గేమ్స్ ఆడుతున్నారా

మనుషులు ఇతరులతో అనేక రకాల గేమ్స్ ఆడుతుంటారు. అవేంటో తెలుసుకుంటే మీరు ట్రాప్ లో పడకుండా తప్పుకోవచ్చు.

1. గేమ్స్ ఆడుతున్నారా??

గేమ్స్ ఆడుతున్నారా??

 గేమ్స్ ఆడుతున్నారా??

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మనుషులు ఒక చోట చేరినప్పుడు వారి మధ్య సంభాషణలు తప్పనిసరిగా జరుగుతాయి. కొన్ని మాటలతో ఉండకపోయినా చేతలతో కొన్ని రకాల శరీర కదలికలతో అవతలి వ్యక్తికి చేరుతుంటాయి. నవ్వడం, కనుబొమలు ముడి వేయడం, మొఖం పక్కకు తిప్పుకోవడం వంటివి కూడా ఒకరి స్పందనను మరొకరికి తెలియచేస్తుంటాయి. ఇలా జరిగే సంభాషణలను సైకాలజీ దృష్టిలో లోతుగా పరిశీలిస్తే అనేక విషయాలు బోధపడుతుంటాయి.

ఎరిక్ బెర్న్ అనే ఒక సైకాలజిస్ట్ మనుషుల ప్రవృత్తి మూడు రకాలుగా ఉంటుంది అని అభిప్రాయపడ్డాడు. ఆ మూడు స్థాయిలకు ఆయన పెట్టిన పేర్లు పేరెంట్, అడల్ట్, చైల్డ్ స్థాయిలు. విచిత్రం ఏమంటే ఈ మూడు స్థాయిలూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అయితే అన్ని స్థాయిలు అందరికీ ప్రదర్శించబడకపోవచ్చు.ఒక కంపెనీ బాస్, తన ఉద్యోగుల దగ్గర తనలోని పేరెంట్ స్థాయిని ఉపయోగించి సంభాశించుతాడు. అదే తన ఈడు, తన స్థాయి ఉన్న వారి దగ్గర అడల్ట్ స్థాయిలో సంభాషిస్తాడు. ఇక సన్నిహితుల దగ్గర, ముఖ్యంగా తన జీవిత భాగస్వామి దగ్గర తనలోని చైల్డ్ స్థాయిని కూడా ప్రదర్శించవచ్చు. 

మనుషుల మధ్యా ఉండే సంబంధాలను ఈ సంభాషణలే ప్రభావితం చేస్తాయి అన్నది నిర్వివాదం. అయితే ఈ సంభాషణలు ఆరు విధాలుగా ఉంటాయి. మొదటిది విత్ డ్రావల్ (బాహ్య ప్రపంచం నుంచి తనను తాను వెనకకు మరలించుకోవడం. తాబేలు తన షెల్ లోపలికి వెళ్ళిపోయినట్లు అన్నమాట. ఉదాహరణకు పగటి కలలు కనడం పేర్కొనవచ్చు. తనదైన ఒక జగత్తుని సృష్టిచుకుని దానిలోనే ఉండడం.

రెండవది, రిట్యువల్స్. అంటే తంతులు. యాంత్రికంగా చేసేవాటిని ఇలా తంతు అని వ్యవహరిస్తుంటారు. మనసు పెట్టి చేయకుండా చేసే సాధారణ పలారింపులు ఈ కోవ లోకి వస్తాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంటూ చేసే పలకరింపులు. మనసు పెట్టి చేస్తే అవి చాలా చక్కటి స్పందనలని కలిగిస్త్యి. లేదంటే ఏదో యాంత్రికంగా అడిగారు అనిపిస్తుంది అవతలివారికి.

మూడవది, యాక్టివిటీస్. అంటే దైనందిన కార్యకలాపాలు. ఏవో పనిని ఉద్దేశించి చేసే సంభాషణలు. వీటికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక విషయాన్ని పరిష్కరించి సాఫల్యం పొందే విధంగా ఉండే సంభాషణలు. కారు మార్కెట్ కి పోనివ్వు, గాస్ బుక్ చేస్తారా? వంటివి. ఇవి అవతలి వ్యక్తికి సరిగా అర్థం అవుతాయి. వారి మనస్థితిని బట్టి ప్రతిస్పందనలను పొందుతాయి.

నాలుగవది, పాస్ టైమ్స్. కాలక్షేపం కబుర్లు. ఇవి సజావుగా సాగిపోతుంటాయి. సాధారణంగా సీరియస్ గా ఉండవు కాబట్టి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. 

అయిదవది, గేమ్స్. ఇవి సంక్లిష్టమైనవి. వీటి గురించి చాలా వివరంగా తెలుసుకుందాము. ఇవి గృహ వాతావరణంలో జరగవచ్చు, కార్యాలయం లో జరగవచ్చు, వ్యాపార రంగాలు, పార్టీలు, ఇల ఎక్కడైనా జరగవచ్చు. ఇవి చాలా సంక్లిష్టమైనవి. అనుకున్న దానికంటే వేరుగా ప్రతిస్పందనలను పొందగలవు. సంభాషణలు అటూ ఇటూ మారుతూ ఉండీ త్వర త్వరగా అగ్ని పర్వతంలా బద్ధలయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఆరవది ,ఇంటిమసీ. ఆత్మీయ భావమ్ అన్నమాట. ఇలాంటి సంభాషణలు సన్నిహితుల మధ్య ఏర్పడుతుంటాయి. ప్రేయసీ ప్రియుల స్వీట్ నథింగ్స్ లాంటివి. ఇద్దరు స్నేహితురాళ్ళు తమ తమ ఆత్మీయానుభూతులను పంచుకునే సంభాషణలు లాంటివి.

ఇలా జరిగే ఈ సంభాషణలనే ట్రాన్సాక్షన్స్ అని వ్యవహరిస్తారు. ప్రతి మనిషిలో ఉండే మూడు స్థాయిలలో ఏదో ఒకటి లేదా ఇంకా ఎక్కువ ఈ సంభాషణలలో పాల్గొంటూ ఉంటాయి. అవి అవతల వ్యక్తి స్థాయిలతో మాచ్ కాకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయి. 

పేరెంట్ స్థాయి అంటే మనిషి తన ప్రవర్తనను ఇతరుల దృక్కోఅంలో కూడా చూసి బేరీజు వేసుకుని తదనుగుణంగా చూపించే ప్రక్రియ. తన జీవితంలో ముఖ్యమైన రొల్ మోడల్స్ ప్రవర్తనను తనకనుగుణంగా అలవర్చుకుని చేసే ప్రవర్తనగా అనుకోవచ్చు.  ఈ స్థాయిలో కొన్ని మౌలిక లక్షణాలు ఉంటాయి. సాధారణంగా కనబడేవి, అధికారం చూపించడం, నీతులు చెప్పడం, మార్గనిర్దేశనం చేయడం వంటివి ఈ స్థాయిలో కనబడుతుంటాయి.

అడల్ట్ స్థాయి లో వ్యక్తి తన ముందు ఉన్న సమాచారాన్ని హేతుబద్ధతతో విశ్లేషించి తదనుగుణంగా ప్రవర్తించే తీరుని చూపిస్తుంది. దీనిలో ఆవేశకావేశాలు ఉండవు. ఇతరుల భావావేశపు రంగులు తమ ప్రవర్తనను కలుషితం చేయకుండా చూసుకుంటారు ఈ స్థాయిలో.

ఇక చైల్డ్ స్థాయిలో ఆ వ్యక్తి తనకు ఆరేళ్ళ వయసు వచ్చే వరకు కనబరచిన ప్రవర్తనను మళ్ళీ చూపిస్తాడు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నాచురల్ అంటే సహజ శిశువు రెండవది అడాప్టేద్ చైల్డ్, అంటే దత్త శిశువు. సహజ శిశువు తన సహజ స్పందనలనే చూపిస్తే, దత్త శిశువు మాత్రం తన ప్రవర్తనను పెద్దల ఆమోదం ఉన్న మేరకు మాత్రెఅమే కనబరుస్తాడు.

వచ్చే వారం గేమ్స్ ఎలా ఆడుతారు, గేమ్స్ వల్ల లాభాలు ఏంఇటి, నష్టాలు ఏమిటి అన్నవి చూద్దాం.

2. ఇలా చేయొచ్చు గా? నిజమే... కానీ...

ఇలా చేయొచ్చు గా? నిజమే... కానీ...

గేమ్స్ ఆడుతున్నారా - 2

(ఇలా చేయొచ్చు గా? నిజమే... కానీ...)

ఇద్దరి మనుష్యుల మధ్య జరిగే సంభాషణలను ట్రాన్సాక్షన్స్ అంటాము. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. మొదటి రకం లో సమతూకం ఉన్న సంభాషణలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు ఎప్పుడూ వారి వారి మానసిక స్థాయిలకు అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు మొదటి వ్యక్తి పేరెంట్ స్థాయి లో సంభాషణను మొదలు పెడితే రెండవ వ్యక్తి చైల్డ్ స్థాయిలో సంభాషణకు స్పందించారు అనుకోండి. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ లో సమతుల్యత ఉన్నది అనుకోవచ్చు. 

రెండవ రకం ట్రాన్సాక్షన్ లో అసమతుల్య సంభాషణలు ఉంటాయి. అంటే మొదటి వ్యక్తి మానసిక స్థాయికి వ్యతిరేకంగా స్పందించే విధంగా స్పందనలు ఉంటాయి. ఈ వ్యతిరేకత అన్నది మాటలలోని భావాన్ని బట్టి కాదు, వాటి వెనక ఉన్న మానసిక స్థాయిల మధ్య ఉండే వ్యతిరేకతను సూచిస్తుంది. ఇందాకటి ఉదాహరణనే తోసుకోండి. అందులో మొదటి వ్యక్తి పేరెంట్ మానసిక స్థాయి నుంచి సంభాషణను మొదలు పెడితే రెండవ వ్యక్తి కూడా పేరెంట్ మానసిక స్థాయిలో సమాధానం ఇస్తే అవి వ్యతిరేకం అవుతాయి. సమతుల్యత లోపిస్తుంది. ఇలాంటి అసమతుల్య సంభాషణలు ఎక్కువ సేపు కొనసాగలేవు. అవి బ్రేక్ డౌన్ అవుతాయి. అదే సమతుల్య సంభాషణలు కొనసాగుతాయి. ఫలవంతమవుతాయి.

గేమ్శ్:

ఇక మూడో రకం సంభాషణలు పై రెండిటికీ భిన్నంగా ఉంటాయి. వీటిలో పైకి కనబడే భావం వేరు, అంతర్లీనంగా ఉన్న భావం వేరు. అలా ఉండడం వల్ల ఇవి సంక్లిష్టమైనవి. ఒక వ్యక్తి మొదలు పెట్టిన సంభాషణ కు బయట కనబడే అర్థానికి వేరుగా అంతర్లీనంగా మరో ఉద్దేశం ఉంటుంది. బయటకు కనబడే దాన్ని సామాజిక స్థాయి అర్థం అనుకుంటే అంతర్లీనంగా ఉండేది మానసిక స్థాయిలో ఉండే ఉద్దేశం. ఈ సంభాషణల పర్యవసానం సామాజిక స్థాయిలో జరిగే వాటి పైన కాక మానసిక స్థాయిలో ఆ ఇద్దరి మధ్య జరిగే పరిణామాలను బట్టి అంచనా వేయాల్సి ఉంటుంది. వీటినే గేమ్స్ అంటారు.

ఉదాహరణకు, ’నాకు ఈ పనిలో సాయం చేయగలవా?’ అన్న ఒక సంభాషణను తీసుకోండి. దీనిలో బయటకు కనబడే అర్థం కాక అంతర్లీనంగా ’నాకు నీతో ఒంటరిగా ఉండాలని ఉంది’ అన్న సందేశం ఉంటుంది. అప్పుడు దీన్ని గేమ్ అంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అలా సంభాషించే ఇద్దరిలోనూ ఏ ఒక్కరికి కూడా నిజానికి అంతర్లీనంగా ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ఏమీ తెలియకుండా ఉన్నప్పుడే దాన్ని గేమ్ అంటారు. లేదంటే దాన్ని మానిప్యులేషన్ అంటారు. అంటే ఒకరు వేరే వారిని తమకు అనుకూలంగా స్పందించేలా నేర్పు చూపుతారన్నమాట.

లాభం ఏమిటి?:

సాధారణంగా తమ దృక్పథాలను స్థిరపరుచుకోవడానికి, తమ అనుభూతులను స్పష్టం చేసుకోవడానికి మనుషులు గేమ్స్ ఆడుతుంటారు. అయితే గేమ్స్ పర్యవసానాలు పాజిటివ్ గా ఉండొచ్చు, లేదా నెగటివ్ గా ఉండొచ్చు. ఈ గేమ్స్ ఎప్పుడు ఆడినా ఒకే విధంగా ముగుస్తాయి, ఒకే రకం పర్యవసానాన్ని ఇస్తాయి. అదీ గాక ఈ గేమ్స్ రిఫీట్ అవుతూ ఉంటాయి జీవితంలో. మానసిక సమస్యలు ఉన్నవారిలో ఈ గేమ్స్ ఆడే తత్వం ఎక్కువగా ఉంటుంది. పైగా వీటిలో లీనమయి మరీ ఆడుతారు. అలాగే వాటి పర్యవసానాల తీవ్రత కూడా ఎక్కువగా అనుభూతిస్తుంటారు.

బాగా ఇంటిమేట్ రిలేషన్స్ లో కూడా ఇలాంటి గేమ్స్ ఉంటాయని అంటాడు బెర్న్. కాలక్షేపం గా వాడబడే ట్రాన్సాక్షన్స్ ద్వారా తమకు తగ్గ గేమ్ పార్ట్‍నర్ ని ఎంపిక చేసుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తుంటారు.

నిజమే కానీ...: 

పార్టీలలో, లేదా సోషల్ గేదరింగ్స్ లో కుటుంబ సభ్యులు బంధువులు కలిసే సందర్భాలలో ఆడే ఒక గేమ్ ’నువ్వెందుకు అలా చేయవు?’ అనేది. దీనికి అవతలి వ్యక్తి ’ నిజమే, కాని...’ అంటూ వారు ఇచ్చిన సలహాలో ఎదురయ్యే సమస్యను హైలైట్ చేస్తాడూ. దానికి ప్రతిస్పందిస్తే మరో సూచన వెలువడుతుంది. ఇలా పింగ్ పాంగ్ ఆటగాళ్ళు బంతిని కొట్టినట్లు ఆట కొనసాగుతుంది. ఎవరో ఒకరు విసిగి ఆగిపోయేవరకు, లేద మరెవరో వచ్చి వారిని రక్షించే వరకు.

ఈ ఆటలో బయటకు , అంటే సామాజిక స్థాయిలో కనిపించేది ఇద్దరు అడ్లట్స్ మానసిక స్థాయిలో సంభాషించుకుంటున్నారు, ఒకరు మరొకరికి సలహా, సంప్రదింపులు చేస్తూ వారికి ఉపయోగపడాలని చూస్తున్నారు అని. కానీ అంతర్లీనంగా ఒకరికొకరు అవతలి వ్యక్తి ఎందుకూ పనికిరాడు అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని, అప్పుడు తమను తాము గొప్పగా భావించుకోవాలని, అలాంటి అనుభూతిని పొంది తమను తాము గొప్పగా కన్‍ఫర్మ్ చేసుకోవాలి అని తాపత్రయపడుతుంటారు.

ఇందులో మొదటి వ్యక్తి నిజానికి పేరెంట్ స్థాయి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. ఎందుకు నేను చెప్పినట్లుగా ఇలా చేయవు’ అనేది అసలు ఉద్దేశం. కానీ బయటకు అడల్ట్ మానసిక స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తూ, చాలా మంచితనంతో అవతలి వ్యక్తికి సరైన దిశా నిర్దేశం చేయడానికి తగు సూచనలు సలహా రూపంలో ఇస్తున్నట్లు కనిపిస్తుంది.

అదే విధంగా అవతలి వ్యక్తి మొదటి వ్యక్తికి అడల్ట్ స్థాయిలో ప్రతిస్పందిస్తూ ’నిజమే’ అన్నట్లు కనిపిస్తింది. మొదటి వ్యక్తి ఇచ్చిన సలహాను స్వీకరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ’నిజమే...కానీ...’ అనే దానిలో ’కానీ’ తో అసలు విషయం మొదలవుతుంది. మొదటి వ్యక్తి చెప్పిన సోది సలహా తనకు ఎప్పుడో తెలుసని, దానిలో ఇలాంటి సమస్య ఉంటుంది అన్నది మొదటి వ్యక్తికి తెలియదేమో అని, కానీ తనకు తెలుసని, శక్తి ఉంటే ఈ పరిష్కారం లేని సమస్యకు సరైన పరిష్కారం సూచించమని ఒక పజిల్ ని మొదటి వ్యక్తికి విసరడం కనిపిస్తుంది అంతర్లీనంగా! ఇక్కడ రెండవ వ్యక్తి నిజానికి చైల్డ్ మానసిక స్థాయిలో ఉండి ప్రతిస్పందిస్తున్నాడు. మొదటి వ్యక్తిలో ఉన్న పేరెంట్ స్థాయిని గుర్తించి, ఆ పేరెంట్ కి చీకాకు తెప్పించే ఉద్దేశం అంతర్లినంగా కనిపిస్తుంది.

ఇందులో ఇద్దరికీ కూడా ఈ గేమ్ ముగింపు దశలో తమ తమ దృక్పథాలే సరైనవని. అవతలి వ్యక్తి ఏదో చెప్తున్నాడు కానీ అసలు సమస్యను పరిష్కరించలేడనీ, లేదా ఏ పనీ చేతకాని దద్దమ్మ అనే అనుభూతి ని పొందుతారు.

వచ్చే వారం మరిన్ని గేమ్స్ గురించి, ఇలాంటి గేమ్స్ ఆడబడుతున్నవని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది తెలుసుకుందాము.

***

3. ఇలా చేయొచ్చు గా? నిజమే... కానీ...2

ఇలా చేయొచ్చు గా? నిజమే... కానీ...2

గేమ్స్ ఆడుతున్నారా - ౩

(ఇలా చేయొచ్చు గా? నిజమే... కానీ...)

గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఒక సుడిగుండం లో చుట్టుకున్న పడవ మాదిరి ఆ గేమ్ లోపలికి లాగబడతారు. దాని వల్ల పొందాలి అనుకున్న లాభాలు నిజానికి అంతగా ముఖ్యమైనవి కావు. పాజిటివ్ పర్యవసానం ఉన్న గేమ్స్ వరకూ కొంత లాభం ఉన్నట్లు కనిపించినా, నెగటివ్ పర్యవసానం ఉన్న గేమ్స్ వల్ల వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు బాగా స్ట్రైన్ అవుతాయి. గేమ్ పూర్తయ్యేసరికి తమ తమ శక్తి తగ్గినట్లు, విపరీతమైన అలసటకు లోనయినట్లు అనిపించడంలో ఆశ్చర్యం లేదు. 

ఈ అలసట అనేది, మానసికంగా అనిపించడమే కాక శారీరికంగా కూడా కనిపిస్తుంది. పరస్పరం విముఖత ఏర్పడే అవకాశం కూడా ఉంది. పైగా ఆ వ్యక్తి తో మళ్ళీ ఏ విషయం మాట్లాడాలి అనిపించినా వంద ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకే గేమ్స్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. అయితే ముందే చెప్పుకున్నట్లు గేమ్స్ ఆడే వ్యక్తులకు తాము ఒక గేమ్ లోకి లాగబడుతున్నాము అన్న విషయం నిజంగా తెలియదు. 

గుర్తించాలి:

నెగటివ్ పర్యవసానం వున్న గేమ్స్ ఆడటం నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న సమస్యకు మొట్టమొదటి పరిష్కార మార్గం, ఆ గేమ్ ఆడబడుతుంది అని గుర్తించగలగడం. అయితే గేమ్స్ ఆడుతున్న విషయం ఆడే వాళ్ళకు తెలియదు అంటున్నారు కదా, మరి ఎలా గుర్తించగలం అన్న ప్రశ్నకు సమాధానం - అనుభవం.

అవును, అనుభవమే! కొన్ని సార్లు గేమ్ అనుకోకుండా ఆడి వాటి చేదు ఫలాలను అనుభవించాక మన మనసులో ఆ విషయాలను మననం చేసుకోవడం ద్వారా గేమ్ ఎలా మొదలయింది అన్న విషయం తెలుసుకోవచ్చు. అయితే అలా తెలియలేని వాళ్ళకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం ఉండొచ్చు. అయితే అది చాలా కొద్ది శాతం మందికే!

చెస్ లో ఓపెనింగ్ మువ్ ఎలా ఉంటుందో అలాగే ఈ గేమ్స్ లో కూడా ఒక ఓపెనింగ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. దాన్ని గనుక గుర్తించగలిగితే, తర్వాత ఎప్పుడైనా దాన్ని అదే వ్యక్తి నుంచి విన్నప్పుడు మనం కాస్త అలర్ట్ అయిపోయి గేమ్ ఆడకుండా తప్పించుకునే మార్గం అనుసరించవచ్చు.

అలా గనుక మనం గేమ్ ఆడకుండా తప్పించుకుంటే రెండు పర్యవసానాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి అవతల వ్యక్తి తను అంతర్లీనంగా కోరుకున్న ఉద్దేశం నెరవేరకపోవడం వల్ల అసంతృప్తి చెందడం ఒక పర్యవసానం. లేదా తన ఉద్దేశం నెరవేరిపోయింది అన్న సంతృప్తిని పొందడం.

ఎటువంటి పర్యవసానం వారికి మిగులుతుంది అన్నది ఏ పద్ధతిలో ఆ గేమ్ ని బ్రేక్ చేసారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

కొన్ని ఉదాహరణలతో ఈ విషయాలు మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

సుత్తి భద్రయ్య నరేష్ కి మావయ్య అవుతాడు. నరేష్ చదువు పూర్తి చేసి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. సుత్తి భద్రయ్య కు తను చాలా తెలివైన వాడినని, ఎంతో సమర్థవంతుడిని అని బాగా నమ్మకం. ఆ నమ్మకం ఇతరులలో తగినంత లేదేమో అనిపించినప్పుడల్లా వారికి ఉచిత సలహాలు చెప్తూ ఉంటాడు. అయితే అవి సుత్తి లా ఉండటం వల్ల అతనికి అందరూ సీక్రెట్ గా పెట్టుకున్న పేరు సుత్తి భద్రయ్య. సీక్రెట్ అంటే ఎవరికీ తెలియదు అని కాదు, అందరికీ తెలుసు కాని అతనికి మాత్రం తెలియదు అని అర్థం.

ఒక రోజు బంధువుల పెళ్ళిలో కలుసుకున్నప్పుడు నరేష్ దొరికిపోయాడు సుత్తి భద్రయ్యకు, చుట్టూ పది మంది బంధువులు ఉండటం తో భద్రయ్యకు తన గొప్ప చాటుకునే సావకాశం దొరికింది. దాన్ని వదులుకోకుండా నరేష్ ని పలకరించాడు.

’ఏరా డిగ్రీ అయింది కదా, నెక్స్ట్ ఏంటి?’ అన్నాడు.

’ఉద్యోగ ప్రయత్నాలు  చేస్తున్నా మావయ్యా!’ అన్నాడు నరేష్.

’ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం మాటలేంటి, నువ్వే ఏదైనా స్టార్టప్ పెట్టుకోవచ్చు కదా?’ అన్నాడు భద్రయ్య.

ఇది భద్రయ్య ఆడే పార్టీ గేమ్ లో మొదటి మువ్. ఈ గేమ్ ని ఆడాలి అంటే నరేష్ చెప్పాల్సిన మాట ఆ గేమ్ ని కొనసాగించేలా ఉండాలి. అంటే ’నిజమే... కానీ,’ అంటూ తను భద్రయ్య కంటే తెలివైన వాడీని అన్న ధోరణిలో పరిష్కారం లేని సమస్యలని భద్రయ్య ముందు పెట్టి అతన్ని ఒక ఆట ఆడుకోవాలి. అయితే ఈ గేమ్ చివరకు పాజిటివ్ అవుతుందో నెగటివ్ అవుతుందో చెప్పలేము. చాలా వాటిపై అది ఆధార పడుతుంది.

అయితే మనం ఇక్కడ గమనించాలి అనుకుంటున్నది ఈ గేమ్ ని నరేష్ ఎలా అవాయిడ్ చేస్తాడు అనేది.

నరేష్ కి భద్రయ్య సలహా లాంటి గేమ్ ట్రాన్శాక్షన్ వినగానే బల్బు గనుక వెలిగితే (తన పాత అనుభవాల కారణంగా) గేమ్ మొదలవబోతుందని గుర్తిస్తాడూ.  ఆడటం పట్ల తనకు ఆసక్తి లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అతని ముందు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్. రెండవది నెగటివ్. 

పాజిటివ్ అవాయిడెన్స్:

తనకు గేమ్ ఆడటం లో ఆసక్తి లేదు కానీ సుత్తి భద్రయ్యకు ఆ గేమ్ చాలా పెద్ద కాలక్షేపం అని తనకి తెలుసు. పైగా ఆ గేమ్ ద్వారా తన సమర్ధతను, తెలివి తేటలను, మంచితనాన్ని చాటింపు వేసుకోవాలి అనుకుంటున్నాడు అతను. అతనికి పూర్తి గేమ్ ఆడిన తర్వాత వచ్చేటంత ఆనందాన్ని గేమ్ అవాయిడ్ చేయడం ద్వారా నరేష్ ఇవ్వలేడు. కానీ కొంత వరకు ఇస్తూ గేమ్ ని త్వరగా బ్రేక్ చేయ వచ్చు. 

’స్టార్టప్ గురించి నేను మా ఫ్రెండ్స్ మీ దగ్గర టైమ్ తీసుకుని వచ్చి మాట్లాడుతాము మావయ్యా’ అంటూ గేమ్ ని ముగించే ప్రయత్నం చేయవచ్చు. ఎప్పుడైతే ’నిజమే ..కానీ..’ అన్న పోటీ మాట నరేష్ దగ్గర నుంచి రాలేదో అప్పుడే ఆ గేమ్ ముగింపు వైపుకి ప్రయాణం మొదలుపెట్టేస్తుంది. అయితే భద్రయ్యకు నరేష్ తన గౌరవాన్ని గుర్తించి మాట్లాడటం వల్ల కాస్త తృప్తి లభిస్తుంది.

అందువలన ఫుర్తి స్థాయి గేమ్ ఆడకపోయినా భద్రయ్య పెద్దగా ఫీల్ అవకపోవచ్చు. అందువలన ఈ గేమ్ ని పాజిటివ్ గా అవాయిడ్ చేయగలిగాడు నరేష్. ఇలా మాట్లాడి గేమ్ అవాయిడ్ చేయడం వల్ల నరేష్ కి కూడా మంచి ఇమేజి  ఏర్పడుతుంది. పెద్దల మాటలు వింటాడని. వారి మార్గదర్శకత్వం కోరుకుంటున్నాడని, బంధువులలో మంచి మార్కులు పడతాయి.

నెగెటివ్ అవాయిడెన్స్:

భద్రయ్య ఏ ఉద్దేశంతో గేమ్ మొదలు పెటాడో నరేష్ కి అర్థం అయింది. అదివరకు అనుభవాలను బట్టి భద్రయ్య ఎంత డప్పు కొట్టుకునే టైపో నరేష్ కి బాగా తెలుసు. భద్రయ్య ఆటలు సాగనివ్వకూడదు అనుకున్నాడు. అయినా గేమ్ పూర్తిగా ఆడి అందులో అతన్ని ఓడించి పరాభవించాలి అన్న ఆలోచన లేదు. ఎందుకంటే గేమ్ ఎటైనా స్వింగ్ కావచ్చు.

గేమ్ అవాయిడ్ చేయాలి అనుకున్నాడు నరేష్. కానీ భద్రయ్యకు ఎలాంటి సంతృప్తి కలగనీయకూడదు అనుకున్నాడు. తను. లేదా తన ఈడు పిల్లలు భద్రయ్య చేత చేదు అనుభవాలు పొందడం తెలుసు కాబట్టి, భద్రయ్యకు ఒక చేదు అనుభవం మిగులుస్తూ అవాయిడ్ చెయ్యాలని అనుకున్నాడు.

’నాకు ఇంట్రస్ట్ లేదు మావయ్యా! ఎవరైకైనా ఇంట్రస్ట్ ఉంటే వాళ్ళకి చెప్పు’ అన్నాడు నరేష్. భద్రయ్య తెలివికి, సమర్ధతకు ఒక అడ్డుకట్ట వేసి, అతనికి అవకాశం ఇవ్వకుండా భద్రయ్య ఆశలపై నీళ్ళు జల్లేసాడు. దాని వల్ల భద్రయ్య నరేష్ పై చిరాకు పడి తన పెద్దరికాన్ని కాపాడుకోవాలి అనుకోవచ్చు, అప్పుడు మరో గేమ్ కి తెర తీసినట్లు అవుతుంది .అది మరింత చేదుగా ముగిసే అవకాశం ఉంది. పర్యవసానం నెగటివ్ గా ఉంటుంది. 

వివిధ సందర్భాలలో ఎలాంటి గేమ్స్ ఆడుతుంటారొ వచ్చే వారం చూద్దాం.

***

4. పద్ధతులు - మర్యాదలు

పద్ధతులు - మర్యాదలు

పద్ధతులు - మర్యాదలు

బెర్న్ దృష్టిలో మనుషుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ ఒక పద్ధతిలో జరుగుతుంటాయి. సాధారణంగా ఇవి పేరెంట్, అడల్ట్, లేదా చైల్డ్ స్థాయి లో దేనిలోనో మొదలవుతాయి. సొసైటీ లో జరిగే ట్రాన్సాక్షన్స్ లో అత్యంత సాధారణంగా జరిగేవాటినే పద్ధతులు, మర్యాదలు అంటుంటాము. ’వీడికి పద్ధతి తెలియదు, లేదా ఆమెకు మర్యాద తెలియదు అనే మాటలను గమనించి ఉంటారు కదా!

ఈ పద్ధతులు, మర్యాదలు కొన్ని ప్రాంతాలను బట్టి, కాలాలను బట్టి మారుతాయి. కొన్ని మారవు. వీటిలో ఫార్మల్ (అంటే సభా మర్యాద, లేదా పండిత గోష్టిలోనూ, అధికారంలో, లేదా ఇతరత్రా ఉన్నత శ్రేణిలో ఉండే వారితో పాటించే పద్ధతులు) అలాగే ఇన్ ఫార్మల్ (అంటే వ్యావహారిక పద్ధతులు, తమ మధ్య ఎక్కువ అంతరాలు లేని, కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్) ఉంటాయి.

పరిచయం:

దీనికి ప్రతి సమాజంలోనూ ఒక నిర్దుష్టమైన పద్ధతి ఉంటుంది. ఒక మర్యాద ఉంటుంది. ఉదాహరణకు, ఇంగ్లండ్ రాజసభలో ఒక పద్ధతి ఉండొచ్చు, అలాగే మన దేశ రాష్ట్రపతి ని కలిసేటప్పుడు పాటించే పద్ధతి ఉంటుంది. అదే విధంగా ఒక స్కూల్ లో ప్రిన్సిపాల్ ని కలిసే విధానం, లేదా ఒక కలెక్టర్ ని కలిసే విధానం, స్వపరిచయం చేసుకునే విధానం ఉంటాయి. వీటిలో భాష, మారొచ్చు, పద్ధతిలో కొద్ది మార్పులు ఉండొచ్చు కానీ అంతర్లీనంగా ఉండే మర్యాద ఒకటే! ప్రవర చెప్పి తనను తాను పరిచయం చేసుకోవడం వైదిక సంప్రదాయం. అందరూ పాటించరు. అలాంటి అవసరం పండితుల ముందరే గానీ, అందరి ముందూ కలగదు. అలాగే ఎక్కడ ఎలాంటి పద్ధతి పాటించాలి అన్నది ఎంత ముఖ్యమో పాటించ కూడనంత స్థాయి మర్యాద వేరే చోట పాటించడం కూడా హేళనకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.

పేరెంట్ స్థాయి మర్యాదలు:

ఫార్మల్ విధానాలు సాధారణంగా పేరెంట్స్ స్థాయిలో ఉండే అవతల వ్యక్తిని చైల్డ్ స్థాయిలో ప్రవర్తిస్తూ ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంగా మనస్తత్వ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా తమకు కొన్ని లాభాలు ఉన్నాయని భావించడం వల్ల, ఫార్మల్ విధానాలకు ప్రాచుర్యం లభిస్తూ ఉంటుంది. ఈ ఫార్మల్ విధానాల వెనుక ఉండే ఉద్దేశం మెప్పు పొందడం, లేదా తప్పుకి మన్నింపు కోరడం అయి ఉంటుంది.

ఇన్ ఫార్మల్ పరిచయ మర్యాదలు:

ఇన్ ఫార్మల్ విధానాలు లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు. పలకరింపులు వరకే. వాటిని ఎక్కువ సాగదీయడం సరి కాదు. ఒక పార్టీ జరుగుతున్నప్పుడు మొదటిసారిగా పరిచయం అయిన ఇద్దరు వ్యక్తులు, బాగున్నారా, అంటే బాగున్నారా అనుకుంటారు గానీ, తమ ఆరోగ్య సమస్యలను గురించిన సమాచారం అవతలివారితో పంచుకోవాలని కోరుకోరు కదా! అలాగే ఎండలు దంచేస్తున్నాయి, అని ఒకరు అంటే, అవును బయటకు అడుగు పెట్టాలంటే భయం వేస్తోంది అనడం వరకే కానీ ఓజోన్ పొరకు చిల్లులు, అల్ట్రా వయొలెట్ కిరణాలు వల్ల స్కిన్ కి ఎంత నష్టమూ అన్న వాటిపై మీ ప్రసంగం అక్కడ ఎవరు వింటారు?

సాధారణంగా ఇన్ ఫార్మల్ పరిచయాలు అడల్ట్ స్థాయిలో జరుగుతాయి. వాటిలో ఒకరినొకరు ఎవాల్యుఏట్ చేసుకోవడం ఉండదు. అంతగా పరిచయం లేని వారు స్నేహపూర్వకంగా రెండు మాటలు చెప్పుకునే విధానం అలాగా ఉంటుంది. అదే బాగా పరిచయాస్తుల మధ్య ట్రాన్సాక్షన్స్ వేరే స్థాయిలో అంటే చైల్డ్ టు చైల్డ్ స్థాయిలో ఉంటాయి. ఎటుబంటి హద్దులు పాటించకుండా, ఇంటిమసీ ని షేర్ చేసుకునే విధానాలు.

భార్యా భర్తల మధ్య గేమ్స్:

పరిచయం లేని వ్యక్తుల మధ్య జరిగే పరిచయ కార్యక్రమాలలో ఉండే ట్రాన్సాక్షన్స్ ఉద్దేశం వారితో పరిచయం పెంచుకోవచ్చునా లేదా అన్నంతవరకే ఉంటాయి. అదే బాగా దగ్గర సంబంధం ఉన్నప్పుడు వారి మధ్య కొన్ని రకాల గేమ్స్ కి అవకాశం ఉంటుంది. సాధారణంగా భార్యా భర్తల మధ్య అనేక రకాల గేమ్స్ జరిగే అవకాశం ఉంది. అందులో బాగా పాపులర్ గా ఆడే గేమ్ పేరే, నీ వల్లే, నీ వల్లే...

నీ వల్లే, నీ వల్లే...

ఈ గేమ్ లో భార్య తన భర్త కారణంగా తను ఏమేమి చేయలేకపోయిందో తలుచుకుంటూ ఉంటుంది. తనకు ఇష్టమైన ఎన్నో విషయాలని తన భర్త కారణంగా తాను చేయలేకపోతుందని బాధపడుతుంది. దానికి తన భర్తదే భాద్యత అని నిర్ధారిస్తుంది. ఛాన్స్ దొరికితే తగువు వేసుకుంటుంది. అలాగే తనకు ఇష్టం లేని పనులు చేయడానికి కారణం కూడా తన భర్తే అనుకుంటుంది. అందుకు భాధ్యత అతనిదే అని అతన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇదే తరహా ఆలోచనలు భర్త తన భార్య గురించి చేసే అవకాశం కూడా ఉంది. 

నీ వల్లే నీ వల్లే గేమ్ ఎలా మొదలవుతుంది, ఎలా అదుపు తప్పి విడాకుల దాగా వెళ్ళే అవకాశం ఉంది. దీని నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలను వచ్చే వారం విపులంగా చర్చించుకుందాము.

***

5. భార్యాభర్తల గేమ్స్

భార్యాభర్తల గేమ్స్

భార్యాభర్తల గేమ్స్

(గేమ్స్ ఆడుతున్నారా?)

భార్యాభర్తల మధ్య అనేక రకాల గేమ్స్ జరుగుతుంటాయి. ఈ సైకలాజికల్ గేమ్స్ లో తరచుగా కనిపించే ఒక గేమ్ ను వ్యావహారికంగా ’నీ వల్లే...నీ వల్లే’ అన్న పేరుతో పిలుస్తారు.

నీ వల్లే...నీ వల్లే...:

సరిత చాలా అందంగా ఉంటుంది. ఆమెది అరేంజ్డ్ మారేజి. ఆమె భర్త సుందర్ ఆమెతో పోలిస్తే సామాన్యంగా ఉంటాడు. కాస్త మొరటు మనిషి అని ఆమె అభిప్రాయం. పెళ్ళైన కొద్ది కాలానికే ఆమె తన స్నేహితుల దగ్గర తనను భర్త బాగా రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడని. అతని కారణంగా తాను బయటకి వచ్చి అందరితో సరదాగా గడపడం కుదరడం లేదని ఫిర్యాదు చేసేది.

ఆమె ఫ్రెండ్స్ పిక్నిక్కులకు వెళ్ళినా, కాలేజి డేస్ లో చేద్దామనుకుని చెయ్యలేని పనులను చెయ్యడానికి పూనుకున్నా ఆమెకు కూడా చెప్పేవారు. సంగీతం క్లాసుల్లో చేరామని, యోగా నేర్చుకుంటున్నామని, డాన్స్ క్లాసులకు వెళ్తున్నామని చెప్పేవారు. అలా చెప్పిన రోజు ఆమె ఇంట్లో తప్పనిసరిగా ఆ విషయం భార్యా భర్తల మధ్య చర్చకు తెరతీసేది. 

’పెళ్ళికి ముందు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఫాలో అయ్యేవారు. ఇప్పుడు చూడండి వాళ్ళు ముందుకి దూసుకువెళ్తుంటే నేను వెనకబడిపోయాను’.

’ఏమైంది ఇప్పుడు?’.

’ఏ మవుతుంది, నా తలకాయ! అంతా మీ వల్లే...’.

’అరే ఏమయిందంటే ...’

’లలిత సంగీతం క్లాసులో చేరింది. రీటా సల్సా నేర్చుకుంటుంది. నేనే ఏమీ చెయ్యకుండా ఇలా వంటింటి కుందేలు లాగా మూలనపడ్డాను’ అంది నిరుత్సాహంగా.

’ఇంటి పనులు చూసుకోవడానికి, పిల్లల బాగోగులు చూసుకోవడానికే నీకు సమయం సరిపోవడంలేదు. ఇప్పుడు అవన్నీ చేస్తానంటే ఎలా? కుదరదు...’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు సుందరరావు.

’అదిగో, అదిగో! అదే నేను మొత్తుకునేది. మిమ్మల్ని కట్టుకున్నాక నా సృజనాత్మకత అంతా అటకెక్కింది. మీకు మీ పిల్లలకు సేవ చేసే యంత్రాన్ని అయ్యాను. జీతం భత్యం లేని పనిమనిషినయ్యాను’ అంటూ శోకాలు మొదలెట్టింది.

అది చూసి చిరాకు ఎక్కువై నాలుగు మాటలు దులిపేసాడు సుందరరావు. ఆమె పనుల్లో లోపాలు ఎంచుతూ అవే సరిగా చెయ్యలేవు, ఇవన్నీ నీకెందుకు, అవసరం లేదు అంటూ.

ఇద్దరి మనసుల్లోను ఒక నెగటివ్ ఫీలింగ్ తో ఈ గేమ్ ముగిసింది. సరిత చైల్డ్ స్థాయిలోనూ, సుందరరావు పేరెంట్ స్థాయిలోనూ ప్రవర్తించారు. ఈ గేమ్ డిజైన్ లోనే ఈ రెండు స్థాయిలూ ఉంటాయి. అందువలన అటూ ఇటూ తిరిగి గేమ్ ఇలాగే అంతమవుతుంది. పేరెంట్ స్థాయిలో వ్యక్తి తన అధికారాన్ని ఉపయోగిస్తాడు(ఒక వేళ ఈ గేమ్ రివర్స్ లో ఆడితే భార్య పేరెంట్ స్థాయిలో తన అధికారాన్ని ఉపయోగిస్తుంది). చైల్డ్ స్థాయిలో వ్యక్తి ఒక తిరుగుబాటు ధోరణి, లేదా నిరసన ధోరణి ప్రకటించి అలుగుతుంది(లేదా అలుగుతాడు).

గేమ్ పర్యవసనాలు:

సాధారణంగా గేమ్ అయిన కొద్దిసేపటికి భర్తకు కాస్త అపరాధభావన కలుగుతుంది. అనవసరంగా తను ఎమోషనల్ అయిపోయి భార్యను తూలనాడేనేమో అని బాధపడతాడు. ఆమెను ఊరడించడానికి, అలక తీర్చడానికి ప్రయత్నిస్తాడు. ఆమెకి నచ్చిన పని చేయడానికో, ఆమెకు గిఫ్టులు ఇవ్వడానికో, ఆమెను మరి కాస్త పాంపెర్ చేయడానికో ప్రయత్నిస్తాడు. 

అయితే కొన్నాళ్ళకు ఆ భర్తకు నిజంగానే పరివర్తన వచ్చి, చీటికీ మాటకీ తన భార్యకు నో చెప్పడం ఎందుకు అని ఆలోచన వచ్చి ఆమె మాటలకి యెస్ చెప్పాడు అనుకుందాము. అప్పుడు గేమ్ ఒక కొత్త మనో విశ్లేషణకు తెర తీస్తుంది.

సరిత మనోవిశ్లేషణ:

సరిత కు చిన్నతనం నుండి కొన్ని కొన్ని భయాలు ఉన్నాయి. వాటిని బయట పెట్టకుండా వేరే విధంగా మానేజ్ చేసేది. ఉదాహరణకు స్కూల్ డేస్ లోనే డాన్స్ అంటే ఆమెకు అయిష్టం లేదా భయం ఉండేది. తన స్నేహితులలో కొందరు డాన్స్ క్లాసులకు వెళ్తానంటే ’మా నాన్న తిడతారే, అవన్నీ మా నాన్నకు నచ్చవు’ అంటూ మానేజ్ చేసేది.

ఆమెకు పెళ్ళి చూపులలో చాలా మంది వచ్చినా వారిలో డామినేటింగ్ గా కనిపించిన సుందరరావునే ఆమె లోని చైల్డ్ సెలక్ట్ చేసుకుంది. ఆమె కాన్షస్ మైండ్ లో ఇవన్నీ అంత స్పష్టంగా తెలియకపోయినా ఆమె అంతఃచేతనలో ఈ స్క్రిప్ట్ విపులంగా రాయబడి ఉంటుంది. 

అంతా అనుకున్నట్లే జరిగిపోయేది. ఆమె తను చేయడానికి నిజంగా ఇష్టం లేని పనులను, సొసైటీ లో తన స్నేహితుల దగ్గర భర్త కారణంగా చేయలేకపోతున్నాను అని చెప్పేది. అలాగే చెప్పుకునే ఇతర భార్యలతో ఆ విషయం లో ఒక ఊరట లభించేది ఆమెకు.

అయితే అనుకోని విధంగా సుందరరావు లో ఒక పరివర్తన రావడం వల్ల, సరిత కోరినట్లు ఆమెకు డాన్స్ నేర్చుకోవదానికి అనుమతి ఇచ్చాడు. అదే కాదు ఆమె అడిగే ఇతర విషయాలకు కూడా అనుమతి లభించేది.

కొత్త పర్యవసనాలు:

డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళిన రెండు రోజులకే తనలో ఆ డాన్స్ పట్ల ఉన్న విముఖత వల్ల సరితకు కాలు మడతపడి స్ప్రైన్ కావడం, సరిగా చేయలేకపోవడం, వంటి కారణాలతో క్లాసులకు డుమ్మా కొట్టింది.

ఇదివరకటిలా నీ వల్లే ... నీ వల్లే గేమ్ కొనసాగక పోవడం వల్ల ఆమెకు వచ్చే గిఫ్టులు కూడా తగ్గిపోయాయి. వారి మధ్య తగవులు తగ్గడం వల్ల వారి ఇంటిమసీ లో స్పైసీ టచ్ పోయినట్లు అనిపించింది, ఇద్దరికీ.

కార్నర్: భార్యా భరెతలు ఒకరి నొకరు ఇరుకున పెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఈ గేమ్ గురించి వచ్చే వారం చూద్దాము.

***