+91 9553678686

ఈ కథలు చదవడానికి ఇక్కడా క్లిక్ చేయండి.


సహరి సమగ్ర వారపత్రిక లో ప్రతి వారం ప్రచురింపబడే కథల వివరాలు ఇక్కడ ఉంటాయి. కథలతో పాటు రచయితల పరిచయం కథ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ పొందు పరుస్తాము.

        26.02.2021 వారం కథా కమామీషు

1.                 ఆ రెండు గంటల్లో : ఒక అతిథి ఆవిడ దగ్గరికొచ్చాడు. రెండుగంటలు కూర్చున్నాడు. తనెందుకు వచ్చాడో తన లక్ష్యం ఏమిటో చెప్పాడు. ఆవిడ దగ్గర తనకు కావాల్సినదేమిటో చెప్పాడు. ఉన్నతమైన ఉద్యోగం వదిలి అతను చేస్తున్న పని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. దేవునికీ, తల్లిదండ్రులకూ తప్ప మరెవరికీ పాదాభివందనం చేయని అతడు, వెళ్తూ వెళ్తూ ఆమెకు పాదాభివందనం చేశాడు. ఇంతకూ అతనెవరు? ఆవిడ దగ్గర అతనికి కావాల్సిందేమిటి? ఉద్యోగం వదిలి, అతను చేపట్టిన కార్యక్రమం ఏమిటి? వెళ్తూ వెళ్తూ ఆమెకు ఎందుకు పాదాభివందనం చేశాడు? ఈ వారం బొరుసు చంద్రరావు స్మారక సహరి కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకున్న చివుకుల శ్రీలక్ష్మి  కథ ఆ రెండు గంటల్లోతప్పక చదవండి.

2.                 హమ్మమ్మ : అమ్మమ్మ ఆరోగ్యం బాగులేదని తెలిసి అతడు చూడటానికి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికే ఆ ఇంట్లో అందరూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. అమ్మమ్మ ఏదో అర్థం కాని భాష మాట్లాడుతోంది. ఇంట్లో వాళ్ళు దేనికోసమో వెతికేస్తున్నారు. టైం అయిపోవచ్చిందని కంగారు పడుతూ దేనికోసమో వెదకసాగారు. తన అమ్మమ్మ ఇక చివరి దశకి చేరుకుందని అతడు అర్థం చేసుకున్నాడు. చివరికి వాళ్ళంతా దేనికోసం వెతుకుతున్నారో తెలిసి నివ్వెరపోయాడు. ఇంతకూ అతని అమ్మమ్మకు ఏమైంది? ఇంట్లో వాళ్ళంతా ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అందరూ దేనికోసం వెదుకుతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం జె.ఎస్.వి.ప్రసాద్  హాస్య కథ హమ్మమ్మతప్పక చదవండి.

3.                 ఇంజన్ లేని రైలు : అతడు ఓ చిన్న రైల్ స్టేషన్‌లో గేట్ మ్యాన్‌గా పని చేస్తున్నాడు. తనకి తెలియని విషయాలను స్టేషన్ మాస్టర్ని అడిగి తెలుసుకోవటం పట్ల అతని ఆసక్తి ఎక్కువ. అలా రైళ్ళకి సంబంధించిన విషయాలెన్నో స్టేషన్ మాస్టర్ ద్వారా అతడు తెలుసుకున్నాడు. ఉన్నట్లుండి ఒక రోజు అతని పిల్లలతో బాటు ఎంతోమంది పిల్లలను ఎక్కించుకున్న స్కూల్ బస్సు రైల్ పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో ఇంజన్ లేని గూడ్స్ బండి వస్తోందనీ, గేట్ మూసివేయమనీ స్టేషన్ మాస్టర్ చెప్పటంతో అతడు కంగారు పడిపోయాడు. బస్సు పట్టాలపైనుంచి కదలలేదు. దాంతో అందర్లోనూ టెన్షన్ పెరిగిపోయింది. ఆసక్తి కొద్దీ తను స్టేషన్ మాస్టర్ను అడిగి చెప్పించుకున్న విషయం అతనికి చివరి నిమిషంలో గుర్తుకొచ్చి ఇంజన్ లేని గూడ్స్ కి ఎదురుగా పరిగెత్తాడు. ఇంతకీ అతనికి తట్టిన ఉపాయం ఏమిటి? అతడు స్కూలు పిల్లల్ని ప్రమాదంనుంచి తప్పించగలిగాడా? ఉత్కంఠ రేపే కథనంతా సాగిన  గొర్లి శ్రీనివాసరావు  ఇంజన్ లేని రైలు తప్పక చదవండి.

4.                 ((అ)సురవరం : ఊరుగాని ఊరుకి ఆఫీస్ పనిమీద అతడు వచ్చాడు. వచ్చీ రావటంతోనే రాక్షసుడు లాంటి ఓ హోటల్ కౌంటర్ క్లర్క్ తో పేచీ పడాల్సివచ్చింది. ఒక్క రోజులో అవుతుందనుకున్న పని పూర్తి కాలేదు. ఎవరూ పరిచయం లేని ఆ ఊరిలో అనుకోని విధంగా అతడు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. హోటల్ రాక్షసుడికి మళ్ళీ ఎదురుపడాల్సివచ్చింది. ఒక్కరోజులో హోటల్ రూం ఖాళీ చేస్తానన్న అతడు, ఆ పని చెయ్యలేకపోవటంతో ఆ రాక్షసుడితో మాట పడాల్సివస్తుందని అనుకున్నాడు. ఇంతకూ అతడికా ఊర్లో ఎదురైన ఇబ్బందులేమిటి? ఆ రాక్షసుడితో అతని అనుభవమేమిటి? డబ్బు లేని అతన్ని ఆ రాక్షసుడు ఎలా ట్రీట్ చేశాడు? పి.వి.ఆర్. శివకుమార్  హృద్యమైన కథ (అ)సురవరంతప్పక చదవండి.

5.                 జీనా వహాఁ మర్‌నా వహాఁ : బాల్యంలోనే తల్లిదండ్రులకు దూరమై, చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ చివరికి అతడు మాఫియా విషవలయంలో చిక్కుకున్నాడు. పెళ్ళి పిల్లలు లాంటి జంజాటం పెట్టుకోకుండా ఒక కూతురు ఉన్న స్త్రీతో సహజీవనం చేయసాగాడు. తన బాస్ ఆజ్ఞ ప్రకారం ఒక హత్య చేశాక అతడిలో పశ్చాత్తాపం మొదలైంది. బాస్ ఆజ్ఞను ధిక్కరించాడు. దానితో అతడిని చంపటానికి బాస్ కొంతమందిని నియమించాడు. ఆ కిల్లర్స్ అతడిపై దాడి చేయటంతో తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. బాస్‌కి ఎందుకు ఎదురు తిరిగావని అతనితో సహజీవనం చేసే స్త్రీ అతడిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఏం జరిగింది? బాస్ నుంచి అతడు తప్పించుకున్నాడా? ఉత్కంఠ రేకెత్తించే కథనంతో సాగిన తిరుమలశ్రీ  క్రైం  కథ జీనా వహాఁ మర్‌నా వహాఁతప్పక చదవండి.

6.                 సైబర్ వల : ఆ అమ్మాయి ఇంజనీరింగ్‌లో చేరగానే తల్లిదండ్రుల చేత మొబైల్ ఫోన్ కొనిపించుకుంది. అది చేతికొచ్చినప్పటినుంచీ రకరకాల సామాజిక మాధ్యమాలతో ఆమె బిజీ అయిపోయింది. కొత్త కొత్త స్నేహాలు పుట్టుకొచ్చాయి. ఒక ప్రేమికుడూ ఆమె జీవితంలోకి వచ్చేశాడు. ఆర్యసమాజ్‌లో పెళ్ళి చేసుకుందామని, ఇంట్లోంచి వచ్చేయమనీ అతడు ఆమెపై ఒత్తిడి చేయటంతో ఆమెకేమి చెయ్యాలో తోచలేదు. అందుకే కొంత సమయం అడిగింది. ఒప్పుకోకపోతే అతడు దూరమైపోతాడేమోనని భయపడింది. చివరికామె ఏం చేసింది? అతడితో వెళ్ళిపోయిందా? ఆమె భవిష్యత్తు ఏమైందో తెలియాలంటే జ్యోతి మువ్వల  కథ సైబర్ వలతప్పక చదవండి.

7.                 ఆదర్శం : ఆమె ఒక ప్రఖ్యాత రచయిత్రి. కుల, మత రహిత సమాజాన్ని ప్రతిబింబిస్తూ, ఆదర్శ భావాలతో నిండిన ఆమె రచనలు పాఠకులను ఎంతగానో ఆకర్షించాయి. సమాజానికి ఆమె చేసిన సాహిత్య సేవకు ప్రతిగా ఆమెకు సన్మానాలు, సత్కారాలూ ఎన్నో జరిగాయి. అలాంటి సన్మానమే మరొకటి జరుగుతున్న సందర్భంలో ఆమెకు అనుకోని సంఘటన ఎదురైంది. కులాలు వేరైన ఒక జంట, అతిపేద అమ్మాయి, ధనవంతుల అబ్బాయిల మరో జంట అదే వేదికపై పెళ్ళి చేసుకోవటానికి సిద్ధపడటంతో ఆమె బిక్కచచ్చిపోయింది. ఆ పెళ్ళిళ్ళను వ్యతిరేకిస్తే తన ఆదర్శాలన్నీ రచనలవరకేననీ అక్కడందరూ విమర్శిస్తారని భయపడి ఊరకుండిపోయింది. అక్కడా జంటలను చూసి ఆమె ఎందుకు అవాక్కైంది? ఆ పెళ్ళిళ్ళను ఆమె ఎందుకు సహృదయంతో స్వీకరించలేకపోయింది? ఆ తర్వాత ఇంటికొచ్చిన ఆమె ఏం చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం కొమ్ముల వెంకట సూర్యనారాయణ  కథ ఆదర్శంతప్పక చదవండి.


ఈ కథలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి