కేసు, ఫైల్సు తీసుకుని కారులో పెట్టి డోర్ తీసి నుంచున్నాడు. ఆఫీసర్ ధర్మరాజు షూలేస్ ముడేసుకుని సోఫాలోచి లేచాడు.

"ఏమండీ! చిన్నమాట" అంది వరలక్ష్మి పట్టుచీర సరిచేసుకుంటూ వచ్చి.

"చెప్పు" అన్నాడు ధర్మరాజు.

"సాయంత్రం అమ్మాయి స్వాతి, నేను జ్యూయలరీ షాపింగుకి వెళ్తాం. ఇంట్లో ఉన్న చిల్లర సరిపోయేటట్లు లేదు. వచ్చేటప్పుడు ఏమైనా తెస్తారా?" అంది వరలక్ష్మి.

"పది సరిపోదా?"

"అది...పది కోట్లులా చెబుతున్నారు. ఇంతాజేసి పది లక్షలు"

"ఇప్పుడంటే ఇప్పుడు ఎక్కడ నుంచి తేను వరం?" అన్నాడు వాచీ చూసుకుంటూ బ్రతిమాలుతున్నట్లుగా.

"ఆ దేవుడికే తెలియాలి. ఆయన సొమ్మే కదా?" అంది వరలక్ష్మి నవ్వుతూ.

"ష్! అరవకు. డ్రెయివర్ వింటాడు" అన్నాడు నోటికి వేలు అడ్డుపెట్టుకుని.

"వాడికి తెలియని రహస్యమేం ఉంటుంది?"

"సరే! మీరు వెళ్ళండి. తక్కువైతే నాకు ఫోన్ చెయ్యి. చూద్దాం" అని హడావుడిగా బయటకొచ్చి కారెక్కాడు.

కారు వేగంతో ధర్మరాజు ఆలోచనలు పోటీ పడుతున్నాయి. సాయంత్రం లోగా మరో ఐదు చూడకపోతే రాత్రికి వరలక్ష్మి తో గొడవే. ఆ కాంట్రాక్టర్ ఫైల్ ఈ రోజు క్లియర్ చేస్తే వచ్చే ఐదూ అలా సర్దేయొచ్చు. ఎలాగూ మొన్ననే కబురు చేసాడు కాబట్టి ఈ రోజు తప్పక తెచ్చిస్తాడు.

"సార్!" అన్నాడు యాదగిరి డోర్ తీసి. ఆలోచనల్లో ఆఫీస్ వచ్చిన విషయం ధర్మరాజు గుర్తించలేదు. వెంటనే కారు దిగి ఠీవిగా ఆఫీస్ లో అడుగుపెట్టి టకటక బూట్లు చప్పుడు చేసుకుంటూ తన చాంబర్ లోకి వెళ్ళిపోయాడు.

ఆఫీస్ లో ధర్మరాజు యమ స్ట్రిక్ట్...అంతా యమధర్మరాజనే అంటారు. ఎవర్నీ సరిగా తిననివ్వడు...తనకే సింహభాగం కావాలంటాడు.

మధ్యాహ్నం లంచ్ అయిన అరగంటకు కోటేశ్వరరావు అన్నమాట ప్రకారం సూట్‍కేసుతో వచ్చేసాడు.

"నమస్కారం సార్!" అన్నాడు వినయంగా స్ప్రింగ్ డోర్ తోసుకొస్తూ.

"రండి! వచ్చారా? కూర్చోండి కోటేశ్వరరావు గారూ, మీ కోసమే చూస్తున్నాను" అన్నాడు చిరునవ్వుతో ధర్మరాజు. మనుష్యుల్ని మనుషుల్లా చూడటమే సంస్కారమైతే ధర్మరాజు కాంట్రాక్టర్లని వరాలిచ్చే దేవుళ్ళా చూస్తాడు. తన అభ్యున్నతికి వాళ్ళే కారణమనే విషయం ధర్మరాజుకు తెలుసు. ఎటొచ్చి పావలా ఇచ్చేవాడ్ని రూపాయడుగుతాడు. గిట్టనివాళ్ళు పీడిస్తాడు అంటారంతే.

కోటేశ్వరరావు విఐపి బ్రీఫ్‍కేసు ధర్మరాజు దగ్గరగా తోసాడు.

"చూసుకోండి సార్! మీరడిగినట్లుగానే ఐదు" అన్నాడు.

"చూసేదేముంది? నమ్మకం...నమ్మకం ప్రధానం..." అంటూనే ఓ సారి బ్రీఫ్ కేస్ తెరిచి కళ్ళతో లెక్కపెట్టి చేతులతో తడిమి చూసుకుని తృప్తిగా చిర్నవ్వు పెదాలపై మెరిపించాడు.

"ఓ కె! ఈ రోజు పనయిపోతుంది" అన్నాడు చిరునవ్వుతో.

కోటేశ్వరరావు ఇచ్చిన బ్రీఫ్‍కేస్ తాళాలు జేబులో వేసుకున్నాడు.

మరుక్షణం చాంబర్ డోర్ తోసుకుంటూ ఐదుగురు మనుషులు లోపలికి దూసుకొచ్చారు.

"ఎవరు మీరు? పర్మిషన్ లేకుండా రావడమేనా?" పులిలా గర్జించాడు ధర్మరాజు.

"ఎసిబి" మూడే అక్షరాలు పలికాడు వచ్చినవాళ్ళలో పెద్దాయన.

మరుక్షణం పిల్లిలా ముడుచుకుపోయాడు ధర్మరాజు... ముచ్చెమటలు పట్టేసాయి. గుండెదడ పెరిగింది. కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. కళ్ళు బైర్లు కమ్మాయి.

"యు ఆర్ కాట్ రెడ్ హ్యాండెడ్. ప్లీజ్ డోంట్ మూవ్" అన్నాడు వాళ్ళలో పెద్దాయన.

సెల్‍ఫోన్, బ్రీఫ్‍కేస్ లాక్కున్నారు. చాంబర్ లోనే ఓ ప్రక్కగా కూర్చోబెట్టారు. కోటేశ్వరరావు కుర్చీలోంచి లేచి నుంచున్నాడు గానీ మొహంలో ఏదో సాధించానన్న తృప్తి కన్పిస్తోంది. ఎసిబి వాళ్ళు ఆఫీస్‍ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపలి వాళ్ళని బయటకు, బయటివాళ్ళను లోపలికి అనుమతించడంలేదు. ధర్మరాజు ఇంటి నుంచి ఫోన్‍కాల్ వస్తోంది. ఇన్‍స్పెక్టర్ సెల్ తో బాటు స్పీకర్ ఆన్ చేసాడు.

"ఏమండీ ఎసిబి వాళ్ళుట. మమ్మల్ని ఓ ప్రక్కన కూర్చోబెట్టి ఇల్లంతా సోదా చేస్తున్నారండి. నాకు భయంగా..." అవతల ఎవరో సెల్ డిస్‍కనెక్ట్ చేసారు.

అయిపోయింది... తన జీవితం నాశనం అయిపోయింది. రేపట్నుంచి చిప్పకూడే గతి...కాసులు లెక్కపెట్టే చేతులతో ఇక రోజూ ఊసలు లెక్కపెట్టాలి. డబ్బు...సుఖం...మనశ్శాంతి...పరుపు అన్నీ పోయె. ఇన్నాళు దేవుడి డబ్బే కదా అని కూడబెట్టింది మొత్తం...గోవిందా...గోవిందా...ధర్మరాజు ఆలోచన్లు పరిపరివిధాల పోతున్నాయి.

ఎసిబి వాళ్ళు ఆఫీస్ లో ప్రతీ ఫైలు, ప్రతీ అంగుళం సోదా చేసి కార్యక్రమం ముగించేటప్పటికి రాత్రి తొమ్మిదయ్యింది. ఉదయం ఆఫీస్‍కు పులిలా వచ్చిన ధర్మరాజు రాత్రి అయ్యేటప్పటికి పిల్లిలా తలవంచుకు వచ్చి జీప్ ఎక్కాడు. బ్రీఫ్‍కేసు, ముఖ్యమయిన ఫైల్సు, ధర్మరాజును, కోటేశ్వరరావును తీసుకుని జీప్‍లో ధర్మరాజు ఇంటికొచ్చేటప్పటికి పదయ్యింది. ఇంటి చుట్టూ పోలీస్ ఫోర్స్. లోపల మరో ఐదుగురు ఎసిబి వాళ్ళ సోదాలతో హడవుడిగా ఉంది కాంపౌండులో కట్టేసి ఉన్న ధర్మరాజు పెంపుడు ఆల్సేషన్ కుక్క విశ్వాసంగా మొరుగుతూనే ఉంది.

భార్య వరలక్ష్మి, కూతురు స్వాతి ఏడుపు మొహాలతో సోఫాలో ఓ మూలగా కూర్చుని ఉన్నారు. అప్పటికే వాళ్ళ విచారణ పూర్తయినట్లుంది. అవమాన భారంతో ధర్మరాజు కేసి కోపంగా చూస్తున్నారు. ధర్మరాజు వచ్చి వరలక్ష్మి ప్రక్కన కూర్చున్నాడు.

"ఛీ!" అని పురుగును చూసినట్లు చూసి ప్రక్కకు జరిగింది వరలక్ష్మి.

"చేతకానివాడివి ఎందుకు చెయ్యాలి? మాకు ఎంత అవమానంగా ఉంది? ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనుంది" అసహ్యాన్ని నొక్కిపెడ్తూ ఛీదరించుకుంది వరలక్ష్మి.

"నాన్నా౧ ఎందుకు చేసావు నాన్నా! మా ఫ్రెండ్సంతా నన్ను చూసి నవ్వరా?" కూతురు స్వాతి కూడా ధర్మరాజునే నిలదీసింది.

ధర్మరాజు నివ్వెరపోయాడు. ’ఎవరికోసం పాపపు పనులు చేసాడో వాళ్ళే తనని అసహ్యించుకుంటే ఇక లోకం ఎలా చూస్తుంది? ఏమని కూస్తుంది?’

"ష్! మాట్లాడకండి" అరిచాడు సబ్ ఇనెస్పెక్టర్.

అప్పటికే ఇంట్లో అలమారాలు, కిచెన్ లో కబోర్డులలోను, వాడని వాషింగ్ మెషిన్ల లోనూ దాచిన నగలు, దస్తావేజులు అన్నీ ఓ బెడ్షీట్ పరిచి లిస్ట్ రాస్తున్నారు. ఆ పంచనామా అయ్యేటప్పటికి రాత్రి పదకొండు.

"మా అంచనా ప్రకారం మీ దగ్గర షుమారు వందకోట్లు పైనే ఉండాలి. కానీ ఇక్కడ పదికోట్లకు మించి ఈ నగలు, డాక్యుమెంట్స్ లేవేమి?" అన్నాడు డియస్పీ.

"పదికోట్లు కూడా ఉండదండీ" అన్నాడు ధర్మరాజు అమాయకంగా.

"మీ తోడల్లుడు, బావమరిది, మామగారు అందరిళ్ళపై రైడింగ్ పూర్తయింది. లాకర్స్ రేపు తెరుస్తాం. మీ అంతట మీరు అన్ని విషయాలు తెలియజేస్తే మాకు శ్రమ, మీకు శిక్ష తగ్గుతాయి. మిగతాది ఎక్కడ దాచారో చెప్పండి> చెప్పకపోతే ఎలా చెప్పించాలో మాకు తెలుసు" ఇనెస్పెక్టర్ కటువుగా అన్నాడు.

అప్పటికే మీడీయా వచ్చేసింది. డియస్పీ మీడియా వాళ్ళకి చెప్పాడు " దేవాదాయ శాఖలో పాతికేళ్ళ క్రితం అటెండర్ గా ఉద్యోగం లో చేరిన ఈ అడవి ధర్మరాజు అంచెలంచెలుగా ఆఫీసర్ అయి షుమారు వంద కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టాడు. కొడుకుని యూయస్ లో యం.ఎస్ చేయిస్తున్నాడు. కూతురికి లక్షలు కట్టి మెడిసిన్ సీటు, కోట్లు ఖర్చు పెట్టి పీజీ లో సీటు ఇప్పించాడు. ఈ రోజు ఐదు లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఈయన్ని అరెస్ట్ చేసి రిమాండుకి పంపిస్తున్నాము. రేపు శని ఎల్లుండి ఆదివారం కాబట్టి కోర్టుకి శలవు. సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము" చెప్పాడు డియస్పి. మీడీయా వాళ్ళ కెమారాలు క్లిక్ మంటూనే ఉన్నాయి.

ధర్మరాజుని జీప్ ఎక్కించారు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా కేవలం రాతి విగ్రహంగా భావించి నిలువు దోపిడీకి పాల్పడ్డ అ.ధర్మరాజుకు మొట్టమొదటిసారి దేవుడంటే ఏమిటో తెలిసి వచ్చింది. క్షణాల్లో ఎలెక్ట్రానిక్ మీడియా పదేపదే ధర్మరాజు అక్రమ సంపాదన గురించి వార్త చూపడం మొదలుపెట్టింది.

మర్నాడు వార్తాపత్రికలన్నిట్లో ’అధర్మరాజు అక్రమార్జన’ అంటూ మొదటి పేజీ హెడ్‍లైన్స్‍లో ఫొటోలతో సహా ప్రచురించారు.

ఎసిబి వాళ్ళు అన్ని చోట్ల వెతికినా వాళ్ళ అంచనా ప్రకారం ఉడాల్సినంత అక్రమార్జన ఆచూకీ చిక్కలేదు.

యాదగిరిని పిలిపించి మాట్లాడాడు డియస్పి. "సార్! ఒకసారి వృద్ధాశ్రమానికి వెళ్దాం" అన్నాడు యాదగిరి.

వెంటనే అందరూ వెహికిల్స్ లో ధర్మరాజు తల్లి యశోదమ్మ ఉండే వృద్ధాశ్రమానికి వెళ్ళారు. యాదగిరి సరాసరి యశోదమ్మ గదికి తీసుకు వెళ్ళాడు. రూమ్ లో ఆమె పొడవాటి బల్ల మీద పరిచిన బెడ్ మీద కూర్చుని ఉంది ఆమెకు యెనభై ఏళ్ళు ఉంటాయి. మనిషి బలహీనంగా ఉన్నా మాట స్పష్టంగా వినిపిస్తోంది. ఆశ్రమం మానేజర్ ఆమెతో ఏదో మాట్లాడుతున్నాడు. వారి సంభాషణ వింటూ గుమ్మం బయట ఆగిపోయారు అంతా.

"అమ్మా! మీ అబ్బాయి ఫొటో పేపర్లో పడిందమ్మా" అన్నాడు మానేజర్.

"ఏం ఘనకార్యం చేసాట్ట?’ అందావిడ చదువుతున్న భగవద్గీత మీద నుంచి దృష్టి మరలచకుండా.

"అక్రమంగా కోట్లు సంపాదించాడని ఎసిబి వాళ్ళు దాడి చేసి పట్టుకున్నారట అమ్మా!"

"ఇందులో ఆశ్చర్యమేముంది? ఇలాంటి వార్త ఏదో రోజు వినవలసి వస్తుందని నాకు ముందే తెలుసు. ఎన్నోసార్లు దేవుడి సొమ్ము తినొద్దని, మంచిది కాదని చెప్పాను. నా మాట నచ్చక నన్ను వాడు ఈ ఆశ్రమంలో ఉంచాడు. ఆ అవినీతి కూడు తినలేకే నా పెన్షన్ డబ్బులతోనే నేను ఆశ్రమంలో బ్రతుకుతున్నాను" అంది యశోదమ్మ.

ఎసిబి బృందం గదిలోకి ప్రవేశించారు.

"అమా! మేం ఎసిబి నుంచి వచ్చాం" అన్నాడు డియస్పి.

మీ పని మీరు కానివ్వండి బాబూ!" అంది ఆమె ప్రశాంతంగా!

గబగబా గది అంతా చెక్ చేసారు. ఏం దొరకలేదు. డియెస్పీ కి అక్కడ ఉన్న కొత్త మంచం చూసి ఏదో అనుమానం వచ్చింది.

"ఈ మంచం చేయించి ఎన్నాళ్ళయింది? ఆశ్రమంలో మంచాలన్నీ ఇలాగే ఉంటాయా? అన్నాడు.

"ఇది యశోదమ్మగారు వచ్చాక ధర్మరాజు గారు పంపారండి" అన్నాడు ఆశ్రమ మేనేజర్.

పరుపు పైకెత్తి చూసారు. పైకి కనిపించని విధంగా రహస్యంగా బాక్స్ టైప్ లో అలమరా అమర్చి ఉంది. దాన్ని బలవంతంగా తెరిచారు. దాని నిండా బంగారం, నగదు, డాక్యుమెంట్స్ కిక్కిరిసి ఉన్నాయి. వాటిని బయటకు తీసి చూసాక డీయస్పి మొఖంలో తృప్తి స్పష్టంగా కనిపించింది.

"ఓ కె అవర్ మిషన్ ఈజ్ కంప్లీటెడ్" అన్నాడు. డియస్పి ఉత్సాహంగా!

"నా కొడుకు నన్ను ఆశ్రమం పాలుచేసినా ఇన్నాళ్ళూ అవినీతి పడగనీడలో తినడం లేదని తృప్తిగా బ్రతికాను. కానీ ఇంతకాలం అవినీతి విషసర్పం పైనే పవళించానని ఈ రోజు తెలిసింది" అంది యశోదమ్మ బాధగా!

"మీరెందుకమ్మా బాధపడుతున్నారు? అనుమానం రాదని ఇక్కడ దాచాడు మీ అబ్బాయి. గుళ్ళో పూజారి భక్తులకు శఠగోపం పెడతాడు వాళ్ళకు మంచి జరగాలని. కానీ దేవుని ఆస్తి తనకు కలవాలని మీ అబ్బాయి దేవునికే శఠగోపం పెట్టాడు" అని అన్నాడు డియస్పి.

"కంగ్రాచ్యులేషన్స్ యాదగిరి, ప్రతి డిపార్ట్‍మెంట్ లో నీలాంటి వాళ్ళు ఉంటే అవినీతిని అరికట్టవచ్చు" అన్నాడు డీయస్పి.

"సార్ నాదేముంది సార్. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. దేవుడు తన సొమ్ము తిన్నా క్షమిస్తాడేమో గాని కన్నతల్లికి కూడు పెట్టనివాడిని క్షమించడు సార్" అన్నాడు యాదగిరి చేతులు జోడించి.

***