మేధో హత్యలు part 6

This is Sixth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 6

మేధో హత్యలు - 6

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

హోటల్ బయట తను దిగి కార్ కీస్ తీసి జూకీ కి ఇచ్చేసి ’నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో. కొన్నాళ్ళు ఎవరికీ కనబడకు, నీ సేఫ్టీ కోసం. నాకు కూడా మళ్ళీ కనబడాలని ప్రయత్నం చేయకు’ అన్నాడు. అతను ఆఖరున అన్న మాట మరణ శాసనంలా వినిపించింది జూకీకి. గజగజ వణుకుతూ తల ఊపింది. 

చకచకా నడుచుకుంటూ హోటల్ లోపలికి పోతున్న విజయ్ ని అలానే చూస్తూ ఉండిపోయింది. అతను కనుమరుగు అయ్యాక ధైర్యం తెచ్చుకుని కార్ దిగి డ్రైవింగ్ సీట్ లోకి మారి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జూకీ.

గబగబా తన రూమ్ కి వెళ్ళి తన వస్తువులతో రెండే రెండు నిముషాల్లో రిసెప్షన్ దగ్గరకి వెళ్ళిపోయాడు విజయ్. చెక్ అవుట్ చేస్తున్నాను అని అనౌన్స్ చేసాడు. చుట్టూ ఒకసారి చూస్తూ. అనుమానంగా కనబడే వాళ్ళు ఎవరూ అతని దృష్టిపథంలోకి రాలేదు.

’ఓకె సర్, బిల్ రెడీ చేస్తాను. .. మీకు ఈ కవర్ వచ్చింది. మీ పెదనాన్న గారు మీకు అందచేయమని పంపారట’ అంది రిసెప్షనిస్ట్ ఒక బ్లూ కలర్ ఎన్వలప్ అందిస్తూ.

కాజువల్ గా చూస్తూ, ఆ కవర్ అందుకుని సీల్ చెక్ చేసి బయట చూసాడు. తన పేరు, రూమ్ నెంబర్ ఉంది. ఫ్రమ్ అడ్రస్ లో అనంతపద్మానాభం అని, లండన్ అని ఉంది. కవర్ చించి లోపల చూసాడు. ఒక కాగితం పైన ’డియర్ విజయ్, నన్ను కలుసుకో, ప్రేమతో నీ పెదనాన్న’ అని రాసి ఉంది. కింద హోటల్ గ్రేట్ హైట్స్ అన్న పేరు ఉంది.

మౌనంగా ఆ కవర్ ని తన కోటు జేబులోకి తోసేసి. బిల్లు చెల్లించి, తన లగేజి తో బయటికి నడిచాడు విజయ్. ఒక సారి చుట్టూ చూసి దగ్గరలో కనబడిన కాబ్ ని పిలిచి ’ఏర్ పోర్ట్ అన్నాడు’. ఏర్ పోర్ట్ కి వెళ్తున్న కాబ్ ని మధ్యలోనే దారి మళ్ళించి హోటల్ గ్రేట్ హైట్స్ కి తీసుకు వెళ్ళమన్నాడు. పెదనాన్న ని కలవాలిగా మరి అనుకున్నాడు సన్నగా నవ్వుకుంటూ.

సుప్రియ అతని మనసులోకి వచ్చింది కానీ ఆమె మూడ్ ఎలా ఉంటుందో అనుకున్నాడు. ఒక సారి రింగ్ చేసి చూద్దామనుకుని కాల్ చేసాడు ఆమె నెంబర్ కి. అతని కాల్ ని రిజెక్ట్ చేసింది ఆమె. ’నీకు చాలా ఎక్స్‍ప్లైన్ చేయాలి. ఒకసారి కలువ్’ అంటూ మెసేజ్ పెట్టాడు. ’నీకు సిగ్గు లేకపోవచ్చు. నాకు బుద్ధి ఉంది’ అని రిప్లై వచ్చింది. 

ఆ రిప్లై చూసి గాఢంగా నిట్టూరుస్తూ మొబైల్ ని కోటు పాకెట్ లోకి తోసేసాడు.

కార్ హోటల్ గ్రేట్ హైట్స్ కి చేరుకుంది. తన లగేజి తీసుకుని లోపలికి వెళ్ళి పెదనాన్న రాసిన లెటర్ లో ఇచ్చిన రూమ్ నెంబర్ చెప్పి తన పేరు చెప్పాడు విజయ్.

’పాస్ పోర్ట్ ప్లీజ్’ అంది రిసెప్షనిస్ట్.

పాస్ పోర్ట్ చూపించి తన వివరాలు చెప్పాడు విజయ్.

’వెల్ కమ్ సర్. మీ రూమ్ రిజర్వ్ చేసి ఉంది. ఇదిగో కీస్’ అంటూ కీస్ అందించింది రిసెప్షనిస్ట్.

కీస్ తీసుకుని లిఫ్ట్ లో గదికి వెళ్ళిపోయాడు విజయ్. అతని వెనుకే వెళ్ళాడు ఒక బాయ్, అతని లగేజి తీసుకుని.

నిజానికి గ్రేట్ హైట్స్ స్విఫ్ట్ అధీనంలో నడపబడే హోటల్. స్విఫ్ట్ అంతర్జాతీయ ఏజెంట్లు కలుసుకోవడానికి, వారి రహస్య సమావేశాలు జరుపుకోవడానికి ఉపయోగించబడుతూ ఉంటుంది. వేరే అతిథులు వచ్చినా వారిని సెవెంత్ ఫ్లోర్ వరకే అనుమతిస్తారు. ఆ పైన ఉన్న మూడు ఫ్లోర్ లు స్విఫ్ట్ ఏజెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

నైన్త్ ఫ్లోర్ లో ఉన్న తన గదికి వెళ్ళి టివి ముందు ఉన్న సోఫా లో కూర్చున్నాడు. వేడి వేడి కాఫీ అతని కోసం సిద్ధంగా ఉంది అతని ఎదురుగా ఉన్న టేబుల్ పై. కాఫీ కప్ లో పోసుకుని సిప్ చేస్తూ, రిమోట్ తో టివి ఆన్ చేసాడు. తనకు నచ్చిన ఛానెల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కాఫీ ఫినిష్ చేయగానే, స్క్రీన్ పైన బలబీర్ సింగ్ ప్రత్యక్షం అయ్యాడు.

’వాట్ న్యూస్ విజయ్’ అన్నాడు పరామర్శలు లేకుండా నేరుగా విషయంలోకి వస్తూ.

ప్రోగ్రామ్ సడెన్ గా మాయమయినందుకు ఛానెల్ ప్రోబ్లమ్ అనుకుని రిమోట్ కోసం వెతుకుతున్న విజయ్ ఆ ప్రయత్నం మానేసి, ’మీరా బాస్! ఎలా ఉన్నారు? అందరూ బాగానే కదా?’ అన్నాడు నవ్వుతూ.

సీరియస్ గా మొఖం పెట్టి ’మేమంతా ఓకే గానీ. ముందు జరిగిన విషయాలు చెప్పు’ అన్నాడు బలబీర్ సింగ్.

’మన కాంటాక్ట్ నాకు పూర్తి విషయాలు చెప్పకుండానే హతం అయింది. ఆమె హంతకులతో కనెక్షన్ ఉండి, నన్ను ఎటాక్ చేసిన ఒక రోగ్ దగ్గర నాకు ఒక విజిటింగ్ కార్డ్ దొరికింది. దానిపైన మార్సెల్లో మార్టియాని అనే ఒక సైంటిస్ట్ పేరు ఉంది. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రిసెర్చ్ చేస్తున్నాడు’ అన్నాడు విజయ్.

’ఒక బాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్ చెప్పావు’ అన్నాడు బలబీర్ నిట్టురుస్తూ. ’ఆమె గురించి వివరాలు తెలిసాయా?’ అన్నాడు ఆసక్తిగా!

’ఆమె పేరు తెలిసింది - మరియా కలెస్నికావా’ అన్నాడు విజయ్. 

ఆమె పేరు విని తలాడించాడు బలబీర్. ఆమె ఎవరో అతనికి తెలుసు అని అర్థం అయింది విజయ్ కి. అక్కడితో ఆ విషయాన్ని తను మరిచిపోవచ్చు అనుకున్నాడు. 

’పేపర్ చూసాను బాస్, ’ఫ్రెంచ్ రివెయెరా’ లో ఒక కాన్ఫరెన్స్ జరగబోతోంది. దానిలో అన్ని రంగాలకు చెందిన సైంటిస్టులు తమ రీసెర్చ్ ఫలితాలను గురించి చర్చించుకుంటారు. మార్సెల్లో కూడా అది అటెండ్ అవుతాడట’ అన్నాడు విజయ్.

’అవును. ఆ దుర్మార్గుల దగ్గర మార్సెల్లో పేరు ఉన్న కార్డ్ దొరికింది అంటే అతనికి రిస్క్ ఉంది అని అర్థం అవుతోంది. ఇప్పటికే ఏడుమంది అత్యంత మేధావుల మేధస్సు హత్య గావించబడింది. వారి శరీరాలు బ్రతికే ఉన్నాయి కానీ వారి మస్తిష్కాలు అప్పుడే పుట్టిన పసిపాపల మస్తిష్కాలులా ఉన్నాయి- బ్లాంక్ గా! ప్రాణం తీయకుండా మేధస్సుని మాత్రమే హత్య చేసి ఆటలాడుతున్నారు ఆ విద్రోహులు. వాళ్ళు ప్రపంచ మానవాళికే పెను సమస్య’ అన్నాడు బల్బీర్ సింగ్.

పిడికిళ్ళు బిగించాడు విజయ్. బాస్ చెప్పింది నిజమే! వారెవరో గానీ ఇలా చేయడం మానవాళికి ద్రోహం చేయడమే! కానీ అలా కొందరు సైంటిస్టులను చేస్తే ఏమిటి వారికి లాభం? ఏమి పొందుతారు వాళ్ళు ఇలా చేసి? అది తెలుసుకోగలిగితే సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. 

’అయితే ఇలా హఠాత్తుగా ఆ సైంటిస్టుల మేధస్సు నాశనం అవడానికి కారణాలు కనుక్కున్నారా?’ అడిగాడు విజయ్.

’లేదు. కనుక్కోలేదు. ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ రెండు రకాల ఆలోచనలను చేస్తున్నారు ఈ కేసులను పరిశీలిస్తున్న అంతర్జాతీయ వైద్య బృందం’ అన్నాడు బలబీర్ సింగ్.

’ఏమిటవి??’ కుతూహలంగా అడిగాడు విజయ్.

’ఒకటి- ఏదో ఒక కొత్తరకం వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించి నేరుగా బ్రెయిన్ సెల్స్ ని సర్వనాశనం చేస్తుంది. తర్వాత అది కూడా డిజింటెగ్రేట్ అయిపోతుంది. అందువలన ఆ వైరస్ ఉనికి పరిశోధకులకు అంతుపట్టటంలేదు. రెండవది - ఎక్స్ రేస్, గామా రేస్ లాంటివి ఒక ఫ్రీక్వెన్సీ లో ప్రయోగిస్తే అవి బ్రెయిన్ సెల్స్ లో ఏదో అంతుపట్టని రసాయనిక చర్యను కలిగించి వాటిని నాశనం చేసేస్తాయి. బ్రెయిన్ లో ఉన్న సమాచారం, ఆలోచనా శక్తి లాంటివి సంపూర్ణంగా తుడిచి పెట్టుకుని పోతాయి’ అన్నాడు బలబీర్ సింగ్.

అతను చెప్పిన రెండు ఆలోచనలు కూడా విజయ్ కి చెమటలు పట్టించాయి - ఆ చల్లటి ఎసి రూమ్ లో కూడా! ’అంటే ఎవరి దగ్గరో చాలా ప్రమాదకరమైన వింత ఆయుధం ఉంది. అది బయలాజికల్ వార్ కి గానీ, ఫిజికల్ వార్ కి గానీ ఉపయోగపడే అవకాశం తోసి పుచ్చలేము’ అన్నాడు విజయ్.

’అవును. అది ఇంకా ప్రొటో టైప్ లాగా ప్రాథమిక దశలోనే ఉంటే ఆ ఆయుధాన్ని కనుగుని దాన్ని నాశనం చేయాలి. మళ్ళీ అలాంటి దాన్ని తయారు చేసే అవకాశం లేకుండా దానికి సంబంధించిన వాళ్ళను ఎలిమినేట్ చేయాలి’ అన్నాడు బలబీర్ గంభీరంగా!

మౌనంగా తల ఊపాడు విజయ్. మనుషులను చంపడం సరదా కాదు అతనికి. కానీ బాస్ చెప్పే పరిస్థితులలో అలాంటి వారు ఉంటే వారు అమాయకులైనా వారిని కూడా చంపాలి అన్న ఆలోచన అతన్ని బాగా డిస్టర్బ్ చేసింది. అయినా బాస్ మాటలలోని లాజిక్ కాదనలేనిది. ప్రపంచ మానవాళికి అలాంటి ఆయుధాలు ఎప్పటికైనా ప్రమాదకరమే! వాటిని అడ్డుకోవడానికి ఏమైనా చేయొచ్చు, తప్పులేదు అనుకున్నాడు.

’నువ్వు తెచ్చిన మార్సెల్లో పేరు చాలా ముఖ్యమైన సైంటిస్టుది. ఆతన్ని ఆ విద్రోహులు తమ టార్గెట్ గా నిశ్చయించుకుని ఉంటే దాన్ని అడ్డుకోవడానికి, వారి ఉనికికి సంబంధించిన  వివరాలను తెలుసుకుని వాళ్ళ ఆట కట్టించడానికి నీకు ఒక అవకాశం దొరుకుతుంది’ అన్నాడు బలబీర్ సింగ్.

’ఫెంచ్ రివెయెరా వెళ్ళాలా?’ అడిగాడు విజయ్.

’అవును, ఆ సైంటిస్ట్ ని ఫాలో చేసే అవకాశం ఉన్న ఒక సైంటిస్ట్ గా నిన్ను పంపే ఏర్పాట్లు చేస్తాము. అతనికి ఎలాంటి అపాయం కలగకుండా చూసుకో. అతను కూడా ఆ ఏడుగురి లా ఒక వెజెటెబుల్ గా మారకుండా కాపాడు’ అన్నాడు బలబీర్.

’అలాగే’ అన్నాడు విజయ్.

’మరో విషయం... నిన్ను కూడా నువ్వు కాపాడుకో! స్విఫ్ట్ లో వెజెటుబుల్స్ ఉండడానికి నేను ఇష్టపడను, ఎందుకంటే నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్ ని’ అన్నాడు, బలబీర్ గంభీరంగా చూస్తూ.

ఫక్కున నవ్వి, ’నేను వెజిటేరియన్ ఫుడ్ తింటాను గానీ స్వయంగా ఒక వెజెటుబుల్ గా మారడానికి మాత్రం సిద్ధంగా లేను’ అన్నాడు విజయ్. గంభీరమైన విషయాలను చర్చించినప్పుడు ఇలా ఏదో ఒక జోక్ చేసి వాతావరణాన్ని తేలికపరచడం బలబీర్ సింగ్ ప్రత్యేకత. సర్దార్జీల మీద జోకులు కూడా ఎంజాయ్ చేసే హాస్యప్రియత్వం అతని సొంతం.

’సరే గానీ, మన స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ పాణిగ్రాహి నీతో మాట్లాడుతాడు ఇప్పుడు. నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు’ అన్నాడు బలబీర్ సింగ్. వెంటనే స్క్రీన్ పైన గిరిజాల జుత్తూ, సోడా బుడ్డి కళ్ళద్దాలు, బూరె బుగ్గలతో ఉన్న ఓ బెంగాలీ బాబు కనిపించాడు. 

నవ్వుతూ పలకరించాడు విజయ్ అతన్ని. ఒక అరగంట పాటు మాట్లాడాడు ఆ బెంగాలీ బాబు. విజయ్ కి అనేక సూచనలు చేసాడు. పారిస్ లో కాన్ఫరెన్స్ కి వెళ్ళిన తర్వాత ఎలా మసులుకోవాలి అన్నవిషయాల దగ్గరనుంచి, సైంటిస్ట్ కి క్లోజ్ గా ఉంటూ ఏ విధంగా అతన్ని సంరక్షించాలి అన్నదాని వరకు అన్నిటి గురించి అరటిపండు వలిచి తినిపించినట్లు వివరంగా చెప్పాడు. 

గ్రేట్ హైట్స్ లోని స్టోర్ కీపర్ విజయ్ కి కొన్ని పరికరాలను కూడా అందిస్తాడని వాటిని ఉపయోగించి సైంటిస్ట్ రక్షణ మెరుగ్గా చేయొచ్చని సలహాలు ఇచ్చాడు. విజయ్ అడిగిన సందేహాలను కూడా తీర్చాడు.

చివరగా మళ్ళీ బలబీర్ టివి స్క్రీన్ పైకి వచ్చాడు.

’విజయ్, ఇది సైంటిస్టులతో వ్యవహారం నువ్వు మొరటుగా ఉండకూడదు. వాళ్ళతో ఎలా నెగ్గుకొస్తావో ఏమిటో. అక్కడ రఫ్ కారెక్టర్లు ఉండకపోవచ్చు కానీ, లేడీ అసిస్టెంట్స్ తో జాగ్రత్త’ అన్నాడు.

’అంటే ఏంటి బాస్ మీ ఉద్దేశం’ అన్నాడు విజయ్ కోరగా చూస్తూ.

’నువ్వు వాళ్ళ దగ్గరకి పోవు అని నాకు తెలుసు. వాళ్ళు నీ దగ్గరకి రాకుండా జాగ్రత్త పడు’ అన్నాడు బలబీర్ విడియో ఆఫ్ చేస్తూ.

గట్టిగా నిట్టూర్చాడు విజయ్. తాను కోరిన సుప్రియ మాత్రం తనకు అందకుండా దూరం దూరం పోతూ ఉంది. వేరే ఎవరైనా దగ్గరకు వస్తే మాత్రం లాభం ఏముంది? 

***

ఒక రోజంతా రెస్ట్ తీసుకుని మరుసటి రోజు ఫ్రెంచ్ రివెయెరా కి ఫ్లైట్ లో వెళ్ళాడు విజయ్. పాణిగ్రాహి అసిస్టెంట్  గ్రేట్ హైట్స్ లో స్టోర్ మానేజర్. అతని పేరు హరిశ్చంద్ర ఛటర్జీ. 

అతను విజయ్ పేరు మార్చేసాడు. అతని పేరు ఇప్పుడు డాక్టర్ అభిరామ్. అతను న్యూరల్ నెట్‍వర్క్స్ పైన విస్తృతంగా రీసెర్చ్ చేస్తున్న ఇండియన్ సైంటిస్ట్. ఇండియా నుంచి ప్రత్యేకంగా మార్సెల్లి తో కలిసి పని చేసే అవకాశం కోసం పారిస్ కాన్ఫరెన్స్ కి వెళ్తాడు అతను. ఇలా విజయ్ కి కొత్త ఐడెంటిటీ, దాన్ని సపోర్ట్ చేసే అన్ని రకాల డాక్యుమెంట్స్, తో పూర్తి వివరాలు అందించాడు. నిజానికి డాక్టర్ అభిరామ్ అనే సైంటిస్ట్ ఉన్నాడు. అతని క్రెడెన్షియల్స్ అన్నీ నిజమే. మనిషి మాత్రమే మార్పు చెందాడు! అతనికి బదులు విజయ్ కాన్ఫరెన్స్ కి వెళ్తాడు. 

***

ఫ్రెంచ్ రివెయెరా లో జరిగే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ సెమినార్స్ నిర్వహించే సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ. దానికి నోబెల్ కమిటీ కూడా ఉదారంగా ఫండ్ అందిస్తుంది. శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించే శాస్త్రవేత్తలు తమ తమ రొటీన్ పరిశోధనలకే పరిమితం కాకుండా ఏడాదికి ఒకసారైనా రిలాక్స్ అయ్యే వాతావరణం కల్పించాలని వారి ఉద్దేశం. అదీగాక వారి పరిశోధనల గురించి ఇతర పరిశోధకులతో చర్చించే అవకాశం కూడా లభిస్తుందని శాస్త్రవేత్తలకు ఆ సమావేశాలంటే ప్రీతి. ప్రతి నెలా ఏదో ఒక టూరిస్ట్ ప్రాముఖ్యత ఉన్న నగరాలలో ఈ సమావేశాలు నిర్వహిస్తుంది ఆ సంస్థ. ఒక్కో నెల ఒక్కో సబ్జెక్ట్ తీసుకుని దానికి సంబంధించిన శాస్త్రవేత్తలను ఆహ్వానిస్తుంటారు.

సమావేశాలు ఫ్రెంచ్ రివెయెరా లో ని రాయల్ మొజోన్స్ అనే రిసార్ట్స్ లో జరుగుతాయి. సమావేశాలు జరిగే మూడు రోజులకు ఆ రిసార్ట్స్ ని వేరెవ్వరికీ కేటాయించరు. నిజానికి సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందే ఆ రిసార్ట్స్ ని పూర్తిగా ఖాళీ చేయించి శానిటైజ్ చేసి టైట్ సెక్యూరిటీ పెట్టారు. సమావేశానికి ఆహ్వానం ఉన్న సైంటిస్టులను వారి కుటుంబ సభ్యులను మాత్రమే లోనికి రానిస్తారు.

ఫ్రెంచ్ రివెయెరా అనేది ఒక అనఫిషియల్ ప్లేస్. మెడిట్టరేనియన్ తీరప్రాంతంలో ఇటలీ, ఫ్రాన్స్ ల అఫీషియల్ సరిహద్దులకు చేరువలో ఉంటుంది అది. చూడ చక్కని బీచులతో, అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ తో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కేన్స్, ఈ ఫ్రెంచ్ రివెయెరా లోనిదే! నైస్ నగరం కూడా ఈ ఫ్రెంచ్ రివెయెరా లో ఉంది. ఇదే ఫ్రెంఛ్ రివెయెరా లోని అతి పెద్ద నగరం. ఫ్రాన్స్ లోని రెండవ అతి పెద్ద ఏర్‍పోర్ట్ ఈ నగరంలోనే ఉంది. 

రిసోర్ట్స్ కి కాబ్ లో వచ్చిన విజయ్ (డాక్టర్ అభిరామ్) తన బాగేజి తీసుకుని మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ లో అడుగుపెట్టిన సైంటిస్ట్ కమ్ టూరిస్ట్ లా దిక్కులు చూసాడు తన దళసరి కళ్ళద్దాలలోనుంచి. ఆ కళ్ళద్దాలు కనబడిన ప్రతి దాన్నీ విడియో రికార్డ్ చేస్తాయి. 

రెగ్యులర్ గా ఉన్న సెక్యూరిటీకి సమాంతరంగా మరో అనధికార సెక్యూరిటీ కూడా ఒకటి ఉన్నట్లు కనిపెట్టాడు విజయ్. అనధికార సెక్యూరిటీ వాళ్ళు పెదవులు విప్పడం లేదు. లోపలికి వస్తున్న వాళ్ళ వంక గంభీరంగా చూస్తూ, అప్పుడప్పుడు తమ చేతుల్లోని మొబైల్ స్క్రీన్ వైపు చూసుకుంటున్నారు.

ఖచ్చితంగా ఆ స్క్రీన్ పైన తన ఫొటో ఉండి ఉంటుందని ఊహించాడు విజయ్. తన పేపర్స్ తీసి చేతిలో పట్టుకుని ఎంట్రన్స్ వైపుకి వెళ్ళిపోయాడు ధీమాగా!

***