మేధో హత్యలు part 13

This is Thirteenth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 13

మేధో హత్యలు 13

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్) 

ఆమె పదేళ్ళ పాపే అయినా పట్టుదల కల అమ్మాయిలా కనిపించింది విజయ్ కి, తల్లిని ఆ రాక్షసుల నుంచి కాపాడుకోవాలి అన్న ఒకే ఒక కోరిక ఆమెకు వాళ్ళ ఎదుటకి పోయే ధైర్యాన్ని ఇచ్చింది.

  అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె బయటికి వెళ్ళింది. 

ఆమె వెనుకగా తను కూడా లాడర్ దిగాడు విజయ్. పక్కనే ఉన్న ట్రాక్టర్ దగ్గరకి వెళ్ళి గోడ మీద ఉన్న రాక్ లో దాచి ఉంచిన ట్రాక్టర్ కీ తీసుకున్నాడు. అది ఎక్కడ ఉందో గ్రెంటా చెప్పింది. కాలి నొప్పిని పట్టించుకోకుండా ట్రాక్టర్ దగ్గరకి వెళ్ళాడు. చాలా ఎత్తుగా ఉంది ట్రాక్టర్. ముందు భాగంలో దానికి ప్లవింగ్ డిస్క్స్ అమర్చి ఉన్నాయి. పెద్ద పెద్ద చక్రాల్లాంటి బ్లేడ్స్, వాటికి పదునైన పళ్ళు. ఆ డిస్కులు గిర్రున తిరిగితే పంట కోయడం చాలా సులభం. కూలి మనుషులు అవసరం లేదు. పైగా కూలి మనుషులు అక్కడ దొరకక పోవచ్చు కూడా!

తనకి టైమ్ ఎక్కువ లేదు, గ్రెంటా ఏం చేస్తుందో చూడాలి అనుకున్నాడు. తెరిచి ఉన్న షెడ్ ద్వారంలో నుంచి ఆరు బయట ఉన్న మాక్స్ అతని అనుచరులు కనిపిస్తున్నారు. మరో రౌండ్ ఎమిలీ ని కొట్టడానికి బెల్ట్ పైకి ఎత్తాడు ఒకడు. గ్రెంటా "వద్దు వద్దు. నేను చెప్తాను" అంటూ అరుస్తూ పరిగెడుతోంది వారి వైపు.

వికటంగా నవ్వాడు మాక్స్.

’చెప్పు, వాడెక్కడ ఉన్నాడు?’ అన్నాడు గ్రెంటా తో.

’ఆ నది వైపు వెళ్ళాడు. అక్కడే దాక్కున్నాడు’ అంది గ్రెంటా భయంతో వణికి పోతూ. చెయ్యెత్తి రెండు గుట్టల నడుమ ఉన్న సన్నని దారి వైపు చూపించింది గ్రెంటా.

’చూసి వస్తాము. వాడు అక్కడ లేకపోతే, అప్పుడు చెప్తా మీ పని...’ అంటూ తన మనుషులకు సైగ చేసాడు. అందరూ కలిసి నది వైపు బయల్దేరారు తమ ఆయుధాలను సిద్ధంగా పట్టుకుని.

వాళ్ళు ఆ కొండ గుట్టల నడుమ ఉన్న దారిలోకి ప్రవేశించగానే తను ట్రాక్టర్ స్టార్ట్ చేసి బయటకు నడిపించాడు విజయ్. బయట నుంచి చూసే వారికి తను కనబడకుండా వంగి నేరుగా ఆ కొండ గుట్టల నడుమ్ ఉన్న దారిలోకి ట్రాక్టర్ పోనిచ్చాడు. అదే సమయంలో రెండు వైపులా ఉన్న ప్లవింగ్ డిస్క్స్ ని ఆపరేట్ చేసాడు. సన్నగా హమ్మింగ్ శబ్ధం మొదలయింది. ఆ డిశ్ఖ్స్ ని రెండు అడుగుల పైకి ఎత్తి అదే పొజిషన్ లో కదలకుండా ఉంచి లాక్ చేసాడు. ఒక దాని పైన ఒకటి గా మొత్తం ఆరు డిస్కులు, ఒకో వైపు మూడేసి చొప్పున హై స్పీడ్ తో తిరుగుతున్నాయి. పంటలనైనా, గట్టిగా ఉండే కొమ్మలనైనా కూడా కట్ చేస్తాయి. మనుషుల శరీరాలు వాటికి ఒక లెక్కే కాదు. 

సన్నటి ఆ దారి సరిగ్గా ట్రాక్టర్ పట్టేటంత మాత్రమే ఉంది. ట్రాక్టర్ ని తప్పించుకోవడానికి వారికి అవకాశమే లేదు. ట్రాక్టర్ తాము నడుస్తున్న దారిలోకి ఎంటర్ అయిన తర్వాత దాన్ని గమనించారు వాళ్ళు. ముందుకి పరిగెత్తి దాని నుంచి పారిపోయే అవకాశం లేదు. అది వేగంగా వచ్చేస్తూ ఉంది. పక్కలకు పారిపోవడానికి కూడా వీలు లేదు.. ఎత్తుగా ఉన్న కొండగుట్టలను ఎక్కడానికి ఆస్కారం లేదు.

తమ గన్స్ ని ఎయిమ్ చేసి ట్రాక్టర్ పైకి కాల్పులు మొదలు పెట్టారు వాళ్ళు. బుల్లెట్లు ట్రాక్టర్ మెటల్ కి తగిలి రిఫ్లెక్ట్ అవుతూ సృష్టించిన శబ్దాలు వారి మరణగీతానికి బాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా భీతి గొల్పుతూ ఉన్నాయి. ట్రాక్టర్ నడుపుతున్న విజయ్ వారి దృష్టిలో పడకుండా బాగా కిందకి వంగి పక్కల నుంచి కనిపిస్తున్న ఎత్తైన కొండ గుట్టల ఆధారంగా నేరుగా వారి మీదకు ట్రాక్టర్ నడిపించాడు. 

వేగంగా తిరుగుతున్న డిస్కులు ఆ దుండగుల శరీరాలను కోస్తుంటే వెలువడే బాధాపూరిత ఆర్తనాదాలు విని మనసు చలించి పోయింది విజయ్ కి. కానీ ఎనిమిది మంది సైంటిస్టులను బ్రతికి ఉన్నా పనికిరాని వెజెటిబుల్స్ లాగా మార్చేసిన దౌష్ట్యం, ధర్మం వైపు నిలబడిన ఒక స్త్రీని కోల్ద్ బ్లడెడ్ మర్డర్ చేయడం, ఎమిలీ ని వివస్త్రను చేసి బెల్టు తో ఒళ్ళు చీరేసేలా చేయడం గుర్తుకి తెచ్చుకుని, ఆ దుండగుల మీద దయచూపడం అంటే విషపు పురుగులపైన దయ చూపినట్లే అనుకుని మనసుని సమాధానపరుచుకున్నాడు.

బుల్లెట్ల శబ్దాలు ఆగిపోయాయి, ఆక్రందనలు మిన్నంటాయి. పారిపోవడానికి విశ్వప్రయత్నాలు చేసారు కానీ విఫలమయ్యారు. గుట్టలపైకి ఎగబాకడానికి ప్రయత్నించి జారి పడిపోయారు. తుదకు ఖండఖండాలు గా నరకబడ్దారు ఆ డిస్కుల వల్ల. కొంతసేపటికి డిస్కుల హమ్మింగ్ శబ్దం తప్ప మరో శబ్దం వినబడలేదు. 

అప్పుడు ట్రాక్టర్ని ఆపి వెనక్కి నడిపించాడు విజయ్. దారి పొడవున్నా ఉన్న ఆ దృశ్యం భీభత్సంగా ఉంది. అటు ఒక చూపు చూసి దృష్టి మరలించుకున్నాడు. 

ఎమిలీ ఇంటికి చేరుకునాక ట్రాక్టర్ ని షెడ్ లో పెట్టేసి ఇంట్లోకి వెళ్ళాడు. అప్పటికే గ్రెంటా తల్లి ని బంధ విముక్తురాలను చేసి ఆమెను ఇంటిలోకి తీసుకు వెళ్ళిపోయింది. ఆమెను బెడ్ పైన పడుకోబెట్టి ఆమె పై పలచటి బెడ్ షీట్ కప్పి పక్కనే ఏడుస్తూ కూర్చుంది. ఎమిలీ కూడా నొప్పికి తాళలేక కన్నీరు కారుస్తూ ఉంది.

లోపలికి వచ్చిన విజయ్ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది ఎమిలీ. 

’అంతా క్లియర్ అయింది. ఏమీ భయం లేదు’ అన్నాడు విజయ్.

మెల్లగా నిట్టూర్చింది ఎమిలీ.

’గ్రెంటా నువ్వు బయట ఆవులకు ఫీడింగ్ సంగతి చూసుకో, అమ్మ విషయం నేను చూసుకుంటాను’ అన్నాడు విజయ్.

గ్రెంటా బుద్ధిగా తలఊపి, బయటకు వెళ్ళింది.

’ఒక్క మాట, ఆ నది వైపు మాత్రం వెళ్ళకూడదు, సరేనా?’ అన్నాడు విజయ్.

’సరే’ అంది గ్రెంటా.

ఎమిలీ పైన ఉన్న బెడ్ షీట్ ని మెల్లగా తీసి ఆమె శరీరం వైపు చూసాడు విజయ్. రక్తం ఓడుతూ ఉన్న బెల్ట్ దెబ్బలను, దగ్గర నుంచి చూసేసరికి తను అంతకు ముందు డిస్కు లను వాడి ఆ దుండగలను ఖండఖండాలుగా నరకడం పూర్తిగా సమంజసమే అనిపించింది. అతని కళ్ళు చెమర్చాయి.

అతని వైపే పట్టి పట్టి చూస్తున్న ఎమిలీ అంది ’వాళ్ళు నా ప్రాణాలు తీసేసినా నీ గురించి చెప్పి ఉండను. కానీ గ్రెంటా అలా చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది, గ్రెంటాను తిట్టాను, ఎందుకు అలా చెప్పావు అని’ అంది ఎమిలీ. 

అర్థం చేసుకున్నట్లు తల ఊపాడు విజయ్.

’ఇంకా నీ గాయాలు మానలేదు. వాళ్ళను ఎదుర్కునే శక్తి నీకు ఉందో లేదో నాకు తెలియదు. భగవంతుడీ దయవలన నీకు ఏమీ కాలేదు’ అంది.

’గ్రెంటా తో నేనే చెప్పాను అలా చెప్పమని. నువ్వు తిడతావు అని కూడా చెప్పాను. అప్పుడు నీకు సారీ చెప్పమని చెప్పాను, చెప్పిందా?’ నవ్వాడు విజయ్.

ఆమె కూడా నవ్వింది కాసేపు బాధను మరిచిపోయి.

’మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసారని నాకు అనిపించలేదు. గ్రెంటా నా కంటే ఎక్కువ మనోధైర్యం కలది’ అంది ఎమిలీ.

’అవును. ఏం చదివించాలనుకున్నావు ఆమెను’ అన్నాడు విజయ్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని తీసుకు వస్తూ. 

’డాక్టర్. నేను ఎలాగూ కాలేకపోయాను. నర్సు గా మిగిలాను. తను డాక్టర్ చదవాలని మేం ఇద్దరం అనుకున్నాము. కానీ అర్థాంతరంగా విధి అతన్ని మా మధ్య నుంచి తీసుకువెళ్ళిపోయింది. ఇక మా ఆశలు అన్ని అడియాసలైపోయాయి’ అంది నిరాశగా.

ఆమె గాయాలకు సున్నితంగా డ్రెస్సింగ్ చేయటం మొదలుపెట్టాడు. కాస్త నొప్పిగా ఉంటుంది, కానీ ఓర్చుకో. నీకు సేవ చేసే వంతు ఇప్పుడు నాది’ అన్నాడు విజయ్.

పసిపాపకి తల్లి సేవ చేసినట్లు ఆమె శరీరానికి అయిన గాయాలకు డ్రెస్సింగ్ చేసాడు విజయ్. 

’నీకు జావ కాసి ఇస్తాను. అది తాగు. ఓపిక వస్తుంది. మెడిసిన్స్ వేసుకుని హాయిగా పడుకో. గ్రెంటాకి నాకు కూడా ఫుడ్ తయారు చేస్తాను’ అన్నాడు.

అతను కాచి ఇచ్చిన జావ తాగి, మెడిసిన్స్ వేసుకుని ప్రశాంతంగా, నిర్భయంగా నిద్రపోయింది ఎమిలీ.

గ్రెంటా తో కబుర్లు చెప్తూ లంచ్ చేసాడు విజయ్. గ్రెంటా తో అతనికి మంచి స్నేహం కుదిరింది. 

’గ్రెంటా, కొండగుట్టల మధ్య వెళ్ళే నది కాకుండా వేరే నది ఏదైనా ఉందా’ అని అడిగాడు.

’ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్తే ఒక స్ట్రీమ్ ఉంది అది చాలా వేగంగా వెళ్తుంది. చాలా డేంజరస్ నది అది’ అంది గ్రెంటా కళ్ళు పెద్ద పెద్దవి చేసి చూస్తూ.

లంచ్ తర్వాత ఆమెను తల్లి దగ్గరే ఉండమని చెప్పి ఒక్కడే బయటకి వెళ్ళాడు విజయ్. మళ్ళీ ట్రాక్టర్ వేసుకుని బయలుదేరాడు. కొండగుట్టల మధ్య దారిలో పడి ఉన్న దుండగుల శరీర భాగాలను ఒక షోవెల్ తో పైకి ఎత్తి ట్రాక్టర్ లో వేసుకుని తీసుకు వెళ్ళి గ్రెంటా చెప్పిన వేరే నది దగ్గరకు వెళ్ళి ఆ శరీర ఖండాలను డిస్పోజ్ చేసేసాడు. తర్వాత ట్రాక్టర్ ని శుభ్రంగ కడిగి తిరిగి యథాస్థానంలో ఉంచాడు. ఆ పని పూర్తి చేయడానికి అతనికి నాలుగు గంటలు పట్టింది.

ఒళ్ళంతా అలసిపోయి, కాలు నొప్పి విపరీతమయిపోగా ఇల్లు చేరాడు. పైన్ కిల్లర్ వేసుకుని, ఎమిలీ కి కావలసిన ఫుడ్ తయారు చేసి ఆమెకు సేవ చేసాడు. ఆ రాత్రి వారితో పాటు ఆ బెడ్ రూమ్ లోనే ఒక పక్కన పడుకున్నాడు విజయ్.

రెండు రోజులు అలా గడిచాక ఎమిలీ తో పాటు విజయ్ కి కూడా కాస్త శక్తి తిరిగి వచ్చింది. జ్యూరిచ్ వెళ్ళడానికి కావలసిన ఓపిక వచ్చింది అని నిర్ణయించుకున్నాక ఒక్క నిముషం కూడా వేచి ఉండలేకపోయాడు విజయ్. ఎమిలీ అతన్ని దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసింది. జ్యూరిచ్ అక్కడికి ట్రైన్ లో మూడు నాలుగు గంటల సమయంలో చేరుకోవచ్చు అని తెలిసిన తర్వాత, అక్కడ ఆగి ఉన్న ఒక గూడ్స్ బండి ఎక్కేసాడు విజయ్. 

’పాసెంజర్ ట్రైన్స్ కూడా వస్తుంటాయి, హాయిగా కూర్చుని వెళ్ళొచ్చు కదా?’ అంది ఎమిలీ.

’ఇదైతే ఇంకా బెటర్, హాయిగా పడుకుని వెళ్ళొచ్చు. నన్ను డిస్టర్బ్ చేయడానికి వేరే పాసెంజర్స్ ఎవరూ ఉండరు కూడా’ అన్నాడు నవ్వుతూ.

’అతని మాటలకు అర్థం ఏమిటో తెలిసింది ఎమిలీకి. తను కూడా నవ్వుతూ, ’ఓకె, అలాగైతే, హేపీ జర్నీ’ అని వీడ్కోలు చెప్పింది.

***  

బలబీర్ సింగ్ అలర్ట్ చేసి పెట్టిన స్విఫ్ట్ ఏజెంట్లు, వారి ఇన్‍ఫార్మర్లు విజయ్ ని కనుగొనలేకపోయారు. అతను మళ్ళీ ట్రైన్ ఎక్కుతాడని వాళ్ళు అనుకోలేదు. సరైన వైద్య సహాయం దొరికిందా లేదా, అతను మాక్స్ కి దొరికి పోయాడా అన్నది కూడా వాళ్ళకి తెలియలేదు. ఉన్న్నట్లుండి మాక్స్ కనబడకపోయేసరికి అతను పని పూర్తి చేసుకుని వెళ్ళాడా అన్న ఆలోచన కూడా వచ్చింది. విజయ్ జ్యూరిచ్ చేరే సమయానికి తమ మాన్ హంట్ ని మొదలు పెట్టారు స్విఫ్ట్ ఏజెంట్లు - విజయ్ ఆచూకీ కనుక్కోవడానికి. 

జ్యూరిచ్ వెళ్తూనే, హోటల్ మౌంటైన్ హైట్స్ కి వెళ్ళిపోయాడు విజయ్. అక్కడకు వెళ్ళడం అంటే తన ఉనికిని స్విఫ్ట్ కి నేరుగా తెలియ చేయడమే అని తెలుసు విజయ్ కి. అంతర్జాతీయంగా ముఖ్య పట్టణాలలో తమ హోటల్స్‍ని రన్ చేస్తూ ఉంటుంది స్విఫ్ట్. వారి ఏజెంట్లకు టాప్ ఫ్లోర్స్ అట్టే పెట్టి వేరే కస్టమర్స్ ని ఇతర ఫ్లోర్స్ లో ఉంచి మానేజ్ చేస్తూ ఉంటుంది.

విజయ్ కి టాప్ ఫ్లోర్ లో స్వీట్ అలాట్ చేసారు. అతను గదిలోకి వెళ్ళడానికి మనిషిని తోడు పంపించారు. అతన్ని అటెండ్ అవడానికి బెస్ట్ డాక్టర్స్ వచ్చారు. 

అతనికి అయిన గాయాలు చాలా వరకు మానాయని, అతనికి చాలా మెరుగైన ఫస్ట్ ఎయిడ్ అందిందని సంతృప్తి వ్యక్తం చేసారు ఆ డాక్టర్లు. మరోసారి ఎమిలీకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు విజయ్.

డాక్టర్లు వెళ్ళగానే అతని టివి ఆన్ అయింది. స్క్రీన్ పైన బలబీర్ సింగ్ ప్రత్యక్షం అయ్యాడు.

తన పరిస్థితికి ఆందోళన కనబరుస్తూ సాంత్వన వాక్యాలను పలుకుతాడు అనుకున్నాడు విజయ్. 

’నేను ఓకే బాస్, మీరెలా ఉన్నారు?’ అన్నాడు అతని మాటలను ముందుగా ఊహిస్తూ.

’మాక్స్ ని ఏమ్ చేసావు? పెద్ద తేనెతుట్టె కదిలించావు. ఆ తేనెటీగలు నిన్నే కాదు నీతో పాటు నీకు సాయపడ్డ వారిని కూడా వదలవు’ కోపంగా అన్నాడు బలబీర్. అతని ఎదురు దాడికి కాస్త స్ర్ప్రైజ్ అయ్యాడు విజయ్.

’ఎలిమినేటెడ్ బాస్. మీరు ఎమిలీని, ఆమె కూతురు గ్రెంటా ని జ్యూరిచ్ కి రీ లొకేట్ చేయండి. గ్రెంటా మెడిసిన్ చదువుకుంటుంది’ అన్నాడు విజయ్.

’ముందు నీ ఫైండిగ్స్ చెప్పు. నీ అనుమానాలు ఏమిటి అనేవి మాకు అర్థం కాలేదు ఇంకా? నీ నెక్స్ట్ స్టెప్ ఏమిటి?’ అన్నాడు బలబీర్ సింగ్ అసహనంగా చూస్తూ.

’ఈ రాత్రికే నా అనుమానాలు నివృత్తి చేసుకుంటాను. నా అనుమానం నిజమైతే ఈ రాత్రికే మీకు ఫుల్ రిపోర్ట్ ఇచ్చి కేస్ క్లోజ్ చేస్తాను’ కాన్ఫిడెంట్ గా అన్నాడు విజయ్.

’టేక్ కేర్. నీ కోసం జ్యూరిచ్ లో వెదుకులాట మొదలయింది. కేర్ ఫుల్ గా ఉండు. బై ద్ వే, ఆ ఎమిలీ గురించి నువ్వు ఏమీ వర్రీ అవ్వకు’ అన్నాడు బలబీర్ సింగ్.

టివి స్క్రీన్ బ్లాంక్ అయ్యాక తన పొజిషన్ ని అంచనా వేసుకున్నాడు విజయ్.

తను అనుమానిస్తున్న వ్యక్తికి తను అతన్ని అనుమానిస్తున్న విషయం తెలుసా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేము. సో, తెలిసే ఉంటుంది అని అనుకోవాల్సి వస్తుంది. అలాగే, అతను తనను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడా లేదా అన్నది కూడా అవుననే అనుకోవాలి. సో, సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు తనకి. కానీ ఎప్పుడు అనేది అతనికి ఖచ్చితంగా తెలియదు కాబట్టి, పైగా తను మాక్స్ నుంచి తప్పించుకుని అయిదు రోజులు అవుతుంది కాబట్టి  తన టార్గెట్ కొద్దిగా రిలాక్స్డ్ గా ఉండొచ్చు. బట్ అది చాలా కాస్త మాత్రమే అవకాశం ఉన్న అంశం. అందువలన మరీ అర్థ రాత్రి కాకుండా ఎర్లీ నైట్ వెళ్ళడం బాగుంటుంది అనుకున్నాడు విజయ్. అది అనెక్స్‍పెక్టెడ్ సమయం కాబట్టి, టార్గెట్ డిఫెన్సెస్ కాస్త లోయర్ లెవెల్ లో ఉంటాయి అనుకున్నాడు.

సాయంత్రం ఆరు గంటలకు హోటల్ నుంచి బయట పడ్డాడు. తను ఎక్కిన కాబ్ ని తను వెళ్ళాల్సిన వీధికి పక్క వీధిలోనే ఆపేసాడు. అక్కడ నుంచి కాలినడకన టార్గెట్ ఉన్న ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. 

తన ఫేస్ కవర్ చేస్తూ గోల్ఫ్ కాప్ ని పెట్టుకుని లీజర్ గా నడక సాగించిన విజయ్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అతని ఉలికిపాటుకి కారణం ఎదురుగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున జార్జి. 

రౌండ్ రౌండ్ గా చబ్బీ చబ్బీ గా ఉన్న జార్జి బెర్ముడాస్ లో కాకుండా ఫుల్ సూట్ లో కనబడ్డాడు. ఫుల్ హైట్ లో బలంగానే ఉన్నాడు వీడు అనుకున్నాడు విజయ్ తన ఉలికిపాటుని కప్పి పెట్టుకుని ఏమీ జరగనట్లు జార్జి పక్కనుంచే నడుస్తూ. జర్మన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు జార్జి. ’నేను బయలదేరుతున్నాను. డిన్నర్ మీ ఇంట్లోనే చేద్దాము బేబీ’ అంటున్నాడు.

జార్జి బాచిలర్. వయసు యాభై ఏళ్ళు. ఒంటరిగా ఉంటాడు. గాళ్ ఫ్రెండ్స్ బాగా ఎక్కువగానే ఉన్నారు అతనికి అని తెలుసు విజయ్ కి. 

డిన్నర్ చేసి ఇంటికి వాడు తిరిగి వచ్చేలోగా తన అనుమానాలు నిజమా కాదా అని వెరిఫై చేసుకోవడానికి  కావలసినంత సమయం ఉంటుంది. ఒక వేళ వాడే అనుమానితుడు అయితే వాడితో ముఖాముఖీ కొన్ని విషయాలు తేల్చుకోవడానికి అక్కడే వేచి ఉండొచ్చు అనుకున్నాడు విజయ్ రిలాక్స్ అయిపోతూ.

జార్జి ఒక సైంటిఫిక్ కమ్యూనిటీకి అడ్‍మినిస్ట్రేటివ్ ఆఫీసర్. తను అప్పటివరకు ఫేస్ చేసిన నరహంతకుల జాబితాలోకి వచ్చే టైప్ కాదు, కనుక పెద్దగా ఇష్యూస్ ఏమీ ఉండవు తనకు అతని ఇంట్లో అనుకున్నాడు విజయ్. ఒక వేళ వాడే అసలు విలన్ అయితే, వాడి జాగ్రత్తలో వాడు ఉండడా? అన్న ఆలోచన అతని మనసులో మెదిలి మాయమయింది.

జార్జి ఇల్లు చిన్నగా నీట్ గా ఉంది. కాంపౌండ్ దాటి లోపలికి వెళ్తే ఎవరూ కనుక్కోలేరు. వీధులలో జనాలు అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. గేట్ దగ్గరకి వెళ్తూనే దానికి లాక్ లేకపోవడం చూసి చిన్నగా విజిల్ వేసాడు విజయ్. గేట్ తెరుచుకుని లోపలికి వెళ్ళేవారిని దొంగలు అని ఎవరూ అనరు కదా స్విట్జర్లాండ్ లో అనుకుంటూ ఠీవిగా గేట్ తెరుచుకుని, తిరిగి దాన్ని ప్రోపర్ గా క్లోజ్ చేసి లోపలికి నడిచాడు. అక్కడి వరకు దొరలాగే నడిచినా పోర్టికో లోకి వెళ్ళ కుండా ఇంటి చుట్టూ ఒక రౌండ్ కొట్టాడు అప్పుడే ముసురుకుంటున్న చీకటి నీడలను అడ్డం పెట్టుకుంటూ. అక్కడక్కడా గదులలో బ్లూ కలర్ నైట్ లాంప్స్ వెలుతురు బయటకి గ్లాస్ విండోస్ ద్వారా కనిపిస్తూ ఉంది.

బహుశా ఈ కాండిడేట్ కి నాకు తనపై అనుమానం కలిగిన విషయం తెలియదేమో, లేదా మాక్స్ తన పని పట్టి ఉంటాడని నమ్మకంగా ఉన్నాడేమో అనుకున్నాడు విజయ్.

వెనకవైపు విండోస్ ని కదిపి చూస్తుండగా ఒక విండో గ్లాస్ స్లైడ్ అయింది. ’ఆహ్... ఆజాగ్రత్తగా ఉన్నాడు మన జార్జి గాడు’ అనుకుంటూ నిశ్శబ్దంగా ఆ గ్లాస్ ని మరింత గా పక్కకి జరిపి తెరుచుకున్న జాగా లో నుంచి గదిలోకి ఎంటర్ అయిపోయాడు విజయ్. తర్వాత గ్లాస్ డోర్ ని క్లోజ్ చేస్తుండగా అతని మెడ మీద వెంట్రుకులు మెల్ల మెల్లగా అలర్ట్ అవడం మొదలయ్యాయి. 

తను ఎదురు చూడని ప్రమాదం ఏదో తనకోసం మాటు వేసి ఉందని అనిపించి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం మొదలు పెట్టాడు విజయ్. ప్రతి గది ని క్షుణ్ణంగా చెక్ చేసి వస్తుండగా జార్జి స్టడీ రూమ్ కనిపించింది. ఆ గది లోని బుక్ రాక్ ని చూసి సందేహం వచ్చింది విజయ్ కి. దాన్ని అటూ ఇటూ కదపడానికి ప్రయత్నిస్తుంటే నిశ్శబ్దంగా పక్కకి స్లైడ్ అయింది అది. దాని వెనక ప్రత్యక్షమయ్యాయి కిందికి వెళ్ళడానికి మెట్లు. 

ఆ మెట్ల మీదుగా కిందకి దిగుతూ గోడకి ఉన్న లైట్ స్విచ్ వేసాడు విజయ్. వెంటనే లోపల పుచ్చపువ్వు లాంటి తెల్లటి వెలుతురు పరుచుకుంది. మెట్లు ఎక్కువగా లేవు. ఒక దీర్ఘచత్రుస్రాకారపు గది. సెంట్రల్ ఏర్ కండిషన్ నుంచి వస్తున్న గాలి అక్కడి టెంపరేచర్ ని సౌకర్యంగా ఉంచుతూ ఉంది. లోపల టేబుల్స్ పైన ఉన్న రకరకాల సీసాలు. కోల్డ్ స్టోరేజి ఏర్పాట్లు, మైక్రో స్కోప్, ఇతర పరికరాలు చూసి, చిన్నగా విజిల్ వేసాడు విజయ్. జార్జి గాడు ఛోటా మోటా సైంటిస్ట్ లా ఉన్నాడే అనుకున్నాడు.

అన్నీ చూస్తూ ఉండగా ఒక డ్రాయింగ్ అతని దృష్టిని ఆకర్షించింది. ప్రెజరైజ్డ్ ఎయిర్ గన్ లాంటి డయాగ్రమ్ అందులో ఉంది. ఏదైనా మందుని నొప్పి లేకుండా ఎక్కించడానికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచన వచ్చింది విజయ్ కి.

అక్కడ ఉన్న సీసాలో రంగు లేని ద్రవం ఉన్న సీసాను పట్టుకుని దాన్ని పరిశీలించాలి అనుకుని చేతిని చాచిన విజయ్ కి హఠాత్తుగా మైండ్ లో డేంజర్ సిగ్నల్ మోగింది. చటుక్కున మెట్ల వైపు చూసాడు విజయ్.

మెట్లపైన జార్జి ఫుల్ హైట్ లో నిలబడి ఉన్నాడు. అతను అంత దగ్గరగా వచ్చే వరకు అతని అడుగుల చప్పుడు తనకు వినబడకపోవడం ఏమిటి అనుకున్నాడు విజయ్. చటుక్కున అతని కాళ్ళ వైపు చూసాడు విజయ్. మెత్తటి రబ్బరు షూస్ ధరించి ఉన్నాడు జార్జి. అందుకేనా శబ్దం రాలేదు అనుకున్నాడు విజయ్.

’ఓ, నువ్వు బ్రతికే ఉన్నావా? మంచిది. చేతులు పైకి ఎత్తు. ఏ మాత్రం కదిలినా కాల్చి పారేస్తాను’ అన్నాడు జార్జి.

అతని పెదవులపైన ఒక వంకర నవ్వు ప్రత్యక్షమయింది.

***