అచ్చిరాని అతితెలివి

This is a crime story by Thirumalasri. తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ, చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ. వీధి తలుపుకు ఉన్న గోద్రెజ్ తాళంకప్పను చూడగానే వాడి కన్నులు మెరిసాయి. జేబులోంచి తాళపుచెవిని తీసి కప్పలో దూర్చి రెండు త్రిప్పులు త్రిప్పేసరికి తాళం తెరచుకుంది. లోపల ప్రవేశించి, తలుపు మూసేసాడు.

అచ్చిరాని అతితెలివి

క్రైమ్ స్టోరీ

అచ్చిరాని అతితెలివి

రచనః తిరుమలశ్రీ

***

            జాకీ ఓ ర్యాగ్ పిక్కర్. పదిహేడేళ్ళుంటాయి. పొడవుగా, పీలగా ఉంటాడు. కాంప్లెక్స్ ల నుండి చెత్త కలెక్ట్ చేసుకుని బండిలో తీసుకువెళ్ళే రజని వాడి గాళ్ ఫ్రెండ్. జాకీకి రజని అంటే పిచ్చిప్రేమ. తాను కోరింది ఇవ్వకపోతే ఊరుకోదామె. రోజుల తరబడి వాడితో మాట్లాడడం మానేస్తుంది.

వారం రోజుల్లో వారి అభిమాన నటుల సినిమాలు – ‘అల వైకుంఠపురములో...’, ‘సరిలేరు నీకెవ్వరు’ - ఒకేసారి విడుదలకాబోతున్నాయి. వాటికి తీసుకువెళ్ళమని అడిగింది రజని. పాప్ కార్న్ తింటూ సినిమా చూడడమంటే ఇష్టం ఆమెకు. జాకీ దగ్గర డబ్బులు లేవు.

ఆరోజు నాచారంలో చెత్త ఏరుతున్నాడేకానీ వాడి మనసంతా చికాకుగా ఉంది. ఎలాగోలాగున డబ్బులు సంపాదించాలి. రజనిని సినిమాలకు తీసుకువెళ్ళాలి. లేకపోతే అది తనతో పోట్లాడి విడిపోతుందేమోనన్న భయం.

          అదిగో, అప్పుడే…దొరికింది జాకీకి ఆ మనీపర్స్. ఎన్టీయార్ గార్డెన్స్ దగ్గర పేవ్ మెంట్ మీద!

          ఆశతో ఆత్రుతగా పర్స్ ను తెరచి చూసిన వాడికి నిరుత్సాహమే కలిగింది. అందులో వందరూపాయల కంటే ఎక్కువ లేవు. పర్స్ విండోలో చేతిరాతతో తెలుగులో ఓ చీటీ ఉంది. జాకీకి తెలుగు చదవడం వచ్చును. అది ఓ ఇంటి చిరునామా.  లోపల ఓ ‘గోద్రెజ్’ తాళపుచెవి కూడా కనిపించింది. ఆ చిరునామా ఆ పర్స్ యొక్క యజమానిదయివుంటుందనీ, తాళపుచెవి అతని ఇంటిదయివుంటుందనీ అనిపించింది.

          డబ్బులు జేబులో వేసుకుని పర్స్ ని విసిరేయబోయాడు. అంతలోనే బుర్రలో లైట్ వెలగడంతో ఆగిపోయాడు. వాడి మెదడు చురుకుగా పనిచేయనారంభించింది…సాధారణంగా ఎవరూ తాళపుచెవిని అలా పర్స్ లో పెట్టుకుని తిరగరు. బహుశా ఆ వ్యక్తి ఒంటరిగాడయి వుండొచ్చుననిపించింది. ఆ తాళపుచెవిని ట్రై చేస్తేనో? సినిమాకి సరిపడా డబ్బులు దొరకవచ్చును...ఎ.టి.ఎమ్. కార్డ్ ‘పిన్’ తో సహా దొరికినంతగా సంబరపడిపోయాడు.

          అంతలోనే భయం వేసింది వాడికి. ఎప్పుడూ దొంగతనం చేయలేదు తాను. కానీ రజని గుర్తుకు రావడంతో భయంపీక నొక్కి, ధైర్యం పుంజుకుని…ఆ చిరునామాని మరోసారి వీక్షించాడు. నాచారంలోని హెచ్.ఎమ్.టి. నగర్ లోనిదది…ఆ కాగితాన్ని, తాళపుచెవినీ తీసి జేబులో వేసుకుని మనీపర్స్ ను విసిరేసాడు. భుజాన ఉన్న గోనెసంచిని డస్ట్ బిన్ వెనుక దాచి, ఆ కాలనీ వైపు నడిచాడు.  

          అప్పుడు సమయం ఉదయం పది గంటలు దాటి పది నిముషాలు అయింది…

#

          హెచ్.ఎమ్.టి. నగర్ లోపలికి వెళితే కాలనీకి ఎడమవైపు చివరగావున్న అపార్ట్మెంట్స్ కు కాస్త దూరంగా ఉంది ఆ చిరునామా. ఓ పాతకాలపు పెంకుటిల్లు. ఓ పక్క ఏదో షెడ్డూ, రెండో పక్క అటువంటిదే ఓ చిన్న ఇల్లూ ఉన్నాయి.

          తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ, చెత్త ఏరుతున్నట్టు నటిస్తూ ఇంటి గుమ్మం ముందు నిలుచున్నాడు జాకీ. వీధి తలుపుకు ఉన్న గోద్రెజ్ తాళంకప్పను చూడగానే వాడి కన్నులు మెరిసాయి. జేబులోంచి తాళపుచెవిని తీసి కప్పలో దూర్చి రెండు త్రిప్పులు త్రిప్పేసరికి తాళం తెరచుకుంది. లోపల ప్రవేశించి, తలుపు మూసేసాడు.

లోపల ఓ హాలు, రెండు గదులు, కిచెను, బాత్ రూమూ ఉన్నాయి. హాల్లో కేన్ సోఫాసెట్టు, రెండు ప్లాస్టిక్ చెయిర్సు, ఓ వుడెన్ స్టూలు, టీవీ, చిన్న డైనింగ్ టేబుల్, వగైరాలు ఉన్నాయి. కిచెన్ తప్ప గదులు రెండూ మూసివున్నాయి.

ఓ గదిలో ప్రవేశించాడు జాకీ. అందులో ఓ సింగిల్ కాట్, రైటింగ్ టేబుల్, కుర్చీ, ఓ స్టీలు కప్ బోర్డ్, ఓ చెక్క బీరువా, బట్టల స్టాండ్ ఉన్నాయి. చెక్కబీరువాలో ఆడ, మగ దుస్తులు ఉన్నాయి…స్టీల్ బీరువా లాక్ చేసివుంది. అందులో డబ్బు, నగలూ ఉంటాయని ఊహించాడు. దాన్ని తెరవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. తాళం పగులగొడితే ఆ చప్పుడుకు ఎవరైనా వస్తారేమోనని భయం వేసింది. కీహోల్ లో పెట్టి త్రిప్పేందుకు షార్ప్ పనిముట్టు ఏదైనా కనిపిస్తుందేమోనని గదిలోను, హాల్లోనూ, కిచెన్ లోనూ వెదికాడు. ఏదీ కనిపించలేదు. ఫ్రిజ్ మీదున్న సెల్ ఫోన్ కంటపడడంతో దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు.

రెండో గది తలుపు తెరచిన జాకీ ఉలిక్కిపడ్డాడు…గది మధ్యగా ఉన్న డబుల్ కాట్ బెడ్ మీద పడుకుని ఉంది ఓ యువతి!

చటుక్కున తలుపు వెనుక నక్కాడు వాడు. ఆమెలో కదలిక కనిపించకపోయేసరికి కొన్ని నిముషాల తరువాత లేచి మెల్లగా ఆమెను సమీపించాడు. నిద్రపోతోందనుకుని ఆమె పైకి వంగి పరీక్షగా చూసాడు.

వెల్లకిలా పడుకునివుందామె. కనుగ్రుడ్లు తెరచుకుని నిశ్చలంగా ఇంటి పైకప్పునే చూస్తున్నాయి. నాలుక బైటకు పొడుచుకువచ్చింది…ఏదో అనుమానం పొడసూపడంతో భయపడుతూనే ఆమె ముక్కు దగ్గర వ్రేలు పెట్టి చూసాడు. శ్వాస ఆడడంలేదు. ఆ యువతి చచ్చిపోయింది…!

హఠాత్తుగా భయం సునామీలా క్రమ్ముకుంది వాణ్ణి. ‘డబ్బుల మాట దేవుడెరుగు! ఎవరూ రాకముందే అక్కడ నుండి బైటపడాలి. లేకపోతే ఆమె చావు నా మెడకు చుట్టుకోవచ్చు…’ అనుకున్నాడు. అంతలోనే ఎక్కడి నుండో పోలీస్ సైరన్ వినిపించింది. వాడిలో కంగారు హెచ్చింది. గుమ్మం వైపు పరుగెత్తి వీధి తలుపు తెరచాడు. గుమ్మంలో – పోలీసులు…!!

#

హతురాలికి పాతికేళ్ళుంటాయి. పేరు అంజలి. చామనచాయ, సాధారణ పొడవు. నైటీలో ఉంది.

కనుగ్రుడ్లు తెరచుకుని, నాలుక బైటకు వచ్చి భయంకరంగా ఉంది. పీక పిసికి చంపబడ్డట్టు ఉబ్బిన మెడను చూస్తే అర్థమయిపోతోంది. మృతురాలు హంతకుడితో పెనగులాడిన సూచనలేవీ కనిపించలేదు.

స్నిఫ్ఫర్ డాగ్ పడగ్గదిలోని అంజలి శవాన్ని వాసన చూసి, అక్కడ నుండి నేలంతా వాసన చూసుకుంటూ హాల్లోంచి దొడ్డివైపు వెళ్ళి వెనుక గుమ్మం వద్ద నిలుచుంది. దగ్గరగా మూసియున్న ఆ తలుపును తెరవగానే బైటకు పరుగెత్తింది. ఇంటి పక్కగా వీధిలోకి దారితీసింది. దూరంగా ఉన్న అపార్ట్మెంట్స్ ఎదుటనున్న పేవ్ మెంట్ దగ్గరకు వెళ్ళి ఆగిపోయింది.  

హంతకుడు హత్యచేసి దొడ్డిదారి గుండా వీధిలో ప్రవేశించి రోడ్ మీద పార్క్ చేసిన వాహనంలో పరారయివుంటాడని భావించారు పోలీసులు. అక్కడ ఇసుకలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆనవాళ్ళను బట్టి అది ద్విచక్రవాహనం అయ్యుంటుందనుకున్నారు.

హతురాలి భర్త కరుణాకర్ ఇ.సి.ఎల్. క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఓ కెమికల్ కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. పోలీసుల కబురు అందుకుని పరుగెత్తుకొచ్చాడు.

కరుణాకర్ వయసు ముప్పై పైనే ఉంటుంది. అయిదడుగుల ఆరంగుళాల దృఢకాయం. ఫెయిర్ గా హ్యాండ్సమ్ గా ఉంటాడు. “స్నేహితురాలికి అబార్షన్ అయిందని తెలిసి మూడురోజుల క్రితం వరంగల్ వెళ్ళింది నా భార్య. ఉదయం ఇంటికి తాళంవేసి ఏడున్నరకు ఆఫీసుకు వెళ్లిపోయాను నేను. అంజలి ఇవాళ సాయంత్రానికి వస్తానని చెప్పింది. ఎప్పుడు తిరిగివచ్చిందో, ఇలా దుర్మరణం పాలయిందంటే నమ్మశక్యం కాకుండా ఉంది…” అంటూ భోరుమన్నాడు అతను.

కరుణాకర్, అంజలిల వివాహమయి మూడేళ్ళయింది. అప్పుడే సంతానం వద్దనుకున్నందున పిల్లలు లేరు. అయితే, ఆమధ్యే నిర్ణయించుకున్నారు నట్టింట్లో ఓ చంటిబిడ్డ పారాడుతుంటే బాగుంటుందని. ఆ ప్రయత్నంలో వారు ఉండగానే ఆ దుర్ఘటన జరగడం దురదృష్టకరం.

“ఒకవేళ మీ భార్య అనుకున్న వేళకు ముందే తిరిగివచ్చినట్లైతే మీకు ఫోన్ చేసేది కాదా?” అడిగాడు ఎస్సయ్. చేసేదన్నాడతను. ఆమె వద్ద డూప్లికేట్ ‘కీ’ ఉందని చెప్పాడు.

“మీ భార్య, మీరు అన్యోన్యంగా ఉండేవారా?” ఎస్సయ్ ప్రశ్నకు తలూపాడు కరుణాకర్. తమకు శత్రువులు ఎవరూ లేరన్నాడు. కరుణాకర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాడు ఎస్సయ్.

అప్పటికి వ్రేలిముద్రల నిపుణులు, ఫొటోగ్రఫర్, వీడియోగ్రఫర్ తమ తమ పనులు ముగించడం జరిగింది. శవాన్ని పరీక్షించి మరణసమయాన్ని ఉజ్జాయింపుగా నమోదుచేసి వెళ్ళిపోయాడు డాక్టర్. అనంతరం శవపంచాయితీ జరిపించి, శవాన్ని అటాప్సీ నిమిత్తం ఆంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించాడు ఎస్సయ్.  

#

పట్టపగలే ఇంట్లో ఒంటరిగా వున్న ఓ హౌస్ వైఫ్ దారుణంగా హత్యచేయబడిందన్న వార్తతో అట్టుడికిపోయింది ఆ ప్రాంతమంతా. హత్యాప్రదేశంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జాకీ నుండి పోలీసులు ఎంత ప్రయత్నించినా తనకేమీ తెలియదంటూ ఏడుస్తున్నాడు వాడు. కోర్ట్ వాణ్ణి రిమాండ్ కి పంపింది. ఓపక్క కరుణాకర్ రోజూ పోలీస్ స్టేషన్ కి వచ్చి ‘హంతకుడు దొరికాడా? వాణ్ణి నా చేతులతో గొంతు నులిమి చంపాలని ఉంది” అంటూ సతాయిస్తున్నాడు. ఇంకోపక్క వారం రోజులయినా కేసును సాల్వ్ చేయలేదంటూ స్థానిక రాజకీయనాయకులు పోలీసులను తప్పుపడుతున్నారు. దాంతో అంజలి హత్యకేసు క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించబడింది…

క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శివరామ్ అంజలి హత్యకేసుకు సంబంధించిన అటాప్సీ రిపోర్ట్ ను, ఫోరెన్సిక్ నివేదికలను, కరుణాకర్, జాకీల స్టేట్మెంట్స్ నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు…హత్య ఉదయం గం.9-20 – 9-35 నడుమ జరిగినట్లు నిర్ధారణ అయింది. హతురాలు గొంతునులిమి చంపబడింది. బలం కొంచెం ఎక్కువగానే ఉపయోగింపబడడంవల్ల ఆమె వెంటనే మరణించింది. హతురాలు ప్రతిఘటన సలపకపోవడానికి కారణం – హంతకుడు ఆమెకు తెలిసినవాడయినా అయ్యుండాలి. లేదా, అందుకు అవకాశం లేకపోయి అయినా అయ్యుండాలనిపించింది. ఆమె సెడెటివిలో ఉన్నట్టు కూడా రిపోర్టులో పేర్కొనబడింది. ‘అంటే, ఆమెకు ముందుగా సెడెటివ్ ఇచ్చి, ఆ తరువాత గొంతు నులిమి చంపివుంటారా? అందుకే ఆమె పెనగులాడలేదా?’ అనిపించింది..

తరువాత వ్రేలిముద్రల రిపోర్ట్ చూసాడు శివరామ్…హతురాలి కంఠంపైన వ్రేలిముద్రలేవీ లేవు! హంతకుడు వ్రేలిముద్రలను చెరిపేసైనా ఉండాలి, చేతులకు గ్లవ్స్ ఐనా తొడుక్కునివుండాలనిపించింది. ఆ దంపతుల వ్రేలిముద్రలు ఇంట్లో పలుచోట్ల లభిస్తే – ఇంటితాళంకప్ప పైన, వీధితలుపు మీద, గదుల తలుపుల మీద, చెక్కబీరువా, స్టీల్ కప్ బోర్డ్ ల పైనా, కిచెన్ లోనూ జాకీ వ్రేలిముద్రలు కూడా ఉన్నాయి. అయితే దొడ్డితలుపు పైన దంపతులవి కాక, మరో వ్యక్తి వ్రేలిముద్రలు ఉన్నాయి. ఆ వ్యక్తి జాకీ కాదు. అవి ఎవరివో పోలీసులు కనిపెట్టలేకపోయారు.

ముందుగా కరుణాకర్ ని పిలిపించి విచారించాడు శివరామ్…అంతకుమునుపు ఎస్సయ్ యాదవ్ కి చెప్పిన సంగతులే చెప్పాడు అతను.  ఉదయం 9 గంటలకు కంపెనీ చెక్ ఒకటి డిపాజిట్ చేయడానికి నాచారంలోని స్టేట్ బ్యాంక్ కి వెళ్ళినట్టు, ఆఫీసుకు తిరిగివచ్చిన కొంతసేపటికి పోలీసుల నుండి కబురు వచ్చిందనీ, అప్పుడు ఇంచుమించు పదిన్నర అవుతుందనీ చెప్పాడు. అంతేకాదు, ‘జాకీకి ఇంటితాళం ఎలా వచ్చిందని’ పోలీసులు అడిగేంతవరకు, తన మనీపర్స్ పోయిన సంగతి తాను గమనించనేలేదన్నాడు. ఆ ర్యాగ్-పిక్కర్ కుర్రాడు తాను బ్యాంక్ కి వెళ్లినప్పుడు తన పర్స్ కొట్టేసివుంటాడని భావిస్తున్నట్టు చెప్పాడు.

అతని సెల్ ఫోన్ ని ఇవ్వమంటే, “బిజినెస్ నంబర్లన్నీ ఇందులోనే ఉన్నాయి సార్! ఫోన్ లేకపోతే చాలా ప్రోబ్లెమ్ అవుతుంది నాకు” అన్నాడు కరుణాకర్.

“డజంట్ మేటర్. రెండు రోజులు ఎలాగో మేనేజ్ చేయండి” అంటూ మొబైల్ ని తీసేసుకున్నాడు శివరామ్. అనంతరం అతని వ్యక్తిగత సమాచారాన్ని కొంత రాబట్టుకుని, అవసరమయితే మళ్ళీ పిలుస్తానని చెప్పి పంపేసాడు.

కరుణాకర్ ఇంటి సమీపంలో సిసి కెమేరా లేదు. దూరంగా ఉన్న అపార్ట్మెంట్స్ వద్ద ఉంది. హత్య జరిగిన నాటికి మూడు రోజుల ముందునుండీ దాని ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నాడు పరిశీలించే నిమిత్తం.

తరువాత సబ్ జెయిల్ కి వెళ్ళి, రిమాండ్ లో ఉన్న జాకీని కలుసుకున్నాడు శివరామ్ …భయాందోళనలతో వణికిపోతున్నాడు వాడు. ఇన్స్పెక్టర్ కాళ్ళమీద పడి, తాను ఏ పాపమూ ఎరుగనంటూ భోరుమన్నాడు. వాడిని చూస్తే పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ లోని అంశం గుర్తుకువచ్చింది శివరామ్ కి… వాడి కంటే హతురాలు వయసులో పెద్దదే కాక, బలమైనది కూడాను. చాలీచాలని తిండితో పీలగా ఉండే ఆ కుర్రాడు అంత సులభంగా ఆమె పీకపిసికి చంపగలగడం సాధ్యమా అనిపించింది.

పైగా, జాకీ ఆ ఇంట్లో చొరబడ్డ కాసేపటికే ఎవరో పోలీసులకు ఫోన్ చేసి, ‘ఆ ఇంట్లో దొంగలు దూరినట్టు’ చెప్పారు! అందుకే పోలీసులు వెంటనే వచ్చి వాణ్ణి పట్టుకోవడం జరిగింది…పొలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు??

అక్కణ్ణుంచి ఎన్టీయార్ గార్డెన్స్ కి వెళ్ళాడు శివరామ్. జాకీ చెప్పిన ఆనవాళ్లను బట్టి ఆ ప్రాంతమంతా పరిశీలించాడు. డస్ట్ బిన్ వెనుక ఏదో వస్తువు కనిపించడంతో దాన్ని చేతిరుమాలుతో తీసి జేబులో వేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని సిసి కెమేరా యొక్క సంబంధిత తేదీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నాడు... కరుణాకర్ ఆఫీసు, నాచారంలోని ఎస్.బి.ఐ., వద్దనుండే సి.సి. కెమేరాల ఫుటేజెస్ ని కూడా తెప్పించాడు… అలాగే నాచారం పోలీసులు జాకీ నుండి స్వాధీనం చేసుకున్న అంజలి యొక్క సెల్ ఫోన్ ని కూడా తీసుకున్నాడు…

తన ఆఫీసుకు వెళ్ళి ఆ ఫుటేజ్ లను, సెల్ ఫోన్స్ లోని కాల్ డేటాలనూ పరిశీలించేందుకు పూనుకున్నాడు. ఆ లోపున కరుణాకర్ ఫ్యామిలీ గురించి మరిన్ని వివరాలు సేకరించవలసిందిగానూ, జాకీ గురించి వాకబుచేయమనీ, రజనిని కలుసుకుని వాడు చెబుతున్నది ఎంతవరకు నిజమో తెలుసుకోవలసిందిగానూ…తన సిబ్బందికి పురమాయించాడు.

సిసి కెమేరాల ఫుటేజ్ లను – ముఖ్యంగా, అపార్ట్మెంట్స్, ఎన్టీయార్ గార్డెన్స్ దగ్గరవి - పరిశీలిస్తూంటే అతని ఆశ్చర్యానికి అంతులేకుండాపోయింది…అలాగే, అంజలి సెల్ ఫోన్ లో కాల్ డేటాని చెక్ చేయగా, హత్య జరిగిన ముందురోజు సాయంత్రం 5 గంటలకు ఆమె భర్తకు చేసిన కాలే ఆఖరిదని గుర్తించాడు. కరుణాకర్ సెల్ లోని ఓ ‘వన్-వర్డ్’ మెసేజ్ అతన్ని ఆకట్టుకుంది!

తాను స్వయంగా సేకరించిన సాక్ష్యాధారాలకు తన సిబ్బంది తీసుకొచ్చిన సమాచారాన్ని జోడించి  నిశితంగా విశ్లేషించిన శివరామ్ పెదవులపైన మందహాసరేఖ విరిసింది…

#

అంజలి హత్యకేసులో హంతకుడు దొరికాడన్న వార్త ప్రాకడంతో…క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ కి ఎలెక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇన్స్ పెక్టర్ శివరామ్, పోలీస్ కమీషనర్, ఏరియా డి.సి.పి. వేదికనలంకరించారు. కరుణాకర్ తోపాటు ఓ యువకుడు, యువతీ కూడా ప్రవేశపెట్టబడ్డారు.  కోర్ట్ అనుమతితో జాకీ కూడా అక్కడికి తీసుకురాబడ్డాడు.

ఇన్స్పెక్టర్ శివరామ్ బ్రీఫింగ్ ఆరంభించడంతో నిశ్శబ్దమయిపోయిందక్కడ… ‘కరుణాకర్ కాలేజ్ లో చదువుతుండగా తన క్లాస్ మేట్ హేమను ప్రేమించాడు. వారి మధ్య రిలేషన్ షిప్ కూడా కొనసాగింది. పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అంతలోనే వయసులో తనకంటే బాగా పెద్దవాడైన ఓ కోటీశ్వరుడితో పరిచయమయింది హేమకు. అతన్ని పెళ్ళిచేసుకుని ముంబయ్ వెళ్ళిపోయింది. తరువాత కరుణాకర్ కి అంజలితో వివాహమయింది. అయితే, ఆర్నెల్ల క్రితం అనుకోకుండా హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో కరుణాకర్ కి మళ్ళీ కనిపించింది హేమ. ఎవరో స్నేహితుల ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిందట.

హేమ భర్త కొన్ని నెలల క్రితం ఓ ప్లేన్ క్రాష్ లో మరణించాడు. అతని కోట్ల ఆస్తికి ఆమె వారసురాలయింది. డబ్బు, హోదాల కోసం వయసుమళ్ళినవాణ్ణి చేసుకున్నా, కరుణాకర్ మీది ప్రేమను చంపుకోలేదామె. ఇప్పుడు అతను కనిపించడంతో, దగ్గర కావడానికి ప్రయత్నించింది. ఆమె అందం ఆస్థీ ప్రలోభపెట్టడంతో లొంగిపోయాడు కరుణాకర్. మూణ్ణెల్లక్రితం హైదరాబాద్ కు తాత్కాలికంగా మకాం మార్చింది హేమ. విడాకులకు అంజలి ఒప్పుకోదు. కనుక ఆమె అడ్డంకిని శాశ్వతంగా తొలగించుకునేందుకు హేమ తమ్ముడు కార్తీక్ ప్లాన్ వేసాడు. అందుకు కరుణాకర్ ని ఒప్పించింది హేమ.

అంతలో అంజలి స్నేహితురాలిని చూడ్డానికి వరంగల్ వెళ్ళడం జరిగింది. హత్య జరిగిన ముందురోజు సాయంత్రమే తిరిగి వచ్చేసింది. రాత్రులు అప్పుడప్పుడు భోజనం అయ్యాక గోళీసోడా త్రాగడం అలవాటు దంపతులకు. ఆ రోజు రాత్రి భార్య సోడాలో నిద్రమాత్రలు కలిపాడు కరుణాకర్. అందువల్ల మర్నాడు ఎప్పటిలా ఉదయమే లేవలేదామె. కరుణాకర్ లేచి తన పనులు పూర్తిచేసుకుని, ఇంటికి తాళం వేసుకుని ఏడున్నరకల్లా ఆఫీసుకు వెళ్ళిపోయాడు.  పథకం ప్రకారం ఇంటి దొడ్డితలుపు గెడ తీసేవుంచాడు. తొమ్మిది గంటల ప్రాంతంలో కార్తీక్ స్కూటర్ని ఇంటికి ఎడంగా ఉన్న అపార్ట్మెంట్స్ వద్ద పార్క్ చేసి, కాలినడకను వెళ్ళి వెనుకవైపు నుండి ఇంట్లో ప్రవేశించాడు. చేతులకు గ్లవ్స్ తొడుక్కుని ఏమరుపాటుగా ఉన్న అంజలిని పీక పిసికి చంపేసాడు. వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. చంపగానే గ్లవ్స్ ని తీసేయడంవల్ల దొడ్డితలుపు మీద అతని వ్రేలిముద్రలు పడ్డాయి. అపార్ట్మెంట్స్ వద్దనున్న సిసి కెమేరాలో అతని రూపం, స్కూటర్ నంబర్లు నమోదయ్యాయి. అంతేకాదు, అంజలి భర్తకు ఫోన్ చేసిన సమయంలోనే, గ్రీన్ కలర్ ఆటో ఒకటి కరుణాకర్ ఇంటివైపు వెళ్ళినట్టు కూడా ఆ ఫుటేజ్ లో గోచరమవుతోంది. కరుణాకర్ ఫోన్లో రికార్డైన ‘నేను ఇంటికి వచ్చేసానండీ!’ అన్న అంజలి పలుకులు, ఆమె ముందురోజునే తిరిగివచ్చేసిందన్న నిజాన్ని నిరూపిస్తున్నాయి.

అంజలిని చంపి బైటపడగానే కరుణాకర్ కి వాట్సాప్ లో ‘ఓవర్’ అన్న కోడెడ్ మెసేజ్ ని పంపించాడు కార్తీక్. అది వారి సెల్ ఫోన్స్ ని పరిశీలించగా బైటపడింది.  ఆ హత్యను ఇతరుల నెత్తిన రుద్దాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే కార్తీక్ మెసేజ్ అందగానే, కంపెనీ చెక్ ని డిపోజిట్ చేసే నెపంతో ఎస్.బి.ఐ. కి వచ్చిన కరుణాకర్, ఎన్టీయార్ గార్డెన్స్ వద్ద పేవ్మెంట్ మీద తన ఇంటి చిరునామా, తాళపుచెవీ ఉన్న మనీపర్సును ఉద్దేశ్యపూర్వకంగానే, ర్యాగ్ పికర్ కంటపడేలా పడేసాడు. అతను ఆశించినట్టే జాకీ దాన్ని తీయడమూ, ఆ ఇంటికి వెళ్ళడమూ జరిగాయి.

అదంతా చాటుగా గమనిస్తూన్న కరుణాకర్, బ్యాంక్ దగ్గర వున్న పబ్లిక్ బూత్ నుండి ‘ఫలానా ఇంట్లో దొంగలు దూరారు’ అంటూ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు వెళ్ళి జాకీని పట్టుకోవడమూ, అంజలి హత్యకు వాణ్ణి అనుమానించడమూ జరిగాయి…కరుణాకర్ కంపెనీ ఎదుటనున్న సిసి కెమేరా, ఎస్.బి.ఐ. వద్దనున్న కెమేరాల ఫుటేజ్ లు అతని మూవ్ మెంట్స్ ను తెలిపితే…ఎన్టీయార్ గార్డెన్స్ వద్దనున్న కెమేరా, అతను మనీపర్సును జేబులోంచి తీసి పేవ్మెంట్ పైన పడేయడము, రోడ్ కు అవతలి వైపున నిలుచుని జాకీ పర్స్ తీయడాన్ని గమనించడమూ, వాణ్ణి అనుసరించి వెళ్ళడమూ నిరూపించింది. తరువాత అతను పోలీసులకు ఫోన్ చేయడం కూడా బ్యాంక్ వద్దనున్న కెమేరాలో నమోదవడమేకాక, ఫోన్ లోని అతని వాయిస్ ని ఫోరెన్సిక్ టెస్ట్స్ నిర్ధారించాయి. జాకీ విసిరేసిన కరుణాకర్ యొక్క ఖాళీ పర్సు అక్కడే డస్ట్ బిన్ వెనుక దొరికింది నాకు.

పోస్ట్ మార్టెమ్ రిపోర్ట్ ప్రకారం హత్య ఉదయం 9-20 కి 9-35 మధ్య జరిగింది. కార్తీక్ యొక్క మెసేజ్ కరుణాకర్ కి 9-35కి అందింది. అతను పర్సును 9-45 కి పేవ్మెంటుపైన పడేసాడు. 9-55 కి జాకీ దాన్ని తీసాడు. 10-10 కి ఆ ఇంటికి బైలుదేరాడు. కనుక జాకీ కథనం నిజమేననీ, వాడు నిర్దోషియనీ నిరూపితమయింది…క్రైమ్ లో ఉపయోగింపబడ్డ స్కూటర్ యొక్క రెజిస్ట్రేషన్ నంబర్ని ట్రేస్ చేస్తే, అది కార్తీక్ ఫ్రెండ్ దనీ, మూణ్ణెల్లుగా కార్తీక్ దాన్ని వాడుకుంటున్నాడనీ తెలిసింది. ఆ ఫ్రెండ్ ద్వారా కార్తీక్ చిరునామా బైటపడింది. సాక్ష్యాధారాలతో కన్ఫ్రంట్ చేసేసరికి, అంజలిని హత్యచేసింది తానేనని ఒప్పుకోకతప్పలేదు అతను. అందులో పాలుపంచుకున్నందుకు కరుణాకర్, హేమలు కూడా అరెస్ట్ చేయబడ్డారు…తాము చేసిన నేరంలో ఇతరులను ఇరికించాలనుకున్న వారి అతితెలివి అచ్చిరాలేదు…’

ఫొటోగ్రఫర్ల కెమేరా ఫ్లాష్ లు మిరుమిట్లు గొలుపుతూంటే నేరస్థులు తలలు వంచుకున్నారు. జాకీ వదనంలో ఆనందం వెల్లివిరిసింది.

“Tirumalasree”  PVV SATYANARAYANA

Mob. 91107 36095