వయస్కాంతం

’ఇక చాలు, రెండు రోజులేగా గ్యాప్.. తిరిగొచ్చాక ఎరియర్స్‍తో సహా తీసుకుందువు గాని.. వదిలేయరా బాబు’ తనను కౌగిట బంధించి లిప్‍లాక్ చేసిన హబ్బీని వెనక్కు నెడుతూ అంది సంగీత.

వయస్కాంతం
వయస్కాంతం

వయస్కాంతం

(కథ)

[పినిశెట్టి శ్రీనివాసరావు, 9963749657]

’ఇక చాలు, రెండు రోజులేగా గ్యాప్.. తిరిగొచ్చాక ఎరియర్స్‍తో సహా తీసుకుందువు గాని.. వదిలేయరా బాబు’ తనను కౌగిట బంధించి లిప్‍లాక్ చేసిన హబ్బీని వెనక్కు నెడుతూ అంది సంగీత. 

’ఈ హనీ చెర్రీలు నా ఫేవరెట్..’ అంటూ అంటూ సంగీత రోజారంగు పెదాలను తన చూపుడు వ్రేలితో తాకి, ’నువ్వు నా ’హనీబీ’ వి సంగూ అంటూ సతీష్ సంగీతను దగ్గరకు లాక్కున్నాడు. 

’ఓహో! ముందు ఇంటి నుండి చెకౌట్ అవ్వరా బాబూ, లేదంతే ఫ్లైట్ చెకిన్ టైమ్ అయిపోతుంది’ అంటూ బలవంతంగా సంతోష్ నుంచి విడిపించుకుంది సంగీత.

’నిన్ను వదలి నేను పోలేనులే..’ అన్నట్టు సతీష్ దీనంగా చూస్తుంటే, జగమంత జాలేసి, తనే అతన్ని దగ్గరకు తీసుకుని జూజిప్స్ పెదాలను తన మునిపంట నొక్కిపట్టి, ’ఇది నీ హనీబీ కాటు. ఘాటుగా ఉంది కదూ!’ అంటూ సతీష్ కళ్ళలోకి మైకంగా చూసింది సంగీత. 

’థేంక్యూ.. ఐ లవిట్, ఇదే ఇదే నేను కోరుకున్నది, అంటూ సంగీత ఒళ్ళంతా తడిమి, ’ఇది నా సెక్యూరిటీ చెక్.. నా ఆస్తులన్నీ నీ దగ్గర వదిలి వెళుతున్నాను.  నేను తిరిగొచ్చేంతవరకూ భద్రంగా చూసుకో. వచ్చాక నాకు తిరిగి అప్పచెప్పాలి’ అంటూ ఓ కొంటె నవ్వు నవ్వి, బయట్కొచ్చి కారెక్కాడు సతీష్. 

’దొంగ రాస్కెల్.. తిరిగొచ్చాక నీ పని పడ్తా’ అనుకుని నవ్వుకుంది సంగీత. ఎయిర్‍పోర్ట్‍కు చేరేలోపు మూడుసార్లు ఫోన్ చేసి, ’వర్షం పడుతోంది, ఇంటికి వచ్చేయనా?’ అని సంతోష్ అడుగుతుంటే, ’రొమాంటిక్ గై’ అనుకుంటూ మురిసిపోయింది. 

* * *

స్నానానికి ఉపక్రమించే క్రమంలో, ’ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు, ఏమీ లేని దానని చేస్తావు?’ అని ఓల్డ్ మెలోడీని హమ్ చేసుకుంతూ బత్రూం లోకి వెళ్ళింది. 

షవర్ నుండి నీరు పన్నీటి జల్లులా కురుస్తోంది. అభిషేకం చేస్తున్నట్లుగా శిరస్సు మీద నుంచి జారిపడుతూ నిమ్నోతాలను దాటుకుంటూ, పాదాల చెంతకు చేరే క్రమంలో, తనువులోని అణువణువునూ ఆత్మీయనేస్తంలా పలకరించి, పరవశింపచేస్తోంటే ఒళ్ళంతా థ్రిల్లింతకు లోనై ’ఆహా! ఏమి హాయిలే ఇలా’ అనుకుంటూ సంగీత తన్మయత్వం చెందుకున్న తరుణంలో బెడ్రూమ్‍లో మొబైల్ రింగవుతోంది. 

’ఇంట్లో ఉంటేనే నయం. బయటకు వెళ్తే అదేపనిగా ఫోన్లు. అంత తొందరేమొచ్చిందో! గురుడు దేనికీ ఆగలేడు. ఇప్పుడేం చేయటం?’ అనుకుంటూ, స్నానం ఆపి, టవల్ ఒంటికి చుట్టుకుని, బెడ్రూంలో ఉన్న మొబైల్ తీసి, ’హలో!’ అంది. 

’హయ్ సంగూ! ఎయిర్‍పోర్ట్ నుంచి. చెకిన్ అయ్యాను. బోర్డింగ్ ఇంకా కాలేదు. వాతావరణం బాగోలేదట.  ఈ గాలి వానలో వెళ్తే పైన ఫ్లైటు, లోన ప్రయాణికులు తడిసి ముద్దవుతారట. గొడుగుల కోసం మార్కెట్‍కి పంపించారట. ఈలోగా విహంగం ఎప్పుడు ఎగిరేనో! ఇక వెళ్ళినట్లే. ఇదంతా ఎందుక్కానీ, నువ్వు ’ఊ’ అను, వచ్చేస్తా. ఇద్దరం కలిసి వర్షంలో తడుస్తూ బీచ్‍రోడ్డులో చెట్టాపట్టాలేసుకుని, ముద్దుల్లో తడిసి ముద్దవుదాం. సరేనా!’ అన్నాడు సతీష్. 

’ఇది చెప్పటానికేనా ఫోన్ చేసింది! స్నానం సగంలో ఆపి వచ్చాను. నువ్వు పోరా బాబూ..’ అంటూ ఫోన్ కట్ చేసింది సంగీత. 

* * *

రాత్రయ్యింది. ముసురు తగ్గలేదు. సతీష్ నుంచి ఫోను లేదు. సంగీత ఫోను చేస్తే సమాధానం లేదు. బాగా చలిగా ఉంది. నిద్ర రానని అలిగింది. ప్రక్కన సంతోష్ ఉంటే కొంటె మాటలు, కొక్కిరాయి చేష్టలతో పోకిరీ వేషాలు వేస్తుంటాడు. ఆ అల్లరికి అలవాటు పడ్డ తన శరీరం నిద్రపొమ్మంటే ’నో’ అంటోంది. అంటే తన మీద తనకే నియంత్రణ పోయిందా? తనకు తెలీకుండానే తన ఒళ్లంతా సతీష్ పార్టీలోకి మారిందా? జాదూగాడు సతీష్. నిజానికి సతీష్‍వి కానివేవీ లేవు తనలో. అంతా సతీష్ మయమే. జ్వరం వచ్చినట్లు సంగీత ఒళ్ళు వెచ్చబడింది. ప్రక్కన సతీష్ లేకపోతే పిచ్చెక్కినట్లుగా ఉంది.  

’ఫోన్ చెయ్యచ్చుగా!’ సంగీత అనుకుంటూండగానే ఫోన్ రింగైంది. సతీష్ ఫోను చేసింది. 

’హాయ్ సంగూ! గుర్తొస్తున్నాను కదూ! నాకూ అంతే. ఫ్లైటు చాలా లేటయ్యింది. గంట క్రితమే రూమ్‍కి చేరుకున్నాను. నీకు ఫోన్ చేస్తూ రిప్లై లేదు.. ఏం మాట్లాడవు?’ అన్నాడు సతీష్. 

’నన్నూ నీతో తీసుకువెళ్లచ్చుగా? నన్నొదిలేసి నువ్వొక్కడివే వెళ్లిపోయావు, నాకు పిచ్చెక్కినట్లుంది’ ఏడుపు గొంతుతో అంది సంగీత. 

’ఏయ్! పిచ్చీ, ఏమైందిరా? అందుకనే ప్రయాణం కేన్సిల్ చేసుకుని వచ్చేస్తానంటే రావద్దన్నావ్. రేపు రాత్రికంతా నీ ఒళ్లో వాలనూ? అన్నాడు సతీష్. 

’కాదు.. ఇప్పుడే వచ్చేయాలి. . ఈ రాత్రి మనం నిద్రపోకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఊహల పల్లకిలో ఊరేగించు’ చిన్నపిల్లలా గారాలు పోయింది సంగీత. 

’ఓకే.. అలాగే.. అబ్రకదబ్ర. నువ్వే నా దగ్గరకు వచ్చేస్తున్నావ్’ అన్నాడు సతీష్. 

* * *

’వెల్‍కమ్ టూ గాడ్స్ ఓన్ కంట్రీ.. మై డియర్ సంగూ!’ అంటూ ఎయిర్‍పోర్ట్ ఎగ్జిట్ గేటు బయట నుంచుని చేతులు చాచాడు సతీష్. 

’కొచ్చిలో ఫ్లైట్ దిగిన సంగీత పరిగెత్తుకుంటూ వచ్చి సతీష్‍ను పెనవేసుకుపోయింది. సంగీతను అలానే పైకెత్తి పట్టుకుని, కారు పార్కింగ్‍ప్లేస్ దాకా తీసుకువెళ్తుంటే జనం సంభ్రమాశ్చర్యాలతో అలానే చూస్తూ నిలబడిపోయారు. 

"ఛీ.. ఏంటిది? అందరూ చూస్తున్నారు, క్రిందకి దింపు. నాకు సిగ్గేస్తోంది’ అని సంగీత గొడవ చేస్తోంటే, ’చూడనీవోయ్, నా స్వీట్‍హార్ట్‍నేగా నేనెత్తుకుంది’ అయినా, బెడ్రూంలో కాదు, బాహ్యంలో చేసేదే దంపతుల మధ్య ఉన్న ప్రేమరాగాలకి ప్రామాణికం’ 

నీకు తెలీదు కాని.. ఇప్పుడు నిన్ను చూసిన లేడీసు ఎంతమంది తమ భర్తలు కూడ అలా ఎత్తుకుని తీసుకువెళ్తే ఎంత థ్రిల్లింగా ఉంటుందో కదా! అనుకుంటూ నీ అదృష్టానికి అసూయపడలేదంటావు?’ అని క్యాబ్ డోరు తీసి, సంగీతను బ్యాక్ సీటులో కూర్చోబెట్టి తనూ ప్రక్కనే కూర్చున్నాడు. 

సతీష్ గాఢ పరిష్వంగంలో ఒత్తిడికి గురైన సంగీత కోమల శరీరం ప్రక్కనున్న సతీష్ పై వాలి లతలా అల్లుకుపోయింది. 

చెంప చెంప హత్తుకుపోతుంటే.. నా చెంపకు ఎంతటి ఉబలాటమో, నీ చెంపతో చెలగాటమాడాలని’ అని సతీష్ చేస్తున్న అల్లరి చూసి, ’ఊ.. ఇలానే బావుందిరా’ అంటూ గారాలు పోయింది సంగీత. 

క్యాబ్ స్టార్ హోటల్ ముందు ఆగింది. సతీష్ రిజర్వ్ చేసి ఉంచిన రూం లోకి వెళ్లగానే సంగీత ’డామ్‍టైర్డ్’ అంటూ తూలుతూ ఫోమ్‍బెడ్‍పై పడబోతుంటే పట్టుకున్న సతీష్ పట్టుతప్పి సంగీతపై పడిపోయాడు. 

’ఏమైంది సంగూ నీకు?’ అన్నాడు సతీష్ సంగీతను పొదివి పట్టుకుని. 

’ష్! డిస్టర్బ్ చెయ్యకు, నిజంగానే ఏదో అయ్యింది. మత్తుగా, గమ్మత్తుగా ఉంది. ఈ రోజంతా ఇలానే ఉండిపోవాలని ఉంది. సరేనా..’ అంది కళ్ళు మూసుకునే. 

’అలాగే.. ముందు ఫ్రెషప్ అయ్యిరా..’ అన్నాడు సతీష్. 

’నువ్వురా..’ అంటూ సంగీత, సతీష్‍ను తీసుకెళ్ళింది. ఆరోజంతా హోటల్ రూంలోనే గువ్వపిట్టల్లా గడిపిన ఇద్దరు, మర్నాడు ఉదయమే క్యాబ్‍లో బయల్దేరారు. 

* * *

దారిపొడవునా ఎత్తైన పర్వత శ్రేణులు, దట్టమైన ఆడవులు, పచ్చని పచ్చిక బయళ్ళు, గలగలా పారే సెలయేళ్లు.. అద్భుతమైన కేరళ ప్రకృతి అందాలను చూస్తూ పరవశించి పోతూ ఇద్దరూ పులకించిపోయారు. 

కారు దిగగానే.. ప్రకృతి ప్రేమికులకు, హనీమూన్ జంటలకు, స్వర్గధామం, మూడు నదుల సంగమం.. మున్నార్‍కి వెల్‍కం’ అంటూ సంగీత చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు సతీష్. 

’అబ్బ! ఎంత చలిగా ఉందో! అంటూ సతీష్‍ని వెనకనుంచి వాటేసుకుని అలాగే నడుచుకుంటూ రిసార్టు రూంలోకి వెళ్లింది సంగీత. 

ఎత్తైన కొండ అంచున కట్టిన రిసార్టు బాల్కనీలోనుంచి చూస్తే లోతైన లోయలోకి సన్నటి పాయలుగా జరజరా పాకిపోతున్న జలపాతాలు, దాపునున్న కొండల మీదుగా శ్వేత విహంగాల మాదిరి మంద్ర గమనంతో సాగిపోతున్న మేఘమాలికలు ’ఓహ్! అద్భుతం!’ అంటూ సంగీత ఆశ్చర్యంతో కేరింతలు కొడుతుంటే, ’రా.. కూర్చో’ అంటూ సిట్‍అవుట్‍లో సంగీతను కూర్చోబెట్టి కాఫీ తెచ్చాడు సతీష్. ఇద్దరూ కలిసి కాఫీ సిప్ చేస్తూ లోయ అందాలను వీక్షించారు. 

రిసార్టు బయట అనడిచి వెళ్తుంటే, ఒకప్రక్క ఏటవాలుగా ఉన్న కొండలపై ఆకుపచ్చటి తివాచీ పరిచినట్లు మళ్ళుమళ్ళుగా కనుచూపుమేర విస్తరించిఉన్న తేయాకు తోటలు, మరో పక్క అంబరాన్ని అంటుతున్నట్లున్న పొడవాటి జిగురు చెట్లు, వాటి మధ్య వయ్యారంగా విహరిస్తున్న రంగురంగుల పక్షులు చెట్టాపట్టాలేసుకుని కౌగిళ్లలో కరిగిపోతున్న కొత్తజంటలు, శృంగార వేడుకలు జరుపుకుంటున్నట్లు అంతటా సందడే సందడి. 

సతీష్, సంగీత లవ్‍బర్డ్స్‍లా ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ ఆ ప్రకృతి రమణీయతను కెమేరాలో బంధించారు. 

అలా రెండు గంటలపాటు తిరిగి తిరిగి ఇక రిసార్టుకు వెళదామనుకుంటూండగానే అప్పటికప్పుడు కారుమబ్బులు క్రమ్ముకొచ్చాయి. ప్రియుని రాకకై ఎదురుచూస్తున్న ప్రేయసిలా చల్లటి పిల్లగాలి దూసుకొచ్చింది. ఆ రెంటి అనురాగ సంగమమై చిటపట చినుకులు పుట్టుకొచ్చాయి. 

పదపదమంటూ వడివడిగా నడుచుకుంటూ సతీష్, సంగీత రిసార్టు చేరేసరికి తడిసితడిసి ముద్దయ్యారు. తడి దుస్తుల్లో అద్భుతమైన అజంతా శిల్పసుందరిలా ఉన్న సంగీత అందాల ఆరబోత చూసి ట్రాన్స్‍లోకి వెళ్లిపోయినట్లు రెప్పేయకుండా అలానే చూస్తూండిపోయాడు సతీష్. 

’ఛీ పొండి’ అంటూ సంగీత ముందుకొచ్చి తన రెండు చేతుల్లో సతీష్ కళ్ళుమూసింది. మరుక్షణమే తడిసిన దుస్తులు నేలరాలాయి. ’జోహారు జోహారు ఈ వానకు’ అనుకుంటూ అనాచ్ఛాదిత దేహాలు రెండూ అనంగక్రీడకై తహతహలాడుతూ తలపడ్డాయి.

* * *

ఆ రోజు మున్నార్‍లో పండుగ చేసుకుని, మర్నాడు మరో హిల్ స్టేషన్ ’తెక్కడి’ కి ప్రయాణమయ్యారు. దారిపొడవునా మంచు దుప్పటి కప్పుకున్న కొండవాగులు, అడవులకు, చిరుజల్లులు తోడై వణుకు పుట్టిస్తుంటే సంగీత సతీష్‍ను అంటిపెట్టుకునే ఉంది.

దారిలో ఆగి చూసిన కాఫీ, సుగంధద్రవ్యాలు, మసాలా దినుసుల తోటలు దేనికదే ఓ వింత అనుభూతిని పంచిచ్చాయి. పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యగా, పెరియార్ సరస్సులో బోటు ప్రయాణం మరో మధురానుభూతిని మిగిల్చింది. 

నీలగిరి టార్ (దుప్పి), చెంగున గెంతుతూ సాగే జింకలు, పొడవాటి నీలగిరి కోతులు, ఎగిరే ఉడుతలు చూసి ఇద్దరూ విస్మయానికి లోనయ్యారు. 

’అదిగదిగో అటు చూడు’ అంటూ సతీష్ చుట్టూ చేతులు బిగించి, దగ్గరకు లాక్కుంది సంగీత. అటుగా చూపు సారించిన సతీష్ సరస్సులో గజరాజుల జలకాలాటలు, సరస శృంగార చేష్టలు చూసి.. ’బాగుంది కదూ!’ అన్నాడు నవ్వుతూ. 

’ఊ..’ అంటూ అంటూ సతీష్‍ను వెనుకనుంచి మత్తుగా హత్తుకుపోయింది సంగీత. తెక్కడికి చేరాక, సంగీత మనసు పడిందని మావటి సాయంతో గజరాజుని కూర్చోబెట్టి, ఇద్దరూ తొండం మీదుగా ఎక్కి, గజారోహణం చేసి, అరగంట సేపు అడవిలో విహరించడం ఆ ఎలిఫెంట్ రైడ్ అద్భుతం.. అత్యద్భుతం.. అనుకుంటూ మురిసిపోయారు. 

ఆ రాత్రి ’ట్రీటాప్’ కాటేజ్‍లో చుట్టూ ఉన్న మహావృక్షాలపై ఆవాసం ఏర్పరచుకున్న వందలకొద్దీ పక్షులతో కలిసి, ప్రేమపక్షుల్లా సరససల్లాపాల్లో మినిగితేలారు. 

* * *

కేరళ పర్యాటకంలో అన్నిటికంటే అత్యంత ఆనందాన్ని మధురానుభూతిని కలిగించేది, ’వెనిస్ ఆఫ్ ఈస్ట్’ గా పిలవబడే అలెప్పీ నుంచి కొల్లాకు వరకు వెంబినాడ్ సూట్స్‍పై ఒక రోజంతా పడవలో ప్రయాణం.

సతీష్.. ప్రత్యేకంగా బుక్ చేసుకున్న హౌస్‍బోట్‍లో ఒక ఫర్నిష్‍డ్ బెడ్రూం సెట్టింగ్ ఉంది. బోటును నడిపేందుకు ఒక డ్రైవరు, మరో సహాయకుడు, పర్యాటకులకు వారికి ఇష్టమైనవి వండి పెట్టేందుకు ఒక కుక్ కూడా ఉండడం విశేషం. 

’హైలో.. హైలెస్సా.. హంస కదా నా పడవ.. ఉయ్యాలలూగినది..’ అంటూ సరస్సులో రాజహంసలా ఠీవిగా సాగిపోతున్న ’హౌస్‍బోట్‍లో’ ప్రయాణం సతీష్, సంగీతలకు జీవితంలో ఓ మరుపురాని, మధురమైన అనుభవం. 

సరస్సు మధ్యలో చిన్న చిన్న ద్వీపాలు, వాటిపై సాగు చేస్తున్న వరిపొలాలు, కొబ్బరి చెట్లు, చేపలు పట్టుకుని జీవించే మత్స్యకారుల ఇళ్ళు, మధ్యమధ్యలో సరస్సులోకి ప్రవహించే అనేక చిన్న చిన్న నదులు, వాటిని కలిపే వంకరటింకర కాలువలు, ఇలా దారిపొడవునా కనువిందు చేసే ప్రకృతి అందాలు, బోటు బాల్కనీ లోనుండి వీక్షిస్తూ, కెమేరాలో బంధిస్తూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు ఇద్దరూ. 

తమకు ఇష్టమైన వంటకాలు బోటులోనే చెప్పి చేయించుకుని తింటూ, వారి రుచి మొగ్గలకు సరికొత్త రుచులు పరిచయం చేసారు. 

రాత్రి భోజనానంతరం.. బెడ్రూంలో సంతోష్ సరసన చేరిన సంగీత ’గ్రేట్, ఊహల పల్లకిలో ఊరేగించమంటే నిజంగానే పల్లకిలో ఊరేగించావు’ అంది మైకంగా సతీష్ కళ్ళలోకి చూస్తూ. 

’నువ్వు ఆ రోజు రాత్రి ఫోనులో మట్లాడే ముందే నాకు మెసేజ్ వచ్చింది. మా కంపెనీ చైర్మన్ ప్రోగ్రామ్ కేన్సిల్ అయ్యిందని, బోర్డ్ మీటింగ్ వచ్చే నెలకు వాయిదా పడిందని. అందుకే నువ్వు మాట్లాడడం అయిపోగానే ఆన్‍లైన్‍లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసి, నీకు మెయిల్ చేసి చెప్పాను. తెల్లారేసరికి నువ్వు కొచ్చికి ఫ్లైట్ కొచ్చేసావు’ అన్నాడు. 

’ఐ లవ్యూ.. లవ్యూ.. లవ్యూ..’ అంటూ సతీష్ గుండెలపై పడుకుని ’నన్ను నీలో కలిపేసుకోరా..’ అంటూ తమకంతో సంగీత మత్తుగా హత్తుకుపోతుంటే, వెంబనాడ్ సరస్సు సాక్షిగా, హౌస్‍బోట్‍లో ఆ రాత్రి వసంతోత్సవం జరిగింది. 

ఫ్లైట్‍లో.. తిరుగుప్రయాణంలో సతీష్, సంగీతని, ’ఎలా ఉంది ఈ నాలుగు రోజుల మన అనుభవం?’ అని ఆడిగినప్పుడు సంగీత చప్పున ప్రక్కకు తిరిగి సతీష్ జూజిప్స్ పెదాలపై ముద్దు పెట్టి ’ఇలా..’ అంది.

’ఓకె.. మరి అన్నిటికంటే ఏది బాగా మనసుకు నచ్చింది.. కొచ్చి ఎయిర్‍పోర్ట్‍లో నిన్ను ఎత్తుకుని తీసుకు వెళ్లటమా, మున్నార్ వానలో తడిసి ముద్దవటమా, తెక్కడిలో ఎలిఫెంట్ రైడా. ట్రీటాప్ రిసార్ట్‍లో గడిపిన క్షణాలా, హౌస్‍బోట్‍లో వసంతోత్సవమా?’ అని సతీష్ అడిగినప్పుడు... ’దేనికదే సాటి.. అనుక్షణం నీతో గడపటమే అన్నిటికన్నా మేటి..’ అంది సంగీత. 

’ఎక్సలెంట్.. అయితే ఇది చెప్పు, నీలో నాలో మనిద్దరిలో ఒకేలా ఉన్నదేంటి?’ అని సతీష్ అడగ్గానే.. ’వయస్కాంతం’ అంది సంగీత తడబడకుండా. 

’అంతే.. ఆ సమాధానానికి ఫిదా అయిపోయిన సతీష్, అంతకు ముందు సంగీత ఇచ్చిన ముద్దు తిరిగిచ్చేశాడు. అప్పుడే అటుగా వచ్చిన ఎయిర్‍హోస్టేస్, అది చూసి గుంభనంగా నవ్వుకుంది. 

* * *

మూడు నెలలు గడిచాయి. సంగీతకు ఇప్పుడు మూడోనెల. ’అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలానే ఉంటుంది.. పేరు, మున్నా’ అన్నాడు సతీష్. 

’కాదు.. అబ్బాయే ఫుడతాడు.. అచ్చం నాన్నలాగానే ఉంటాడు. . పేరు మున్నార్’ అంది సంగీత. చూద్దాం అనుకుని ఇద్దరూ నవ్వుకున్నారు. 

అలవాటు ప్రకారం సతీష్ సంగీతను ఎత్తుకోబోతే ..’ఇక నన్ను కాదు, ఆర్నెల్లు ఆగితే పాపాయిని ఎత్తుకుందురుగాని..’ అని సంగీత సతీష్ సరసన చేరింది.