సివిల్స్ కొట్టాలంటే ఎలా చదవాలి?

Articles written by G K S Anirudh for Civils Aspirants

సివిల్స్ కొట్టాలంటే ఎలా చదవాలి?

సివిల్స్ కొట్టాలంటే ఎలా చదవాలి?

 (జి కె ఎస్ అనిరుధ్)

ప్రస్తుతం మన దేశంలోని యువత ఎదుర్కుంటున్న ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. మన దేశంలో ఉన్నన్ని యూనివర్శిటీలు చైనాలో తప్ప మరెక్కడ లేవు. వాటి నుంచి ప్రతి ఏటా యాభై లక్షల మంది యువతీయువకులు వివిధ రకాల గ్రాడ్యుయేషన్ లు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. వారిలో పట్టుమని ౪ శాతం కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు అంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించండి.

ఉద్యోగావకాశాలు తక్కువ ఉండడం ఒక పార్శ్వం అయితే, ఉద్యోగం చేయగల నైపుణ్యాలు ఉన్న యువత అందుబాటులో లేరు అనేది ఈ నాణానికి రెండో పార్శ్వం. ఉద్యోగాలకోసం ప్రకటన వెలువడగానే అప్లికేషన్లు వెల్లువెత్తుతాయి. పదవ తరగతి అర్హతతో ఉద్యోగం అనగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ లు కూడా అప్లై చేస్తున్నారు. ఉద్యోగం స్థాయి పెరుగుతున్న కొలదీ పోటీ తగ్గుతోంది అంటే నమ్ముతారా?

రైల్వే లో హెల్పర్ ఉద్యోగాలకు టెన్త్, ఐటిఐ ఉంటే చాలు. వాటికి కోటికి పైగా అప్లికేషన్లు వస్తాయి. అదే గ్రాడ్యుయేట్ లు మాత్రమే అప్లై చేయగల పోస్టులకు ఆ పోటీ అరవై డెబ్బై లక్షలలో ఉంటుంది. అదే ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమాలతో అప్లై చేయలి అంటే ఆ పోటీ మరికాస్త తగ్గుతుంది. అదే అయ్యేయెస్ అవడానికి యుపిఎస్‍సి నిర్వహించే సివిల్స్ పరీక్షకు పోటీ పది లక్షలకంటే తక్కువే! అప్లైచేసేవాళ్ళు అందరు ఉన్నా, రాసే వాళ్ళు అందులో సగం కూడా ఉండరు.

అంటే స్థాయి పెరుగుతూ ఉంటే అప్లై చేసేవాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అనే కదా! అది అలా ఉంచండి. ఇప్పుడూ రాష్ట్రాల వారీగా అయ్యేయెస్ లు గా సెలెక్ట్ అయ్యే వారి సంఖ్య గురించి చూస్తే ఆశ్చర్యకరమైన గణాంకాలు కనిపిస్తాయి. ౨౦౦౨ నుంచి ౨౦౧౨ వరకు అత్యధిక అభ్యర్థులు డిల్లీ నుంచి సెలెక్ట్ అయ్యేవారు. తర్వాత స్థానాలలో ఉత్తరపరదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ఉండేవి.

సివిల్స్ పరీక్షలో మౌలికమైన మార్పులు వచ్చాక ఈ గణాంకాలలో చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ టాప్ లో ఉంది. దాణి తర్వాత స్థానానికి రాజస్థాన్ దూసుకువచ్చింది. మీకు గుర్తు ఉండే ఉంటుంది, రాజస్థాన్ లోని కోటా ఐఐటి కోచింగ్ కి కేంద్రం గా ఉండేది. తర్వాత స్థానాలలోకి బీహార్, తమిళనాడు దూసుకువెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ పెద్దగా కదలికలు లేకుండాఉన్న చోటుని కాపాడుకుంటూ ఉండిపోయింది.

తెలివితేటలలో, కష్టపడే తత్వంలో మన తెలుగు వారు దేశంలోని ఇతరప్రాంతాలవారితో పోలిస్తే ఏమీ తక్కువ కాదు. అయినా యుపిఎస్‍సి నిర్వహించే సివిల్స్ పరీక్షలో ఎక్కువ స్థానాలు ఎందుకు పొందలేఖపోతున్నారు?? ఒక్కటే అనిపిస్తుంది. మనవాళ్ళాకు చిన్నతనం నుంచి ఐఐటిలో సీటు, అమెరికోలో చోటు పైన ఉన్నంతగా దృష్టి సివిల్స్ పైన లేదు అని. 

ఈ కోవిడ్౧౯ దారుణంగా మన  జీవన విధానాన్ని మార్చి వేసాక ప్రభుత్వంలో పనిచేయడం ఎంత ఛాలెంజింగ్ గానూ, ఎంత సంతృప్తి కరంగానూ ఉంటుందో మన యువత గ్రహించింది. ఇప్పుడు కోచింగ్ అంతా ఆన్‍లైన్ లోనే జరుగుతుంది కాబట్టి లక్షల ఖర్చుతో ఛలో డిల్లీ అనే కార్యక్రమాలను రద్దు చేసుకుని, అందుబాటులో ఉన్న కోచింగ్, అనుభవజ్ఞుల సలహాలతో ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని పరీక్షకు తయారయితే సివిల్స్ కొట్టడం కష్టం కాదు. మీ చేతిలోని పనే! వచ్చేవారం ఎలాంటి ప్రణాళికతో ప్రిపరేషన్ మొదలు పెట్టాలో తెలుసుకుందాము. 

***

జి కె ఎస్ అనిరుధ్ (గెట్ సివిల్స్ అకాడెమీ)