తన మనము తోడైతే

"నీకిప్పుడేం కావాలి" అనునయంగా అడిగాడు స్వరూప్. "నేనింకా కొన్నాళ్లు కన్యగానే ఉండాలి" దృఢంగా చెప్పింది తన్మయి. "ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకుని ముడుచుకు కూర్చోవడం ఎలా?" మనసులో అనుకుంటున్నది బయటికే అనేశాడు స్వరూప్. "అది మీ సమస్య" తేల్చి చెప్పింది తన్మయి.

తన మనము తోడైతే

తన మనము తోడైతే..

                 రచయిత :శాంతారాం సూరపు

 

   "నీకిప్పుడేం కావాలి" అనునయంగా అడిగాడు స్వరూప్.

   "నేనింకా కొన్నాళ్లు కన్యగానే ఉండాలి" దృఢంగా చెప్పింది తన్మయి. 

   "ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకుని ముడుచుకు కూర్చోవడం ఎలా?" మనసులో అనుకుంటున్నది బయటికే అనేశాడు స్వరూప్. 

   "అది మీ సమస్య" తేల్చి చెప్పింది తన్మయి. 

   "సరే.." లోపల అలజడిగా ఉన్నా బయటికి ఒప్పుకున్నట్టుగా అన్నాడు స్వరూప్. 

   "పిజి చేస్తూ విద్యార్థి జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలి" మరో పేచీ పెట్టింది తన్మయి. 

   "స్వేచ్ఛగా అంటే అందులో మగ స్నేహితులు కూడా ఉంటారా?" అనుమానం వ్యక్తం చేశాడు స్వరూప్. 

   "చెప్పలేను" భుజాలు ఎగరేసింది తన్మయి. కొన్నాళ్లు కన్యగా ఉండటం ఆమె అభిమతం కాబట్టి మగ స్నేహితులు ఉన్నా అనుమానించే పనిలేదని "స్సరే.." దానికీ తలూపాడు స్వరూప్. 

   నాది సాఫ్ట్ వేర్ ఫీల్డ్ కాబట్టి ఆఫర్ వస్తే యు ఎస్ వెళ్ళాలి" తన్మయి అంటుండగా "నాన్సెన్స్" ఒక్కసారి చిర్రెత్తుకొచ్చి కోప్పడిపోయాడు స్వరూప్. 

   "కాదని నా కెరీర్ అడ్డుకోవాలని చూస్తే అందాన్ని కాపాడుకోవడం కష్టం కానీ పాడుచేసుకోవటం సులువు. తినకో తిని కూర్చునో.. అది పూర్తిగా నా చేతిలోని పని. బయటవారి జోక్యానికి లొంగనిది" హెచ్చరింపుగా అంది తన్మయి. 

   అతడికి భవిష్యత్తు అర్థమైపోయింది. ఆమె కోరినదాన్ని ఒప్పుకోవడం మించి అతడికి మరో దారి లేదు. అతడికి అందం కావాలి. ఆమెకి అందలం కావాలి. అనుబంధం గూర్చిన ఆలోచన ఇద్దరిలో కొరవడటమే ఈ అనర్దానికి కారణం. ఆమెను దాటి వెళ్లలేడు. ఆమె ధాటిని అడ్డుకోలేడు. నిస్సహాయుడైపోయాడు స్వరూప్. 

   ఆమె ఇష్టాన్ని తెలుసుకోకుండా తన ఇష్టానికి ప్రవర్తించి తప్పు చేశాడని అనుకున్నాడు. శోభనం గదిలోంచి బాల్కనీ వేపు నడుస్తూ తన్మయితో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు. 

 

   ఆ అమ్మాయిని ఐమాక్స్ దగ్గర చూసాడు స్వరూప్. 'అ ఆ' సినిమా చూసి సమంతాని గుర్తు చేసుకుంటుండగా సమంతాని తలపించే అందం అతడి కళ్ళకి తళుక్కున తగిలింది. ఆ అమ్మాయిని చూస్తుంటే, కోకిల కూసినట్టు ఆమని పూసినట్టు ఆహ్లాదంగా అనిపించింది. 

   సరిగ్గా అలాంటి అమ్మాయి కోసమే అతడు కలలు కంటూ అన్వేషణ సాగిస్తున్నాడు. కలలు కనటం అతడి ప్రవృత్తి. ఆ కలల్ని కళగా మలచి సొమ్ము చేసుకోవటం అతడి వృత్తి. అతడో యాడ్ ఫిల్మ్ మేకర్. పరిచయస్తులు కొందరు 'కలల బేహారి' అనటం పరిపాటి. అయితే అలాంటి అమ్మాయి కోసం కంటున్న కల మాత్రం పెళ్లి కోసం. 

   అప్పటికి అతడి కోసం అమ్మాయిల్ని చూడటంలో ఇంట్లోవాళ్ళు శతకం దాటి అతడితో అర్ధశతకం కొట్టించారు. ఎక్కడా స్థిరపడలేక పోయాడు. ఎంతో వెతికిన మీదట ఇంత సారూప్యంతో అతడి కలలరాణి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు. 

   ఆ అమ్మాయి స్నేహితులతో వచ్చినట్టుంది. వాళ్లంతా నిష్క్రమణ ద్వారం దాటి వెళ్లబోతుండగా వడి వడిగా అటు అడుగులేశాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వాహనాల కోసం నడవగా మరో ఇద్దరు అమ్మాయిలతో వసారా దగ్గర నిలబడి నిరీక్షణ చేస్తోంది ఆ అమ్మాయి. 

   "క్షమించాలి" దగ్గరకెళ్లి పలకరించాడు. అమ్మాయిలు ముగ్గురు అతడి వైపు చూశారు. పరిచయం లేని ముఖం అనిపించి భృకుటి ముడిచారు.  

   "మీ ఇంటి చిరునామా లేదా మీ నాన్నగారి మొబైల్ నంబర్ ఇస్తారా" తన కలలరాణిని ఉద్దేశించాడు. ఆ మాట ఉహించని ఆ రాణితో పాటు మిగిలిన ఇద్దరు బిత్తరపోయి ఒకరినొకరు చూసుకున్నారు. 

   "ఇదేం కాలేజీ ఎగ్గొట్టి రాలేదు. ఇంట్లో చెప్పే వచ్చింది. ఈ విషయం మోద్దాం అనుకుంటే మోసపోతారు" వాళ్లలో ఓ గడుగ్గాయి ఎద్దేవా చేసింది.  

   "అయ్యయ్యో..అందుక్కాదు, పనుంది" గాబరా పడ్డాడు స్వరూప్. 

   "ఇది కాలేజీకి వచ్చిపోయే దరిమిలా దారికాసి బీటు కొడతారా" అడిగింది గడుగ్గాయి. 

   "మరీ రోమియోలా అనిపిస్తున్నానా.." నవ్వాడు స్వరూప్. 

   "అంతలేదు లెండి. ఇంటికెళ్లి సెంటు పూసేలా ఉన్నారు" ప్రక్కన మరో అమ్మాయి అంది. 

   "సెంటంటే..?" అర్థంకాక అడిగాడు స్వరూప్. 

   "వాళ్ల చెల్లినో తమ్ముడినో మచ్చిక చేసుకుని వలపు రాయబారాలు నడపబోతారని" అంది ఆ మరో అమ్మాయి. 

   "మీరన్నట్టు రాయబారం కోసమే.. కానీ, వలపు రాయబారం కాదు" చెప్పాడు స్వరూప్. 

   "మరి పలుపు రాయబారమా" అడిగింది గడుగ్గాయి. 

   "పలుపు రాయబారం ఏమిటి?" మళ్ళీ అర్థంకాక అడిగాడు స్వరూప్. అమ్మాయిలు అతడిని మోసేస్తున్నారని అర్ధమైంది. సాయం కోసం తన కలలరాణి వైపు చూశాడు. ఆ సంభాషణకి ఆనందిస్తున్నట్టుంది. నవ్వు దాచుకుంటూ నిల్చుంది. 

   "దీని మెడలో పలుపుతాడు అదే పసుపుతాడు కట్టి, దొడ్లో అదే బెడ్లో కూలెయ్యబోతారని.." అంటుండగా మిగతా అమ్మాయిలు వాహనాలతో వచ్చారు. ఆ ముగ్గురు వెనుక ఈ ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. 

   "పని చూసుకోండి" వెళ్తూ వెక్కిరించింది గడుగ్గాయి. తన కలలరాణి ఎక్కి కూర్చున్న నలుపు తెలుపు స్కూటీ పెప్ నంబర్ గుర్తు పెట్టుకున్నాడు స్వరూప్. 

 

ఆ నంబరుతో నమోదు చేయబడ్డ విలసాన్ని అంతర్జాలంలో పట్టుకొని ఓ విల్లా ముందు కారు ఆపాడు స్వరూప్. లాన్లో కూర్చున్న ఓ పెద్దమనిషి కనిపించి అటు నడిచాడు. ఆయన కూర్చోమన్నట్టు కుర్చీ చూపించి పనేమిటన్నట్టు చూశాడు. వచ్చిన విషయం విన్నవించి స్కూటీ వైపు చూపాడు స్వరూప్. 

   పెద్దాయన ఒడిలో ఉన్న కుక్కపిల్లకి ఏదో చెప్పాడు. ఆ కుక్కపిల్ల ఇంట్లోకెళ్లి ఓ అడపిల్లని వెంటేసుకుని వచ్చింది. ఆ పిల్ల దగ్గర తన జవరాలు వివరాలు తెలుసుకొని బయటపడ్డాడు స్వరూప్. 

   

   'తన్మయి..తన్మయత్వంలో పడేసే తనువుకి తగిన పేరు..' అనుకున్నాడు. మూడునెలల బిడ్డప్పుడే మూడేడుల వయసప్పటి రూపాన్ని ఊహించి యోగ్యమైన పేరు పెట్టిన కామా (కాబోయే మామగారు) కాళ్లపై సాష్టాంగ పడినా తప్పు లేదనిపించి ఆ ఇంట్లో అడుగుపెడుతూ మొదటిగా అదే చేశాడు. 

   అలా కాళ్లపై పడ్డ స్వరూప్ ని చూసి కామా కలవరపడ్డాడు. ఆ కలవరపాటు అణచుకుంటూ విషయం వాకబు చెయ్యబోగా, "తన్మయి" ఉపోద్ఘాతంగా అన్నాడు స్వరూప్. 

   "మా అమ్మాయే" చెప్పాడు కామా. 

   "నే వచ్చిన విషయం విన్నవించుకుంటాను" విషయంలోకి వచ్చాడు స్వరూప్. 

   "అక్కర్లేదు. అమ్మాయిని ఇష్టపడుతున్నారు. అంతేనా.." అడిగాడు కామా. 

   "అంతేనా అంటే, కష్టపడుతున్నాను కూడా" చెప్పాడు స్వరూప్. 

   "కష్టపెడుతున్నారు కూడా" నిష్టూరంగా అన్నాడు కామా. 

   "అర్ధం కాలేదు" చెప్పాడు స్వరూప్. 

   "ఎవరో ఏమిటో కులం గోత్రం, మంచి చెడు తెలియకుండా అమ్మాయిని అన్యాక్రాంతం చెయ్యటం అంటే.." ఆగాడు కామా. 

   "అలా అనకండి. మీరు కన్యాదానం చేస్తే, ఈ దీనుడి జీవితం ధన్యమౌతుంది" వేడుకోలుగా అన్నాడు స్వరూప్. 

   "నేనూ నా కుటుంబం అన్యాయం అయిపోతామే" అభ్యంతరం చెప్పాడు కామా. 

   "మళ్లీ అర్ధం కాలేదు" అర్ధింపుగా అన్నాడు స్వరూప్. 

   "ఏ పట్టింపులూ లేకుండా మీ దర్జా హోదా చూసి పిల్లనిచ్చేస్తే రేపు పలువురికీ ఏం సమాధానం చెప్పుకోవాలి" తన ఇబ్బంది చెప్పాడు కామా. 

   "అంత కాని పని ఏంచేస్తున్నారు. దానాలలో గొప్పదైన కన్యాదానం చేస్తున్నారు" ఏదో చెప్పబోతున్న స్వరూప్ ని అడ్డుకుంటూ, "కాసునైనా అడిగే వాళ్లందరికీ దానం చేస్తామా. మన అభీష్టం మేరకే కదా. అలాంటిది మరి కన్యని.." అర్ధోక్తిగా ఆగాడు కామా. స్వరుప్ ముఖం జేవురించింది. "కోరి వచ్చానని అలుసుగా అనుకుంటున్నారులా ఉంది" ఉక్రోషాన్ని ఉగ్గబట్టుకుంటూ అన్నాడు. 

   "మా స్థితిగతులు చూసి మీరూ అలుసుగా తీసుకున్నారని నేనంటే..? నచ్చటం పర్లేదు ఆశ. ఇచ్చెయ్యమనటం దురాశ. కొంతవరకూ అర్ధం చేసుకోవచ్చు. 'ఎందుకివ్వరు?' అనుకోవటం అహం. మీలో నేను చూసింది అదే. నాకు నచ్చలేదు" ముసుగులో గుద్దులాట లేకుండా సూటిగా చెప్పాడు కామా. 

   "అది అహం కాదండీ, మోహం. ఆశ పడ్డది దక్కించుకోవాలనే ఆశయం. కట్నకానుకలేం కోరను. కట్టుబట్టలతో పంపించండి. మీరు నా కాళ్లు కడగడం కాదు, అంతటి అందాన్ని కన్న మీ దంపతుల అడుగులకు మడుగులొత్తి నా ఋణం తీర్చుకుంటాను" సావధానంగా చెప్పాడు స్వరూప్. 

   "మడుగులొత్తి మెడలు వంచొద్దులే బాబూ. మమ్మల్ని పరువుగా తలెత్తుకుని బ్రతకనియ్యి" మరో మాట లేనట్టు లేచాడు కామా. 

   

   'మడుగులొత్తొద్దు అన్నప్పుడు ఆ మడుగులోనే దించి కాళ్ల బేరానికి తేవడం తప్పు కాదు' అనుకున్నాడు స్వరూప్. 'సామ భేద దానాలయ్యాక దండోపాయం ఒక్కటే ఇక మిగిలింది. దండంతో కానిది దండనతో నెరవేర్చుకోవాలి, తప్పదు' ఓ నిర్ణయానికి వచ్చాడు స్వరూప్. 

    చిన్న నాటకమాడి కామాని లంచగొండిగా చిత్రించి అవినీతి నిరోధక శాఖతో పట్టించటంతో మొదటి పావు కదిపాడు. కామా జీతం పైనే ఆధారపడ్డ ఆ కుటుంబానికి ఆ లోటు భర్తీ చేస్తూ రెండో పావు కదిపాడు. అతడి సాయాన్ని వద్దనుకున్నా వద్దనలేని పరిస్థితులు ఆ కుటుంబాన్ని నిస్సహాయంగా నిలిపి అతడికి కొంత సహాయంగా మారాయి. 

   ఆ విధంగా ఆ అమ్మాయెవరో అన్నట్టు తన కలలరాణి చెల్లెలు తమ్ముడే కాకుండా ఇంటిల్లిపాదిని మచ్చిక చేసుకొని పావులుగా కదిపి కామాకి చెక్ చెప్పాడు. శుభస్య శీఘ్రం అనిపించుకొన్నాక కామాని ఆ కేసు నుండి తప్పించి ఉద్యోగం వాపసు వచ్చేలా సిఫారసు చేశాడు. 

   అయితే అదంతా వ్యూహాత్మకంగా చేసినట్టు కాకుండా వీధిన పడ్డ ఆ కుటుంబాన్ని ఆదుకోటానికి ఉదారంగా చేసినట్టు కలరిచ్చాడు. వాళ్లకి ఆ కర్మ పట్టడానికి కర్త అయిన తనే ఆ సహాయ క్రియ చేపట్టినట్టుగా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. 

   కానీ, అది లీక్ అవ్వాల్సిన చోట అయ్యిందని అప్పటికి తెలుసుకోలేకపోయాడు. 

 

   లాస్ ఏంజిలిస్.. వేకువజాము మూడు గంటలు. విమానం దిగి విజిటర్స్ లాంజ్ లోకి వచ్చి కూర్చున్నాడు స్వరూప్. అతడు తన ఏంజెల్ ని మిస్ చేసుకున్నది అక్కడే. తన్మయి అక్కడికి వచ్చి మూడేళ్లు అవుతుంది. ఏదైనా పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలి అన్నట్టు అతడే ఏడాదికి ఒకటి రెండు సార్లు తన్మయి దగ్గరికి వచ్చి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. అప్పుడు అందం కోసం తిరిగాడు. ఇప్పుడు అనుబంధం కోసం తిరుగుతున్నాడు. అందలం కోసం పరుగెత్తుతున్న ఆమెకు అనుబంధం గూర్చిన తలపు కలిగే దాకా నిరీక్షిస్తున్నాడు. 

   అయితే ఆమె అందలం కోసం పరిగెత్తలేదని తనకి అందకుండా తప్పించుకు వెళ్లిందని ఈ మధ్యే అవగాహనకు వచ్చాడు. అదెందుకో ఇదమిద్దంగా అర్ధం చేసుకుని ఆ దిశగా పావులు కదపటానికి సిద్ధమై వచ్చాడు. 

   మరో రెండు గంటలు కాలక్షేపం చేసి వెలుగొచ్చాక తన్మయి ఉండే చోటుకి వెళ్ళాలి. ఒంటరితనం పోగొట్టుకుందుకు మొబైల్లో మ్యూజిక్ పెట్టబోతే, భూపాల రాగంతో ఆ చీకటేల పొద్దు పొడిచినట్టు అతడి కళ్లు మెరిశాయి. 

   'ఈ మూడేళ్లలో లేనిది' అనుకుంటూ లేచి రెండడుగులు ముందుకు వేశాడు. 

   తన్మయి అతడిని దాటి వెళ్లి తండ్రి కాళ్లకి నమస్కరించింది. స్వరూప్ ఆలస్యం చెయ్యలేదు. అమాంతం కామా కాళ్లపై సాష్టాంగ పడిపోయాడు. లాంజ్ లోని వాళ్లంతా అతడి చేష్టకి స్ట్రేంజ్ గా చూస్తుండిపోయారు. తన్మయి కళ్లు మాత్రం కొంత చల్లబడ్డాయి. పెద్దరికం లెక్క చేయకుండా మడుగులో దించి కాళ్ల బేరానికి తెచ్చిన అతడు తిరిగి తండ్రి కాళ్లు పట్టుకోవటం సంతృప్తి పరచింది. కానీ, అంతలోనే ఏదో మార్పు.. 

   తండ్రితో ఉన్న అనుబంధం అతడిపై ఏహ్యభావాన్ని కలిగిస్తే, ఇప్పుడు ఇంతమందిలో అతడు తండ్రి కాళ్లపై పడటం కూడా చూడలేకపోతోంది. ఏదో ఆత్మాభిమానం అడ్డొస్తోంది. ఈ మూడేళ్లు తనకి తెలియకుండానే అతడితో అనుబంధాన్ని మనసు అంగీకరించిందని తెలుసుకోడానికి ఆమెకు ఎక్కువ సేపు పట్టలేదు. తన కోసమైన అతడి నిరీక్షణకో, తనే లోకమన్నట్టున్న అతడి క్రమశిక్షణకో.. ఎక్కడో అతడంటే సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందని అర్ధం చేసుకుంది. 

   అక్కడే స్వరూప్ రొట్టె విరిగి నేతిలో పడింది. తానొకటి తలస్తే దైవం రెండు తలచింది.

   "పిచ్చిమనిషికి ఏదొచ్చినా పట్టలేం. లేవమనండి నాన్నా" ఇబ్బందిగా అంది తన్మయి. ఆ ఇబ్బందిలో బందీ అయిన ప్రేమ పెద్దాయనకి అర్ధమైంది. 

   "అదేదో నువ్వే చెప్పుకోమ్మా" అక్కడి నుండి కాఫీ షాప్ వైపు తప్పుకున్నాడు కామా. 

   "సుందరాంగులను చూసిన వేళల కొందరు ముచ్చట పడనేలా..కొందరు పిచ్చను పడనేలా.." క్షమించినట్టుగా చెప్పి స్వరూప్ ని లేపే ప్రయత్నం చేసింది తన్మయి. 

   లేచినట్టు లేచి తిరిగి జారిపోయాడు స్వరూప్. బ్యాలెన్స్ తప్పి ఆమె అతడిపై పడింది. 

   "అయితే సావిత్రి గారూ..ఇంతకీ మేం ఎన్టీఆరా జగ్గయ్యా" అడిగాడు స్వరూప్. 

   "జంటీయార్" అంది తన్మయి. 

   "ఓహో..జెంట్ ఆఫ్ ద ఇయరా..భలే.." అన్నాడు స్వరూప్. 

   "అలా అర్ధమైందా..సరే, ఇక్కడ ఎక్కువసేపు సీన్ క్రియేట్ చేస్తే కాప్స్ కప్స్ తొడిగి తీసుకెళ్లగలరు" హెచ్చరించింది తన్మయి. ఆమెను లేపి అతడు లేచాడు. 

   "ధనబలము తోనే ఘనకార్యము సాధించలేరు.. తన మనము తోడైతే విజయమ్ము వరించగలదు" కాఫీ కప్పుతో వచ్చిన కామా హ్యాపీగా దీవించేసాడు. 

   "ఆ ఘనకార్యం ఏర్పాటేదో చూడండి మరి" చెప్పాడు స్వరూప్. 

   తన్మయి అతడిని చిన్నగా గిచ్చి, "నా దగ్గర సామ బేధ దాన దండోపాయలేం పనిచెయ్యలేదేం..ఈ ఉపాయం పన్నారు" అంది. 

   "ఇది దండోపాయమేగా.." అన్నాడు స్వరూప్. 

   "అదెలా?" చిత్రమైంది తన్మయి. 

   "గదిలోకొస్తే తెలుస్తుంది" నవ్వాడు స్వరూప్. 

   ఈసారి ఆమె గట్టిగా గిచ్చింది. 

                               -000-