సివిల్స్ కొట్టాలంటే ఎలా-2

Articles written by G K S Anirudh for Civils Aspirants

సివిల్స్ కొట్టాలంటే ఎలా-2

సివిల్స్ కొట్టాలంటే ఎలా చదవాలి? -2

(జి కె ఎస్ అనిరుధ్)

సివిల్స్ కొట్టడం తేలిక కాదు. అలా అని మరీ అంత కష్టమూ కాదు. బాంకులలోని ప్రొబేషనరీ ఆఫీసర్ల ఉద్యోగాలకు, అలానే మరి కొన్ని ప్రభుత్వ సంస్థల పరీక్షలకు, రైల్వే లోని ఉద్యోగాలలో విజయం సాధించాలంటే అభ్యర్థులకు కావలసిన నైపుణ్యాలు వేరు, సివిల్స్ లో విజయం సాధించాలంటే కావలసిన నైపుణ్యాలు వేరు.

ఈ తేడా సరిగా అర్థం చేసుకోకపోతే సివిల్స్ లో విజయం సాధించడం దాదాపు అసాధ్యం! సివిల్స్ పరీక్ష మూడంచెలుగా ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. రెండూ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెశ్చన్స్ అన్న మాట. ఈ పేపర్‍ల కి 200 మార్కులు  చొప్పున కేటాయించారు యుపిఎస్‍సి వారు.

మొదటి పేపర్ జనరల్ స్టడీస్. దీనికి నిర్దుష్టమైన సిలబస్ ఉంటుంది. ఇక్కడ మరీ విస్తారంగా చెప్పడం అనవసరం. కానీ తెలుసుకోవాలి అనుకున్న వారు sahari.in లోపోటీ పరీక్షలు  చూడండి. వివరంగా ఉంటాయి.

ఇది కంప్యూటర్ బేసెడ్ టెస్ట్ కాదు. పేపర్ అండ్ పెన్ టెస్ట్. మీరు ఒఎమ్‍ఆర్ షీట్ లో మీ ఆన్సర్ ని సరిగా మార్క్ చెయ్యాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే మార్కులను మాత్రమే మెరిట్ నిర్ణయించడానికి వాడుతారు. 

రెండవ పేపర్ ని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఇందులో ఇంగ్లీష్, మాథ్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటాయి. వీటిలో కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులోని మార్కులు మెరిట్ కోసం లెక్కించరు. అయితే ఇందులో కనీసం మూడవ వంతు మార్కులు తెచ్చుకుంటేనే మొదటి పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారు. అందువలన ఇది చాలా ముఖ్యమైనదే!

ఇక రెండవ స్టేజి. ప్రిలిమినరీలో మొదటి పేపర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయించబడిన మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను సివిల్స్ మైన్ రాత పరీక్ష రాయడానికి కావలసిన అప్లికేషన్ అందుతుంది. దానిలో మాత్రమే అభ్యర్థులు మైన్ రాత పరీక్షకు అప్లై చేయగలరు.

ఈ మైన్ పరీక్షలో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇవి ఆబ్జెక్టివ్ క్వెశ్చన్స్ కావు. ఎస్సే టైప్ క్వెశ్చన్స్. ఈ పేపర్ లలో అడిగిన ప్రశ్నలకు అభ్యర్థి ఆన్సర్ నిర్దేశించిన పదాల సంఖ్య లోనే రాయవలసి ఉంటుంది. వీటిలో ఒక optional సబ్జెక్ట్ కూడా ఉంటుంది. దాన్ని అభ్యర్థి ఇష్టానుసారంగా సెలెక్ట్ చేసుకోవచ్చును. మైన్ పరీక్ష లో 1750 మార్కులు ఉంటాయి. మొత్తం 9 పేపర్లు రాయాలి. ఒకటి ఇంగ్లీష్, రెండవది అభ్యర్థి సెలెక్ట్ చేసుకున్న ఒక language పేపర్. ఈ రెండిటిలోనూ 25% మార్కులు రాకపోతే తక్కిన పేఫర్లను ఎవాల్యుయేట్ చెయ్యరు. అయితే వీటిలో వచ్చే మార్కులను మెరిట్ నిర్ణయించడానికి లెక్కించరు. ఇక మిగిలిన ఏడు పేపర్లకు మొత్తం 1750 మార్కులు ఉంటాయి. అంటే ప్రతి పేపర్ కి 250 మార్కుల చొప్పున ఉంటాయి. వీటిలో 5 పేపర్లు అభ్యర్థులందరికి కామన్. మిగిలిన రెండు పేపర్లు ఎవరికి వారు తాము ఎంచుకున్న optional సబ్జెక్ట్ పైన వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.

వీటిలో మొదటి పేపర్ ఎస్సే పేపర్. రెండు ఎస్సేలు రాయాలి. మొత్తం మార్కులు 250. తర్వాత మూడు జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. అయిదవ పేపర్ ఎథిక్స్ పేపర్. ఆరు ఏడు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు.

ఈ స్టేజి కూడా దాటిన వాళ్ళను యుపిఎస్‍సి ఇంటర్వ్యూకి పిలుస్తుంది. ఇంటర్వ్యూకి 275 మార్కులు ఉంటాయి. మొత్తం 2025 (1750 + 275 = 2025) మార్కులకు షుమారు 50 శాతం మార్కులు సాధించిన వారు విజయం సాధించడానికి అవకాశం ఉంది. 

ప్రిలిమినరీ పరీక్షకు సాధారణంగా నవంబర్/డిసెంబర్ లో ప్రకటన వెలువడుతుంది. మరుసటి సంవత్సరం మే/జూన్ లలో ఒక ఆదివారం నాడు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. దాని ఫలితాలు సాధారణంగా జూలై/ఆగస్టులలో వెలువడుతాయి. మైన్ పరీక్షకు కావలసిన డిటైల్డ్ అప్లికేషన్ ఫార్మ్ లు అభ్యర్థులకు అందుతాయి. మైన్ పరీక్ష అక్టోబర్/నవంబర్ లలో ఉంటాయి. వాటి ఫలితాలు మరుసటి సంవత్సరం జనవరిలో వెలువడుతాయి. వాటి ఆధారంగా మెరిట్ సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. అవి ఫిబ్రవరి/మార్చ్ లలో జరుగుతాయి. ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్/సెప్టెంబర్ లో వెలువడుతుంది. ఇవి షుమారుగా చెప్పినవి. ఒక్కో సంవత్సరం ఒక్కోలా కొద్ది పాటి తేడాలతో ఇలాగే జరుగుతుంది.

ఈ వివరాలు చెప్పడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే ఈ పరీక్ష ప్రకటన నుంచి ఫైనల్ result వరకు పట్టే సమయం దాదాపుగా 20 నుంచి 22 నెలలు. అంటే ఒక దీర్ఘప్రయాణం ఇది. దేశంలో ఇతర ఉద్యోగాలకు జరిగే పరీక్షలకు, సివిల్స్ కి ఉండే ఒక పెద్ద అతి ముఖ్యమైన వ్యత్యాసం ఇదే! అభ్యర్థికి చాలా ఓపిక కావాలి!!

వచ్చే వారం యుపి‍ఎస్‍సి అభ్యర్థులలో ఎలాంటి గుణగణాల కోసం చూస్తుంది అనేది తెలుసుకుందాము.

***