మేధో హత్యలు part 14

This is Fourteenth part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 14

మేధోహత్యలు 14

(స్పై సస్పెన్స్ థ్రిల్లర్)

జార్జి ని చూసి తన అనుమానాలను తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు విజయ్. అతని చేతిలో గన్ ఉంది. తను అతని ముందు నిరాయుధుడిగా ఉన్నాడు. ఏ క్షణమైనా తనను కాల్చి చంపేయగలననే ఆలోచన లో ఉంటాడు జార్జి. అందువలన అబద్ధం చెప్పల్సిన అవసరం అతనికి ఉండదు.

’ఓహ్, నా అనుమానం నిజమే నన్నమాట. మార్సెల్లో మేధస్సుని నాశనం చేసింది నువ్వే నన్న మాట’ అన్నాడు విజయ్ తన మొఖంలో ఎలాంటి భావాన్ని ప్రకటించకుండా!

’మార్సెల్లో ఒక్కడే అనుకున్నావా? అంతకు ముందు మరో ఏడుగురి కి కూడా అదే గతి పట్టించాను’ అన్నాడు జార్జి నవ్వుతూ. ఒక్కొక్క మెట్టే దిగి దగ్గరకు వస్తున్నాడు. టేబుల్ పైన ఓపెన్ చేసి ఉన్న డయాగ్రమ్ వైపు ఒక అరక్షణం చూసాడు.

’అర్థమయింది. నువ్వు ప్రెజరైజ్డ్ ఎయిర్ గన్ వాడుతున్నావని’ అన్నాడు విజయ్ కళ్ళతోనే ఆ డయాగ్రమ్ వైపు చూపిస్తూ.

పక పకా నవ్వాడు జార్జి.

’అంత మోటుగా ఉన్న పరికరాన్ని ఎవరైనా వాడుతారా? నేను అలాంటిది వాడుతాను అని నువ్వు అనుకున్నావా?’ నోటితో విచిత్రంగా ఒక శబ్దం చేసి, ’నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు. నువ్వే కాదు ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా నన్ను తక్కువ అంచనా వేసింది. రసాయన శాస్త్రంలో నేను చేసిన రీసెర్చ్ వాళ్ళ దృష్టికి రీసెర్చ్ లాగానే అనిపించలేదట. నన్ను ఒక సైంటిస్ట్ గా వారి మధ్య చేర్చుకోవడానికి తిరస్కరించారు. అందుకే నాలో ప్రతీకారేచ్చ రగిలింది. ఈ ఆర్గనైజేషన్ లో అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కి అప్లై చేసాను. పెద్ద జీతం తో నన్ను తెచ్చి పెట్టుకున్నారు వారి పనులు చూసుకోవడానికి. నేను... చూసుకుంటున్నాను...’ అంటూ మళ్ళీ గట్టిగా నవ్వాడు.

’అంటే నువ్వు ఆ ప్రెజరైజ్డ్ ఎయిర్ గన్ ని మాడిఫై చేసావా?’ ఆశ్చర్యంగా అడిగాడు విజయ్.

విజయ్ మొఖంలో కనిపిస్తున్న ఆశ్చర్యం జార్జికి సంతృప్తి కలిగించింది. తన గొప్పదనాన్ని వినడానికి ఒక శ్రోత దొరికాడు అనుకున్నాడు. ’యెస్. ఆ డయాగ్రమ్ లో ఉన్నది నాకు పనికి రాదు. దాన్ని నా అరచేతిలో ఇమిడిపోయేటంత మీనియేచర్ ఎయిర్ గన్ లాగా చేయడానికి నాకో మిత్రుడు సాయం చేసాడు. నీకు తెలిసే ఉంటుంది స్విస్ వాళ్ళు వాచ్ తయారీలో ప్రపంచంలోనే నెంబర్ ఒన్ అని. ఆ నైపుణ్యాన్నే నా ఫ్రెండ్ దగ్గర చూసాను. అతను నాకు సహకరించాడు. ఇదిగో ఇలాంటిది తయారయింది. దీన్ని ప్రయోగించడం కూడా సులభం. ఇందులో ఆ మందు నింపి ఒక్క సారి వీపు మీద చరిస్తే చాలు. కాన్ఫరెన్సులలో కోట్లు ఉంటాయి. బీచిల్లో కాజువల్స్ ఉంటాయి’ అంటూ కోటు జేబులోనుంచి ఒక సిగరెట్ లైటర్ పరిమాణంలో ఉన్న ఒక వస్తువుని తీసాడు.

దాన్ని చూడగానే ఒళ్ళు జలదరించింది విజయ్ కి. ఈ దుర్మార్గుడు ఆ పరికరంతో ఎనిమిది మంది మేధావుల మేధస్సు ని నాశనం చేసాడు. ఉన్నపళంగా వాడిని నరికి పోగులు పెట్టాలని అనిపించింది. మోచేతికి దగ్గరలో ఉన్న హోల్డర్ లో ఉన్న చురకత్తి మార్టిన్ తనని వాడుకోమని మెల్లగా అడిగినట్లు అనిపించింది. కుడి అరచేయి లోకి అరక్షణంలో వచ్చి వాలిపోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మార్టిన్. అతి బలవంతం మీద ఆ కోరికను అదుపు చేసుకున్నాడు విజయ్.

లాబ్ టేబుల్ పైన ఉన్న ద్రవాలను చూస్తూ, వీటిలో దేన్నో వాడి ఆ మేధోహత్యలను చేస్తున్నాడు వీడు అనుకుంటూ, ’ఈ కెమికల్స్ ని ఆ పరికరం ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నావు కదా?’ అన్నాడు విజయ్.

’అది కెమికల్ కాదు. అది ఒక ఆర్టిఫిషియల్ ప్రొటీన్. అది మెదడులోని కణాలలో త్వరగా వ్యాప్తి చెందుతుంది’ గర్వంగా చెప్పాడు జార్జి.

బ్రెయిన్ లోని కణాల పై పని చేసే ప్రొటీన్ అనగానే డాక్టర్ ఆలిస్టెర్ రీసెర్చ్ గురించి గుర్తుకి వచ్చింది విజయ్ కి. బ్రెయిన్ సెల్స్ లో పెరిగే ట్యూమర్ కణాల పై వ్యాప్తి చెంది అవి పని చేయకుండా చేసే ఒక రకమైన ప్రోటీన్ ని డెవలప్ చేసే రీసెర్చ్ ని ఆలిస్టెర్ డెవలప్ చేసాడు. దాన్ని న్యూరోసర్జన్లు ఒక రివల్యూషనరీ ఆవిష్కరణగా పొగిడారు. 

’ఇది డాక్టర్ ఆలిస్టర్ పరిశోధన లాగా అనిపిస్తోంది’ అన్నాడు విజయ్.

’అది వేరు. నేను దాన్నే మోడిఫై చేసాను. ట్యూమర్ సెల్స్ అనే కాదు నార్మల్ సెల్స్ పైన కూడా పని చేసి వాటిని నిర్వీర్యం చేసే ఒక పవర్ ఫుల్ మారణాయుధాన్ని తయారుచేసాను. నా ఆవిష్కరణ ఆలిస్టర్ కనిపెట్టినదాని కంటే  గొప్పది. ప్రపంచ దేశాల భవిష్యత్తునే మార్చేసే శక్తిని ఇస్తుంది అది దాన్ని వాడే వారికి’ అన్నాడు మహా గర్వంగా’

’నీ మీనియేచర్ పరికరం చేసిన ఫ్రెండ్ ఇప్పుడు జ్యూరిచ్ లోనే ఉన్నాడా?’ అడిగాడు విజయ్. 

’అతనా... అతనికి పాపం హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చనిపోయాడు’ అన్నాడు జార్జి. 

’అదేంటి??’ అన్నాడు విజయ్ ఆశ్చర్యంగా. 

’అతనే నా మొదటి గినీ పిగ్. డోస్ కాస్త్ ఎక్కువయింది. బ్రెయిన్ సెల్స్ డామేజి మరీ ఎక్కువ అయిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది’ అంటూ వికటంగా నవ్వాడు జార్జి.

అతని కళ్ళల్లో కనిపిస్తున్న వింత వెలుగు, పెదవుల చివర కొద్ది కొద్దిగా కన్పిస్తున్న లాలాజలం నురగ చూసి, విజయ్ కి అనుమానం వచ్చింది, జార్జి మానసిక స్థితి పైన. పిచ్చి ప్రకోపించినట్లుంది. ఇంకా పొడిగిస్తే, ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పలేము, ఇప్పుడే ఇతన్ని నిరాయుధుడిని చేయాలి అనుకున్నాడు. 

వెంటనే తన కుడి చేతి మజిల్స్ ని ఒక ప్రత్యేక పద్ధతిలో కదిల్చాడు. మార్టిన్ తన సేఫ్టీ తొడుగులోనుంచి జారింది. ముందు పదునైన సన్నని బ్లేడ్, తర్వాత పిడికిలిలో సరిగా ఫిట్ అయ్యే పిడి! 

దాని పిడి తన అరచేతికి అందగానే మెరుపు దాడి చేస్తూ గన్ పట్టుకున్న జార్జి చేతికి గురి చూసి విసిరాడు దాన్ని. అతని గురి తప్ప లేదు. సూటిగా వెళ్ళి జార్జి కుడి మణికట్టులో దిగబడింది మార్టిన్. దాంతో జార్జి చేతిలోని గన్ కింద పడిపోయింది. ఆ గన్  అతనికి అందకుండా దాన్ని కాలితో తన్నాడు విజయ్. అది లాబ్ టేబుల్ కిందకి పోయింది. 

జార్జి ఉన్మాద మనస్థితిలో అతనికి నొప్పి కూడా పెద్దగా తెలుస్తున్నట్లు లేదు. మణికట్టుకి గుచ్చుకుని మరో వైపునుంచి పదునైన కత్తి భాగం బయటికి వచ్చి రక్తం కారుతూ ఉన్నా దాన్ని పట్టించుకోకుండా గట్టిగా అరుస్తూ ఆ గన్ ని అందుకోవడానికి ప్రయత్నించాడు జార్జి. అదే అదను లో జార్జి పొట్ట మీద కుడి చేత్తో పవర్ ఫుల్ పంచ్ ఇచ్చాడు విజయ్. మామూలు మనుషులు అయితే ఆ దెబ్బకు కనీసం ఒక రోజు స్పృహ కోల్పోయి ఉండేవారు. కానీ జార్జి దేహంపై అది అంత పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. దానికి కారణం వాడి పొట్టలో పేరుకు పోయి ఉన్న కొవ్వు అనుకున్నాడు విజయ్, పళ్ళు కొరుకుతూ.

జార్జి వెళ్ళి లాబ్ టేబుల్ పైన పడ్డాడు. ఆరు అడుగుల భారీకాయంతో ఉన్న జార్జి వెయిట్ కి ఆ టేబుల్ అదిరింది. దానిపై ఉన్న సీసాలన్ని చెల్లా చెదురుగా ఎగిరి గోడల మీద, నేల మీద పడి ఆ ద్రావకాలన్నీ నేల పాలయ్యాయి. వాటి వైపు చూస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ తన మణి కట్టుకి గుచ్చుకున్న మార్టిన్ పదును భాగాన్ని ఆయుధంగా వాడుతూ విజయ్ మీదకు ఎగబడ్డాడు. పిచ్చి పిచ్చిగా చేతిని విసురుతున్న జార్జి చేతికి అందకుండా వెనక్కి దుమికాడు విజయ్. అతని కోట్ కి తగిలి చీరేసింది, మార్టిన్.

  పిచ్చివాడి చేతికి రాయి దొరికినట్లు ఉంది, వీడీకి నా మార్టిన్ దొరికి. ఇలా వాడుతాడు అనుకుంటే నా రూజర్ మార్క్ తీసి ఒకే ఒక బుల్లెట్ వీడి కనుబొమల మధ్య దిగేసేవాడిని అనుకున్నాడు విజయ్ వాడి చేతి నుంచి తనను తాను రక్షించుకుంటూ. టేబుల్ కి అటూ ఇటూగా అయిపోయారు ఇద్దరు. ఉన్నట్లుండి మనసు మార్చుకున్నాడు జార్జి. ఒక్క ఉదుటున గిరుకున తిరిగి మెట్ల వైపు పరిగెత్తాడు. టేబుల్ చుట్టి అతని వెంట విజయ్ పడే లోపు మెట్లన్నీ ఎక్కేసి ఆ రహస్య గది నుంచి బయటపడి డోర్ ని వేసేసి లాక్ చేసాడు.

భుజాన్ని పెట్టి ఆ డోర్ ని గట్టిగా నెడుతున్న సమయంలో బుస్ మంటూ తెల్లటి పొగ లోపలికి రావడం మొదలయింది. ఇనప పెట్టె లా ఉన్న ఆ గదిలోపలికి జార్జి ఏం గాస్ పంపిస్తున్నాడో అని కంగారు పడ్డాడు విజయ్. ఊపిరి బిగపట్టి ఉండడానికి గట్టిగా ప్రయత్నిస్తే బలప్రయోగం చేసి డోర్ ని తెరవలేడు. తెగించి గాలి పీల్చుస్తూ డోర్ ని బ్రేక్ చేయడం ఒకటే మార్గం గా అనిపించింది. భుజాన్ని ఉపయోగించి బలంగా గుద్దాడు విజయ్. రెండు మూడు సార్లు అలా చేసేసరికి డోర్ విరిగింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.  ఆ గాస్ ప్రభావం అతన్ని మత్తులోకి నెట్టేసింది. జార్జి నుంచుని తన వైపే కళ్ళు పెద్దవి చేసి చూడడం కనిపించింది. అతను నుంచుని ఉన్న అతనిస్టడీ రూమ్ గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. మొదలు నరికిన చెట్టులా దబ్బున నేల మీద పడ్డాడు విజయ్, స్పృహ కోల్పోయి. 

***

స్పృహ లోకి వచ్చేసరికి తల అంతా బరువుగా అనిపించింది విజయ్ కి. తన ఒంటి పైన అదనపు దుస్తులు, తన చేతులకు గ్లోవ్స్, స్కీ షూస్, కనిపించాయి అతనికి. తను ఒక కేబుల్ కార్ లో కూర్చుని ఉన్నట్లు  గమనించాడు. తనకు మెలుకువ  రావడం లేటయితే ఏం జరిగేదో అనుకున్నాడు విజయ్.

’అప్పుడే మెలుకువ వచ్చేసిందా?’ మంచిది. మత్తులో ఉన్నప్పుడు ప్రాణాలు పోకుండా మెలుకువగా ఉన్నప్పుడు పోతే, ఆ భయాందోళనలు అనుభవించవచ్చు నువ్వు. నాకు అది సంతోషాన్ని ఇస్తుంది. అసలు నీకు కూడా ఆ ప్రొటీన్స్ ఎక్కించేసే వాడిని, నువ్వు ఆ మందు సీసాలను నాశనం చేయకుండా ఉండి ఉంటే. మళ్ళీ దాన్ని తయారు చేయడానికి నాకు కనీసం రెండు వారాల సమయం కావాలి. అంతవరకు నిన్ను బ్రతకనివ్వకూడదు అనుకున్నా. అందుకే ఈ ఏర్పాటు. స్కీయింగ్ చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తు ఈ మంచుకొండల మధ్య లోయల్లో పడి చనిపోయావని తెలుస్తుంది ప్రజలకి’ అన్నాడు జార్జి కేబుల్ కార్ ని నడిపే యంత్రాన్ని ఆన్ చేసే ముందు.

’అదా సంగతి. ఆ మందు లేకపోవడం వల్ల తనను కూడా మేధోహత్య చేసే ప్రయత్నం చేయలేకపోయాడు. థాంక్ గాడ్, ఆ మందు సీసాలను పగలగొట్టించేసావు’ అనుకున్నాడు విజయ్.

అంతలో దడ దడ మని శబ్దం చేస్తూ మెషిన్ పని ప్రారంభించింది. కొండ పైకి ప్రయాణం ప్రారంభించింది కేబుల్ కార్. జార్జి ఆలోచన ఏమిటో అర్థం కాలేదు విజయ్ కి. తనతో ఇప్పుడు స్కీయింగ్ చేయిస్తాడా అనుకున్నాడు. స్కీయింగ్ చేస్తే మరణం సంభవించదు కదా! మరేదో ప్లాన్ అయి ఉంటుంది అనుకున్నాడు.

అంతలో పెద్దగా ఉన్న ఒక కట్టర్ ని తీసాడు జార్జి. దాన్ని రెడీగా పెట్టుకుని కేబుల్ కార్ వైపే చూస్తున్నాడు. కేబుల్ కార్ లో కూర్చుని ఉన్న విజయ్ కిందకి చూసాడు. మెల్ల మెల్లగా కొండ పైకి వెళ్తూ ఉంది కేబుల్ కార్. కింద కనిపిస్తున్న మంచు కొండ ఉపరితలానికి, కేబుల్ కార్ కి మధ్య ఉన్న గాప్ పెరుగుతూ ఉంది.  

అప్పుడు అవగతమయింది విజయ్ కి జార్జి అసలు ప్లాన్ ఏమిటో. కింద పడితే మరణం తప్పదు అన్న హైట్ కి వచ్చాక ఈ కేబుల్ కార్ ని కింద పడే ఏర్పాటు ఏదో చేయబోతున్నాడు ఈ జార్జి గాడు అనుకున్నాడు విజయ్. పున్నమి చంద్రుడు ఆకాశంలో మబ్బుల మధ్య మసక మసకగా కనిపిస్తున్నాడు. ఆ వెలుతురులో  కొండ ప్రాంతమంతా కనిపిస్తోంది. తను కూడా జార్జి కి కనిపిస్తూ ఉంటాడు అని గ్రహించాడు విజయ్.

తన చేతిలోని కట్టర్ ని ఊపుతూ ’గుడ్ బై’ అంటూ అరిచాడు జార్జి, హేళనగా.

ప్రాణాలు కాపాడుకోవడం ఎలా అన్న ఆలోచన తొలిచేస్తుంది విజయ్ మెదడుని. కేబుల్ కార్ యాక్సిడెంట్లు అవడం కొత్త కాదు. అవి సాధారణంగా మధ్యలో కేబుల్ తెగడం వల్ల జరుగుతాయి. కానీ ఇప్పుడు జార్జి ఒక చివర కేబుల్ ని కట్ చేస్తాడు. కేబుల్ అటు చివర  స్ట్రాంగ్ గానే ఉంటుంది. కేబుల్ కార్ కేబుల్ నుంచి విడిపడి కింద పడిపోతుంది. కానీ కేబుల్ అలా వేలాడుతూనే ఉంటుంది కదా. ఆ కేబుల్ ని గనుక పట్టుకుని వేలాడితే!

ఆ ఆలోచన ఒక్కటే అతనికి పరిష్కార మార్గం అనిపించింది. ఒక వైపు జార్జి కట్టర్ ని ప్రయోగించడంలో బిజీగా ఉన్నాడు. వెంటనే విజయ్ లేచి కేబుల్ కార్ కి మరో వైపు ఉన్న కేబుల్ ని పట్టుకుని వేలాడడానికి సిద్ధపడ్దాడు. అతను కేబుల్ ని గట్టిగా పట్టుకోవడం పెద్ద శబ్దం తో కేబుల్ తెగడం ఒకేసారి జరిగాయి. పెద్ద అనకొండ లా కదిలింది కేబుల్. ఆ తెల్లటి మంచు కొండల మీద అది వికృతంగా ఊగుతూ ఉంటే జార్జి పైశాచిక నవ్వులు కొండల మధ్య ప్రతిధ్వనించాయి. 

తన్ ప్రానాలకోసం వేల్లాడుతూ ఉన్నాడు విజయ్. అరచేతులు చీరుకుపోతున్న బాధ అతన్ని కుదిపేస్తూ ఉంది. కేబుల్ ఒక పెద్ద లోలకంలా అటూ ఇటూ ఊగుతోంది. కేబుల్ కార్ ఎక్కడో అగాధంలో పడిపోయింది. అది పడిన శబ్దం కూడా వినబడలేదు. బహుశా మెత్తటి మంచులో కూరుకుపోయిం ఉంటుంది.

కేబుల్ కార్ పడిపోవడం గమనించాడు జార్జి. చేతిలోని కట్టర్ ని ఊపుతూ గెంతులు వేసినట్లు కనిపించాడు విజయ్ కి. వీడు మనిషి కాదు. నరరూపరాక్షసుడు అనుకున్నాడు విజయ్ పళ్ళ బిగువున చేతులలోని బాధను అనుభవిస్తూ.

వయొలెంట్ గా ఊగుతూ ఉంది అది. తనను తీసుకు పోయి ఏ కొండ శిలలకో గట్టిగా బాదినా బాదుతుంది. ఆ సమయంలో తను కొండకు చేరువలో ఉన్నప్పుడు కేబుల్ ని వదిలి కొండ వాలు లో పడాలి. అప్పుడు పడినా మరీ ఎత్తు నుంచి పడినట్లు ఉండదు. కానీ ఆ వేగం వల్ల మాత్రం ప్రమాదం ఉండే అవకాశం ఉంది. లేక్ లో పడిన దాని కంటే దారుణంగా ఉండొచ్చు. ఏ రాతికో తల పొడుచుకుంటే ఇక అంతే సంగతులు. మంచు పడుతూ ఉంటుంది కాబట్టి మెత్తటి మంచులో పడితే కొంతలో కొంత బెటర్.

కేబుల్ ఊగుతూ కొండకు సమీపంలోకి వచ్చేసింది. ఇదంతా కొన్ని సెకన్ల కాలంలోనే జరిగింది. దేవుడి మీద భారం వేసి కేబుల్ ని విడిచి పెట్టాడు విజయ్. అయినా కేబుల్ వెళ్ళిన దిశలోనే కొద్ది సేపు అతని ప్రయాణం సాగింది. తర్వాత వేగంగా కిందకు పడ్డాడు. తన తలను మోచేతులతో ప్రొటెక్ట్ చేసుకుంటూ పడ్డాడు విజయ్. లంగ్స్ లో గాలి అంతా ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోయినటు అనిపించింది. 

అదృష్టం కొద్దీ మెత్తటి మంచులో పడ్దాడు. పడడం వల్ల ప్రమాదం లేదు గానీ ఆ అదటుకు చెదిరిన దుస్తులు, చీరుకు పోయిన గ్లవ్స్ వల్ల చలి అతన్ని పులిలా కమ్ముకుంది. ఎముకలు కొరికేసే ఆ చలి లో జార్జి గాడు వచ్చి చంపక్కరలేదు, తనకు తానే గడ్డకట్టుకుని పోతాను అనుకుని నవ్వుకున్నాడు విజయ్. జాగ్రత్తగా లేచి చెల్లా చెదురుగా పడి ఉన్న స్కీయింగ్ వస్తువులను తెచ్చుకుని కాళ్ళకు తగిలించుకున్నాడు. స్కీయింగ్ చేయడానికి వాడే స్కీ పోల్ చేతిలో లేకపోవడం చాలా పెద్ద లోటు అనుకున్నాడు.

కొండ కింద భాగం లోకి చేరుకుంటే ఎలాగోలా జ్యూరిచ్ చేరుకోవచ్చు అనే ఉద్దేశంలో వెన్నెల వెలుగులో స్కీయింగ్ మొదలు పెట్టాడు విజయ్.

బాలన్స్ చేసుకుంటూ వెళ్తున్న విజయ్ కి హఠాత్తుగా తనను ఎవరో చూస్తున్నట్లు అనిపించింది. భుజాల మీదగా చూస్తే వెనక జార్జి స్కీ పోల్ సాయంతో వేగంగా స్కీయింగ్ చేస్తూ వచ్చేస్తున్నాడు. ’దుర్మార్గుడు నన్ను గమనించినట్లున్నాడు, అందుకే వెంటాడుతున్నాడు’ అనుకుని తను మాత్రం సేఫ్ గా స్కీయింగ్ చేయడం మీదనే దృష్టి పెట్టాడు విజయ్.

చేరువవుతున్న జార్జిని గమనించి అతని ఎటాక్ ఎలా ఉండబోతుందో అంచనా వేసుకున్నాడు. అంతలో జార్జ్ తన చేతిలోని స్కీయింగ్ పోల్ ని ఎత్తి తన వేగాన్ని వాడుకుంటూ విజయ్ ని దానితో పొడవడానికి ప్రయత్నించాడు. అలర్ట్ గా ఉన్న విజయ్ ఆ దాడి ని నేర్పుగా తప్పించుకున్నాడు. 

ఆత్మరక్షణ తప్ప ఎదురు దాడి చేసే స్థితిలో లేడు విజయ్.  తనని దాటి ముందుకి వెళ్ళి తన వేగాన్ని అదుపు చేసుకుని తిరిగి తన వైపు దూసుకు వస్తున్న జార్జి ని చూసి వట్టి చేతులతో ఎదుర్కోవడం కంటే తన రూజర్ మార్క్ ని నమ్ముకుంటే బెటర్ అని తడిమి చూసుకున్నాడు నడుము దగ్గర. అక్కడ ఉండాల్సిన అతని హేండ్ గన్ లేకపోయేసరికి నిట్టూరుస్తూ పిడికిళ్ళు బిగించి వట్టి చేతులతో జార్జిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు.

జార్జి తన వ్యూహాన్ని మార్చుకున్నాడు స్కీ పోల్ తో పొడవడానికి ప్రయత్నించకుండా దాన్ని గోల్ఫ్ క్లబ్ లా స్వింగ్ చేయడాని భుజం మీదుగా పెట్టుకున్నాడు, వేగంగా వస్తూ ఆ స్కీ పోల్ ని స్వింగ్ చేసాడు విజయ్ అప్పర్ బడీని ఎయిమ్ చేస్తూ. హడావుడిగా తను కూడా రెస్పాండ్ అవుతూ ఒక కాలు పైకి ఎత్తి అన్ బేలన్స్ చేసుకుని మంచులో పడిపోయాడు విజయ్. 

విజయ్ తనను తప్పించుకోవడానికి వీలుపడని విధంగా అతని శరీరాన్ని గాయపరచడానికి ఎయిమ్ తీసుకున్న జార్జి విజయ్ అలా పడగలడని ఊహించలేదు. వేగంగా వస్తూ స్కీ పోల్ ని స్వింగ్ చేయడం, దానికి కనెక్ట్ కావలసిన విజయ్ బాడీ కనెక్ట్ కాకపోవడంతో అన్‍బేలన్స్ అయి పడిపోయాడు, దొర్లుకుంటూ పోయాడు. 

విజయ్ లేచి తనను తాను స్టెడి చేసుకునే సమయానికి జార్జి కూడా లేచాడు కానీ బాగా దెబ్బలు తగిలినట్లుంది, మునుపటి వేగం లేదు. పోరాటానికి సిద్ధ పడ్డాడు విజయ్. ఈ దుర్మార్గుడిని వదిలేస్తే ఇంకా ఎంత మంది జీవితాలను నాశనం చేస్తాడో, వీడిని వదిలి పెట్టకూడదు అనుకున్నాడు విజయ్.

చేతిలోని స్కీ పోల్ ని ఫెన్సింగ్ క్రీడల్లో వాడే కత్తి లా వయొలెంట్ గా ఊపుతూ విజయ్ మీదకు వచ్చాడు జార్జ్.  

వాడు మీదికి వచ్చే వరకు ఆగకుండా సుడిగాలి లా కదిలాడు విజయ్. ఆ పోల్ దూరంగ్ ఉన్నప్పుడు ఉన్నంత ఎఫెక్టివ్ గా దగ్గరకు పోతే ఉండదని తెలుసు విజయ్ కి. విజయ్ తనకు దెబ్బకు అందే దూరం లోకి రాగానే మొదటి దెబ్బ జార్జ్ కొట్టాడు. 

భుజం మీద పడబోయింది అది. ఆ దెబ్బ తగిలితే ఇక జీవితాంతం ఆ చేయి పనికి రాకుండా పోతుంది. ఒడుపుగా ఆ దెబ్బను  తప్పించుకుని పిడికిటి పోట్లతో జార్జిని కుమ్మేసాడు విజయ్. కొండలని పిండి చేసే లా ఉన్న ఆ ముష్టిఘాతాలను తట్టుకోలేక రెండు అడుగులు వెనక్కి వేసాడు జార్జి. 

గట్టిగా షౌట్ చేస్తూ ఎగిరి తన్నాడు విజయ్. అతని షూకి ఉన్న స్పైక్స్ తగిలి జార్జ్ మెడవిరిగి ఒక పక్కకు వాలిపోయింది. దాంతో జార్జి ప్రాణవాయువులు అనంత విశ్వంలో కలిసిపోయాయి. జీవంలేని అతని శరీరం ఎగిరి అల్లంత దూరంలో పడి దొర్లుకుంటూ కొండ పక్కనే ఉన్న అగాధంలోకి పడిపోయింది.

ఎక్కడలేని నిస్సత్తువ ఆవహించుకుని ఉన్న చోటే కూలబడ్డాడు విజయ్. 

మంచులో కప్పబడిపోతుంది జార్జి మృతదేహం. మంచు కరిగితే గాని బయటపడదు. ఈ ప్రాంతాల్లో మంచు కరిగే పరిస్థితి ఉండదు. ఇక  జార్జ్ గురించి ప్రపంచం మరిచిపోవచ్చు. 

కొంత సేపటికి లేచి కొండ దిగువకు ప్రయాణం మొదలు పెట్టాడు విజయ్. జార్జ్ చేతినుంచి జారి పడిన స్కీ పోల్ సాయంతో సేఫ్ గానూ, వేగంగానూ వెళ్ళగలిగాడు. తన తక్షణ కర్తవ్యం జార్జి ఇంటికి వెళ్ళి దాన్ని క్లీనప్ చేయడం. ఆ మాయదారి ప్రొటీన్ వివరాలను సేకరించి స్విఫ్ట్ కి అందించడం అనుకుంటూ జ్యూరిచ్ కి లిఫ్ట్ ఇచ్చే వారి కోసం వెయిట్ చేస్తూ నడక ప్రారంభించాడు హైవే మీద.

***