మిస్సింగ్ షూస్

This is a crime story by Thirumalasri. భర్త మరణవార్తను ఆలకించగానే స్పృహతప్పి పడిపోయిందామె. ముఖం పైన నీళ్ళు చల్లి తెలివి తెప్పించాడు శివరామ్. ఆమె కొంచెం కుదుటపడగానే ప్రశ్నించడానికి పూనుకున్నాడు.

మిస్సింగ్ షూస్

 

క్రైమ్ స్టోరీ

మిస్సింగ్ షూస్

రచనః తిరుమలశ్రీ

***

        సెల్ ఫోన్ ఆగకుండా మ్రోగుతూంటే మెలకువ వచ్చేసింది క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరామ్ కి. లేచి టైమ్ చూస్తే తెల్లవారుఝామున మూడు గంటలయింది.

          బేగంపేట ఫ్లై వోవర్ క్రింద ఎవరిదో శవం పడివున్నదట!

          లేచి, త్వరత్వరగా డ్రెస్ చేసుకుని మోటార్ బైక్ లో బయలుదేరాడు శివరామ్.

          బేగంపేట–పంజాగుట్ట కూడలివద్ద ఫ్లై వోవర్ క్రింద వెల్లకిలా పడివుంది ఓ యువకుడి శవం. మిడ్-థర్టీస్ లో ఉంటాడు. చామనచాయ. అయిదడుగుల నాలుగు అంగుళాల కంటే ఎక్కువ ఉండడు. లైట్ కలర్ జీన్స్ ప్యాంటులో డార్క్ బ్లూ కలర్ షర్ట్ టక్ చేసాడు. కాళ్ళకు పాదరక్షలు లేవు!  షూస్ కానీ, చెప్పల్స్ కానీ కనిపిస్తాయేమోనని దరిదాపులలో చూసాడు శివరామ్. ఏవీ కనిపించలేదు.

          మృతుడి తలవెనుక బలమైన గాయం ఉంది. అక్కడ రక్తం గడ్డకట్టి వుంది. నేలపైన తలక్రింద సన్నటి రక్తపుచారలు తప్ప రక్తపుమడుగువంటిదేదీ లేదు. శరీరం మంచుగడ్డలా తగిలింది. చనిపోయి చాలాసేపు అయివుంటుందని గ్రహించాడు. ఆ వ్యక్తిని ఎక్కడో చంపి, శవాన్ని అక్కడకు తెచ్చి పడేసారా అనిపించింది.

          సమీపంలో ఓ పాత మోడల్ హోండా మోటార్ బైక్ పడివుంది. బైక్ దేనికీ గ్రుద్దుకున్నట్లు కనిపించలేదు. ఎక్కడా చొట్టలు కానీ, గీతలు కానీ లేవు. కనీసం సిమెంట్ లేదా మట్టి కూడా అంటుకోలేదు. పడుకోబెట్టినట్టుంది. బైక్ నీ, పరిసరాలనూ పరీక్షించిన ఇన్స్ పెక్టర్ కి, అది యాక్సిడెంటులా అనిపించలేదు.

          శవం జేబులు వెదికాడు శివరామ్, మృతుడి ఐడెంటిటీ ఏదైనా కనిపిస్తుందేమోనని. ఏమీ కనిపించలేదు. శవాన్ని త్రిప్పిచూస్తే, బాడీ క్రింద సెల్ ఫోన్ ఒకటి కనిపించింది. దాన్ని తీసి చూసాడు. పాస్ వర్డ్-ప్రొటెక్టెడ్ కావడంతో ఓపెన్ అవలేదు.

          జరుగవలసిన తతంగమంతా జరిపించి, ఆంబులెన్స్ లో శవాన్ని పోస్ట్ మార్టెమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించేసరికి తెల్లవారిపోయింది.

#

          మోటార్ బైక్ సీటు క్రింది అరలో ఉన్న డ్రైవింగ్ లైసెన్సునుబట్టి హతుడిని గుర్తించారు పోలీసులు…అతని పేరు హనుమంతు. ముప్పయ్ అయిదేళ్ళు. సికింద్రాబాదులోని అడ్డగుట్టలో ఉంటాడు.   

          హనుమంతు నివాసానికి వెళ్ళాడు ఇన్స్ పెక్టర్ శివరామ్. పూర్వీకుల నుండి సంక్రమించినది కాబోలు, ఓ పాత ఇండిపెండెంట్ హౌస్ అది. ముందు భాగంలో పూలమొక్కలు, వెనుకవైపు వెజిటబుల్ గార్డెనూ వేసారు. ఓ పక్కను రేకులతో స్కూటర్ షెడ్ ఉంది.  

          హనుమంతు భార్య జ్యోతికి ముప్పయ్యేళ్ళుంటాయి. అందంగా ఉంటుంది. హౌస్ వైఫ్. పిల్లలు లేరు.

          భర్త మరణవార్తను ఆలకించగానే స్పృహతప్పి పడిపోయిందామె. ముఖం పైన నీళ్ళు చల్లి తెలివి తెప్పించాడు శివరామ్. ఆమె కొంచెం కుదుటపడగానే ప్రశ్నించడానికి పూనుకున్నాడు.

          ‘హనుమంతు ‘హైక్’ ఫుట్ వేర్ కంపెనీలో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. గత దినం ఎప్పటిలాగే ఉదయం డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి ఇంటికి రాలేదు. అప్పుడప్పుడు పొరుగూరికి వెళ్ళినప్పుడు అతను అలా రాత్రులు ఇంటికి రాకపోవడం అలవాటే. ఫోన్ చేసి చెబుతాడు. ఆ రోజు ఏ కబురూ లేదు. తాను అతనికి ఫోన్ చేస్తే, ‘స్విచ్డాఫ్’ అని బదులు వచ్చింది…’

          జ్యోతి చెబుతున్నది ఆలకిస్తూ గదులన్నీ తిరిగి చూస్తూన్న ఇన్స్ పెక్టర్, సాలోచనగా బెడ్ రూమ్ లోని టేబుల్ సొరుగు తెరచి చూసాడు. అందులో హనుమంతు యొక్క మనీపర్స్ కనిపించింది. అందులో కొంత క్యాషు, డెబిట్, క్రెడిట్ కార్డ్సూ ఉన్నాయి. ఆశ్చర్యంతో ఆమె వంక చూసాడు.

          ఆమె తెల్లబోతూ, “ఇది ఆయనదే. మరచిపోయి వెళ్ళిపోయినట్టున్నారు నిన్న. నేనూ చూళ్ళేదు“ అంది.

          డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ని తన సెల్ ఫోన్ లో ఫొటో తీసుకుని, మనీపర్సును తిరిగి సొరుగులో పెట్టేసాడు ఇన్స్ పెక్టర్. అతను అడిగిన ప్రశ్నకు జవాబుగా, ‘తనకు తెలిసినంత వరకు తమకు శత్రువులు ఎవరూ లేరని’ చెప్పిందామె.

          “ఆయనకు అప్పుడప్పుడు డ్రింక్ చేయడం అలవాటు. త్రాగిన మైకంలో బండి నడపడం వల్ల ప్రమాదం జరిగిందేమో!” అంది స్వగతంలా. హనుమంతు త్రాగిలేడని చెప్పాడు ఇన్స్ పెక్టర్.

వీధి అరుగుపైన చెప్పుల స్టాండ్ కనిపించింది. అందులో మగవారివి రెండు లెదర్ చప్పల్సు, ఓ హవాయ్ చెప్పుల జత, ఓ పాత షూ…స్త్రీలవి అరడజను చెప్పులూ ఉన్నాయి. ముందురోజు హనుమంతు ఏం తొడుక్కుని వెళ్ళాడని అడిగితే, అతనికి రెండు జతల షూస్ ఉన్నాయనీ, కొత్తవి తొడుక్కుని వెళ్ళాడనీ చెప్పిందామె. శవం కాళ్ళకు పాదరక్షలేవీ లేవని చెప్పడంతో ఆశ్చర్యపోతూ, “ఎవరైనా తీసేసుకుని వుంటారంటారా?” అనడిగింది. భుజాలు ఎగరేసాడు అతను.

          పోస్ట్ మార్టెమ్ పూర్తికాగానే శవాన్ని అప్పగిస్తారు. ఈలోపున మీవాళ్ళెవరికైనా ఫోన్ చేసి రప్పించండి” అన్నాడు.           అతను వెళ్ళగానే ఉబికి వస్తూన్న దుఃఖంతో బెడ్ మీద వాలిపోయిందామె.

#

          హనుమంతు పనిచేస్తూన్న ‘హైక్’’ ఫుట్ వేర్ కంపెనీకి వెళ్ళాడు శివరామ్. హనుమంతు గురించి ఆరా తీసాడు. గతదినం అతను ఆఫీసుకు వచ్చి వెళ్ళినట్టు చెప్పారు.  సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ రోజూ ఆఫీసుకు వచ్చి ఎటెండెన్స్ వేయించుకుని, ఆ తరువాత ఫీల్డ్ కి వెళతారనీ చెప్పారు.  హనుమంతు ఎవరితోనూ విరోధం పెట్టుకునే మనిషి కాదనీ, అతన్ని చంపే అవసరం ఎవరికీ ఉండదనీ అభిప్రాయపడ్డారు.

          హైక్ కంపెనీ ఆమధ్య ఓ కొత్త మోడల్ షూని మార్కెట్లో ప్రవేశపెట్టిందనీ, దాన్ని పుష్ చేసే నిమిత్తం హనుమంతు నిర్విరామంగా కృషి చేస్తున్నాడనీ తెలిసింది. ఆ షూని పరిశీలించిన ఇన్స్ పెక్టర్, బాగుందని మెచ్చుకున్నాడు. ఆ మోడల్ని ఆ కంపెనీ సిబ్బంది అంతా తొడుక్కుని ఉండడం చూసి విస్తుపోయాడు.

          ‘కొత్త మోడల్సు వచ్చినప్పుడు ప్రచారం కోసం వాటిని తమ సిబ్బందికి…ముఖ్యంగా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కి ఉచితంగా ఇస్తామనీ…వాళ్ళు వాటిని అమ్ముకోకుండా వారికిచ్చిన షూస్ మీద మడమ భాగంలో కంపెనీది మినియేచర్ గుర్తు ఒకటి ముద్రిస్తామనీ’ తెలిపాడు మేనేజర్. ‘హనుమంతుకు కూడా ఆ షూస్ ని ఇచ్చినట్టూ, వాటిని అతను రెగ్యులర్ గా వాడుతున్నాడనీ, ముందురోజు ఆఫీసుకు వచ్చినప్పుడు అతను వాటిని తొడుక్కునే వున్నాడనీ’ చెప్పాడు…

          అక్కడ నుండి హనుమంతు యొక్క ఎకౌంట్ ఉన్న బ్యాంక్ కి వెళ్ళాడు ఇన్స్ పెక్టర్ – గతదినం హనుమంతు తన డెబిట్ కార్డును గానీ, క్రెడిట్ కార్డును కానీ ఉపయోగించాడేమో తెలుసుకోవడానికి…

#

పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ ప్రకారం హనుమంతు మరణం గతరాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సంభవించి వుంటుందని తెలుస్తోంది. బ్లంట్ గా వుండే ఏదో ఆయుధమో, వస్తువో తల వెనుకభాగంలో బలంగా తగలడంతో వెంటనే మరణం సంభవించి వుంటుందన్న అభిప్రాయం వెలిబుచ్చాడు ఎటాప్సీ జరిపిన సర్జన్.

          ఆ కేసును అధ్యయనం చేస్తూన్న ఇన్స్ పెక్టర్ శివరామ్ కి కొన్ని అంశాలు ట్రిక్కీగా అనిపించాయి –

          హనుమంతు మందు త్రాగలేదు. పక్కనే పడున్న మోటార్ బైక్ ఇన్ టాక్ట్ గా ఉంది. తల మీది దెబ్బ తప్ప శరీరం పైన చిన్న గాయం కూడా లేదు. తల మీది గాయానికి ఆ పరిసరాలలోని ఏ వస్తువూ కారణం కాదు.  అంటే, అది ప్రమాదం కాదని స్పష్టమవుతోంది…మరణం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సంభవించినట్టు సర్జన్ నివేదిక. రాత్రి పన్నెండు గంటలకు నైట్ బీట్ కాన్ స్టబుల్స్ ఆ ఏరియాని కవర్ చేసారు. అప్పుడు హనుమంతు శవం లేదక్కడ. మళ్ళీ తెల్లవారు ఝామున రెండున్నర గంటలకు అక్కడికి తిరిగి వచ్చేసరికి శవం కనిపించింది. అంటే అతన్ని ఎక్కడో చంపేసి,   12–2.30 గంటల మధ్యలో శవాన్ని అక్కడికి తెచ్చి పడేసుంటారని తెలుస్తోంది. అందుకే పడున్నచోట రక్తం కనిపించలేదు. తల వెనుక రక్తం గడ్డకట్టి ఉంది. అంతేకాదు, తాను బాడీని టచ్ చేసినప్పుడు మంచుగడ్డలా తగిలింది. అంటే, మరణించి అప్పటికి చాలా గంటలు అయిందన్నమాట! దురదృష్టవశాత్తూ ఆ ప్రాంతంలోని సిసి కెమేరాలు పనిచేయడంలేదు.

          అన్నిటికంటే ఇన్స్ పెక్టర్ ని తికమకపెడుతూన్న విషయం -  హతుడి మిస్సింగ్ షూస్!

ఫుల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి పాదరక్షలు ధరించకుండా ఉండడు. భర్త షూస్ తొడుక్కుని వెళ్ళాడని జ్యోతి చెబుతుంది. ఎవరైనా వాటిని తీసుకుని వుంటారనుకుంటే – ఆ వేళప్పుడు అక్కడికి ఎవరూ వచ్చుండరు. అదికూడా, ఎక్కడో చంపి శవాన్ని అక్కడికి తెచ్చి పడేసుంటారన్న థియరీని బలపరుస్తోంది…

          ఎస్సయ్ వచ్చి, ‘బేగంపేటలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకడు కార్లలో వెళుతూన్నవాళ్ళకు కొత్త షూస్ ని అమ్మబోతుంటే…ట్రాఫిక్ కాన్ స్టబుల్ పట్టుకున్నాడని,’ చెప్పాడు.

          “వాటిని ఎక్కడ దొంగిలించాడోనని అడిగితే, తెలిసినవారెవరో ఇచ్చారని చెబుతున్నాడు, సార్! వాణ్ణి స్టేషన్ కి తీసుకువచ్చారు మనవాళ్ళు” అన్నాడు ఎస్సయ్.

          ఆ షూస్ ని తెప్పించి పరిశీలించాడు శివరామ్. అవి తాను హైక్ కంపెనీలో చూసిన న్యూ మోడల్ షూస్. వాటి మడమ భాగంలో కంపెనీ యొక్క ‘మినియేచర్’ గుర్తు ముద్రింపబడివుంది! అది కంపెనీ సిబ్బందికి ఇవ్వబడిన జత అని గ్రహించాడు…వెంటనే ఆ కుర్రాణ్ణి ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించాడు.

          పాతికేళ్ళుంటాయి వాడికి. నలిగిపోయిన ప్యాంటు, షర్టు తొడుక్కున్నాడు. దబాయించి అడిగేసరికి, ‘ఆ షూస్ ని తాను ఎక్కడా దొంగిలించలేదనీ, ఆరోజు ఉదయం తెలిసిన పెద్దమనిషి ఒకరు వాటిని తనకు ఇచ్చాడని చెప్పాడు. తనకవి బిగువయ్యిపోయాయనీ, ఆ కుర్రాడికి సరిపోవచ్చుననీ తొడుక్కోమని చెప్పి ఇచ్చాడట. “కొత్త షూస్ కదా, అమ్ముకుంటే పైసలు వస్తాయని…” అంటూ నసిగాడు వాడు.

తన పేరు రంగా అనీ, బేగంపేటలో ప్రకాష్ నగర్ లోని స్లమ్స్ లో ఉంటాననీ చెప్పాడు.. ఏవో ఆడ్ వర్క్స్ చేస్తుంటాడట. తనకు షూస్ ఇచ్చిన పెద్దమనిషి ప్రకాష్ నగర్ లో ఉంటాడట. అప్పుడప్పుడు అతనికి ఏవో చిన్నచిన్న పనులు చేసిపెడుతుంటాడట తాను. అందుకే వాటిని తనకు ఇచ్చాడట…ప్రస్తుతానికి వాణ్ణి లాకప్ లో వేయమని చెప్పాడు శివరామ్.

#

          రంగాకి షూస్ ఇచ్చిన వ్యక్తి పేరు మోహన్. ముప్పయ్యేళ్ళుంటాయి. హ్యాండ్సమ్ గా ఉంటాడు. అవివాహితుడు. విశాఖ నేటివ్ అయిన అతను ప్రస్తుతం బేగంపేటలోని ఓ షాపింగ్ మాల్ లో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్నాడు.

          రెండు రోజుల క్రితం తాను మోణింగ్ వాక్ కి వెళ్తే బేగంపేట పోలీస్ లైన్స్ సమీపంలో ఆ షూస్ పేవ్మెంటు మీద తనకు దొరికాయని చెప్పాడు అతను. వాటిని ఉపయోగించడం ఇష్టంలేక, రంగాకి ఇచ్చేసినట్టు చెప్పాడు. హనుమంతును తాను ఎరుగనన్నాడు.  

          అతని బాడీ లాంగ్వేజ్ ని నిశితంగా గమనిస్తూన్న శివరామ్ కి అతను నిజం చెబుతున్నట్టు అనిపించలేదు. అతని మొబైల్ ఫోన్ ని తీసుకుని తెరవమన్నాడు. సంశయిస్తూనే పాస్ వర్డ్ తో ఓపెన్ చేసి ఇచ్చాడు అతను. కాల్ డేటాని పరీక్షిస్తూన్న ఇన్స్ పెక్టర్, హనుమంతు హత్య జరిగిన నాటి ఇన్కమింగ్–ఔట్ గోయింగ్ కాల్స్ ని చూసాడు. ‘ట్రూ కాలర్’ ద్వారా ఆయా నంబర్లు ఎవరివో చెక్ చేసాడు. వాటిలో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అతనికి కాల్ చేసిన వ్యక్తి పేరు ‘జ్యోతి’ అని ఉండడం గమనించాడు.

          ఆ కాలర్ ఎవరని అడిగితే, ఓ క్షణం ఆలోచించిన మోహన్ – “ఎవరో తెలియదు. రాంగ్ కాల్ అని చెప్పడంతో కాల్ కట్ చేసేసారు” అని చెప్పాడు.

          అతని ఫోన్ లోంచి అదే నంబరుకు కాల్ చేసాడు శివరామ్. అటువైపు నుండి ఓ స్త్రీ స్వరం వినిపించింది – “మోహన్! మొన్న ఆయన దహనకార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి అయిపోయింది. ఇల్లంతా బంధువులు ఉన్నా, నా మదికి ఊరట కలగడంలేదు. ఎంత సరిపెట్టుకుందామన్నా ఆయన లేని లోటు తెలుస్తూనే ఉంది…రేపు బంధువులంతా వెళ్ళిపోతున్నారు. ఒంటరిదాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది…” సన్నగా ఏడ్పు వినవచ్చింది.

          స్పీకర్ ఆన్ చేయడంతో అదంతా ఆలకిస్తూన్న మోహన్ వదనంలో కత్తివేటుకు నెత్తురుచుక్క లేకుండా పోయింది.

          “జ్యోతికీ, నీకూ సంబంధం ఏమిటి? ఆమె హనుమంతు భార్య అని నీకు తెలుసు కదూ? హనుమంతును ఎందుకు చంపావ్?” అంటూ శివరామ్ గద్దించేసరికి సన్నటి కంపన ఆరంభమయింది అతనిలో.

          అతని వ్రేలిముద్రలు తీసుకుని, విచారణ ముగిసేవరకు లాకప్ లో వేయించాడు ఇన్స్ పెక్టర్.

          మోహన్ కి మారుతి-800 కారు ఉంది. దాన్ని సీజ్ చేసి, డిక్కీలో కాని, ఇతర చోట్ల కానీ రక్తపు మరకలేవైనా దొరుకుతాయేమోనని, పరిశీలించే నిమిత్తం ఫోరెన్సిక్ ఎక్ష్ పర్ట్స్ ని పిలిపించాడు…

          రెండు రోజుల తరువాత - జ్యోతి, మోహన్ అరెస్ట్ చేయబడ్డారు.

2

          క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆ కేసు యొక్క పూర్వాపరాలను వివరించాడు ఇన్స్ పెక్టర్ శివరామ్ –

          ‘’జ్యోతి, మోహన్ ఒకే ఊరికి చెందినవారు, స్కూల్ ఫ్రెండ్సూను. జ్యోతి వివాహం తరువాత విడిపోయారు. బేగంపేటలోని ఓ షాపింగ్ మాల్ లో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేస్తున్న మోహన్, ఓసారి జ్యోతికి కనిపించాడు. చాలా ఏళ్ళ తరువాత కలుసుకోవడంతో సంతోషించారు ఇద్దరూ. సెల్ నంబర్సు మార్చుకున్నారు. అప్పుడప్పుడు ఒకరికొకరు తారసపడితే మాట్లాడుకునేవారు.

మోహన్ విషయం భర్తకు చెప్పలేదు జ్యోతి. ఎందుకంటే, హనుమంతు అనుమానపుపక్షి. కానీ, ఆ సంగతి అతనికి ఎలాగో తెలిసిపోయింది. అడిగితే, తామిద్దరూ ఓల్డ్ స్కూల్ మేట్స్ మనీ, అంతకు మించి తమ మధ్య వేరే ఏ సంబంధమూ లేదనీ చెప్పిందామె. మోహన్ హ్యాండ్సమ్ గా ఉంటాడు. అవివాహితుడు.  హనుమంతులోని అనుమానపుపిశాచి ఒళ్ళు విరుచుకుంది. తరచు భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు.

హనుమంతు మరణం సంభవించిన రోజున – జ్యోతి, మోహన్ లు కాఫీ షాపులో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం హనుమంతు దృష్టిలో పడింది. రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చిన హనుమంతు షూస్ విప్పి పక్కను పడేసాడు. జేబులోంచి మనీపర్సు తీసి టేబుల్ సొరుగులో పెట్టాడు. డ్రెస్ కూడా మార్చుకోకుండా, కిచెన్ లో ఉన్న జ్యోతి దగ్గరకు వెళ్ళి ఆమెతో గొడవపెట్టుకున్నాడు. తాను ఏ పాపమూ ఎరుగనంటూ ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా, ఆవేశంలో ఆమె గొంతుక పట్టుకుని పిసికేయబోయాడు. ఊపిరాడక పట్టు విడిపించుకునేందుకు పెనగులాడిన జ్యోతి, అతన్ని వెనక్కి త్రోసేసింది. హనుమంతు వెనుకనున్న సిమెంట్ గట్టుమీద పడిపోయాడు. గట్టు తల వెనుకభాగంలో బలంగా తగలడంతో వెంటనే మరణించాడు.

ఆ హఠాత్సంఘటనతో కొయ్యబారిపోయింది జ్యోతి. ఏం చేయాలో పాలుపోలేదు. మోహన్ కి ఫోన్ చేసింది. వెంటనే వచ్చాడతను…అమాయకురాలైన జ్యోతి మీదకు కేసు రాకుండా హనుమంతు శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. అర్థరాత్రి దాటాక తన కారులో శవాన్ని తీసుకువెళ్ళి బేగంపేట-పంజాగుట్ట ఫ్లై ఓవర్ క్రింద పడేసాడు. అతని మోటార్ బైక్ ని కూడా తీసుకువెళ్ళి అక్కడే పడేసాడు, అది ప్రమాదంగా అనుకోవాలని. ఆరోజు భర్త ఇంటికి రాలేదని చెప్పమన్నాడు జ్యోతితో. తరువాత హనుమంతు షూస్ ఇంట్లో కనిపించడంతో, వాటిని శవం దగ్గర పడేసేందుకు మళ్ళీ అక్కడకు వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు అతనికి. షూస్ ని తనతో తీసుకుపోయి, మర్నాడు స్లమ్స్ లోని ఓ కుర్రాడికి ఇచ్చేసాడు. వాడు వాటిని అమ్మకానికి పెట్టడంతో కేసులో తీగ కదిలింది.

ఆ రోజు భర్త మనీపర్సును మరచిపోయి వెళ్ళాడంది జ్యోతి. కానీ, అదేరోజు మధ్యాహ్నం అతను ఎటిఎమ్ నుండి ఐదువేలు డ్రా చేసినట్టు మా విచారణలో తేలింది. అందులో కొంత సొమ్ము పర్సులో ఉంది. అంటే, అతను ఇంటికి వచ్చాడన్నమాట! మోహన్ కారుడిక్కీలోని రక్తపుమరకలు ఫోరెన్సిక్ టెస్టుల్లో బైటపడ్డాయి. మోటర్ బైక్ మీద, శవం మీద మోహన్ వ్రేలిముద్రలు ఉన్నాయి… సాక్ష్యాధారాలతో కన్ ఫ్రంట్ చేసేసరికి, జ్యోతి ఏడుస్తూ నిజం చెప్పేసింది. కిచెన్ గట్టుమీద ఎండిపోయిన రక్తపుమరకలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చాయి…

ఆత్మరక్షణ కోసం జ్యోతి భర్తను త్రోయడం, అతను తల గట్టుకు తగిలి మరణించడమూ యాదృచ్ఛికం. స్నేహితురాలికి సాయం చేయబోయి మోహన్ కూడా  చిక్కుల్లో పడ్డాడు…సెల్ఫ్-డిఫెన్స్ కారణంగా సంభవించిన మరణం కాబట్టి న్యాయస్థానం సానుభూతితో పరిశీలించి జ్యోతికి తగు న్యాయం చేకూర్చినా…సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ప్రయత్నించిన నేరానికి ఆమెకు, మోహన్ కీ శిక్ష తప్పదు…”  ఓ క్షణం భయంకర నిశ్శబ్దం ఆవరించుకుందక్కడ.

జ్యోతి వంక జాలిగా చూస్తూ, “మనిషిలోని అనుమానపుపిశాచి ఎంతటి దారుణాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ కేసే నిదర్శనం. మనిషి ఆవేశాన్ని అదుపులో పెట్టుకుని, వివేకాన్ని మేల్కొలిపితే జరగబోయే అనర్థాలను అరికట్టవచ్చును,” అన్నాడు ఇన్స్ పెక్టర్ శివరామ్ నిట్టూర్చుతూ.              

 

“Tirumalasree”  PVV SATYANARAYANA

Mob. 91107 36095