ఆగంతకుడు

క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు.

ఆగంతకుడు
క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు.

క్రైమ్ స్టోరీ

ఆగంతకుడు

రచనః తిరుమలశ్రీ

***

శీతాకాలం కావడంతో రాత్రి ఎనిమిది గంటలకే వీధులన్నీ నిర్మానుష్యం అయిపోయాయి. నగరపు శివార్లలో అందమైన భవంతులు రెండు ఎదురుబొదురుగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఓ టీవీ ఛానల్ ప్రొడ్యూసరుదీ, రెండవది ఓ ప్రముఖ చిత్రకారుడిదీను.

సోడియం వేపర్ ల్యాంప్స్ ఆ ప్రాంతాన్ని పసుపురంగు వెలుతురుతో నింపేస్తున్నాయి. వాటి నీడలలో జాగ్రత్తగా నడుస్తూ ఆ భవంతులను సమీపించాడు ఓ వ్యక్తి. మనిషి పొడగరి, మీడియం బిల్టూను. వోవర్ కోటు, క్యాపూ ధరించాడు. చేతులకు గ్లవ్స్ ఉన్నాయి. ఎన్నో రోజులుగా తిండిలేనివాడిలా ముఖం పీక్కుపోయి నీరసంగా కనిపిస్తున్నాడు…ఆగి భవంతుల వంక చూసాడతను. ఒకదానిలో వెలుతురు కనిపిస్తూంటే, రెండవది చీకటి ముసుగును కప్పుకుంది.   

క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను. మెయిన్ గేటే కాక, ముఖద్వారం కూడా తెరచివుండడం ఆశ్చర్యం గొలిపింది. లోపల ప్రవేశించి, జేబులోంచి పెన్ టార్చ్ తీసి వెలిగించాడు.

విశాలమైన హాలు అది. నేలపైన పరచబడియున్న ఖరీదైన కాశ్మీరీ కార్పెట్, రోజ్ వుడ్ ఫర్నిచర్, గోడలకు ఉన్న అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్ ఆ ఇంటివారి రిచ్ టేస్టుకు అద్దంపడుతున్నాయి…పై అంతస్థులోంచి సన్నటి వెలుతురు రావడం గమనించి, చప్పుడుకాకుండా మేడమెట్లు ఎక్కాడు. పైన వరుసగా నాలుగు గదులున్నాయి. వెలుతురు చివరి గదిలోంచి వస్తోంది. టార్చ్ ని ఆఫ్ చేసి, అటువైపు నడచాడు.

ఆ గది తలుపు ఓరగా తెరచివుంది. మెల్లగా త్రోసి లోపలికి తొంగిచూసాడు. ఎసి చల్లదనం అతని ముఖానికి సోకింది. కుడిచేయి కోటు జేబులోకి వెళ్ళింది.

విశాలమైన గది అది. ట్యూబ్ లైట్స్ వెలుతురులో పట్టపగలులా ఉంది. పెయింటింగ్స్, ఆర్ట్ పేపర్, కలర్స్, బ్రష్ లు, పెన్నులు, పెన్సిల్స్, వగైరాలు చిందరవందరగా ఉన్నాయి. కాల్చి పారేసిన సిగరెట్ పీకలు నేలంతా పడున్నాయి. గది మధ్య పెద్ద డ్రాయింగ్ బోర్డ్ ఉంది. ఓ వ్యక్తి ఆ ఈజెల్ ముందు స్టూల్ మీద కూర్చుని ఏదో పెయింటింగ్ ను వేయడంలో పూర్తిగా నిమగ్నమయివున్నాడు. ఓచేతిలో బ్రష్షూ, మరో చేతిలో సిగరెట్టూతో పరిసరాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపించాడు.

ఆగంతకుడు షూతో నేలపైన చప్పుడు చేసాడు. లోపలి వ్యక్తి తన లోకంలో తాను ఉన్నాడు. ఆగంతకుడి పెదవుల పైన సన్నటి చిరునవ్వు మెరిసింది.

తలుపు దగ్గరగా మూసి వెనుదిరిగాడు. మిగతా గదులు ఒక్కొక్కటే తొంగిచూస్తూ వెళ్ళి, ఓ పెద్ద గది ముందు ఆగాడు. లోపల ప్రవేశించి లైట్ వేసాడు. బెడ్ రూమ్ అది. గోడలకున్న ప్లెజెంట్ కలర్ షేడ్స్, ఇల్లూమినేషన్, ఖరీదైన ఫర్నిషింగ్స్, ఫోమ్ బెడ్, అపురూపమైన ఆర్ట్ పీసెస్ వగైరాలతో కూడిన రిచ్ డెకొరేషన్ అబ్బురపరచింది.

అంత పెద్ద భవంతిలో ఆ ‘పిచ్చి’ ఆర్టిస్ట్ తప్ప వేరెవరూ లేరన్న విషయం అర్థమయిపోయింది అతనికి. బెడ్ ని చూడగానే రిలాక్స్ అవ్వాలనిపించింది. చేతులకున్న గ్లవ్స్ ని తీసేసి కోటు యొక్క ఎడమ జేబులో దోపుకున్నాడు. కుడి జేబులోంచి పిస్టల్ తీసి టీపాయ్ మీద పెట్టాడు. కోటు విప్పి డ్రెస్సింగ్ స్టాండ్ మీద పడేసి, క్యాప్ ని స్టాండ్ కి తగిలించాడు.

అద్దం ముందు నిలుచుని ఓసారి తన రూపం పరీక్షగా చూసుకున్నాడు. గడ్డం మాసివుంది. స్టాండ్ మీదున్న టర్కిష్ టవల్ ని అందుకుని వాష్ రూమ్ వైపు నడచాడు…సువాసనలీనే వాష్ రూమ్ లో ఉన్న ట్విన్-బ్లేడ్ జిలెట్ రేజర్ తో షేవ్ చేసుకున్నాడు. షవర్ క్రింద చన్నీటితో స్నానం చేస్తూంటే శరీరానికి, మనసుకూ హాయిగా అనిపించింది. కూనిరాగాలు తీస్తూ షవర్ క్రింద అవసరానికంటే ఎక్కువసేపే గడిపాడు. తరువాత ఒంటికి టవల్ చుట్టుకుని, డ్రయ్యర్ తో జుట్టును ఆర్చుకున్నాడు. ఒంటికి క్రీమ్స్ రాసుకున్నాడు.

వార్డ్ రోబ్ లో తనకు సరిపోయే దుస్తులకోసం చూసాడు. ఆ ఆర్టిస్టూ, తానూ ఇంచుమించు ఒకే ఒడ్డూ పొడవూలో ఉంటారు. తనకు నచ్చిన డ్రెస్ ని ఎంచుకుని తొడుక్కున్నాడు. బెడ్ మీద వెల్లకిలా పడుకుని గదంతా పరికించాడు. చూపులు ఫ్రిజ్ మీద పడడంతో ఆకలి తన్నుకువచ్చింది. చటుక్కున లేచి వెళ్ళి ఫ్రిజ్ తెరచాడు. లోపల రకరకాల వెజ్, నాన్ వెజ్ ఫాస్ట్ ఫుడ్ ఉంది. హాట్ డ్రింక్సు, సాఫ్ట్ డ్రింక్సూ ఉన్నాయి.

విస్కీ తీసి గ్లాసులో పోసుకున్నాడు. ఐస్ కలపకుండానే ఒక్క గుక్కలో దాన్ని గొంతులో పోసేసుకున్నాడు. తనకిష్టమైన నాన్ వెజ్ ఫుడ్ ని ప్లేటులో పెట్టుకుని తనివితీరా తిన్నాడు. తరువాత భుక్తాయాసంతో బెడ్ పైన నడుం వాల్చాడు.

#

నిద్రలోకి ఎప్పుడు జారుకున్నాడో, ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు…అడుగుల చప్పుడుకు ఉలికిపడి కళ్ళు తెరచాడు అతను.

గుమ్మంలో ఆర్టిస్ట్ నిలుచుని ఉన్నాడు. ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పుచేసుకుని, అపనమ్మకంగా ఆగంతకుడి వంక చూస్తున్నాడు.

ఆగంతకుడు చటుక్కున లేచి కూర్చుని, ఆర్టిస్ట్ వంక తేరిపారజూసాడు…ముప్పయ్ లలో ఉంటాడు అతను. విశాలమైన నుదురు, మెరిసే కన్నులూను. నైట్ డ్రెస్ లో ఉన్నాడు. డ్రెస్ అంతా రంగుల మరకలు. ముఖానికి కూడా అక్కడక్కడ రంగులు అంటడంతో ఫన్నీగా కనిపించాడు. పెదవుల మధ్య సిగరెట్ ఉంది.

ఇద్దరూ ఒకరినొకరు తేరిపారజూసుకున్నారు.

తన స్థితి హఠాత్తుగా గుర్తుకు రావడంతో చటుక్కున బెడ్ మీంచి క్రిందికి గెంతాడు ఆగంతకుడు. టీపాయ్ మీది పిస్టల్ అందుకుని ఆర్టిస్టుకు గురిపెట్టాడు.

ఆర్టిస్ట్ కనుబొమలు ముడివడ్డాయి. “ఎవరు నువ్వు?” అన్నాడు తీక్ష్ణంగా.

ఆగంతకుడు అదోలా నవ్వాడు. “నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది!” అన్నాడు.

ఆర్టిస్ట్ కదలబోతే, “కదలకు!” అంటూ అరచాడు. “ఇది డమ్మీ పిస్టల్ కాదు. ఇప్పటికే అరడజను ప్రాణాలు తీసింది. నువ్వు ఏడో విక్టిమ్ వి కాకు”.

ఆర్టిస్ట్ నిశ్చేష్ఠుడయ్యాడు. ఆగంతకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది అతనికి. కానీ, ఎక్కడ చూసాడో గుర్తుకు రావడంలేదు…లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆగంతకుడు ఎదురుగా కూర్చుని, పిస్టల్ ని అతనికి గురిపెట్టి వుంచాడు.

“రంగులు పులుముకున్న నీ ముఖము, దుస్తులూ చూస్తూంటే…కదులుతూన్న కళాఖండంలా ఉన్నావు!” అంటూ పెద్దగా నవ్వాడు. “నీ పరిచయ భాగ్యం కలిగించు నాకు”.

అతని హ్యూమర్ కి ఆర్టిస్ట్ పెదవులపైన చిరునవ్వు నర్తించింది. “ఫన్నీ! నా ఇంట్లో దొంగతనంగా చొరబడింది నువ్వు. నేనెవరో చెప్పుకోమంటున్నావు!” అన్నాడు. “ఓకే. నా పేరు పరంధామ్. ఓ ఆర్టిస్ట్ ని”.

“ఈ లంకంత కొంపలో నువ్వు తప్ప మరో జీవి ఉన్నట్టు కనిపించదు. నువ్వింకా పెళ్ళిచేసుకోలేదా?”

“నాకు పెళ్ళయింది”.

“మరైతే నీ భార్య ఎక్కడ?”

“హఠాత్తుగా తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి వుంటారు!”

“వాడ్డుయూ మీన్?”

మందహాసం చేసాడు పరంధామ్. “నా స్థితి ఏమిటో నువ్వే చూసావుగా? నువ్వు ఇంట్లో చొరబడడం కూడా ఎరుగను నేను. ఒకసారి ఈజెల్ ముందు కూర్చున్నానంటే నన్ను నేనే మరచిపోతాను. నాలాంటి ఆర్టిస్ట్ ని పెళ్ళాడిన ఏ స్త్రీ అయినా నిరుత్సాహంతో మనసు వికలమై పుట్టింటికి పోవడం అసహజం కాదు!” అన్నాడు.

ఆశ్చర్యంగా చూసాడు ఆగంతకుడు. “క్వైట్ ఇంటరెస్టింగ్! నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట!”  పరంధామ్ భుజాలు ఎగరేసాడు.

ఆగంతకుడు పిస్టల్ తీసి జేబులోకి త్రోస్తూ లేచి నిలుచున్నాడు. “ఐ తింక్ యూ బ్యాడ్లీ నీడ్ ఎ డ్రింక్”.

ఫ్రిజ్ తెరచి డ్రింక్స్ బయటకు తీస్తూ, “ఐస్ వేసుకుంటావా?” అనడిగాడు పరంధామ్ ని. అతను తల ఊపడంతో, విస్కీ బాటిల్ తీసి రెండు గ్లాసులలో పోసాడు. ఒకదానిలో ఐస్ క్యూబ్స్ ని వేసి, దాన్ని పరంధామ్ కి అందించాడు. తాను రెండవ గ్లాసు తీసుకుని వెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నాడు. అతని వీపు గుమ్మం వైపు వుంది. ‘చీర్స్’ చెబుతూ పరంధామ్ గ్లాస్ కి తన గ్లాస్ ని తాకించాడు. కొద్ది నిముషాలపాటు మౌనంగా డ్రింక్స్ ను సిప్ చేస్తూ ఉండిపోయారు ఇద్దరూ.

ఆగంతకుడు జేబులోంచి పిస్టల్ తీసి తొడపైన పెట్టుకున్నాడు. “నెక్స్ట్ టైమ్ నీ భార్య పుట్టింటికి వెళ్ళేటప్పుడు నాలాంటి అన్-వాంటెడ్ గెస్ట్స్ రాకుండా మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళ్ళమని చెప్పు. నాలాంటివాళ్ళకు శివార్లలో ఉన్నమీ ఇల్లు ఐడియల్లీ సూటెడ్. వాడ్డూయూ సే?” అన్నాడు.

“పెళ్ళాల పోకడ, ఆగంతకుల రాకడ ఎవరు ఊహించగలరు!?” నవ్వడానికి ప్రయత్నించాడు పరంధామ్. “నాలాంటి మ్యాడ్ ఆర్టిస్టును పెళ్ళాడినందుకు నా భార్య ఎప్పుడూ సణుక్కుంటూనే వుంటుంది”.

ఆగంతకుడి ముఖంలో రంగులు మారిపోయాయి. దవడలు బిగుసుకున్నాయి. పిస్టల్ మీద పట్టు బిగించాడు. “డామిట్! ఆడవాళ్ళందరినీ షూట్ చేసి పడెయ్యాలి! వాళ్ళందరూ ఒకటే! నిజానికి, నా ఈ దుస్థితికి కారణం ఓ ఆడదే!” ఆవేశంతో ఊగిపోయాడు.

ఆవేశంలో అతను ఎక్కడ ట్రిగ్గర్ నొక్కుతాడోనని భయం వేసింది పరంధాంకి ఓ క్షణం. ఎందుకంటే, పిస్టల్ తనకే గురిపెట్టబడివుంది. కానీ, ఆగంతకుడు త్వరగానే కోలుకున్నాడు.

పరంధామ్ సిగరెట్ వెలిగించి రెండు పీల్పులు పీల్చాడు. “ఇప్పటికైనా నువ్వెవరో తెలుసుకోవచ్చునా నేను?” అడిగాడు. “ఆర్ యూ ఎ ఫ్యూజిటివ్?”

ఆగంతకుడు తలూపాడు. “రెండు రోజుల క్రితం సెంట్రల్ జెయిల్ నుండి తప్పించుకున్న ఖైదీని నేనే” అన్నాడు. పరంధామ్ త్రుళ్ళిపడి సిగరెట్ తో మూతి కాల్చుకున్నాడు.

 “నేను ముందే చెప్పాను, నేనెవరో తెలిస్తే భయపడిచస్తావని!” వికటంగా నవ్వాడు ఆగంతకుడు.

పరంధామ్ కి హఠాత్తుగా గుర్తుకువచ్చింది, ఆ వ్యక్తిని ఎక్కడ చూసాడో…గత రెండు రోజులుగా అతని ఫొటో టీవీలోను, వార్తాపత్రికలలోనూ కనిపిస్తోంది. ‘అతని పేరు మహేష్ అనీ…డ్రెడెడ్ కిల్లర్ అనీ…ఐదు హత్యలు చేసినందుకుగాను ఉరిశిక్ష విధింపడిన అతను రెండు రోజుల క్రితం జెయిల్ గార్డును చంపి తప్పించుకున్నాడనీ... పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారనీ… ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, అతను తారసపడినట్లైతే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెలియపరచవలసిందనీ…’ నగర పోలీసులు హెచ్చరికలు జారీచేస్తున్నారు.

“ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్, మేన్? నన్ను పోలీసులకు పట్టించాలనుకుంటున్నావుకదూ? నీ తలలో బులెట్ దూరాలని ఉబలాటంగా ఉంటే తప్ప, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలేవీ చేయకు,” పిస్టల్ ఝళిపిస్తూ హెచ్చరించాడు ఆగంతకుడు.

పరంధామ్ సున్నితమనస్కుడైన ఓ కళాకారుడు. ప్రకృతి అందాలను తన కుంచెతో హృద్యంగా, రమణీయంగా మలచే ఓ చిత్రకారుడు. కరడుగట్టిన క్రిమినల్స్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు.

“ఇక్కడికి ఎందుకు వచ్చావ్? నీకేం కావాలి?” అనడిగాడు.

“నా పేరు మహేష్. నేను ప్రేమించిన యువతి నన్ను ఘోరంగా మోసం చేసింది. నన్ను హంతకుడిగా మార్చింది. ఉరిశిక్ష పడి నేను జెయిల్లో మగ్గుతూంటే తాను మరొకడితో కులుకుతోంది. నాకంత త్వరగా చావాలని లేదు. కనీసం, ఆమె మీద నా పగ తీర్చుకునేవరకైనా…అందుకే సాహసించి జెయిల్ నుండి తప్పించుకున్నాను. అప్పట్నుంచీ నిద్రాహారాలు, విశ్రాంతీ లేకుండా పోలీసులనుండి పరుగిడుతూనే వున్నాను. అనుకోకుండా ఊరి శివార్లలో ఉన్న నీ భవనం కనిపించింది. నేను దాక్కునేందుకు అనువైన ప్రదేశం ఇదేననిపిస్తోంది. పోలీసులు నాకోసం వెదకడం మానేసేంత వరకు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను…”

నో నో!” కంగారుగా అన్నాడు పరంధామ్. “నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను. మరో సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపో”.

“ఇంతకంటె సురక్షిత ప్రదేశం ఎక్కడుంటుంది! నిన్ను చంపి నీ స్థానంలో ప్రవేశిస్తాను నేను. మనిద్దరం ఇంచుమించు ఒకేలా ఉంటాం కనుక ఎవరికీ అనుమానం కలుగదు. ఎలా ఉంది ఐడియా?” వికటంగా నవ్వాడు ఆగంతకుడు.

పరంధామ్ నిర్ఘాంతపోయాడు. హఠాత్తుగా ముచ్చెమటలు పోసాయి. ‘ఆగంతకుణ్ణి ఓవర్ పవర్ చేయగలిగితే ఎంత బావుణ్ణు? ఏదో విధంగా పోలీసులకు టిపాఫ్ ఇవ్వగలిగితే…? లేదా, ఈ క్షణంలో సునీత తిరిగిరాకూడదూ?’ అనిపించింది. సునీత అతని భార్య.

ఆగంతకుడు ఆర్టిస్ట్ యొక్క ముఖకవళికలను జాగ్రత్తగా గమనించసాగాడు. “వాట్ మేన్, ఏం ఆలోచిస్తున్నావ్? పోలీసులకు టిపాఫ్ ఇవ్వాలనుకుంటున్నావు కదూ? అలాంటి దుస్సాహసానికి పూనుకున్నావంటే అంతిమ ప్రార్థనకు కూడా నోచుకోవు నువ్వు. ఐ వార్న్ యూ!” అన్నాడు కటువుగా.

పరంధామ్ జవాబివ్వలేదు. అతను టెన్స్ గా ఉండడం గమనించిన ఆగంతకుడు పరిస్థితిని తేలికపరచడానికి ప్రయత్నించాడు. “టెల్ మీ, మేన్! ఇంతటి అందమైన భవంతిని ఇలా విసిరేసినట్టుగా ఊరి చివర కట్టడంలో నీ ఉద్దేశ్యమేమిటి…అది కూడా, స్మశానానికి చేరువలో? భయంలేదూ?” చిరునవ్వుతో అడిగాడు. “నాకైతే వింత శబ్దాలంటే చచ్చేంత భయం. ఐ మీన్, స్మశానవాటికల వంటి ప్రదేశాల నుండి వస్తుంటాయే…అలాంటి వియర్డ్ సౌండ్స్ అన్నమాట. నిజం చెప్పాలంటే, చిన్నప్పట్నుంచీ ఈరీ-సౌండ్ ఫోబియా ఉంది నాకు. ఎంత ప్రయత్నించినా అది నన్ను వదలడంలేదు… నిన్ను చంపాక ఇక్కడ ఒంటరిగా వుండాలంటే కష్టమే. బట్, ఛాయిస్ లేదు కదా! ఈజ్ దేర్ ఎనీ?”

ఉన్నట్టుండి పరంధామ్ కన్నులు మెరవడం ఆగంతకుడి దృష్టిని తప్పించుకోలేదు. “వాటీజ్ దట్?” అనడిగాడు షార్ప్ గా. అప్రయత్నంగా అతని చేయి పిస్టల్ మీద బిగుసుకుంది. ఏదో అనుమానం రావడంతో స్ప్రింగులా లేచి ద్వారం వైపు పరుగెత్తాడు. బయట ఎవరూ కనిపించలేదు.

“తన నీడను చూసుకుని భయపడే వ్యక్తి అన్ని హత్యలు చేసాడంటే ఆశ్చర్యకరమే!” అన్నాడు పరంధామ్ మందహాసంతో.

తిరిగి కూర్చుంటూ ఆర్టిస్ట్ వంక గుర్రుగా చూసాడు అతను. “నిజానికి నేను భయపడేదంటూ ఉంటే…అది కేవలం నీడలకు, శబ్దాలకే, మిస్టర్! మనుషులకు కాదు…” అన్నాడు తీవ్రంగా. “నిజానికి మనిషి మరో మనిషికి భయపడడు. అతని చేతిలోని ఆయుధానికి భయపడతాడు…ఉదాహరణకు- మనిద్దరమూ ఒకే వయసువాళ్ళం. ఒకే ఫిజిక్ మనది. ఆమాటకువస్తే జెయిల్ కూడు తినీ, రెండు రోజులుగా నిద్రాహారాలు లోపించీ నీరసంగా ఉన్నాను నేను. నువ్వు తలచుకుంటే నన్ను ఓవర్ పవర్ చేయడం కష్టం కాదు. కానీ, అలాంటి ఆలోచనే కలుగదు నీకు. ఎందుకంటే నువ్వు భయపడేది నన్ను చూసి కాదు, నా చేతిలోని పిస్టల్ ని చూసి! అంటే రక్తమాంసాలుగల మనిషి కంటే, ప్రాణంలేని ఆయుధమంటేనే భయం అన్నమాట…”

హఠాత్తుగా వింత శబ్దం ఏదో వినరావడంతో ఉలిక్కిపడ్డాడతను. మాటలు ఆపి, చెవులు రిక్కించాడు. అదేమిటన్నట్టు ఆర్టిస్ట్ వంక చూసాడు. ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో అతనికీ బోధపడలేదు.

శబ్దాలు క్రమంగా అధికం కావడంతో, ఆగంతకుడి ముఖంలో రంగులు మారసాగాయి. “అవి…ఆ వియర్డ్ సౌండ్స్…ఏమిటి? ఎక్కణ్ణుంచి వస్తున్నాయి?” అన్నాడు సన్నగా కంపిస్తూన్న స్వరంతో.

పరంధామ్ జవాబిచ్చే లోపునే, కీచుమంటూ చిన్నపిల్ల ఏడ్పు వినిపించింది.

త్రుళ్లిపడి నిటారుగా కూర్చున్నాడు ఆగంతకుడు. “ఎ…ఎవరది?...మీ ఇంట్లో చంటిపిల్లలు ఉన్నారా?”

‘లేరన్నట్టు’ పరంధామ్ తల అడ్డుగా త్రిప్పాడు.

ఆ శబ్దాలు మరింత పెరగడమే కాక– ఎవరో స్త్రీ ఏడ్పు…దెయ్యాలు అరచినట్టూ…వేటకుక్కల మొరుగుళ్ళు…గుడ్లగూబల అరుపులు…నక్కల ఊళలు…క్రూరమృగాల గర్జనలు…వగైరా వింత వింత శబ్దాలు భయం గొల్పుతూ వినిపించసాగాయి.

భయంతో గుండె వేగంగా కొట్టుకుంటూంటే ఆగంతకుడిలో సన్నగా వణుకు ఆరంభమయింది.

ఏ…ఏమిటా శబ్దాలు? ఎక్కణ్ణుంచి వస్తున్నాయవి?” కళ్ళలో భయం ద్యోతకమవుతూంటే ఆర్టిస్ట్ పైన అరచాడు అతను. “అసలు ఏం జరుగుతోందిక్కడ?”  పరంధాం భుజాలు ఎగరేసాడు.

అంతవరకూ ఉండి ఉండి విడివిడిగా వివవస్తూన్న శబ్దాలన్నీ ఇప్పుడు కలగాపులగమై ఒకేసారిగా పెద్దగా వినిపిస్తూ ఆ భవనమంతా దద్దరిల్లసాగాయి. దాంతో ఆగంతకుడి భయం తారాస్థాయికి చేరుకుంది. ఒళ్ళు చల్లబడి రక్తం గడ్డకట్టడంతో, భయం భయంగా ఆ గదంతా పరికించాడు.

అదిగో, అప్పుడే పడ్డాయి అతని చూపులు – గోడమీదున్న ఆ ఫొటోగ్రాఫ్ మీద. దాన్ని చూడగానే పక్కలో బాంబ్ ప్రేలినట్టు అదిరిపడ్డాడు.

అది – పరంధామ్ ఫొటో. దానికి కర్పూరపు దండ వేయబడివుంది…!!

ఆగంతకుడి గుండె ఓ బీట్ ని మిస్ చేసింది. పాలిపోయిన వదనంతో ఆర్టిస్ట్ వంక అనుమానంగా చూస్తూ వణికే గొంతుకతో                అడిగాడు– “టెల్ మీ, హూ…హూ…ద హెల్…ఆర్…యూ…?”

పరంధామ్ నవ్వాడు. ఆ నవ్వు కృతకంగా అనిపించింది ఆగంతకుడికి.

ఆ శబ్దాలవీ ఎక్కణ్ణుంచి వస్తున్నాయో పరంధామ్ కూ తెలియదు. కానీ, ఆగంతకుడి కళ్ళలో ప్రతిఫలిస్తూన్న భీతి, క్షణక్షణమూ పెరిగిపోతూన్న భయమూ, అతని వింత ప్రవర్తనా చూస్తూంటే తమాషాగా అనిపించింది. పెద్దగా నవ్వాలనిపించింది.

పిరికితనం పెనవేసుకోగా ఆర్టిస్టునూ, గోడమీది ఫొటోనీ మార్చి మార్చి చూసాడు ఆగంతకుడు. చూసిన ప్రతిసారీ అతని గుండె మరింత వేగంగా కొట్టుకోనారంభించింది.

పరంధామ్ చిత్రంగా నవ్వుతూ కూర్చున్న చోటునుండి లేచాడు.

అదే సమయంలో శబ్దాలు మరింత ఉధృతమయ్యాయి.

దాంతో ఆగంతకుడు భయంతో నిలువెల్లా వణకనారంభించాడు. నిలద్రొక్కుకోవడానికి వృధా ప్రయత్నం చేసాడు. ఒక్కో అడుగే వెనక్కి వేస్తూ పిస్టల్ని ఆర్టిస్టుకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కడానికి ప్రయత్నించాడు. కానీ, అతని చేయి సహకరించలేదు. కంపిస్తూన్న చేతినుండి పిస్టల్ జారి క్రింద పడిపోయింది.

“నువ్వు…నువ్వు…మనిషివేనా?” అతని మాట తడబడింది.

సమాధానంగా పెద్దగా నవ్వాడు పరంధామ్.

“ఆగు! నువ్వు…మనిషివి…కాదు కదూ? ఆర్టిస్ట్ చచ్చిపోయాడు కదూ?”

జవాబివ్వలేదు పరంధామ్. చిత్రంగా నవ్వుతూ అతని వైపు అడుగులు వేసాడు. ఆ నవ్వు ఆగంతకుడి గుండెలు అవిసిపోయేలా చేసింది.

“బాబోయ్… దె..దెయ్యం…!” అంటూ భయంతో అరచి నేలపైన కూలిపోయాడు.

పరంధామ్ విస్తుపోతూ అతని పైకి వంగి పరీక్షగా చూసాడు. శ్వాస ఆడుతోందికానీ, మనిషిలో చలనంలేదు.   

శబ్దాలు ఎంత హఠాత్తుగా ఆరంభమయ్యాయో, అంత హఠాత్తుగానూ ఆగిపోయాయి!

పరంధామ్ భార్య సునీత అక్కడికి వచ్చింది. “థాంక్ గాడ్! నా ప్లాన్ ఫలించింది…” అంటూ తేలికగా నిట్టూర్చింది. ఇద్దరూ కలసి ఆగంతకుణ్ణి త్రాళ్ళతో కట్టేసారు.

జరిగిందేమిటో భార్య వివరిస్తూంటే, నోరు తెరచుకుని వింటూ వుండిపోయాడు పరంధామ్ –

‘పరంధామ్ తన పనితో బిజీగా వుంటే, తాను దర్శకత్వం వహిస్తూన్న టీవీ సీరియల్ తరువాయి ఎపిసోడ్స్ గురించి చర్చించేందుకని ఎదురింట్లో ఉన్న ఛానల్ ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళింది సునీత…ఆమె తిరిగివచ్చేసరికి ఆగంతకుడెవరో భర్తను పిస్టల్ తో బెదిరిస్తుండడం కనిపించింది. అతను తనకు వున్న ‘ఈరీ సౌండ్స్ ఫోబియా’ గురించి మాట్లాడుతూంటే ఆలకించింది. మొదట పోలీసులకు ఫోన్ చేయాలనుకుంది. కానీ, ఆగంతకుడి వద్ద పిస్టల్ ఉంది. తప్పించుకునేందుకు దానితో పరంధామ్ ని షూట్ చేయవచ్చును. ఆ ఆలోచనను విరమించుకుని, అతగాడి బలహీనతను తెలివిగా వాడుకోవాలనుకుంది. తన టీవీ సీరియల్ కోసం రెండు రోజుల క్రితం వింత ధ్వనులను, వైల్డ్ యానిమల్స్ యొక్క చిత్ర విచిత్ర శబ్దాలనూ రికార్డ్ చేసిన సీడీ ఆమె వద్దే ఉంది. దాన్ని ల్యాప్ టాప్ లో రన్ చేసి ఆగంతకుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది…’

“ఓ మై!” అన్నాడు పరంధామ్. “అదిసరేకానీ…అతను నా ఫొటో చూసి ఎందుకలా ప్రవర్తించాడు? నన్ను చూసి ఎందుకలా వణికిపోయాడు?”

ఫొటోవంక చూసిన సునీత ఫక్కుమంది… ‘ఆ రోజు సాయంత్రం కర్పూర మాలలు అమ్మివస్తే, దేవుడి కోసమని ఒకటి తీసుకుందామె. మర్నాడు పూజ సమయంలో అలంకరించవచ్చునని, బైటకు వెళ్ళే హడావుడిలో దాన్ని భర్త ఫొటో ఉన్న మేకుకు తగిలించింది. దాన్ని చూసిన ఆగంతకుడు, పోయినవారి ఫొటోకి దండ వేయడం ఆచారం కాబట్టి… ఆర్టిస్ట్ చనిపోయాడనీ, తన ఎదుట ఉన్నది అతని దెయ్యం అనీ భావించాడు. అది ఆమె నాటకాన్ని రక్తి కట్టించి, కొత్త మలుపు త్రిప్పింది…’

“మార్వెలస్!” అంటూ ఆనందంతో భార్యను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు పరంధామ్. “హేట్సాఫ్, డియర్! నీ సమయస్ఫూర్తి, తెగువ గొప్ప ప్రమాదం నుండి రక్షించాయి మనల్ని. టీవీ సీరియల్స్ డైరెక్టర్ ని భార్యగా పొందడంలో ఉన్న ఎడ్వాంటేజ్ ఏమిటో ఇప్పుడే తెలిసింది!”  దంపతులు మనసారా నవ్వుకున్నారు.

“ఈ అనుకోని అతిథిని అతిథి గృహానికి పంపొద్దూ?” అని సునీత అనడంతో, “ఓ ష్యూర్!” అంటూ మొబైల్ ఫోన్ ని అందుకున్నాడు పరంధామ్, పోలీసులకు ఫోన్ చేసేందుకు.

 

“Tirumalasree”   PVV SATYANARAYANA

Mob. 91107 36095