ప్రహేళికా పదబంధం

హాస్యానందం • 01 Jul 2020 • 👁 2 views
*****

*ప్రహేళికా పదబంధం*
===============
(హాస్య కథ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.


"కౌరవ సంతానంలో 53 వ సోదరుని పేరు ఏమిటి ?"

ఇదీ, శోభనం రోజున సిగ్గుపడుతూ, పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన తన భార్య సుపథను ప్రహేళికారావు అడిగిన మొదటి ప్రశ్న.

"............................................"

"పోనీ, ఏ రాజ్యకూటమికీ చెందని ఓ రెండు దేశాల పేర్లు చెప్పు. "

"............................................"

"సింపుల్ క్వశ్చన్, కాజా అనే స్వీట్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది ??"

"............................................"

అంతే, పాల గ్లాసు పక్కన పెట్టి, ప్రహేళికా రావు పాదాల మీద పడిపోయింది సుపథ.

అది, సంస్కారంతో పెట్టిన నమస్కారమో లేక  'నీ క్విజ్ ప్రశ్నలతో నన్ను చంపకురా మగడా, నీకో నమస్కారం' అని కాళ్ళ మీద పడిందో తెలియక అర్థంకాని పజిల్ లా మొహంపెట్టేడు ప్రహేళికా రావు.

ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో సుపథకి  క్విజ్ ల విషయంలో కొంచెం గట్టిగానే ట్రైనింగ్ ఇవ్వాలని ఆ రాత్రే ఓ నిశ్చయానికి వచ్చేసాడు ప్రహేళికా రావు.

***** ***** ***** *****  

అందరూ అనుకుంటున్నట్టు అతని పేరు ప్రహేళికా రావు కాదు. అతని అసలు పేరు ప్రహ్లాదరావు. తన పేరు హిరణ్యకశిపుడు కాకపోయినా, కొడుకుకి మాత్రం ఎంతో భక్తిగా ప్రహ్లాదరావు అని పెట్టుకున్నాడు పాపం, నరసింహం అనే ఆ చాధస్తపు తండ్రి. ఆ పురాణాల ప్రహ్లాదునిది భక్తి పిచ్చి అయితే, మన ప్రహ్లాదరావుది క్విజ్జులు మరియు తిండి పిచ్చి.

పొద్దున్న లేచింది మొదలు పేపర్లు, పత్రికలు క్విజ్జుల కోసం తిరగవేయడం, తినుబండారాలు కోసం ఫ్రిజ్జులో వెతకడం అతని నిత్యకృత్యం. ఇంట్లో వాళ్లనే కాకుండా, కనపడిన ప్రతీ వాళ్లని తన క్విజ్జులతో, ప్రశ్నలుతో విసిగించడం, సరైన సమాధానాలు చెప్పని వాళ్లని హేళన చేయడం ప్రహ్లాదరావుకి అలవాటుగా మారిపోయింది.

అతని క్విజ్జులుతో విసుగెత్తిపోయిన కొంతమంది మిత్రులు అతన్ని ప్రహ్లాదరావు అని కాకుండా సరదాగా ప్రహేళికారావు అని పిలవడం మొద లెట్టడంతో , ఇదేదో బాగానే ఉంది అని తన పేరును 

ప్రహేళికారావు గా మార్చేసుకున్నాడు ప్రహ్లాదరావు.

ఇక పెళ్లి విషయంలో……

ప్రహ్లాదరావుకి ఇంకా ఐదేళ్లు నిండకుండానే, అతని తండ్రి నరసింహం అవతారం చాలించేసాడు. పాపం తల్లే కష్టపడి చదివించి ఒక ఉద్యోగస్తుడుని చేసింది.

"ఒరే పెహ్లాదా, ఉద్యోగం వచ్చింది కాబట్టి, త్వరగా ఓ అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసేసుకోరా, నీ ప్రశ్నలు పిచ్చి తెలిసిన దగ్గర బంధువులు ఎవరూ కూడా నీకు పిల్ల నివ్వడానికి ముందుకు రావడం లేదు" కొడుకుని బతిమాలింది  ప్రహ్లాదరావు తల్లి.

తల్లి మాట కాదనలేక ఓ సంబంధం కోసం తల్లి, మేనమామతో కలసి ఓ పెళ్లికూతురిని చూడడానికి వెళ్లాడు ప్రహ్లాదరావు. పెద్దల పలకరింపులు అయిన తరువాత పెళ్లి కూతురుని తీసుకుని రమ్మని పురమాయించాడు పిల్ల తండ్రి. 

కాసేపటికి పెళ్ళి కూతురు ఓ వెండి పళ్లెంలో మైసూరు పాక్ ముక్కలు తీసుకుని వచ్చి, వాటిని టీపాయ్ మీద పెట్టి, ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఎంతో వినయంగా!.

ప్లేటులో తినుబండారాలు చూసిన ప్రహ్లాదరావు వాటి మీద దండయాత్ర చేసి, జెట్ స్పీడులో రెండు ముక్కలు కరకరా నమిలేసి, మూడవ ముక్కను కూడా అదే వేగంతో తినబోయి, అందరూ తెల్లబోయి నోరు ఆవలించి తనవైపే చూడడం గమనించి,

"అవునూ, మైసూరు పాక్ ఇంత గట్టిగా ఉందేమిటీ, కొంపతీసి పాకం కానీ బాగా ముదరబెట్టేసారా?" అడిగాడు ప్రహ్లాదరావు, పెళ్లి కూతురు వైపు తిరిగి.

"............................................"

"చెప్పు, అలా సిగ్గు పడతావెందుకు? అసలు శెనగపిండి, పంచదార, నెయ్యి ఏ పాళ్లలో వేసేరు?"

"............................................"

"నాకు అనుమానంగా ఉంది, అసలు ఇది నువ్వు చేసినదేనా?"

"............................................"

"సరే అవన్నీ ఎందుకు కానీ, నీకు వంట చేయడం వచ్చా? పోనీ అదైనా చెప్పు"

"రా.....దు…" అంటూ, ఘా...ఠ్ఠి...ఘా , అది కూడా గదిలో ఉన్న ఫొటోల అద్దాలు బద్దలయ్యేటంత పెద్ద శబ్దంతో చెప్పింది పెళ్లికూతురు.

ఆ దెబ్బకి ఉలిక్కిపడిన ప్రహ్లాదరావు, కొంచెం తేరుకుని, ఊపిరి పీల్చుకుని,

"వంట చేయడం రాదా? అంటే, నేర్చుకోవాలని లేదా? లేక నేర్చుకోవాలనిపించలేదా?" అడిగాడు ఎందుకైనా మంచిదని కొంచెం స్వరం తగ్గించి.

"ఆ రెండూ కాదు. అవసరమనిపించలేదు" అంతే పెడసరంగా చెప్పింది.

"మరి పెళ్లి అయిన తర్వాత వంట విషయం ఏం చేద్దామను కుంటున్నావ్?"

"వంట అవసరం నాకేంటి? , మీరుండగా?" మళ్లీ అదే పెడసరపు జవాబు.

"ఛస్..వంట చేయడం కూడా రాని ఈ సంబంధం నాకు నచ్చలేదు" కుర్చీలోంచి లేవబోతూ చెప్పాడు ప్రహ్లాదరావు, మేనమామ, తల్లీ అతని వైపు బిక్కచచ్చిపోయి చూస్తూండగా.

"నాకు కూడా.." అంటూ అతని కంటే వేగంగా కుర్చీలోంచి విసురుగా లేచి, టీపాయ్ మీద ఉన్న మైసూరు పాక్ ముక్కలు ఉన్న వెండి ప్లేటుని ఒక చేత్తో తీసుకుని, రెండో చేత్తో ప్రహ్లాదరావు చేతిలో ఉన్న మైసూరు పాక్ ముక్కని లాక్కుని బుసలు కొడుతూ తన గది లోకి వెళ్లిపోయింది.

వెర్రి మొహం వేసుకుని, ఆమె వెళ్లిన వైపే చూస్తున్న ప్రహ్లాదరావుని,
"ఇంకా ఏం చూస్తావురా, తింగరి సన్యాసి, లేచి తగలడు" అంటూ చెరో జెబ్బా పట్టుకుని బయట ఉన్న ఆటోలో కుదేసారు మేనమామ, తల్లి. 

"కేటరింగ్ చేసే వాళ్ళు కూడా ఇంత ఛంఢాలపు ప్రశ్నలు వెయ్యరురా, పిచ్చివెధవా !" అంటూ పాపం ప్రహ్లాదరావుని ఇంటికెళ్లేవరకూ ఆటోలో అలా తిట్లతో తల అంటుతూనే ఉన్నారు, అతని తల్లి, మేనమామ.

  ***** ***** ***** *****  

ఈ సంఘటన జరిగిన రెండు నెలల వరకూ ప్రహ్లాదరావు వద్ద పెళ్లి గురించి మాట్లాడడానికి ఎవరూ సాహసించలేదు.  

రెండు నెలల తరువాత ఓ రోజు, తన పెళ్లి గురించి తల్లి పడుతున్న బాధ చూడలేక ఇంకో అమ్మాయిని చూడడానికి బయలుదేరాడు ప్రహ్లాదరావు కిందటి సారి లాగే, తన తల్లినీ, మేనమామను వెంట బెట్టుకుని. కొడుకు గత చరిత్ర తెలిసిన తల్లి కాబట్టి, "పెళ్లి కూతురిని ఎటువంటి ప్రశ్నలు వేసి వేధించకూడదని"  అతని చేత ముందే ఒట్టు వేయించుకుంది.

ప్రహ్లాదరావు అండ్ పార్టీ కుర్చీలలో  ఆశీనులయ్యాక, 

"బాబూ, మీ పూర్తి పేరు ఏమిటి ??" అడిగాడు పెళ్లి కూతురు తండ్రి, ప్రహ్లాదరావును.

"నా పేరు ప్రహ్లాదరావండీ, కొంతమంది స్నేహితులు ప్రహేళికారావు అని కూడా పిలుస్తారు. మరి మీ పేరు ? "

"నా పేరు సంగమేశ్వరరావు బాబూ "

"సంగమేశ్వర ఆలయం ఎక్కడుందో తెలుసాండీ ?"

"తెలవదు బాబూ !"

"పోనీ తెలుసుకోవాలని కూడా అనిపించలేదాండీ?"

"అవసరంలేదని పించింది బాబూ"

అప్పటికే ప్రహ్లాదరావు ఎడంకాలు మీద రెండు సార్లు తొక్కింది అతని తల్లి, కంట్రోల్ చేసుకో అని సింబాలిక్ గా.  అది గ్రహించిన ప్రహ్లాదరావు ఇద్దరి మధ్య కుక్కిన పేనులా కూర్చున్నాడు సోఫాలో కాసేపు, ఎర్రగా మారి బాధ పెడుతున్న ఎడమ కాలి వైపు జాలిగా చూసుకుంటూ..

"సరేకానీ బాబూ, నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ?" ప్రహ్లాదరావును కెలికాడు పిల్ల తండ్రి.

"నాది జూలై పది. మరి మీదెప్పుడండీ?" అడిగాడు ప్రహ్లాదరావు.

"నాది ఫిబ్రవరి పన్నెండు బాబూ!"

"ఆ రోజున జన్మించిన ప్రసిద్ధ హిందీ నటుడెవరో తెలుసా?"

"తెలవదు బాబూ!"

"తెలవదా లలేక తెలుసుకోవాలనిపించ లేదా?"

"తెలుసుకుని ఏం చేయగలను బాబూ!"

ఈ సారి ప్రహ్లాదరావు కుడి కాలుమీద తన ఎడమ కాలు పెట్టి కారు ఏక్సిలేటర్ని బలంగా మట్టానికి తొక్కినట్టు తొక్కేసాడు అతని మేనమామ.  కీచుమని పైకి అరవబోయి వస్తున్న బాధను శివుడులా గొంతులోనే అదిమిపెట్టి, ఎవరికీ కనబడకుండా రెండు కన్నీటి చుక్కలు మౌనంగా కార్చుకున్నాడు ప్రహ్లాదరావు.

ఇవేమీ తెలియని అమ్మాయి తండ్రి, 

"అమ్మా, మా తుషారని తీసుకుని రమ్మంటారా?" అని అడిగాడు ప్రహ్లాదరావు తల్లిని.

"అయితే పెళ్లి కూతురు పేరు తుషారా?" మళ్లీ బరిలోకి దిగిపోయాడు ప్రహ్లాదరావు.

"ఔను, బాబూ , ఏం బాబూ పేరు నచ్చలేదా?"

"అది కాదండీ, తుషార అంటే అర్థం తెలుసా?"

"తెలియదు బాబూ, పేరు బావుందని పెట్టేసాం"

"అయ్యో, అలాగా, తుషార అంటే మంచు అని అర్ధం అండీ. పోనీ,  మన దేశానికి మంచు పర్వతాలు ఏ దిక్కున ఉన్నాయో అదైనా తెలుసా?"

"అంత నాలెడ్జ్ నాకు లేదు బాబూ!"

"ఉత్తరం వైపు ఉన్నాయండీ. పోనీ మీ ఇంటికి తూర్పు వైపు ఏదో అదైనా తెలుసా?" కొంచెం వెటకారం జోడించి అడిగాడు ప్రహ్లాదరావు.

"తెలియదు బాబూ, కొంచెం మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి" అంతే వెటకారంగా చెప్పేడు అమ్మాయి తండ్రి.

ఒక్క సెకను ఆలోచించి….

"అదిగో, అదే మేము లోపలికి వచ్చిన గుమ్మం వైపు ఉన్నదే తూర్ప" వేలెత్తి చూపుతూ చెప్పాడు ప్రహ్లాదరావు.

వెంటనే  ప్రహ్లాదరావు తల్లీ, మేనమామ ఒకేసారి కళ్లతో సౌంజ్జలు చేసుకుని కాళ్లు సాపు చేసుకుని కార్యరంగంలోకి దిగబోయేరు.

ఈ లోగా..

"ఒహో, తూర్పు వైపు అంటే అదా? , లే బాబూ లేచి వచ్చిన దోవనే మర్యాదగా వెళ్లు, ఆలశ్యమయితే నేను మనిషిని కాదు. మొగుడు కావలసింది మా అమ్మాయికి, నాకు కాదు" అంటూ అమ్మాయి తండ్రి ప్రహ్లాదరావు ని పెడరెక్కలు పట్టుకుని లేపబోయేడు.

అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా ప్రహ్లాదరావుని అతని తల్లి, మేనమామ చెరో జబ్బా పట్టుకుని ఎప్పటిలాగే ఆటోలో కుదేసి, ఇంటికి తీసుకుని పోయారు. ఎప్పటిలాగే దోవ పొడుగునా తిట్లతో తలంటుతూ..

  ***** ***** ***** *****  

ఇది జరిగిన చాలా రోజుల తరువాత, ప్రహ్లాదరావు ముసలి తల్లి కోరిక మేరకు, మేరేజ్ మేట్రిమోనీలలో అతని పేరు నమోదు చేయించారు అతని స్నేహితులు. అభిరుచులు కాలమ్ లో ఫజిల్స్ మరియు వంటలు అనేవి రాకుండా జాగ్రత్తపడి.

అప్పటికే పెళ్లి చూపులు విషయంలో చావు దెబ్బలు తిన్న ప్రహ్లాదరావు కూడా కిక్కురుమనకుండా ఈ ప్రపోజల్ కి ఒప్పేసుకున్నాడు. మరీ బెట్టుసరి చేస్తే మొదటికే మోసము వచ్చేలా ఉందని గ్రహించి.

***** ***** ***** *****  

మేరేజ్ మేట్రిమోనీలలో తెగ వెతికి వెతికి , తన పేరుకు మేచ్ అయ్యింది కదా అని వెనకాముందూ ఏమీ చూసుకోకుండా, గత అనుభవాల దృష్ట్యా, ఎటువంటి పెళ్లి చూపులు లేకుండా,  సుపథను సెలెక్ట్ చేసుకొని, వివాహం చేసేసుకున్నాడు  ప్రహేళికారావు. అంతేకాదు తమ ఇద్దరి పేర్లూ కలసి వచ్చేలా, పెళ్లి పత్రిక మీద " ప్రహేళికా (సు) పదబంధం" అని ఎంతో గొప్పగా వేయించుకున్నాడు ప్రహేళికా రావు.

ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ప్రహేళికారావుకి, సుపదకి జనరల్ నాలెడ్జ్ తక్కువనీ, కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి తోవలో పెట్టాలనీ, అప్పుడు కానీ తను, సుపథ కలసి తన చిరకాల వాంఛ అయిన , "మీలో ఎవరు కోటీశ్వరుడు" క్విజ్ లో పాల్గొని ఫ్రైజు మనీ కోటి రూపాయలు కొట్టుకు రాలేమనీ.

   ***** ***** ***** *****  

ఆరు నెలలు గిర్రున తిరిగాయి. సుపథ క్విజ్ లలో ఏమాత్రం పరిణితి సాధించలేదు, సరికదా, ప్రహేళికా రావు అడిగే ప్రశ్నలకు కొంచెం వెటకారంగా సమాధానాలు ఇవ్వడం నేర్చుకుంది. పోనీ ఈ విధంగానైనా తనని హింసించడం మానేస్తాడేమోనని.

ఓ రోజు…

"వడియాలుని ఒరియాలో ఏమంటారు ?" అడిగాడు ప్రహేళికా రావు.

"ఒరియాలు" కామెడీగా చెప్పింది సుపథ.

" కౌరవ సంతానంలో 84 వ వారెవరు ??"

"83 తరవాత వారు"

" బీరకాయలని బీహార్ భాషలో ఏమంటారు ? "

" బీహార్ కాయలు. "

ఈ సమాధానాలతో పిచ్చెక్కిపోయింది ప్రహేళికా రావుకి. ఎలాగైనా సరే సుపథని మార్చాలని ఇంకా గట్టి ప్రయత్నాలు మొదలెట్టాడు, పట్టు వదలని విక్రమార్కుడులా.

  *********       ********       *********

ఇక, ఈయన తనని ప్రశ్నలతో వేధించడం మానడు అని ఓ స్థిర నిశ్చయానికి వచ్చిన సుపథ, ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని తన అక్కకి ఫోన్ చేసింది ఓ రోజు. దానికి ఆవిడ "ముల్లును ముల్లు తోనే తీయాలని, అలాగే నువ్వు కూడా అతడిని తికమక ప్రశ్నలతోనే లొంగదీసు కోవాలని " సలహా ఇచ్చింది. 

అదిగో, అప్పటినుండి అతడిని ఎలా ఉక్కిరిబిక్కిరి చెయ్యాలా అని ప్రతీరోజూ ఆలోచిస్తోంది సుపథ. 

అనుకోకుండా ఆ రోజు రానే వచ్చింది.

*********       ********       *********

స్వతహాగా తిండి పురుషుడైన ప్రహేళికా రావు, ఉదయం టిఫిన్ తిని, ఆఫీసుకు వెళ్లి, మధ్యాహ్నం భోజనానికి మటుకు ఇంటికి వచ్చేస్తుంటాడు. ఆఫీసులో తింటే, సాటి ఉద్యోగులు వాటాకి వచ్చేస్తారని అతని భయం. 

అంతేకాదు, ప్రతీరోజూ ఆఫీసుకు వెళ్లే ముందు భార్యని అడుగుతాడు, "మధ్యాహ్నం భోజనంలోకి స్పెషల్ ఏమిటని ?" ఎందుకంటే, ఆ స్పెషల్ ఐటంస్ కోసం, ఆఫీసులో నానా గడ్డి తినకుండా కడుపుని ఖాళీగా ఉంచుకోవడం కోసం. 

ఆ రోజు..

ఆఫీసు ఇనస్పెక్షన్ హడావుడిలో పడి, మధ్యాహ్న భోజనం వివరాలు అడక్కుండా, ఆఫీసుకి వెళ్లి పోయి, ఆ తరువాత జ్జాపకం వచ్చి, ఎంతో ఆశతో వంటకాలను ఊహించుకుంటూ భార్యకు ఫోన్ చేసేడు ప్రహేళికా రావు.

ఈ పరిస్థితిని ముందే ఉహించి, సరిగ్గా ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న సుపధ ఫోన్ ఎత్తింది, తను అమలు చేయబోయే పథకాన్ని ఓ సారి మననం చేసుకుంటూ…

"సుపథా, ఈ రోజు ఏం కూర చేసేవ్ ??" అడిగాడు ప్రహేళికా రావు, ఎంతో ఆశగా !!

"ఆశ, దోశ, అప్పడమేం కదూ, చెప్తారు పాపం. మీరే ఊహించుకోండి" అతని ఆశను నీరు గార్చేసింది సుపథ. 

"రైతు బజారులో కొన్న కూరలా ??"

"మన పెరట్లో పండించినవే !!"

"ఇంట్లో పండించిన కూరలా ? పోనీ సందు చివర సూపర్ బజార్ నుంచి తెచ్చుకోలేకపోయావా ??"

"గడప దాటి నేను ఎప్పుడైనా బయటికి వెళ్లేనా ? అదీ మీరు పక్కన లేకుండా !!"

"ఇక నన్ను ఊరించక, ఏం కూర వండేవో చెప్పేయవోయ్"

"వచ్చేదాకా చెప్పను, అది ఏం కూరో. అంతా సస్పెన్స్. సస్పెన్స్"

"పోనీ, మషాలాపెట్టి వండేవా ? లేక ఆవపెట్టి వండేవా ?? కనీసం రుచి ఎలా ఉంటుందో ? అదైనా చెప్పవోయ్ ??"

"సూపరుగా యమ్మీ యమ్మీ గా ఉంటుంది. 
ఒకేనా ??"

"చెబుతోంటేనే నోరు ఊరి పోతోంది. మరి తింటే ఇంక ఎలా ఉంటుందో ??"

"తిన్న తర్వాత కూడా అలాగే అంటారు"

"బాగానే వుంది కానీ, కొంచెం ఏదైనా క్లూ ఉంటే ఇవ్వవోయ్, ఆ రహస్య కూర ఏదో తేల్చేస్తాను"

"సరే అయితే ఆ రహస్యం చెప్పేస్తున్నా. జాగ్రత్తగా వినండి. నేనిచ్చిన ఈ సమాధానాల్లోనే అది దాగి ఉంది. ఇటువంటి పజిల్స్ సాల్వ్ చేయడంలో మీరు అనుభవజ్ఞులు కదా ? చాలా ఈజీగా కనిపెట్టేస్తారులెండి. ఓ పావు గంటలో ఏ విషయం ఫోన్ చేయడం మరవకండేం !!" కొంచెం వెటకారం జోడించి చెప్పింది సుపథ.

"ఆ……" అంటూ నోరు తెరిచి, ఫోన్ పక్కన పడేసి, కరెంట్ షాక్ కొట్టిన కోతిలా కుర్చీలో బిగుసుకు పోయాడు ది గ్రేట్ క్విజ్ ఎక్స్ పర్ట్ ప్రహేళికా రావు.

***** ***** ***** *****  

తను ఏం ప్రశ్నలు అడిగాడో, వాటికి సుపధ ఏం సమాధానాలు ఇచ్చిందో గుర్తుకు తెచ్చుకోవడానికి తెగ తంటాలు పడుతున్నాడు ప్రహేళికారావు. ఎంత గింజుకుంటున్నా ఏవీ వరసక్రమంలో జ్ఞాపకం రాక బుర్రని బరబరా గోకేసుకుంటున్న ప్రహేళికారావు వద్దకు అతని సహచరుడు సలహాల్రావు వచ్చి,

"ఏంట్రోయ్, బుర్రని అలా రక్తాలు కారేలా గోకేసుకుంటున్నావు ? తలలో పేలు ఏమైనా డిస్కో డాన్స్ కడుతున్నాయా ? లేక జనాలను చంపడానికి ఏదైనా కొత్త క్విజ్ ప్లాన్ చేస్తున్నావా ??" అని అడగడంతో, 

"చచ్చిన పాముని మళ్లీ చంపకురా ! నేను ఎప్పుడైనా తెలిసో, తెలియకో నిన్ను కూడా  క్విజ్జులతో వేధించి, అవమానపరిచి ఉంటే నన్ను మనస్పూర్తిగా క్షమించేయిరా !" అంటూ సలహాల్రావు చేతులు పట్టుకుని బాధగా మూలిగాడు ప్రహేళికారావు.

ఇలాంటి చర్యని ప్రహేళికారావు నుంచి ఊహించని సలహాల్రావు ఆశ్చర్యంతో,

"ఇదేవిట్రోయ్, ఇది కూడా ఏదైనా కొత్త రకం క్విజ్ లో భాగమా ??" అని అడిగాడు ప్రహేళికారావు పక్కనే కూర్చుంటూ.

"లేదురా , ఇంక ఎవ్వరినీ ఎలాంటి పజిల్స్ లేదా క్విజ్ సంభందించిన ప్రశ్నలు వేసి బాధ పెట్టకూడదు అని నిశ్చయించుకున్నానురా. ఎందుకంటే కేవలం ఓ పది నిమిషాల క్రితం జరిగిన సంభాషణే నాకు గుర్తు లేనప్పుడు ఎప్పుడో చదివిన పాత సంఘటనలు ఎవరికీ మాత్రం గుర్తుంటాయి ? " అంటూ తనకు, సుపథ కి జరిగిన కూర గురించి జరిగిన సంభాషణ అంతా పూస గుచ్చినట్టు చెప్పి, బావురుమన్నాడు ప్రహేళికారావు.

"బాగుందిరా, బుద్ధుడుకి భోధి చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టు, నీకు సుపధ బెట్టు వల్ల జ్ఞానోదయం అయ్యిందన్న మాట. పోనీలే ఒక విధంగా మంచే జరిగింది. అది సరే, ఫోన్ లో జరిగిన సంభాషణలు గురించి నువ్వు ఇంత బాధ పడుతున్నావు గానీ, నీ స్మార్ట్ ఫోన్ లో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది కదా ?? అది ఓపెన్ చేసి ఆ సంభాషణలు వినొచ్చుగా ? సరిగ్గా వింటే ఏదో క్లూ దొరక్కుండా పోదు అని నా అభిప్రాయం" మిత్రుడుకి సలహా ఇచ్చి పేరు సార్థకం చేసుకున్నాడు సలహాల్రావు.

ఏదో ఆందోళనలో ఉన్న తనకు, ఆ మాత్రం ఐడియా రానందుకు మనసులోనే తిట్టుకుంటున్న ప్రహేళికా రావుకు,  ఆ సమయంలో ఈ సలహా ఇచ్చిన సలహాల్రావు, గీతోపదేశం చేయడానికి గీతల చొక్కా వేసుకొచ్చిన గీతాచార్యుడులా కనపడ్డాడు.

వెంటనే కార్యరంగంలోకి దిగిన ప్రహేళికారావు, ఫోన్ లో వింటూ జరిగిన సంభాషణలు అన్నీ ఓ కాగితం మీద రాయడం మొదలెట్టాడు.

ఏ విధంగా చూసినా, ఎన్ని విధాలుగా రాసిన ఆ సంభాషణలలోని రహస్యాన్ని కనుక్కొలేకపోయాడు ప్రహేళికారావు.

చేతిలో కాయితాలు నలుగుతున్నాయి. కడుపులో ఎలుకలు కదులుతున్నాయి కానీ సంభాషణలో ఉన్న సారం కనుక్కోలేకపోయిన ప్రహేళికారావు ఇక ఓపిక లేక బార్యకు ఫోన్ చేసి..

"సుపథా, ఆఫీసులో పని ఎక్కువగా ఉంది. నా కోసం చూడకు. భోజనం చేసేయ్" అని ఓ అబద్ధం చెప్పి , తాత్కాలికంగా ఈ గండం నుంచి బయటపడి, ఆఫీసు కేంటీనులో దూరాడు ప్రహేళికారావు, కడుపు, మొహమూ రెండూ మాడ్చుకుని.

ఇలాంటి సమాధానం వస్తుందని ముందే ఊహించిన సుపథ యురేకా అంటూ ఎగిరి గంతేసింది, తన విజయానికి మొదటి మెట్టుగా !!. 

*********       ********       ********

"సుపధా ! ఆకలేస్తోంది, త్వరగా భోజనం వడ్డించేయవోయ్ ! రెండు నిమిషాల్లో స్నానం చేసేసి వస్తా !! " అంటూ వాష్ రూమ్ లోకి వెళ్లాడు, ఆఫీసు నుంచి ఆలశ్యంగా వచ్చిన ప్రహేళికారావు.

ఎప్పుడూ ఆఫీసు నుంచి వచ్చీరావడంతోనే యక్ష ప్రశ్నల్లాంటి లక్ష ప్రశ్నలతో బుర్ర తినేసే భర్త మన్ను తిన్న పాములా మౌనంగా ఉండడంతో, తన పాచిక పారిందని సంతోషపడింది సుపథ.

కుక్కిన పేనులా కంచం ముందు కుదురుగా కూర్చున్న ప్రహేళికారావుకు అన్నంతో పాటు తను వండిన "ఆనపకాయ కూర" వేసి, అతని పక్కనే నిలబడింది సుపథ, అతని ముఖ కవలికలు గమనిస్తూ. 

ఆనపకాయ కూర తింటున్న ప్రహేళికారావు మొహంలో "అవమానంతో కూడిన అనుమానంతో నిండిన అభద్రతా భావం" కనపడడంతో, ఇక ఉదయం జరిగిన సంభాషణ గురించి చర్చించి, అతడిని బాధపెట్టకూడదని నిశ్చయించుకున్న సుపధ , వేరే విషయాల గురించి చర్చించడం మొదలుపెట్టింది. అనవసర ప్రసంగం చేయకుండా ప్రహేళికారావు కూడా ఆమెతో శృతి కలిపి బ్రతుకు జీవుడా అనుకొని త్వరగా భోజన కార్యక్రమం ముగించి బయటపడ్డాడు. 

***** ***** ***** *****

ఆ మరుసటి రోజు సాయంత్రం..

"అక్కా, నువ్వు చెప్పినట్లు గానే, ముళ్లుని ముళ్లుతోనే తీసేనే. ఈ దెబ్బకి మళ్లీ ఆయన నా దగ్గర క్విజ్ ప్రోగ్రామ్ లు పెట్టకుండా చేసా" ఫోన్ లో చెబుతోంది సుపథ.

"దొంగ పీనుగా, ఏం మాయ చేసావే ? పూర్తిగా చెప్పు" ఆశ్చర్యంగా అడిగింది.

జరిగిన సంఘటన అంతా మొత్తం పూస గుచ్చినట్టు అక్కకు చెప్పింది సుపథ.

"ఓసి నీ తెలివి తెల్లారా ! పాపం మరిది గారిని బాగానే ఇబ్బంది పెట్టావే ? ఔనూ, నాకు తెలియక అడుగుతున్నా ? నువ్వు ఇచ్చిన సమాధానాలు లో "ఆనపకాయ కూర" అని ఎక్కడ ఉందే ?" ఆశ్చర్యంగా అడిగింది అక్క.

"అయ్యో , అక్కా, నేను ఇచ్చిన ఏడు సమాధానాలు వరుసగా రాసి, మొదటి సమాధానం నుంచి మొదటి అక్షరం, రెండవ సమాధానం నుంచి రెండవ అక్షరం, ఇలా ...ఏడవ సమాధానం నుంచి ఏడవ అక్షరం వరకూ వరుసగా రాసుకుని పోతే ఆనపకాయ కూర" రెడీ" చెప్పింది సుపథ.

"ఏడిసావులే వెధవ తెలివి తేటలూ నువ్వూనూ. మరిది గారు అన్నారని కాదు కానీ, ఇన్ని తెలివి తేటలు ఉన్న నువ్వు, కొంచెం మరిది గారి మాట విని కొంచెం లోక జ్ఞానం పెంచుకొని, మీరిద్దరూ కలిసి ఆ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కు వెలితే మొత్తం ఆ ఫ్రైజు మనీ మీరే కొట్టుకొచ్చేస్తారని నేను గ్యారెంటీ గా చెప్పగలను" అంటూ చెల్లెలుకి హితబోధ చేసింది అక్క. 

"నువ్వు చెప్పింది నిజమేనే అక్కా ! పాపం నిన్న ఆయన పరిస్థితి చూసిన తరువాత నాకూ అలాగే అనిపించింది. అనవసరంగా ఆయనని బాధపెట్టే నేమోనని ? కానీ ఈ దెబ్బతో ఇక ఆయన ఎవరినీ ఇలాంటి క్విజ్జులతో బాధపెట్టడంకానీ, హేళన చేయడం కానీ చెయ్యరనే తృప్తి మటుకు నాకు కలిగింది. ఏది ఏమైనా నువ్వు ఇచ్చిన ఈ రెండో సలహా కూడా నేను పాటించి‌ కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటా ! ఉంటానక్కా , థాంక్స్" అంటూ ఫోన్ పెట్టేసి, బుక్ రేక్ వద్దకు వెళ్లి, "ఫజిల్స్. పదబంధాలు" అనే పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టింది సుపధ, అప్పుడే గుమ్మంలోకి అడుగు పెట్టిన ప్రహేళికారావు ఆమెనూ, ఆమె చేతిలోని పుస్తకాన్ని బిక్కచచ్చిపోయి చూస్తుండగా !!!

***** **శుభం** *****

(నేను రాసిన ఈ హాస్య కథ, హాస్యానందం పత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలో బహుమతి పొంది, జూలై 2020 లో ప్రచురితమైనది)