Aptavakyam-12-04-2024

Single page story in Sahari Digital Weekly. It can be read in 2 minutes

1 / 1

1.

చెల్లి కోసం

 

                బంధువుల ఇంట్లో ఫంక్షన్ అటెండ్ అయి ఇంటికి వెళ్తున్నాడు సుమంత్ తన తల్లిదండ్రులతో. ఎప్పటిలాగే అతని పక్క సీట్ లో వాళ్ళ అమ్మ మాలతి కూర్చుని ఉంది. దారిలో వరసగా కారులను పక్కకు తీస్తూ కనిపించారు పోలీసులు.

                ’ఈ డ్రంకెన్ డ్రైవింగ్ స్టాప్ చేయడానికి ఇలా ట్రాఫిక్ ఆపేస్తారు. ఏముంది... తాగి డ్రైవ్ చేస్తే వాడికే యాక్సిడెంట్ అవుతుంది, అదే పెద్ద శిక్ష కదా, పోలీసులు వీళ్ళని వదిలేస్తే సరి..’ అన్నాడు సుమంత్ ఆలస్యాన్ని భరించలేక.

                ’డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల వాళ్ళకే నష్టం కలిగితే నువ్వు అన్నట్లు ఓకే! కానీ అమాయకులకు కూడా కలగవచ్చు కదా!’ అందిమాలతి.

                ’ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి కదా!’ అన్నాడు సుమంత్ తను చెప్పేదే కరెక్ట్ అన్నట్లు.

                ’బాబూ నీకో సంఘటన గురించి చెప్తాను, విను.. అది జరిగి సరిగ్గా మూడేళ్ళు అయింది ఈ రోజుకి.’ అంది మాలతి ఆ నాటి సంఘటన తన కళ్ళ ముందు జరుగుతున్నట్లు చూస్తూ.

                ’ఆ రోజు నేను ఒక మాల్ కి వెళ్ళాను. అక్కడకి ఒక చిన్న అబ్బాయి వచ్చాడు ఒక చిన్న బాగ్ లో డబ్బులు తెచ్చుకుని. తిన్నగా రాక్స్ లో నుంచి ఒక అందమైన బొమ్మ తీసుకుని కౌంటర్ దగ్గరకు వెళ్ళి ఆ బొమ్మను, తన చేతిలో ఉన్న చిన్న బాగ్ ని అక్కడ ఉన్న సేల్స్ గాళ్ కి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఆ బాగ్ లోని డబ్బులు లెక్క పెట్టి, సరిపడా డబ్బులు లేవని చెప్పి బొమ్మ తన దగ్గర ఉంచుకుని ఆ బాగ్ ను అతనికి ఇచ్చేసింది.

                ఆ అబ్బాయి మొఖం చాలా దిగులుగా ఉంది. అతన్ని చూస్తే యాచకుడి లా అనిపించలేదు. విషయం ఏమిటో తెలుసుకుందాము అని అతని దగ్గరకు వెళ్ళి ’ఏంటి బాబూ. ఏమయింది? అని అడిగాను.

                ’ఆ బొమ్మ మా చెల్లికి గిఫ్ట్ గా ఇవ్వాలి. మా చెల్లి రెండు రోజుల క్రితం దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆమెకు పంపించాలి ఆ బొమ్మ.’ అన్నాడు.

                ఆశ్చర్యపోయాను. చనిపోయిన చిన్న చెల్లి కోసం గిఫ్ట్ పంపిస్తున్నాడా ఆ అబ్బాయి. ఎలా? ఎలా పంపగలడు?

                ’సరే ఆ బాగ్ ఇలా ఇవ్వు, డబ్బులు సరిగా ఉన్నాయో లేదో మళ్ళీ లెక్క పెడదాము.’ అన్నాను. వెంటనే తన చేతిలోని చిన్న బాగ్ నా చేతికి అందించాడు ఆ అబ్బాయి. కౌంటర్ లో అడిగి ఆ బొమ్మ ఖరీదు తెలుసుకున్నా. ఆ అబ్బాయి చూడకుండా నా దగ్గర ఉన్న డబ్బు కొంత కలిపాను. లెక్క పెట్టి చూసాను, బొమ్మ కొనగా కొంత డబ్బు మిగులుతుంది.

                ’లెక్క పెట్టాను, డబ్బులు సరిపోతాయి.’ అన్నాను నవ్వుతూ.

                ఆ అబ్బాయి మొఖం వెలిగింది ఓ క్షణం పాటు.

                ’థాంక్స్ ఆంటీ..’ అని ఆ బాగ్ తీసుకెళ్ళి కౌంటర్ లో అమ్మాయికి ఇచ్చాడు. ఆమె నా వంక ఒకసారి చూసి ఆ బాగ్ లోని డబ్బులు లెక్క పెట్టి, బొమ్మ తో పాటు, కొంత చిల్లర కూడా ఇచ్చింది.

                ఆ చిల్లర చూసి ఇంకా హేపీ అయ్యాడు ఆ అబ్బాయి.

                బొమ్మ తీసుకుని బయటకు వెళ్ళి అక్కడ ఉన్న ఫ్లవర్ షాప్ దగ్గర ఆగి వైట్ రోజెస్ కొన్నాడు తన దగ్గర మిగిలిన చిల్లరతో.

                అతని దగ్గరకు వెళ్ళి అడిగాను, ’ ఆ రోజెస్ కూడా మీ చెల్లికి ఇష్టమా?’ అని.

                ’కాదు. మా అమ్మకి ఇష్టం. మా అమ్మ కూడా దేవుడి దగ్గరకు వెళ్తుందట. ఈ బొమ్మ మా చెల్లికి ఇవ్వమని చెప్తాను. నా ఫొటో కూడా ఇస్తాను’. అని జేబులోనుంచి ఒక ఫోటో తీసాడు. దానిలో ఆ అబ్బాయి, అతని చెల్లి నవ్వుతూ కనిపించారు. నా కళ్ళు చెమర్చాయి.

                ’ఈ ఫోటో ఉంటే నా చెల్లి నన్ను మరిచిపోదు కదా!’ అన్నాడు ఆ అబ్బాయి.

                నా కన్నీళ్ళు ఆగలేదు.

                ’నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా?’ అని అడిగాను.

                ’లేదు ఆంటీ. అమ్మ ఇక్కడ పక్కనే ఉన్న హాస్పిటల్ లో ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను.’ అని పరిగెత్తాడు ఆ అబ్బాయి.

                చెప్పడం ఆపింది మాలతి. ఆమె కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు.

                ’నాకూ ఏడుపొస్తుంది అమ్మా!’ అన్నాడు సుమంత్. అతని గొంతు గద్గదంగా ఉంది.

                ’ఆ మరుసటి రోజు పేపర్లో వార్త వచ్చింది బాబూ. వెనక నుంచి ఒక కారు వచ్చి వీళ్ళ కార్ ని గుద్దుకోవడం వల్ల ఒక తల్లీ కూతురు తీవ్రంగా గాయపడ్డారని, కూతురు స్పాట్ లో చనిపోయిందని, తల్లి కూడా ఆ రోజు చనిపోయిందని, ఆ యాక్సిడెంట్ చేసిన డ్రంకెన్ డ్రైవర్ కస్టడీలో ఉన్నాడని తెలిసింది.’