మేధో హత్యలు part 1

This is a spy thriller by Samrat. Vijay is the spy. He investigates a strange cae of scientists losing all therir intellect and becoming vegetables.This is First part of Spy Suspense Thriller Novel. Written by Samrat. Medho Hatyalu is Very Gripping Novel. Un-put-downable.

మేధో హత్యలు part 1

మేధోహత్యలు

హీథ్రూ ఏర్‍పోర్ట్ లోనుంచి బయటికి నడుస్తూ వాచ్ చూసుకున్నాడు విజయ్. తన పని చూసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. వెళ్తూ వెళ్తూ సుప్రియను కలిసి వెళ్ళొచ్చు అనుకున్నాడు. బయటికి వస్తూనే ఎదురుగా కనిపించిన కాబ్ ఎక్కి అడ్రస్ చెప్పాడు. నల్లటి రోడ్ పై పాదరసం జారినట్లు అతను ఎక్కిన తెల్లటి సుజుకి శబ్ధం చేయకుండా సాగిపోయింది.

సుప్రియకు తను వస్తున్న విషయం ఇండియాలో ఫ్లైట్ ఎక్కేముందు మెసేజి చేసాడు. కానీ ఆ మెసేజి ఆమె చూసిందో లేదో తెలియదు అతనికి. ఒక సారి మొబైల్‍లో వాట్సప్ ఓపెన్ చేసి చూసాడు. బ్లూటిక్స్ రాలేదు ఇంకా. ఆమె ఎప్పుడు ఆఖరుసారి వాట్సప్ చూసింది అన్నది అందరికీ తెలియకుండా ఉండేందుకు ఆమె సెట్టింగ్స్ లో మార్పు చేసుకుంటుంది. అందుకే ఆమె అదివరకు ఎప్పుడు చూసిందో తెలుసుకునే అవకాశం లేదు విజయ్‍కి.

ఆమె తన మెసేజి చూసినట్లు లేదు అనుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు. మొట్టమొదటసారి ఆమెను అంతకు ముందు ఎసైన్‍మెంట్ లో ఒకసారి లండన్ వచ్చినప్పుడు కలిసాడు, యాథృచ్చికంగా!  

కేంబ్రిడ్జ్ సెంట్రల్ లైబ్రరీ లో పనిచేస్తుంటుంది తను. చాలా తెలివైనది. అంతకు మించి అందమైనది. ఆమె భారతీయ సంతతికి చెందినదే అయినా,  వాళ్ళు లండన్ లో సెటిల్ అయిపోయి యాభై ఏళ్ళకు పైనే అయింది. అందువలన లండన్ అమ్మాయిలానే ఉంటుంది. కట్టూ - బొట్టు(??), వేసే బట్టలు, నడిచే పద్ధతులు అన్నీ లండన్ వే. ఎంతైనా అక్కడే పుట్టి పెరిగిన మూడో తరం అమ్మాయి కదా!

ఆమె ముందు తరాలలో కలిసిన యూరోపియన్ బ్లడ్ వల్ల వారి పోలికలు కూడా పుష్కలంగా కనిపిస్తుంటాయి ఆమెలో. ముఖ్యంగా నీలం రంగులో మెరిసే ఆమె కళ్ళు. అవి బంగాళాఖాతం లా కనిపిస్తాయి విజయ్ కి. ఆమె చూపుల్లో అతను తన చూపు కలిపితే - అతని మనసు ఆ బంగాళా ఖాతం లో మునకలు వేస్తూనే ఉంటుంది. ఆమె గురించి ఆలోచనలతో అతని పెదవులపైన చిరునవ్వు సన్నగా మెరిసింది.

’మిస్టర్, మీ డెస్టినేషన్ వచ్చింది’ కాబ్ ని రోడ్ కి కుడి పక్కగా పార్క్ చేసి చెప్పాడు డ్రైవర్. వాలెట్ తెరిసి అతనికి ఒక నోట్ ఇచ్చి బూట్ లో ఉన్న తన బాగ్ తీసుకుని సుప్రియ ఉండే అపార్ట్ మెంట్ ఎంట్రన్స్ వైపుకి అడుగులు వేసాడు విజయ్.

  అది లండన్ లోని కింగ్స్ స్ట్రీట్ ఫోర్త్ క్రాస్. హై క్లాస్ మనుషులు ఉండే పోష్ లొకాలిటి. సుప్రియకు వాళ్ళ తాత గారు గిఫ్ట్ గా ఇచ్చిన టూ బెడ్ రూమ్ ఫ్లాట్ ఒకటి అక్కడే ఉంది. ఫోర్త్ ఫ్లోర్ లో. చూడ చక్కని పార్కులు అందమైన పేవ్‍మెంట్లతో చాలా ఆకర్షణీయంగా ఉంది ఆ లొకాలిటీ.

అలవాటుగా ఒక సారి చురుకుగ చూసాడు. జాగ్రత్త అనేది నరనరాలలోనూ జీర్ణించుకుపోయి ఉంటుంది అతనికి. తన ప్రొఫెషన్ లో అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని పనిలోకి దిగితే రెండో రోజు అనేది ఉండదు తన జీవితంలో అని అతనికి బాగా తెలుసు. 

దేనికీ గారంటీ లేదు తన ప్రొఫెషన్ లో. ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రిమినల్స్ తమ హిట్ లిస్ట్ లో అతని పేరు టాప్ లో పెట్టుకున్నారు. అతను ఎక్కడ కనబడ్డా రెండో ఆలోచన లేకుండా అతని వంటి నిండా తమ దగ్గర ఉన్న ఆయుధాలలోని బుల్లెట్లు నింపేస్తారు. అందుకే సున్నితమైన భావాలకు అతని ప్రొఫెషన్ లో చోటు లేదు. అయినా సుప్రియ మీద ఏర్పడ్డ ఆ సున్నితమైన భావాలను చెరిపేసుకోలేకపోతున్నాడు. ప్రొఫెషనల్ గా చూస్తే అది అతని బలహీనతగానే గుర్తించాలి. అదొక్కటే కాదు... ఇతర బలహీనతలు కూడా ఉన్నాయి అతనికి. 

కళ్ళతో చురుకుగా చుట్టూ ఒక సారి స్కాన్ చేసి చూసి నింపాదిగా అడుగులు వేసాడు విజయ్, అపార్ట్‍మెంట్ దిశగా. ఇంకో నాలుగు అంగల్లో పోర్టికో దగ్గరికి చేరుకోబోతుండగా, అతని మెడపైన వెంటుకలు నిక్కబొడుచుకున్నాయి. ఉలిక్కిపడి తలఎత్తాడు విజయ్. సరిగ్గా సుప్రియ అపార్ట్‍మెంట్ పక్కన బాల్కనీ డోర్ తెరిచి ఉండడం, అక్కడ ఆ దృశ్యం కనబడడం చూసి అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది. అంతలోనే పైనుంచి ఒక ఎర్రటి ప్లాస్టిక్ బకెట్  కింద పార్క్ చేసి ఉన్న ఒక బ్లూ కలర్ కార్ మీద పడి పెద్ద శబ్ధం చేస్తూ రోడ్ మీదికి దొర్లింది. రోడ్ పైన నడుస్తున్న ఇద్దరు మధ్యవయస్సులో ఉన్న మహిళలు పైకి చూసి గొంతు చించుకుని అరిచారు ’ఓ ’ అంటూ. 

బాల్కనీ రైలింగ్ పట్టుకుని వేలాడుతూ ఉంది ఏడెనిమిదేళ్ళ వయసు ఉన్న ఒక పాప. ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు తమ పాప అలా ప్రమాదంలో ఉంది అన్న విషయం తెలుసో లేదో అనుకున్నాడు విజయ్. ఆ పాప ఇంక ఎంతో సేపు అలా వేలాడుతూ ఉండలేదు. అలా వేలాడటానికి కావలసినంత బలం ఆ చిన్నారి చేతుల్లో ఉండదు. పట్టు జారిన మరుక్షణం నాలుగు ఫ్లోరుల ఎత్తు నుంచి ఆ బ్లూ కలర్ కార్ పైన పడిన రెడ్ బాకెట్ లా ఆ పాప పడిపోవడం ఖాయం. తన కనుల ముందే ఒక చిన్నారి శరీరం చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంది.

’ఎంతమందిలో ఉన్నా నిన్ను నీ ప్రత్యర్థులు ఈజీగా గుర్తుపట్టేస్తారు. నీది కాని సమస్యలోకి పిలవకుండా పరిగెట్టుకుంటూ వెళ్తావు చూడు... అదే నిన్ను అందరికీ పట్టించే నీ బలహీనత! అడవిలో పులిని వేటడటానికి దానికి కనబడేలా ఒక మేకని కట్టేసి ఉంచుతాడు పులిని వేటాడే వేటగాడు. అలాగే నిన్ను పట్టాలన్నా, కొట్టాలన్నా నీ కోసం ఆపదలో చిక్కుకున్న ఒక బలహీనమైన మనిషినో లేక ఒక నోరులేని ప్రాణినో పెడితే చాలు... పరిగెత్తుకుంటూ వెళ్తావు నువ్వు అక్కడికి. నిన్ను ఫినిష్ చేయడానికి ఒక్క బుల్లెట్ చాలు వాళ్ళకి’ అంటూ "స్విఫ్ట్" ఇండియన్ బాస్ బలబీర్ సింగ్ ఎప్పుడూ చెప్పే మాటలు చెవుల్లో మళ్ళీ రింగుమన్నాయి. చిరాకుగా తలవిదిలించాడు విజయ్, ఆ ఆలోచనలను తరిమి కొడుతూ.

తలవంచుకుని తన దారినపోయే ప్రశ్న లేనే లేదు. అతని శరీరం అతని ప్రమేయం లేకుండానే తరవాత చేయబోయే పనికి సన్నద్ధమయిపోయింది. "స్విఫ్ట్" లో అతని గురించి అందరూ అనుకునే ఒక మాట ఉంది. "అందరి శరీరాలు వాళ్ళ వాళ్ళ మేధస్సులు చెప్పినట్లు వింటాయి. కానీ విజయ్ శరీరం మాత్రం అతని హృదయం చెప్పినట్లు వింటుంది" అని. అలా అనుకుని అతన్ని బయటికి మందలించినా మనసులో మాత్రం అతనిని తమ ఆత్మీయుడిగా అనుకోవడం మానరు. 

చేతిలో ఉన్న బాగ్ ని పేవ్‍మెంట్ మీద విడిచి, ఒక్క పరుగున వెళ్ళి ఎదురుగా కనబడిన కారు పైకి ఎక్కి అక్కడ నుంచి ఒకే ఒక్క గంతులో ఫస్ట్ ఫ్లోర్ రెయిలింగ్ పట్టుకున్నాడు.

అతను పైకి దుమికిన వేగానికి కారు టాప్ సొట్ట పడింది. ఫస్ట్ ఫ్లోర్ రైలింగ్ ను పట్టుకుని ఒక స్వింగ్ చేసి ఇంకా పైకి ఎగబాకాడు. పర్వతారోహకులు ఎక్కడెక్కడో పట్టు చిక్కించుకుని పైకి ఎగబాకినట్లు ఆ అపార్ట్‍మెంట్ బిల్డింగ్ పైకి ఎగబాకేడు.

’స్పైడర్ మాన్’ అని అరిచింది కిందనే ఉన్న స్త్రీలలో ఒకామె. చూస్తూ చూస్తూనే పెద్ద గుంపు పోగయింది అక్కడ. నాలుగు ఫ్లోరుల ఎత్తున రైలింగ్ పట్టుకుని వేలాడే పాప ఒక వంక- ఏ ఆధారమూ లేకుండానే బిల్డీంగ్ పైకి ఎగబాకుతున్నట్లు కనిపిస్తున్న విజయ్ మరో వంక, అందరి దృష్టిని కట్టి పారేసారు.

అరనిముషంలోపే పాప ఉన్న బాల్కనీ చేరుకున్నాడు విజయ్. భయంతో కళ్ళు మూసుకుని హీనమైన స్వరంతో బలహీనంగా ఏడుస్తున్న పాప అతను అక్కడకు చేరుకోవడాన్ని గమనించలేదు. బాల్కనీ దగ్గరకు చేరుకున్నాక ఒక్క స్వింగ్ తో పైకి చేరుకున్న విజయ్ ఆ పాప చేతులను పట్టుకుని, ’ఇట్స్ ఓకె’ అన్నాడు మృదువుగా. శాంతాక్లాజ్ వచ్చి తనకి క్రిస్టమస్ సమయంలో గిఫ్టులు ఇస్తే కూడా అంతగా ఆశ్చర్యపోదేమోగానీ, ఆ క్షణంలో విజయ్ ని చూసి అంతకంటే ఎక్కువే ఆశ్చర్యపోయింది ఆ చిన్నారి. 

రెండు చేతుల్లో ఆ పాప ను ఎత్తి సేఫ్ గా బాల్కనీలోకి దింపబోయాడు విజయ్. కానీ ఆ పాప అతని మెడ చుట్టూ తన చిన్న చిన్న చేతులను వేసి అతన్ని గట్టిగా కావలించుకుంది. ఆ పాప వీపు నిమురుతూ, ’ఇట్స్ ఓకె’ అన్నాడు విజయ్ మళ్ళీ, మళ్ళీ. 

ఇంతలో ఎవరో ఫోన్ చేసి చెప్తే జరుగుతున్న విషయం తెలిసి నట్లుంది లోపల నుంచి ఒక స్త్రీ వచ్చి, విజయ్ ని, పాప ను చూస్తూ అలా నిలబడిపోయింది. కనుకొనల నుంచి కింది జనాలు మొత్తం సీన్ ని మొబైల్స్ లో విడియో తీస్తుండటం గమనించి చిరాకుగా తలవిదిలించాడు విజయ్. ఇంకో గంటలో బల్బీర్ సింగ్ తాజా "గీతోపదేశం" వినాల్సి ఉంటుంది అనుకుంటూ. 

’థాంక్స్’ అంది పాప తల్లి, కనులలో నీళ్ళు నింపుకుని అతన్నే చూస్తూ. మృదువుగా నవ్వాడు విజయ్. తన మెడలను చుట్టుకున్న చేతులను సున్నితంగా విడదీస్తూ పాప చెక్కిలి పై చిన్న ముద్దు పెట్టి ఆ పాపని ఆమెకి అందించాడు. పాప తల్లి వైపు వెళ్ళకుండా మళ్ళీ అతని మెడను వాటేసుకుని అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది.

ఆ తర్వాత తన తల్లి చేతుల్లోకి వెళ్ళింది ఆ పాప. కింద నుంచి అంతా చూస్తున్న జనాలు కేరింతలు కొట్టారు. తను మళ్ళీ ఆ అపార్ట్‍మెంట్ వైపు వస్తే ప్రతి వ్యక్తి కంట్లోను పడతాడు అని తెలిసి తేళ్ళు జెర్రులు వంటి మీద పాకుతున్న అనుభూతి కలిగింది విజయ్ కి. ఆ స్త్రీ అప్పుడు అడిగితే సుప్రియ గురించి చెప్పడం అంత బుద్ధి తక్కువ పని మరోటి ఉండదని అతనికి తెలుసు. 

తన రాకకు కారణంగా నోటికి వచ్చిన అబద్ధం చెప్పి, పాప తల్లి ఆతిధ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ఫ్లాట్ లో నుంచి బయటకు నడిచాడు. పక్క ఫ్లాట్ లో ఉన్న సుప్రియ ను కలిసే పనిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు. ఆమె డోర్ వైపు కూడా చూడకుండా అతి ప్రయత్నం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ బయటకు నడిచాడు. అతని వెంట రాబోయిన పాప తల్లిని, అక్కడే ఉండమని చేతితో సైగ చేస్తూ, ఒక నవ్వును మొఖానికి అతికించుకుని ఆమెకు బై చెప్పి గబగబా మెట్ల వైపు నడిచాడు.

ఇంట్లోకి వెళ్తూ అతని వైపు మరోసారి కృతజ్ఞతా పూర్వకంగా చూసిన ఆ తల్లి పాపను తీసుకుని బాల్కనీ లోకి వచ్చింది, తన పాప అలా పడడానికి కారణం ఏమిటో అన్వేషించడానికి. రెపరెపలాడుతున్న కైట్ అందీఅందనంత దూరంలో ఒక చెట్టుకు చుట్టుకుని ఎగురుతూ ఉండటం చూసింది. బకెట్ వేసుకుని దాని పైకి ఎక్కి దాన్ని అందుకునే ప్రయత్నంలో పాప జారిపడింది అని గ్రహించింది. తన చేత్తో కైట్‍ని అందుకుని దారం తెంచి పాపకు అందించింది. ఫ్లాట్ లోకి వెళ్తూ బాల్కనీ డోర్ వేయటం మరిచిపోలేదు ఈ సారి.

వడి వడిగా మెట్లు దిగుతూ వెళ్ళిపోయాడు విజయ్, ఆఖరు మెట్టు మీద ఉండగా కాల్ వచ్చింది అతని మొబైల్ కి. బల్బీర్ సింగ్ గుర్తుకి వచ్చాడు వెంటనే, ఫోన్ తీసి ఆన్సర్ చేసాడు విజయ్ - తిట్లు తినడానికి రెడీ అయిపోతూ.

’హాయ్ విజయ్...’ అంటూ తియ్యటి పలకరింపు వినేసరికి... ’సోఫీ’ అన్నాడు మెల్లగా. సుప్రియ ను అక్కడి వాళ్ళు సోఫియా అని పిలుస్తూ ఉంటారు. అతనికి కూడా అదే అలవాటు అయింది.

’హాయ్, నువ్వు వస్తావని తెలుసు, కాని ఒక అర్జెంట్ పని మీద యూనివర్శిటీ కి త్వరగా వచ్చేసాను. చెప్పు మనం ఎప్పుడు కలుసుకుందాము?’ అంది సుప్రియ. ఆమె గొంతులో అతన్ని కలుసుకోబోతున్న ఎక్సైట్‍మెంట్ అతని దృష్టిని దాటిపోలేదు.

’సాయంత్రం ఏడు గంటలకి నీకు వీలవుతుందా?’ అన్నాడు వాచ్ చూసుకుంటూ. ఆమెకు కనీసం రెండు గంటల సమయం ఉంటుంది తనతో గడపడానికి. డిన్నర్ తర్వాత ఆమెను వదిలిపెట్టి తను తన పని గురించి శ్రద్ధ పెట్టొచ్చు అనుకున్నాడు.

’ష్యూర్. ఎక్కడకు రాను. నైట్ నీ దగ్గరే ఉండి పోనా, లేక నా అపార్ట్‍మెంట్ కి వస్తావా?’ అంది.

ఆమె అపార్ట్‍మెంట్ అనగానే మనసు బాధతో మూలిగింది. ఆమెకు కూడా తన వల్ల రిస్క్ అయ్యే అవకాశం ఉంది అన్న ఆలోచనతో, ’వద్దు వద్దు... మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాము. నీతో డిన్నర్ అయిన తర్వాత నాకు వేరే పని ఉంది’ అన్నాడు త్వరత్వరగా మాట్లాడుతూ.

’ఓ... సరే...’ అంది సుప్రియ కొంచెం కినుకతో. కానీ అతన్ని కనీసం కలుసుకోవడానికైనా ఉంటుంది అన్న ఆశతో, తనను తాను సర్దుకుని, ’అడ్రస్ చెప్పు’ అంది.

ఆమె గొంతులో వచ్చే ప్రతి చిన్న మార్పు విజయ్ కి ఆమె మొఖంలో మారే ప్రతిభావాన్ని మనసులోనే తెలియచేస్తూ ఉంది. ఆమెకి అడ్రస్ చెప్తూనే వెళ్ళి తన బాగ్ తీసుకుని కాబ్ కోసం మెయిన్ రోడ్ పైకి వెళ్ళిపోయాడు. అతన్ని ఆపి మాట్లాడుదామని అక్కడే వేచి ఉన్న ఆ కాలనీ వాసులకు అతని ప్రవర్తన కొద్దిగా విడ్డూరమనిపించినా వాళ్ళకు అతని పైన ఎటువంటి దురభిప్రాయం కలగలేదు, ఫోన్ లో మాట్లాడుతూ ఎవరినీ పట్టించుకోని వాళ్ళను ఎందరినో చూస్తూ ఉండటం వల్ల.

***

తను వెళ్ళాల్సిన హోటెల్ కి చేరుకుని, రిసెప్షన్ దగ్గర తన పేరున బుక్ చేయబడి ఉన్న రూమ్ కీస్ తీసుకున్నాడు. రిసెప్షన్ లో పెద్దగా జనాలు లేరు ఎవరిపైనా విజయ్ కి ఎలాంటి అనుమానాలు రాలేదు. తను వచ్చిన అసైన్‍మెంట్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. ఒక వ్యక్తి లండన్ లోని స్విఫ్ట్ కార్యాలయాన్ని కాంటాక్ట్ చేసింది. ఆమెను తను కలుసుకోవాలి. లండన్ ఫ్లైట్ ఎక్కడానికి మూడు గంటల ముందు తను బలబీర్ సింగ్ చాంబర్ లో అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉండడం కళ్ళ ముందు మెదిలింది విజయ్ కి.

బలబీర్ సింగ్ స్విఫ్ట్ ఆఫీస్ చూడడానికి ఒక ఆఫీస్ లాగానే ఉండదు. అది అతని రెసిడెన్స్ కమ్ ఆఫీస్. ఆ స్ట్రీట్ లో ఉండే నాలుగైదు ఇల్లు స్విఫ్ట్ కంట్రోల్ లో ఉండే క్లస్టర్ లా ఉంటాయి. ఆ క్లస్టర్ ని రూబీ అని పిలుస్తారు స్విఫ్ట్ ఏజెంట్లు. పూర్తిగా ఎలెక్ట్రానిక్ సర్వెయిలెన్స్ తో నిండి ఉంటుంది అది. 

వారికి తెలియకుండా ఆ క్లస్టర్ లోకి చిన్న చీమ కూడా ఎంటర్ కాలేదు- రోడ్ పైనుంచి గాని, ఆకాశంలో నుంచి గానీ. మామూలు సెల్ ఫోన్లు పనిచెయ్యనే చేయవు అక్కడ. సెల్ ఫోన్లు ఆపరేట్ అయ్యే బాంద్ విడ్త్ మొత్తం జామ్ అయి ఉంటుంది ఆ క్లస్టర్ లో! స్విఫ్ట్ కోసం సెపరేట్ గా కేటాయించబడిన బాండ్ విడ్త్ లో ప్రత్యేకమైన ఫోన్లతో సంభాషణలు జరుపుతూ అంతర్జాతీయంగా ఇతర స్విఫ్ట్ మిత్ర దేశాలతో కలిసి పని చేస్తుంటారు.

స్విఫ్ట్ ఒక ఇంటెలిజెన్స్ సంస్థ! ప్రపంచవ్యాప్తంగా మానవాళికి, హాని కలిగించే కార్యకలాపాలాను ఒక కంట కనిపెడుతూ - ప్రజాస్వామ్యానికి పెనుసవాల్ విసిరే విద్రోహులను నిర్ధాక్షిణ్యంగా ఏరిపారేసే ఫినిషింగ్ టీమ్ స్విఫ్ట్! 

వారి ఏజెంట్ల వేగాన్ని వారికి అనుక్షణం గుర్తుండేలా ఆ సంస్థ తమకు తాము పెట్టుకున్న పేరు స్విఫ్ట్. సీక్రెట్ వరల్డ్ ఇంటెలిజెన్స్ అండ్ ఫినిషింగ్ టీమ్ అనే పేరులో మొదటి అక్షరాలతో ఏర్పడింది స్విఫ్ట్ అనే పేరు!

బలబీర్ సింగ్ తన ఎదురుగా కూర్చున్న విజయ్ వైపు చూసి గట్టిగా నిట్టూర్చాడు. అది తన మీద జాలితో కాదని, తనకు నచ్చే పని ఇవ్వబోయేటప్పుడు ఇలాంటి శబ్దాలే చేస్తాడు తన బాస్ అని విజయ్ కి తెలుసు. ఎక్కడ లేని అమాయకత్వాన్ని తన మొఖంలో చూపిస్తూ రాముడు మంచిబాలుడు లా కూర్చున్నాడు విజయ్.

"మన లండన్ ఆఫీస్ కి కాల్ వచ్చిందట" అంటూ ఒక వ్యక్తి తన దగ్గర విలువైన సమాచారం ఉందని, ఆ విషయాన్ని నెగోషియేట్ చేయడానికి స్విఫ్ట్ టాప్ ఏజెంట్ ని కలవాలనుకుంటున్నదని చెప్పాడు.

"ట్రాప్??" అన్నాడు విజయ్ సాలోచనగా. కానీ వెంటనే నాలుక కరుచుకున్నాడు అలా అనుకోకుండా అన్నందుకు. 

ఒక క్షణం కూడా సమయం వేస్ట్ చేయలేదు బలబీర్ సింగ్. "పాపం ఆ తెలివి మాకు లేదు మరి?" అన్నాడు కోరగా చూస్తూ.

మళ్ళీ రాముడు మంచి బాలుడు లాగా అయిపోయాడు విజయ్, ఏమీ ఎరగనట్లు దిక్కులు చూస్తూ.

"స్విఫ్ట్ ని కాంటాక్ట్ చేయడం అంత తేలిక కాదు. స్విఫ్ట్ ఉన్న విషయం సామాన్య ప్రజలకు తెలియదనే విషయం మరిచిపోయావు నువ్వు. ఆమె మన లండన్ ఆఫీస్ ను మనకి బాగా పరిచయం ఉన్న ఒక ఇన్‍ఫార్మర్ నెట్ వర్క్ ద్వారా కాంటాక్ట్ చేసింది" అన్నాడు మళ్ళీ నిట్టూరుస్తూ.

ఈ నిట్టూర్పులు వినలేకపోతున్నాము అనుకుంది విజయ్ మనసు. ఏదో అనబోయి అర్జెంట్ గా నోరు మూసుకున్నాడు. ఎందుకంటే అప్పుడే బలబీర్ తన  ఎదురుగా ఉన్న టీ టేబుల్ మీద ఉన్న ఒక కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక కాగితాన్ని విజయ్ మీదికి విసిరాడు.

అది చదవగానే విషయం సీరియస్ అని అర్థం అయింది విజయ్ కి. ప్రపంచంలో వివిధ రంగాల్లో అత్యాధునిక రిసెర్చ్ చేస్తున్న అయిదుగురు సీనియర్ సైంటిస్టులు అంతు తెలియని విధంగా తమ మేధస్సుని కోల్పొయారు. వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ వారి మేధస్సు మాత్రం అప్పుడే పుట్టిన పసిపాపల మేధస్సుతో సమానంగా అయిపోయింది. దీనికి- ఆ వ్యక్తి తమకు ఇస్తానన్న విలువైన సమాచారానికి ఏదో లింక్ ఉందని స్విఫ్ట్ భావిస్తూ ఉంది. 

"చూసావుగా. నీకు వచ్చిన అనుమానాలు స్విఫ్ట్ కి కూడా ఉన్నాయి. అందుకే అక్కడి వారికి తెలిసి ఉండే అవకాశం ఉందని లండన్ ఏజెంట్లను వాడడం లేదు ఈ మీటింగ్ కి. నిన్ను ఎంపిక చేసింది ఎందుకంటె, అది ట్రాప్ అయితే నిన్ను నువ్వు రక్షించుకుంటూ అలా ట్రాప్ చేయడానికి సాహసించిన వారిని ఫినిష్ చేస్తావని" కోరగా చూస్తూ అన్నాడు.

"మరెందుకు ఆ దీర్ఘమైన నిట్టూర్పులు..." అందామనుకుని బలబీర్ సింగ్ మొఖంలోని బావురుపిల్లి కి తిక్క రేగినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్స్ కనబడే సరికి నోరు మూసేసుకున్నాడు అర్జెంట్ గా.

"నువ్వు ఎక్కడా చక్కర్లు కొట్టకుండా సేఫ్ గా ఉండు. మెయింటైన్ లో-ప్రొఫైల్. ఎవరి దృష్టినీ ఆకర్షించకు" బుల్లెట్స్ లాగా మాటలను వదిలాడు.

బుద్దిగా తల ఊఫాడు విజయ్. బాస్ కి తన సొంత విషయాల గురించి ఎందుకంట అంత ఆరా? ఆ సుప్రియ గురించే కదా ఇన్ డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాడు. ఈ ముసలాళ్ళకేం తెలుస్తాయి కుర్రాళ్ళ బాధలు అంటూ రెచ్చి పోతున్న తన మనసుని బలవంతంగా గొంతు నులిమేసి, తల ఊపాడు గబగబా! 

హోటల్ కూడా తన రేంజ్ కి తగ్గట్లు కాకుండా మిడిల్ రేంజ్ లోది తీసుకున్నాడు. ఈ హోటల్ లో తనను చూస్తే సుప్రియకి తను బిజినెస్ లో దివాళా తీసాడు అనుకుంటుంది అని నిట్టూరుస్తూ గదికి చేరుకున్నాడు. అంగుళం అంగుళం అలవాటుగా చెక్ చేసుకుని సోఫాలో కూర్చుని తను చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటే హోటల్ ఫోన్ మోగింది. సుప్రియ అప్పుడే వచ్చేసిందా అనుకున్నాడు సన్నగా నవ్వుకుంటూ. 

ఫోన్ ఆన్సర్ చేస్తే రిసెప్షనిస్ట్ చెప్పింది తన కోసం ఎవరో అమ్మాయి వచ్చిందని.

గబగబా కిందికి వెళ్ళాడు విజయ్ సుప్రియ ని చూడాలన్న ఆత్రుతతో. 

కిందికి వెళ్ళాక రిసెప్షన్ లో కనబడిన అమ్మాయి ని చూసి అనుమానంతో భ్రుకుటి ముడి వేసాడు.

*** 

(ఇంకా ఉంది)