సహరి వీక్లి కథా కమామీషు

This is the story summary of sahari weekly dated 15-07-2022

సహరి వీక్లి కథా కమామీషు

                                      కథా కమామీషు 15.07.2022 

 

1.    వార్నీ : స్నేహితుడు కదా అతడు అడిగినప్పుడల్లా యాభై, వంద అప్పులిస్తూ పోయాడతాడు. ఎప్పుడూ అప్పు ఆడగటమే కానీ తీర్చాలనే ధ్యాస లేని ఆ స్నేహితునిమీద అతనికి పీకలదాకా కోపం ఉంది. అలాంటి స్నేహితుడు ఒక రోజు ఒక బంగారు గొలుసుతో తన దగ్గరికి రావటం కనిపించింది. తాగటానికో, పేకాటకో డబ్బు తగలేయటంకోసమే అప్పుచేసే ఆ స్నేహితుడు ఒకరోజు అతని దగ్గరికి వచ్చాడు. అలా వచ్చేటప్పుడు అతడు తన జేబులో ఉన్న బంగారు గొలుసు సర్దుకోవటం చూశాక ఎలాగైనా సరే ఆ గొలుసు తీసుకుని, తాకట్టు పెట్టేసి, తన బాకీ వసూలు చేసుకోవాలని అనుకున్నాడతడు. తీయగా మాట్లాడుతూ అతడిని మాటల్లో పడేసి, తన డబ్బుతో మందు తాగించి, ఆ గొలుసు తీసేసుకుందామని అదను కోసం వేచిచూడసాగాడు. అతని పథకం ఫలించిందా? తన బాకీ వసూలు చేసుకోగలిగాడా? బొరుసు చంద్రరావు స్మారక ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న పసుపులేటి తాతారావు హాస్య కథ ‘వార్నీ’ తప్పక చదవండి.

 

2.     ప్రైజ్ మనీ : ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా పనిచేసే అతడొక కథా రచయిత. బడినుంచి ఇంటికొచ్చేలోపు కథకి సరిపడా సబ్జెక్ట్ గురించి ఆలోచించి, ఇంటికి వచ్చాక కథ రాస్తుంటాడు. ఓరోజు ఇంటికొచ్చేసరికి అతడి భార్య అతనికోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. అతడి ఇంట్లోకి అడుగుపెట్టటం ఆలస్యం... ఒక కథల పోటీలో అతడు ఐదువేల డాలర్లు బహుమతి గెలుచుకున్నాడంటూ ఉత్తరం వచ్చిందన్న శుభవార్త అతని చెవిన వేసింది. ఐదువేలంటే దాదాపు మూడు లక్షల పై చిలుకే అవటంతో, అంత మంచి వార్త చెప్పిన భార్యకు చీర కొనుక్కోమని ఒక ఐదువేలు ఇచ్చేశాడు. ఈ విషయాన్ని స్కూల్లో చెప్పి, తన సహ ఉపాధ్యాయులు మరియు ఊరి ప్రజల సమక్షంలో తన విజయాన్ని ఘనంగా జరుపుకున్నాడు. ఒక పబ్లిక్ స్కూలుకు యాభై వేలు విరాళం ఇచ్చేశాడు. ఇంతాచేసి ఆ ప్రైజ్ మనీ అతని చేతికి అందిందా? కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఇలపావులూరి శేషతల్పసాయి కథ ‘ప్రైజ్ మనీ’ తప్పక చదవండి.    

 

3.   365 డేట్స్ : చూడగానే ఆకర్షించే స్ఫురద్రూపి అయిన ఆ యువకుడితో ఆమె ఒకరోజు డేటింగ్ చేసింది. తనతో ఎంతో గౌరవంగా ప్రవర్తించిన అతని వ్యక్తిత్వం ఆమెకెంతో ఆనందం కలిగి, అతనికి తన ప్రేమను తెలియజేద్దామనుకుంది. అయితే అనుకోకుండా ఫేస్ బుక్ లో అతని అకౌంట్ చూసిన ఆమెకు, అతను అప్పటివరకు తనలాంటి 365 మంది యువతులతో డేటింగ్ చేశాడని తెలిసి కోపంతో ఉడికిపోయింది. ఆల్రెడీ అతనితో డేటింగ్ చేసిన అమ్మాయిలు అతన్ని పొగుడుతూ పంపిన మెసేజీలు చూసి ఆమె సహించలేకపోయింది. ఆడవారి జీవితాలతో ఆటలాడే ఇలాంటివారిని ఊరికే వదిలిపెట్టకూడదని అనుకుని, సరాసరి వెళ్ళి అతన్ని నిలదీసింది. దానికతడు ఏం సమాధానం చెప్పాడు? అతడు చెప్పింది విని ఆమె ఏం చేసింది? సరసమైన కథల పోటీలో బహుమతి పొందిన ఆకునూరి మురళీకృష్ణ హృదయానికి హత్తుకునే కథ 365 డేట్స్ తప్పక చదవండి.

 

4.     ప్రఫుల్ల : ఆ ఆఫీసులో కొత్తగా చేరిన ఆమెతో మొదట్లో కాస్త ముక్తసరిగా ఉన్నా, ఆ తర్వాత ఆమె కలుపుగోలుతనానికి అతడు కరిగిపోయాడు. అతడు వివాహితుడైనా, ఆమె అతనితో  అంత సన్నిహితంగా చూసిన ఆ ఆఫీసులోని ఇతర ఉద్యోగులు చెవులు కొరుక్కోవటం చూసి, అతడు బాధపడ్డాడు. కానీ ఆ విషయాన్ని ఆమె చాలా తేలిగ్గా తీసిపారేసింది. దాంతో ఆమెమీద అతనికి గౌరవం పెరిగింది. ప్రతిరోజూ ఆమె చెప్పే ఎన్నెన్నో మంచి విషయాలకు అతడు ముగ్ధుడైపోయేవాడు. ఒక రోజు ఆమెను కలసి కాసేపు మాట్లాడివద్దామనిపించి ఆమె దగ్గరికి బయల్దేరాడు. ఆమె ఇంటి అడ్రస్ కనుక్కుని లోపలికి అడుగుపెట్టబోతుండగా, లోపలినుంచి ఎవరో మాట్లాడుకునే మాటలు వినిపించి బయటే ఆగిపోయాడు. లోపల మాట్లాడుతున్నది ఎవరు? వారేం మాట్లాడుతున్నారు? ఆ మాటలు విన్న అతని స్పందన ఏమిటి? మానవ మనస్తత్వాలను తెలిపే సి.పార్థసారథి ‘ప్రఫుల్ల’ కథను చదవండి.

 

5.     గెలిచిన గోళీలు : తన తమ్ముడు కష్టపడటం చూసి భరించలేని అతని అన్న, స్వంతంగా వ్యాపారం పెట్టుకొమ్మని అతనికి కొంత సొమ్ము ఇచ్చాడు. తన అన్నయ్య ఇచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టిన అతని తమ్ముడు వ్యాపారంలో బాగా పుంజుకున్నాడు. ఆపైన అతనికి దుర్బుద్ధి పుట్టి, తన అన్నయ్య దగ్గర పనిచేసే ఉద్యోగులను తన వ్యాపారంలోకి తీసుకుని అన్న వ్యాపారాన్ని దెబ్బకొట్టటం మొదలుపెట్టాడు. తమ్ముడు చేస్తున్న ద్రోహానికి ఆ అన్నగారికి కోపం వచ్చి తమ్ముడిని నిలదీశాడు. దాంతో ఇద్దరికీ గొడవ మొదలైంది. పెద్దలు సర్దిచెప్పాలని చూసినా వ్యవహారం చివరికి కోర్టు వరకూ వెళ్ళింది. అక్కడ వెలువడిన తీర్పు పర్యవసానం ఏమిటి? విడిపోయిన ఆ అన్నదమ్ములు చివరికి ఏమయ్యారు? కథలో ఈ గోళీల కథ ఏమిటి? చివరికి సువర్ణ మారెళ్ల రచించిన చక్కని సామాజిక కథ ‘గెలిచిన గోళీలు’ తప్పక చదవండి. 

 

6.     అంతరిక్ష అనురాగం : యుక్తవయసులో ఉన్న ఆ యువతీయువకులిద్దరూ స్పేస్ ఇంజనీరింగ్ లో అత్యున్నత డిగ్రీలు కలిగినవారు.  ఆ కారణంగా భూమికి అయిదు కోట్ల డెబ్భై లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారక గ్రహానికి ఆ ఇద్దరినీ పంపాలని నిర్ణయించబడింది. దానికోసం ఆ ఇద్దరూ మూడు సంవత్సరాల కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. వారి ప్రతి కదలికా, వారు మాట్లాడే ప్రతి మాటా భూమిపైనున్న కంట్రోల్ రూంనుంచే నియంత్రించబడసాగింది. భూమికి కొన్ని కోట్ల మైళ్ళ దూరం వరకు వారి ప్రయాణం సాగింది. ఆ యువతికి వచ్చే ప్రతి కష్టంలోనూ అతడు అండగా నిలిచాడు. ఆరునెలల ప్రయాణం తర్వాత వారు అంగారక గ్రహాన్ని చేరుకున్నారు. అక్కడ ఏవో వింత జీవులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టాయి. అప్పుడతడు ఏం చేశాడు? ఆమె రక్షించబడిందా? వారి మధ్య ప్రేమ చిగురించిందా? పాఠకులను అంతరిక్షంలో విహరింపజేసే ఎం.వి.ఎస్.ఎస్. ప్రసాద్ రచించిన చక్కని కథ ‘అంతరిక్ష అనురాగం’ లో ఈవారం సహరిలో చదవండి.