వీరాంజనేయ-1

This is biography of Lord Hanuman. Written by A N Jagannadha Sharma

వీరాంజనేయ-1

1. వీరాంజనేయ

 అది త్రేతాయుగం. ఆ యుగంలో ఒకనాడు శివుడూ, బ్రహ్మ, మహేంద్రాదిదేవతులుసహా మహర్షులు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీమహావిష్ణువును దర్శించారు.  

 ‘‘దేవాధిదేవా! లంకాధిపతి రావణాసురుని హింసలు భరించలేకపోతున్నాం. యజ్ఞయాగాదిక్రతువులు ఆగిపోయాయి. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో రావణుడు రెచ్చిపోతున్నాడు. అతని ఆగడాలకు అంతులేకుండాపోతోంది.’’ అన్నారు. ఆందోళనచెందారు.

 ‘‘బ్రహ్మ ఏమని వరం ఇచ్చాడు?’’ అడిగాడు విష్ణువు.

 ‘‘నరులవల్లా, వానరులవల్లా తప్ప రావణునికి మరెవరివల్లా ప్రాణహానిలేదన్నాను. ఆ వరబలంతోనే అతను దేవతలనూ, మహర్షులనూ హింసిస్తున్నాడు. ధర్మాన్ని నాశనంచేస్తున్నాడు. అతన్ని మట్టుబెట్టి లోకానికి శాంతిని నువ్వే చేకూర్చాలి లక్ష్మీరమణా! నువ్వే దిక్కు.’’ అన్నాడు బ్రహ్మ.

 ‘‘రావణుడు మహాశివభక్తుడని విన్నాను.’’ అన్నాడు విష్ణువు. శివుణ్ణి నవ్వుతూ చూశాడు.

 ‘‘భక్తుడు అయినంతమాత్రాన బరి తెగిస్తే ఎవరు భరిస్తారు బ్రహ్మనాభ? నీ ఇష్టం. నీకు నేను ఏ రకంగానూ అడ్డుకాను. అడ్డురాను.’’ అన్నాడు శివుడు.

 ‘‘సరే! మీ అందరి అభీష్టంమేరకు నేను నరునిగా జన్మిస్తాను. శ్రీరాముడు పేరిట రావణసంహారానికి ఉపక్రమిస్తాను. ఈ ఆదిశేషుడూ, ఈ శంకుచక్రాలూ నాకు సహోదరులవుతాయి. మా శ్రీమహాలక్ష్మి భూమిజగా జన్మిస్తుంది. రావణవధకు కారణమవుతుంది.’’ అన్నాడు విష్ణువు.

 ‘‘ధన్యులం దామోదరా! ధన్యులం.’’ అన్నారంతా.

 ‘‘నరునిగా నువ్వు జన్మిస్తే, ఇంద్రాదిదేవతలంతా వారివారి అంశాప్రాభవాలతో వానరులుగా జన్మిస్తారు. ఆ వానరసైన్యం నీకు బాసటగా నిలుస్తుంది.’’ అన్నాడు బ్రహ్మ.

 ‘‘అవునుదేవా! అసురసంహరణార్థం మేమంతా వానరులుగా జన్మిస్తాం. మా శౌర్యప్రతాపాలతో నీకు అండగా నిలుస్తాం.’’ అన్నాడు ఇంద్రుడు.

 ‘‘బాగానే ఉందిగాని, మహాశివభక్తుడు, బ్రహ్మజ్ఞాని, మహాతపస్సంపన్నుడు రావణబ్రహ్మను సంహరించాలంటే దైవాంశసంభూతుడైన గొప్పవానరుడు ఇంకొకడు కావాలి. అతను మహాబలసంపన్నుడై ఉండాలి.’’ అన్నాడు విష్ణువు. శివుణ్ణి నవ్వుతూ చూశాడు. అర్థమైందన్నట్టుగా సన్నగా తలూపాడు శివుడు.  

 ‘‘నాకోసం జన్మించిన ఆ వానరప్రముఖుడు, నా అవతారనామం ‘రామనామం’ స్మరిస్తూ, ఆశ్రితభక్తరక్షకుడు అవుతాడు. రామబంటుగా నిలుస్తాడు.’’ అన్నాడు విష్ణువు. అతనిమాట పూర్తికానేలేదు. వైకుంఠం అంతా రామనామం మారుమ్రోగింది. ఆ నామానికి పరవశులయ్యారంతా.

 కొన్నాళ్ళు గడిచాయి.

 సుపర్వగిరిమీద కేసరి అని ఓ గొప్ప వానరుడు ఉండగా, అతన్ని సేవిస్తూ అరవైవేలమంది వానరులు నివసించసాగారక్కడ. వారంతా కేసరిని తమ నాయకుడు అని ప్రకటించారు.    

 శంఖమూ, శబలమూ అని రెండు ఏనుగులు ఉండేవి. అవి ప్రభాసతీర్థంలోని మునులను బాధిస్తూ ఉండేవి. వాటిని మట్టుపెట్టాడు కేసరి. ఆ కారణంగా అతన్ని ‘కేసరి’ అన్నారు. కేసరి అంటే సింహం అని అర్థం. బలవంతుడూ, భాగ్యవంతుడూ అయినా పెళ్ళిచేసుకోలేదు కేసరి. బ్రహ్మచర్యం అవలంబించి, గొప్పతపస్సుచేశాడు. అనేకశక్తులు సాధించాడు.

 ఆకాలంలోనే శంబసాధనుడు అని ఓ రాక్షసుడు ఉండేవాడు. అతను ఘోరతపస్సు  చేసి, బ్రహ్మను మెప్పించాడు. ముల్లోకాలనూ జయించేటట్టు వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో దేవతలనూ, మునులనూ హింసించసాగాడు. బ్రహ్మచేసిన పనికి తలలు పట్టుకుని, అతన్ని సమీపించారు దేవతలు. శంబసాధనుడు పెట్టే బాధలు భరించలేకపోతున్నామన్నారు.

 ‘‘నువ్వే ఏదో దారి చూపించు.’’ అని వేడుకున్నారు.

 ‘‘వెళ్ళి కేసరిని కలవండి. సమస్యకు పరిష్కారం లభిస్తుంది.’’ అని చెప్పాడు బ్రహ్మ. మునులుసహావచ్చి కేసరిని కలిశారు దేవతులు. అతన్ని ఆశీర్వదించి, అసలు విషయం విన్నవించారు. శంబసాధునుణ్ణి భరించలేకపోతున్నామన్నారు.

 ‘‘ఆ దుర్మార్గుని మదమడచి, నువ్వే మమ్మల్ని కాపాడాలి.’’ అన్నారు.

 ‘‘తప్పకుండా’’ అన్నాడు కేసరి.

 దేవతలూ, మునులూ వేడుకుంటే కేసరి అనే కోతి తనని సంహరించేందుకు సిద్ధమైందని తెలుసుకున్నాడు శంబసాధనుడు. దాని అంతు చూస్తానన్నాడు. పెద్దకత్తి ఒకటి చేతపట్టి సరాసరి కేసరిని సమీపించాడు. అసరికింకా దేవతలూ,మునులూ కేసిరి దగ్గరే ఉన్నారు. ఊహించలేదు ఈ పరిణామాన్ని.  శంబసాధనుణ్ణించి తప్పించుకునేందుకు వారంతా కేకలు వేసుకుంటూ అడవుల్లోకి పారిపోయారు. కొందరు గుహల్లో దాగారు.  

 ‘‘దాగుంటే దొరక్కపోరు. రండ్రా! బయటకు రండి.’’ అన్నాడు శంబసాధనుడు. గుహల్లో దాగున్న మునుల గడ్డాలనూ, దేవతల జుత్తునూపట్టి ఇవతలకి లాగసాగాడు. రాక, రాలేక బాధగా వారు కేకలువేస్తోంటే విని తట్టుకోలేకపోయాడు కేసరి. వెళ్ళి శంబసాధనుణ్ణి అడ్డుకున్నాడు.

 ‘‘చూపిస్తే నీ పౌరుషప్రతాపాలు నా మీద చూపించ. దమ్ముంటే నాతో యుద్ధానికి  రా.’’ అన్నాడు.

 ‘‘నీతోయుద్ధమా! చీఛీ! కోతులతో నేను యుద్ధంచెయ్యను.’’ అన్నాడు శంబసాధనుడు.

 ‘‘మరి నన్ను చంపడానికేగా ఇంత దూరంవచ్చావు. నాకంతా తెలుసు. రా! చంపు.’’ అన్నాడు కేసిరి.

 ‘‘అయితే చూసుకో.’’ అన్నాడు శంబసాధనుడు. కేసరిపైకి కత్తి ఎత్తాడు. ఎత్తిన కత్తిని అందుకున్నాడు కేసరి. మోకాలుమీదపెట్టి దానిని రెండుముక్కలు చేశాడు.

గట్టిగా పిడికిలి బిగించి, ఆ పిడికిలితో రాక్షసుడి రొమ్ముమీద ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు శంబసాధనుడు అల్లంతదూరం వెళ్లిపడ్డాడు. తేరుకుని లేచాడు. కేసరిమీదికి  పరుగునవచ్చాడు. ఈసారివాణ్ణి తోకతోకొట్టాడు కేసరి. ఆ దెబ్బకి గింగిరాలు తిరిగాడు రాక్షసుడు. కాసేపటికి నిలదొక్కుకుని మళ్ళీ కేసరిని ఎదిరించాడు.

 ‘‘ఈ దెబ్బతో నువ్వు సరి’’ అన్నాడు కేసరి. రెండుచేతులూ పిడికిలిచేసి, దానితో వాడి నెత్తిన ఒక్కపెట్టుపెట్టాడు. ఆ పెట్టుకి నెత్తురుకక్కుకుని మరణించాడు రాక్షసుడు.

 శంబసాధనుడు మరణించాడని తెలియగానే దేవతలూ, మునులూ కేసరిని పరుగున సమీపించారు. అతన్ని వేనోళ్ళ పొగిడారు.

 ‘‘ఇంకా ఎంత కాలం ఈ బ్రహ్మచర్యం? హాయిగా పెళ్ళిచేసుకుని సుఖించు.’’ అంటూ హెచ్చరించి, వెళ్ళిపోయారు. వారు హెచ్చరించినమీదట కేసరికి పెళ్లిచేసుకోవాలనిపించింది. మంచికన్యకోసం చూడసాగాడు.

 అందమైన కన్యను సృష్టించాడు బ్రహ్మ. ఆమెకు అహల్య అని నామకరణం చేశాడు. కొన్నాళ్ళకు ఆమెను గౌతమునికి ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ పుట్టిందే అంజన.

 గతజన్మలో అంజన ఓ విద్యాధరుని కూతురు. అప్పుడామె గొప్పగాయకురాలు. ఆ కారణంగా ఆమెను ‘సుకంఠి’ అని వ్యవహరించారంతా. చెలికత్తెలతో కలసి సుకంఠి హిమాలయాలకు చేరుకుంది ఓనాడు. అక్కడి సరోవరంలో తనివితీరా స్నానంచేసింది. స్నానంచేసి ఒడ్డుకుచేరుకుని, అర్ధనగ్నంగా ఓ చెట్టునీడన నిల్చుంది. అదేసమయంలో అటుగా పోతున్నాడు అగ్నిహోత్రుడు. అతన్నిచూసి నవ్విందామె. ఆ నవ్వుకి కోపగించాడు అగ్నిహోత్రుడు.

 ‘‘వచ్చేజన్మలో ఓ వానరుడికి తల్లివికా.’’ అని శపించాడు.

 కుంజరుడు అని ఓ వానరుడు, సంతానంకోసం శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమయ్యాడు శివుడు.

 ‘‘కుంజరా! నీకు కొడుకులుపుట్టే యోగంలేదు. కాకపోతే ఓ కూతురు దొరుకుతుంది. ఆ పిల్లను పెంచి పెద్దచెయ్యి. ఆమెకు నా అంశన ఓ కొడుకు జన్మిస్తాడు. అతడు మహానుభావుడై నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు.’’ అన్నాడు శివుడు. అదృశ్యమయ్యాడు.

 కూతురుకోసం కుంజరుడు ఎదురుచూడసాగాడు. ఒకనాడు గౌతముడు సమీపించాడతన్ని. అంజనను అతనికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు. శివునివరం అలా ఫలించడంతో కుంజరుని ఆనందానికి అంతులేకుండాపోయింది.

 కుంజరుని భార్యపేరు వింధ్యావళి. వారిద్దరినీ తల్లిదండ్రులుగా స్వీకరించింది అంజన. పెరిగి పెద్దదయింది. యుక్తవయస్కురాలయింది. ఆమెకు పెళ్ళిచేయతలపెట్టాడు తండ్రి.

 అంజనగురించి విన్నాడు కేసరి. ఆమె అందాన్ని కనులారాచూడాలనీ, ఆమె పాటవినాలనీ తహతహలాడాడు. బయల్దేరివచ్చాడు. అంజన అప్పుడు వనవిహారం చేస్తోంది. చాటుగా చూశాడామెను కేసరి. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అందగత్తెనే చేసుకోవాలనుకున్నాడు. చాటుగా ఉన్న కేసరిని అంజనకూడా చూసింది. మనసులోనే మెచ్చుకున్నదతన్ని. ఇతగాడు నాకు భర్తయితే బాగుణ్ణనుకున్నది.

 సుపర్వగిరికి తిరిగివచ్చాడు కేసరి. మంత్రులనూ, పెద్దలనూ సమావేశపరిచాడు. అంజనగురించి తెలియజేశాడు వారికి.

 ‘‘పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్ళిచేసుకోవాలని ఉంది.’’ అన్నాడు.

 ‘‘ఆమెనే ఇచ్చి నీ పెళ్ళిచేస్తాం. కాదూ కూడదంటే కుంజరుని అంతుచూస్తాం.’’ అన్నారు పెద్దలు. వెళ్ళి కుంజరుని కలిశారు. కేసరి కోరిక అతనికి తెలియజేశారు. అందుకు ఎంతగానో ఆనందించాడు కుంజరుడు.

 ‘‘కేసరిలాంటివాడు అల్లుడవుతానంటే కాదంటానా?’’ అన్నాడు. కొద్దిరోజుల్లోనే కేసరికీ, అంజనకీ వివాహం చేశాడు.

 పెళ్ళయి చాలా కాలం అయినా అంజనకు సంతానం కలగలేదు. సంతానంకోసం ఆమె చేయని వ్రతంలేదు. నోచనినోములేదు. ఆఖరికి సంతానంకోసం వాయుదేవునిగురించి తపస్సు చేసేందుకు సిద్ధమయిందామె. భర్త అనుమతి కోరింది. కాదనలేదు కేసరి. పుంజకస్థలం అని ఓ ప్రదేశం చూపించి, అక్కడ తపస్సు ప్రారంభించమాన్నాడామెను. భర్త చెప్పినట్టుగానే ఆ స్థలంలోనే అంజన తపస్సు ప్రారంభించింది. వాయుదేవుణ్ణి ప్రార్థించసాగింది.

 అంజన ప్రార్థన ఫలించింది. వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎన్నోరోజులుగా తాను మోస్తున్న శివునితేజాన్ని ఒక పండురూపంలో అంజనకు ప్రసాదించాడు.

 ‘‘ఈ పండు స్వీకరించు. నీకు సంతానంకలుగుతుంది.’’ అన్నాడు. అదృశ్యమయ్యాడు. వాయుదేవుడు ఇచ్చిన పండును కళ్లకద్దుకున్నది అంజన. తిన్నది. వాయుదేవుడు చెప్పినట్టుగానే గర్భవతి అయింది. అయితే రోజురోజుకీ గర్భం పెరగడం చూసి ఆందోళన చెందింది. చాలాకాలంగా తాను ఒంటరిగా ఉన్నదిక్కడ. తపస్సు  చేసుకుంటూ ఉంది. గర్భందాల్చడం ఎలా సాధ్యం? రేపు పెద్దలు వేలెత్తిచూపుతారేమోనని భయపడింది. ఆమె భయాన్ని పోగొడుతూ ఆకాశవాణి పలికిందిలా.

 ‘‘అంజనా! ఒకప్పుడు శివుడు వానరరూపందాల్చి, తన తేజస్సును వాయుదేవునికి ఇచ్చాడు. దానినే ఇప్పుడు వాయుదేవుడు నీకు పండుగా ఇచ్చాడు. దానిని నువ్వు స్వీకరించిన కారణంగా సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పిల్లాడిగా పెరుగుతున్నాడు.’’

 ఆకాశవాణిమాటలకు ఆనందించింది అంజన. శివుణ్ణి తలచుకుని చేతులుజోడించింది. నమస్కరించింది.  

 ‘‘సంతానంకోసం నువ్వు వాయుదేవునిగురించి తపస్సుచేసినకారణంగానూ, నీకు సంతానం కలిగేందుకు వాయుదేవుడు సహాయపడిన కారణంగానూ రేపు నీకు పుట్టబోయే కొడుకును అంతా ‘వాయునందనుడు’ గా పేర్కొంటారు. పెరిగి పెద్దవాడయి అతను ముల్లోకాలలోనూ కీర్తిప్రతిష్టలు ఆర్జిస్తాడు.’’ అన్నది ఆకాశవాణి.

 స్థిమితపడింది అంజన. అంతలో అక్కడ వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు.-

 ‘‘ఆకాశవాణి చెప్పిందంతా నిజం. నువ్వు జరిగిందంతా నీ భర్తకు చెప్పు. అంతా సజావుగాసాగిపోతుంది.’’ అన్నాడు. సరేనన్నది అంజన. తిరిగివచ్చింది. భర్తకేసరికి జరిగిందంతా చెప్పింది.

 ‘‘అంతా దైవలీల’’ అన్నాడు కేసరి. అంజనను అభిమానంగా దగ్గరగా తీసుకున్నాడు.

 ఓ సంవత్సరం గడిచింది. అంజన ప్రసవించింది. ఆకాశవాణి చెప్పినట్టుగా కొడుకే  పుట్టాడామెకు. అప్పుడు దేవదుందుభులు మోగాయి. పుష్పవర్షం కురిసింది. ఆకాశంలో అప్సరసలు నాట్యంచేశారు. సుపర్వగిరివాసులంతా చూశారది. పొంగిపోయారు. కేసరికి అభినందనలు తెలియజేశారు. అనేకకానుకలు చెల్లించి అతన్ని ఆనందింపజేశారు. ప్రతిఫలంగా కేసరికూడా వారికి పళ్ళూ, పలహారాలూ, తాగేందుకు సురనూ అందించి సంతోషించాడు. పండుగచేసుకున్నారంతా.

-జగన్నాథశర్మ