కథా కమామీషు

సహరి వీక్లీ 03-06-2022 లో వచ్చిన కథల గురించి క్లుప్తంగా

కథా కమామీషు
Sahari weekly dt 03-06-2022

కథా కమామీషు 03.06.2022  

1. రాజుగారి భోజనం : ఆ ఆఫీసుకి కొత్త బాస్ దూర రాష్ట్రం నుంచి వచ్చాడు. భార్య సహితంగా వస్తున్న ఆ రాజుగారిని రిసీవ్ చేసుకోవటానికి ఆ ఊర్లో ఉన్న ఆయన బంధు మిత్రులెవరూ రాలేదు. ఆఫీసులో పనిచేసే ఒక పాలనా విభాగాధిపతి మాత్రం రాజుగారిని సుముఖుడిని చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి విమానాశ్రయానికి విచ్చేశాడు. తాత్కాలికంగా ఆ దంపతులకు గెస్ట్ హౌస్ లో విడిది ఏర్పాటు చేశాడు. దొరవారికి అద్భుతమైన భోజనం పెట్టమంటూ వంట వాడిని పురమాయించాడు. ఆ వంటవాడు మార్కెట్లో డబల్ రేటు పెట్టి తెచ్చిన కోడికూర తయారుచేసి రెడీగా ఉంచాడు. ఆ దంపతులిద్దరూ భోజనానికి వచ్చి ఆ కూరను చూశారు. ఆ తర్వాత ఏం జరిగింది? పాలనా విభాగాధిపతి ప్లాన్ ఫలించిందా? బొరుసు చంద్రరావు స్మారక ఉగాది కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న ఎలక్ట్రాన్ హాస్య కథ ‘రాజుగారి భోజనం’ తప్పక చదవండి.

 

2. దృష్టి కోణం : తన మిత్రుడు అద్దె ఇంటికోసం వాకబు చేయటంతో కారణం అడిగాడతాడు. అతని స్నేహితుడు ఒకడు ఈ మధ్యనే చనిపోయాడనీ, అతని భార్యా పిల్లలకు వేరే ఏ ఆధారమూ లేకపోవటంతో తానే వాళ్ళని ఆ ఊరికి తెద్దామని అనుకుంటున్నట్లు ఆ స్నేహితుడు అతనికి చెప్పాడు. దాంతో తన ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు అద్దెకు కుదిర్చాడు. అందులోకి ఇద్దరు పిల్లులున్న ఒక అందమైన స్త్రీని తెచ్చి దించాడా స్నేహితుడు. అంతేకాక ఆఫీసుకి వెళ్ళటానికి ముందూ, ఆఫీసు అయిపోయాకా ఆమె ఇంటికొచ్చి ఆమెకు అన్నీ సౌకర్యాలు సమకూర్చుతున్న విషయం తన మిత్రుని భార్యకు తెలియదని అతనికి అర్ధమైంది. మిత్రునిపై అనుమానం మొదలైంది. అతని అనుమానం నిజమేనా? చివరికి వారి కథ ఏ మలుపు తిరిగింది? కొసమెరుపు కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అంగర వెంకట శివప్రసాదరావు కథ ‘దృష్టి కోణం’ తప్పక చదవండి.    

3. గురివింద గింజ : పెళ్లి మాట ఎత్తితే వాయిదాలమీద వాయిదాలు వేసే తన కొడుకు తమకు తెలియకుండా ఒక కలకత్తా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు ఆవిడకు కల వచ్చింది. ‘కలేగదా’ అని కొట్టిపారేసిన ఆమెకు తన కొడుకు నిజంగానే పెళ్లి చేసుకున్నాడని తెలిసి, తనకు రావలసిన అత్తగారి లాంఛనాలతో పాటు అదనంగా తీసుకుందామనుకున్న ఆడపడుచు లాంఛనాలు, పెళ్లికొడుకు అలకపానుపు కట్నం మిస్ అయినందుకు చాలా ఫీలయింది. అయినా పత్రికలకు ఉత్తరాలమీద ఉత్తరాలు రాసే భర్తకి టీ లు అందించలేక సతమతమయ్యే తన డ్యూటీని కోడలికి అప్పగించవచ్చనీ, ఆపైన తనకు ‘మంచం మీదికే కంచం’ వచ్చేలా కోడలితో పనులు చేయించుకోవాలని అనుకుంది. మరి తెలుగు భాషే తెలీని ఆ కోడలు వచ్చాక ఆవిడ కోరికలు తీరాయా? ఈ బొమ్మకు కథ రాయండి శీర్షిక క్రింద గంటి రమాదేవి రాసిన హాస్యభరితమైన కథ ‘గురివింద గింజ’ తప్పక చదవండి. 

4. కంవిరసం : అక్కడ పెద్ద ప్రాంగణంలో అందరూ గుమిగూడారు. వారి నాయకుడు వారందరినీ ఉద్దేశించి ప్రసంగం మొదలుపెట్టాడు. ఆ ప్రసంగంలో ఆయన తరతరాలుగా మానవులు చేసే ఆక్రమాలనూ, అన్యాయాలనూ ఖండించాడు. తమమీద ఆధారపడిన మానవుడు తమనే శాసిస్తున్నాడని విమర్శించాడు. మానవులకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఉద్రేకంగా చెప్పాడు. విప్లవమార్గంలో నడవాలని అందరికీ దిశానిర్దేశం చేశాడు. భవిష్యత్తులో అందరూ ఏమి చేయాలన్న దానిమీద తర్జన భర్జనలు చేశారు. చివరికి ఒక మార్గాన్ని అనుసరించాలని అంతా ఏకకంఠంతో ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంతకూ వారంతా ఎవరు? మానవులకు వ్యతిరేకంగా వారంతా ఎందుకు గళం విప్పాల్సివచ్చింది? చివరికేమి జరిగింది? గండ్రకోట సూర్యనారాయణ శర్మ రచించిన ఈవారం వింత విప్లవ కథ ‘కంవిరసం’ లో చదవండి. 

5. దిశా నిర్దేశం : చిన్నతనంలో చెడుస్నేహాల కారణంగా దురలవాట్లకు బానిసై అతడు చదువును నిర్లక్ష్యం చేశాడు. అందుకు కోపగించిన తండ్రి కొట్టటంతో ఇంట్లోంచి పారిపోయాడు. కొన్నాళ్ళు ఒక హోటల్లో పని చేస్తూ, ‘ఒక మంచి స్థాయికి వచ్చాక ఇంతకీ వెళ్ళాలి’ అనుకున్నాడు. అయితే కొందరు దురాశాపరుల కారణంగా అనుకోని అవాంతరం ఏర్పడి అతని బతుకు తీరే మారిపోయింది. జీవితమంతా అస్తవ్యస్తమైంది. ఒక విషవలయంలో చిక్కుకుని దుర్భరమైన జీవితాన్ని గడపాల్సివచ్చింది. చివరికి తల్లి అనారోగ్యం గురించి తెలిసినా వెళ్లలేని పరిస్థితులు ఏర్పడినా, ఆ అవాంతరాలను తప్పించుకుని, ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలేంటి? గాడి తప్పిన అతని జీవితాన్ని సరైన మార్గంలో పెట్టటానికి అతనికి దిశానిర్దేశం చేసిందెవరు? చివరికేమైంది? అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రచించిన హృద్యమైన కథ ‘దిశా నిర్దేశం’ తప్పక చదవండి.  

6. పిచ్చి ఆలోచనలకు తెర : కారుణ్య నియామకం ద్వారా కొత్తగా తమ ఆఫీసులో చేరబోయే అమ్మాయి అందచందాలను ఊహించుకుంటూ అతడు ఆ ఆఫీసులో పనిచేసే మిగిలిన వారితో పోటీ పడ్డాడు. ఆ అమ్మాయిని బుట్టలో పడేయాలని ఎవరికి చేతనైనంతగా వారు తమ తమ ప్రయత్నాలలో మునిగిపోయారు. అతడు కూడా ఎలాగైనా సరే ఆ రాబోయే అమ్మాయిని తనదానిగా చేసుకోవాలని కలలుకంటూ ఎంతగానో ఎదురుచూడసాగాడు. కొత్త అమ్మాయి చేరబోయే రోజు రానే వచ్చింది. ఆఫీసుకి వచ్చిన ఆ కొత్త అమ్మాయి ముందుగా మేనేజర్ గదిలోకి వెళ్లటంతో అందరూ ‘ఆమె ఎప్పుడు బయటకు వస్తుందా!’ అని ఎదురుచూడసాగారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయిని పొందిన అదృష్టవంతుడు ఎవరు? ఎన్నో కలలుగన్న అతని ఆశ ఫలించిందా? బొందల నాగేశ్వరరావు చక్కని కథ ‘పిచ్చి ఆలోచనలకు తెర’ లో ఈవారం సహరిలో చదవండి.