ప్లాన్ బి

పెద్దగా చదువుకోకపోయినా బంగారు బొమ్మలా ఉండే తన అన్న కూతుర్ని కొడుక్కి చేసుకోవాలని కళ్యాణి కోరిక..! బాగ చదువుకున్న వాడూ, బుద్ధిమంతుడు అయిన తన చెల్లెలి కొడుక్కి కూతుర్నిచ్చి చెయ్యాలని చక్రపాణి ఆశ...! గోడకున్న కీ.శే. భర్త ఫోటో పక్కన తనూ ఒక ఫోటోగా అయిపోయేలోగా మనవరాలిని మనవడి చేతిలో పెట్టెయ్యాలని మంగమ్మ పట్టుదల. కానీ ఈ ముప్పేట దాడి నుంచి తనని తాను ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నాడు సిద్దార్ధ. ఆ ముగ్గురి కోరికలోనూ తప్పు లేదు కానీ దానిని దాడి అని ఎందుకనవలసి వచ్చిందంటే, సిద్దార్ధకి మేనరికమంటే అస్సలు ఇష్టం లేదు. దాని వల్ల ఎనో అనర్ధాలున్నాయని అతని నమ్మకం.

ప్లాన్ బి

ప్లాన్ -బి

 (కథ)

రచయిత: జె ఎస్ వి ప్రసాద్ 

పెద్దగా చదువుకోకపోయినా బంగారు బొమ్మలా ఉండే తన అన్న కూతుర్ని కొడుక్కి చేసుకోవాలని కళ్యాణి కోరిక..! బాగ చదువుకున్న వాడూ, బుద్ధిమంతుడు అయిన తన చెల్లెలి కొడుక్కి కూతుర్నిచ్చి చెయ్యాలని చక్రపాణి ఆశ...! గోడకున్న కీ.శే. భర్త ఫోటో పక్కన తనూ ఒక ఫోటోగా అయిపోయేలోగా మనవరాలిని మనవడి చేతిలో పెట్టెయ్యాలని మంగమ్మ పట్టుదల. 

కానీ ఈ ముప్పేట దాడి నుంచి తనని తాను ఎప్పటి నుంచో కాపాడుకుంటున్నాడు సిద్దార్ధ.  ఆ ముగ్గురి కోరికలోనూ తప్పు లేదు కానీ దానిని దాడి అని ఎందుకనవలసి వచ్చిందంటే, సిద్దార్ధకి మేనరికమంటే అస్సలు ఇష్టం లేదు. దాని వల్ల ఎనో అనర్ధాలున్నాయని అతని నమ్మకం. 

* * *

’ఏరా చక్రీ! చెల్లెల్నీ, బావగార్నీ పండక్కి రమ్మని చెప్పావా..? లేక పండగెళ్ళాక చెబుతావా?’ అంది మంగమ్మ కొడుకుతో. 

’పొలంలో చాలా పని ఉండిపోయిందమ్మా! పంట చేతికొచ్చే టైమ్ కదా.. కొన్ని పనులు చక్కబెట్టుకుని నేనే వెళ్ళి పిలుచుకొస్తాను’ అన్నాడు చక్రపాణి. 

’ఆ పెద్ద పాలేరుగాడున్నాడుగా, వాడికి చెప్పు పనులు, వాడి వెనుక నేనుంటాగా. పది రోజుల ముందయినా వాళ్ళు రాకపోతే పండగ కళేముంటుంది?’ అంది మంగమ్మ. 

’సరే సరే త్వరగానే వెళతాలే’ అని జారుకున్నాడు చక్రపాణి. ఆ ఇంటిలో మంగమ్మ చాణుక్యుడికి తక్కువ, బాహుబలి శివగామికి ఎక్కువ.

* * *

’మహదేవపట్నం నుంచి మావయ్యొచ్చాడు, పండక్కి పిలవడానికి’ అంది కల్యాణి కొడుక్కి టీ కప్పు అందిస్తూ. సిద్దార్ధ తల్లివైపు చురుగ్గా చూసాడు. ’ఏదో విశాఖపట్టణం నుంచి వచ్చినంత గొప్పగా చెప్పావు గానీ ఆ పల్లెటూరికి నేను రాను. పండగ ముందో, పది రోజుల తరవాతో పది రోజులు నన్నక్కడ కట్టి పడేసి, మాయ చేసి ఆ డోలుని నా మెడకు తగిలించాలని చూస్తుంది ఆ ముసల్ది’ అన్నాడు. 

’డోలు, రోలు అంటావేమిట్రా. శ్రీదేవి నిజంగా పేరుకు తగ్గట్టు సిరిదేవే. చక్కగా బంగారు బొమ్మలా ఉంటుంది కదూ!’  అంది కళ్యాణి. 

’బంగారంలా ఉంటే కరిగించి వడ్డాణం చేయించుకో. నాకు తగిలించకు. అయినా ఎన్ని సార్లు చెప్పాలమ్మా, మేనరికం మంచిది కాదు. పుట్టే పిల్లలు ఏదో వంకతో పుడతారని..!!’ 

’మేనరికం చేసుకున్న వాళ్ళు చాలామంది లక్షణంగా లేరూ?’

’అబ్బా!’ అంటూ నెత్తి కొట్టుకున్నాడు సిద్దార్ధ, ’కొందరిలో వెంటనే తేడా కనిపించదమ్మా, తరవాతి తరం వాళ్ళల్లో కనిపిస్తుంది. వీళ్లని క్యారియర్స్ అంటారు’.

’సరే సరే! ఆ సంగతలా ఉంచు, మమూలుగా మావయ్యగారింటికి వెళ్ళివద్దాం, పండక్కదా! మీ నాన్నగేరేమో సంక్రాంతిక్కూడా అమరావతిని వదిలి రావడం కుదరదని అంటున్నారు. ఆయన టెన్షన్ ఆయనది. వెళ్ళి త్వరగా వచ్చేద్దాం లే’ అంది పుట్టింటి మీద మమకారంతో. 

అబ్బాయి కొంచెం మెత్తబడ్డాడు. ’సరే అమ్మా! కానీ అక్కడ ఎవరూ నా పెళ్ళి మాట ఎత్తకూడదు మరి. అమ్మమ్మకి, మావయ్యకి, అత్తయ్యకీ కూడా చెప్పు. మరీ ముందుగా వద్దు, దగ్గరగా వెళదాంలే’ అన్నాడు. 

కళ్యాణి నాలుగైదు రకాలుగా తలాడించింది.

* * *

’రావే కళ్యాణీ!  రారా మనవడా!’ అంటూ ఆహ్వానించింది వాకిట్లో గాడిపొయ్యి మీద్ అమూకుడు పెట్టి పిండివంటలు చేస్తున్న మంగమ్మ. ’అల్లుడుగారు రాలేదేమే? తర్వాత వస్తానన్నారా?’ అడిగింది మళ్ళీ. 

రామలక్ష్మి ఇద్దర్నీ ప్రేమగా ఆహ్వానించింది. కుశలప్రశ్నలు అయ్యాక వేడివేడి పిండివంటలు ప్లేట్లల్లో సర్ది సిద్దార్ధ ముందు పెట్టింది.  చక్రపాణి పొలం వెళ్ళాడు. ఉత్తరం వైపు గదిలో మంచం వాల్చి విశ్రాంతి తీసుకోమని చెప్పి వదినామరదళ్ళిద్దరూ వంటింటి సామ్రాజ్యంలోకి కబుర్లు పంచుకోవడానికి వెళ్ళిపోయారు. 

సిద్దార్ధ కళ్ళు అప్రయత్నంగా శ్రీదేవి కోసం వెదకసాగాయి. మేనరికం తప్పని గట్టిగా నమ్మడం వల్ల గానీ, లేకపోతే మేనమామ కూతురంటే అతనికి ఇష్టమే! బావామరదళ్ల అనుబంధంలోని మర్మమే అది.

శ్రీదేవిని చూడగానే అతని కళ్ళలో ఏ భావాలుంటాయో చూడాలని మంగమ్మ అక్కడే తచ్చాడుతోంది. కాసేపటికి చెంగుచెంగున ఎగురుతూ వరదలా వచ్చింది మరదలు శ్రీదేవి. 

’హాయ్.. బావా! ఎప్పుడొచ్చావు? అందరూ వచ్చారా? నాకు ఏమి తెచ్చావు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 

’వచ్చి రెండ్రోజులైంది, బస్టాండ్‍లో పడుకుని ఇప్పుడే వచ్చాం గానీ, ఇంతవరకూ ఎక్కడికి వెళ్ళిపోయావు?’ అడిగాడు నవ్వుతూ.

’పండక్కదా! ఆడుకోవడానికెళ్ళాను బావా!’ అంది గోముగా గారంగా. 

’ఆడుక్కోడానికా..?’ అన్నడు నొక్కిపెట్టి వేళాకోళంగా. 

శ్రీదేవిని చూడగానే సిద్దార్ధ కళ్ళలో వచ్చిన చిరుమార్పుని మంగమ్మ కనిపెట్టింది. ’నిరిటికీ, ఈ నాటికీ శ్రీదేవిలో చాలా మార్పులు, మెరుపులూ వచ్చాయి మరి’ మంగమ్మ అటు తిరిగి ముసిముసిగా నవ్వుకుంది. 

* * *

సిద్దార్ధ పుస్తకాల పురుగు. అతని రూమ్ నిండా వందల పుస్తకాలుంటాయి. డ్యూటీ నుంచి వచ్చాక, పుస్తకాల తోనే గడుపుతాడతను. అలాంటిది ఈ ఇంట్లో ఒక్క పుస్తకమూ కనిపించడం లేదు. టీవీ రిపేరొచ్చి మూలపడింది. కాసేపు సెల్లో గేమ్స్ ఆడుకున్నాడు. ఫ్రెండ్స్‍తో కబుర్లు చెప్పుకున్నాడు. విసుగొచ్చి లేచి అటూ ఇటూ పచార్లు మొదలుపెట్టాడు. 

మంగమ్మ అంతా గమనిస్తూనే ఉంది. ఒక స్టీల్ బాక్స్ తీసుకుని బయటికి వెళుతున్న శ్రీదేవిని చూడగానే గబగబా వెళ్ళి శ్రీదేవిని చెయ్యి పట్టుకుని పక్కకి లాగి, ’ఎక్కడికి వెళుతున్నావు?’ అని అడిగింది మంగమ్మ. 

’అమ్మ ఈ బాక్స్ పార్వతి ఆంటీకి ఇవ్వమంది’ అంది శ్రీదేవి. 

’నేనిస్తాలే, బావని వదిలి నిన్నెక్కడికీ వెళ్లద్దొన్నానా? నువ్వు వెళ్ళి మీ బావతో కబుర్లు చెప్పు. పాపం వాడు ఏమీ తోచక ఆ గదిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు’ అంటూ ఇంకా ఏవేవో విషయాలు సీక్రెట్‍గా బోధించింది. 

* * *

’ఎం బావా! బోర్ కొడుతోందా?’ అంటూ వచ్చింది శ్రీదేవి. 

’కొట్టదా మరి, మా ఊర్లో హాయిగా ఫ్రెండ్స్‍తో ఉండేవాణ్ణి తీసుకొచ్చి ఈ అడవిలో పడేసింది మా అమ్మ. ఒక్కపుస్తకం గాని, కనీసం టీవీ కూడా లేదు. పిచ్చెక్కుతుంది’ అన్నాడు చిరాగ్గా. 

’నన్ను చూస్తుంటేనా? థాంక్స్ బావా! అంతందంగా ఉన్నానా?’ అంటూ చిలిపిగా నవ్వింది శ్రీదేవి. ’పోనీలే బావా! నా సెల్లులో బోలెడు పాటలున్నాయి. వింటావా?’ అంటూ తన సెల్ ఇచ్చింది. 

హమ్మయ్యా! అనుకుంటూ సెల్‍లో మ్యూజిక్ ఆన్ చేసాడు. ’ఈ మూగ చూపేలా బావా మాటాడాగానేరవా’ అంటూ వచ్చింది పాట. అది కట్ చేసి మరొకటి పెట్టాడు. ’బావవి నువ్వు, భామను నేను. ఇద్దరమొకటవనీ’ అని మరో పాట. అదీ ఆఫ్ చేసి మరొకటి పెట్టాడు. ’ఏలే ఏలే మరదలా’ అంటూ అన్నమయ్య మొదలుపెట్టాడు. తరువాత ’దంచవే మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా’ అంటూ మంగమ్మ గారి మనవడొచ్చాడు. 

’చదువూ సంధ్యా లేకుండా ఈ పిచ్చి పాటలేంటీ? మీ నాన్నతో చెబుతానుండు’ అన్నాడు సిద్దార్ధ చిరాగ్గా. 

’నాన్నమ్మ పని కూడ చెపుతావా? తను రోజూ ఈ పాటలే వింటూ నిద్రపోతుంది, తెలుసా?’  అంది శ్రీదేవి. ఆ నవ్వు జలతరంగిణిలా ఉంది. తన నరాలనెవరో పట్టి గిటార్ మీటినట్టయింది సిద్దార్ధకి. 

* * *

ఆ రోజు భోగి. కోడి కూయక ముందే అందరూ లేచి అభ్యంగన స్నానాలు చేసి ఇంటి ముందు వాకిట్లో ముగ్గుల మధ్య వేసిన భోగి మంట చుట్టూ చేరారు. 

’బావగారు కూడా ఉంటే బావున్ను’ అన్నాడు చక్రపాణి. ’మీరు వెళ్లండి, నేను తరవాత వస్తాను అన్నారు మరి’ అంది కళ్యాణి. 

’పనిని పట్టుకు వేళ్ళాడేవాళ్లకి శలవులు దొరకవులే’ అంది మంగమ్మ. 

కొంతసేపటికి భోగిమంట ముందు నుంచి లేవగానే శ్రీదేవి లోపలికి పరుగెత్తి ఒక బాక్స్‍తో సున్నుండలు తెచ్చింది. ముందుగా స్వీట్ తినాలంటూ అందరికీ పంచగా శ్రీదేవి సిద్దార్ధ మిగిలిపోయారు. స్వీట్ ఒకటే ఉంది. దాన్ని సిద్దార్ధకిచ్చి అతని వైపే చూస్తూ నుంచుంది. సిద్దార్ధ కొంచెం కొరుక్కోగానే చటుక్కున అతని చేతిలో నుంచి లాక్కుని నోటిలో వేసుకుని పారిపోయింది. 

సిద్దార్ధ కంగారుగా చుట్టూ చూసాడు, ఎవరైనా చూసారేమోనని. మంగమ్మ అటు తిరిగి నవ్వుకోవడం అతను చూడలేదు. 

* * *

తెలతెలవారుతుండగా హరిదాసు వచ్చాడు. అతనికి బియ్యం వేస్తూ సిద్దార్ధ చేత సెల్‍లో ఫోటో తీయించుకుంది శ్రీదేవి. తరవాత గంగిరెద్దుల వాళ్ళొచ్చారు. మంగమ్మ రహస్యంగా వాళ్లకేమి సైగ చేసిందో , వాళ్ళు సిద్దార్ధనీ, శ్రీదేవినీ రకరకాల దేవతలతో పోల్చి ఎన్నో విధాలుగా పొగిడారు. పెళ్ళికి పిలవలేదేమని దెబ్బలాడారు. మంగమ్మ వాళ్ళకి బాగా డబ్బూ, బట్టలూ ఇచ్చింది. ఎందరో పేదవాళ్లకి దోసిళ్లతో ధాన్యం, బియ్యం పంచారు మధ్యాహ్నం వరకూ. 

శ్రీదేవిని పొరపాటున కూడా సిద్దార్ధకి దూరంగా వెళ్లనివ్వడం లేదు మంగమ్మ. కళ్లతోనే సైగలు చేస్తూ డైరక్షన్ చేస్తూండేది. 

’అత్తయ్యా! దానికిలాంటివన్నీ చెప్పి, మనసు పాడుచెయ్యడం తప్పేమో? మీ ప్లాన్ ఫలించి, ఇద్దరూ ఒకటయితే పరవాలేదు.  అనుకున్నట్టు జరగక అది ఈ విద్యలన్నీ ఎవరిమీదైనా ప్రయోగిస్తే ప్రమాదం కదా’ అంది రామలక్ష్మి భయంభయంగా. 

’ఏం పరవాలేదమ్మా! ప్లాన్ - ఏ ప్రకారం మనమందరం వాడికెన్నో విధాల చెప్పి చూసాం.  మేనరికం గీనరికం అంటూ వెధవ్వేషాలు వేస్తున్నాడు. నేను మంగమ్మ శపథం చేసాను కదా. ప్లాన్ - బి తో ఈ పెళ్ళి చేసి తీరతానని.. చేస్తాను.. అంతే!’ అంది మంగమ్మ. ఈ సంగతులేవీ చక్రపాణికి తెలియవు. 

బాగా తెల్లవారుఝామునే లేవడం అలవాటు లేకపోవడం, పైగా తలంటు స్నానం  వల్ల తల దిమ్ముగా ఉండి మంచం మీద వాలాడు సిద్ధార్ధ. టిఫిన్ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది శ్రీదేవి. 

’ఏం బావా! పడుకున్నావు? తలనొప్పా!’ అంటూ ముందుకు వంగి సిద్దార్ధ నుదుటి మీద చెయ్యి వేసింది. ముందుకు వంగడం వల్ల తలంటు పోసుకున్న నిడుపాటి కేళాలు నల్ల మబ్బుల్లా. నల్లటి వల లగా అతని ముఖాన్ని కమ్మేసాయి. వలలో పడ్డ చేపలా గిలగిలలాడాడు. చేప అయితే వల నుండి తప్పుకోవడానికి గిలగిలలాడుతుంది. కానీ అతను తప్పిపోతానేమో అని విలవిలలాడిపోయాడు. ఆమె కురుల్లోనుంచి వస్తున్న పరిమళాలు అతనిని ఉక్కిరిబిక్కిరి చేసాయి కొన్ని క్షణాలు. 

’ముందు టిఫిన్ తిను బావా, టీ తెస్తాను. వేడిగా తాగితే తలనొప్పి గిలనొప్పి తగ్గిపోతాయ్’ అని వెళ్ళిపోయింది శ్రీదేవి. 

ఏదో అందమయిన కల చెదిరినట్టయిపోయింది సిద్దార్ధకి. 

టీ తాగాక మంచం మీద వెల్లకిలా పడుకుని బరువెక్కిన మనసుతో మిద్దె వైపు చూస్తోంటే సీలింగ్ ఫ్యాన్ రెక్కల మీద, షెల్ఫ్ మీద, టేబుల్‍పై ఉన్న ఫ్లవర్ వాజ్ మీద, మన్మథుడు ఐదు రకాల బాణాలు పట్టుకుని అల్లరి చెయ్యసాగాడు. 

’కంట్రోల్.. కంట్రోల్’ అంటూ తనని తాను హెచ్చరించుకోసాగాడు సిద్దార్ధ. ఐనా మన్మథుడి వేధింపులు ఎక్కువవుతూంటే, లేచి అలా తిరిగొద్దామని బయలుదేరాడు. ఊరంతా రంగురంగుల రంగవల్లులతో, పిల్లల కోలాహలంతో కళకళలాడుతోంది. ఒక అరుగు మీద కూర్చున్న అమ్మలక్కలిద్దరు సిద్దార్ధని చూసి గుసగుసలాడుకోవడం అతనికి గట్టిగానే వినిపించింది. 

’సుబ్బొమ్మొదినా! ఆ అబ్బాయి మన చక్రపాణి మేనల్లుడట. వాళ్ల శ్రీదేవినిచ్చి చేస్తారంట, మంగక్క చెప్పింది. ఈడుజోడూ బాగుంటుంది కదూ’ అన్నదొకావిడ. 

’అవున్నిజమేనొదినోయ్..! అంది సుబ్బమ్మ బోసినోరు సాగదీసుకుని. మరో వీధిలో ఇద్దరు ఆడపిల్లలు అతన్ని కొరుక్కు తినేసేలా చూసారు. 

’అబ్బ ఎంత బగున్నాడే..! శ్రీదేవి ఇతన్ని నాకొదిలేస్తే బాగుణ్ణు..’ అంది ఒక పిల్ల. 

’నిజమేనే పోయి అడిగేద్దామా..!’ అంది మరొకతి 

’పల్లెటూరి ఆడపిల్లలు కూడ ఇంత ముదిరిపోయారా?’ అని ఆశ్చర్యపోతూ ఇంటిదారి పట్టాడు సిద్దార్ధ.

సంక్రాంతి రోజు సిద్డార్ధ నోటికి ఐదు నిమిషాలు కూడా రెస్ట్ ఇవ్వడంలేదు ఆ ఇంటి వాళ్ళు. అరిసెలు, సున్నుండలు, గారెలు, బొబ్బట్లు, జంతికలు, భుక్తాయాసంతో పడుకున్నాడని జాలైనా లేకుండా బాణాలు గుప్పిస్తూ తియ్యటి గాయాలు చేస్తున్నాడు మన్మథుడు. అది చాలక మధ్య మధ్య ఏవేవో స్వీట్స్ తెచ్చి ఆ గాయాలపై మరింత షుగర్ చల్లుతోంది శ్రీదేవి.  కనుమరోజు మేనల్లుడికి ఎడ్ల పందాలు, కోడి పందాలు చూపించాడు చక్రపాణి.  అక్కడ కూడా శ్రీదేవి నీడలా అతని వెనకే తిరిగింది. 

పండుగ సంబరాలన్నీ అయిపోయాయి. అన్నగారు పెట్టిన సారెచీరలతో ఇంటికి బయలుదేరింది కళ్యాణి. తల్లి పక్కనే ఉన్నా ఏదో లోకంలో ఉన్నట్టున్నాడు సిద్దార్ధ. అప్పటివరకూ మనసులో ఉన్న మధుర స్మృతులను తరిమివేయాలని యుద్ధం చేస్తున్నాడతను. కానీ అతను ఓడిపోయాడు. అది తియ్యని ఓటమి...! అలిసిపోయిన సిద్దార్ధ అలసటగా తల్లి భుజం మీద తల వాల్చాడు. 

’అమ్మో, మాఘమాసంలో ము ముహూర్.. తాలు.. ఉ ఉంటాయా...?’ అడిగాడు సిగ్గుపడుతూ. కళ్యాణికి అంతా అర్ధమయింది. కళ్ళింతలు చేసుకుని చూసింది కొడుకు వైపు. వెంతనే విచారం నటిస్తూ ’కానీ ఏమ్ లాభం? మేనరికాలు మంచివి కాదు కదా...!’ అంది.

’పోమ్మా..!’ అని సిగ్గుపడుతూ తల్లి చెంగు చాటున మొహం దాచేసుకున్నాడు సిద్దార్ధ..!