మన్మథుడు

A Romantic Story by Pasupuleti Satya Sreenivas. "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది.." అంది యామిని. "ఆరతీ.. నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు.." అడిగింది వసుంధర.

మన్మథుడు

మన్మథుడు

పసుపులేటి సత్య శ్రీనివాస్ 

 

                   ఆరతి తన ఫ్రెండ్స్‌తో  కాఫీడేలో కూర్చుంది. అంత అందమైన అమ్మాయిలు ఒక్క చోట చేరి కిలకిల లాడుతూ ఉంటే వివిధ వర్ణాల గులాబీతోట విరబూసిందేమో అన్నట్టుగా ఉంది చూడడానికి.   ఆమె ఒక గంట నుండీ చాలా లోతుగా చర్చ జరుపుతోంది వాళ్ళతో.  అందరి ముఖాలలోనూ కుతూహలం. అందమైన ఆ కనురెప్పల వెనుక కళ్ళల్లో ఎన్నెన్నో భావాలు తొణికిసలాడుతున్నాయి. ఆ ఎన్నెన్నో భావాలమధ్య కూడా వాళ్ళందరికీ స్పష్టంగా కపిపించింది ఒక ప్రత్యేకమైన కుతూహలం.

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మాకందరికీ క్లారిటీ వచ్చేసింది.." అంది యామిని.

     "ఆరతీ.. నువ్వు అతన్ని మొదటిసారి ఎప్పుడు చూసావు.."  అడిగింది వసుంధర.

     "బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఫ్లైట్‌లో నా పక్క సీటే అన్నానుగా.. అదే మొదటిసారి చూడడం. "

            'నిన్న క్రాస్ వరల్డ్ లో బుక్స్ చూస్తుంటే కనిపించాడు మళ్ళీ'  అంది ఆరతి.

     "ఓ.. ఐసీ.. ఫ్లైట్‌లో మాటలమధ్యలో ఆ మర్నాడు ఇనార్బిట్‌మాల్‌కి వెళతానని చెప్పుంటావు.. నీలాంటి బ్యూటీతో మళ్ళీ మాట్లాడాలనుకుంటాడు. వచ్చి కలిసాడు. " అంది వసుంధర.

     "నిన్ను కావాలని వెంటాడుతున్నాడేమో"  అంది పల్లవి కళ్ళు పెద్దవి చేసి.

     "అబ్బ ఉండవే.. ఇదేమైనా వెంటాడు వేటాడు సినిమా అనుకున్నావా.. ఇప్పుడే మొదలయిన అందమైన ప్రేమకథ" అంది సౌందర్య.

     "ఊ.. ఊ.. నేనేమీ ప్రేమించెయ్యడంలేదు అతనిని.." అంది ఆరతి ఉడుక్కుంటూ

            "ఆరతీ.. నువ్వు మన మెడికల్ కాలేజి బ్యూటీవి.  అతను నీ వెంట పడటంలో ఆశ్చర్యం ఏవుంది చెప్పు. అయినా అందగాడే కదా" అంది యామిని.

            "అవును..  మన్మథుడి లా ఉన్నాడు" అంది వసుంధర ఆరతి చేతిలోని మొబైల్ లో అతని ఫొటో చూస్తూ. అది ఫ్లైట్‌లో ఆరతి తీసుకున్న సెల్ఫీ.

     "అతను అందగాడయితే సరిపోదే.. బుద్ది కూడా అందంగా ఉండాలి కదా.." అంది సౌందర్య.

     "ఓకే.. దానికంత ఆలోచనెందుకు..  ఏమయింది మన ఆడపిల్లలకి. నీవెంట పడుతున్నందుకు అతనికి చెల్లించక తప్పదు భారీమూల్యం' అంది యామిని. 

            "అంటే ఏంటో క్లియర్ గా చెప్పు" అంది ఆరతి.

            "అతను నిన్ను పిలిచింది డిన్నర్‌కే కదా.. వెళ్ళి భారీగా బిల్ చేసి అతన్ని టెస్ట్ చెయ్యి.." అంది యామిని సింపుల్ గా.

            తక్కిన ఆడపిల్లలంతా వత్తాసు పలికారు. "నీ ఒక్కదాని వల్ల కాకపోతే మా ఫ్రెండ్స్ ట్రీట్ అడుగుతున్నారని చెప్పు. మేము కూడా వస్తాం.  వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాంలే" అంది వసుంధర.

            "ఓకే. మీరంతా వస్తానంటే నేను ఓకె చెప్తాను. చూస్తాను ఏమంటాడో.. అంది ఆరతి.

     "మన్మథుడు ఓకే అంటాడు.. నాకు తెలుసు.." అంది యామిని.

            హోటల్ తాజ్ కష్ణలో ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఆరతి ఆమె ఫ్రెండ్స్‌తో సహా హాజరయింది.  ఆమె నలుగురి ఫ్రెండ్స్ కి ఒక టేబుల్ రిజర్వ్ చేసి ఉంది, ఆమెకు 'మన్మథుడీకి మరో టేబుల్ రిజర్వ్ చేసి ఉంది. వాళ్ళు వెళ్ళి కూర్చున్న కొద్దిసేపటికి అతను వచ్చాడు.

            ఆరతి ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్ళే ముందు ఆమె ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర ఆగాడు. 'హాయ్ గాళ్శ్ అన్నాడు నవ్వుతూ.

            అప్పటివరకు అతని పైన బోలెడన్ని జోక్స్ వేసుకున్నా అతను అంత చొరవగా వచ్చి తమను మాట్లాడించేసరికి అమ్మాయిలందరూ సైలంట్ అయిపోయారు. వసుంధర ఒక్కతే కాస్త ముందుగా తేరుకుంది. "మేమంతా రావడం వల్ల మీకు ఇబ్బందనిపిస్తుందేమో.. సారీ.. మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాము" అంది.

            "నో నో.. మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. వియ్ ఆర్ ఆల్ ఫ్రెండ్స్..  ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్వెస్" అన్నాడు

            "అలాగే,  థాంక్స్. మీ పేరు" అంది వసుంధర, మన్మథుడి అసలు పేరు ఏమిటా అనుకుంటూ.

అ అమ్మాయిలందరూ కలిసి అతనికి 'మన్మథుడ అనే నిక్ నేం  పెట్టారు. అదే బాగుందనుకుని దాన్నే కంటిన్యూ చేస్తున్నారు.

            "ప్రద్యుమ్న్.."అన్నాడు నవ్వుతూ.

            తన ఫ్రెండ్స్ టేబుల్ దగ్గర అంత సేపు ఏం చేస్తున్నాడా అనుకుంటూ చూస్తోంది ఆరతి. అంతలో ఆమె దగ్గరకు వచ్చి "హాయ్.. కొద్దిగా లేటయింది  నేను రావడం.." అన్నాడు ప్రద్యుమ్న్.

            "అదేం ఫరవాలేదు. మా వాళ్ళు ఏమైనా సతాయించారా.." అంది ఆరతి అనుమానంగా.

            "ఏం లేదు. యు హావ్ నైస్ ఫ్రెండ్స్.." అంటూ కాంప్లిమెంట్ చేసాడు.

            అతనితో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు ఆరతికి. రెండు గంటల తర్వాత వాళ్ళందరిని  కాబ్‌లో  హాస్టల్‌కి  పంపించాడు.

            రిటర్న్ జర్నీలో అమ్మాయిలందరిదీ ఒకేమాట.. "నీ మన్మధుడికి మేము కూడా ఫిదా.."  అంత వెల్ బ్రెడ్ మనిషిని, సినిమా హీరోలకే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ తెప్పించే లాంటి ఫిజిక్ ఉన్నవాడిని, సంస్కారవంతుడిని అంతవరకూ చూడలేదని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.

     "అయితే ఆరతి కోసం అతను అంత ఖర్చు పెట్టడం ఎందుకు.. " అతనికి ఆమె పైన ఎంత ఇష్టం ఉన్నా  ఎంతటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకుందామన్నా వాళ్ళకి అందులో ఏదో అసహజంగా అనిపించింది.

      ఆ విషయం ఆరతికి చెప్తే ఎలా ఫీలవుతుందో అని కార్ లో తిరిగి వెళ్తున్నప్పుడు ఎవరికి వారు లోలోనే అనుకున్నారు.  హాస్టల్‌కెళ్ళాక అందరూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాత్రం  బయటపడిపోయారు. ఆరతి మనసులోనూ అదే సందేహం కలిగింది. కాని ఆమె బయటికి చెప్పలేదు.

           

            "సరే, నాకు మరో రోజు టైం ఇవ్వండే, అతను ఈ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ఏ మూల దాగి ఉన్నా.. వెతికి పట్టుకువచ్చే బాధ్యత నాది.." అంది పల్లవి, అలనాడు బాణుడి కూతురు ఉషకు అనిరుద్ధుడి చిత్రపటం గీసి ఇస్తానన్న చిత్రలేఖలా వాగ్దానం చేస్తూ.

            "సరే, ఆ పనిలో ఉండు నువ్వు" అంది యామిని.

            ఆ మర్నాడు ఆదివారం కావడంతో అందరూ తీరికగా లేచి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్తూ పల్లవి కోసం చూస్తే ఆమె నిద్రపోతూ కనిపించింది. ఆమె రూం మేట్ యామిని  చెప్పింది  "అది రాత్రంతా నిద్రపోకుండా ఆ మన్మథుడి ప్రొఫైల్ కోసం ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్ఇన్, ట్విట్టర్ ల వంటి అన్ని సోషల్ మీడియా నెట్ వర్కులలోను వెతుకుతూనే ఉంది. ఎప్పుడు పడుకుందో కూడా తెలియదు" అంది.

            వాళ్ళ మాటలకు ముసుగు తీసి చూసింది పల్లవి.  రాత్రంతా నిద్రలేకపోవడంవల్ల ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి.

            "ఏమయిందే, నెట్ వేసి సోషల్ మీడియాలలో ఎక్కడ ఉన్నా పడతానన్నావుగా, పట్టావా.."నిలదీసింది యామిని, పల్లవి లేవడం గమనించి.

            "లేదు తల్లీ, లేదు. రాత్రంతా అన్నీ వెతికాను, కానీ ఫలితం శూన్యం" అంది పల్లవి ఒళ్ళు విరుచుకుంటూ.

            "అయితే ఇక నువ్వే కనుక్కోవాలి" అంది సౌందర్య ఆరతి వైపు చూస్తూ.

            సాలోచనగా ఆమె వైపు చూసి తన ఫోన్ నుంచి మెసేజి పంపింది ఆరతి. వెంటనే ప్రద్యుమ్న్ నుంచి రిప్లై వచ్చింది. అది చూసి ఆమె కళ్ళు పెద్దవి అయ్యాయి.

            "ఏమయింది.." అంది యామిని ఆరతి మొఖంలో మార్పులు చూసి.

            "ఇదేంటే, తనకు ఏ సోషల్ మీడియాలోనూ అకౌంట్ లేదు అంటున్నాడు. ఇదెలా సాధ్యం" అంది ఆరతి.

            "నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది ఇతని వ్యవహారం. మీరు నేను చెప్పింది సీరియస్ గా తీసుకోవాలి ఇప్పటికైనా. కనీసం ఫేస్‌బుక్ లో అకౌంట్ లేదంటే ఎలానే నమ్మడం. తన వివరాలు మనకు తెలిసిపోతాయని కావాలని అబద్ధం చెపుతున్నట్లున్నాడు. ఆరతీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి.." అంది యామిని సీరియస్‌గా.

            కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ఆరతి పైన కొంచెం జాలి కలిగింది వాళ్ళకి. అంత స్మార్ట్‌గా ఉన్నవాడు ఆమెకోసం పడి చస్తున్నాడు అంటే తమకు కూడా కాస్త అసూయ కలిగిన విషయం గుర్తుకి తెచ్చుకున్నారు.

            "అవునే ఇప్పుడు అందరూ డిజిటల్ ఐడెంటిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అతను తన డిజిటల్ ట్రేస్ దొరక్కుండా ఉంచాలి అనుకుంటున్నాడేమో.. ఎందుకన్నా మంచిది ఒకసారి అతని బాక్ గ్రౌండ్ చెక్ చేసాకే ఏదైనా డెసిషన్ తీసుకో.." అంది పల్లవి.

            స్నేహితురాళ్ళ సలహాలతో బుర్ర గిర్రున తిరిగింది ఆరతికి ఈ మన్మథుడి వెనక రహస్యం ఏమిటో అర్థం అయి చావడం లేదే అనుకుంది. అతనిలో నిజమెంత.. అబద్ధం ఎంత.. అనేది తేల్చుకోవడానికి తనే ఏదైనా చేయాలి అనుకుంది. స్నేహితురాళ్ళతో తన ఆలోచన చెప్పింది. వాళ్ళు విన్నారు, చాలా ఎక్సైటెడ్ గా. "కానీ ప్రమాదం కదే.." అంది యామిని.

            "సరేలే రిస్క్ తీసుకుంటేనే కదా నిజం తెలిసేది. అయినా మనమంతా ఉంటాంగా" అంది పల్లవి.

            వాళ్ళందరూ ఉన్నారన్న ధైర్యంతో గుండెలు చిక్కబట్టుకుని మన్మథుడికి ఫోన్ చేసి మాట్లాడింది ఆరతి. ఆమె కాల్ చేయడం పూర్తి అయ్యేవరకూ ఒక్క శబ్ధం కూడా చేయకుండా ఆమె వైపే చూసారు మిత్రబౄందమంతా!

            "ఏమన్నాడు" అన్నారు స్నేహితురాళ్ళంతా ఏకకంఠంతో, ఆమె కాల్ ముగించగానే!!

            "సరే.. అన్నాడు" అంది ఆరతి. ఆమె మొఖంలో అనందం లేదు. ఒక మాదిరి టెన్షన్, మరో రకమైన తెగింపు కనిపించాయి

            ఆ రోజు రాత్రి ప్రద్యుమ్న్ ఉన్న హోటల్ గది బయట ఎవరో బజర్ నొక్కారు. లాప్ టాప్ ముందు కూచుని ఏదో పని చేసుకుంటున్న ప్రద్యుమ్న్ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఒక కాశ్మీరీ షాల్ తో భుజాలు పైన నిండుగా కప్పుకుని అందాల భరిణె లా నుంచుని ఉన్న ఆరతిని చూసి ఆశ్చర్యంతో అతని కనులు పెద్దవయ్యాయి. కానీ వెంటనే సంభాళించుకుని, "కం.. కం.." అంటూ తను లోపలికి వెళ్ళాడు. గది తలుపు దగ్గరగా వేసి అతని వెనక రాయంచలా నడుచుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆరతి.

            అతని గది విశాలంగా, చాలా రిచ్ గా ఫర్నిష్ చేయబడి ఉంది. టివి రన్ అవుతుంది కాని చాలా లో వాల్యూం లో ఉంది. అతని లాప్ టాప్ తెరిచి ఉండటం చూసి, 'మీ పని డిస్టర్బ్ చేసానా.." అంది ఆరతి.

            "నో.. నో.. అదేమీ లేదు. నువ్వు వచ్చే లోగా ఏదైనా పని చేసుకుందామని అనుకున్నా అంతే.." అన్నాడు పట్టుబడ్డ దొంగలా

            "ఓ.." అంటూ అతను ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. భుజాల చుట్టూ ఉన్న అందమైన కాశ్మీరీ షాల్‌ను భుజాల మీదుగాజారవిడిచింది. ఆమె నున్నటి భుజాలపైనుంచి, ఆమె చేతులమీదుగా మౄదువుగా అది జారుతూ ఉంటే ఆమెను చూసిన ప్రద్యుమ్న్ కి గుండె జారినట్లయింది. కళ్ళప్పగించి ఆమె బంగారు మేని ఛాయను చూస్తూ ఉండిపోయాడు.

            ఆమె వేసుకున్న స్లీవ్ లెస్ డ్రె స్ వెనుక వైపు ఆమె నున్నటి వీపు కనిపించి అతని నోరు దాహంతో ఎండిపోయింది. ముందుకి చూస్తే ఒక ముత్యాల హారం ఆమె ఎదలోతులలో ఇరుక్కున్నట్లు కనిపించింది. నల్లటి వెల్వెట్ డ్రెస్ లో ఆమె మరింత అందంగా కనిపించింది. బహుశా ఈ అందం అందరి మతులు పోగొట్టకూడదనే సదుద్దేశంతోనే ఆమె ఆ కాశ్మీరీ షాల్ కప్పుకున్నట్లుంది అనుకున్నాడు.

           

"మరి డిజిటల్ టెక్నాలజీని వాడుతున్నారు గాని సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారు.." అంది లేచి అతని వైపు నడిచి అతని ముందుకొద్దిగా వంగి అతని కనులలోకి సూటిగా చూస్తూ. అలా ఆమె వంగినప్పుడు ఆమె లోనెక్ డ్రెస్ లో ఆమె అందాలు కనువిందు చేస్తుంటే అతని చూపులు అటు పరిగెత్తాయి. తను కోరుకున్న ఎఫెక్ట్ అతనిలో వచ్చింది అనుకుంది ఆరతి. మనిషికి కామం కలిగితే బుద్ధి నశిస్తుంది. అప్పుడు నటించే శక్తి కోల్పోతాడు. మనసులో ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, మౄగం ఉంటే అదే బయటకు వస్తుంది. ఒక వేళ మౄగమే గనుక వస్తే తన మిత్రులకు ఒక్క సిగ్నల్ చేస్తే తలుపులు బద్దలు కొట్టుకునైనా వచ్చేస్తారు అనుకుంది ఆరతి. అందుకే తను తలుపులు దగ్గరగా వేసింది గాని లాక్ చేయలేదు.

            "ఆరతీ.. నెట్ లో మనం ముక్కు మొఖం తెలియని వాళ్ళను మొక్కుబడిగా స్నేహితులుగా భావించడం నాకు ఇష్టం ఉండదు. నాకు నిజంగా పరిచయం అయిన వాళ్ళలో ఎవరితోనైనా అభిరుచులు కలిసినప్పుడు నా స్నేహితులుగా చేసుకుంటాను. నీతో మాట్లాడి నీ వ్యక్తిత్వం నచ్చింది కనుకే నీ స్నేహం కోరుకున్నాను. నీతో జీవితం పంచుకోవడానికి ఆశపడుతున్నాను.." అన్నాడు చూపులు ఆమె పైనుంచి తప్పించి దూరంగా ఉన్న గోడని చూస్తూ.

            ఫ్రెండ్స్ సందేహపడినట్టు అతను వేరే విధంగా ప్రవర్తించకపోవడం ఆరతికి చాలా ఆనందం కలిగించింది.

            "స్నేహం అంటే డేటింగ్ లాగానా.. లేక మామూలు స్నేహమేనా.." అలా మాట్లాడడం ఆమె స్వభావం కాదు.. అయినా కాస్త కవ్వించింది. ఎందుకంటే అప్పటికే అతను మంచివాడిలా ఉన్నాడు అని అనుకుంటున్నా.. బాగా వేడి మీద ఉన్నప్పుడే ఒక దెబ్బ వేస్తే బంగారం క్వాలిటీ బయట పడుతుంది అన్నట్లుగా.

            ఒకసారి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసాడు. అతని చూపులు ఆమె మనసు లోతులలోకి చొచ్చుకుపోయిన అనుభూతి కలిగింది. మనసులో ఏమూలనైనా అతన్ని మభ్యపెట్టాలి, భ్రమింప చేయాలి అన్న ఆలోచన ఉన్నా ఆ చూపుతో అవి ఆవిరి అయిపోయాయి. అతని చూపులను తప్పించుకోవడానికి లేచింది ఆరతి.

            "నీ పెద్దవాళ్ళతో మాట్లాడి నీకు ఇష్టమైతే నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను.." అన్నాడు. అతని మాటలలోని నిజాయితీకి చలించిపోయింది ఆరతి. ఏమి మాట్లాడాలో తెలియలేదు ఆమెకి. లేచి రెండు అడుగులు టివి వైపు వేసింది. హైహీల్ వేసుకున్న ఆరతి కాలు అనుకోకుండా మడతపడి ఆమె తూలి పడింది. నిజానికి అలా పడటం ఆమె ప్లాన్ లో లేదు.

            చటుక్కున లేచి ఆమె పడకుండా పట్టుకున్నాడు ప్రద్యుమ్న్. అతని వెచ్చని స్పర్శకు ఆమె దేహమంతా పులకరించింది.. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది.. అంతలో ఆమె చేతిలో ఉన్న కీ చైన్ కిందకు జారింది. ఒక చేత్తో ఆరతి నడుము చుట్టి తనకు దగ్గరగా హత్తుకుని ఉన్న ప్రద్యుమ్న్ మరో చేత్తో దాన్ని కిందపడకుండా పట్టుకుని, అటూ ఇటూ చూస్తూ.. "ఈ బటన్ ఏమిటి.." అన్నాడు.

            ఆ ప్రశ్న పూర్తి కాకుండానే.. "దాన్ని నొక్కొద్దు.." అంది ఆరతి హడావుడిగా. కానీ అంతలోనే ప్రద్యుమ్న్ దాన్ని నొక్కేసాడు.. సరిగ్గా పది సెకన్లలో కారిడార్ లో కలకలం రేగింది. దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుంటూ ఆరతి స్నేహితులు లోపలికి వచ్చేసారు.

            హఠాత్తుగా అలా వచ్చిన ఆరతి స్నేహితులను చూసి ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్న్.

            ప్రద్యుమ్న్ చేయి ఆరతి నడుము చుట్టూ, ఆమె చేయి అతని మెడ చుట్టూ ఉండటం చూసి తాము అనుకున్న పరిస్థితికి వ్యతిరేకంగా ఉండటంతో ఆరతి మిత్రబౄందం కూడా షాక్ అయ్యారు. ఆరతి పైన దాడి చేస్తూ ఉంటాడు ఆ మన్మథుడు అనుకున్నారు గాని వాళ్ళిద్దరూ రతీమన్మథులలాగా ఆనందంగా ఒకరినొకరు కౌగలించుకుని ఉంటారని వాళ్ళు ఊహించనేలేదు.

            అందరినీ చూసి కాస్త ఇబందిగా ఫీలయినా, వెంటనే ఫక్కున నవ్వేసింది ఆరతి. ప్రద్యుమ్న్‌కి కూడా ఆరతి తనను పరీక్షించిందని అర్థం అయిపోయి అతను కూడా గట్టిగా నవ్వాడు. వాళ్ళిద్దరి నవ్వులకు ఆరతి స్నేహితుల కిలకిలారావాలు తోడవడంతో అక్కడ ఆనందం వెల్లి విరిసింది.

            ఆరతికి మన్మథరహస్యం తెలిసింది. అతనికి తనపైన ఉన్న ప్రేమ నిజమని తెలుసుకుంది.  అది అర్ధం చేసుకున్న ఆరతి ఫ్రెండ్స్ కూడా సంతోషంగా వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు చెప్పారు.