మానస భజరే

Spiritual Articles

మానస భజరే

మానస భజరే

భగవంతుడు అపార కరుణామయుడు. జీవులు ఈ లోకంలో పడే కష్టాలను బాపి వారిని తరింపచేయడానికి గురువుగా అవతరిస్తుంటాడు. శ్రీగురుచరిత్రలో అవధూత తనకు ఇరవైనలుగురు గురువులు ఉన్నారని చెప్తాడు. పాము మొదలుకొని ఈగ వరకు ఎందరో ఎన్నో విషయాలలో గురువుగా తనకు బోధ చేసారు అంటాడు. దీనిని బట్టి గురుతత్వం అనేది భగవత్కృప తప్ప ఏదో ఒక రూపం నామం కి మాత్రమే పరిమితం కాదు అని తెలుస్తుంది. అలాంటి గురువుగా భగవంతుడిని మనసులో నిరంతరం గుర్తుంచుకోవడం ఒక సాధన.

భగవంతుడికి మనం సమర్పించే పుష్పాలు, ఫలాలు ముఖ్యం కాదు. నిజానికి ఆ ఫలపుష్పాలు భగవంతుడి సృష్టించినవే కాని మనవి కావు. ఒకరి తోటలో పూసిన పుష్పాలు, ఫలాలను వారికే తీసుకుపోయి సమర్పించినట్లు ఉంటుంది అది. అలా కాక మనది అని చెప్పుకోవడానికి ఏదైనా ఉన్నది అంటే అది మన మనసే కదా! ఆ మనసులోని పాపమనే మలినాలను పశ్చాత్తాపం వలన కలిగిన కన్నీటితో కడిగి శుభ్రపరిచి నిర్మలంగా మార్చుకుని, సుగుణాలు అనే పరిమళాలను నింపి భగవంతుని పాదపద్మాల ముందు సమర్పించాలి. ఇదంతా మనసులోనే జరగాలి. బాహ్యంగా మనం చేసే ఆడంబరమైన పూజలో మనం సమర్పించే ఫలాలు, మధుర పదార్థాలు, పుష్పాలు చూసి పేదవారైన భక్తులు తాము అలా చేయలేకపోయినందుకు బాధపడతారు తమ పేదరికాన్ని నిందుంచుకుంటూ.

అందుకే భగవంతుడు ఆర్భాటంగా చేసే బాహ్యపూజ కంటే మనసులో చేసే మానసిక పూజకు ఎక్కువ ఫలం ఇస్తాడు. హృదయంలో ఇష్టదైవం యొక్క రూపాన్ని ప్రతిష్టించుకోవాలి. మన కర్మఫలాలనే ఫలాలుగానూ, మనలో పుట్టే ఆలోచనలను, భావాలను పుష్పాలుగాను ఆ భగవంతునికి అర్పించి అర్చించాలి. ఇలాంటి పూజకే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. 

భగవంతుడు గురువుగా వచ్చి చేసిన బోధ పైన సాధకుడికి అపారమైన నమ్మకం ఉంచాలి. అలా నమ్మకం ఉంచిన సాధకుడు తప్పక తరిస్తాడు. దీనికి దృష్టాంతంగా ద్వాపర కాలంలో ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుడు వాహ్యాళికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను చూద్దాం. ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక పక్షిని చూసి శ్రీకృష్ణుడు ’అర్జునా ఆకాశంలో చూడు. అది పావురమా’ అని అడిగాడు. అర్జునుడు వెంటనే అన్నాడు, అవును కృష్ణా, అది పావురమే’ అని.

కొంత సేపు ఆగి శ్రీకృష్ణుడు ’అర్జునా, అది గ్రద్ద కదూ’ అన్నాడు. ’అవును కృష్ణా, అది గ్రద్దే’ అన్నాడు అర్జునుడు. మరి కాసేపటి తర్వాత ’అర్జునా అది కాకి’ అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, ’అవును కృష్ణా అది కాకి’.

శ్రీకృష్ణుడు పక పకా నవ్వి ’అర్జునా, నేనేమి చెప్తే దానికి అవునంటావు, నువ్వు నీ కళ్ళతో చూసి, నీ బుద్ధి తో యోచించి సమాధానం చెప్పవా?’ అంటూ గేలి చేసాడు. ’ఓ కృష్ణా, నాకు నీ మాటలే ప్రమాణం గాని నా కనులు బుద్ధి తెలిపే విషయాలు కావు ప్రమాణం. సంకల్పమాత్రాన ఆ పక్షిని కాకి చేసే శక్తి నీకు ఉంది. అందుకే నువ్వు కాకి అంటే అది కాకి అయితీరవలసిందే’ అన్నాడు అర్జునుడు.

ఇలాంటి అనన్య భక్తినే భగవంతుడు కోరుకునేది. అలాంటి సాధకుడికి భగవంతుడు అధీనుడు అనడంలో సందేహం లేదు. అందుకే నిరంతరం భగవంతుని గురువుగా తలుస్తూ మనసులో భజించే సాధకుడే ఉత్తమ సాధకుడు.

***