కథలో రాకుమారుడు

ఆ గదిలో రెండు ఎ.టి.ఎమ్. మిషన్లు ఎదురుబొదురుగా ఉన్నాయి. రెండవదాని వద్ద ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుని వెనుదిరిగాడు. నిస్సహాయంగా నిలుచున్న పత్రలేక కనిపించింది. ఆమెను గుర్తుపట్టి, “హలో! ప్రముఖ చిత్రకారిణి పత్రలేక గారే కదూ?” అంటూ నవ్వుతూ పలుకరించాడు. విస్తుపోయి చూసిందామె. ఆ యువకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది.

కథలో రాకుమారుడు

కథలో రాకుమారుడు

(రచయిత- తిరుమల శ్రీ)

సిటీలో మూడు రోజులుగా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. లబ్ధప్రతిష్ఠులతోపాటు వర్ధమాన చిత్రకారులు కూడా అందులో పాల్గొనడం విశేషం… ఆఖరు రోజున చిత్రకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా ఎంపికచేసిన ‘ప్రకృతికాంత’ చిత్రానికి అవార్డ్ లభించింది. 


తన తొలి ప్రదర్శనే అవార్డ్ ని తెచ్చిపెట్టినందుకు  చిత్రకారిణి పత్రలేక మది ఆనందంతో నిండిపోయింది. సభికుల కరతాళధ్వనుల నడుమ, సభాధ్యక్షుడు ఆమెను శాలువాతో సన్మానించాడు. లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడ్డాయి ఆమెకు.


సభానంతరం విలేఖర్లు పత్రలేకను చుట్టుముట్టారు. ఆమెను అభినందిస్తూ, వివిధ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేసారు. అన్నిటికీ చిరునవ్వుతో జవాబులు ఇచ్చిందామె. పత్రలేక కారు ఎక్కుతూంటే – ఆమె దగ్గరకు వచ్చాడు ఓ యువకుడు. అందమైన పుష్పగుచ్ఛం ఒకటి ఆమె చేతిలో పెట్టి అభినందించాడు.


    “నేను కళారాధకుణ్ణి. కళ ఏ రూపంలో ఉన్నా ఇష్టం నాకు. మీ చిత్రం కూడా మీ అంత అందంగా ఉంది. మున్ముందు మీ కోమల హస్తాల మీదుగా మరెన్నో కళాఖండాలు జాలువారాలని మనఃస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను…” అంటూ ఆమె రెండు చేతులూ పట్టుకుని ఊపేసాడు. ఆ అపరిచితుడి చొరవకు బిత్తరపోయింది పత్రలేక. 


    పత్రలేకకు ఇరవై రెండేళ్ళుంటాయి. పొడవుగా. తెల్లగా, నాజూకుగా, అందంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచీ ఆమెకు చిత్రలేఖనం అంటే అమిత ఇష్టం. అందుకే ఫైన్ ఆర్ట్ స్ లో చేరింది. జె.ఎన్.టి.యూ. నుండి  ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలు అవడమే కాక, బంగారుపతకాన్ని కూడా సాధించింది. 


    ఓసారి పత్రలేక ఎ.టి.ఎమ్. నుండి డబ్బు డ్రా చేసే నిమిత్తం, డెబిట్ కార్డ్ ని మిషన్ లోకి చొప్పించింది. అది లోపల స్టక్ అయిపోయింది. కార్డును బైటకు తీయడానికి ప్రయత్నించి విఫలురాలయిందామె.


    ఆ గదిలో రెండు ఎ.టి.ఎమ్. మిషన్లు ఎదురుబొదురుగా ఉన్నాయి. రెండవదాని వద్ద ఉన్న వ్యక్తి డబ్బులు తీసుకుని వెనుదిరిగాడు. నిస్సహాయంగా నిలుచున్న పత్రలేక కనిపించింది. 


    ఆమెను గుర్తుపట్టి, “హలో! ప్రముఖ చిత్రకారిణి పత్రలేక గారే కదూ?” అంటూ నవ్వుతూ పలుకరించాడు. విస్తుపోయి చూసిందామె. ఆ యువకుణ్ణి ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది.


    “నేనండీ. ఆ రోజు మీ పెయింటింగుకి అవార్డ్ వచ్చినప్పుడు బుకేతో మిమ్మల్ని అభినందించిన మీ అభిమానిని” అన్నాడు. “ఎనీ ప్రోబ్లెమ్?”.  చెప్పింది.


    “ఓకే. లెట్ మీ ట్రయ్” అంటూ మెషీన్ దగ్గరకు వెళ్ళాడు అతను. ఏం చేసాడో తెలియదు, క్షణంలో కార్డ్ నిర్ణీతస్థానానికి వచ్చేసింది!


    “నేను వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటాను. మీరు పిన్ టైప్ చేయండి” అన్నాడు నవ్వుతూ. 
    డబ్బు డ్రా చేసుకుని, అతనికి ‘థాంక్స్’ చెప్పిందామె.


    “ఈ ఎ.టి.ఎమ్. లు  ఒక్కోసారి జాదూ చేస్తూంటాయి. అందుకే వీటికి కీలెరిగి వాత పెట్టాలి!” అన్నాడు నవ్వుతూ. మందహాసం చేసిందామె… 
ఆ సంఘటన జరిగిన నెల్లాళ్ళకు మల్టీప్లెక్స్ లో ఆడుతూన్న ‘ఆక్వామ్యాన్’ మూవీకి వెళ్ళింది పత్రలేక ఒంటరిగా. సినిమా ఆరంభమైన కొంతసేపటికి ఎవరో వచ్చి ఖాళీగా ఉన్న ఆమె పక్క సీట్లో కూర్చున్నారు. ఇంటర్వెల్ లో అతని వంక చూసిన పత్రలేక ఖంగుతింది. 


అతను కూడా ఆమెను చూసాడు. “హాయ్, పత్రలేక గారూ!” అంటూ ఆశ్చర్యానందాలతో పలుకరించాడు. “వాట్ ఎ వండర్! అనుకోకుండా ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉన్నాం మనం. ఇది దైవేచ్ఛ కాక మరేమిటి?” అంటూ నవ్వాడు. 


తన పెయింటింగుకి అవార్డ్ వచ్చినప్పుడు బుకేతో ఆమెను అభినందించినవాడు…ఎ.టి.ఎమ్. దగ్గర హెల్ప్ చేసినవాడూను…అతను! 


“బై ద బై, నా పేరు రాజ్ కుమార్. చెప్పానుగా, కళాభిమానినని! మీ ప్రకృతికాంత పెయింటింగ్ చూసాక ఫిదా అయిపోయి, మీకు వీరాభిమానిని అయిపోయాను నేను” అన్నాడు.


బయటకు వెళ్ళి ఇద్దరికీ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకువచ్చాడు. తీసుకోవడానికి ఆమె మొహమాటపడుతూంటే బలవంతం చేసాడు. డ్రింక్ సిప్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పాడు. 


ఆట ముగిసాక, విడిపోతూ, అతను తన సెల్ నంబర్ ఇచ్చి, ఆమెను తనకు మిస్డ్ కాల్ ఇమ్మన్నాడు.

అతని కలుపుగోరుతనము, స్నేహతత్వమూ చూసి కాదనలేకపోయిందామె. పైగా,  తనకు వీరాభిమానినని చెప్పుకుంటున్నాడు. అంతేకాక, థియేటర్లో పక్కపక్కనే కూర్చున్నా అతను ఎటువంటి వెకిలి చేష్ఠలూ చేయకుండా హుందాగా ప్రవర్తించడం కూడా మరో కారణం.


ఆ తరువాత వారి నడుమ ఫోన్ కాల్స్ ఆరంభమయ్యాయి. ‘వాట్సాప్’ మెసేజ్ లు ఎక్ఛేంజ్ అయ్యాయి.  అతని కోరిక మేరకు తాను వేసిన పెయింటింగ్స్ యొక్క ఫోటోలు తీసి అతనికి సెల్ లో పంపించేది పత్రలేక. వాటిని బాగా మెచ్చుకునేవాడు అతను. వీకెండ్స్ లో ఏదో ఒకచోట కలుసుకోవడం వరకు వచ్చారు. ఏడాది తిరిగేసరికి వారి స్నేహం ప్రేమగా పుష్పించడం విశేషం.


పాతికేళ్ళ రాజ్ కుమార్ పొడవుగా, ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’ గా ఉంటాడు. ఎప్పుడూ బ్రాండెడ్ వుడుపులను, వస్తువులనే వాడతాడు. స్టయిలిష్ గా ఉంటాడు…తాను జర్నలిస్టునని చెప్పాడు…
ఓసారి పత్రలేక ఆన్ లైన్ బ్యాంక్ ఎకౌంట్లోంచి ఐదు లక్షలు అదృశ్యమయ్యాయి. ఆమె గుండె ఝళ్ళుమంది. సొమ్ము ఏమయిందో బోధపడక, బ్యాంక్ ని కాంటాక్ట్ చేసింది. ఆమె ఎకౌంట్ ని బ్లాక్ చేసింది బ్యాంక్. అది హ్యాకర్స్ పని అనీ, పోలీస్ కంప్లెయింట్ ఇవ్వమనీ సలహా ఇచ్చాడు బ్యాంక్ మేనేజర్. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంటుకు ఫిర్యాదుచేసింది. 


కొద్దిరోజులుగా ఆమె డల్ గా ఉండడం గమనిస్తున్నాడు రాజ్ కుమార్. ఆరా తీయడంతో, జరిగిందంతా అతనికి చెప్పింది. నిర్ఘాంతపోయాడతను. “ఇన్నాళ్ళూ ఈ సంగతి నాకెందుకు చెప్పలేదు? ఓకే, లీవిట్ టు మీ. నీ ఎకౌంట్ ని హ్యాక్ చేసిందెవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. నువ్వు దిగులుచెందకు” అంటూ ఓదార్చాడు. బ్యాంక్ బ్రాంచ్ పేరు, ఎకౌంట్ నంబరూ అడిగి తీసుకున్నాడు…


వారం తరువాత పత్రలేకకు ఫోన్ చేసి బ్యాంక్ ఎకౌంట్ ని చెక్ చేసుకోమని చెప్పాడు రాజ్ కుమార్. కొత్త పాస్ వర్డ్ తో ఎకౌంట్ ఓపెన్ చేసిన పత్రలేక సంభ్రమానికి గురయింది. పోయిన సొమ్ము తిరిగి జమచేయబడింది! ఆమె ఆనందానికి మేరలేకపోయింది.


తాను బ్యాంక్ యొక్క ఐ.టి. సిబ్బంది సాయంతో, తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ మిస్టరీనీ భేదించినట్లు చెప్పాడు రాజ్ కుమార్. ఆమె ఎకౌంట్ ని హ్యాక్ చేసిందెవరో కనిపెట్టి, ఆ సొమ్మును తిరిగి ఆమె ఖాతాలో జమచేసేలా చేసానన్నాడు. 


ఆ రోజు పార్క్ లో అతను తన ఒళ్ళో పడుకునివుండగా, “నువ్వు అచ్చు ప్రిన్స్ మహేష్ బాబులా ఉంటావు. అతనికి ట్విన్ బ్రదర్ వా?” అనడిగింది పత్రలేక అల్లరిగా. 


“ట్విన్ నో, రెప్లికానో తెలియదు కానీ…అతని కంటే మిక్కిలి అదృష్టవంతుణ్ణని మాత్రం చెప్పగలను నేను” అన్నాడతను. “ఎందుకో!?” ఆశ్చర్యంగా అడిగింది.


“నీవంటి అందాల ఆర్టిస్ట్ యొక్క మనసును గెలుచుకున్నందుకు!” జవాబిచ్చాడు.
“నువ్వు నా కలల రాకుమారుడివి…!” అంటూ అతని బుగ్గమీద ముద్దుపెట్టింది. 
ఇక ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులతో చెప్పి, అతనికి ప్రపోజ్ చేయాలని నిశ్చయించుకుందామె.


అంతలోనే – తాను ఓ ముఖ్యమైన ఎసైన్మెంటు మీద ఢిల్లీ వెళ్తున్నట్టూ, మూడు నెలల వరకూ తిరిగిరాననీ చెప్పాడు రాజ్ కుమార్. అది సెన్సిటివ్ ఎసైన్మెంట్ కావడంవల్ల తమ మధ్య ఏ విధమైన కాంటాక్టూ సాధ్యంకాదని చెప్పాడు….. 


చూస్తూవుండగానే  నాలుగు మాసాలు గడచిపోయాయి. అన్నాళ్ళు రాజ్ కుమార్ ని కలవకుండా, మాట్లాడకుండా ఉండడం పత్రలేకకు పిచ్చెక్కిస్తోంది. ఫోన్ చేసి చూసింది, మెసేజ్ లు ట్రై చేసింది. ఫోన్ ఆఫ్ మోడ్ లో ఉందన్న సమాచారం.


ఓరోజున రాజ్ కుమార్ నుండి వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది – ఎసైన్మెంట్ పూర్తయిందనీ, ఏ రోజైనా తాను తిరిగిరావచ్చుననీ, సరాసరి ఆమె ఇంటికే వస్తాననీను. మిక్కిలి సంతోషం కలిగిందామెకు. అతను రాగానే తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్పాలనుకుంది…..


ఎవరో స్నేహితుల ఇంట్లో పెళ్ళికని పత్రలేక తల్లిదండ్రులు ముంబయ్ వెళ్ళారు. రాజ్ కుమార్ ని సర్ ప్రైజ్ చేసేందుకని, అతని తైలవర్ణ చిత్రం వేసి అతనికి బహూకరించాలనుకుంది పత్రలేక. రోజంతా ఇంటినుండి కదలకుండా చిత్రం పూర్తిచేసింది. అలసటతో మంచం పైన వాలడంతో తెలియకుండానే నిద్రపట్టేసింది…


డోర్ బెల్ మ్రోగడంతో ఉలికిపడి లేచింది. పరుగెత్తుకు వెళ్ళి తలుపు తెరచింది. గుమ్మంలో – రాజ్ కుమార్! 


అన్నాళ్ళ ఎడబాటు కన్నీటివెల్లువ కాగా, అతని మెడచుట్టూ చుట్టుకుపోయింది పత్రలేక. ఆమె అధరాలను చుంబించాడతను. చుంబనమాధుర్యం నరాలలో ప్రకంపనలను రేపడంతో తన్మయత్వంతో కన్నులు మూసుకుంది…


డోర్ బెల్ గట్టిగా మ్రోగడంతో త్రుళ్ళిపడి లేచింది. చిత్రం! తాను రాజ్ కుమార్ కౌగిట్లో లేదు… ’అదంతా కలా!?’ అనుకుంది సంభ్రమంగా. 


డోర్ బెల్  ఈసారి ఆగకుండా మ్రోగింది. గబగబా వెళ్ళి తలుపు తెరచింది.


గుమ్మంలో – రాజ్ కుమార్ కాదు… ఎవరో ఆగంతకుడు!! 


ఆమెను త్రోసుకుంటూ లోపలికి చొచ్చుకువచ్చాడతను.


పత్రలేక తెల్లబోతూ, “ఏయ్! ఎవరు నువ్వు?” అనడిగింది. 


“అరచావంటే పొడిచేస్తాను! పోలీసులు తరుముతున్నారు. కాసేపు నన్నిక్కడ తలదాచుకోనిస్తే… నా దారిన నేను వెళ్ళిపోతాను” అన్నాడతను, కత్తి చూపిస్తూ.


భయం వేసిందామెకు. “పోలీసులు ఎందుకు తరుముతున్నారు? నువ్వు…ఎవరినైనా హత్య చేసావా? లేక, నగ్జలైట్ వా?” అనడిగింది.


 “అదేమీ కాదు. నేను ఓ దొంగను…భయపడకు, మీ ఇంటిని దోచుకోనులే” అన్నాడు. 


పాతికేళ్ళుంటాయి అతనికి. సన్నగా ఉన్నాడు. పొడవూ పొట్టీ కాని విగ్రహం. వంకీల జుత్తు. ఫేడెడ్ జీన్స్ మీద బ్లూ కలర్ టీషర్ట్ ధరించాడు. మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్.


పత్రలేకను కుర్చీకి కట్టేసాడతను, “నా సేఫ్టీ కోసం...” అంటూ. “ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా?” అనడిగాడు. లేరన్నట్టు తల అడ్డుగా ఊపిందామె.


“గుడ్! ఒంటరిగా ఉన్నావని భయపడకు. నిన్నేమీ చేయన్లే” అని అతను అనడంతో, కొంచెం ధైర్యం చిక్కింది ఆమెకు.


ఇల్లంతా ఓసారి తిరిగివచ్చాడతను. ఫ్రిజ్ లోంచి బ్రెడ్, బటర్, జామ్, సాఫ్ట్ డ్రింక్ బాటిలూ తెచ్చుకుని ఆమె ఎదురుగా కూర్చున్నాడు. “సారీ, ఆకలిగా ఉంది” అంటూ అవురావురుమంటూ తిన్నాడు. తరువాత సాఫ్ట్ డ్రింక్ త్రాగాడు. “స్నానం చేయాలి.. బాత్ రూమ్ ఎక్కడుంది?” అనడిగాడు. చెప్పిందామె.


స్నానం చేసి వచ్చి, “షవర్ క్రింద నిలుచుంటే టైమే తెలియదు సుమా!” అన్నాడు టవల్ తో తల తుడుచుకుంటూ. అతని ప్రవర్తనకు ఓ పక్క ఆశ్చర్యంగానూ, మరోపక్క ఆగ్రహం గానూ ఉందామెకు. 
టీవీ ఆన్ చేసి వెస్టర్న్ మ్యూజిక్ పెట్టాడు. కొంతసేపటి తరువాత వాచ్ చూసుకుంటూ, “నేను వచ్చి గంట దాటిపోయింది. ఈపాటికి పోలీసులు వెళ్ళిపోయుంటారు. వెళ్తాను, థాంక్స్!” అంటూ లేచాడు. 
అంతలోనే అతని దృష్టి, ఓ మూలగా ఉన్న ఈసిల్ మీద పడింది. “ఏమిటిది? పెయింటింగా?” అంటూ దాని పైన కప్పిన గుడ్డను తీసాడు. రంగులు ఆరేంతవరకు ధూళి పడకుండా దాన్ని కవర్ చేసిందామె.
ఆ పెయింటింగ్ ని చూడగానే ఫెయింట్ అయినంత పని చేసాడు అతను. “వీడి చిత్రం వేసావేమిటీ? వీడు నీకు ఏమవుతాడు?” అంటూ ప్రశ్నించాడు, ముడివడిన భ్రుకుటితో.


“అతను మీకు తెలుసా?” సంభ్రమంతో అడిగింది పత్రలేక.


“వీడు ఒకప్పటి నా ఫ్రెండ్. పేరు రాజ్ కుమార్…” చెప్పాడతను. “గొప్ప ఫ్రాడ్ మాస్టర్!” 
తెల్లబోయింది పత్రలేక. “మీరు పొరబడుతున్నారు. ఇతను జర్నలిస్ట్. చాలా మంచిమనిషి” అంది.
ఫకాలున నవ్వాడు. అతను చెబుతూన్నది వింటూంటే  నిశ్చేష్ఠురాలయిందామె… ‘తన పేరు గోవిందు. తానూ, రాజ్ కుమార్ విశాఖపట్టణంలో ఒకే అనాధాశ్రమంలో పెరిగారు. ఇద్దరూ పదవ తరగతితో చదువుకు స్వస్తి చెప్పారు. బ్రతుకుతెరువు కోసం గోవిందు దొంగగా మారాడు. రాజ్ కుమార్ తెలివైనవాడు. ఎలా నేర్చాడో, హ్యాకింగ్ కళ నేర్చాడు. సైబర్ నేరాలకు పూనుకున్నాడు.  ఫ్రాడ్ తో బాగా సంపాదిస్తూ జల్సా జీవితం గడుపుతున్నాడు. నాలుగు నెలల క్రితం నగరంలోని ఓ బిజినెస్ మేన్ ఎకౌంట్ ను హ్యాక్ చేసి ఐదు కోట్లు కాజేసారు ఎవరో. అది రాజ్ కుమార్ పనేననీ, నేపాల్ పారిపోయాడనీ పోలీసులు నిర్ధారించి, అతని కోసం గాలిస్తున్నారు…’ 
ఆ తరువాత గోవిందు పలుకులు పత్రలేక చెవుల్లో దూరడంలేదు…ఎ.టి.ఎం. లో చిక్కుకుపోయిన తన డెబిట్ కార్డ్ ని రాజ్ కుమార్ క్షణాలలో రిట్రీవ్ చేయడం…తన ఎకౌంట్ లోంచి హ్యాక్ చేయబడ్డ సొమ్మును వాపసు చేయించడం…హఠాత్తుగా మదిలో మెదిలాయి. 
“బీ కేర్ ఫుల్, మిస్!” హెచ్చరికగా అన్నాడు గోవిందు ఆమె కట్లు విప్పుతూ. “బై ద బై, డోర్ బెల్ వినిపించగానే పరుగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచేయొద్దు. అప్పుడప్పుడు నాలాంటివాళ్ళు కూడా వస్తూంటారు…”


అతను వెళ్ళిన చాలాసేపటి వరకు చేష్టలు ఉడిగి ఉండిపోయింది పత్రలేక. అంతలో వాట్సాప్ లో రాజ్ కుమార్ నుండి మెసేజ్ వచ్చింది – ‘కారణాంతరాలవల్ల ఇంటికి రాలేకపోతున్నాను. ఫలానా చోట నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడికి రా…’


కొద్ది క్షణాలపాటు ఆలోచిస్తూ ఉండిపోయింది. తరువాత ల్యాప్ టాప్ తీసి నెట్ లో సిటీ పోలీస్ సైట్ లోని సైబర్ క్రైమ్స్ విభాగానికి వెళ్ళింది. అందులో - రాజ్ కుమార్ ఫొటో! దాని క్రింద ‘వాంటెడ్ ఇన్ సైబర్ క్రైమ్స్’ అని రాసివుంది. 


కాసేపు వెక్కివెక్కి ఏడ్చిందామె. తరువాత మనసు దిటవుచేసుకుని, సెల్ ఫోన్ తీసింది – రాజ్ కుమార్ ఆచూకీ పోలీసులకు తెలియపరచేందుకు!!