*****
*కవి రోదన*
========
(హాస్య కథ)
(నేను రాసిన ఈ హాస్యకథ ఆగష్టు 2014 హాస్యానందం మాసపత్రికలో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
ఏమీ తోచక, కాలు కాలిన పిల్లిలా వాకింగ్ చేస్తున్న ఆశారావుకి కాసేపు టి.వి. పెట్టుకుని కాలక్షేపం చేద్దాం అనిపించి... టి.వి. ఆన్ చేసాడు.
'వంకర' టి.వి. వాళ్ళకంటే 'సంకర' టి.వి. వాళ్ళు కొంచెం మంచి ప్రోగ్రాంలు వేస్తారు కాబట్టి ఆ టి.వి. ఛానల్ పెట్టాడు.
“నమస్కారం గురువుగారూ! మా 'కవిరోదన' కార్యక్రమానికి స్వాగతం" చెప్పింది యాంకరమ్మ. ఇప్పుడే కార్యక్రమం ప్రారంభం అయినట్టుంది. ఆ కవి పేరు ఏమిటో, ఎప్పుడూ చూసినట్లు లేదు. తనలో తానే గొణుక్కున్నాడు ఆశారావు.
"నమస్కారమమ్మా!... ఈ కార్యక్రమం చూస్తున్న సకల ప్రాణులకు కూడా నా నమస్కారాలు” చెప్పాడు కవి.
'ఈ కవి పేరు ఏమిటి?... ఈ టి.వీ. వాళ్ళు ఇంకో సారి అడగరు. వీళ్ళు చెప్పరు. చూద్దాం, కాసేపు పోయాక స్క్రోలింగ్లో వేస్తారేమో?' అనుకుంటూ ఆశగా చూస్తున్నాడు ఆశారావు.
"గురువుగారూ, మీరు ఇంతవరకు ఎన్ని కథలు, కవితలు రాసారు?" అడిగింది యాంకరమ్మ, పెదాలు మీద ఉన్న లిపిస్టిక్ ని నాలికతో చప్పరిస్తూ.
"సరిగా గుర్తులేదు కానీ, నాకు తెలిసినంతవరకు సుమారు ఓ మూడు వందలు.. అబ్బే...ఓ అరవై... కాదు.... కాదు, సుమారు ఓ రెండు కవితలు, ఒక కథ రాసినట్టున్నానమ్మా" బాగా తీవ్రంగా ఆలోచించి చెప్పాడు కవి.
"మీ పేరు కింద సినీ పాటల రచయిత అని కూడా రాస్తున్నారు కదా? ఏ ఏ సినిమాలకు పాటలు రాసారు?"
"1976 లో వచ్చిన జంకుమొగుడు' సినిమాలోని ఓ పాటకు ఓ చరణం రాసానండీ!"
"వీడి తస్సాదియ్యా, పాటలో ఒక్క చరణం రాసి గొప్పగా సినీ రచయిత అని చెప్పుకుంటున్నాడు....అసలు ఈయన పేరు ఏమిటో తెలిసి చావటం లేదు. ఆ పిల్లకాని, ఇతను కానీ, పేరు తెలియనీయకుండా భలే జాగ్రత్త పడుతున్నారు. ఇంతకీ ఈ కవి పేరు ఏమిటబ్బా..." తల బద్దలు కొట్టుకుంటున్నాడు ఆశారావు.
"గురువుగారూ! మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది?"
మంచి ప్రశ్న అడిగింది, ఇప్పుడు ఈ కవి తన ఊరు పేరు చెబుతాడు, ఆటోమేటిక్ మనం కవి పేరు గుర్తు పట్టేయొచ్చు అనుకున్నాడు ఆశారావు.
"నా బాల్యమంతా మా అమ్మమ్మగారి ఊరిలోను, విద్యాభ్యాసం మా బాబాయిగారి ఊరిలోను జరిగిందమ్మా!"
"ఓరి వీడి మొహం మండ! ఊరి పేరు చెప్పకుండా ఈ సోది ఏమిట్రా బాబు. నాకు ఈ సస్పెన్స్ గోల ఏమిట్రా తండ్రి..." అనుకుంటూ బుర్ర మీద వెంట్రుకలు లేకపోవడం వలన చెవిలో వెంట్రుకలు పీకేసుకుంటున్నాడు ఆశారావు,
"మరిన్ని ప్రశ్నలు అడిగే ముందు 'కవి రోదన' కార్యక్రమంలో ఒక చిన్న బ్రేకు తీసు కుందాం" చెప్పింది యాంకరమ్మ.
"అసలు కవి పేరు చెప్పకుండా... చూసే వాళ్ళని సస్పెన్స్ లో పెట్టి ఇప్పుడు బ్రేక్ ఏమిటర్రా? క్రాకు పీనుగుళ్లారా! ..." అని తిట్టుకుంటూ రిమోట్ తో తలమీద బాదుకున్నాడు ఆశారావు.
ఎప్పుడూ అవసరానికి పనిచేయని ఆ రిమోట్ అప్పుడే జ్ఞానోదయం అయ్యినట్టు ఒక్క సారిగా మేల్కొని టి.వి.ని స్విచ్ ఆఫ్ చేసేసింది.
"ఈ టి.వి. ఇప్పుడే ఆగిపోయి చావాలా?.... అయ్యయ్యో బ్రేక్ అయిపోతే మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ అయితే డెఫినెట్గా ఆ కవి పేరు చెప్పడంగానీ, స్క్రీన్ మీద వెయ్యడంగాని చేస్తారు.... అని నెత్తి నోరు కొట్టుకుంటూ లబోదిబో అంటూ టి.వి. ఆన్ చేసాడు ఆశారావు.
టి.వి.లో ఇంకా అడ్వర్టయిజ్ మెంట్లు వస్తున్నాయి.
"సోమ్బాబు గాడు రెండో తరగతి పాస్ అవు తాడా? చదవడం కష్టంగా ఉంది...."
"ఎవడు చెప్పాడు? మా ద్వివేదా స్కూల్లో చేరితే సోంబాబే కాదు వాళ్ళ బాబు కూడా
ఈజీగా రెండవ తరగతి పాస్ అవుతాడు."
"ఆగండి... ఆగండి...మీరు వాడే టూత్పేస్లో ఉప్పు, నిమ్మకాయ ఉన్నాయా?"
"ఉండవు. ఎందుకంటే మేము వాడేది ఉప్పు బొగ్గు మిశ్రమం. అందుకే మా పళ్ళు ఇంత తెల్లగా ఉంటున్నాయి. "
ఊపిరి బిగపట్టి, టి.వి. రిమోట్ పక్కన పెట్టి ఎడ్వర్టయిజ్మెంట్లు చూసాడు ఆశారావు, రాబోయే కార్యక్రమం గురించి ఆశగా ఎదురు చూస్తూ-
"కవిరోదన కార్యక్రమానికి తిరిగి స్వాగతం... గురువుగారూ! మీ కుటుంబంలో ఎవరైనా రచన వ్యాసంగంలో ఉన్నారా?"
"ఇప్పుడు దొరికాడు కొండిగాడు.... ఇతని కుటుంబ సభ్యుల పేర్లు తెలిస్తే ఇతడిని ఈజీగా గుర్తు పట్టేయచ్చు" అనుకుంటూ టి.వి. ముందుకు వెళ్ళి నేల టికెట్లో సినిమా చూసే వాడిలా కూర్చున్నాడు ఆశారావు,
"అబ్బే! నాకు ఎవరు తోబుట్టువులు లేరు. మా అమ్మనాన్నలకి నేను ఒక్కడినే సంతానం" చావు కబురు చల్లగా చెప్పాడు కవి. గాలి తీసివేసిన బెలూన్ల ఎగిరి సోఫాలో పడ్డాడు ఆశారావు.
"గురువుగారూ! మీకు సాహితీ మిత్రులు ఎవరైనా ఉన్నారా? అంటే వాళ్ళ పేర్లు చెప్పుతారా?" సమాధానం ఏమి చెబుతాడో తెలిసినదే అయినా ఉత్సాహం ఆపుకోలేక చెవులు రిక్కించి వినబోయాడు ఆశారావు.
"నాకు సాహిత్యానికి సంబంధించి చాలా మిత్రులు ఉన్నారమ్మా ఆ పేర్లు అన్నీ చెప్పాలంటే ఈ సమయం చాలదు" మళ్ళీ ఆశారావుకి నిరాశ కలిగించే సమాధానం చెప్పాడు కవి.
"నీ పిండాకూడురా... నీ పిండాకూడు.... ఒక్కడి పేరు అయినా చెప్పి చావచ్చు కదరా ముష్టిపీనుగా" బయటికి తిట్టడం సభ్యత కాదని మనసులోనే గింజుకున్నాడు ఆశారావు,
"ఇంక చివరి ప్రశ్న గురువుగారూ!
మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏమిటి?"
"ఒరే... బాబు... ఇప్పుడైనా నోరు విప్పు! నీ పేరు చెప్పి తగలడరా నాయనా... సస్పెన్స్ తో చచ్చిపోయేలా ఉన్నాను...” మూగగా రోదిస్తున్నాడు ఆశారావు.
"మనిషికి కావలసింది సందేశం కాదు... సందేహం. అప్పుడే ప్రతి మనిషి, తన సందేహం తీర్చుకోవడానికి తపన పడతాడు. ఇక పుస్తకాలు చదివితే కొన్ని సందేహాలకు సమాధానములు కూడా దొరుకుతాయి" సందేశం ఇచ్చాడు కవి.
"నువ్వు ఎవరో తెలియక ఇందాకటి నుంచి సందేహపడి చూస్తుంటే మళ్ళీ ఈ సందేశాల గోల ఏమిట్రా నిన్ను తగలెయ్య... " సోఫా కవర్ సర్రున చింపేశాడు ఆశారావు.
“చాలా థ్యాంక్స్ గురువుగారూ!... మా కార్యక్రమానికి వచ్చి చాలా విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు... మళ్ళీ వచ్చేకార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు శెలవు...” ముగించింది యాంకరమ్మ.
"వాడు ఏవడో తెలియదు... ఏ ఊరో తెలి యదు... అలాంటి వాడినుంచి ఏమి విషయాలు నేర్చుకున్నావమ్మా... నీ పిండాకుడమ్మా..... " మనసులో కసి తీరా తిట్టుకున్నాడు ఆశారావు.
ఎలాగైనా సరే, ఆ కవిగాడి పేరు తెలుసుకు తీరాలి... ఎలాగబ్బా అని ఆలోచించి వాళ్ళ అపార్టుమెంటులో ఉంటున్న కుటుంబరావుకి ఫోన్ చేసి,
"ఒరే కుటుంబం! నేను ... ఆశారావుని, ఇప్పుడు సంకర టి.వి.లో వచ్చిన కవిరోదన చూశావా?" అడిగాడు ఆశారావు.
"చూడలేదురా... ఎందుకు అలా అడిగావు?"
"ఏమీ లేదురా... ప్రోగ్రాం అంతా చూసా కాని ఆ కవి పేరు తెలియడం లేదురా... సస్పెన్స్ చచ్చిపోయేలా ఉన్నా...".
"చచ్చకురా... చచ్చకు... ఆ టి.వి. వాళ్ళకు ఫోన్ చేసి చావు. వాళ్ళే చచ్చినట్లు చెబుతారు" చావు సలహా కాక చక్కటి సలహా ఇచ్చాడు కుటుంబరావు.
వెంటనే టి.వి. ఆఫీస్ కి ఫోన్ చేసాడు ఆశారావు
"హలో సంకర టి.వి.యేనా? కొంచెం ప్రోగ్రాం హెడ్డుకి కలుపుతారా??
"మీ హెడ్డుకి ఏ ప్రోగ్రాం కావాలి? సారీ, మీకు
ఏ ప్రోగ్రాం హెడ్ కావాలి?"
"ప్రోగ్రాంల కంటే ప్రాసలు బాగానే వేస్తున్నావు కానీ, మీ 'కవిరోదన' కార్యక్రమం హెడ్ కావాలి" చెప్పాడు ఆశారావు,
"వన్ అవర్... సారీ వన్ మినిట్... కలుపు తున్నా... "
"హలో హలో... సర్... నేను కవి రోదన కార్యక్రమ హెడ్డుని మాట్లాడుతున్నా... ప్రోగ్రాం ఎలా ఉంది సార్?"
"ఎలా ఉందో తర్వాత చెబుతా కానీ, ఆ కవి పేరు ఏమిటో కూడా తెలియకుండా ప్రోగ్రాం వేసేసారు... ఇంతకీ ఆ కవి ఎవరూ?" జవాబు కోసం ఆశగా చెవులు రిక్కించుకుని రెడీగా ఉన్నాడు ఆశారావు.
"సారీ సర్, నాకు కూడా ఆ కవి పేరు తెలియదు. మా కాంపిటీటర్ వంకర టి.వి. వాళ్ళు కవుల మీద ప్రోగ్రాం చేస్తున్నారని తెలిసి వెంటనే మా యాంకర్ని రోడ్ మీదకు పంపి అర్జంటుగా వెతికి ఎవరినైనా తీసుకు రమ్మంటే... భుజాన సంచీ వేసుకుని, గడ్డం పెంచుకుని... మా స్టూడియో రోడ్ మీద వెళుతున్న ఈయన దొరికాడు. వెంటనే స్టూడియోలోకి లాగేసి, ప్రోగ్రాంలో కుదేసి... ఏదో...అలా కానిచ్చేసాం అన్నమాట..." సిగ్గుపడుతూ చెప్పాడు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్.
"బాగానే ఉంది సంబరం... మీ ప్రోగ్రాం లతో మాలాంటి వాళ్ళ బుర్రలు తినేస్తున్నారయ్యా! పోనీ, ఆ కవి ఫోన్ నంబర్ ఏమైనా దొరుకుతుందా?" అడిగాడు ఆశారావు.
భగవంతుడు ఆశారావు మొర ఆలకించి, ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ద్వారా కవిగారి ఫోన్ నంబర్ ఇప్పించాడు.
వెంటనే ఫోన్ అందుకుని కవిగారికి ట్రై చేసాడు ఆశారావు.
"హలో కవిగారా... నా పేరు... ఆశారావు... మీ ప్రోగ్రాం చూసా...".
"థ్యాంక్స్ సర్, ప్రోగ్రాం బావుందా?"
"ప్రోగ్రాం మాట దేవుడెరుగు... అసలు మీ పేరు చెప్పకుండా ప్రోగ్రాం ఎలా కానిచ్చేసారు. మహాశయా?" అడిగాడు ఆశారావు.
"నా పేరు చెప్పకపోవడం ఏమిటి? ప్రతి ప్రశ్నకు ఆ యాంకర్ నా పేరు ఉచ్చరిస్తేనూ?" చెప్పాడు కవి.
"అవునా! ఇంతకీ మీ పేరు ఏమిటీ మహాప్రభూ?" వేడుకున్నాడు ఆశారావు.
"నా పేరు గురువు!. మా అబ్బాయి పేరు లఘువు. ఏదో సాహిత్యం మీద మక్కువతో....." చల్లగా చెప్పుకుపోతున్నాడు కవి.
"ఆ........!!!!"
***** **శుభం** *****